కొత్త మెయిల్ వచ్చింది మెయిల్-బాక్స్ లోకి. ఆమె నుండే! పైకి ఒప్పుకోకపోవచ్చుగానీ, అది వస్తుందని అతడికి ఓ మోస్తరు నమ్మకం. రావాలన్న కోరిక కూడా కాబోలు. చూసీ చూడని ఎదురుచూపులూ ఉన్నాయి. తీరా అది రానే వచ్చాక దాన్ని వెంటనే తెరిచే ధైర్యం లేక మంచానికి వాలబడ్డాడు. చీకటిగా ఉన్న గదిలో లాప్‍టాప్ వెలుతురు మొహం మీద పడుతుంటే, ఓ రెండున్నర గంటల ముందు వాళ్ళిద్దరి మధ్యా ఫోన్ సంభాషణ మళ్ళీ వినిపించింది.
పరస్పరం “హలో!” అన్నాక ఓ అర నిముషం నిశ్శబ్ధం. కొత్తల్లో ఆమె ఇట్లాంటి నిశ్శబ్ధాలకు బెదిరిపోయేది. తనను ఇంట్లోనే వదిలేసి అమ్మ బయటకివెళ్ళేటప్పుడు చిన్నపిల్ల భయపడిపోయినట్టు, ఒకటే కంగారు. “లేదమ్మా.. నేను మళ్ళీ వచ్చేస్తాను. తప్పకుండా వచ్చేస్తాను.” అని నమ్మించి, బుజ్జగించి, మాయచేసి మెల్లిగా బయటకు జారుకునేట్టు జారుకునేవాడు. బహుశా, ఎటూ ఎదగనని మోరాయించిన వాళ్ళ బంధంలో ఆమె ఎదిగిందేమో, ఈ మధ్యనలా కంగారు పడి గోలజేయటం మానేసింది. అతడి నుండి వినిపించే “హలో!”నే ఆమెకు సరిపోతుంది. అంతకన్నా ఎక్కువగా ఒక్క మాటైనా ఆమెకు బోనస్! అవకాశం ఇవ్వాలే గానీ ఆమె అలాంటి నిశ్శబ్ధాన్ని గంటలకు గంటలకు భరించగలదు, ఫోనులో కూడా! అందుకే అతడు వెంటనే సర్దుకొని “నేను ఒక ఐదు నిముషాల్లో మళ్ళీ చేయనా?” అని అడుగుతాడు. డీల్ కుదురిపోతుంది.
ఆ ఐదు నిమిషాలూ ఎప్పటికీ అవ్వవని ఇద్దరికీ తెల్సు. ఎలా అవుతాయి? ఆరో నిముషంలో అతడు ఆమెకు ఫోన్ చేసి మాత్రం ఏమని చెప్పగలడు? ఎంతని చెప్పగలడు? మనఃస్థితిని పూసగుచ్చినట్టు వివరించడానికి ఆమె ఎవరని? ఏమవుతుందని? ఇంకో నాలుగు నిముషాలు ఉగ్గపెట్టుకొని, పదకొండో నిముషంలో “ఏమయ్యా పెద్దమనిషి, ఐదు నిముషాలన్నావ్? ఇంకా ఉలుకూ పలుకూ లేదు?” అని ఆమె కూడా నిలదీయలేదు. “ఏం? ఎందుకు చేయాలి? ఎందుకు చెప్పాలి? అసలు నువ్వెవరు?” అని అతడు గదమాయిస్తే, ఇంకేమన్నా మిగులుతుందా? అలా అడగలేనంత మంచితనం అతడికి ఉండచ్చు. అయినా గానీ, ఎందుకు అవకాశం తీసుకోవటం? తాను కట్టుకున్న కలల కోటకు (తెలిసో, తెలియకో) అతడే కాపలా కాస్తుంటే, ఆమె ఎందుకు కాళ్ళదన్నుకుంటుంది వాటిని?
ఫోన్ చేసే ముందు “కాల్ లిఫ్ట్ చేసి హలో అంటే చాలు నాకు. అంతకన్నా ఎక్కువ అడగను.. ప్లీజ్” అని మొక్కుకున్న మొక్కులు, ఫోన్ పెట్టగానే హుళిక్కి అంటాయి. అతడు మాట్లాడాలని అనుకున్నవన్నీ ఇప్పుడు ఆమె ఊహల్లో ఊసులవుతాయి. అవి అలానే గాల్లో కల్సిపోతాయని ఆమె అనుకుంటుందిగానీ, అవ్వనీ ఆమె మెదడులో తిష్ఠ వేస్తాయి. బరువెక్కిన తలతో తాగుబోతు వాగినట్టు ఆమె ఎడా-పెడా ఓ ఉత్తరం రాసేస్తుంది. తప్పులు, తడకలతో. అయోమయ వాక్య నిర్మాణాలతో. పబుల్లో కూర్చొని బాగా ఎక్కేసిన మగాళ్ళ వింత చేష్టలను భరించిన అనుభవాలు సైతం అతడిని కాపాడలేకపోతాయి, పాపం, ఆమె పైత్యాలనుండి.
కొన్ని నిముషాలకు అతడా మెయిల్ తెరిచాడు. అందులో ఏముంటుందో ఊహించటం కొంచెం కష్టమే! ఒక్కోసారేమో, రాసిన ప్రతి పదం పదిరెట్ల వాల్యూమ్ తో వినిపిస్తాయి – అరుస్తోందన్నమాట, గొంతు చించుకొని. ఇంకొన్ని సార్లు గలగలమంటూ ప్రతి పదం మువ్వలా వినిపిస్తుంది – శాంతావతారం! మరికొన్ని సార్లు ఒక్కో పదంలో నుండి అర బక్కెట్టు నీళ్ళు వచ్చేలా! ఒక్కోసారి ఒక్కోలా ఉంటాయి ఆమె రాసేవి. అతడు ఉన్నది శరత్కాలమనుకొని, ఆమె కుంపటి పంపిస్తుంది చలి కాచుకోవడానికి. అప్పటికి అతడి వైపు వసంతం వచ్చేసి ఉంటుంది. పుండును శుభ్రంగా కడిగి, మందేసి, కట్టేసి కట్టాక ఆమె ఉత్తరం దాన్ని కెలకడానికి తయారవుతుంది. ఏమున్నా, చదవడం పూర్తయ్యేసరికి అస్తవ్యస్తంగా మారిన మానసికావస్థను మళ్ళీ కుదుటపర్చుకోవాల్సి వస్తుంది. ఆమె చెరిపేసిన గీతలను అతడు మళ్ళీ గీసుకోవాల్సి వస్తుంది. ఈ తతంగాలన్నీ అయ్యేసరికి అర్థరాత్రి దాటింది. లాప్‍టాప్ కట్టేసి పెళ్ళి-కాని-తనంలో మాత్రమే సాధ్యమయ్యే కల్తీలేని ఏకాంతాన్ని కప్పుకొని పడుకున్నాడు తన గదిలో.
ఆమె నిద్రపోయి అప్పటికే చాలా సమయమవుతుంది.
తెల్లారాక మెయిల్ రాయటం, చదటం రెంటిని కలలు అన్నట్టు వ్యవహరించాలంటే, వాళ్ళిద్దరూ నిద్రపోవాలిగా ఆ మాత్రం.
hmm ..
LikeLike