డైనింగ్ టేబుల్ మీద వేసున్న బట్టను స్లో మోషన్ లో బలంగా లాగాడు అతడు. దానితో టేబుల్ మీదున్న వస్తువులు కొన్ని స్లో మోషన్లో భళ్ళున్న పగిలితే, మరికొన్ని అంతే నిదానంగా కిందపడి దొర్లాయి. వాటి తాహత్తుకు తగ్గట్టు అవి చప్పుళ్ళు చేశాయి. ఆ శబ్ధాలకు సగం నిద్రతో, సగం పరుగుతో తన గది బయటకు వచ్చింది ఆమె.
“నో! నో! నో!” అని అతడు గొంతు చించుకుంటున్నాడుగానీ మాట బయటకు వినబడ్డం లేదు.
“ఏంటి రామ్ ఇది? చెప్పానుగా పనిమనిషి రేపూ, ఎల్లుండి రాదని? ఇప్పుడివ్వన్నీ ఎవరు శుభ్రం చేస్తారు?” నిలదీసింది ఆమె.
అతడు మాత్రం తన ఎదురుగా ఉన్న వ్యక్తినే చూస్తూ నించున్నాడు. చూడ్డానికి ఆ వ్యక్తి అతడికన్నా యవ్వనంలో ఉన్నాడు. కొంచెం వదులు చొక్కా, బెల్‌బాటం ఫాంటూ, చెవులూ, నుదురు కప్పుకునిపోయేలా క్రాఫూ.
“నువ్వు ఫో ఇక్కన్నుంచి.. పోతావా లేదా?” అతడు గట్టిగానే అరుస్తున్నా, నూతిలోంచి మాట్లాడుతున్నట్టు వినిపిస్తోంది. ఆమె మాత్రం పగిలిన పాత్రలపై అతడి పాదాలు పడకుండా ఉండడానికి నానా హైరానా పడుతోంది.
“ఏం? చెప్పేది నీకు కాదూ? మా అమ్మ నీతో రాదు. రాదంటే రాదు. ఏం? మా అమ్మ ఏమైనా అరవై, డబ్భైలలో వచ్చిన హింది సినిమాలలోని నిరుప రాయ్ అనుకుంటున్నావా? నీకోసం ఇన్నాళ్ళూ తులసి మొక్క దగ్గర పూజజేయడానికి? నీకోసం ఎదురుచూడ్డానికి? నువ్వు వచ్చీరాగానే కరిగిపోయి… ” అతడు ఆవేశంలో ఊగిపోతూనే ఉన్నాడు. ఆమె అతడిని పక్కకు తోస్తూ, పడున్న వస్తువులను సర్దుతూనే ఉందామె.
ఆమె రెక్క పట్టుకొని గుంజి, “చెప్పు సంజూ! చెప్పు ఈ మనిషికి మా అమ్మ రాదనీ.. అతణ్ణి పొమ్మనీ..” అని అంటుండగానే, ఇద్దరూ నిర్ఘాంతపోయి అటువైపు చూశారు. అతడి తల్లి ఆ వ్యక్తి పక్కకు వచ్చి జేరింది. కొత్త పెళ్ళికొడుకూ, పెళ్ళికూతురూ ఫోటో దిగడానికి ఇచ్చే ఫోజులో నించున్నారు ఇద్దరూ.
“ఎంత చక్కని జోడి కదా?!” అందామె అప్రయత్నంగా. అతడికి గుప్పెడు జెర్రలని నోట్లో పోసినట్టనిపించింది. కొండచిలువలు అతణ్ణి చుట్టుకుంటున్నట్టు అనిపించింది. మెదడు బొత్తిగా మొద్దుబారిపోయింది. అమ్మ! అమ్మ! అమ్మ! అని అనాలి అనుకుంటున్నా వీలుపడ్డం లేదు.
“అత్తయ్యా! ఈ చీర మీరు మొన్న చూపించిందే కదా. కట్టుకుంటే ఎంత బావుందో..” అంటూ వెళ్ళి చీర కొంగు పట్టుకొని పరీక్షించింది ఆమె. “ఈ ముత్యాల గొలుసు కూడా ఎంత బావుందో చూడండి మీకు. మీరేమో, నాకెందుకూ, నువ్వు ఉంచేసుకో అంటూ నాకిచ్చేయబోయేరు..” అని కొనసాగించింది.
ఆ ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందినవారిలా, వాళ్ళ అన్యోన్యతలను చూసి తట్టుకోలేని తానొక్కడే అనాథలా అనిపించింది అతడికి. కోపాన్నంతా డైనింగ్ టేబుల్ మీద ప్రదర్శించాడు. మళ్ళీ స్లో మోషన్లోనే, గాజు డైనింగ్ టేబుల్‌పై కుర్చీవేసి కొట్టాడు. గాజు పగిలిన శబ్దం భళ్ళున వచ్చింది.
ఆమె ఒక ఉదుటున అటునుండి ఇటు వచ్చి, “ఎంత పనిజేశావ్? కనీసం మూడు ఈ.ఎం.ఐలు కూడా కట్టలేదింకా? అప్పుడే పగలగొట్టేశావా?” అని విసుక్కుంటూ అరిచింది. వెంటనే మొబైల్ తీసుకొని, ఆ కంపెనీవాళ్ళిచ్చే ఇన్సూరెన్స్ డిటేల్స్ చదువుతూ కూర్చొంది.
అటువైపున అమ్మా, అమ్మ పక్కనా వ్యక్తి అలానే నవ్వుతూ ఫోజు ఇస్తున్నట్టే నిలబడ్డారు.
అతడు మొకరిల్లి, గట్టి గట్టిగా అమ్మ, అమ్మ! అని ఏడుస్తున్నాడు.
*****
“రామ్.. రామ్!” అని కుదుపుతున్నా అతడికింకా మెలకువ రావటం లేదు. మెలకువ వచ్చిన క్షణం అతడికీ ఏం అర్థం కాలేదు. వెంటనే వీపు నిమురుతూ, గ్లాసుడు మంచినీళ్ళు తాగించింది.
“ఏమయ్యింది? పీడకలా? ఆ? చెప్పు రామ్.. పీడకలా?”
అవునన్నట్టు తలూపాడు. “ఏం కాదులే! ఉత్తి కలే!” అంటూ అతడిని దగ్గరతీసుకొంది.
“అమ్మ.. అమ్మ” అని మెల్లిగా, కలవరపాటుగా అన్నాడు అతడు. ఆమె ఒక్కసారి గట్టిగా ఊపిరి తీసుకొంది.
“చిన్న జ్వరం రామ్.. దానికింత గాభరా ఏంటి?” అని ముద్దుగా విసుక్కుంది.
“కాదు. అమ్మ నన్ను విడిచివెళ్ళిపోతుంది. అమ్మ నన్ను వదిలేసి..” అని చెప్తూండగానే, ఆమె అతణ్ణి ఆపేసింది.
“నువ్వూ, నీ పిచ్చి ప్రేమలూ! మామూలు జ్వరానికి కూడా ఇలా అయిపోతే ఎలా?” అని తలనిమిరింది. అమ్మని ఒకసారి చూసొస్తానంటూ వెళ్ళబోయిన అతణ్ణి ఆపేసింది. “ఇప్పుడుగానీ నీ ప్రిన్సెస్ లేచిందనుకో, అందరికీ జాగరమే ఇక!” అంటూ దుప్పటి కప్పేసి పడుకోబెట్టేసింది.
ఆమె జోకొట్టినట్టు, తన గతాన్నికూడా జోకొట్టగలిగితే ఎంత బావుణ్ణో అని అనుకున్నాడు అతడు మనసులో.
మా జీవితాల్లోకి మళ్ళీ తగలడతాడా? అమ్మ ఏం చేస్తుందప్పుడు? నిజంగానే, నన్ను వదిలిపోతుందా? – ఇలాంటి ఆలోచనలతో యుద్ధం చేస్తూ చేస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు.
Leave a Reply