కినిగె పత్రికలో ’ఓ చిత్ర కథ’

Posted by

http://patrika.kinige.com/?p=1516

అద్దం ముందు నిలుచుంది ఆమె.

తనని తాను తీక్షణంగా చూసుకుంటోంది. చెదిరిన జుట్టు, ఉబ్బిన మొహం, ఎరుపెక్కిన కళ్ళు, ఆఫీసునుండి వచ్చాక మార్చని బట్టలు కనిపిస్తున్నాయి ట్యూబ్‍లైట్ ప్రసరించే వెలుగులో. ఆ కనిపిస్తున్నవేవీ ఆమెకు నచ్చటంలేదు. పక్కన లేని అర్జున్‍ను అద్దంలో ఉన్నట్టు ఊహించుకోసాగింది.

ఊహాల అద్దంలో కనిపిస్తున్న తమ జంటలో, తనని చెరిపేసుకొని, ఆ స్థానంలో అర్జున్‍కు నచ్చిన సినిమా హీరోయిన్‍ను నిలబెట్టింది. బాగనిపించారు వాళ్ళిద్దరు. హీరోయిన్‍ను చెరిపేసి తనను పెట్టుకుంది మళ్ళీ! అబ్బే.. బాలేదు.

ఆ ఊహలోకి మనోహర్ జొరబడ్డాడు అకస్మాత్తుగా. ప్రతిస్పందనగా డ్రెసింగ్ టేబుల్ ముందున్న చిన్న స్టూల్ మీద కూలబడిపోయింది. కళ్ళు మూసుకొంది. స్టేజ్‍ పైన మనోహర్ పక్కన ఆమె దండలతో నుంచున్న జ్ఞాపకం ముందుకు తోసుకొచ్చింది.

పైనుండి పూలవాన. ఎదురుగా కాలేజి విద్యార్థుల చప్పట్లు. అదో నిజమనిపించే అబద్ధం.

ఆ ఏడాది జరగబోయే వార్షిక నాట్యోత్సవంలో జంటగా డాన్స్ చేయటానికి ఆమె, మనోహర్ ఎంపికయ్యారు. కావ్యని కాకుండా, తనని ఎందుకు ఎంచుకున్నారన్న అనుమానం వస్తూనే ఉన్నా, ఆనందాతిశయాలు ఆమెను తోచనివ్వలేదు. అంతలోనే, అది టాగోర్ రాసిన “చిత్ర” నాటకం ఆధారంగా రూపొందిస్తున్న నృత్యనాటకమనీ, అందులో చిత్ర పాత్రకు “రఫ్”గా, “మాన్లీ”గా ఉండే అమ్మాయిని కావాల్సి వచ్చిందని కో-ఆర్డినేటర్ చెప్పినప్పుడు మనసు చివ్వుక్కుమంది. వరం పొందాక అందంగా మారిపోయిన చిత్రగా కావ్యకూ పాత్ర ఉందని తెల్సి నీరుగారిపోయింది.

మనోహర్‍కు దగ్గరగా ఉండడానికి ఇంతకు మించిన అవకాశం దొరకదని ఒప్పుకుంది. రిహార్సల్స్ జరిగే కొద్దీ ఆమెకు తాను ధరిస్తున్న పాత్రలోని మానసిక సంక్షిష్టత, తన మనసులోని అలజడి రెండూ బాగా అర్థమయ్యాయి. నాటకంలోనూ మనోహర్ ఆమెను చూడడు. కావ్యని చూడ్డం మానడు.

అర్జునుడు కాదన్నాక చిత్ర మానసిక సంఘర్షణకు లోనవుతుంది. అతడిని ఒప్పించాలని, ఒప్పుకునేదాకా ప్రాధేయపడాలని తపిస్తుంది. ముందు ఈ సీన్‍ను యథాతథంగా చిత్రీకరించడానికి పూనుకున్నారు. ఆమె మనోహర్‍కు తన మనసులోని మాట చెప్పాలి, మనోహర్ కాదంటాడు, ఆమె మనోహర్ కాళ్ళ మీద పడివేడుకుంటుంది. ఇది విన్న లెక్చరర్ ఒకరు “రాజ్యాన్ని ఏలే సామర్థ్యం ఉన్న వ్యక్తి, ఆ రాజ్యానికి రాజు తర్వాత రాజంతటి స్త్రీ, కేవలం మనసుపడ్డ వాడు కాదన్నాడని, ఇలా దేబరిస్తుందా?!” అన్న ప్రశ్న లేవనెత్తారు. జవాబుగా మరో రెండు పాత్రలు పుట్టుకొచ్చాయి.

స్టేజి మధ్యలో ఒక తెల్లని తెర కట్టి, దాని వెనుక ఒక ఆడా, మగలను నిలబెట్టి, వారి నీడలను చిత్రార్జునల ఆత్మలుగా చూపించాలని నిర్ణయించారు. రిహార్సల్ చేసి చూద్దామనుకున్నారు.

చిత్ర తన ప్రేమను వ్యక్తీకరించేటప్పుడు ఆమె ఆత్మ (తెరవెనుక నీడై) కూడా అచ్చు అలానే లయబద్ధంగా ఆడుతుంది. అర్జునుడూ, అర్జునుడి ఆత్మ ఆమె ప్రస్తావన తిరస్కరించి, వెళ్ళిపోడానికి వెనక్కి తిరుగుతారు. చిత్ర అలానే చూస్తూ ఉంటుంది, గంభీరంగా. తెరవెనుక నీడలా ఉన్న ఆమె ఆత్మ మాత్రం ఒక్కసారిగా అర్జుని ఆత్మ కాళ్ళపై పడుతుంది. అర్జునుడూ, ఆత్మ నడుచుకుంటూ స్టేజి పక్క వింగ్‍లోకి వెళ్ళిపోతారు. చిత్ర అలానే చూస్తూ ఉంటుంది. ఆమె ఆత్మ అర్జుని ఆత్మచే ఈడ్వబడుతూ పక్క వింగ్‍లోకి వెళ్ళిపోతుంది.

లైట్సాఫ్!

మళ్ళీ లైట్లు వేసేలోపు ఆమె హాస్టల్‍కు పరిగెత్తుకొనిపోయింది, రొప్పుతూ, ఆయాసపడుతూ, ఏడుస్తూ. ఆమె పరిస్థితి గ్రహించిన సీనియర్ అయిన రూమ్మేట్, “తొలిప్రేమ సినిమా చూశావా నువ్వు? అందులో వేణు మాధవ్ అమ్మాయిలను ఎ, బి, సి క్లాసులుగా వర్గీకరిస్తాడు. కావ్య ‘ఎ’ క్లాస్. ఏ అర్హతులు ఉన్నా లేకపోయినా, అందరూ ‘ఎ’ క్లాస్ అమ్మాయిలకే ఎగబడతారు. ఆ.. జీవితం ముప్పుతిప్పలుపెట్టి, ముక్కుపిండినప్పుడు, నీలాంటి, నాలాంటి ‘బి’ క్లాస్ అమ్మాయిలను పెళ్ళిజేసుకుంటారేమోగానీ.. ప్రేమించరు. అందులో కావ్య కూడా మనోహర్‍ను కావాలనుకుంటుంది. మర్చిపోవడమే నీకు అన్ని విధాలా శ్రేయస్కరం.” అని గీతోపదేశంజేసింది.

సీనియర్ మాటలు తప్పవ్వాలని బలంగా కోరుకుంది. మనోహర్ దృష్టి తన మీద పడుతోందిగానీ నిలువలేకపోతుందని తెల్సుకుంది. అందుకోసం నచ్చని, నప్పని పనులు ఎన్నో చేసింది. వాటిలో చాలావరకూ ఇప్పుడు మర్చిపోయింది. కొంచెం కష్టమనిపించినా ఆ దశనుండి త్వరగానే బయటపడింది. గాడిన పడిన జీవితం మళ్ళీ ఆమెను అలాంటి పరిస్థితుల్లోనే నిలబెట్టింది, ఈసారి అర్జున్ ఎదురుగా!

వేణుమాధవ్ లెక్కలు అబ్బాయిలకు అన్వయించుకుంటే, అర్జున్ ‘ఎ’ క్లాస్‍వాడు. అందగాడు, జీతగాడు, మంచివాడు. ఆర్నెల్ల పరిచయంలో అతడితో భవిష్యత్తు ఎంత అందంగా, ఆనందంగా ఉండగలదో ఊహించుకునే కొద్దీ బాధ. అందదని అనిపిస్తున్న ఆ ద్రాక్ష పుల్లగా అవ్వలేదింకా. ఆ ద్రాక్షను అందుకునే అర్హత తనకెలాగైనా వస్తే బాగుణ్ణన్న చిన్న ఆశ ఆమెచే రంగురంగుల అద్దాల మేడను కట్టించింది. అందులో ప్రతి అద్దంలోనూ ఆమె, అర్జున్.

కల చెదిరింది. కళ్ళు తెరిచింది. ఎదురుగా అద్దంలో ఆమె ఎప్పటిలానే ఉంది. ఆమే ఉంది.

* * *

ఆ మాయాభవనంలోకి ఆమె అడుగుపెట్టగానే అడుగులకు మడుగులొత్తుతూ ఓ ఇద్దరుముగ్గురు యువతులు ఆమెను లోపలికి తీసుకొనివెళ్ళారు. ఆమె ఓ యువరాణి అయ్యినట్టు మర్యాదలు చేశారు. పానీయాలూ, ఫలహారాలు వద్దంటున్నా వదల్లేదు. ఎగ్జిక్యూటివ్ వచ్చి బ్రైడల్ పాకేజ్ గురించి అనర్గళంగా చెప్పుకుంటూ పోతూంటే, ఆమెను ఆపి పెళ్ళికి తయారవటం కాదు, పెళ్ళయ్యేలా తయారు చేయడం కుదురుతుందా అని అడిగింది. మేకప్, మేకోవర్ కన్నా మించినదేదో అడుగుతుందని గ్రహించి, పెద్ద చేపే వలలో చిక్కిందన్న ఆనందంలో తలాడించింది ఎగ్జిక్యూటివ్.

మొదట ఆమె నిలువెత్తు 3డి ఫొటో ఒకటి తీసి, పెద్ద ఎల్.ఇ.డి స్రీన్‍లో ఫీడ్ చేశారు. దాంట్లో ఆమెకు నచ్చినట్టు మార్పులు చేసుకుంటూ పోయారు. ఫైనల్‍గా ఒక బొమ్మ అనుకున్నారు. అనుకున్న మార్పుల్లో ఏవేవి ఆమె శరీరానికి సరిపడతాయో చూడ్డానికి తలవెంట్రుక నుండి కాలిగోటి దాకా అన్నింటి పరీక్షలూ చేశారు.

పరీక్షలయ్యాక ఎగ్జిక్యూటివ్ వచ్చి, ప్రతి ట్రీట్మెంట్‍కూ ఇంత ఇంత అంటూ వేసుకుంటూ పోతూ, “మొత్తం ఇంత!” అని తేల్చింది. తిరిగిపోతున్న ఆమె కళ్ళకు బ్రేక్ వేస్తూ “అంతా కట్టనవరం లేదు ఇప్పుడే. ముందు పది పర్సెంట్ కట్టండి. ట్రీట్మెంట్స్ అయ్యే కొద్దీ మిగితా డబ్బులు కట్టచ్చు.” అంది. అయినా కూడా, అంత మొత్తం ఎప్పటికి తీసుకురాగలదు?

“మీరేం వర్రీ కాకండి. ఈ.ఎం.ఐ ఆఫర్ ఉంది మా దగ్గర. మీరు ఏ విషయం చెప్తే, నేను మా బాంక్ వాళ్ళతో మీటింగ్ అరేంజ్ చేస్తాను.”

అంత మొత్తం పెడితే భారతదేశంలో ఓ మహానగరంలో ఖరీదైన ఇల్లు కొనుక్కోవచ్చును. మనసుపడినవాడిని మనువాడకపోయాక, ఇల్లుంటే ఏంటి? లేకపోతే ఏంటి? అని ఆమెకు అనిపించింది. అందం, సులభ వాయిదా పద్ధతిలో వస్తానంటే కాదనుకోవడానికి ఆమె సిద్ధపడలేదు. ఇంట్లో మాటమాత్రంగానైనా చెప్పకుండా, సన్నిహితుల సలహా కూడా తీసుకోకుండా సంతకాలు చేసింది, ఎక్కడపడితే అక్కడ.

ట్రీట్మెంట్స్ మొదలయ్యాయి. కొన్ని తేలిగ్గా అయిపోతే, మరికొన్ని తిప్పలుపెట్టాయి. కొన్ని వద్దని డాక్టర్లు వారించినా, ఆమె వినిపించుకోలేదు. ఒక్కో ట్రీట్మెంట్ ఒక్కోరకంగా బాధించింది. అయినా భరించింది.

ఆర్నెళ్ళల్లో ఇంతకు మునుపులేని నిగారింపు ఆమెలో చూసి “పెళ్ళికళ!” అని చెవులు కొరుక్కున్నారందరూ. వెతకక్కర్లేకుండానే మంచి సంబంధం వచ్చిన సంబరంలో కూతురిలో సంతోషాన్ని చూడగలిగారేగానీ తల్లిదండ్రులు, ఆమెలో కొత్త అందాన్ని పట్టించుకోలేదు. వారంవారం కొత్తకొత్తగా కనిపించే ఆమెలోని మార్పుల చిట్టాను మొదట శ్రద్ధగానే లెక్కెట్టిన కొలీగ్స్ కొన్నాళ్ళకు ఆ ప్రయత్నాన్ని వదులుకున్నారు. కాలేజి రోజులకీ ఇప్పటికీ వచ్చిన మార్పును అప్పటి స్నేహితులు పోల్చుకోలేకపోయారు. ‘ఏం చేయించుకున్నావో మాకూ చెప్పచ్చు కదే తల్లీ! అర్జున్ అంతటివాడు కాకపోయినా, మేమూ ఎవరో ఒకర్ని పడేయాలిగా!’ అని అంటూ ఆరా తీశారుగానీ, రహస్యం తెల్సుకోలేకపోయారు.

మిసెస్. అర్జున్ – ఆ కొత్త పేరు ఆమెను పులకింపజేసింది. ఆమె అందం మరింత ఇనుమడించింది. పదిమందిలో ఉన్నప్పుడు ఎక్కువ చూపులు తనవైపు తిరగడం, కొత్తల్లో ఇబ్బందిపెట్టినా, గర్వంతో కూడిన సంతోషాన్ని అందించింది. పార్టీలలో తనను పరిచయంజేసేటప్పుడు అర్జున్ కళ్ళల్లో మెరుపు ఆమెను ఉక్కిరిబిక్కిరిజేసింది.

* * *

సైక్రియాట్రిస్ట్ దగ్గర ఎట్టకేలకు ఆమె నోరు విప్పింది.

“అర్జున్ కోసం చేశాను.” అని ఆమె జవాబు, డాక్టర్ వేసిన ప్రశ్నకు.

తన కోసమా? తన కోసం ఎవరు చేయమన్నారు? తాను ఏనాడైనా అడిగాడా ఇలా చేయమని? లేదే?! ఆమెను చూడకుండానే ప్రేమించలేదా? అసలు ఇండియాకి ఇంకా వెళ్ళకముందే ఆమె గురించి ఇంట్లో చెప్పి, ఒప్పించలేదా? అమ్మాయిని తనూ చూడలేదని, ఆఫీస్ ప్రొఫైల్‍లో ఒక పాస్‍పోర్టు ఫోటోనే చూశాననీ, ఆమె పెద్దగా బాగోకపోయినా పెళ్ళిచూపుల్లోనే ఏ నిర్ణయం తీసుకోవద్దనీ తనవాళ్ళని బతిమిలాడుకోలేదా? వాళ్ళకీ నచ్చేసి పెళ్ళి ఏ అడ్డంకులూ లేకుండా అయిపోయిందిగానీ, ఏ అడ్డంకి వచ్చినా దాన్ని ఎదుర్కోవాలని తాను ముందే అనుకోలేదా? మరి అలాంటి తనను అపరాధిగా నిలబెడుతుందేంటి?

డాక్టర్ ఇంకేవో అడుగుతున్నాడు. ఆమె ఏడుపు ఆగినప్పుడల్లా సమాధానాలు చెప్పడానికి ప్రయత్నిస్తోంది. కాలేజినాటి సంగతులేవో చెప్పుకొస్తోంది. వాడెవడో కాదన్నాడని ఏం తోచితే అది చేసేయటమేనా? మగాడుగా పుట్టిన ప్రతివాడూ అందానికి తప్ప మరిదేనికీ లొంగడని తీర్మానించుకోవడమేనా? చిరాకేస్తోంది అతడికి.

నాలుగేళ్ళ కాపురంలో పిల్లలు పుట్టకపోవడం అతణ్ణి కలవరపరచలేదు. ఇద్దరూ మొదటి రెండుమూడు ఏళ్ళు కెరీర్లపైనే దృష్టి పెట్టారు. ఇంతలో అటువైపు, ఇటువైపు పెద్దవాళ్ళు ఒత్తిడి తెచ్చారు, మనవలకోసం. స్నేహితులూ, తెల్సినవారూ కనేస్తే ఓ పనయ్యి పోతుందిగా అన్నట్టు సలహా ఇచ్చారు. పదినెలల నుండి ప్రయత్నిస్తున్నారు పిల్లల కోసం.

కొన్ని నెలలక్రితం ఓ అబార్షన్! కొంచెం భయమనిపించినా పర్లేదనుకున్నాడు. కానీ అప్పటి నుండి ఆమె ముభావంగా ఉండడం మొదలెట్టింది. ఆమెలో ఉత్తేజం మాయమయ్యింది. చిత్రంగా రోజులు గడిచేకొద్దీ ఆమె తేరుకోవడం అటుంచి, ఇంకా ఇంకా కూరుకుపోయినట్టనిపించింది. ఎంత అడిగినా చెప్పేది కాదు. తనకి చెప్పటం లేదని ఇంట్లోవారితో అడిగించాడు. అయినా లాభం లేకపోయింది.

చివరకు గైనకాలజిస్ట్ దగ్గర విషయం బయటపడింది. ఆమె కన్సీవ్ కాకలేకపోవచ్చుననీ, కన్సీవ్ అయినా కూడా చాలా కాంప్లికేషన్స్ వస్తాయని తేల్చి చెప్పింది డాక్టర్. మెడికల్ హిస్టరీ గురించి నొక్కి, నొక్కి డాక్టర్ అడిగినప్పుడు పెళ్ళికి ముందు చేయించుకున్న ట్రీట్మెంట్ వివరాలు బయటపడ్డాయి.

విషయం తెల్సిన అందరూ ఆమెను ఒక్కసారిగా బోనులో నిలబెట్టేసి, తీర్పులివ్వటం మొదలెట్టారు. తెలియని అమాయకత్వంలో చేసిందని వెనకేసుకొచ్చింది తనే! కానీ ఆమె పరిస్థితి మాత్రం దిగజారింది. శారీరకంగా ఒకరకమైన ఇబ్బందులైతే, మానసికంగా కూడా కృంగిపోయింది.

డాక్టర్ మందులేవో రాసిచ్చి, ఆమె ఆలోచనల్లో కూరుకుపోకుండా, బిజిగా ఉండేట్టు చూడమని అతడికి సలహా ఇచ్చి, మళ్ళీ వచ్చేవారం రమ్మని చెప్పి పంపేశాడు.

ఇంటికి చేరుకొని ఆమెకు వేయాల్సిన మందులు వేసి, ఆమె పడుకున్నాక వచ్చి హాల్లో, చీకట్లో, మ్యూట్ పెట్టిన టివి ముందు కూర్చొని, లాప్‍టాప్‍ తెరిచాడు.

చాలా ఒంటరిగా ఉన్నట్టు అనిపించింది అతడికి. అంతకు మించి అలసటగా ఉంది. “అర్జున్ కోసం చేశాను” అన్నది మరుపుకు రావడంలేదు. ఆమె చేసినవన్నీ చేయడానికి తానేమైనా దోహదపడ్డాడా? మాటమాటల్లో తనకు తెలీకుండానే ఆమెను ఇలా చేయడానికి ప్రేరేపించాడా? పిల్లలు పుట్టకపోతే పోనీ -అంత దాకా వస్తే, దత్తత తీసుకోవచ్చు- కానీ ఆమెకి మరే విధంగానైనా ఆరోగ్యం చెడితే?! నెలనెలా తన సొంత ఖర్చులంటూ ఎవరికి డబ్బు ట్రాన్సఫర్ చేస్తుందో పట్టించుకోన్నందుకు తనని తాను తిట్టుకున్నాడు. ఎప్పుడు ఆమె స్కూల్, కాలేజిల గురించి అడిగినా ఏవో ముక్కలను జాగ్రత్తగా అతికినట్టు చెప్పుకొచ్చేదేగానీ, ఇష్టంగా చెప్పేదికాదు. రానురాను ఆ కబుర్లూ తక్కువైపోయాయి. అలంకరణలపై ఆసక్తి ఆడవాళ్ళ అలవాటనుకున్నాడుగానీ, అది అభద్రతను సూచిస్తుందని ఇప్పటి వరకు తట్టలేదు. అమ్మానాన్నలను, దేశాన్ని వదిలి తనతో వచ్చినట్టుగా, అప్పటివరకూ ఆమె తాను జీవించిన ఇరవై మూడేళ్ళ జీవితాన్ని వదిలివచ్చేసినట్టు వ్యవహరించేది. అది అతడికి ఇప్పుడు ఎబ్బెట్టుగా తోచి, ఇబ్బంది పెట్టింది.

“ఏమన్నార్రా డాక్టర్?” – అక్క పింగ్ చేసి పదినిముషాలవుతుందని గ్రహించాడు.

“ఏం లేదు. ఏవో మందులిచ్చారు. సమయం పడుతుందని అన్నారు.”

“నువ్వెలా ఉన్నావ్?”

“ఏదో.. ఉన్నాను.”

“ఎక్కువ ఆలోచించకురా! జరిగిందేదో జరిగిపోయింది. జస్ట్ ట్రై టు గెట్ ఓవర్ ఇట్..”

“హమ్మ్.. ప్రయత్నిస్తున్నాను. ప్రస్తుతానికి మాట్లాడే ఓపిక లేదు. నిద్రపోతాను. బై.”

అవతల వైపు నుండి ఏం సమాధానం వచ్చిందో కూడా చూసుకోకుండా లాప్‍టాప్ మూసేశాడు. సమస్యకు సమాధానం వెతుక్కోవడమా, లేక సమాధనపడ్డమా అని మధనపడుతూ పడుకున్నాడు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s