కినిగె పత్రికలో మై_లవ్_లైఫ్.లై

Posted by

http://patrika.kinige.com/?p=2399

“కమ్మాన్.. డోన్ట్ బి సో నేవ్. బాచలర్స్ ఉన్న గదికి వెళ్ళాలంటేనే ఇబ్బందే?! అంతదాకా ఎందుకు, వాళ్ళ హార్డ్ డిస్కో, లాప్‍టాపో వాడుకోవాలన్నా కొంచెం జంకే! వాటిలో చూడరానివి ఏమేం ఉంటాయోనని. అలాంటిది ఎంత అతడు పిలిస్తే మాత్రం నువ్వెలా పోయావ్ అమ్మాయ్.. అదీ అక్కడికి?” అని మీరు అడగచ్చు. అడగండి. మొదలెట్టాను గనుక నాకూ చెప్పక తప్పదు. కాకపోతే నేను చెప్పేది వినటం, ఆ పై అర్థం చేసుకోవటమంటే మీరేసుకున్న జోళ్ళు వదిలేసి, నా సాండల్స్ వేసుకొని నడవటంలాంటిది. అది మీకు ఒకేనా మరి?

నాకా అప్పటికే ఇరవై మూడేళ్ళు. ఎటెళ్ళినా “పెళ్ళెప్పుడు?” అని అడగడానికి మీరు, మీలాంటి వాళ్ళు తయారుగా ఉండేవారు. “ప్రస్తుతానికి ఏం లేదండి.” అని అంటే విని ఊరుకోరుగా! వయసైపోతుందని కంగారు పెట్టేస్తారు. “ఏంటి ఇరవై మూడుకే?” అని నేను. “థర్టీస్‍కళ్ళా ఉద్యోగంలో సెటిల్ అయ్యి, ఒకట్రెండు భారీ ఇన్వెస్ట్మెంట్లు చేయడంతో పాటు, పెళ్ళై కనీసం ఒక నలుసైనా ఉండాలిగా! ఇవేవీ అప్పటికప్పుడయ్యే పనులుకావుగా” అన్నది మీ థీసిస్. లెక్కేసుకోవడం మొదలెడితే, మీరు చెప్పిందే రైటుగా తోచింది. ఏ మాటాకా మాట. నాకూ త్వరగా పెళ్ళిచేసుకోవాలని అనిపించేది. పెళ్ళితో స్టేజ్ పెద్దదవుతుంది. కారెక్టర్లు ఎక్కువవుతారు. నాటకీయత భారీగా పెరుగుతుంది. అందులోంచి పుట్టుకొచ్చే కథల సంగతే వేరు. వాటికి ఆడియన్స్ బేస్ ఎక్కువ. టీ.ఆర్.పీల సంగతి చెప్పనే అక్కర్లేదు. ఇప్పుడీ కథ ఎంత తక్కువమందికి ఎక్కుతుందో వేరే చెప్పాలా?

ఇంట్లో ఏమో సంబంధాల హడావుడి. ఆఫీసులో మా ఇద్దరిని గమనిస్తున్న ప్రజానీకం కూడా చూసీచూడనట్టు ఊరుకోలేదు. వాళ్ళ ఊహాగానాలు, అంచనాలూ, విశ్లేషణలూ, ఎగ్జిట్ పోల్లూ వాళ్ళవి. ఒప్పుకోంగానీ, మనలోనూ ఒక బుల్లి న్యూస్ ఛానల్ దాగుంటుంది. మైకులు బయటకు కనిపించనివ్వంగానీ, “ఏం జరుగుతుంది ఇక్కడ! నాకు తెలియాలి” అన్న డిమాండును మాత్రం దాచుకోలేం. కొలీగ్స్ కొందరొచ్చి ముఖం పట్టుకొని అడిగేశారు, “ఏంటి కథ?” అని. మరే! అక్కడికేదో యష్ రాజ్ అంతటి రొమాంటిక్ సినిమా డైరక్టర్ నాకు “ఇదేనమ్మా నీ ప్రేమకథ” అని చేతికి స్క్రిప్ట్ ఇచ్చినట్టు, నేను దాన్ని ఎవరికీ చూపించకుండా దాచేసుకున్నట్టు.

యష్ రాజ్ సినిమానే అయ్యుంటే గులాబి పువ్వొక్కటి చేతిలో పట్టుకొని, “హి లవ్స్ మి”, “హి లవ్స్ మి నాట్” అనే ఆట ఆడుకునేదాన్ని. అది చేతకాకే, ఇలా ప్రోగ్రామ్ రాసుకున్నాను. అప్పటికి, ఇప్పటికి అతడు నా కెరీర్ తొలినాళ్ళల్లో నేర్పిన ప్రోగ్రామింగ్ అంటే నాకు ప్రాణం. నన్ను అతడికి దగ్గర చేసింది, దగ్గరగా ఉంచిందీ అదే!

మై_లవ్‍_లైఫ్.లై

ఇంపోర్ట్ అతడిని అతడుగా

ప్రొపోజ్_చేయి(ఏమని):

        అతడికి_చెప్పు(ఏమని = ఏమని )
        సమాధానం = అతడు.మనసుని_అడుగు(ఏమని = “నేనంటే ఇష్టమా?”)
        తిరిగిపంపు సమాధానం

లైవ్_లైఫ్(అతడు):

        అతడి_సమాధానం = ప్రొపోజ్_చేయి(ఏమని=“నువ్వంటే ఇష్టం”)

        అతడి_సమాధానం “అవును” అయితే:

                  పెద్దలను_ఒప్పించు(చూపించు = [అతడు.కెరీర్, అతడు.కుటుంబం, అతడు.గుణగణాలు])
                  క్యూ_లో_ఉన్న_సంబంధాలు(ఏం_చేయాలి =“తీసెయ్య్”)
                 పెళ్ళి_పిల్లల_ప్లానింగ్_మొదలెట్టు()

       కాకపోతే:

               ఇగ్నోర్_చేయి (“అతడిని”)
               క్యూ_లో_ఉన్న_సంబంధాలు(ఏం_చేయాలి = “కొనసాగించు”)

జీవితం బైనరీ కాదుకదా? అతడి “నో”కి కూడా సిద్ధపడున్న నాకు అసలు ఏ సమాధానమూ రాలేదు. నేనెంత తలతిక్క ప్రశ్నలు వేసినా ఓపిగ్గా వివరించే మనిషి, సింపుల్‍గా ఒక “నో” అనో, “యెస్” అనో చెప్పలేకపోయాడు. ప్రోగ్రామ్‍లో రాసుకున్నట్టు, “యెస్”కాని దల్లా “నో” అని అనుకోవాలనుకున్నాను. కానీ, ఏమో, అది “యెస్” కూడా అవ్వచ్చుగా అన్న ఆశ నన్ను వదల్లేదు. నాకు తెలీకుండానే ప్రోగ్రామ్ ఇలా మారిపోయింది:

అతడి_సమాధానం “అవును” అయ్యేంతవరకూ:

అతడి_సమాధానం = ప్రొపోజ్_చేయి(ఏమని = “నువ్వంటే ఇంకా ఇంఖా ఇష్టం”)

చిరాకేయడం మొదలెట్టింది. చిరాకుపడ్డాను. విసుగొచ్చింది. విసుక్కున్నాను. కోపం వచ్చింది. కోపడ్డాను. “చెప్పకుండా ఎలా ఉంటావో నేనూ చూస్తాను?” అన్న పంతం మొదలైయ్యింది. ఆడవాళ్ళు పంతంపడితే ఏమవుతుందో అనుభవజ్ఞులైన మీకు నేను కొత్తగా చెప్పనక్కరలేదనుకుంటాను. ఏయే ఆయుధాలతో ఎలాంటి చిత్రహింసలు పెడితే సమాధానం ఇవ్వడానికి ఒప్పుకున్నాడో మీ ఊహకే వదిలేస్తున్నాను.

ఇంత వత్తిడి తెచ్చి, అతడు సమాధానం ఇస్తానన్న చోటుకి నేను వెళ్ళనని అనలేనుగా? ఊ?

అదేదో పెద్ద లాబ్‍లా ఉంది. ఏ లాబ్ అన్నది నాకు అర్థం కాలేదు. గుండ్రంగా, గాజుగోడలున్న ఓ పెద్ద గదిలోకి నన్ను తీసుకెళ్ళారు. అతడిని గది బయటున్న స్ట్రెచర్ మీద పడుకోబెట్టి, ఏవో ఇంజెక్షన్లు ఇచ్చారు. తలకి ఏవేవో అమర్చారు. స్ట్రెచర్‍ను లోపలికి తీసుకుపోతుంటే నావైపు చూసి “థంబ్స్ అప్” అని సైగ చేశాడు. నాకసలేం పాలుపోలేదు. అడిగినదానికి అవునో, కాదో అని చెప్పకుండా ఈ గొడవంతా ఎందుకో అర్థంకాలేదు.

ఇంతలో నేనున్న గదిలోకి ఒక ఆడమనిషి వచ్చింది. గది మధ్యలో ఉన్న కుర్చీలో కూర్చోమంది. ఆ తర్వాత ఎదురుగా ఉన్న బల్లనూ, గోడలనూ చూపించి ఏవేవో చెప్తూ పోయింది. నా ధ్యాసంతా అతడి మీదే ఉంది. మనసులో బోలెండంత భయం కూడా ఉంది. ఆమె చెప్పేవాటిపై శ్రద్ధ పెట్టలేకపోయాను.

“సరే..ఇక నేను వెళ్తాను.” అంది.

“అదేంటి? ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉండాలా?”

“అవును. ఇది మీ ఇద్దరికి సంబంధించిన విషయం. ప్రైవసీ వద్దా?” అని తిరిగి నన్నే అడిగింది.

నాకు గుండె జారిపోయింది. ఏదో సమాధానంకోసం వెంపర్లాడుతున్నాను కాబట్టి వచ్చానుగానీ, అతడి మెదడేమైనా డిస్నీ వరల్డా మురిసిపోతూ చుట్టేయడానికి?

ఆమె వెళ్ళిపోయింది. ఆమె మాటిమాటికి చూపించిన గ్రీన్ బటన్ ఒకటి నొక్కాను. అప్పటివరకూ గాజుగోడలనుండి బయటకు చూస్తే అన్నీ కనిపించాయి. కొన్ని క్షణాలకు అవి కనిపించడం మానేశాయి. ఇంతకుముందుకన్నా ఎక్కువ భయం వేసింది. టెన్షన్ వల్ల చెమటలు పట్టాయి. వాటిని తుడుచుకుంటుండగా బల్ల మీద నా వేళ్ళు టచ్ అయ్యినట్టున్నాయి. అందులో ఏవేవో ఫొటోలు కనిపించాయి. వాటిల్లో నాకు తెల్సున్న ముఖం ఓ హాలీవుడ్ సినీనటిది. దాని మీద క్లిక్ చేశాను.

వెంటనే గోడల నిండా ఆమె ఫోటోలతో నిండిపోయాయి. నా ఎదురుగా ఉన్న గోడ మీద ఒక వీడియోలాంటిది మొదలయ్యింది. ఆ వీడియోలో అతడూ, ఆ సినితార ఏదో బీచ్‍లో ఉన్నారు. ఆమె బికినిలో ఉందిగానీ చేతులనిండా గాజులున్నాయి. గోరింటాకు పెట్టుకొనుంది. మెట్టలు, పట్టీలు పెట్టుకొనుంది. వాళ్ళిద్దరి మధ్యన రొమాన్స్ శృతి మించుతోంది. చూడలేక కట్టేశాను.

ఆ హాలీవుడ్ నటంటే పడిచస్తాడని తెల్సు. ఆమెపై ఇష్టాన్ని చెప్పమంటే గంటగంటలు మాట్లాడతాడు. అతడి ఫాంటసీలు, సీక్రెట్లూ నాకెందుకూ? నా గురించి ఏమనుకుంటున్నదీ తెలిస్తే చాలు నాకు.

ఎంత వెతికినా నేనెక్కడా కనిపించలేదు. నా పేరు ఇచ్చి సిస్టమ్‍నే వెతకమన్నాను. “నో రిజల్ట్స్” అంది. ఆమె ఇన్‍స్ట్రక్షన్స్ ఇస్తున్నప్పుడు శ్రద్ధగా వినుంటే కొద్దిగా అయినా పనికొచ్చేవేమోనని అప్పుడు అనిపించింది. కొంచెం ఓపిక నశించి రాండమ్‍గా ఏదో సెర్చ్ చేస్తుండగా ఓ అందమైన నవ్వు తళ్ళుక్కుమంది. మరుక్షణంలో దానిపైన క్లిక్ చేసేశాను. అతడి అంతరాంతరాలలో దాగినట్టుంది, పూర్తి వివరాలు రావడానికి కొంచెం సమయం పట్టింది. కాసేపటికి గదంతా ఆ నవ్వుతో నిండిపోయింది. ఆ నవ్వు తాలూకు డీటేల్స్ చూస్తే నా పేరుంది!

ఇంకేముంది? ఎగిరి గెంతులేశాను. ఆ క్షణంలో అది ప్రపంచంలోకెల్లా మోస్ట్ రొమాంటిక్ ప్రొపోసల్ అననిపించింది. అతడి హృదయంలో నేను! అదేలే, నా నవ్వు. మీరూ, మీ నిట్‍పికింగ్! కొంచెం రిలాక్స్ అయ్యి వెనక్కి వాలండి. ఊహించుకోండి: ఇప్పుడు మీరు “మిమ్మల్ని ప్రేమించిన మనిషి” అనే గది లోపల ఉన్నారు. అక్కడన్నీ అస్తవ్యస్థంగా పడేసున్నాయి. మీ రాకకు ముందో పాతికేళ్ళ జీవితం. మీతో కలిసి ఓ ఐదు, పది, ఇరవై సంవత్సరాలు – ఎన్నైతే అన్ని వేసుకోండి. మీతో పాటు ఇంకా ఎందరెందరో. ఇన్నింటిని మధ్య, ఇందరి మధ్య అతిభద్రంగా మీరు; అమ్మ కడుపులో పాపాయిలా! There’s a reason why it is so amazing to be loved. Don’t you think so?

మీకెలా అనిపిస్తుందోగానీ, నాకప్పుడు వెంటనే ఆ గదిలోంచి బయటకు పరుగుతీసి, అతడిని ఆ స్ట్రెచర్ మీదనుండి లేపి, హత్తుకోవాలని అనిపించింది. అదే చేసుండేదాన్ని నా దృష్టి మళ్ళీ ఆ నవ్వు మీదకు పోకపోయుంటే! దాన్ని చూస్తుంటే ఇంకా ముద్దొచ్చింది. నా నవ్వు అంత అందమా, లేక అతడు దాన్ని అంత అందంగా దాచుకున్నాడా అన్నది నాకిప్పటికి అంతుపట్టని విషయం. చాచిన బొటనివేలు, చూపుడువేలుని ఆ ఫొటోమీద పెట్టి, మెల్లిమెల్లిగా దగ్గరకు తీసుకొచ్చా రెండు వేళ్ళని. రెండూ కలిసాక, పెదాల దగ్గరకు తీసుకొచ్చి ముద్దుపెట్టుకుందామనుకున్నాను.

కలిసిన నా వేళ్ళు పెదాల వరకూ రాకముందే, నా నవ్వు ఫొటో పక్కకు జరిగిపోయుంది. దాని వెనుక ఇంకో అమ్మాయి ఫొటో ఉంది, ముక్కముక్కలుగా. ఆమె సంగతేంటో చూద్దామనుకున్నాను. ఆ ఫోటోకి లింక్ ఉన్న వీడియో తెరిచి చూడ్డం మొదలెట్టాను. ఆ వీడియోకి లింక్ ఉన్న మరొకటి. అలా చూస్తుండిపోయాను.

ఎప్పటినుండి మోగుతున్నాయో మరి, అలార్మ్స్ వినిపించాయి. చూస్తూ చూస్తుండగానే పెద్దగా మోగాయి. గదంతా ఎర్రగా అయిపోయి, సిస్టమ్ దానంతట అదే మొత్తం ఆగిపోయింది.

గాజుగోడల్లోంచి మళ్ళీ అంతా కనిపించటం మొదలయ్యింది. డాక్టర్లూ, నర్సులూ హడావుడిగా తిరుగుతున్నారు. అతడున్న గదివైపు అంతా గొడవగొడవగా ఉంది. వెంటనే అక్కడికి పరుగెత్తుకుపోయాను. అతడు బాధలో విలవిలాడుతున్నాడు. డాక్టర్లు గదిలో నేనేం చేశానో అడిగారు. చెప్పాను. ఎక్కడో ఏదో తేడావచ్చిందని తేల్చారు. నన్నా గదిలోకి వెళ్ళనివ్వమని బతిమాలాను. అతడున్న పరిస్థితుల్లో మళ్ళీ మాపింగ్ కుదరని పని అని ఒప్పుకోలేదు.

అతడు కుదుటపడ్డానికి గంటలు పట్టాయి. కోలుకోడానికి రోజులు పట్టాయి. అసలు మనిషి ఏమైపోతాడోనన్న బెంగ, నా-మనిషి-కాలేడన్న బాధను మింగేసింది. అతడు కళ్ళు తెరిచేసరికి అతడికి ఇష్టమైన నవ్వుతోనే అతని ముందు నిల్చున్నాను. బదులుగా నీరసంగా నవ్వాడు. అది చాలునని అనుకున్నాను.

ఊహు. సరిపోలేదు.

ఆ గదిలో నేను ఏమేం చూశానా? అవి నేనెలా చెప్తాను? అవన్నీ అతడి కథలుగా. ఎప్పుడో అతడికి మీరు ఇలానే తగిలితే, అతడికి చెప్పాలనిపిస్తే, అతడే చెప్పుకొస్తాడు అవన్నీ. మీకెందుకు చెప్తాడనా మీ అనుమానం? ఇప్పుడు నేను చెప్పటం లేదా? అలానే. కొన్నిసార్లు మన కథలు వినడానికి అత్మీయులు పనికిరారు. వాళ్ళ ధ్యాస ఎప్పుడూ మన మీదే ఉంటుంది. జరిగిపోయిన కథలోనైనా మన బాధను వింటూ ఊరుకోలేరు. అందుకే మీలాంటి పరాయివాళ్ళు, అపరిచితులు కావాలి. మళ్ళీ మనం కలిసే అవకాశమే లేకపోతే మరీ మంచిది.

my_love_life.lieమా బంధానికి సంబంధించినంత వరకూ ఆ లాబ్‍లో జరిగిందంతా ఓ లాండ్‍మార్క్. మా గురించి మాట్లాడుకోవాలంటే, దానికి ముందూ, దాని తర్వాత అనే మాట్లాడుకోవాలి. ఏదీ అంతకు ముందులా మిగల్లేదు. మా స్నేహం ఒక సాప్ట్వేర్ బిల్డ్ అనుకుంటే, ఆ పూట నుండి ఎప్పటికప్పుడు “బ్రేక్” అవుతూనే ఉంది. కనీవినీ ఎరుగని exceptions విసురుతుంది. (వాటితో పనిజేయించుకోవటం కూడా రావటంలేదని ప్రోగ్రామ్స్ మనల్ని తిట్టడాన్ని exceptions అంటారులే!) మీకివ్వన్నీ అర్థమవుతాయని కాదుగానీ, నన్ను చెప్పనివ్వండి.. ప్లీజ్. అతడిపై నా ఫీలింగ్స్ stack overflow exception. ఫ్రెండ్‍గా ఎదురుగా ఉన్న, బాయ్ ఫ్రెండ్ కానందుకు, అతడికి చెప్పుకోలేను కాబట్టి null pointer exception! నాపై నాకే చిరాకేసేంత దరిద్రంగా నేను అతడితో వ్యవహరిస్తున్నప్పుడు అతడి సహనం array out of bounds exception. Exception driven relation అయిపోయింది ఒకానొక స్టేజిలో.

ఎందుకంటే ఏం చెప్తాం? ఇద్దరికి ఈ మా స్నేహమనే బిల్డ్ పాస్ అవ్వాలనే ఉండేది. అది ఎక్కడెక్కడ చేతులెత్తేస్తే అక్కడక్కడ మేం ఆత్రుతతో, కంగారుగా ఏది తోచితే అది, ఎవరికి తోస్తే వారు “ఫిక్స్” చేసేసేవాళ్ళం. ఇద్దరు సరిగ్గా మాట్లాడుకోనప్పుడు, కలుగుతున్న ఇబ్బందులకుగల కారణాలు ఏంటని సరిగ్గా ఆలోచించుకోనప్పుడు ఎంతటి జాతర జరుగుతుందో మీకు తెలీంది కాదుగా! మేం చేసిన “fixes”లో చాలా వరకూ “conflicts” అయ్యి కూర్చున్నాయి. మా స్నేహం చతికలబడిపోయింది.

అతడికి దూరంగా ఉంటే, పరిస్థితి మెరగవుతుందన్న ఆశతో పై చదువులకు వెళ్ళిపోయాను. అతడెప్పుడూ గొప్పగా చెప్పే యూనివర్సిటిలోనే చేరాను.

కంటికి దూరమయ్యాక, గొంతుతో నటిస్తే సరిపోయేది. యూనివర్సిటిలో కొత్తగాలి, కొత్త మనుషులు మంచి ప్రభావం చూపించారు. మొదటి మూడునెలలోనే నేను ఇక్కడ సాధించాల్సింది చాలా ఉందని బోధపడింది. అతడులేని లోటును అతడు ఇష్టపడే టెక్నాలజిలతో తీర్చుకున్నాను. వాటిలో మునిగిపోయాను.

మా మధ్య కాల్స్ తగ్గిపోయాయి. దాదాపుగా లేనట్టే, ఇవ్వాల్టి ఉదయం వరకూ. ఛాట్స్ ఎక్కువ అలవాటు ముందునుంచి. ఆఫీసులో పక్కపక్కనే ఉన్నప్పుడు కూడా చాట్స్ లోనే మాట్లాడుకునేవాళ్ళం. నా అంతట నేను పింగ్ చేయటం మానుకున్నాను. అతడే అప్పుడప్పుడూ పలకరించేవాడు. మొదట్లో మూడ్ బాగోలేకపోతే సమాధానం ఇచ్చేదాన్ని కాను. రానురాను మూడ్ బాగుంటే అక్కడినుండి తప్పించుకునేదాన్ని.

Maybe, I was falling out of love. Or maybe, I was just safeguarding my own sanity. “నన్ను విసిగించకుండా ఉండగలవా?” అని అడుగుదామని చాలాసార్లు నోటి చివరిదాకా వచ్చేది. ఒక్కసారిగా ఆ లాబ్‍లో జరిగినవన్నీ నన్ను చుట్టుముట్టేవి. నేనిచ్చిన మాట గుర్తుకొచ్చేది. కథ మళ్ళీ మొదటకొచ్చేది.

“ జస్ట్ ఫ్రెండ్స్” ఆట కొనసాగుతూనే ఉండాలి. కానీ నేనుండనవసరం లేదు. ఎలా?

“ఒకటి గుర్తుంచుకో. నువ్వు దానికి అర్థమయ్యేట్టు చెప్పగలగాలేగానీ కంప్యూటర్ ఏమైనా చేసిపెడుతుంది. అది చేయగలిగినదేదీ నువ్వు చేయనవసరం లేదు. చేయకూడదు. దానితో చేయించుకోగలగాలి! నీ నేర్పు, ఓర్పు చేయించుకోడానికే ఉపయోగించు.” – అతడెప్పుడో ఇచ్చిన సలహా.

ఆ సలహాను నాకు అనుకూలంగా మార్చుకున్నాను. నేను చేయలేకపోతున్నది దానితో చేయించాను. అది కూడా బాగానే పనిజేసిందనుకున్నాను, ఇవ్వాళ పొద్దున్న అతడినుండి కాల్ వచ్చేంతవరకూ. అతడికి దొరికిపోతానని నాకు తెల్సు. దొరికిపోయినప్పుడు అతడి ఆగ్రహావేశాలకు ఎలా అడ్డుకట్ట వేయాలో, నన్ను నేను ఎలా సమర్థించుకోవాలో అన్నీ ఆలోచించుకొనిపెట్టుకున్నాను. కానీ అతడు నన్నేం అనలేదు. మామూలుగా మాట్లాడాడు. నా సక్సస్ అతడి సక్సస్‍గా మురిసిపోయాడు. అతడు పింగ్ చేసినప్పుడల్లా నాలా మాట్లాడగలిగే సాప్ట్వేర్ రాసినందుకు, దాన్ని అతడికి చెప్పకుండా అతడి మీద ప్రయోగించినందుకూ, దాన్ని ఇప్పుడు మా సర్కిల్స్ లో అందరూ దాన్ని “ప్రామిసింగ్” అంటున్నందుకూ తెగ ముచ్చటపడిపోయాడు. కోపగించుకోవాలిగా? మరేం, ఇలా మాట్లాడాడు?

లేదు. లేదు. వెటకారం కాదది. కోపమొస్తే కక్కేస్తాడంతే. నాలా కాదు.

ఆ సాఫ్ట్వేర్ రాయడం మొదలెట్టడానికి అతడి మీదొచ్చిన కోపమే కారణం. ఏదో ఆవేశంలో రాసింది తన్నకుండా కొంతవరకూ బానే పనిజేసింది. పనిజేయనిదాని బాగుచేస్తూ ఉంటే ఇంకా, ఇంకా చేయాలనిపించింది. మొదట్లో అతడు అన్నదానికి దాని రెస్పాన్స్ నాకు చూపించి, నేను “ఒకే” అన్నాక, అతడికి పంపేది. రానురాను వాళ్ళిద్దరి మధ్యా నా అవసరం తగ్గిపోయింది. నేను ఊహించదానికన్నా ఎక్కువగా వాళ్ళిద్దరి మధ్యా బాండింగ్ పెరిగింది. నేను కుళ్ళుకునేదాన్ని. It is living my life, in a way, కదా? ఏ పూటైనా దాన్ని కట్టేసి, నేనే జవాబిస్తే “ఏంటి? అదోలా ఉన్నావ్?” అనేవాడు. నాకు తిక్క కోపం వచ్చేది. బహుశా, అప్పటికే అది ప్రోగ్రామ్డ్ అని అతడికి తెల్సిపోయుండచ్చు.

మీరేంటి? ఓహ్.. ప్లీజ్. ఇప్పటివరకూ “ఎథిక్స్ కోర్టు”లో ముద్దాయి తరఫున వాదన విని, ఇప్పుడిక ఏదో ఒక తీర్పు చెప్పడానికి సిద్ధమయ్యే జడ్జిలా అప్పుడే ఆ మొహం ఏంటి? ఇందుకే మనుషులకన్నా మెషీన్లు మేలనిపించేది. శిక్ష కోసం బోడి మీ దాకా ఎందుకు? నేనే వేసుకోలేనా? అయినా.. ఓ పక్క నేనింకా చెప్తూనే ఉన్నాగా? ఏంటి.. సానుభూతా? హహహహ. కాదు.. సహానుభూతా? ఏం పాడో.. నా సాండల్స్ సర్వనాశనం చేసేశారుగా! నేను ముందే అడిగాను, మీకు ఓకేనా? అని. సర్లే.. ఇవిగో మీ జోళ్ళు ఇక్కడున్నాయి. ఇక బయలుదేరండి. బైదవే, ఇంతవరకూ ఉన్నందుకూ, వినిపెట్టినందుకూ థాంక్స్!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s