దొ దివానె షెహర్ మెఁ…
వీడియో కాల్ కనెక్ట్ అవ్వగానే అతడి గొంతు కన్నా ముందుగా ఆ పాటే వినిపించింది ఆమెకు. అతడు స్క్రీన్‍పై కనిపించడానికి ఓ రెండు నిముషాలు పట్టింది. మొహంపై తడి లేకుండా తుడుచుకొని, టవల్‍ను పక్కనే పడేసి, లాప్‍టాప్‍ను ఇంకా దగ్గర తీసుకొని, మీడియా ప్లేయర్‍లో పాటను ఆపి, ఆమె ఉన్న విండోని మాక్సిమైజ్ చేశాడు.
“హే బేబీ! వాట్స్ అప్?”
“ఏంటి? ఇప్పుడే షేవ్ చేసుకొని వచ్చావా?”
అతడింకా గెడ్డంపై నురగగానీ ఉండిపోయిందా అని చెంపలను సర్వే చేస్తుండగానే —
“నిజం చెప్పు రాజ్.. బానే ఉన్నావా?”
వారం పది రోజులుగా రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేస్తూ, మెదడూ ఒళ్ళూ హూనమైపోయి, కొద్దిగా జ్వరం వచ్చినట్టున్నా ఆ సంగతి తెలీనివ్వకుండా ఉండేందుకు పెరిగిన గెడ్డాన్ని ఆదరాబదరా గీకేసి, క్రాపు కొంచెం సరిచేసుకొని ఆమె ముందుకొచ్చినా ఒక నిముషంలో దొరికిపోయినందుకు లోలోపల తిట్టుకుంటూ —
“బానే ఉన్నాను. కొంచెం అలసట అంతే! చెప్పానుగా ఈ వారం డెడ్‍లైన్ ఉందని. పని బా సతాయించిందిలే! అంతా చేతిలో ఉన్నట్టే ఉంటుంది. కానీ ఎంతకీ లొంగనట్టే అనిపిస్తుంది. ఉఫ్.. మొత్తానికైతే అయిపోయింది. Monkey’s off my back, now. So, all’s well.”
ఆమె ఏమీ మాట్లాడలేదు. వింటున్నట్టు కూడా లేదు.
“నీ సంగతేంటి? How was your week?”
పెళ్ళి కాకముందు, ఒకటే కంపెనీలో పనిచేసేటప్పుడు, ప్రతీ సోమవారం ఉదయం ఒకరినొకరు చూసుకోగానే మొక్కుబడి పలకరింపులలో భాగంగా అడిగే ప్రశ్న: “How was your weekend?” మొదట్లో “Good.”, “Nice”, “Not bad”లాంటి పొడిపొడి సమాధానాలే. ఒకరంటే ఒకరికి ఆసక్తి పెరిగే కొద్దీ జవాబులూ ఆసక్తికరమైయ్యాయి. వారంలో ఐదురోజులూ ఎనిమిది గంటలపాటు ముఖముఖాలు చూసుకుంటున్నా తెలియలేనివెన్నో ఆ ప్రశ్నకు సమాధానాల్లో తెలిశాయి.
పెళ్ళైన కొత్తల్లో, తనువుల తపన తీరకముందే తెల్లారిపోతుంటే, నిద్రమత్తులోనే బాత్రూం కోసం పోటీపడి, బ్రేక్‍ఫాస్ట్ విషయంలో పోట్లాడుకొని, వచ్చే పదిగంటల వరకూ సరిపోయేంతటి కౌగిలింతల్లో పెట్టుకున్న ముద్దుల తడి ఆరకముందే చెరో వైపునున్న ఆఫీసులకు పరుగులు తీసి, తిరిగి కల్సుకున్న బద్దకపు సాయంత్రాల్లో, ఆలస్యాల అలసటలో లాలనగా అడిగే మొదటి ప్రశ్న: “How was your day?”
చూస్తూ చూస్తూండగానే “How was your week?” మొదలయ్యింది. ఇలానే కొనసాగనిస్తే, నెలలూ, సంవత్సరాలూ ఎలా గడిచాయని అడిగే అగత్యం పడుతుందేమోనని ఆమె భయం. “ఇంకెన్నాళ్ళిలా?” అని ఆమెకు అడగాలని ఉంటుంది, అడగాల్సిన అవసరం లేకపోయినా. ఎప్పటిలోగా ఎంత సంపాదించి, అందులో ఎంత ముడివేసి పక్కకు పెట్టాలో, ప్రతి నిముషాన్ని డాలర్లలోకి, పౌండ్లలోకి ఎంతెలా మార్చుకోవాలో అన్నీ ఆమెకు నూరిపోశాడు. వాళ్ళ భవిష్యత్ కాపురం గూగుల్ కాలండర్‍లో రిమోట్ వర్క్, వెకేషన్ అనే ఈవెంట్స్‌లో భద్రంగా ఉందని తెల్సినా, అతడులేని లోటును స్ర్కీన్‍పై కనిపిస్తున్న అతడితో తీర్చుకోలేకపోయినప్పుడల్లా అడగాలనిపిస్తూనే ఉంటుంది.
“ఓయ్.. ఎక్కడికెళ్ళి పోయావ్?” అని అడిగాడు, ఎదురుగా కనిపిస్తున్న ఆమెను.
“ఆకలి వేస్తుంది. మధురై ఇడ్లీ సెంటర్‍కు వెళ్తున్నా. వస్తావా?” అంది మనసును మాటల మాటున మాయంచేస్తూ. అతడూ సన్నగా నవ్వాడు.
మధురై ఇడ్లీ సెంటర్, కోరమంగల…
ఒకరంటే ఒకరు ఇష్టమని దాచలేనంతగా బయటపడిపోయాక, జోరు మీదున్న వలపు బండికి వీకెండ్ స్పీడుబ్రేకర్ అవుతుంటే చూస్తూ ఊరుకోలేక, అర్థరాత్రి దాటేవరకూ ఫోన్‍లో ఇద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నా, ఉదయం ఎనిమిదింటికల్లా ఆమె ఉండే పి.జి. దగ్గర్లోని ఈ టిఫిన్ సెంటర్‍లో కలవటమనే ఆనవాయితీ మొదలయ్యింది. వేడివేడి టిఫిన్ ఏదో గుట్టుక్కుమనిపించి, గుక్కెడు కాఫీ నీళ్ళూ గొంతులో పోసుకున్నాక, ఇద్దరూ భుక్తాయాసం నటించి, కాస్త నడిస్తే కుదుటపడుతుందన్న వంకతో ఆ వీధుల్లో తిరగడమనే అలవాటు చేసుకున్నారు.
Public display of affectionలో ఏ మాత్రం తగ్గని జంటల ప్రేరణతో ఒక చేతిని మరొకరి నడుం వెనుక దాచి, నాలుగు కాళ్ళ రెండు చేతుల డబుల్ శరీరాన్ని నడిపిస్తూ, నాలుగు కళ్ళూ ఒకటైనప్పుడు, కనిపించేవన్నీ వింతలే! అన్ని వింతల్లో ప్రత్యేకమనిపించినవి ఆ రెసిడెన్షియల్ ఏరియాలోని ఇళ్ళు.
తిరిగి మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేంత అందంగా. గుచ్చుకునే చూపులను దిష్టిబొమ్మల అవసరంలేకుండా తిప్పికొట్టగల ఆత్మవిశ్వాసంతో. నచ్చడానికి, మెచ్చుకోడానికి అడ్డురాని డాబు, దర్పం, దర్జాలతో. అన్నింటికీ మించి, విలక్షణమైన వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నట్టుగా… సింపుల్‍గా చెప్పాలంటే, బెంగళూరు అమ్మాయిల్లా అక్కడి ఇళ్ళు!
“ఎంత బావున్నాయో కదా, ఇళ్ళు?!”
“కదా? ఎప్పటికైనా ఇలాంటి ఇల్లు ఒకటి కట్టుకోవాలని నా కల.”
“నీకేం బాబూ.. బోలెడు జీతం. కొనేసుకోవచ్చులే..”
“మన జీతాలు పెడితే వచ్చే ఇళ్ళు కావివి. IT folks are perpetually middle class. ఇలాంటివి కొనాలంటే ఇంకేవో చేయాలి. ఐటి ఉద్యోగం చాలదు.”
అతడు తనని ఆటపట్టించడానికి అలా అన్నాడేమోనని అనుకుంది. వాళ్ళ బంధానికి సమాజం ఆమోదించే ముద్ర వేయించుకోడానికి ఇద్దరూ సిద్ధపడ్డాక, అందుకు పెద్దవాళ్ళు మనస్పూర్తిగా అంగీకరించాక, తమకంటూ ఓ సొంత గూడు ఏర్పర్చుకోడానికి ప్రయత్నాలు మొదలెట్టాక, బయటకొచ్చిన జీతాల అంకెలు, వాటికి exponential highలో ఉన్న రియల్ ఎస్టేట్ ధరలూ చూశాక, ఆమెకు అతడి మాటల్లోని నిజం కనిపించింది.
కోరుమంగలలాంటి ఏరియాలో ఇండిపెండెంట్ ఇల్లు తమ తాహతుకు మించిందని తేలిపోయాక, బెంగళూరు అమ్మాయి తిరస్కరించిన తెలుగు అబ్బాయిలా కొంచెం మనసు కష్టపెట్టుకున్నా, అమ్మ చూపించే అమ్మాయికి తాళి కట్టడానికి సిద్ధపడిన బుద్ధిమంతుడిలా, పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అపార్ట్మెంటుల్లో ఒకదాన్ని తమ సొంతం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. చదివిన చదువుకు, ఉన్న ఉద్యోగావశాలకు, పడగలిగే కష్టానికి అది సొంతమవ్వగల కలేనని అనిపించింది.
పెళ్ళి షాపింగ్ కన్నా, పెళ్ళి అయ్యాక కాపురం పెట్టాల్సిన అద్దె ఇల్లు వెతకటం కన్నా, కొనాల్సిన ఇంటిని గురించి ఇద్దరూ పిచ్చివాళ్ళలా తిరిగారు. ఏజెంట్లు, బ్రోకర్లు, ఇల్లు కొనుకున్నవాళ్ళు, కొనుక్కోలేకపోయినవాళ్ళు, తెల్సున్నవాళ్ళు, తెలియనివాళ్ళు – అందరి సలహాలూ, సూచనలూ తీసుకున్నారు. నేల మీద పునాదిరాయి లేకపోయినా, గాల్లో మేడలు కట్టి చూపిస్తుంటే ఎత్తిన మెడలు దించకుండా చూశారు. కలలు కన్నారు. జీ(వి)తాలని తాకట్టు పెట్టి తీసుకొస్తున్న పెట్టుబడి మట్టిపాలైపోతుందేమోనని భయపడ్డారు. వారమంతా ఆఫీసులో చాకరిచేసి, వారాంతం రాగానే బైకు వేసుకొని నత్తనడక నడిచే ట్రాఫిక్‍లో ఉసురోమంటూ సిటి ఓ మూల నుండి మరో మూలకి ప్రయాణించి, ఎలాగో ఒకట్రెండు సైట్లు చూసొచ్చేవారు. వాటిని గురించి మళ్ళీ వారమంతా తర్జనభర్జనలు.
వంటగది పెద్దగా ఉండకపోతే ఆమెకు కుదరదు. స్పోర్ట్స్‌కి స్కోప్ ఎక్కువుండాలి, “పిల్లలకి అది చాలా ముఖ్యం!” అని అతడు. ఇద్దరికీ వెంటిలేషన్ బాగుండాలి. ఆఫీసులకు దగ్గరైతే చాలదు. స్కూల్, హాస్పిటల్, మాల్, సినిమా హాల్ – ఇవ్వన్నీ కూడా రాయి విసిరితే తగిలేంత దూరంలో ఉండాలి.
ఎట్టకేలకు వీళ్ళిద్దరికీ ఏదో నచ్చితే, అక్కడితో అయిపోదు. ప్రేమించుకుంటున్నామనగానే కాదనకుండా ఆశీర్వదించడానికి సిద్ధమైనందుకు తగుమాత్రం గౌరవమిస్తూ, ఇద్దరి అమ్మానాన్నల (లేక వారివారి తరపున వచ్చిన పండితుల) వాస్తు విజ్ఞానానికి సరిపడే ఇల్లు అయ్యుండాలి. ఇన్ని కుదిరిన ఇల్లు దొరికినా కళ్ళు మూసుకొని కొనేయడానికి లేదు. ఎవడి భూమి? ఎవడు అమ్ముతున్నాడు? అమ్మేవాడికి ఆ ఆస్తి ఎలా సంక్రమించింది? అపార్ట్మెంట్స్ కట్టడానికి అప్రూవల్ ఉందా? ఎంతవరకూ లీగల్? ఎక్కడెక్కడ ఇల్లీగల్? బిల్డరు రెప్యుటేషన్ ఎలాంటిది? లాంటి అనంతకోటి ప్రశ్నలకు జవాబులు దొరకపుచ్చుకొని, ఒక నిర్ణయానికి రావాలి.
ఎంతకూ తెగని సొంతింటి వేటలో అలుపు ఒకవైపు. కనీసం కాగితాల్లో అయినా గృహప్రవేశం కానిదే పెళ్ళిపీటలెక్కకూడదని పెట్టుకున్న నియమం మరోవైపు. ఆమె పి.జికి వెళ్ళి పిక్ చేసుకున్న ఒకానొక వీకెండ్ ఉదయాల్లో, మధురై ఇడ్లీ సెంటర్‍లోనే టిఫిన్ తినేసి, పొగలుగక్కుతున్న కాఫీని చల్లారబెట్టుకునేలోపు ఏజెంట్ నుండి వస్తున్న కాల్ కాలుస్తుండగా, ఆమె మొహం చూశాడో సారి. సగం వదిలేసిన చౌ-చౌను స్పూన్‍తో కుళ్ళబొడుస్తోంది. కాఫీ ముట్టుకోలేదు. తాగమంటే వద్దంది. బయలుదేరుదామంటే కదల్లేదు. ఏమయ్యిందని ఒకటికి రెండుసార్లు అడిగితే —
“అసలు మనం ఇల్లు కొనుక్కోగలమంటావా, రాజ్?”
“ఎందుకు కొనలేం. కొనేస్తాం. ఇవ్వాళ వెళ్ళి చూసొచ్చాక ఇహ ఫైనల్ చేసేద్దాం..
“అసలా అనుమానం ఎందుకొచ్చింది నీకు?”
“ఏమో బాబు. ఇల్లూ ఇల్లూ అని ఇప్పటికే ఆర్నెళ్ళు పెళ్ళి వాయిదా వేసుకున్నాం. కనీసం ఈ మాఘంలోనైనా పెళ్ళి అవుతుందా అని అమ్మ పోరుబెడుతుంది. మనం ఎంత వెతుకుతున్నా సరైన ఇల్లే దొరకటం లేదు. నాకు భయంగా ఉంది. పోనీ, పెళ్ళి చేసేసుకుందాం. అప్పుడిలా బయట కల్సుకోవడాలు ఉండవు. వీడికి పోసిన డబ్బులు చాల్లేదనా, ఇంకా తగలెయ్యడం?”
“నిజంగానే వాడికెన్ని డబ్బులు పోశామో కదా?” ఇయిర్ ఫోన్స్ లో సన్నటి రొదలోంచి అతడికి ఆమె మాటలు చేరాయి. నవ్వి ఊరుకున్నాడు.
“ఎందుకా నవ్వు?” చెప్పలేక, మళ్ళీ నవ్వుకున్నాడు –
అప్పుడు ఆమె లాగిన పాయింటుకు అతడు పడేవాడేగానీ, అంతకు ముందురోజే ఆఫీసులో టీ బ్రేక్‍లో సంసార సాగరంలో డీప్ డైవింగ్ చేస్తున్న సీనియర్ ఒకడు, సముద్రంలోకి దూకబోతున్న జూనియర్లకి ఇచ్చిన గీతోపదేశంలో ఒక సత్యం: నాయనల్లారా, పెళ్ళికి ముందు లైఫ్ NDTV Goodtimesలా ఉంటుంది – హైవే పై తినడాలు, గాడ్జెట్ల పై విపరీతాభిమానాలు, విచ్చలవిడిగా ఫాషన్షోలు, కింగ్‍ఫిషర్ కాలెండర్లు చూడ్డాలు వగైరా. పెళ్ళయ్యాక, NDTV 24×7గా మారుతుంది. బ్రేకింగ్ న్యూస్‍లూ. బిగ్ ఫైట్లూ.
అవే మాటలు ఆమె దగ్గర తూలబోయి, తమాయించుకొన్నాడు, ఇప్పుడు.
“ఓయ్.. ఎందుకు నవ్వుతున్నావ్? చెప్పచ్చుగా..”
“నువ్వు చేసే ఉల్లికారం పెట్టిన వంకాయ ఎంత బాగుంటుందో! నోటికి మళ్ళీ అలాంటి కారం ఎప్పుడు తగులుతుందో?!” యుగయుగాలుగా మగవాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతున్నందుకూ, తరతరాల అనుభవాన్ని అంతటినీ తనబోటి కొత్తవారికి అందిస్తూ ఉన్నందుకు మగజాతికి మనసులో దణ్ణం పెట్టుకున్నాడు.
“ఏం? మొన్న బిర్యాని తెప్పించుకున్నారటగా? బాలేదా?”
“బిర్యానియా, వాడి పిండాకూడా? బన్ తీసేసిన చికెన్బర్గర్ను ఫ్రైడ్‌రైస్‌లో పడేసి మా మొహాన కొట్టాడు.”
అతడికి వంట చేసి పెట్టే అవకాశం ఆమెకు తక్కువగానే కలిగింది. పెళ్ళైన మొదటి మూడు, నాలుగు నెలల్లోనే. అందులో మళ్ళీ అత్తగారు ఓ నెల, అమ్మ ఓ నెల ఉండి వెళ్ళారు. అప్పుడు కూడా రోజూ చేసిపెట్టడానికి ఎంత ప్రయత్నించినా, అతడికి లేట్ మీటింగ్సో, ఆమెకు పని ఒత్తిడి ఎక్కువ అవడమో. దానికి తోడు స్నేహితులూ, క్లోజ్ కోలీగ్స్ భోజనానికి పిలవడాలు. పెళ్ళి ఇంకాస్త ముందయ్యుంటే, అతడి ఇంకాస్త ముందుగా తనవాడయుంటే…
“అన్నట్టు.. గుల్జార్ కొత్త సినిమా పాట పంపాను. విన్నావా?”
“హమె కామ్ పె రఖ్ లొ కభీ.. యారమ్.. ”
“యెస్.. అదే.. అదే”
ఆమె పాట హమ్మింగ్ ఆపేసి, ఒకలా చూసింది. అదేంటో క్లిక్ అవ్వడానికి అతడికి కొన్ని క్షణాలు పట్టింది.
“ఓహ్.. సారీ! మిస్స్ అయ్యా. Trying to seduce me, eh?”
ఆమె ఇబ్బందిగా కదిలింది. అనరాని మాట, అనకూడని వాళ్ళు అన్నప్పటి ఇబ్బంది. మర్యాదపూర్వకంగా ఎన్ని హద్దులైనా దాటడానికి అనుమతించే బంధం వాళ్ళిద్దరి మధ్యా ఉన్నా, మాటలతో వేడెక్కిన శరీరాలతో ఒంటరిగా వేగడం కష్టమని అనుభవంలోకి వచ్చాక, లేని హద్దుల్లో గిరిగీసుకొని కూర్చోవటం మామూలైంది.
అతడి కీస్, అతడి ఫైల్స్, అతడి లాప్‍టాప్, అతడి ఫోన్, అతడి ఐపోడ్, అతడి ఇయర్ ఫోన్స్, అతడి బట్టలు, అతడి చర్మం, అతడి వాసన – చూసి ఎన్నాళ్ళైపోతుందో?!
“ఈ పాట గుల్జార్ రాసిన కవితల్లోది అనుకుంటా.. ఈ సినిమా కోసం ప్రత్యేకించి రాయలేదనుకుంటా..”
మొదలెట్టాడు. ఇప్పుడు ఆ పాట గురించి ఏమేం అనుకుంటున్నాడో ఆపకుండా వాగుతాడు. ఎప్పుడూ అంతే! ఇష్టాన్నయినా, కష్టాన్నయినా మాటమాటల్లో చెప్పేస్తాడు, అది ఆమెకు ఇష్టంగా, ఆమె కష్టంగా మారేట్టు.
అసలిక ఇల్లు కొనగలమా అన్న అనుమానంతో అతడి ముందు బయటపడిన ఉదయం, ఆమె మూడ్ సరిచేయడానికి, “నీకో పాట వినిపిస్తానుండు. భలే గొప్పగా ఉంటుంది.” అంటూ తన ఫోన్‍లో ఉన్న పాటను వెతికి, ఇయిర్ ఫోన్స్ తీసుకొని ఆమె చెవిలో పెట్టాడు.
చక్కని సంగీతం మొదలయ్యింది. అంతలో ఒక అమ్మాయి నవ్వు.
“దీవానా” అందా గొంతు, నవ్వుతూనే.
“ఏక్ దీవానా షెహర్ మెఁ” అని మగ గొంతు.
“ఏక్ దీవానా నహీ, ఏక్ దీవానీ భీ” అంది ఆడ గొంతు.
“హే.. మనలానే?” అందామె ఆశ్చర్యంగా, నవ్వుకుంటూ. తలూపాడు అతడు.
ఇంతలో ఫోన్ మోగింది. “హిహి.. ఇదో ఇంకో ఆవారా కూడా ఉన్నాడు ఇక్కడ.” అని అంటూ ఇయర్ ఫోన్స్ డిస్‍కనెక్ట్ చేసి ఫోన్ అతడికి ఇచ్చింది.
“తుంబె ట్రాఫిక్ ఇదె… లేట్ ఆగబొహుదు” అని ఏజెంట్‍కు చెప్పి ఫోన్ కట్ చేసి, ఆమె చెవులకు వేలాడుతున్న ఇయిర్ ఫోన్స్ కు ఫోన్ మళ్ళీ కనెక్ట్ చేశాడు. పాట ఆగిన చోటే మొదలయ్యింది.
“దొ దీవానె షెహర్ మెఁ” అని పాట మొదలయ్యింది మగగొంతులో, క్షణాల్లో ఆడగొంతూ కలిసింది.
“ఆబూదానా?” పాటను ఆపి అడిగింది, “ఆబూదానా అంటే ఏంటి?”
“ఆబూ అంటే నీళ్ళు. దానా అంటే గింజలు అని మావాడు చెప్పాడు.”
పాట మళ్ళీ ఆగిన చోటే మొదలయ్యింది.
“ఆషియానా? – అంటే?”
“ఆషియానా అంటే డ్రీమ్‍హోమ్. అది సరే కానీ, నువ్విలా మాటమాటకీ పాటని ఆపేస్తే మొత్తం ఫీల్ పోతుంది. పాట వినెయ్య్ పూర్తిగా.. తర్వాత చెప్తాను నీకు అర్థంకానివి.” అంటూ ఆమె చేతిలోంచి ఫోన్ తీసుకొని అతడు పట్టుకున్నాడు.
మూడున్నర నిముషాల తర్వాత, పాట మళ్ళీ ప్లే అయ్యింది – ఈ సారి ఇద్దరూ చెరో ఇయర్ ఫోన్ పెట్టుకున్నారు. మొదట, పాటలో ఆమెకు అర్థంకాని పదాలు చేతనైనంతవరకూ వివరించాడు. గుల్జార్ మాటలను మనసుతో వినాల్సిందేగానీ మరోదారి లేదన్నాడు. తెలుగులో ఆత్రేయ, వేటూరిలా హింది సినిమాలకి గుల్జార్ అని ఆమెకు పరిచయంచేశాడు. రూమ్మేటు పెట్టే పాటలకు తనకి తెలీకుండానే ఎలా అలవాటుపడిపోయాడో, ఇదే సినిమాలో అయన రాసిన ఇంకో పాట విన్నప్పుడల్లా చుట్టాలు కానీ, స్నేహితులు కానీ లేని ఈ సిటికి వచ్చిన కొత్తల్లో బాధపెట్టిన ఒంటరితనంలో తోడు నిలిచిన గుల్జార్ అంటే ఎంత ఇష్టమో, ఆ తర్వాత ఆమె తన జీవితంలోకి వచ్చి తోడంటే ఏంటో తెలిపినందుకు ఆమె అంటే ఇంకెంత ఇష్టమో చెప్పుకొచ్చాడు.
పాట లూప్‍లో ప్లే అవుతూనే ఉంది. అతడు మాట్లాడుతున్నప్పుడు బాక్‍గ్రౌండ్ అయిపోతూ, అతడి మౌనాన్నీ మ్యూజికల్‍గా మారుస్తూ.
ఇష్టాల గురించి చెప్పాక, సొంతిల్లు గురించి తానెందుకంత పట్టుబడుతున్నదీ వివరించాడు. మాటిమాటికీ బదిలీ అయ్యే గుమాస్తా ఉద్యోగం నాన్నది కావటంతో ఏ ఊరూ తనది చెప్పుకోడానికి లేక, తోటిపిల్లలతో పరిచయమై స్నేహం పెంచుకునే లోపు అన్నీ వదులుకొని మళ్ళీ కొత్త ఊరికి వెళ్ళాల్సిన పరిస్థితుల్లో, అక్కలనూ, తననూ బాగా చదివించటం తప్ప మరో ధ్యాస లేకుండా సొంత ఇంటి కలను వదిలేసుకొని, రెక్కల కష్టాన్నంతా తమ చదువులూ, తమ జీవితాలకు ధారపోసి, ఇప్పటికీ అద్దె ఇళ్ళల్లో మగ్గుతున్న అమ్మానాన్నలకు వాళ్ళదంటూ ఒక ఇల్లు ఇవ్వాలన్నది తన ఆశయం అని చెప్పుకొచ్చాడు.
మాటమాటల్లో వణుకుతున్న అతడి గొంతును సవరించడానికి ఆమె ఆ పాటనే కూనిరాగం తీసింది. అప్పటినుండి, ఎలాంటి అనుమానాలూ, భయాలూ కలిగినా ఆ పాటనే అందుకోవడం అలవాటు చేసుకున్నారు, ఆ దీవానా, అతడి దీవానీ.
అతడి పక్కకు లీసా వచ్చి కూర్చొంది.
“Hey.. Don’t worry about him. He’s fine. And we’re there.” అని నమ్మకంగా చెప్పింది. కుశల ప్రశ్నలయ్యాక, కాసేపు కబుర్లాడి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఏ ఆధారమూ లేకపోయినా తమ సొంతకాళ్ళమీద నిలబడగలిగినవాళ్ళకుండే మొండి ధైర్యం ఆమె సొంతం. కొన్ని నెలల క్రితం అతడికి ఫ్లూ వస్తే, అతడి బాగోగులు చూసుకున్నారు లీసా, మార్క్. ముగ్గురికీ మరో గత్యంతరం లేక ఏడాది క్రితం ఆ అపార్ట్మెంటును షేర్ చేసుకున్నారు. ఎన్నో ఆటుపోట్లలని కల్సి ఎదుర్కోవటంలో స్నేహం బలపడింది.
“రేపు మళ్ళీ సైక్లింగ్ ట్రిప్ అంటోంది ఈ పిల్ల. నాకేమో ముసుగు తన్ని పడుకోవాలనుంది. చలికాలం వచ్చేస్తే అంతకు మించి ఏం చేయగలం? పద పోదామని ఒకటే గోల.”
“వెళ్ళగలవా మరి?”
“ఏమో… చూస్తాను. పొద్దున్న లేవడం బట్టి..”
“లంచ్ అయ్యిందా?”
“ఇంకా లేదు. ఇవ్వాళ మార్క్ గాడి వంట. ఆకలి దంచేస్తుంది. వాడి సంగతి తెల్సిందేకదా, బ్రేక్‍ఫాస్ట్ టైమ్‍కి మొదలెడితే డిన్నర్‍కి పూర్తిచేస్తాడు. అంత స్లో.. ఇంతకీ నువ్వేం తిన్నావ్?”
ఆమె ఆలోచనలో పడింది.
“డోన్ట్ టెల్ మి. మళ్ళీ ఉపవాసమా? అందుకేనా ఆకలి అంటున్నావ్?”
లేదని నమ్మించబోయింది. ఈసారి దొరికిపోవడం ఆమె వంతు అయ్యింది. రాసిపెట్టుకున్న నోట్స్ నుండి చదువుతున్నట్టు గడగడా చిరాకుపడిపోయాడు —
“పూజలూ వ్రతాలూ అంటారు మాట్లాడితే! అమ్మ చాలదన్నట్టు అత్తగారు కూడా తయారయ్యారు. అయినా నువ్వు పూజ చేశావో, లేదో వాళ్ళు చూడరుగా. చేశానని చెప్పలేవూ? ఊ అంటే ఉపవాసాలు చేసేయడమే! అసలే ఉంటున్న వాతావరణానికి, తింటున్న తిండికి సంబంధం లేదు….”
“సరే.. ఇక నేను ఇక ఉంటాను. నువ్వు జాగ్రత్త. రెస్ట్ తీసుకో..”
“చూడూ…. నేను బాగానే ఉన్నా. When I said I’m fine, I’m fine.”
ఆమె మంచినీళ్ళు తాగుతానంటూ పక్కకు వెళ్ళింది.
అవును. అతడు ఫైన్ అంటే ఫైన్. నాట్ ఫైన్ అంటే నాట్ ఫైన్. ఇంకో మాటకు ఆస్కారమే లేదు. బెంగళూరులో అయితే రేట్లు ఎక్కువ, ఇక్కడ ఒక ఇంటి మీద పెట్టే డబ్బుతో హైదరాబాదులో రెండు ఇళ్ళు తీసుకోవచ్చునట అంటే —
“Hyderabad sucks! అదసలు సిటియే కాదు. Overgrown village. అండ్.. అక్కడి IT industry అయితే small scale industry కూడా అనిపించుకోలేదు! రేపే రెసిషనో వస్తే మళ్ళీ ఊరూరూ తిరగాలి. I can’t live there.”
సాప్ట్వేర్‍లో కొంచెం అనుభవం వచ్చాక, ఎం.బి.ఎ చేయడంవల్ల మంచి కెరీర్, ముఖ్యంగా ఫైనాన్షియల్ గా బాగుంటుందని, అది ప్రయత్నించమని చెప్తే —
“ఏ కోచింగ్ సెంటరో పెట్టుకుంటే ఇంకా డబ్బులొస్తాయేమో. But that’s not what I want to do. Right?”
ఇంత పెద్ద మొత్తం లోనుగా అంటే, అదీ ఎప్పుడు ఊడిపోతాయో తెలీని ఉద్యోగాలతో? కష్టం కదా? తన పేరనున్న పొలాలు అమ్మేస్తే అని సలహా ఇస్తే —
“అది నీ ఆస్తి. మీ నాన్న కష్టార్జితం. ఇది మన ఇల్లు. ఇందులో ప్రతి పైసా మన స్వార్జితం అవ్వాలి. అయినా ఒక ఇల్లుంటే అయిపోదుగా. పిల్లలు పుట్టాక ఎన్నేసి ఖర్చులో. ఉండనీ దాన్ని అలా.”
ఒకచోటు నుండి ఇంకో చోటుకి వెళ్ళడానికి ఒకటంటే ఒకటే దారి ఉండి, ఒకసారి రోడ్డు ఎక్కాక వెనక్కి తిరగడానికీ పక్కకు మళ్లడానికీ వీలులేని బెంగళూరు రోడ్లలోని ట్రాఫిక్‍లా, అతడు అనుకున్నది అనుకున్నట్టు అయ్యేవరకూ ఓపికపట్టటం తప్ప మరో దారి లేదన్నది ఆమె రాజీపడిన సత్యం.
ఆమె తాగని నీళ్ళు, ఆమె కార్చిన కన్నీరు ఇవతల వైపున్న అతడు మింగాడు.
తనంటే ఆమెకు ఎంత ఇష్టమో, తనకి దూరంగా ఉండడం ఎంత కష్టమో అతడికి తెలీంది కాదు. పైగా తన మీద అంతగా లేని సోషల్ ప్రెజర్ ఆమెపై ఉంది. ఇవ్వాళ్టి ఉపవాసమూ, తమ మధ్య దూరంపోయి, పిల్లలు పుట్టుకొచ్చేయాలన్న తాపత్రయంలోనిదే! తనంటే అమ్మ మీద చిరాకుపడగలడు. అత్తగారు ఎటూ అంత చనువు తీసుకోలేరు. ఆమె మాత్రం ఇద్దరికీ దొరికిపోతుంది. వాళ్ళేం చెప్పినా చేయాల్సి వస్తుంది. పిల్లలతో తనకేం సమస్య లేదు కానీ ఇంకా దేశాలు పట్టుకొని తిరుగుతున్నప్పుడే వాళ్ళు పుట్టేస్తే, “నాన్నేడమ్మా?” అని అడిగినప్పుడల్లా ఏ లాప్‍టాప్ వంకో, ఫోన్ వంకో చూపిస్తారు. అదో నరకం.
కాపురం పెట్టిన మూడునెలల వరకూ హనీమూన్‍కు వెళ్ళలేకపోయారు. తిరిగొచ్చిన వారానికి హెచ్. ఆర్ పిల్చి, “థాంక్స్ ఫర్ వర్కింగ్. ఇక వెళ్ళిరా!” అని చెప్పింది. అప్పటికే ఈ.ఎం.ఐ మొదలైపోయింది. నెత్తిమీద అప్పుండడం అంటే ఏమిటో తెల్సివచ్చింది. ఏదో.. కాంటాక్ట్స్ ఉపయోగించి నెల తిరిగే సరికి అమెరికాలో ఉద్యోగం సంపాదించుకున్నాడు కాబట్టి సరిపోయింది.
పెళ్ళి వాయిదా వేస్తూ వచ్చి, పెళ్ళవ్వగానే అలా దూరంగా వెళ్ళిపోవటం తనకి మాత్రం కష్టం కాకనా? ఆమెకు తోడుగా అమ్మానాన్నలు వచ్చి ఉన్నారు. నాన్నకి సిటి పడలేదు. తిరిగి వెళ్ళిపోవాల్సివచ్చింది. ఆమె మళ్ళీ పి.జిలో చేరింది. పేరుకు సిటియే అయినా, సొఫిస్టికేషన్‍కు ఏ మాత్రం లోటులేకపోయినా, అమ్మలక్కల సూటిపోటి మాటలు మాత్రం అవే అర్థంలో ఉండేవి: “ఏమ్మా, మీ ఆయన ఎప్పుడు వస్తాడు? చూసుకో తల్లీ.. అక్కడే ఎర్రగా, బుర్రగా ఉన్నదాన్నీ..”
ఎర్రగా, బుర్రగా ఉన్న లీసాతో అపార్ట్మెంటు షేర్ చేసుకోవాల్సిన వస్తుందని చెప్పినప్పుడూ అర్థంచేసుకుంది. “నీ మీదున్నంత నమ్మకం నా మీద నాకూ లేదు తెల్సా?” అని చెప్పింది. పెళ్ళయ్యీ ఒంటరిగా ఉండలేక, జీతం వస్తున్నా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చునే ఉద్యోగంలో కొనసాగలేక, పేపర్లు పెట్టేసి, ఆన్‍సైట్‍కు అవకాశమున్న ఉద్యోగంలో చేరింది. గత పద్దెనిమిది నెలలుగా యూకెలో చేస్తుంది.
ఎలాగో నెట్టుకొస్తున్నారు… దూరంగా ఉన్నా, కలిసే ఈదుతున్నారు.
ఆమె వచ్చి కంప్యూటర్ ముందు కూర్చుంది. అతడూ ఆలోచనల నుండి తేరుకొని —
“నేను అరవకుండా ఉండాల్సింది. సారీ!”
“నువ్విలా కోపగించుకుంటావనే చెప్పలేదు. ఒంటిపూట ఉపవాసమేలే. ఇంకో గంటలో అత్తయ్య ఫోన్ చేయగానే, నేను తింటాను.”
అంతలో అతడికి మార్క్ నుండి పిలుపు వచ్చింది, భోజనానికి. ఒకరికి ఒకరు అప్పజెప్పుకోవాల్సిన జాగ్రత్తలు పూర్తయ్యాక, వీడియో కాల్ కట్ అయ్యింది.
ఆమె లాప్‍టాప్‍లోనూ “దొ దివానె..” అంటూ పాట మొదలయ్యింది. కాల్ కనక్టయ్యే ముందు ఆమె వింటున్న పాట, బ్రౌజర్ రిఫ్రెష్ అయ్యేసరికి మళ్ళీ మొదలయ్యింది.
* * *
బెంగళూరు. వైట్‍ఫీల్డ్. ఒకానొక వీధి.
ఆ వీధి చివర్న సిమెంట్, మట్టి, దుమ్ము వల్ల ఏర్పడ్డ ధూళిలో నీలి కవర్ల ముసుగులో అపార్ట్మెంట్సు. వాటి దగ్గరకు వస్తే, పిల్లర్లూ, స్లాబులూ పూర్తయ్యి, కిటికీలు, గుమ్మాలు నిలబెట్టటం కనిపిస్తుంది, సగం కట్టిన గోడలతో. గేటుకి కుడివైపున ఆరో అంతస్థులో వీళ్ళ అపార్ట్మెంటు.
ఇంకో ఆర్నెల్లలో తయారైపోతుంది. మరింత మురిపెంగా ముస్తాబు చేసుకోవాలంటే, ఇంకో రెండు నెలలు.
కిటికీ తెరచి, ఆకాశంలోకి చూస్తూ – “అంబర్ సె ఖులె కిడికియా, కిడికి సె ఖులా అంబర్ హోగా” అనుకోడానికి అంతకన్నా ఎక్కువ ఎదురుచూడక్కర్లేదు.
ఆ అపార్ట్‌మెంట్స్‌లో కొన్ని ఎన్నారై ఇన్వెస్ట్మెంట్లు అవ్వచ్చు. అవి కాక, తక్కిన వాటి వెనుకా ఇలాంటిదేదో కథ ఉండచ్చు. మధ్యతరగతి భారతీయుని సొంతింటి కల.
దొ దివానె షెహర్ మెఁ అన్నది ఇలా కూడా అనుకోవచ్చు –
కయీ దివానె.. కయీ షెహరోన్ మెఁ
ఆబూదానా ఢూన్డతె హై.. ఆషియానా ఢూన్డతె హై