తొలి ప్రచురణ: ఆంధ్ర జ్యోతి సాహిత్యం
తేది: సోమవారం, అక్టోబరు 8
నేను కథలు ఎందుకు రాస్తాను. – మంటో
(సాదత్ హసన్ మంటో (1912-1955) ప్రముఖ ఉర్దూ రచయిత. సంచనల కథలు రాసిన రచయితగా ఎక్కువ పేరు. కేవలం దానికోసమే రాశాడని కూడా అపవాదు. అప్పటి బొంబాయి గురించి, ముఖ్యంగా వేశ్యా వృత్తిలో ఉన్నవారి గురించి విస్తృతంగా రాసాడు. భారతదేశ విభజన సమయంలో జరిగిన హింసను – ఏ మతపు రంగు పులకమకుండా – కలంలో సమర్ధవంతంగా పట్టుకోగలిగిన రచయిత. సమాజంలో ఉన్న కుళ్ళుకు ఆయన రచనలు అద్దం పట్టాయి. ఆడంబరం లేని భాష, అలంకారాలకు దూరంగా ఉండే శైలి వల్ల కథలో , వ్యాసాల్లో చెప్తున్నా విషయం సూటిగా బలంగా తాకుతాయి – ఈనాటికి. కొందరికి గట్టిగా తలిగాయి కూడా. ఫలితంగా, కేవలం కథలు రాసిన కారణాన కోర్టులు చుట్టూ తిరిగాడు. అయినా తనదన శైలిలో రాస్తూనేపోయాడు, పోయేంతవరకూ. అలా రాస్తునే ఉండడానికి తనకున్న కారణాలు ఈ ప్రసంగంలో పంచుకున్నాడు.)
హాజరైన అందరికి నా సలాం!
నేను కథలు ఎందుకు రాస్తానో మీతో పంచుకోమని నన్ను అడిగారు.
ఈ “ఎందుకు” అన్నది నాకు అర్థం కాలేదు – నా పదకోశంలో “ఎందుకు”కి దొరికిన అర్థాలు – ఎలా, ఏ విధంగా.
ఇప్పుడు నేను మీకేం చెప్పను నేను కథలు ఎందుకు రాస్తానో? ఇది కొంచెం జటిలమైన అంశం. నేను “ఏ విధంగా” అన్నది దృష్టిలో ఉంచుకుంటే నా జవాబు ఇలా ఉంటుంది: “నేను నా గదిలో సోఫాలో కూర్చుంటాను, కాగితం-కలం తీసుకుంటాను, బిస్మిల్లాహ్ అని అనుకుని కథ రాయడం మొదలుపెడతాను – నా ముగ్గురు కూతుర్లూ అల్లరి చేస్తూ ఉంటారు. నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను, వాళ్ళ చిలిపి తగాదాలకు తీర్పులూ ఇస్తుంటాను. నా కోసం సలాడ్ కూడా చేసుకుంటాను – ఎవరైనా కలవడానికి వస్తే వాళ్లకి మర్యాదలు చేస్తాను – అయినా కథ రాసుకుంటూనే ఉంటాను.”
ఇప్పుడు “ఎలా” అన్న ప్రశ్న వేస్తే, దానికి నేను ఇలా చెప్తాను: “నేను కథలు ఎలా రాస్తానంటే అన్నం తిన్నట్టు, మలవిసర్జన చేసినట్టు, సిగరెట్టు తాగినట్టు, కాలయాపన చేసినట్టు. ”
నేను కథ ఎందుకు రాస్తాను అని అడిగితే దానికి కూడా నా దగ్గర సమాధానం సిద్ధంగా ఉంది.
“నేను కథలు రాయడానికి మొదటి కారణం, తాగుడులానే కథలు రాయటం కూడా నన్ను వ్యసనంలా అంటుకుంది.”
కథలు రాయకపోతే నాకు వంటిపైన బట్టలు వేసుకోనట్టూ, మలవిసర్జన చేయనట్టూ, మందు తాగనట్టుగా అనిపిస్తుంది.
నేను కథలు రాయను; నిజానికి కథలే నన్ను రాస్తాయి.
నేను చాలా తక్కువ చదువుకున్నవాణ్ణి – రాయడానికి నేను ఇరవైకి పైగా పుస్తకాలు రాసాను గాని, నాకే ఆశ్చర్యం వేస్తుంటుంది, అంత మంచి కథలు, ఎప్పుడూ ఏదో ఒక కోర్టు కేసు నడిచేంత బాగా రాసింది ఎవరా అని.
నా చేతిలో కలం లేకపోతే నేను ఒట్టి సాదత్ హసన్ మాత్రమే, వాడికి ఉర్దూ రాదు, ఫార్సీ రాదు. ఇంగ్లీష్ రాదు, ఫ్రెంచ్ రాదు.
కథ నా బుర్రలో కాదు, నా జేబులో ఉంటుంది. అదున్నట్టు నాకు తెలీని కూడా తెలియదు.
నేను బుర్ర మీద బాగా ఒత్తిడి పెడతాను, ఏదో ఒక కథ బయటకు రాకపోతుందా అని – కథారచయితను కావడానికి చాలా ప్రయత్నిస్తాను. సిగెరెట్టు మీద సిగరెట్టు ఊదేస్తాను, కానీ బుర్రల్లోంచి మాత్రం కథ బయటకు రాదు – చివరికి విసిగిపొయి, ఓటమి ఒప్పుకొని గొడ్రాలిలా వాలిపోతాను.
రాయని కథలకి ముందే డబ్బులు తీసుకొని ఉంటాను, అందుకని ఇంక గుబులు మొదలవుతుంది.
అటూ-ఇటూ దొర్లుతాను, లేచి పిట్టలకి గింజలు వేస్తాను, కూతుళ్ళని ఊయల ఊగిస్తాను, ఇంట్లో చెత్తా-చెదారం శుభ్రం చేస్తాను, చిట్టి పొట్టి చెప్పులు ఇళ్ళంతా ఎక్కడబడితే అక్కడ ఉంటాయి – వాటిని ఒక చోట సర్దుతాను – కానీ దిక్కుమాలిన కథ మాత్రం, నా జేబులోనే ఉంటుంది కానీ, నా బుర్రలోకి దిగదు – నేనేమో గిలగిలా కొట్టుకుంటుంటాను.
గుబులు మరీ ఎక్కువైనప్పుడు బాత్రూములోకి వెళ్తాను, కానీ అక్కడ కూడా ఏమీ దొరకదు.
ప్రతీ పెద్దమనిషి పాయఖానాలో ఆలోచిస్తాడని విన్నాను – నా అనుభవం ప్రకారం నాకు అర్థమయ్యింది ఏటంటే నేను పెద్దమనిషిని కాను, ఎందుకంటే నేను పాయఖానాలో కూడా ఏమీ ఆలోచించలేను.
విడ్డూరం కాకపోతే, అయినా కూడా నేను పాకిస్థాను, హిందుస్థానులో చాలా పేరున్న కథారచయితను.
అయితే ఇదంతా నా విమర్శకుల పుణ్యమన్నా అయ్యుండాలి, లేదా నేను వాళ్ళ కళ్ళల్లో దుమ్ము అన్నా కొడుతుండాలి, లేదా వాళ్ళని మాయ అయినా చేస్తుండాలి.
చెప్పొచ్చేది ఏమిటంటే, నేను ఖుదాను మనసులో పెట్టుకొని చెప్తున్నాను, నేను కథలు ఎందుకు రాస్తానో, ఎలా రాస్తానో నాకు తెలీదు.
చాలాసార్లు పరిస్థితి ఎలా ఉంటుందంటే, నేను హైరానా పడుతుంటే మా ఆవిడ వచ్చి అంటుంది: “మీరు ఆలోచించకండి… కలం తీసుకొని రాయడం మొదలుపెట్టేయండి.”
నేను ఆమె మాట ప్రకరాం పెన్నో, పెన్సిలో తీసుకుంటాను, కథ రాయడం మొదలుపెడతాను.
బుర్ర మొత్తం ఖాళీగా ఉంటుంది. కానీ జేబులో నిండుగా సరుకు ఉంటుంది. ఏదో ఒక కథ అదే గెంతుకుంటూ బయటకి వచ్చేస్తుంది.
ఈ లెక్క ప్రకారం నన్ను నేను కథారచయితగా కాదు, జేబులు కత్తిరించేవాణ్ణి అని అనుకుంటాను. నేను నా జేబే కత్తిరించుకొని మీకు అప్పగిస్తాను.
నాలాంటి మూర్ఖుడు ఇంకోడు ఈ ప్రపంచంలో ఉంటాడా!
అనువాదం: పూర్ణిమ తమ్మిరెడ్డి