మంటో వ్యాసాలు: సఫేద్ ఝూట్

Posted by

తొలి ప్రచురణ: http://eemaata.com/em/issues/201812/18177.html

లాహోర్‌ నుంచి వచ్చే అదబే-లతీఫ్‌ మాస పత్రికలో, నా కథ ఒకటి కాలీ సల్వార్ పేరిట 1942లో అచ్చయ్యింది. దీనిని అందరూ అశ్లీలమని అన్నారు. ఇది పచ్చి అబద్ధం.

కథలు రాయడం నా వృత్తి. నాకు సాహిత్యపు అన్ని లక్షణాలతోనూ పరిచయముంది. నేను ఇంతకు మునుపు ఇలాంటి అంశాల మీదే అనేక కథలు రాసున్నాను. వీటిలో ఏ కథ కూడా అశ్లీలం కాదు. నేను ఇకపై కూడా ఇలాంటి అంశాల గురించి రాస్తాను. అవేవీ కూడా అశ్లీలమవ్వవు.

కథలు చెప్పడమనేది ఆదాము భూమి మీద పడినప్పటినుండి ఉంది, నాకు తెల్సినంతవరకూ కయామత్ వరకూ కొనసాగుతూనే ఉంటుంది. దీని లక్షణాలు, పద్ధతులు మారుతూ ఉంటాయి కానీ మనిషి తను అనుభవిస్తున్నది ఇంకో మనిషికి చేరవేయడానికి ఈ పరంపరను కొనసాగిస్తూనే ఉంటాడు.

వేశ్యల గురించి ఇప్పటికే చాలా రాసి ఉన్నారు, ఎప్పటికీ రాస్తూనే ఉంటారు కూడా. ఎదురుగా ఉన్న ప్రతి వస్తువు గురించి అయితే రాస్తారు, లేకపోతే మాట్లాడతారు. వేశ్యలు ఇప్పుడే కాదు, వెయ్యేళ్ల బట్టీ మన మధ్యనే ఉన్నారు. వాళ్ళ ప్రస్తావన దేవతల గురించిన పుస్తకాల్లో కూడా ఉంది. ఇప్పుడిక అలాంటి పుస్తకాలు కాని, పైగంబరులుండే అవకాశం కాని లేదు కాబట్టి, ప్రస్తుత కాలంలో వాళ్ళ ఊసు ఖుర్ ఆన్‌ లోని ఆయాత్‌లలో కాక వార్తాపత్రికల్లోనూ, పత్రికల్లోనూ, పుస్తకాల్లోనూ కనిపిస్తుంది, వాటిని మీరు అగరబత్తీ, సాంబ్రాణీ వంటివి వెలిగించకుండానే చదువుకొనవచ్చు. చదివేశాక పాతకాగితాలలా కట్టగట్టి పారేయవచ్చు.

అలాంటి పత్రికల్లోనూ, పుస్తకాలల్లోనూ రాసే మనిషిని నేను. ఎందుకు రాయడమంటే ఏదో చెప్పాలని ఉంటుంది గనుక. నేను ఏదైతో చూస్తానో, ఏ దృష్టితో చూస్తానో, ఏ కోణంలోంచి చూస్తానో, అదే దృష్టిని, అదే కోణాన్ని నేను ఇంకొకరి ఎదురుగా ప్రదర్శిస్తాను. ఒకవేళ రాసేవాళ్ళందరూ పిచ్చివాళ్ళు అయితే, నా ప్రస్తావన కూడా ఆ పిచ్చివాళ్ళ జాబితాలో చేర్చండి.

కాలీ సల్వార్‌లో కథాస్థలం ఒక వేశ్య ఇల్లు. ఇదేమీ గిజిగాడి గూడులా ఒక అద్భుతం కాదు, ఒక ప్రసిద్ధమైన రాణీవాసం ఏమీ కాదు. దీని గురించి ఎవరూ అబ్బురపడిపోతూ మాట్లాడుకోరు. ఢిల్లీలో ఇలాంటి స్త్రీల కోసం ఒక స్థలాన్ని ఎన్నుకొని వరుసగా ఎన్నో ఇళ్ళు కట్టించారు. నా సుల్తానా అలాంటి ఒక ఇంట్లో ఉంటుంది. ఆమె గిజిగాడులాగా ఈ ఇల్లు తనే కట్టుకోలేదు. ఆమె గిజిగాడులాగా రాత్రంతా మిణుగురులను పట్టుకొని తన ఇంటిలో వెలుగు నింపుకోదు. వెలుగు కోసం కరెంటు ఉంది, కానీ ఆ కరెంటు ఉచితంగా దొరకదు. ఉండడానికి ఇల్లు కూడా అద్దెకు కాకుండా ఊరికే దొరకదు. అందుకే ఆమె కూలి చేయాల్సి వస్తుంది. ఆమెకు ఒకవేళ పెళ్ళై ఉంటే ఇలాంటివన్నీ ఆమెకు ఉచితంగా వచ్చేవి. కానీ, ఆమెకు పెళ్ళి కాలేదు. ఆమె కేవలం ఒక ఆడది మాత్రమే. ఆడది కరెంటుకి డబ్బులు కట్టాలన్నప్పుడు, ఇంటి అద్దె చెల్లించాలనప్పుడు, పైగా ఆమెను ఫకీరుల వెంట కాళ్ళీడ్చుకుంటూ తిరిగే ఖుదాబక్ష్ లాంటి మగవాడు తగులుకున్నప్పుడు, ఆమె మన ఇళ్ళల్లో కనిపించే ఆడవాళ్ళలా ఉండదు కదా!

నా సుల్తానా వేశ్యావాటికలో ఒక ఆడది. ఆమె వృత్తి అదే, వేశ్యావాటికల్లో ఆడవాళ్ళు చేసేదే. వేశ్యావాటికల్లో ఆడవాళ్ళు ఏం చేస్తారో ఎవరికి తెలియదు? దాదాపుగా ప్రతి నగరంలోనూ కనీసం ఒక్క వేశ్యావాటికైనా ఉంది. బయలుదొడ్ల గురించి, మోరీల గురించి తెలియందెవ్వరికి? ప్రతి నగరంలోనూ మురిక్కాలువలు, మోరీలు ఉన్నాయి, అవి నగరపు మురికినంతా బయటకు తీసుకెళ్తాయి. మనం మన పాలరాతి పాయఖానాల గురించి రాసుకోవచ్చునంటే, మనం సబ్బు, లావెండరు గురించి ప్రస్తావించ వచ్చునంటే, మరి ఆ మోరీలు, నాలాల గురించి ఎందుకు ప్రస్తావించ కూడదు, అవి మన మురికి తాగేవి కదా? మనం గుళ్ళ గురించి, మసీదుల గురించి ప్రస్తావించ వచ్చునంటే ఈ వేశ్యావాటికల్ని ఎందుకు ప్రస్తావించకూడదు, వీటి నుండి తిరిగొచ్చిన చాలా మంది గుళ్లకో, మసీదులకో వెళ్తారుగా? మనం నల్లమందు, గంజాయి, సారా దుకాణాల గురించి ప్రస్తావించవచ్చు అన్నప్పుడు, మరి ఆ వేశ్యల ఇళ్ళ గురించి ఎందుకు ప్రస్తావించకూడదు, అక్కడ అన్ని రకాల మత్తుపదార్థాల ఉపయోగించేటప్పుడు?

మనం పాకీదొడ్లు ఊడ్చేవారిని అంటీముట్టనట్టు చూస్తాం. దొడ్లు ఊడ్చే మనిషి మన ఇంటినుండి బుట్టెడు రోతను ఎత్తుకొని బయటకు వెళ్తుంటే మనం ముక్కు మీద జేబురుమాలు తప్పకుండా పెట్టుకుంటాం. మనకి అసహ్యం కూడా వేస్తుంది. కానీ, మనం దొడ్లూడ్చేవారి ఉనికిని నిరాకరించలేం. మన ఒంటినుండి రోజూ బయటకుపోయే మలాన్ని నివారించలేం. విరోచనాలు, మలబద్ధకం, మూలశంక, అతిసార వ్యాధులకి మందులు ఎందుకున్నాయంటే మన ఒంటినుండి మలాన్ని బయటకు పంపడం అంత ముఖ్యం కాబట్టి.

అశుద్ధాన్ని నిర్మూలించడానికి ప్రతి నిత్యం ఎన్నో కొత్త విధానాలు, ఆలోచనలు పుట్టుకొస్తుంటాయి, ఎందుకంటే మురికి ప్రతిరోజూ జమ అవుతూ ఉంటుంది. ఒకవేళ మన ఒంట్లో ఒక ఇంక్విలాబ్ వ్యాపించి దాని పనితీరు మారిపోతే మనం మూలశంక, మలబద్ధకం, అతిసార వ్యాధుల గురించి మాట్లాడుకోము. ఒకవేళ మలాన్ని తీసేయడానికి ఏదైనా మెకానిక్ విధానం ఉండుంటే, దొడ్లూడ్చేవాళ్ళ ఉనికి మిగలదు.

మనం దొడ్లూడ్చేవాళ్ళ గురించి మాట్లాడుకుంటుంటే, తప్పకుండా చెత్తాచెదారాల, అశుద్ధాల ప్రస్తావన వస్తుంది. మనం వేశ్యల గురించి మాట్లాడుకుంటే తప్పకుండా వారి వృత్తిని గురించిన ప్రస్తావన వస్తుంది.

వేశ్యల ఇళ్ళకి మనం నమాజ్ చేయడానికో, మహమ్మద్ ప్రవక్త దురూద్ చదవడానికో వెళ్ళం. మనం అక్కడికి ఏ అవసరంతో వెళ్తామో స్పష్టంగానే తెలుసు; అక్కడికి మనం ఎందుకు వెళ్తామంటే అక్కడికి మనం వెళ్ళగలం కాబట్టి. మనం అణచుకున్న కోరికలను అడ్డూ అదుపూ లేకుండా అక్కడ కొనగలం కాబట్టి. అక్కడికి వెళ్ళడానికి మనకి దాపరికం లేని అనుమతి ఉన్నప్పుడు, ప్రతి మహిళ తన ఇష్టానుసారంగా వేశ్య కాగలినప్పుడు, ఒక లైసెన్స్ తీసుకొని శరీరంతో వ్యాపారం చేయగలిగినప్పుడు, ఈ వ్యవహారమంతా చట్టబద్ధమైనప్పుడు, దాని గురించి మనం మాట్లాడుకోవడం మాత్రం ఎందుకు అశ్లీలం అవుతుంది?

ఒకవేళ వేశ్య ప్రస్తావనే అశ్లీలమైతే ఆమె ఉనికి కూడా అశ్లీలమే. ఒకవేళ ఆమె ప్రస్తావన నిషిద్ధమైతే, ఆమె వృత్తి కూడా నిషిద్ధమవ్వాలి. వేశ్యలను రూపుమాపండి, వాళ్ళ ప్రస్తావన దానంతట అదే పోతుంది.

మనం వకీళ్ళ గురించి బాహాటంగా మాట్లాడుకోవచ్చు. మనం మంగలివాళ్ళు, చాకలివాళ్ళు, కూరగాయలమ్మేవాళ్ళు, పూటకూళ్ళు పెట్టేవాళ్ళ గురించి మాట్లాడుకోవచ్చు. మనం దొంగలు, దోపిడిగాళ్ళు, దారిన పోయేవారిని దోచుకునే వాళ్ల కథలు వినిపించొచ్చు. మనం జీనీలు, అప్సరసల కథలు కూర్చొని గడగడా ఎన్నయినా చెప్పుకోవచ్చు. ఆకాశంవైపు సైతాను బయలుదేరినప్పుడు ఫరిష్తాలు చుక్కల్ని తెంపి అతడి మీదకు విసురుతాయని చెప్పుకోగలం. మనం ఒక ఎద్దు తన కొమ్ముల మీద ప్రపంచం మొత్తాన్ని ఎత్తిందని చెప్పుకోగలం. మనం దాస్తాన్-ఎ-అమీర్ హమ్‌జా, చిలుక-మైనాల కథలు చెప్పుకోవచ్చు. మనం లంధౌర్ పెహల్వాను గాడిదను కూడా పొగడచ్చు. మనం బతికినంత కాలం, అతగాడి టోపి, సంచి గురించి మాట్లాడుకోవచ్చు. మనం ఏ భాషైనా మాట్లాడగలిగే చిలుకలు, మైనాల కథలు చెప్పుకోవచ్చు. మనం మాయావుల మంత్రాలు, వాటి విరుగుళ్ల గురించి మాట్లాడుకోవచ్చు. మనం బేతాళుల గురించి, పరుసవేదుల గురించి నోటికేది వస్తే అది అనవచ్చు. మనం మన జుట్టు, గడ్డాలు, పైజామాల పొడవు గురించి కొట్టుకొని చావచ్చు. మనం రోగన్‌ ఘోష్, పులావు, కుర్మాలు చేయడానికి కొత్త కొత్త విధానాలు చర్చించుకోవచ్చు. మనం ఆకుపచ్చ రంగు బట్ట మీద, ఏ రంగు, ఎలాంటి బొత్తం సరిపోతుందోనని అందరం కలిసి కూర్చొని ఆలోచించుకోవచ్చు– కాని, మనం వేశ్యల గురించి ఎందుకు ఆలోచించకూడదు? వారి వృత్తిని గురించి ఎందుకు పరిశీలించకూడదు? వాళ్ల దగ్గరకి వెళ్ళేవారి గురించి ఎందుకు ఏమీ రాయకూడదు?

మనం ఒక యువకుడు, యువతి మధ్య పరస్పరం ప్రేమ పుట్టేలా చేయవచ్చు. వాళ్ళ తొలి పరిచయం లాహోర్ లోని దాతా-గంజ్-భక్ష్‌ సూఫీ దర్బార్‌లో చేయించవచ్చు. మధ్యవర్తిగా ఒక ముసలిదానిని తీసుకురావచ్చు, విడిపోయిన ఈ రెండు ఆత్మలని మళ్ళీ మళ్ళీ కలిసేలా చేయడానికి. మనం చివరకి వాళ్ళ ప్రేమను విఫలం చేయొచ్చు. ఇద్దరికి విషం తాగించవచ్చు. వాళ్ళిద్దరి శవాలను, ఒకరిది ఒక ప్రాంతం నుండి, ఇంకొకరిది ఇంకో ప్రాంతం నుండి లేపించవచ్చు. ఆపైన వాళ్ళిద్దరి సమాధులు ఆ దేవుడి అద్భుతాలవల్ల పక్కపక్కనే ఉండేలా చేయించొచ్చు, అవసరమైతే పైనుండి దేవతల చేతుల మీదుగా పూలవాన కురిపించచ్చు–కాని, మనం వేశ్య జీవితానికి సంబంధించినవి ఎందుకు ప్రకటించకూడదు? ఆమెకైతే దేవతలు, వాళ్ళ పూలు కూడా అక్కరలేదు. ఆమె చనిపోతే, పక్క ప్రాంతం నుండి ఇంకో శవం లేచి తోడు రాదు. ఏ సమాధీ ఆమె సమాధితో కలవాలనే ఆశ పెట్టుకోదు.

వేశ్య ఇల్లే ఒక శవం. సమాజం దాన్ని తన భుజాల మీద ఎత్తుకొని మోస్తుంది. అది దాన్ని పాతిపెట్టనంతవరకూ దాని గురించి చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఈ శవం కుళ్ళిపోనీ, కృశించిపోనీ, కడుపులో దేవేసేలా కంపుకొట్టనీ, భయంకరమవ్వనీ, అసహ్యమవ్వనీ, అయినా దీని మొహం చూడ్డం వల్ల ఏం నష్టం? ఏం, ఆమె మనకి ఏమీ కాదా? ఏం, మనం ఆమెకు దగ్గరవాళ్ళం కామా? మనం అప్పుడప్పుడూ ఆమె శవం మీద కప్పిన బట్టను తీసి ఆమె ముఖాన్ని చూస్తూ ఉంటాం, వేరేవాళ్ళకి చూపిస్తూ ఉంటాం.

నేను కాలీ సల్వార్‌లో ఇలాంటి ఒక శవపు ముఖమే చూపించాను. ఉదాహరణకి:

రోడ్డుకి అవతల కుడివైపున ఆ మూల నుండి ఈమూల దాకా ఒక పెద్ద గోదాము ఉండేది. దాని ఇనుప కప్పు కింద పెద్దపెద్ద ఇనుప పిడులు, ఇంకా అన్ని రకాల సామానులు గుట్టలుగా పోసి ఉండేవి. ఎడమవైపంతా ఒక వెడల్పాటి మైదానం, దానిలో బోలెడన్ని రైలు పట్టాలు వేసి ఉండేవి. ఎండలో ఈ ఇనుప పట్టాలు మెరుస్తుంటే, సుల్తానా తన చేతుల వంక చూసుకునేది. వాటిపై నీలంగా నరాలు అచ్చంగా ఆ పట్టాలలానే ఉబ్బెత్తుగా ఉండేవి. ఆ పొడుగాటి మైదానంలో ఎప్పుడూ రైళ్ళూ, ఇంజన్లూ నడుస్తూ ఉండేవి, అటు కొన్నిసార్లు, ఇటు కొన్నిసార్లు. ఆ ఇంజన్లు, బండ్ల ఛక్-ఛక్ ఫక్-ఫక్ చప్పుళ్ళు ఎప్పుడూ ఇంట్లో తిరుగాడుతుండేవి. పొద్దున్నే ఆమె లేచి బాల్కనీలోకి వచ్చినప్పుడల్లా ఒక వింత దృశ్యం కళ్ళకి కనిపించేది. గోదాము మీద, మైదానం మీద పొగమంచు పట్టివుండేది. ఆ పొగమంచులో ఇంజను నోటినుండి చిక్కటి పొగ పైకి వెళ్తూంటే లావుపాటి మనుషులు ఆకాశం వైపు పోతున్నట్టు అనిపించేది. ఇంజన్ల తలనుంచి హడావిడిగా తన్నుకొచ్చే ఆవిరి, మేఘాల్లా పెరిగి రెప్పపాటులో గాలిలో కలిసిపోయేది. ఒక్కొక్కప్పుడు, ఇంజను ఒక చిన్న ధక్కా ఇచ్చి వదిలేసిన రైలు డబ్బా ఒంటరిగా పట్టాలపై పోతూ కనిపిస్తే ఆమెకి తనే గుర్తుకొచ్చేది: ఆమె జీవితాన్ని కూడా ఎవరో పట్టాలపై ఒక తోపు తోసి వదిలేశారు. ఆమె అలా వెళుతోంది. ఆమె జీవితపు బండిని ఇంకెవరో నెడుతున్నారు, ఆమె పట్టాలు మారుతూ పోతోంది, తన ప్రమేయం లేకుండా. ఎక్కడికో మరి? ఏదో ఒక రోజు వస్తుంది, ఆమెను తోసిన తోపు మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది, ఆమె ఎక్కడో ఆగిపోతుంది, ఆమె బాగోగులు కూడా పట్టించుకోడానికి ఎవరూ ఉండని ఏదో ఒక చోట.

సూక్ష్మంగా చదివేవారికి ఇంతకన్నా ప్రతీకలు ఏమి కావాలి? సుల్తానా జీవితానికి సరిపోలే ఈ ప్రతీకలను నేను స్పష్టంగా ఇవ్వగలిగాను. ఢిల్లీ మునిసిపాలిటీ వాళ్ళు వేశ్యలకోసం ఒక ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయించేటప్పుడు ఇది ఆలోచించి వుండరు, పాతసామాన్ల గోదాము వాళ్ళ జీవితాలకి సరిపోయే ప్రతీకలుగా భావించవచ్చని. అది సాహెబుగారి దృష్టిలో పడి, ఆ గోదాముని, ఇళ్ళని ఎదురెదురుగా చూసి, కాలీ సల్వార్ లాంటి ఎన్నో కథలు రాస్తారని.

ఇదే శవానికి ఉన్న మొహాన్ని నేను ఇంకో సందర్భంలో కూడా చూపించాను. ప్రసిద్ధి చెందిన నా కథ హతక్‌ను ఇలా ప్రారంభించాను:

రోజంతా అలసి సొలసి ఆమె అప్పుడే తన మంచం మీద నడుం వాల్చింది. వాలుస్తూనే నిద్రపోయింది. మునిసిపల్ కమిటికి చెందిన సఫాయి ఆఫీసరు, అతణ్ణి ఆమె సేఠ్ అని పిలుస్తుంది, ఇప్పుడిప్పుడే ఆమె ఒళ్ళు నలగ్గొట్టి, మందు మత్తులో ఎముకలు పిండిపిండి చేసి, ఇంటికి తిరిగివెళ్ళాడు. అతడు రాత్రి ఇక్కడే ఉండిపోయేవాడే కానీ తన ధర్మపత్ని గురించిన ఆలోచన ఉండనీయదు. ఎందుకంటే ఆమె అతనిని ఎంతగానో ప్రేమిస్తుంది.

ఆమె తన శరీర కష్టానికి బదులుగా ఆ ఆఫీసరు నుండి సంపాదించిన రూపాయలు, ఆమె పైట కింద అతని ఉమ్ము మరకలున్న జాకెట్టు లోపల నుండి బయటకు ఉబ్బి ఉన్నాయి. ఆమె అప్పుడప్పుడూ బరువుగా ఊపిరి తీసుకొని వదిలినప్పుడు ఆ వెండి రూపాయలు గలగలమంటాయి. ఆ గలగలలు ఆమె గుండె చప్పుడులో కలిసిపోతుంటాయి. అది ఆ వెండి నాణాలు కరిగిపోయి ఆమె గుండెనుండి రక్తంలోకి కలిసిపోతున్నట్టుగా అనిపిస్తుంది.

ఆమె ఛాతీ లోపల మంటగా ఉంది. ఆ మంటకు కాస్త ఆ ఆఫీసరు తనవెంట తీసుకొచ్చిన బ్రాందీ కారణం. మరి కాస్త సోడా అయిపోయిందని నీళ్ళు కలుపుకొని తాగుబోతుల్లా తాగడం కారణం.

ఆమె టేకుతో చేసిన పొడవాటి మంచం మీద బోర్లా పడుకొని ఉంది. ఆమె చేతులు భుజాలవరకూ నగ్నంగా ఉన్నాయి. అవి రాత్రి మంచుకి తడిచిపోయి కాగితం ఊడివచ్చేశాక గాలిపటంలో మిగిలిపోయిన పుల్లల్లా ఉన్నాయి.

ఆమె కుడిభుజానికి పక్కన ఒక దెబ్బ తగిలివుంది. అది నీలంగా నల్లగా ఇంకు మరక అంటినట్టుగా ఉంది. అక్కడ చర్మం కమిలిపోయి, ముడుతలు పడి, కోడితోలు ముక్క ఒకటి ఎవరో కోసి అక్కడ అతికించినట్టుగా ఉంది.

ఇది సుల్తానాకున్న ఒక చెల్లెలి చిత్రం. ఈమెకి ఖుదాభక్ష్ కాకుండా ఒక విశ్వాసంగల కుక్క ఉంది. ఖుదాభక్ష్ సుల్తానాను ఆహ్లాదపరచలేకపోయాడు. కానీ ఈ విశ్వాసంగల కుక్క సౌగంధికి బాగా పనికొచ్చింది. నేను ఈ కథ చివర్లో ఇలా రాశాను:

కుక్క దాని వంకరటింకర తోకను ఊపుకుంటూ సౌగంధి దగ్గరకు వాపసు వచ్చింది. ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని టపటపా తన చెవులను ఆడించింది. సౌగంధి ఉలిక్కిపడింది. ఆమె తన చుట్టూ ఒక భ్రాంతిలాంటి నిశ్శబ్దాన్ని చూసింది. అలాంటి నిశ్శబ్దం ఆమె మునుపెన్నడూ చూడలేదు. ఆమెకు ప్రతి వస్తువు ఖాళీ అయిపోయినట్టనిపించింది. ప్రయాణికులతో నిండివున్న రైలుబండి అన్ని స్టేషన్లలో ప్రయాణికులను దించేసి ఇప్పుడు రేకుల షెడ్డులో ఒంటరిగా నుంచున్నట్టుగా అనిపించింది. శూన్యం లాంటి ఒంటరితనం ఉన్నట్టుండి ఆమెలో పుట్టుకొచ్చి, ఆమెను ఇబ్బంది పెట్టింది. ఆమె చాలాసేపటివరకూ ఆ ఖాళీ నింపుకోడానికి ప్రయత్నించింది, కానీ లాభం లేకపోయింది. ఆమె ఒకటేసారి ఎన్నో ఆలోచనల్ని తన ఆ ఖాళీలో నింపడానికి ప్రయత్నించింది కాని చేయలేకపోయింది. ఇటునుంచి నింపబోతే అటునుంచి కారిపోయినట్టుగా ఆమె తలలో ఏ ఆలోచనలూ నిలవలేదు. చాలాసేపు అలా ఆ ఒంటరితనాన్ని, ఆ ఏమీలేనితనాన్ని నింపుకునే ప్రయత్నం చేస్తూ ఓడిపోతూ ఆ పేముకుర్చీలో ఆమె కూర్చునే ఉంది. ఎంత ఆలోచించినా ఆమెకు తన మనసును కుదుటపరిచే ఉపాయం తట్టలేదు. చివరికి ఆమెకున్న ఒకే తోడు, విశ్వాసంతో తననే అంటిపెట్టుకున్న ఆ కుక్క, దానిని ఒడిలోకి తీసుకుంది. టేకుతో చేసిన వెడల్పాటి మంచం మీద దాన్ని తన పక్కన పడుకోబెట్టుకొని నిద్రపోయింది.

ఎవరు ఈ రాతలు చదివి కోరికలు తీర్చుకోవడానికని వీళ్ళ ఇళ్ళకి వెళ్తారు? నా సుల్తానా, నా సౌగంధి ఎవరూ లేనప్పుడో, దొంగచాటుగానో చూసుకొనే బొమ్మలు కారు. అలాంటి బొమ్మలు ఇప్పుడు ప్రకటనలుగా చాలానే వస్తున్నాయి వార్తాపత్రికల్లో. వాళ్ళేమీ మీకో సింహాసనం వేయరు. మీ ఒంట్లో వేడిపుట్టించే కథలేమీ చెప్పరు.

ఇంతగా చర్చనీయాంశమైన నా కాలీ సల్వార్ కథ మీరు జాగ్రత్తగా చదివితే మీకు ఈ విషయాలు అర్థమవుతాయి:

1. సుల్తానా ఒక మామూలు వేశ్య. ముందు అంబాలాలో వ్యాపారం చేసేది. తర్వాత తన దోస్తు ఖుదాబక్ష్ మాట విని ఢిల్లీ వచ్చింది. ఇక్కడ ఆమె వ్యాపారం నడవలేదు.

2. ఖుదాబక్ష్ ఖుదా మీద అసంబద్ధమైన నమ్మకాన్ని ఉంచి, ఫకీరుల అద్భుతాలను నమ్మించే మనిషి.

3. సుల్తానా వ్యాపారం నడవకపోయేసరికి ఆమెకు చాలా దిగులు పట్టుకుంది. ఖుదాబక్ష్ ఫకీర్ల వెంట పెరిగెత్తేకొద్దీ ఆమె దిగులు పెరిగింది.

4. మొహరమ్ నెత్తిమీదకు వచ్చింది. సుల్తానా తక్కిన స్నేహితురాళ్ళు నల్ల బట్టలు కుట్టించుకున్నారు, కానీ ఆమె కుట్టించుకోలేకపోయింది. ఆమె దగ్గర ఏమీ లేవు కనుక.

5. ఈ సందర్భంలో శంకర్ వస్తాడు, అతడొక తిరుగుబోతు. మాటకారితనం, సరదాతనం తప్ప అతడి దగ్గర ఏమీ లేదు. అతడు సుల్తానా దగ్గరకొచ్చి ఈ లక్షణాలకి ప్రతిఫలంగా ఆమె డబ్బుకు అమ్ముకునే శరీరపు పొందు కోసం వెతుకుతాడు. ఆమె ఆ బేరానికి ఒప్పుకోదు.

6. రెండోసారి శంకర్ తనంతట తాను రాడు, దిగులుగా ఉన్న సుల్తానానే పిలుస్తుంది అతణ్ణి. నిలువ నీటిలాంటి తన జీవితంలో ఒక అలజడిలా అతడిని స్వీకరిస్తుంది. అతణ్ణి కలిసి ఆమె సంతోషపడుతుంది గానీ, మొహరముకి తన దగ్గర నల్ల సల్వారు లేదన్న సంగతి మాత్రం మర్చిపోలేకపోతుంది. ఆమె శంకర్‌తో అంటుంది: “సంగతేంటంటే మొహరమ్ వచ్చేస్తుంది, నా దగ్గర నల్ల సల్వారు కొనుక్కునేంత డబ్బులు లేవు… ఇక్కడి కష్టాలన్నీ నీకు చెప్పుకొచ్చాను. కమీజు, దుపట్టా నా దగ్గరున్నాయి. వాటిని ఇవ్వాళ రంగు వేయించడానికి ఇచ్చాను.”

7. శంకర్ మొహరమ్ మొదటి రోజున ఒక నల్ల సల్వారు సుల్తానా కోసం తెస్తాడు. ఖుదాబక్ష్‌కి ఖుదా మీదున్న నమ్మకం, ఖుదాని నమ్మిన ముసలివాళ్ల మీద అవసరానికి మించిన శ్రద్ధ సుల్తానాకు ఏ రకంగానూ పనికి రాలేదు, కానీ శంకర్ పనితనం తనకు కావలసినది ఇస్తుంది.

ఈ కథ చదివాక మెదడు-మనసు మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? ఈ కథ ప్లాట్ గాని, కథన పద్ధతి గాని జనాలని వేశ్యల వైపుకి ఆకర్షించేలా చేస్తుందా? దానికి నా సమాధానం: ససేమిరా కాదు. ఎందుకంటే దీన్ని ఆ ప్రయోజనం కోసం రాయలేదు. దీన్ని చదివాక అలాంటి ప్రభావం కలుగలేదంటే ఇది అనైతికమైన కథ కాదు, అని. అనైతికమైనది కానంత మాత్రాన ఈ కథ అందరూ సరదాగా పాడుకునే పాట వంటిదని కాదు. పదిమందీ ఈ కథను మళ్ళీ మళ్ళీ చదువుకోరు, పాటలా పాడుకోరు. గ్రామఫోను కంపెనీ ఏదీ దీన్ని రికార్డు చేసి అమ్మదు. ఎందుకంటే ఈ కథలో విరహంతో ప్రేమికులు పాడుకునే దాద్రాలూ ఠుమ్రీలూ లేవు.

కాలీ సల్వార్ లాంటి కథలు మనోరంజన కోసం రాయబడవు. ఇవి చదివి ఒంట్లో కోరిక వేడెక్కదు. నోట్లోంచి చొంగ కారదు. దీన్ని రాసి నేను సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. ఈ కథ రాసి నేను పాపిని కాలేదు. నాకు గర్వంగా ఉంది, నేను ఈ కథా రచయితను అయినందుకు. మీకు ఇప్పుడు చదివించబోయే కవితల లాంటివి నేను రాయనందుకు నేను సంతోషిస్తున్నాను.

నువు కోరికలో కాలిపోతూ నను పిసికివేస్తూ రొప్పుతుంటావు
నా బట్టలు తీసేస్తూ నాతో నిన్ను కప్పుకుంటావు
నా నోటిలో నీ నోరు పెట్టి నా నాలుకతో నీ నాలుక కలుపుతావు
గాలికూడా చొరబడనంత గట్టిగా నన్ను వాటేసుకుంటావు
కొత్తగా నా పేరు పిలుస్తావు మెత్తగా నీ చేతులతో నన్ను చరుస్తావు
ఏదేదో మూలుగుతావు ఇంతలోనే తడిగా పక్కకు తిరుగుతావు
​ముడుచుకున్న నీ చాతకానితనం సంతృప్తిగా చాలు బాగుందన్న నీ మగతనం
అలసిపోయాను ఇక నన్ను కదిలించకు నిద్ర వస్తోంది నన్ను విసిగించకు
పడుకున్న నీనుంచి మాటలుండవు ఈ రాత్రి ఇక నాకు నిద్ర ఉండదు
ఎప్పుడైనా నీ మాట నిలుస్తుందా లేక నా ప్రతీ రాత్రీ ఇలానే గడుస్తుందా
ఇక నా దగ్గర మాటలూ లేవు ఈ రాత్రిలో మిగిలి గంటలూ లేవు
నన్ను నేను కొట్టుకోవాలి లేదా ఇంకొకరినెవరినో పిలవాలి.
నాలోమాత్రం కోరిక లేదా నాకు మాత్రం గొంతు పెగలదా
ఈ రాత్రి కాకుంటే ఇంకోరాత్రి గడపనా వాడితో మరోరాత్రి.

-(అంజుమన్-ఎ-తరక్కీ-ఎ-ఉర్దూ ప్రచురించిన సంకలనం నుంచి.)

నేను నా దాహపు, ఆకలితో రగిలిన కోరికలను, భావావేశాలను పంచుకోడానికి ఇలాంటి కవితలు రాయనందుకు నాకు సంతోషంగా ఉంది.

నా పెదవులలో పెదవులు కలిపే ఉంచుతావు
నా భుజాలపై నీ తల నిలిపే ఉంచుతావు
కలయికలోనూ కళ్ళు మూసుకోవెందుకు అంటే
గుండెలపై పడుకుని అలిగిపోతావు
నీ నాలుక ఆడే ఆటలు ఎన్నో, అవి చూపే స్వర్గపు అంచులు ఎన్నో
మారే మన కోరికలన్నీ మనతో ఆడించే భంగిమలెన్నో
నన్ను ముట్టుకోనీయవు నిన్ను వివస్త్రను చేయనీయవు
నన్ను గెలవాలని నన్ను కట్టిపడేయాలని పోటీకొస్తావు
నీ చేతులు పాముల్లా నా ఒళ్ళంతా కదులుతాయి
నీ తల తాకిళ్ళకు దిళ్ళు అణగిపోతాయి.
నా చేతులతో నీ చేతులు పట్టి ఉంచుతాను
నీ పళ్ళగాట్లకు తల వంచుతాను
నీ కోరికలు తీరవు తపనలు చల్లారవు
అందుకేనా ఎప్పుడూ ఇక చాలని అనవు.

-(సంపుటం: కుల్లియాత్-ఎ-మోమిన్, ప్రచురణ: నలవ్‌కిశోర్, లక్నో.)

ఆడ-మగ లైంగిక సంబంధాల గురించి ఈ విధంగా చెప్పడాన్ని రాయడాన్ని చూసి నేను సిగ్గుపడతాను. దాన్ని లజ్జాపూరితం అనుకుంటాను. ఎందుకంటే ఇది ప్రతి వయసొచ్చిన మనిషికి తెల్సు. ఏకాంతంలో ఒక మగవాడు, ఆడది ఇలా ఒక మంచం మీద ఈ కోరికతో పడుకున్నప్పుడు ఇలాంటి పనులే చేస్తారు. కానీ అది ఈ కవితల్లో రాసినంత అందంగా ఉండదు. ఆ జాంతవికతను ఇలా కవిత్వపు పరదాల వెనుక దాచేశారు. ఇలా రాసేవాళ్ళు తెలివిగా అందంగా మాటల్లో కట్టిపడేశారు. ఒకవేళ ఆడామగల ఈ పాశవిక కృత్యాల సినిమా తీసి తెర మీద చూపిస్తే, ఆరోగ్యకరమైన ఆలోచనలు ఉన్నవాళ్ళంతా దాని నుండి ద్వేషంతో మొహం తిప్పేసుకుంటారని నా నమ్మకం. కానీ, పైన నేను ఉదాహరణగా ఇచ్చిన కవితలు ఈ పాశవిక చేష్టలను తప్పుగా వాటిలో లేని అందాన్ని చూపిస్తాయి.

ఈ రకమైన కవిత్వం మానసిక రతి. రాసేవారికి, చదివేవారికి ఇది హానికారకమైందని భావిస్తాను. నా కథ కాలీ సల్వారులో ఇలాంటి దౌర్బల్యం లేదు. నేను ఇందులో ఎక్కడా ఆడా మగా శారీరక సంభోగం గురించి ఆశ కలిగించేలాగా నోరూరించేలాగా ఏమీ రాయలేదు. నా సుల్తానా తన కస్టమర్లయిన తెల్లవాళ్ళని తన భాషలో తిట్లు తిట్టడం, వాళ్ళని దద్దమ్మలు అనుకోవడం, ఎలాంటి లజ్జను, లేక భావావేశాలను ఉసిగొల్పుతుంది? ఆమె ఒక వ్యాపారి, కచ్చితమైన వ్యాపారి. మనం సారాయి కొట్టుకి సీసా కొనుక్కోవడం కోసం వెళ్తే, ఆ కొట్టువాడు ఉమర్ ఖయ్యాము లాగా రుబాయీలు వల్లెవేస్తూ ఉంటాడనో, లేదా హఫీజ్ దీవానులన్నీ గుర్తుపెట్టుకొని ఉండుంటాడనో ఆశించం. సారాయి కొట్టువాడు సారాయి అమ్ముతాడు, ఖయ్యామ్ రుబాయిలు, హఫీజ్ సిరాజి కవితలు అమ్మడు. నా సుల్తానా ముందు వేశ్య, ఆ తరవాతే ఆడది. ఎందుకంటే మనిషి జీవితంలో తన పొట్ట నింపుకోవడం అన్నింటికన్నా ముఖ్యమైన పని.

శంకర్ ఆమెని అడుగుతాడు: “నువ్వూ ఏదోటి తప్పకుండా చేస్తూ ఉండే ఉంటావ్?”

సుల్తానా బదులిస్తుంది: “కాలక్షేపం చేస్తాను.”

ఆమె నేను ధాన్యాల వ్యాపారం చేస్తాను, లేక బంగారం-వెండి తాకట్టు పెట్టుకుంటానని చెప్పదు. ఆమెకి తెల్సు ఆమె ఏం చేస్తుందో. ఎవరైనా టైపిస్టుని నువ్వేం చేస్తుంటావని అడిగితే వాడు అదే జవాబు ఇస్తాడు: “నేను టైపు చేస్తాను.”

నా సుల్తానాకి, ఒక టైపిస్టుకి మధ్యన ఏంటి తేడా? మీరే ఆలోచించండి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s