(డిసెంబర్ 14, 2019న హైదరాబాదులో జరిగిన ఆటా సాహిత్య సమావేశంలో
“కొత్త కథకుల అనుభవాలు” మీద మాట్లాడమన్నప్పుడు ఈ అంశాన్ని ఎన్నుకొని మాట్లాడాను. కానీ స్పీచులు ఇవ్వడం రాదు కనుక, చాలా వరకూ చెప్పాలనుకున్నది చెప్పలేకపోయాను. అందుకని ఆ సభకు రాసుకున్న నోట్సుని కొంచం విశిదీకరించి ఇక్కడ పెడుతున్నాను. ఇది దాదాపుగా “why I write what I write”లా తయారైంది. కానీ ప్రస్తుతానికి ఇక్కడ పెడుతున్నాను.)
ఈ మధ్యన ది హిందూ పత్రికలో ఒక వ్యాసం వచ్చింది. ఒక ఇరవై నాలుగేళ్ళ కుర్రాడు రాసిన పర్సనల్ ఎస్సే! చదువులో నెంబర్ వన్ అయిన అతడు చకచకా కాలేజీలు, ఐఐటీలు పూర్తి చేసి ఇరవై రెండేళ్ళ వయసుకి ఆరెంకెల జీతం వచ్చే ఉద్యోగంలో చేరాడు. తల్లిదండ్రులు, చుట్టాలు, చుట్టుపక్కలవాళ్ళు అందరూ వందకి వంద మార్కులు వేశారు ఆ అబ్బాయికి, ప్రయోజకుడు అయినందుకు. ఒక పూట, ఆఫీసులో, ఉన్నట్టుండి అతడికి చెమటలు పట్టేసి, ఊపిరాకపోతుంటే కొలీగ్స్ అతణ్ణి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళారు. డాక్టర్లు శారీరకంగా అతడికేం సమస్య లేదని, పానిక్ అటాక్ వల్ల అలా అయ్యిందని చెప్పి, సైక్రియాటిస్టుల దగ్గరకి పంపించారు.
అప్పటి వరకు అతడికి డిప్రషన్, స్ట్రెస్ లాంటి సమస్యలు ఉన్నాయని ఎవరూ కనిపెట్టలేకపోయారు – అతడితో సహా! “నీకంటూ ఏమిష్టం అని అడిగితే చెప్పలేకపోయాను. నీకోసం నువ్వు జీవితంలో ఏం చేశావంటే సమాధానం లేకపోయింది” అని రాశాడు. ఎంతసేపూ సమాజం వేసే తరాజులోనే తూగటం కాదని అర్థమైందన్నాడు.
అసెంబ్లీ లైనులో ఒక యూనిట్ లా ఒక బెల్టు మీద నుండి ఇంకోదానికి జారుకుంటూ మధ్యమధ్యన ఆగి నట్లూ, బోల్టులూ బిగించుకుంటూ మనుషుల్లా కాకుండా మరల్లా మనం మారి కనీసం రెండు దశాబ్దాలు అవుతుందని నేను అనుకుంటాను. మానసిక ఆరోగ్యం గురించి మనకు కనీస అవగాహన కూడా లేదు. మనిషిని సమాజం గుడ్డిగా నమ్ముతున్న కొలమాలానాలు (సంపాదన, పెళ్ళి-పిల్లలు) బట్టి కొలవడం తప్ప, ఆ యావ మానసిక, శారీరిక ఆరోగ్యాలపై ఎలాంటి దుష్ప్రభావాన్ని చూబుతుందో మనం ఆలోచించడం లేదు.
లోతుగా పుండు పడితే, తోలూడేంతగా దెబ్బ తగితే చాన్నాళ్ళ వరకూ మచ్చ ఉండిపోతుంది. ఎముకులకి ఏ ఫ్రాక్చరో అయితే ఎన్నాళ్ళైనా ఏదో కదలికలో తన ఉనికిని చాటుతూనే ఉంటుంది. మానసికమైన దెబ్బలు తగిలినప్పుడుకన్నా అవి మానే క్రమంలో, ఆ తర్వాత వాటి ప్రభావం ఎలా ఉంటుందని కుతూహలంతో నేను కొన్ని కథలు రాశాను. వాటిని గురించి మాట్లాడే ఉద్దేశ్యం ఇంకొన్ని నిముషాలు.
Is human a mind with a body or a body with a mind? అన్నది చాలా జటిలమైన ప్రశ్న. ఫిలాసఫర్లు, సైకియాట్రిస్టులు దీనికి వారికి తోచినట్టుగా థియరీలు చెప్తారు. ఏది ఏమైనా, మనసుకి శరీరానికి మధ్య complicated relationship ఒకటుంది. ఆ interplayని పట్టుకోడానికి కొన్ని కథలు ఆస్కారమిచ్చాయి. (అంటే ఇదోటి పట్టుకోడానికే అవి రాయలేదు. చాలా ఏళ్ళ గాపు తర్వాత కథలన్నీ చదువుతుంటే ఈ థీమ్ కనిపించిందంతే!)
ముందుగా, “ఆరెక్స్ మారేజ్”. నేను రాసినవాటిలో పది మందికన్నా ఎక్కువ మంది చదివిన కథ ఇది కనుక, మొదట దీని గురించే. కథ ఏటంటే, సమాజపు లెక్కల్లో అంతగా అందంగా ఉండని అమ్మాయి, ఒకడిచే నిరాకరించబడి, ఆ నిరాకరణను బాగా ఇంటర్నలైజ్ చేసేసుకొని పెళ్ళికి దూరంగా ఉంటుంది. డాక్టరే పెళ్ళి చేసుకోమని ప్రిస్క్రిప్షన్ ఇచ్చేవరకూ. ఈ కథకు వచ్చిన స్పందనలలో ముఖ్యంగా అందానికున్న కొలమానాల గురించి, నిరాకరణను హాండిల్ చేయడం గురించే ఎక్కువ వినిపించాయి.
కానీ ఈ కథ ద్వారా నేను చెప్పదల్చుకున్నది: ఒక మనిషి మనసుకి, శరీరానికి సంబంధం తెగిపోతే, తెగిపోయిందన్న స్పృహ కూడా ఆ మనిషికి లేకపోతే ఎలా ఉంటుందని. మన ఎదురుగా ఒక మనిషి ఉన్నా, కనిపిస్తున్నా, ఆ మనిషి లేనట్టు వ్యవహరించినట్టే మనతో మనం వ్యవహరిస్తే ఎలా ఉంటుంది? “హావ్ యు లాస్ట్ యువర్ మైండ్” అని అంటామే, కానీ శరీరమే లాస్ అయిపోతే…? ఇందులో ఆమెకి తన శరీరం మీద ఆసక్తి పోవడానికి, దానితో సంబంధం లేనట్టు వ్యవహరించడానికి “ఆమె అందంగా లేకపోవడం” ఒక్కటే కారణం కాదు. లేదా ఒకడు కాదన్నందుకే డిప్రషనులోకి వెళ్ళిపోయిందని కాదు. మానసిక సమస్యలు అప్పటికప్పుడు పుట్టుకు రావు. చాలా మట్టుకు వాటికి కారణాలు పెరిగిన వాతావరణం, ఇవ్వబడిన సోషల్ కండీషినింగ్, ఎదురుకున్న ఆటుపోట్లు లాంటివన్నీ కలిపి ఒక్కసారిగా కొట్టే అవకాశమూ లేకపోలేదు.
శోకము: ఒక పరీశలన కథలో ఈ అంశానికే ఉన్న ఇంకో పార్శ్వాన్ని చూబించడానికి ప్రయత్నించాను. ఆరెక్స్ లో అమ్మాయికి తనతో మాత్రమే సంబంధం ఉండదు, చుట్టుపక్కలున్నవారి, పరిసరాల స్పృహ ఆమెకింకా ఉంది. కానీ శోకం కథలో ఆమె మెదడులో ఎంతెలా వేరొక జీవితాన్ని ఆమోదించేసిందంటే, తన ఉన్న చోటు, తనతో మాట్లాడుతున్న మనుషులతో కూడా ఆమె disconnect అయిపోతూ ఉంటుంది. ఆమెకు తన శరీరంతోనే కాదు, చుట్టూ ఉన్న రియాల్టీ కూడా సంబంధం తెగిపోతూ ఉన్న పరిస్థితి.
(ఏదో ఫేషను కోసమో, డబ్బు పోసి వర్క్ షాపులు చేసినందుకో వరైటీగా కథ రాయాలనే తాపత్రయం కాదు. మాటిమాటికీ తన లోపల తాను అనుకుంటున్న నిజానికి, బయటున్న అసలైన(?) నిజానికి మధ్య ఊగిసలాడుతూ ఉన్న మనిషి కథను, “ఆమె మొదట అలా అనుకుంటుండగా, సడెన్ గా ఇలా అనిపించేసిందన్న మాట” అని రాస్తే చాలా పేలవంగా ఉంటుంది. అంటే, కారెక్టర్ల psycheని చూబించడానికి ఎంతో కొంత form కూడా పనికొస్తుందని నా నమ్మకం. ముఖ్యంగా, ఆ మనిషి interior landscape ని చిత్రిస్తున్నప్పుడు కథ చెప్పే విధానం, ఒక మానసిక సమస్య వల్ల మనిషి బాహ్య ప్రవర్తనను చెప్పడానికి సరిపోయే కథానిర్మానం కన్నా వేరుగా ఉండచ్చునని నా నమ్మకం.)
పై రెండు కథల్లో mind minimizes the body and the reality. “ఏనాడు విడిపోని ముడి వేసెను” అనే కథలో మెదడు శరీరానికి విస్మరించలేనంత అవస్థని కలగించే కేసు – physical manifestation of mental trauma! ఈ కథలో పెళ్ళై, ఆనందంగా కాపురం చేసుకుంటున్న జంట కథ. అతడికి అప్పుడప్పుడూ ముసురులాంటిది పట్టుకుంటుంది. అలాంటి రాత్రుళ్ళు అతడి ఒంటి నుండి నల్లటి దారపు పోగులు బయలుదేరతాయి. వీటిని పెళ్ళి కాకముందే గమనించినా ఆమె పెళ్ళికి సిద్ధపడుతుంది. తర్వాత అతడితో పాటు ఆ నల్ల దారాలతోనూ ఆమె కాపురం ఎలా చేసిందన్నదే కథ! ఈ కథను మాజికల్ రియలిజం ఎలిమెంట్సు వాడకుండా రాశాను మొదట డ్రాఫ్టు – అతడు బాగాలేక ముసుగుతన్ని పడుకుంటాడు, ఆమె ఏడుస్తూ కూర్చుంటుంది. అది అతడికున్న మానసిక సమస్యను బలంగా చెప్పగలుగుతుందని అనిపించలేదు. అందుకే అతడి ఒంటి నుండి నల్లదారాలు వస్తున్నట్టు మార్చాను. (ఇది మరీ కాకమ్మ కథ కూడా కాదు. విపరీత మానసిక ఒత్తిడి, వేదన వల్ల శరీరంలో జరిగే అనూహ్య మార్పుల గురించి మెడిసిన్ చాలానే చెబుతుంది.) ఈ నల్లదారాల ద్వారా రెండు పాయింట్లపై ఫోకస్ పెట్టగలిగాను
౧) డ్రిపషన్, స్ట్రెస్, ఆందోళన – ఏ మానసికమైన వ్యాధి అయినా శరీరం పైన ప్రభావం తప్పక చూపిస్తుంది. శరీరంపై కొన్ని సార్లు ఆ ప్రభావం కనిపిస్తుంది – ఉదా: ఆందోళన ఎక్కువైతే చెమటలు పట్టడం లాంటిది. కానీ చాలాసార్లు కళ్ళకి కనిపించని ప్రభావమే ఎక్కువ.
౨) మానసిక సమస్యలకి శారీరక లక్షణాలు బలపడినప్పుడు, అవి చుట్టూ ఉన్నవాళ్ళ మీద, ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఎలా దానికి స్పందిస్తారు అన్నది. అది ఆ బంధాలని ఎంత stress and tearకి గురుచేస్తుందో. ఈ కథలో భార్య కూడా “అసలెందుకీ పాడు దారాలు?” నుండి “అతడున్నంత కాలమూ ఇవీ ఉంటాయి” అనేంత వరకూ చాలానే దూరం ప్రయాణిస్తుంది.
అయితే, ఆమెకి అతడంటే ప్రాణం. అందుకని సవాలక్ష విధాల ప్రయత్నించి అతడిని, అతడిని సమస్యను accept చేయగలుగుతుంది. అలా చేయలేక, అలా అని వదులుకోలేక మదనపడే మరో అమ్మాయి కథ “బాక్ వాటర్స్” కథ. అందులో ప్రేమించుకొని, పెళ్ళి చేసుకుందామనుకుంటున్న సమయంలో అబ్బాయి కుటుంబ సభ్యులంతా ఒక ఆక్సిడెంటులో పోతారు. దానితో పోస్ట్ ట్రోమాటిక్ స్ట్రెస్ డిసార్డరులో ఆ అబ్బాయి ఆ అమ్మాయికి మెల్లిమెల్లిగా దూరమవుతుంటాడు. జరిగినదాంట్లో తన తప్పేం లేనప్పుడు, తను తప్ప అతడికెవ్వరూ మిగలనప్పుడు ఎందుకీ దూరమో ఆమెకి అర్థం కాదు. దానిని ఎలా పోగెట్టాలో చేతకాదు.
ఈ కథలో నాకు అక్కరకు వచ్చిన మరో మెటాఫర్ “బాక్ వాటర్స్”. పారుతున్న నది జీవితానికి ప్రతీక. నది మీద డామ్ కట్టేసరికి కొంత నీరు వెనక్కి నెట్టినట్టై బాక్ వాటర్స్ గా ఏర్పాడ్డాయి. జీవితంలో కొన్ని దుర్ఘటనలు కూడా కొంత మందిని అలా వెనక్కి నెట్టేస్తాయి. కానీ అందులో కూడా ఒక విచిత్రమైన అందం ఉంది. పచ్చని చెట్లలో లాంటి అందం కాకపోయినా, మోడైపోయిన చెట్లల్లో కూడా ఏదో అందం. అంతకు మించి బలం – అన్నింటిని తట్టుకొని నిలబడినందుకు. అది ఆ అమ్మాయికి, పాఠకులకి అర్థమవ్వడానికి అబ్బాయికి, బాక్ వాటర్స్ మెటాఫర్ తీసుకున్నాను.
ఒక వ్యక్తికి మానసిక ఆరోగ్య సమస్య ఉంటే, అది ఆ మనిషి ఎలా డీల్ చేస్తారన్నది ఒక ఎత్తు, ఆ వ్యక్తికి ఆత్మీయులు దాన్ని ఎలా అర్థంచేసుకొని మసులుకుంటారన్నది ఇంకో ఎత్తు. దీనికి ఉన్న ఇంకో పార్శ్వం – సమాజం ఆ మనిషి పట్ల ఎలా స్పందిస్తుంది అన్నది. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే, మనిషికి తనకి ఏమవుతుందో తెలుస్తుంది. దగ్గరవాళ్ళకి తెల్సుకోవడానికి అవకాశాలు ఉంటాయి, అవసరమూ ఉంటుంది. సమాజానికి ఈ రెండు ఉండవని నేను గమనించింది. ఉదా: పరీక్షల్లో సరిగ్గా రాయక ఎప్పుడూ ఫెయిల్ అయ్యే పిల్లాడు, చదవలేకపోతున్నాడా, చదువంటే అశ్రద్ధా, చదవింది గుర్తుండడం లేదా, చదవంటే భయమా లాంటివన్నీ సమాజానికి పట్టవు. “బొత్తిగా చదువురాని సన్నాసి!” అనే ఒక్క మాట తప్ప.
సమాజానికేం పట్టింది ఇవ్వన్నీ పట్టించుకోడానికి? దానికి కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. వాటిని చేరుకోకపోతే, అది చిన్నచూపే చూస్తుంది కదా అని వాదించేవాళ్ళు ఉన్నారు. నేను కథల్లో పనిగ్గట్టుక్కొని సమాజాన్ని విలన్ చేస్తున్నాననీ ఒకరిద్దరి స్పందన. కానీ ఆరెక్స్ మారేజ్ లో కానీ, “1+1” కథలో గానీ నేను సమాజాన్ని నెగటివ్ గా చూపించాలని అనుకోలేదు. పెళ్ళికాకుండా ఉన్న అమ్మాయిని, పిల్లలు పుట్టని జంటని మన సమాజం ఏమంటుందో, ఎలాంటి ప్రశ్నలు వేస్తుందో, ఏం వ్యాఖ్యలు చేస్తుందో అవే రాశాను. సమాజానికి ఎప్పటికప్పుడు మారే స్టాండర్డ్స్ ని ఆధారంగా చేసుకొని వ్యక్తులని జడ్జ్ చేసే వీలున్నప్పుడు, వ్యక్తికి ఆ సమాజాన్ని దాని బూటకపు స్టాండర్డ్స్ ని ఇగ్నోర్ చేసే హక్కు, లేదంటే “నేను ఇందులో ఇమడను” అని చెప్పే హక్కూ ఉంటాయనే నా నమ్మకం.
చివరిగా… ఒక మనిషికి దెబ్బ తగిలి రక్తం కారుతుంటే రోడ్డున పోయేవారు కూడా వచ్చి సహాయం చేస్తారు. కానీ మానసిక ఆరోగ్యం గురించి మనకి ఉన్న అవగాహన ఎంత తక్కువంటే, మన మానసికమైన పుండులని మళ్ళీ మళ్ళీ రేపుతుంటాం. ఇంతకు ముందు తరాలకి మానసిక సమస్యలు లేవని కావు. కానీ ఇప్పుడున్న కాలంలో, ఈ టెక్నాలజిలతో, మనకి మనం సృష్టించుకుంటున్న కొత్త జీవన విధానాల్లో ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు రాసిన కథల్లో జంటల్లో ఉన్న సమస్యలే రాసుకొచ్చాను. కానీ ముందుముందు మన వర్క్ ప్లేసెస్ లో, చదువుకునే పిల్లల్లో మానసిక సమస్యలు ఎలా ఉన్నాయో పరిశీలించి రాయాలని కోరిక.