నేటికెవరు మరి కథానాయకుడు?

Posted by

First published in eemaata.com’s July 2016 edition.

కథానాయకుడు కావలెను.

సుప్రసిద్ఢ కథ పాతాళ భైరవికి గాను యోగ్యుడైన, అర్హుడైన కథానాయకుడు కావలెను. రూపములో, గుణములో, ధైర్యసాహసములలో, సత్ప్రవర్తనలో, ఇన్నినాళ్ళూ ఈ కథకు నాయకుడిగా ఉండి, ప్రజల మనసును చూరగొన్న తోటరాముడిని మరిపించి, మురిపించగలిగే దిట్టయి ఉండవలెను. యుక్తితో, శక్తితో మాయావి మాంత్రికుడిని మట్టి కరిపించి, రాజకుమారిని పరిగ్రహించి, పాతాళ భైరవి ఆశీస్సు…

కూర్చున్న రాయి మీద నుండి ఒక ఉదుటున లేచి, మాంత్రికుడిని సమీపించి, అతడి చేతిలోని ప్రతిని లాక్కొని నలిపి, నేల కేసి కొట్టింది రాజకుమారి.

“ఈ ఉపాయమూ నచ్చలేదే నీకు, ఢింభకీ?”

“ఢింభకినీ, డింగరినీ కాను. నీ బుల్‌బుల్‌ను నేను. నీ జిగిడీను. అలా పిలు.”

“మారాము శాయక, మాట వినవే! మనకొక కథానాయకుడు కావాలే.”

“ఏం? ఎందుకు కావాలి? వదిలిపోయిన వాడి కోసం ఎందుకీ వెదుకులాట?”

“కాదనుకున్నాడే! కాదనను. కాని కథ అన్నాక కథానాయకుడొకడు ఉండాలి గదే, ఢింభకీ. లేకున్న…”

“ఆఁ! లేకపోతే? లేకపోతే ఏంటంట?”

“నన్నెవరు హరిస్తారు? నిన్నెవరు వరిస్తారే?” అంటూ నేల మీద పడున్న ప్రకటనని చేతిలోకి తీసుకొన్నాడు.

“అంతేనా? అంతేనా! అయితే పద. నన్ను పాతాళ భైరవి సన్నిధికి తీసుకెళ్ళు. నిన్ను బలి ఇచ్చి దేవిని ప్రసన్నం చేసుకుంటాను. ఆపై నిన్ను సంజీవనితో బతికించుకుంటాను. తర్వాత మనిద్దరం పెళ్ళి చేసుకుందాం.”

“గారడీ మాటలాడకే, ఢింభకీ! ఇంకెక్కడి సంజీవనే?”

ప్రతికి అంటుకున్న మట్టిని వదిలించడానికి దాన్ని గాల్లో దులిపాడు. కుడిచేతితో తొడ మీద పెట్టుకుని చేతితో సాపు చేశాడు. సగం తెగిన అతడి ఎడమ చేయి భుజం నుండి జీవం లేకుండా ఊగుతోంది. రాజకుమారి ఆ చేతినే చూస్తూ ఉండిపోయింది. అది గంట వినిపించని గడియారపు లోలకంలా నిశ్శబ్దంగా అటూ ఇటూ ఊగుతూనే ఉంది.

అసలైతే, కథ మొదలవ్వాల్సిన దగ్గరే మొదలయ్యింది. తోటలో, తోటరాముడితో.

తోటరాముడు మహాసాహసవంతుడు. సన్మార్గుడు. బుద్ధిగలవాడు. బుద్ధి చెప్పగలవాడు. అల్లరివాడు. అయినా, అందరివాడు. అతడికో జతగాడు. ఉజ్జయిని రాజ్యంలో రాజుగారి కోటలో తోటను చూసుకునేది వాళ్ళ అమ్మ. అమ్మకు సాయం చేసేవాడు తోటరాముడు.

ఒకరోజు ఆ తోటకు రాజకుమారి రాబోతుందని కబురొచ్చింది. రాజుగారి ఏకైక కుమార్తె కాబట్టి, ఎప్పుడూ చూడలేదు కాబట్టి దొంగచాటుగా ఆమెను చూడాలనుకున్నాడు.

చూపులు కలిశాయి.

ఆ రాత్రి తన మదిలోని కలవరాన్ని అంతా జాబిలికి చెప్పుకుంది, రాజకుమారి. ఆ జాబిలి వెన్నెలలోనే, అమ్మ ఒడిలో ఆదమరచి నిద్రపోయాడు రాముడు.

రాజకుమారి తోటకు మళ్ళీ మళ్ళీ వెళ్ళింది. తోటరాముడికి ఆ విషయం మామూలైపోయింది. ఎప్పుడన్నా ఎదురుపడితే వినమ్రంగా తలదించుకుని వెళ్ళిపోయేవాడు.

మొదటిసారిగా రాజకుమారికి కోటలో ఊపిరాడలేదు. ఆ ఎత్తైన ప్రాకారాలు తనను చుట్టిముట్టి గాలాడనీయకుండా చేస్తున్నట్టు అనిపించింది. తోటలోనే కోట ఉన్నా, కోటలోనే తోట ఉన్నా ఎంత బాగుండేదో అని అనుకుంది.

రాముడు ప్రాణాలకు తెగించి రాజకుమారిని పాము కాటు నుండి రక్షించాడు. అతడు తన ప్రేమను అలా వ్యక్తపరిచాడనుకుంది రాజకుమారి.

అన్నీ అనుకున్నట్టే అవ్వవు కదా? ఈ కథ కూడా అలాగే.

తోటకి వెళ్ళలేని రాజకుమారిని చూడ్డానికి తోటరాముడు కోట ప్రాకారాలు దాటి రాలేదు. పరాగ్గా ఉన్న కూతురి మనసు గ్రహించి, ప్రభువులే పరాక్రమానికి పారితోషికం ప్రకటించారు. తోటరాముడి మనసేమిటో తెల్సుకోడానికి ప్రయత్నించారు. ‘నిజం చెప్పమన్నారా? అబద్ధం చెప్పమన్నారా?’ అని అడిగి, తోటరాముడు నిజమే చెప్పేశాడు. రాజుగారి అనుగ్రహం కాస్తా ఆగ్రహంగా మారింది. తెల్లవారగానే తల తీసేయమని తీర్పిచ్చారు.

ఆ చెరసాల నుండి తప్పించుకొని, రాజకోట ప్రాకారం దాటుతున్న దృశ్యాన్నే దుర్భిణిలో చూశాడు మాంత్రికుడు. ‘సన్మార్గుడు. మహాసాహసవంతుడు’ — కరుణించిన దేవి పలుకులనే మళ్ళీ స్మరించుకున్నాడు. సదాజపుని వెంటబెట్టుకొని ఉజ్జయినికి చేరుకున్నాడు.

కూడలిలో జనాన్ని కూడబెట్టి తన విద్యలను ప్రదర్శించాడు. అతడి విద్యలు ప్రజలందరికీ వినోదాన్ని అందించాయి. మారువేషంలో ఉన్న తోటరాముడూ కళ్ళప్పగించి చూశాడు ఆ మాయలన్నీ! ప్రదర్శన అయ్యాక అందరితో పాటు చప్పట్లు కొట్టి ఇంటికి చక్కా పోయాడు.

జరగని కథను తెలుసుకున్నాడు మాంత్రికుడు. ప్రేమ లేకపోయినా, వాడికి డబ్బు మీద ఆశ ఉంటే చాలుననుకున్నాడు. తోటరాముని కదలికలు కనిపెడుతూ, అతడి దారికాచి ఎదురుపడ్డాడు మాంత్రికుడు.

“అనంత ఐశ్వర్యం ఇచ్చే నిక్షేపంరా! నీకొక్కడికే ఆ కీలకం చూపిస్తాను. సాహసం శాయరా, ఢింభకా!”

“నాకేం వద్దు. అమ్మే ఐశ్యర్యం. అమ్మే నా ప్రపంచం.”

“అలా అనకురా ఢింభకా! నీవు సాహసివిరా. వరపుత్రుడవిరా!”

“అందుకే! అన్ని వ్రతాలు పట్టి కన్న అమ్మ కంటనీరు చూడలేను. ఆమె కంటికి దూరం కాలేను. బందిఖానా నుండి తప్పించుకుంది కూడా అందుకే.”

అయినా మాంత్రికుడు పట్టు వదలలేదు.

ఆ రాత్రికే తన తల్లిని, స్నేహితుని తీసుకొని ఎవరికీ చెప్పాపెట్టకుండా కథ నుండి వెళ్ళిపోయాడు.

రాజుగారు పంపిన సైన్యానికి గాని, మాంత్రికుడి దుర్భిణికి గాని తోటరాముడు దొరకలేదు.

తన రాముణ్ణి తానే వెతుక్కుంటానని రాజకుమారి కోటను వదిలి బయలుదేరింది. తన మంత్రతంత్రాలకు లేని బలం ఆమె ప్రేమకు ఉండచ్చునని ఆమెను అనుసరించాడు మాంత్రికుడు, ఆమెకు తెలీకుండా.

పుట్టలూ గుట్టలూ దాటి కొండలూ కోనలూ దాకా వెళ్ళింది రాజకుమారి. కళ్ళు కాయలు కాచాయి. పాదాలకు పుళ్ళు పడ్డాయి. ఆమె ఆగలేదు. వెతకడం ఆపలేదు. అలసి సొలసి స్పృహ తప్పి పడిపోయేవరకూ.

స్పృహ వచ్చేసరికి రాజకుమారి ఒక మందిరంలో ఉంది. చుట్టూ బోలెడు పరిచారికలు ఉన్నారు. ఎవరినీ గుర్తుపట్టలేకపోయింది.

మంచం పక్కనే ఉన్న మాంత్రికుణ్ణి చూసింది. కళ్ళు తిరిగి పడిపోయింది.

కోలుకోడానికి కొన్నాళ్ళు పట్టింది. సపర్యలు చేస్తున్న పరిచారికలు ఆమెను కాపాడ్డానికి మాంత్రికుడు పడ్డ కష్టాన్ని కథలుకథలుగా చెప్పుకొచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కదిలించడానికి ఇష్టపడక, ఉన్న చోటనే కోట కట్టి, అన్ని వసతులూ సమకూర్చాడని, దేశవిదేశాల నుండి వైద్యులని రప్పించాడని, తోటరాముడి కోసం మహాయాగం చేయబోతున్నాడని విన్నది రాజకుమారి.

మాంత్రికుడు వచ్చాడు.

“మీరెవరో తెల్సుకోలేకపోయాను. మా ఇద్దరి కోసం ఇంత తాపత్రయపడుతున్న మీకు, ఏమిచ్చి రుణం తీర్చుకోగలం?”

“సన్మార్గులకు సాయం శాయడం మా వ్రతము, రాజకుమారి!”

“మీ వంటి మంత్రసిద్ధుల అనుగ్రహం, మా పూర్వజన్మ సుకృతం.”

“ఛీ, నీచుడా! నీ పాపం పండే రోజు వస్తుంది. నా రాముడొస్తాడు. నిన్ను వధిస్తాడు. చూస్తూ ఉండు.”

చేతికందినది అందినట్టు మాంత్రికుని పైకి విసిరింది. పరిచారికలు ఆమె రెండు చేతులనూ పట్టుకున్నారు.

మాంత్రికుడికి పౌరుషం వచ్చింది. ఆ బికారి రాముడి చావు నాచేతిలోనే అని అరిచాడు. ఆమెపై ప్రత్యేక నిఘా ఉంచమని ఆజ్జాపించి, వెళ్ళిపోయాడు.

గొడవంతా సద్దుమణిగాక, భోజనం తెచ్చింది పరిచారిక.

“ఇలా బిర్రబిగుసుకొని కూర్సుంటే తప్పేదేమి లేదమ్మి!”

“నన్నెందుకిలా పీడిస్తారు? కనికరం లేదు. నేనే అపకారం చేశాను?”

“నిను సూస్తే జాల్యేస్తుంది.” అంటూ పరిచారిక రాజకుమారి వీపు నిమిరింది.

“మా గురువుగారికి తెలీని విద్దె లేదు. ముక్కుసూటిగా పోతే, నీ జీవానికి ఆ కుర్రోడు ఉసూరున సావాలి.”

“నాకేం పాలుపోవటం లేదు, ఈ అపాయం నుండి ఎలా గట్టెక్కాలో?”

“రాజకూతురివికంద? కూతింత రాజకీయం శాయి!”

రాజకుమారి కళ్ళు తుడుచుకొని ఆమె వైపు చూసింది. ఆమె భుజం తట్టి పరిచారిక అక్కడనుండి వెళ్ళిపోయింది.

రాజకుమారి చాలా సేపు ఆలోచిస్తూ ఉండిపోయింది. తోటరాముడి కోసం వెతుకుతూ ఉజ్జయిని నుండి ఎంత దూరం వచ్చేసిందో, అక్కడ ఏం జరుగుతుందోనన్న స్పృహ లేకపోయింది ఆమెకి. అదే అదనుగా తీసుకుని మాంత్రికుడు, రాజకుమారిని ఎవరో మాయావి అపహరించాడని, తోటరాముడు లొంగిపోతే గాని ఆమెను విడిచిపెట్టడని పుకార్లు లేపాడు. ఈ మాట ఆ నోటా ఈ నోటా విని, ప్రేమ కోసం కాకపోయినా, మరో ప్రాణం కోసమైనా రాముడు వస్తాడని అతడి పన్నాగం.

రాజకుమారిదీ అదే నమ్మకం.

రాముడు వస్తాడు. కుతంత్రాలు తెలీకపోయినా కండబలం, గుండెబలం ఉన్నవాడు. మాంత్రికుని చంపగల సత్తా ఉంది. చంపినా ఏం లాభం? క్షణాల్లో మళ్ళీ బతికిపోతాడే! ఆ మంత్రశక్తి ముందు రాముడి శక్తియుక్తులు ఎంతవరకూ నిలవగలవు?

కొన్నాళ్ళ తర్వాత, ఒక రాత్రి, పరిచారిక సహాయంతో సదాజపుని తన మందిరానికి పిలిపించింది, రాజకుమారి.

“ఎన్నాళ్ళని ఇలా శిష్యరికం చేస్తావు? నీకూ కోటి విద్యలొచ్చని విన్నానే?!”

సదాజపుడు నిలుచుని ఆలకిస్తున్నాడు. నెత్తికి పెట్టుకున్న నల్లటి బట్ట ముందుకు పడ్డం వల్ల అతడి మొహం కనబడటం లేదు. చేతివేళ్ళ మధ్య జపమాల కదులుతూనే ఉంది.

“మీ గురువుగారి పరిస్థితి చూస్తున్నావు గదా? పాతాళ భైరవి కటాక్షం తప్ప మరో ఆశ లేదు. తోటరాముడి రాక తప్ప మరో ధ్యాస లేదు. ఆ రాముణ్ణి కదిలించటం కన్నా రాయిని కరిగించటం తేలిక! నన్ను ప్రేమించనివాడు నాకోసం వస్తాడంటావా?”

జపమాల క్షణం పాటు ఆగి కదిలింది.

“నువ్వే చెప్పు. ఎన్నాళ్ళయ్యింది ఈ కోటలో, మన అందరి ఎదురుచూపుల్లో? నాకంటే తప్పదు. నీకేం ఖర్మని?”

మొహానికి అడ్డుగా ఉన్న బట్ట వెనక్కిపోయేలా తలెత్తాడు. రాజకుమారిని చూశాడు. వేళ్ళమధ్య జపమాల వేగంగా కదిలింది.

“నీకేం భయం లేదు! నువ్వు పారిపోతే, మాంత్రికుడు నిన్ను వెతుక్కుంటూ రాలేడు. ఇంతలో రాముడు ఇక్కడికి వచ్చేస్తేనో, అని అతడి భయం. నువ్వు చూడ్డం లేదూ, ఏ చిన్న అలికిడైనా రాముడు, రాముడు, అంటూ లేచి నుంచుంటున్నాడు.”

జపమాల ఆగిపోయింది.

ప్రయాణానికి సిద్ధం కమ్మని, రాజకుమారి ఒక సంచి ఇచ్చింది. ఆ సంచిలో ఉన్నది చూసి, సదాజపుని కళ్ళు మెరిశాయి.

అర్థరాత్రి. అదును కుదిరిన రాత్రి.

మాంత్రికుడు ఆదమరవక పోయినా, నిద్రలో ఉన్నాడు. దీపం వెలుగులో అతడి మొహం, దానికింద మెడ అస్పష్టంగా కనిపిస్తున్నాయి.

రాజకుమారి ఊపిరి పీల్చుకుంది. ఒక్క వేటు ఆ మెడపై – ఊహించుకుంది. బలాన్నంతా కూడదీసుకొని అప్పటి వరకూ చూస్తున్న మెడపై వేటు వేసింది, జరగబోయే ఘోరాన్ని చూడలేక కళ్ళు మూసుకుంటూ.

మాంత్రికుడు పెద్దగా అరుస్తూ లేచి కూర్చున్నాడు. చేతిలోని కత్తిని అక్కడే పడేసి రాజకుమారి పారిపోయింది.

నెత్తురోడుతూ సగం తెగి వేలాడుతున్న చేతిని భుజానికి ఒత్తి పట్టుకొని “సదాజపా! ఓరీ సదాజపా!” అని బిగ్గరగా అరిచాడు.

ఎంత అరిచినా సదాజపుడు రాలేదు.

“సాహసం సేస్తివి కదే, డింభకీ? అయినా తిరిగి వస్తివే? పలుకు రాజకుమారీ, పలుకు.”

“ఇంకెక్కడి రాజకుమారి? రాజ్యంలేని రాజకుమారి…” గొంతు పూడుకునిపోయి ఆపైన మాట్లాడలేకపోయింది. మాంత్రికుడు ఆమె దగ్గరకు వెళ్ళి, ఏమయ్యిందో చెప్పమన్నాడు.

“అమ్మ, నాన్న, ఉజ్జయిని. ఎవరూ లేరు. ఏమీ మిగల్లేదు.”

ఆమె కన్నీళ్ళు అతడి మెడలోని కపాళికల మీద నుండి జారిపడ్డాయి. మాంత్రికుడు ఆమె తల నిమిరాడు. సానుభూతికి కన్నీళ్ళు వరదలయ్యాయి. ఆ ఉధృతి తట్టుకోడానికి అతడి ఎడమ భుజంపై తలానించింది. డొల్లగా అనిపించి ఆమె ఆదుర్దాగా ఆ భుజాన్ని కప్పిన పులితోలు తొలగించింది. పురులు తెగిన తాడులా వేలాడుతున్న ఆ చేతిని చూడలేక, గావుకేక పెట్టి కళ్ళు మూసుకుంది.

“నీ నజరానా, ఢింభకీ!” అన్నాడు మాంత్రికుడు సన్నగా నవ్వుతూ.

“నా పాపమే! సదాజపునితో పాటు సంజీవని… నా పాపమే!” అతడి చేతిని కళ్ళకి అద్దుకుంటూ చెప్పింది.

మాంత్రికుడు విసురుగా లేచి నుంచున్నాడు. ఆ తాకిడికి రాజకుమారి నేల మీద పడిపోయింది. ఆమె అతడి చేయిని పట్టుకుంది.

“రామూ వచ్చి నిన్ను చంపినా, మళ్ళీ బతికిపోతావన్న భయంలో…”

మాంత్రికుడు చేతిని వదిలించుకోబోయాడు. ఆమె ఇంకా బలంగా పట్టుకుంది.

“నన్ను కనికరించి క్షమించు. ఇలా వదిలి వెళ్ళకు. ఎక్కడా ఎవరూ లేరు!”

మొండిగా చేయి విదిలించుకొని వెళ్ళబోతున్న మాంత్రికుడు, ఆ మాటలకు ఆగాడు. చుట్టూ చూశాడు. కొండలు, కోనలు, కోటలు, ఏవీ లేవు. వాళ్ళిద్దరు తప్ప మరో ప్రాణి ఉనికి కూడా లేదు. రాజకుమారి ఏడుపు తప్ప మరో శబ్దం లేదు.

తప్పుకోడానికి, తప్పించుకోడానికి మార్గం లేదు.

మాంత్రికుడు, రాకుమారి ఎడమొహం పెడమొహంగా కూర్చుండిపోయారు.

అంతా నిశ్చలంగా ఉంది. గాలి కూడా కదలటం లేదు. ఉలుకూ పలుకూ లేకుండా మాంత్రికుడు తదేకంగా దూరానికేసి చూస్తూ ఉన్నాడు. రాజకుమారి దగ్గరలో కూర్చుని అతనినే గమనిస్తోంది.

“జెయ్‍య్‍ పాతాళ భైరవి!”

“నరుడా… ఏమి నీ కోరిక?”

“ఈ జిగిడి ప్రేమించిన తోటరాముణ్ణి ఎక్కడున్నా నవరాళ్ళు కట్టి ఇక్కడ తెచ్చి పడవెయ్.”

“రామూ, రామూ!” అంటూ తోటరాముణ్ణి చేరుకోవడానికి ఆమె పరిగెత్తింది. పరిచారికలు ఆమెను పట్టుకుని వెనక్కి లాగబోయారు.

“ఇందూ, నేను వచ్చేశాను.” అంటూ అతడు తనని బందీగా పట్టుకున్నవాళ్ళని వదిలించుకున్నాడు.

ఒకరినొకరు చేరుకున్నారు. కౌగిలించుకున్నారు.కన్నీళ్ళై కరిగారు.

మాంత్రికుడు రుసరుసలాడుతూ వచ్చి వాళ్ళిద్దర్ని విడగొట్టాడు.

“ఆ పశువును పట్టుకొని చెరసాలలో వేయండి. రేపటి బలికి సిద్ధం శాయండి.”

“వద్దూ…! కావాలంటే, నన్ను చంపు. రామూని ఏం చేయొద్దు!”

“అదెట్లాగే బుల్‌బుల్! నువ్వు నా గుండెవే. నువ్వు బతికే ఉండాలే!” పైకి వినిపించేట్టు అన్నాడు.

“అందుకే నేనుండిపోయాను.” అంది.

అతడు అదే మాట మళ్ళీ అన్నాడు. ఆమె అతడి భుజాలను కుదుపుతూ, అతని ముఖంలోకి ముఖం పెట్టి తనన్నదే మళ్ళీ చెప్పింది.

మాంత్రికుడు రాజకుమారిని దూరంగా నెట్టేశాడు. లేచి పక్కకు వెళ్ళి, ముఖం తిప్పుకున్నాడు.

“ఇప్పటివరకూ ఒలకబోసిన వలపంతా ఏమయ్యింది?” ఆమె గొంతు హెచ్చింది.

“…”

“అప్పుడే మోహం. అప్పుడే పెడమొహం. తమాషా అనుకుంటున్నావా?” ఆమె గొంతు మరింత హెచ్చింది.

మాంత్రికుడు వెనక్కి తిరిగాడు. ఆమె దగ్గరకు వచ్చి కూర్చున్నాడు.

“మోహం నీపైన కాదే, డింభకీ! నా మోహం, నా అంతం. తోటరాముడు లేని కథలో, నీపై మోహం నా మరణానికి దారి తీయదే!”

“బాగుంది. నీకు అనుకూలమైతే నన్ను ప్రేమిస్తావు. లేకుంటే లేదు. అంతేనా?”

మాంత్రికుడు నేలచూపులు చూశాడు.

“అయినా, ఎందుకలా చావుకోసం పరితపిస్తావెప్పుడూ? నువ్వు పోతే నాకు తప్ప ఎవరికీ తేడా తెలీదు. నీ చావు ఎవరినీ ఊరడించలేదు. ఎవరికీ చేరని కథ ఇది. నీ చావు చూసి, ఎవరైనా చప్పట్లు చరుస్తారనుకోడానికి.”

అతడు లేచి నుంచున్నాడు.

“కథలంటే కల్లబొల్లి కూతలు కావే! ప్రతినాయకుడు హతమవ్వాలె. నాయకీ నాయకులు ఒకటవ్వాలె. అదే మరియాదే.”

“నేననేదీ అదే. పోవాల్సినవారు అందరూ పోయారు. ఒకటవ్వాల్సిన వాళ్లమే మిగిలామని. ఇదీ మర్యాదే కదా.”

“నను గడిబిడి శాయకే ఢింభకీ! నిను వరించడం కల్ల.” అంటూ వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.

గంట వినిపించని గడియారంలా మాంత్రికుడి చేయి ఊగుతూనే ఉంది.

“సంజీవనే ఉండుంటే…”

“కీలకం అది కాదే, కీలకం తోటరాముడు.” ప్రతిని ఇంకా సరి చేస్తూన్నాడు మాంత్రికుడు.

“ఈ ప్రకటన చూసి వచ్చినవాడూ నన్ను ప్రేమించకపోతే…?”

మాంత్రికుడు ప్రతి సరిజేయడం ఆపి, ఆమె వైపు చూశాడు. మళ్ళీ ప్రకటన వైపు చూశాడు. ఆలోచనలో పడ్డాడు.

“అవునూ. సంజీవని లేకపోయినా, నీ గడ్డముందిగా ఇంకా?”

అతడు తన గడ్డాన్ని సరిజేసుకున్నాడు.

“నీ శక్తులన్నీ అందులోనే ఉన్నాయి గదా? ఏదీ, ఏవి పనిచేస్తున్నాయో ఒకసారి చూద్దాం.”

“ఏమి శాయవలె, ఢింభకీ?”

“మామూమీమే… మేమైమామే… మాంత్రికుడి మనసు నా వైపు మరల్చు.”

“ఆఁయ్…” అంటూ మాంత్రికుడు ఆ కోరికను కొట్టిపారేశాడు.

“సరే. సరే. కూకంకాకీ… కేకంకూకీ… తోటరాముడికి నాపై ప్రేమ పుట్టించు.”

మాంత్రికుడు మంత్రం పలుకలేదు.

“గాగీగూగే… మోటాటీటూ… నాకో రవ్వల గాజుల జత కావాలి.”

వెంటనే ఆమె చేతికి గాజులు వచ్చేశాయి.

“చూశావా? ఈ కథకు కీలకం తోటరాముడి ధైర్యసాహసాలు కాదు. నీ మంత్రశక్తులు కాదు. దేవి మహిమలు కాదు. ఈ కథకు కీలకం రాముడు నన్ను ప్రేమించడం. అది జరగలేదు. ఈ కథ సాగలేదు. ఎన్నాళ్ళైనా ఇంతే.”

మాంత్రికుడు మళ్ళీ ప్రకటన రాసున్న ప్రతిని చేతిలోకి తీసుకున్నాడు. రాజకుమారి విసురుగా వెళ్ళి, మాంత్రికుని చేతిలోంచి దాన్ని లాక్కుంది. దాని వెనుక ఇలా రాసింది.

ప్రతినాయకుడు కావలెను.

జగత్ప్రసిద్ధి గాంచిన పాతాళ భైరవి కథకుగాను అర్హుడైన, యోగ్యుడైన ప్రతినాయకుడు కావలెను. అపూర్వ మంత్రశక్తికి అధిపతియై, హడలుపుట్టించగల రూపంతో ఉండాలి. కుయుక్తి, కుతంత్రం, పంతం, ప్రతీకారం సహజగుణాలై ఉండాలి. కరుణ, కనికరం మచ్చుకైనా ఉండకూడదు. పాతాళ భైరవిని వశం చేసుకోగల మంత్రశక్తులు, ప్రాణం పోసే సంజీవని వంటి మూలికలు మాత్రమే కాక, మనిషిలో ప్రేమను పుట్టించగలిగే మంత్రతంత్రయంత్రాలన్నీ తప్పనిసరిగా తెల్సుండాలి. విన్నవారికి, చదివినవారికి సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలు అందించే కథలకే కాక, ఎటూ సాగని, ఎవరినీ చేరని కథలను నడిపించగలగాలి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించగలరు.

“రాముడొస్తాడే, ఢింభకీ! తోటరాముడొస్తాడు!” అన్నాడు మాంత్రికుడు, అక్కడే తచ్చాడుతూ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s