(భూమిక సంస్థ వారు రెండు రోజుల పాటు లింగం-లైంగికత: సాహిత్యం, సంభాషణ అనే వర్క్‌షాపుని నిర్వహించారు, జూలై 10-11న. పాతికమంది పైగా LGBTQIA+ కమ్యూనిటీ వారు, పది-పదిహేను మంది ఇతరులు (for once! 🙂 ) ఇందులో పాల్గొన్నారు. పి.సత్యవతి, వసుధేంద్ర, వి.ప్రతిమ లాంటి దిగ్గజాలు తమ అనుభవాలని పంచుకున్నారు. లైంగికత మీద, సాహిత్యం గురించి దాదాపుగా సమానంగా చర్చ జరిగింది. అందులో నాకు పాల్గునే అవకాశాన్ని ఇచ్చిన అపర్ణ తోటకి అనేకానేక ధన్యవాదాలు. ఆ కార్యశాలలో పాల్గొన్నప్పుడు ఆ తర్వాతా నాకు కలిగిన ఆలోచనలని ఇక్కడ దాచుకుంటున్నాను.)
నేను LGBTQIA+ నేపథ్యంగా కథ ఎప్పుడూ ప్రయత్నించలేదు. ప్రయత్నించాలని అనుకున్న సందర్భాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా బెంగళూరులో ఈ కమ్యూనిటి వారు నిర్వహించే కార్యక్రమాలు, వారిని ఆధారంగా చేసుకొని వచ్చిన నాటకప్రదర్శనలు, వారిని అర్థం చేసుకోడానికి నాకు దోహదపడ్డాయి. కాకపోతే ఈ సబ్జెక్టుని తీసుకొని కథ రాయాలంటే చాలా “మానసిక పెట్టుబడి” (మెంటల్ ఇన్వెస్ట్మెంట్) అవసరం. ప్రస్తుతం నా సొంత మానసిక సమస్యలతో సతమతమవుతున్నప్పుడు ఇలాంటి కథాంశం ఎన్నుకుని దానికి న్యాయం చేయగలనని నాకు అనిపించలేదు. “ఆరెక్స్ మారేజ్” లో ఆ అమ్మాయి చుట్టూ జరుగుతున్న ప్రైడ్ పరేడ్స్ గుర్తుచేసుకుంటూ తన sexualityని వెతుక్కుందని రాశనని ఈ వర్క్‌షాపు తర్వాతే స్ఫురించింది. (అది రాసేటప్పుడు పనిగట్టుకొని దాని ప్రస్తావనను తీసుకురాలేదు. She’s desperately looking around for some inspiration and finds it in these movements. అదేదో గొప్ప విషయం అని కాదు, నాకు బల్బు ఇప్పుడే వెలిగింది అని అంటున్నా.)
భాష – సంస్కృతి – చరిత్ర
భాష గురించి బాగానే చర్చ జరిగింది. మనకి పదసంపద లేదని, queer భావవ్యక్తీకరణకు అది సరిపోదని అందరూ అనుకున్నారు. అయితే తెలుగులో వచ్చిన చిక్కేంటంటే పదాలు అసలు ఎప్పుడూ లేవా, ఉన్నవి పోగొట్టుకున్నామా? అన్నది తెల్సుకోవడం చాలా కష్టం. ఉన్నా లేకపోయినా, కొత్తవి కనిపెట్టుకోవాలి. కొత్త పదాలు పుట్టాలి. ఒకరు homo, cis etc లాంటి ఇంగ్లీషు పదాల etymological గా చూస్తే కెమిస్ట్రీ నుండి వచ్చాయన్నారు. అలా తెలుగులో కూడా ఏవైనా సృష్టించాలి.
అయితే ఈ చర్చ వల్ల నాకు కలిగిన ఒక ఆలోచన, ఈ కమ్యూనిటిని mainstreamలో తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా వీళ్ళ ప్రస్తుత కథలు, గాథలు మాత్రమే కాకుండా వీళ్ళ చరిత్రనూ అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. చరిత్రంతా మగమహారాజుల గొడవే కాబట్టీ మనకి సరుకు చాలా తక్కువ దొరకచ్చు, కానీ దాన్నే పట్టుకోవాలి. ఇది రెండు విధాలుగా చేయొచ్చు:
౧. పురాణ కావ్యాలు, గ్రంధాలు, రచనలలో వీరి ప్రస్తావన ఎలా ఉంది, ఏమని రాశారు? (ఇది తప్పకుండా నిరాశపరుస్తుంది. Stigma, వివక్ష అప్పుడూ ఉండుంటాయి. ఆడవాళ్ళ గురించీ ఏవేవో పేలారు. “ఇలా రాయాలి/చూడాలి” అనే తోవకి చెందకపోయినా, “ఇలా రాయకూడదు/చూడకూడదు” అని చెప్పడానికి ఇవి పనికి రావచ్చు.)
౨. oral history & folk historyలో ఎలా ప్రస్తావించారు? ఏమని రాశారు? అప్పటి సామాజిక స్థితిగతుల్లో వీళ్ళ పాత్ర ఎలాంటిది? (ఇది కొంచెం ఉత్సాహాన్ని ఇస్తుందని నా ఊహ. బ్రిటిష్ వారు రానంత వరకూ అయినా వీరికి కొంత ఆదరణ, గౌరవం ఉన్నాయని నాకు అనిపిస్తుంది. వసుధేంద్రగారి కొత్త నవల “తేజో తుంగభద్ర”లో విజయనగరానికి చెందిన హిజ్రా కథ ఒకటుంటుంది. అప్పట్లో కూడా, వారికి (అతడు/ఆమె ఎమనాలో తెలీక)బలవంతుపు పెళ్ళై, భార్య విషయం తెల్సుకున్నాక వేరొకరినితో వెళ్ళిపోతుంది. వారు రాణిగారి అంతఃపురంలో పనిచేసి, కొంచెం వయసయ్యాక ఒక దేవదాసికి తోడుగా ఒక ఊరిలో ఉంటాడు. ఎప్పటికో భార్యను మళ్ళీ కలిసిన సందర్భాన్ని వసుధేంద్ర హృద్యంగా రాసుకొచ్చారు.)
స్త్రీలు పాడుకునే పాటలు, స్త్రీల రామాయణం లాంటి వాటిపైన రిసెర్చులు జరిగాయి. అలానే ఈ కమ్యూనిటికి సంబంధించిన చరిత్ర, ముఖ్యంగా తెలుగు దేశాల్లో జరిగింది సేకరిస్తే ఉపయోగకరం. అయితే చాలా వ్యయప్రయాసలతో కూడుకున్న పని.
రచన – సాధన – శోధన
“మీకు తెలిసిందే మీరు రాయండి” అన్నది ఇంగ్లీషు రైటింగులో కూడా ఊదరగొట్టేదే. తెలుగులో అది ఇంకాస్త ఎక్కువ వినిపిస్తుంది. తెలుగు రచనలను, రచయితలను వేర్వేరుగా చూసే ఆస్కారం తక్కువ. రచయిత గుర్తింపు, వ్యక్తిత్వానికి కొనసాగింపుగా (extension) రచనలని చూస్తారు. దీనితో నాకు కొన్ని పేచీలున్నాయి, కొందరి స్నేహితులతో వాదనలూ జరిగాయి. వాటి వివరాల్లోకి ఇప్పుడు వెళ్ళలేను గానీ, క్లుప్తంగా:
- ఎవరైనా, ఎవరి కథనైనా చెప్పగలరని నా నమ్మకం. దానికి ఐడెంటిటితో సంబంధం లేదు. రాయడానికి కావాల్సినది పరిశోధన, సహానుభూతి. ఇవి లేకుండా రాయడం తప్పు, దాన్ని నేనూ ఒప్పుకోను. కానీ దళితుల కథలు దళితులే రాయాలి, గే కథలు గేలు మాత్రమే రాయాలంటే మాత్రం నేనొప్పుకోలేను.
- ఎవరి కథలు వాళ్ళే బాగా చెప్పగల్గుతారు అన్న అభిప్రాయం కూడా ఒకటి బలంగా వినిపించింది. మన కథ మనం చెప్పుకోవడం అన్నది చాలా కష్టమైన పని, నా అనుభవం ప్రకారం. “నువ్వెందుకు ఫిక్షన్ రాస్తావు?” అంటే నా సమాధానం, “నా కథ నేను చెప్పుకునే నేర్పు, ధైర్యం నాకు లేవు. అందుకే ఫిక్షన్ వెనుక దాక్కోవడం” అని అంటాను. (కథ చెప్పడానికి సబ్జెక్టు నుండి కొంచెం దూరం (distance)గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎలా అంటే, ఒక ఆపిల్ ను చూసి ఆపిల్ బొమ్మ గీయాలంటే/ ఫోటో తీయాలంటే అది మరీ దూరంగా ఉండకూడదు, మరీ మొహం మీద ఉండకూడదు. దానిపై పడుతున్న వెలుగునీడలు అనుకూలంగా ఉండాలి. అప్పుడే బొమ్మ బాగొస్తుంది. కథ రాయడం కూడా అంతే! మనం మన జీవితాల్లో ఎంతగా చిక్కుకుపోయి, ఉక్కిరిబిక్కిరైపోతామంటే క్లారిటి రావడం కష్టం. అందరికీ వాళ్ల కథలు చెప్పుకోవడం అంత తేలిక కాదు. ముందు మన జీవితాల్లో జరుగుతుంది మనకే అర్థమై చావదు. దాన్ని ఇంకొంకరికి ఎలా చెప్పడం? కనీసం, నాకీ సమస్యలన్నీ ఉన్నాయి. )
సరే, ఆ అభిప్రాయభేదాలు పక్కకు పెడితే, ఎవరి కథలు ఎవరు రాసినా, రాయాలనుకున్నా దానికి బోలెడు సాధన కావాలి. “I’m writer made out of internet” కాబట్టి ఈ కమ్యూనిటి వారిలో కొత్తగా రచనలు చేయాలనుకుంటున్నవారికి కొన్ని సూచనలు.
- రాయడమంటే ఒక form of self expression. భావవ్యక్తీకరణ. పుస్తకాలు-అచ్చులు-సన్మానాలు-శాలువాలు అన్నీ ఎప్పటికో వస్తాయి. అసలు రాకపోనూ వచ్చు. కానీ చెప్పాలనుకున్నది కాగితం మీద అర్థవంతంగా పెట్టగలిగినప్పటి సంతోషాన్ని ఇంకేదీ ఇవ్వలేదు. రచనా వ్యాసంగాన్ని అలా చూడ్డం వల్ల మన మీద బరువుబాధ్యతలు కూడా తగ్గుతాయి. (నన్ను నేను రైటర్ అనుకోడానికి పదేళ్ళు పైగా పట్టింది, ఆ బాధ్యతను ఒప్పుకోడానికి.) Travel light, when you can. “Don’t be a writer. Be writing” అన్నది నాకు మార్గదర్శి.
- Self expression కి self loveకి చాలా దగ్గర సంబంధం ఉంది. సమాజం మనకి మన గురించి చెప్పడానికి ప్రయత్నిస్తుంది: “మార్కులు తెచ్చుకోకపోతే నాశనమైపోతావ్!”, “ఇంకో ఆడదాన్ని ప్రేమిస్తున్నావా? నీదీ ఒక జన్మేనా?” లాంటివెన్నో అంటూ పోతుంది. మనం వింటూ వింటూ ఉండటం వల్ల, అవి ఎంత అసమంజసమైనా, వారిలో ఒకరం కాలేకపోతున్నందుకు బాధనీ, కోపాన్నీ మన మీదే చూపించుకుంటాం. సమాజం మనల్ని అనేవాటికన్నా మనమే ఇంకెంతో దారుణమైనవి అనుకుంటూ ఉంటాం. అలాంటి అవస్థలో రాయలేమా అంటే, రాయచ్చు – రాస్తాం కూడా! వాటిని అందరూ పొగడచ్చు కూడా! కానీ వాటిలో ఏదో వెలితి ఉంటుంది. మనం మనల్ని పూర్తిగా స్వీకరించినప్పటి నిండుదనం రాదు.
- కథలు రాయడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఫోటోగ్రాఫీ ఆసక్తి ఉన్నవారు మొదటిసారే అవార్డు గెల్చుకునే ఫోటోలు ఎలా తీయలేరో, అలా తీసే స్థాయికి వెళ్ళడానికి ఎన్ని వేల ఫోటోలు తీసుంటారో, అలానే రాసేవాళ్ళు కూడా ఎంతో సాధన చేస్తే తప్ప గొప్ప కథలు రాయలేరు. (విపరీతమైన టాలెంట్ ఉన్నవాళ్ళుంటారు. వాళ్ళు ఒకసారి రాశాక మళ్ళీ అచ్చుతప్పులు చూసుకునే అవసరం కూడా ఉండదు. కానీ అలాంటివారు 1% కూడా ఉండరు. మనం మానవమాత్రులం – అందుకే కష్టే ఫలి!)
- ఇంటర్నెట్టు మనకున్న గొప్ప వరం. రాయడానికి అంతకు మించిన గొప్ప అవకాశం ఉండదు. బ్లాగుల నుండి డిజిటల్ పబ్లిషింగ్ వరకూ అన్నీ చిటికెలలో పని. గొప్ప రచయితలు మనకి ఫేసుబుక్ ఫ్రెండ్స్ అయిపోతారు. మనం రాసిన కథ మన ఊహకి కూడా అందనంత దూరం వెళ్తుంది.
- బ్లాగుల్లో రాసుకోవడం ఉత్తమం. కవితలు, లేదా ఐదొందల పదాల వరకూ వస్తుందంటే వచనం ఫేస్‌బుక్ లో షేర్ చేసుకోవచ్చు. అలా తరుచుగా ఏదో ఒక విషయం (ఇవేవో గొప్ప విషయాలు కానవసరం లేదు. రోజూవారీ అనుభవాలైనా సరిపోతుంది.) గురించి పెడుతూ ఉంటే, మన చుట్టూ ఒక సాహిత్యపు సమూహం ఏర్పడుతుంది.
- ఈ సమావేశంలోనే పి.సత్యవతి గారు అన్న ఒకమాట అన్నారు: “సమాజమంటే గాలిలో ఉన్న గడుసు దెయ్యం” అని. ఇంటర్నెట్టులో ఈ గడుసు దెయ్యం మరీ పేట్రేగిపోతుంది. నిజజీవితంలో అయితే ముగ్గులోకి దింపటమో, బాటిలులో బంధించటమో, వదిలేదాకా కొట్టడమో చేస్తారు. ఆన్‌లైన్ లో మాత్రం ఏమన్నా ఎవరికీ దొరకం అనే అవగాహన లేని ధీమా కొందరిది. వీరికి పెద్ద భయపడనవసరం లేదు. ఒక “బ్లాక్”తో పోతారు వీళ్ళంతా!
- వారానికో, రోజుకో ఇంత సమయమనుకుని అందులో రాయడం తప్ప వేరే పనేం పెట్టుకోకపోవడం ఉత్తమం. అనేకమంది నిపుణులు, చేయితిరిగిన రచయితలు నిద్ర లేచీ లేవంగానే రాయడం ఉత్తమం అంటారు. (నేను లేచీ లేవగానే పడుకుంటాను కాబట్టి నాకు కుదరదు. :P)
- ఇలా ఒక ప్రత్యేకమైన టైము పెట్టుకోవడం మాత్రం చాలా ముఖ్యం. లేకపోతే రోజూవారీ జీవితంలో మనం కొట్టుకుపోతూనే ఉంటాం, రాయడం వెనుకబడిపోతూనే ఉంటుంది. అయితే వర్జినీయా వూల్ఫ్ రాసిన అద్భుతమైన వ్యాసం, A room of one’s ownలో ఆడవారికి ఈ తీరిక దొరకడం గురించి వివరంగా రాస్తుంది. అలాంటిదొకటి queer కమ్యూనిటి సంబంధించింది వస్తే రచనా వ్యాసంగం కొనసాగించడానికి వాళ్ళకి అడ్డుపడే అవరోధాలు తెలిసొస్తాయి.
- చివరిగా, రాయాలంటే చదవాలి. ఎంత ఎక్కువ చదివితే అంత బా రాయగలం. చదవడమంటే సాహిత్యాన్ని మాత్రమే కాదు. మనుషులని, మనసులని, కట్టుబాట్లని, సమజాన్ని – అందరిని, అన్నింటిని. అప్పుడే బాగా రాయగలం.
మానసిక ఆరోగ్యం – సాహిత్యం
మన దగ్గర మానసిక ఆరోగ్యం గురించి అవగాహన చాలా తక్కువ! అనేక కారణాల వల్ల మన అందరం మానసికంగా అనేక సవాళ్ళని ఎదుర్కొంటున్నాము. ప్రాధమిక చికిత్స, రోజూవారి ఆరోగ్యపు అలవాట్లు మనకి చెబుతారు చిన్నప్పటి నుండి. కానీ మానసిక ఆరోగ్యం, ఏమోషనల్ హెల్త్ గురించి ఎవరూ చెప్పరు ఎప్పుడూ! నిరాకరణ, వేరుగా చూడ్డం, మనల్ని కాదనుకోవడం, సూటిపోటి మాటలు అనడం ఇవ్వన్నీ మనసుకి తగిలే గాయాలే కదా? చిన్న గాయమై కాస్త రక్తమొస్తే “అమ్మో! అమ్మో!” అంటాం గానీ, వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, వ్యవస్థపరంగా రోజూ ఇన్నేసి మానసికమైన గాయాలు తగులుతుంటే, హింసలకి గురైవుతుంటే మనం “బాగా” ఎలా ఉండగలం? ఇది అందరికీ వర్తిస్తుంది, కానీ ఈ కమ్యూనిటి వాళ్ళకి ఎక్కువగా కావాలీ సపోర్టు. (ఈ అంశానికి సంబంధించిన రచనలు, కొన్ని సూచనలు ఇంకో సారి పంచుకుంటాను. ఇవ్వన్నీ ఇంగ్లీషులో ఉంటాయి. మనం తెలుగులో ఈ కంటెంటుని తెచ్చుకోవాలి.)
సాహిత్యం ఈ మానసికమైన దెబ్బలకి మందూ అవ్వగలదు, దాన్నింకా విషమమూ చేయవచ్చు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. సాహిత్యమంటే చదవడమూ, రాయడమూ రెండూ అని నా ఉద్దేశ్యం. (2015లో నాకు డిప్రషన్ ఉందని తేలినప్పుడు, ఒక రెండు సంవత్సరాలు పుస్తకాలు చదవడం మానేశాను పూర్తిగా. ఆ వివరాలన్నీ మళ్ళీ ఎప్పుడో రాస్తాను గానీ, అప్పుడు డాక్టర్లతో, థెరపిస్టులతో చర్చించాక తేలింది ఏటంటే నేను చదువుతున్న సాహిత్యం నాకు కావాల్సిన ఊతం అందించటం అటుంచి ఇంకా పాతాళంలోకి తోసేస్తుందని. అందుకే పక్కకు పెట్టాల్సి వచ్చింది.)
రాయడం వల్లా, చదవడం వల్లా పాత గాయాలు రేగే అవకాశాలూ అధికంగా ఉంటాయి. అందుకే పైన self-love ప్రస్తావన తీసుకొచ్చింది. ఏ పనైనా మనకి ఆ సమయంలో మంచి చేస్తుంటేనే చేయాలి. మనల్ని మనం బలవతం పెట్టుకోకూడదు. గతాన్ని తవ్వే క్రమంలో ఎంతో కొంత బాధ ఉంటుంది గానీ, దాన్ని మన శరీరం, మనసూ ఆ సమయంలో తట్టుకునే పరిస్థితుల్లో ఉన్నాయా అన్నది మనం నిజాయితీగా నిర్థారించుకోవాలి.
కాగితం మీద మనకి అనిపిస్తున్నది పెట్టగానే పెద్ద భారం దిగిపోయినట్టు అనిపించడం కూడా బోలెడు సార్లు జరుగుతుంది. మన కోసమే మనకన్నా ముందు పుట్టేసి, జీవితాన్ని కాచివడపోసి మనకి అందిస్తున్నారు అనిపిస్తుంది చాలా సార్లు పుస్తకాలు చదువుతుంటే. మనకి అప్పటి వరకూ అంతుచిక్కనవి కూడా కొన్ని అర్థమవ్వటం మొదలవుతాయి. కానీ చదువుతున్నప్పుడు, రాస్తున్నప్పుడు అవి మనపైన చూబుతున్న ప్రభావాన్ని మనం ఒక కంట కనిపెడుతూ ఉండడం మంచిది.
కొన్ని సూచనలూ, సలహాలు
ఇట్లాంటివి తలకెత్తుకొని, అందరిని పోగేసి, ప్రణాళిక వేసి నిర్వహించడమనేది చేతులెత్తి దణ్ణం పెట్టాల్సిన విషయం. ముఖ్యంగా తెలుగులో అణాపైసా తీసుకోకుండా ఇవ్వన్నీ చేస్తుంటారు. ఇంగ్లీషులో అయితే డబ్బులు కట్టామన్న అధికారంతో ఫీడ్‌బాక్ ఇచ్చేయొచ్చు. ఇక్కడ మొహమాటం అడ్డొస్తుంది. అయినా కూడా కొన్ని సూచనలూ, సలహాలు. ఎటూ ఇంత శ్రమ తీసుకొని చేసేటప్పుడు ఇంకొన్ని సరిజూసుకుంటే శ్రమకి రెట్టించిన ఫలితం లభిస్తుంది.
-
-
- రైటింగ్‌కి సంబంధించిన వర్క్‌షాపు అంటే ఖచ్చితంగా పాల్గునేవాళ్ళు అప్పటికప్పుడో, లేక మరో విడత సెషన్‌కి కల్సుకునేటప్పటికి రాసేలా (అది వంద పదాలే అవ్వొచ్చు, లేక రెండు మూడు వాక్యాలే అవ్వచ్చు) exercises ఉండాలి. లేకపోతే దాన్ని వర్క్‌షాపని అనలేం. థియరీ మాత్రమే ఉంటుంది. (తెలుగులో ఎప్పుడూ ఇలానే జరుగుతాయా అన్నది నాకు తెలీదు. కానీ నేను ఎక్కువ విన్నది, హాజరైన రెండూ ఇలానే ఉన్నాయి). అక్కడికీ అరిపరాల ప్రశ్నలు అడుగుతూ ఆసక్తికరమైన ఉదాహరణలు ఇచ్చారు. అలాంటివి ఎక్కువగా ఉండాలి.
- LGBTQIA+ కమ్యూనిటీ గురించి కొన్ని వివరాలు మొదట్లోనో, లేక ప్రీ-రీడింగ్‌గా ఇచ్చుంటే బాగుండేది. నేను కొంచెం చదువుకొని వెళ్ళాను గానీ అందరూ మాట్లాడుతుంటే అన్ని నిర్వచనాలు కలగాపులగం అయిపోయాయి బుర్రలో. 😦
- నాకు ఒక నవతరంగంలా, ఒక పుస్తకం.నెట్ లా ఒక LGBTQIA+ ప్రత్యేకమైన వెబ్ మాగజైన్ అవసరం కూడా బాగా కనిపిస్తుంది. 🙂 ఈ కమ్యూనిటికి చెందిన అన్ని విషయాలూ (కథలు, కవితలే కాకుండా) మిగితా కంటెంట్, సమావేశ వివరాలు, మానసిక ఆరోగ్యం గురించి, ఇతరత్రా పంచుకునే వీలుగా. దానికి అందరూ తలా ఓ చేయి వేసేలాగా. This will be useful in educating the larger community too. ఐడియా మరీ కొట్టిపారేయనక్కర్లేదు అని అనిపిస్తే, దీని గురించి ఇంకా brainstorm చేద్దాం.
-