బాక్ వాటర్స్

Posted by

(ఈ కథ “ఇన్ ది మూడ్ ఫర్ లవ్” అనే కథా సంకలనంలో మొదటిసారిగా ప్రచురితమైంది, 2018లో)

“ఉష. ఇంజనీరింగ్ క్లాస్‌మేట్.”


టెంపోకి మళ్ళీ బ్రేక్ పడింది. అర్థరాత్రి కావస్తున్నా బెంగళూరుకి మాత్రమే అలవాటైన ట్రాఫిక్. డ్రైవర్ కాబిన్ దగ్గర నుంచొన్న వాళ్ళిద్దరూ ముందుకు తూలబోయారు. ముందు సీటులో ఉన్నవారు చేతులు అడ్డుపెట్టుకున్నారు. ఆమె బాలెన్స్ ఆపుకుంటూ అతడి చేయి పట్టుకుంది.


“మొండిది. పట్టుకుంటే వదలదు.” ఇరవై మంది దాకా ఉన్న ఆ టెంపోలో వాళ్ళకి చెప్పాడు శరత్. పట్టుకున్న చేయి ఠక్కున ఆమె వదిలేసింది.


ఇప్పుడామె వంతు. మూడు విషయాలు చెప్పాలి: అ) అతడి పేరు, ఆ) వారి బంధం ఇ) అతడు తనలో మార్చుకోవాల్సిన ఒక్క విషయమేటని తాను అనుకుంటుంది. వంతులు వారిగా, ఇద్దరేసి చొప్పున, టెంపోలో ప్రయాణం చేస్తున్న మిగిలినవారంతా చెప్పేశారు. స్నేహితులు, ప్రేమికులు, కలిసి పనిచేస్తున్నవారు, ఒకటే కుటుంబానికి
చెందినవారు, ఇంతకు ముందు కలిసి చేసిన ట్రెక్కుల్లో పరిచయమైనవారు ఉన్నారు ఆ గుంపులో.


“శరత్. చెప్పాడుగా, ఇంజినీరింగ్ కలిసి చదివాం.” అంటూ వచ్చేయబోయింది.
ట్రెక్ లీడర్లు ఒప్పుకోలేదు. “ఇంజనీరింగ్ అంటే నాలుగేళ్ళు! మస్ట్ బి డీప్ ఫ్రెండ్‌షిప్. చెప్పాలి.”

“షిక్వా అప్నోన్ సె కీ జాతీ హై!” అని వచ్చి సీటులో కూర్చుంది. అతడు వచ్చి పక్కనే కూర్చున్నాడు. అటువైపు సీటులో ఉన్న అన్వర్ ని చూసింది, కొరకొరా. మొబైల్ తెరిచి, “యు విల్ పే ఫర్ థిస్!” అని మెసేజ్ చేసింది. బదులుగా ఒక నల్లకళ్ళద్దాల నవ్వు స్మైలీ వచ్చింది.

వాళ్ళ తర్వాత ఒక అమ్మాయి మిగిలింది. ఒక్కత్తే పరిచయం చేసుకుంది. ఆమెకి ఒంటరిగా ట్రెక్స్ చేయడం అలవాటంట!అలా పరిచయం చేసుకోవచ్చననుకుంటే, తను కూడా ఒక్కత్తే వచ్చానని చెప్పేది కదా?

 

“బేబీ, మనం ఒక్కళ్ళమే లవర్స్ అనుకుంట గ్రూప్‌లో…” అంటూ వయ్యారాలు పోయింది ముందు సీటులో ఉన్న అమ్మాయి. “ట్రీట్ అస్ స్పేషల్” అని లీడర్లతో అంది. “ఇది హనీమూన్ పాకేజ్ కాదు మేడం. ట్రెక్కింగ్ చేయాలి. రేపు
తెలుస్తుంది ఎవరు హీరోలో, ఎవరు జీరోలో!!” అన్నాడు ఒక ట్రెక్ లీడ్.


“ఆల్రైట్ ఫోక్స్! రేపు మనం శరావతి బాక్‌వాటర్స్ చూడబోతున్నాం. సుమారుగా ఆరేడు కిలోమీటర్లు నడుస్తాం. బోలెడన్ని వాటర్ గేమ్స్ ఆడతాం. ఇట్ విల్ బి ఫన్, వి ప్రామిస్. బట్ ఆన్ సమ్ కండిషన్స్” అంటూ అక్కడ చేయాల్సినవి, చేయకూడనివి చెప్పుకొచ్చారు. అడిగిన సందేహాలు తీర్చారు. వచ్చే రెండు రోజులు శరీరానికి అలవాటు తప్పిన పనులు చేస్తాము కాబట్టి, సుబ్బరంగా నిద్రపొమ్మని చెప్పి టెంపోలో లైట్లు తీసేశారు.

శరత్ ఎలానో ఎదుటి సీటుకింద కాళ్ళు ఇరికించి, తల ఒక పక్కకి వాల్చి కళ్ళు మూసుకున్నాడు. నిద్రొచ్చో? మెలకువగా ఉంటే మాట కదులుతుందనో? మనిషి అవసరానికి మించిన డిప్లమసీ పాటిస్తుంటాడు. అన్వర్ కన్నుకొట్టే స్మైలీ
పంపాడు – “యు విల్ థాంక్ మి ఫర్ థిస్!”. ఉష మొబైల్ తీసి స్పెషల్ కారెక్టర్స్ అన్నీ టైపు చేసి పంపింది, బొటనువేళ్ళల్లో కోపాన్నంతా నింపి.


టెంపోలో చీకటి. బయటా మసక వెలుతురు. పక్కనే శరత్. కష్టపడి అలవాటు మానుకున్న మాదకద్రవ్యం మళ్ళీ కళ్ళెదుట పడినట్టు, పరిచయమున్న అతడి వాసన నిలువనివ్వటం లేదు. అతడి మీద చేయి వేస్తే? దగ్గరగా జరిగి తల
వాల్చితే? ఏం చేస్తాడు? పక్కకు నెట్టేస్తే? పట్టుకుంటే? నెట్టక, పట్టుకోక, చేయి వేసిందని తెలుస్తున్నా, ఊరుకుంటే?


ఆమె కిటికి వైపుకి తల తిప్పింది. టెంపో సిటి దాటినట్టుంది. వేగమందుకుంది. గాలి కూడా వేస్తుంది. బెంగళూరుకి అలవాటులేని ఉక్క. ఎండాకాలంలో కూడా రోజుకి ఒకసారైనా పడాల్సిన వాన, ఇప్పుడు జూన్ వెళ్ళిపోతున్నా జాడలేదు.

“వర్స్ట్ సమ్మర్, మాన్!ఇది బెంగళూరు కాదసలు!” అని జనాలు ఆయాసపడుతున్నారు. చూస్తూ చూస్తూ పరిస్థితులు చేజారిపోవటమంటే ఏంటో ఉషకి బాగా తెల్సు. పరిస్థితులు చేజారిపోతున్నాయని తెలుస్తున్నా చూస్తూ ఉండిపోవడం కూడా తెల్సు. మనవాళ్ళ విషయంలో అయినా, మన సిటీల విషయంలో అయినా.


దూరపు ప్రయాణం, అందులోనూ రాత్రి పూట. అది తెచ్చే నిశ్శబ్దం, ఏకాంతం. పైగా పక్కనే అతడు. గతాన్ని మరోసారి తోడిపోయడానికి మనసుకి అనువైన సమయం.
అందుకు శరీరం మాత్రం సహకరించలేదు. రెండు వారాల బట్టీ విపరీతమైన పని ఆఫీసులో. దానికి తోడు బాక్‌పాక్ వేసుకొని చాలాసేపు నిలబడింది. టెంపో పదింటికల్లా సోని సిగ్నల్ కోరమంగలకి వస్తుందని చెప్పాడు అన్వర్. ఆమె తొమ్మిదన్నరకే వచ్చేసింది. మడివాల నుండి బయలుదేరిన టెంపో కోరమంగలకి రావడానికి గంటపైగా పట్టింది. నాలుగు కిలోమీటర్ల దూరం గూగుల్ మాప్స్ లో ఎర్ర జెర్రిపోతులా కనిపించింది. బంధాలకి కూడా కోఆర్డినేట్స్ ఉండి, వాటిని కొలవగలిగే ఆప్స్ ఉంటే, వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని, “యు ఆర్ ఆన్ యుర్ బెస్ట్ పాత్, డిస్పైట్ మోర్ దాన్ యూజ్యువల్ మెస్. యు విల్ రీచ్ యువర్ డెస్టినేషన్ ఇన్ ఫ్యూ లైఫ్‌టైమ్స్!” అని చెప్పేదేమో!


నడుస్తూ, నడుస్తూ ఉండగానే అమాంతంగా లాండ్‌స్కేప్ మారిపోయింది. పొలాలు, పాకలూ, గుట్టలూ, పుట్టలూ – మనిషి ఆధిపత్యాన్ని తెలిపే ఆనవాళ్ళన్నీ మాయమైపోయాయి. అనంతాకాశం, దాన్ని అద్దంలా ప్రతిబింబిస్తున్న నీటి
సమూహం, మంచి కలర్ కాంట్రాస్ట్ అన్నట్టు గట్టంతా ఇటుకరంగు ఎరుపులో ఒక పక్క. శ్రద్ధగా అలికినట్టు గట్టు మీద గాట్లు – కనుచూపుమేర. నీటి మధ్యలో మంచి ఎఫెక్ట్ ఇవ్వడానికనట్టు నిటారుగా మోడుబారిన చెట్లు, ఎండిన కొమ్మలతో. ఎప్పుడో విండోస్ వాల్‌పేపర్ల మీదో, పనిగట్టుకొని గూగుల్‌లో ఎక్సాటిక్ ప్లేసెస్ గురించి వెతికినప్పుడు
మాత్రమే కనిపించేలాంటి దృశ్యం.


మొబైళ్ళు, కెమరాలు పోటీపడ్డాయి; కళ్ళెదుట కనిపిస్తున్న దానిలో భాగమవ్వాలని, దాన్ని దాచుకోవాలని. కొలీగ్స్ అంతా కలిసొచ్చిన గాంగ్, ఉషకి కెమారా ఇచ్చి గ్రూప్ ఫోటో తియ్యమని అడిగారు. ఫ్రేమ్‌లో ఒక చెట్టు, నీరు, మట్టి అన్నీ వచ్చేలా సెట్ చేసుకుంది. కెమరా ఇచ్చేశాక కూడా ఆ చెట్టునే చూస్తుండిపోయింది. దానికి ఒక కొమ్మ మాత్రమే ఉంది. నీటిలో దాని నీడ తేలాడుతుంది. తల తిప్పకుండా కేవలం
కనుపాపలు మాత్రమే చెట్టునుండి తిప్పి ఇటువైపు చూస్తే శరత్ కనిపించాడు గట్టు మీద.

ఆమె అటూ-ఇటూ మార్చి మార్చి చూసింది. ఆ చెట్టుని. అతడిని.


అన్వర్ ఆమెనే చూస్తున్నాడని ఆమె చూసుకోలేదు. “జీ నహి భర్ రహా క్యా?” అని అడిగాడు, తనివి తీరటం లేదా?

“బార్ బార్ నసీబ్ హొనెవాలా నజారా తొ నహీ!” అంది ఆమె. అతడిని చూసి దాదాపు ఏడాది అవుతుంది మరి.

ఫోటోల హడావిడి అయ్యేసరికి అవతలి గట్టుకి తీసుకెళ్ళడానికి రెండు దోనెలు వచ్చాయి. మనిషి బరువుని బట్టి, వెంటున్న సామాను బట్టి నలుగురైదుగురిని ఒక్కదాంట్లో పంపడం మొదలెట్టారు. అన్వర్, అతడి కొలీగ్ ఉన్న దోనెలో
ఉష కూడా ఎక్కింది. శరత్ వెనక్కి ఉండిపోయాడు.


నీటి మధ్యలో ఆ చెట్టుకి దగ్గరగా వెళ్ళారు. దూరం నుండి చూసినప్పుడు, బాగుంటుంది కదా అని ఎవరో అక్కడ “ప్లేస్” చేసినట్టు అనిపించింది గానీ దగ్గర నుండి చూస్తే అర్థమయ్యింది. ఆ చెట్టు ఎప్పటినుండో ఉండేదని, అది అప్పుడు
ఇప్పుడు కూడా చెట్టేనని. బహుశా, శరావతి అనే నది మీద ఆనకట్ట కట్టకముందు నుండీ ఉందేమో? నది మీద ఆనకట్ట కట్టాక వెనక్కి తన్నిన నీరే “బాక్‌వాటర్స్” అయ్యాయని గ్రూప్ లీడర్ చెప్పాడు. కేరళలో సముద్రపు నీరు వెనక్కి
తన్నిన బాక్‌వాటర్స్ కి ఇక్కడకి ఎంత తేడా? అక్కడంతా బూడిదరంగులో నీళ్ళు, ఆకాశాం, మధ్యమధ్యలో ఏవో నీటి మొక్కలు. నిలిచిన నీటిలో జీవం మనలేదు. కానీ, ఇక్కడేమో కళ్ళనూ, మనసునూ ఉక్కిరిబిక్కిరి చేసే రంగులు.

ఆమెకి వెనక్కి తిరిగి ఒక్కసారి శరత్‌ను చూడాలనిపించింది. “కదలొద్దు. దోనెకి బాలెన్స్ ముఖ్యం” అని పడవవాడు వారించాడు.


అవే దోనెలు అటూ ఇటూ ట్రిప్పులేసి మొత్తానికి అందరిని ఒక గట్టుకి చేర్చాయి. శరత్ చివరి ట్రిప్పులో వచ్చాడు.


అతడితో పాటు నిన్న చివరిగా ఒక్కత్తే పరిచయం చేసుకున్న అమ్మాయి ఉంది. ఆమె దోనె దిగుతూ తడిగా ఉన్న మట్టిలో కాలు బెణికి జారిపడింది. శరత్, అన్వర్లతో సహా అందరూ వంతలువారీగా ఆమెకు భుజాల సాయం అందించారు. దోనెలు దిగిన దగ్గరనుండి ఓ రెండు మూడు కిలోమీటర్లు నడిస్తే గానీ వాళ్ళుండబోయే చోటు రాలేదు. గట్టూ, ఎదురుగా నీరు, వెనుకేమో దట్టమైన అడవి. “పోయిన ఏడాది నీరు ఇక్కడ వరకూ ఉండేది.” అని చెప్పాడు ట్రెక్ లీడ్. “అప్పుడింకా వెనక్కి టెంట్లు వేసేవాళ్ళం. మూడేళ్ళ బట్టీ చేస్తున్నా ఈ ట్రెక్, నీరంత వెనక్కి వెళ్ళడం చూళ్ళేదు..”
కొంచెం సేద తీరాక అందరిని దగ్గర్లో స్విమ్మింగ్ స్పాట్‌కి తీసుకెళ్ళారు లీడర్లు. ఉష కూడా వెళ్ళింది వాళ్ళతో పాటు.


నీటిలోకి దిగకుండా ఒడ్డున కూర్చుంది. నీళ్ళల్లో మోకాళ్ళ లోతు వరకు, నడుం లోతు వరకు ఆడుతున్న వారందరిని చూసింది. ఈదగలిగినవాళ్ళని నీటి మధ్యలో ఉన్న మోడు మీదకి ఎక్కి దూకమని ప్రోత్సహించాడు లీడ్. ఉషకి ప్రమాదమనిపించింది, కొమ్మ విరిగిపోతే? లీడరే ఎక్కి, దూకి చూపించాడు. మెల్లిగా కొందరు ప్రయత్నించడ
మొదలుపెట్టారు. చెట్టుకున్న బలం ఆమెను ఆశ్చర్యపరిచింది. లవ్ బర్డ్స్ జంటలో అమ్మాయి వచ్చి ఫోటోలు తీయమంది ఉషని. ఒక పావుగంట తీశాక, వాళ్ళ ముద్దూ మురిపాల డోస్ భరించలేక టెంట్లు వేసిన దగ్గరకి వచ్చేసింది అక్కడ శరత్, కాలు బెణికిన అమ్మాయి ఉన్నారు.


“ఇంట్లో ముందు ఒప్పుకోలేదుగానీ, ఆ హింసలు నేను పడలేకపోయాను. బయటకి వచ్చేశాను.” ఉషను చూసినా చెప్తున్నది ఆపలేదు ఆ అమ్మాయి.

“ఐ యామ్ ట్వెంటి సెవన్. సింగిల్-మారీడ్ – సింగిల్ అగైన్! లైఫ్ ఫక్స్! ” అని
చెప్పింది, ఉషను వైపు కూడా చూస్తూ.


“టెల్ మి అబౌట్ ఇట్. ఒక్క ఆక్సిడెంట్. ఫామిలీ మొత్తం…” చెప్తూ శరత్ ఆగిపోయాడు.

“షిట్…” అన్నది ఆ అమ్మాయి.


“ఐ యామ్ సారీ! ఎవరూ మిగల…”


“నోప్. నేను తప్ప, నోబడీ!” కొన్ని నిముషాల పాటు ఇబ్బందికరమైన నిశ్శబ్దం, ముగ్గురి మధ్య. పిట్టొకటి గట్టిగా అరుచుకుంటూ చక్కర్లు కొట్టింది. ఉషకి కూడా అరవాలనిపించింది.

“అబద్ధం చెప్తున్నాడు వీడు. ఆ ఆక్సిడెంట్ వీణ్ణి కూడా మింగేసింది.”

శరత్ అప్పటికే అక్కడనుండి వెళ్ళిపోయాడు. “మస్ట్ బి టఫ్ ఆన్ హిమ్” అన్నది ఉషను చూసి. “ఆన్ మి టూ!” అని అనబోయింది ఉష.


రాత్రి భోజనాలు అయ్యాక అందరూ కాంప్‍ఫైర్ చుట్టూ గుమ్మిగూడారు.


“అయ్యల్లారా, అమ్మల్లారా! మొదలెట్టండి కథలు. వణుకు పుట్టాల, దడదడలాడాల!” అంటూ లీడర్ ఉత్సాహపరచడానికి ప్రయత్నించాడు. “అసలే పున్నమి రాత్రి.” అన్నాడు. “అయినా అమావాస్య రాత్రిలా ఉంది. చంద్రుడు కొంచెం కూడా
కనిపించటం లేదు” అందో అమ్మాయి.

సాయంత్రం సన్‌సెట్ బాగుంటుందని రెండు కి.మీ. నడిపించుకొని వెళ్ళాడు. తీరా చూస్తే మబ్బులు పట్టేసి సూర్యుడు కొంచెం కూడా కనబడలేదు. రాత్రి టెంపోలో ఇరుక్కొని కూర్చొని, పొద్దున్న నుండి నడిచి, నీళ్ళల్లో ఆడి – నడుం ఇక నిలబడని వాళ్ళు మెల్లిమెల్లిగా వాలిపోయారు.

ఒక రౌండ్ మొత్తం పేరుపేరునా అడిగాడు కానీ ఎవరూ కథ అందుకోలేదు. అన్వర్ తో పాటు వచ్చిన కొలీగ్ హర్యానాలో ఏదో చుడేల్ గురించి చెప్పాడు. ఆ తర్వాత తెలుగబ్బాయి ఒకడు బేగంపేట్ వైట్ హౌస్ వెనుక వీధిలో జరిగిన మర్డర్ కథ
ఏదో చెప్పాడు.

ఉషని ఆటపట్టిస్తూ “దెయ్యాలు కూడా కథ చెప్పొచ్చు.” అన్నాడు లీడర్. ఆమె నవ్వి ఊరుకుంది. ఆమెకు మాత్రమే సొంతమైన హారర్ స్టోరి కళ్ళ ముందు కదలాడింది.


“సెక్స్. దానికి మించిన మందు లేదు.” శరత్‌ని ఎలా కాపాడుకోవాలో తెలీటం లేదని ఆమె ఏడిస్తే వాళ్ళ గాంగ్ ఇచ్చిన సలహా.


చేతి వేళ్ళల్లో వేళ్ళు వేసింది. దగ్గరగా జరిగింది. భుజానికి భుజం రాసుకుంది. మొహం తన వైపుకి తిప్పుకుంది. చెంపల మీద ఊదింది. జుట్టులోకి వేళ్ళు పోనిచ్చింది. గట్టిగా ముద్దుపెట్టుకుంది. వెనక్కి జరిగి చూసింది. ఒక్కసారి వాటేసుకుంది. మొహం మీద ముద్దులు పెట్టింది. ఛాతీనంతా తడిమింది. చేతులు చేతుల్లోకి తీసుకొని తన ఛాతీ మీద తిప్పింది. వేసుకున్న షర్ట్ లోపలకి చేతులను తీసుకెళ్ళింది.

అతడి కళ్ళల్లోకి చూసింది. తననే చూస్తున్న కళ్ళు. తన దగ్గర ఆగని కళ్ళు. ఏ భావం కనిపించని కళ్ళు. తనను గుర్తుపడుతున్నాడా, లేడా అని అనుమానం తెప్పించే కళ్ళు. అసలు మనిషి ఇంకా ఉన్నాడా, లేడా అని భయపెట్టే కళ్ళు. చెంపల మీద కొట్టింది. చూపు మారలేదు.భయంగా లేచి నుంచుంది. చూపు మారలేదు. పరిగెత్తుకొని బయటకు వచ్చింది. చాలా దూరం పరిగెత్తింది.

“గివ్ హిమ్ సమ్ టైమ్.”, “ప్లీజ్ అండర్‌స్టాండ్!”, “నీకే ఇంత కష్టంగా ఉంటే, అతడి పరిస్థితేంటి?” , “కొంచెం ఓపికపట్టు.”– అన్నీ ఆమెను తరిమాయి. ఆమె పరిగెత్తుతూ పోయింది. అతడికి అండగా ఉండాలన్న తాపత్రయంలో, ఆదుకోలేకపోతున్నానన్న అపరాధభావనతో, తమ బంధాన్ని కాపాడగలిగేంత శక్తి తన ప్రేమకి ఉందో, లేదోనన్నఅనుమానాలతో…

కొన్ని జీవితకాలాలు పట్టేంత దూరం ఏర్పడింది. మ్యూచువల్ ఫ్రెండ్స్ ఫేస్‌బుక్‌లో పెట్టిన ఫోటోలు చూసేది. అతడిని ఫోటోషాప్ చేసినట్టుండేవి – ఎటో చుస్తూ, ఏదో
ఆలోచిస్తూ, ఆ ఫ్రేమ్‌కి తనకి ఏం సంబంధం లేనట్టుండేవి ఆ ఫొటోలు. కానీ, కనీసం ఫ్రేమ్‌లో ఉండేవాడు. ఉషతో అదీ లేదు. “ఆక్సిడెంట్ నావల్ల జరిగిందని నువ్వు అనుకుంటున్నావా?” లాంటి అసంబద్ధమైన ప్రశ్నలు కూడా అడిగింది. అన్నింటికి ఒకటే సమాధానం – మౌనం.


“ఇంత సైలెంట్ ఏంటి బాబూ, నువ్వు? మాటలొచ్చా నీకసలు?” ట్రెక్ లీడ్ అడిగాడు శరత్‌ని. కాంపులో దాదాపుగా అందరూ నిద్రపోయారు. అర కిలోమీటర్ నడిస్తే ఒక బ్యూటిఫుల్ స్పాట్‌కి తీసుకెళ్తానంటే, అన్వర్, శరత్, ఉష తప్ప ఎవరూ రాలేదు.


“ఏం? ఇంతటి స్వచ్ఛమైన నిశ్శబ్దాన్ని ఎందుకు మాటలతో పాడు చేయాలి?” ఉష కోపం దాచలేకపోయింది. అన్వర్ ట్రెక్ లీడ్‌ని పక్కకు తీసుకెళ్ళాడు ఏదో వంకతో.
మొత్తం చీకటి. అంతా నలుపు. ఇంకో రంగుకి అవకాశం లేదు ఆ కాన్వాస్‌లో. అయినా, రవ్వంత షేడ్ తేడాలతో ఎన్ని నలుపులో; ఆకాశమంటూ ఓ నలుపు, మబ్బుల చాటున చంద్రుడున్నది ఇక్కడేనని చెబుతున్న పల్చబడిన నలుపు,
గాలికి సన్నగా కదులుతున్న నీళ్ళ నలుపు, నిటారుగా మోడులా నుంచున్న చిక్కటి నలుపు, గుబురుగా దూరంగా చెట్ల నలుపు.


ఆకాశం, చంద్రుడు, నీరు, చెట్లు, గట్టు, వాళ్ళిద్దరూ – ఒకటే నల్ల దుప్పటి ముసుగేసుకున్నట్టు. ముసుగులో గుసగుసలాడుకుంటున్నట్టు.


“ఇలానే ఉంటుంది. ప్రతి రాత్రి. ప్రతి రోజు. ప్రతి క్షణం ఇంత చీకటి. ఇంత సైలెన్స్!
“ఇంటికి వెళ్తే ఎవరూ ఉండరు. సడన్‌గా అమ్మ పిలుస్తున్నట్టు అనిపిస్తుంది… అందరూ వచ్చేసినట్టు అనిపిస్తుంది.
ఇట్స్ కిల్లింగ్ మీ!”

తడుముకుంటూ అతడిని చేతిని చేతిలోకి తీసుకుంది. దాన్ని ఆసరాగా తీసుకొని దగ్గరగా జరిగి, వీపు చుట్టూ చేయి వేసింది.
“నాకెందుకీ శిక్షో తెలీదు. బట్, యు డిజర్వ్ బెటర్.”
“యు ఆర్ నాట్ ఎ ఛాయిస్ ఫర్ మి. ఆ స్టేజ్ మనం దాటేశాం. అర్థమవుతుందా నీకు?”


ఇంకా వెలుగు రాకముందే అందర్నీ లేపి తిరుగు ప్రయాణానికి సిద్ధం చేశారు ట్రెక్ లీడర్లు. పక్షులు కచేరి వింటుండిపోయారు కొందరు. రాత్రి వాన పడినా మబ్బులింకా వీడలేదు. ఒక్క రాత్రిలో పోయే ముసురు కాదది. మళ్ళీ దోనెల్లో అవతలి గట్టుకి చేరుకున్నారు. దగ్గర్లో ఉన్న ఒక కొండ మీదకి ఎక్కారు, ఓ నాలుగైదు కి.మి.లు నడిచి.
కొందరు కొండ శిఖరాన్ని ఎక్కారు, శరత్ ఉన్నాడు వారిలో. మిగితా వాళ్లంతా టాప్ వ్యూ కనిపించే దగ్గర ఆగిపోయారు.

ఆమె మళ్ళీ మళ్ళీ తనివి తీరా చూసుకుంది బ్యాక్ వాటర్స్ ని. “ఇక్కడికి జోగ్ ఫాల్స్ చాలా దగ్గర.” ఎవరో అన్నారు. శరత్ కొండ పైనుండి దిగుతూ కనిపించాడు.

సోమవారపు రద్దీకి ఆదివారం రాత్రి నుండే సన్నద్ధమవుతుంది బెంగళూరు ట్రాఫిక్. సిటిలోకి అడుగుపెట్టి రెండుగంటలు అయ్యింది. టెంపోలో గట్టిగా మ్యూజిక్. ఉన్న చోటులోనే డాన్సులు చేస్తున్నారు కొందరు.


“హే! మీరు కూడా లవర్సా? చుపా రుస్తుమ్స్!” అంది పక్కకే ఉన్న లవ్-బర్డ్స్ జంటలో అమ్మాయి, శరత్ ఉషలను చూసి.


కాలు బెణికిన అమ్మాయి వెనక్కి తిరిగి నవ్వింది, “నేను అనుకున్నా!” అంటూ
సిటిలో ఉక్క మళ్ళీ స్వాగతం పలికింది. చేరాల్సిన గమ్యం ఇంకా గంటకు పై మాటేనని చెప్పాయి మాప్స్.


ఉష కళ్ళల్లో మాత్రం బాక్‌వాటర్స్ రంగులు నిండి ఉన్నాయి, నలుపుతో సహా.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s