Fan mail to SPB!

Posted by

(ఇది కోతి కొమ్మచ్చి ఆడియో బుక్ రాగానే బాలూ గారికి రాసిన ఫాన్ మెయిల్. ఆయన గొంతులో రమణగారి వచనం విన్నాక కలిగిన భావోద్వేగంలో రాశానని చెప్పగానే నా దోస్తులు పంపించు అని ప్రోత్సహించారు. ఇంకో అబ్బాయి చెన్నైయ్ అడ్రస్ దొరికించుకుని ఇచ్చాడు నాకు. (My friends have to take the entire responsibility of my craziness! Take them away, and I’d be the most predictable person ever. 🙂 )

చేత్తో కాగితం మీద రాసి ఆయనకి పోస్టు చేశాను. జవాబు రావాలన్న అత్యాశ ఎప్పుడూ లేదు. కానీ, పంపించాలి అనిపించింది పంపించేశాను. ఇప్పుడు ఎందుకు పబ్లిక్ డొమెన్‍లో పెడుతున్నానంటే, కోతి కొమ్మచ్చి ఆడియోని మేము సెలబ్రేట్ చేసుకున్న విధానం, how much it meant to us, the endless discussions around it – what joy!

ఈ సమయంలో వాళ్ళల్లో ఒకరిని పింగ్ చేసి మాట్లాడలేని పరిస్థితి. This feels like more concrete way to reach out to both the departed soul, and the deserted ones.

It was in Nov, 2010. Publishing the text without modifications. )

బాలు గారికి, 

మహాప్రభో…  మీరంటే నాకు బోలెడు అభిమానం. నేను మీ ఫానునీ. మీ పాటలు వినకుండా నాకు పూట గడవదు. మీ పాటలు వింటూ పెరిగాను. అవంటే చెవి కోసుకుంటాను. దేవుడు దిగొచ్చి,  “వరం కోరుకో.. బాలికే!” అంటే నేను మిమల్ని కలవాలనే అడుగుతాను – ఇవ్వన్నీ చెప్పటానికి కాదు నేను మీకు ఉత్తరం రాస్తున్నది. నేను మీ మీద అలిగాను. మనం అలిగామన్న సంగతి మనకన్నా ముందు మనం ఎవరి మీద అలిగామో వాళ్ళకి తెలీకపోతే, మనం తెలపకపోతే, అలక అలిగి అటకెక్కుతుంది, ’నువ్వు సరిగ్గా అలగలేదూ” అంటూ. (నేను అటకెక్కను.. నాకు ఎత్తులంటే భయం.) 

ఇంతకీ నేను అలిగింది ఎందుకో మీకు బా అర్థం కావాలంటే, మీకో ఫ్యాష్‍బాక్ లాంటిది చెప్పాలి. మా ఇంట్లో ప్రతి వేసవిలో మా అమ్మ ఆవకాయ పచ్చడి పడుతుంది, మేం ఉండేది సిటీలో అయినా. పచ్చడి పట్టేటప్పడు పడే హడావుడి గురించి చెప్పబోను – కాని అది భలే ఉంటుందిలే! మామిడి ముక్కలను శుభ్రం చేయటం, ఉప్పూ, కారం, ఆవపిండిల వాసన, నూనెలో ముక్కలను ముంచి, ఉప్పు-కారం-ఆవపిండి-మెంతులూ వగైరాలు కలిపిన పొడిలో వాటిలో దొల్లించి, అలా జాడిలోకి వేస్తుంటే ఉంటుందిలే.. భలే, భలే! ఇదంతా అయ్యాక, అధమం మూడు రోజుల దాకా పచ్చడి తినడానికి ఉండదు. పచ్చడి “ఓపెనింగ్ సెర్మనీ” నాడు మాత్రం, అమ్మ ముద్దుపప్పు చేసి, నేయి కాచి, గుమ్మడకాయో / ఆనపకాయో పుల్సు పెట్టి, మామిడి పండ్లు తెప్పించి – ఇలా ఉంటుందా భోజనం? అయితే ఆనవాయితీ అంటూ, మా అమ్మ మొదట ఆవకాయ వేడన్నంలో నెయ్యేసి కలిపి నాకో, మా చెల్లికీ, మా నాన్నకీ ముద్ద పెడుతుందా! తినేస్తానా! ఆ తర్వాత నా కంచంలో నేను అదే వేడన్నం, అదే నెయ్యి, అదే ఆవకాయ వేసుకొని కలుపుకుంటానా! అయినా అమ్మ ముద్ద రుచి రాదు. ’నువ్వేదో కలిపావ్’ అంటాను. ’నీ ముందేగా కలిపాను.. చూస్తూనే ఉన్నావ్ గా” అంటుంది. మరి నాకు రాదే ఆ ముద్ద రుచి అని నాకు కోపం వచ్చేస్తుంది. అవే పాళ్ళల్లో వేసుకొని మళ్ళీ కలుపుతా, అయినా రాదు. అప్పుడు అలుగుతా. (అప్పుడు అమ్మే కలిపి అన్ని ముద్దలూ పెట్టేస్తుందిలే.. కాని కథ అలగటం దగ్గర ఆగిపోవాలి కాబట్టి, చెప్పటం లేదు.) 

ఇప్పుడు మీ మీద అలిగింది కూడా ఇందుకే. “నేను బాపూ రమణల కోతి కొమ్మచ్చి చదివాను తెల్సా.. బోలెడు సార్లు చదివాను” అని మా దోస్తుల దగ్గర బోలెడు బడాయి పోయానా? పొయాను. ఇప్పుడేమో మీరు చదివింది విన్నాక అమ్మ పెట్టిన ముద్దలా ఉందా! అప్పుడేమో నాకూ అలా చదవాలని ఉంటుందా? ఉంటుంది. కాని రాదే! అప్పుడు చేతకాకపోవటం వల్ల వచ్చిన ఉడుకుమోతుతనంతో కోపం పుట్టి, అలక వస్తుందన్న మాట. అందుకని మీ మీద అలిగానన్న మాట. 

నా ఫ్రెండొకడు నాకన్నా ముందే కోతి కొమ్మచ్చి ఆడియో వినేసి బడాయి పోయాడా? కాదు, బడాయిన్నర పోయాడు. “You know what, he has taken it to altogether different heights” అంటే, తీసుకెళ్ళక ఏం చేస్తారూ? అసలే గానగంధర్వులూ, ఆపైన రమణ గారి వచనం – ఆవకాయ ముద్ద తిన్నంత రుచిగా ఉండకపోతుందా అనుకున్నాను. నేను విన్నాక, నాకేమో అలా చదూకోవాలి అని బుద్ధి (పోనీ.. దుర్బుద్ధి?) పుట్టేసింది. 

బాఆఆఆఆఆఆఆఆఆగా ఆకలిగా ఉన్నవాడకి ఒక ముద్ద అన్నం పెడితే, వాడు నవ్వడు. ముందు ఏడుస్తాడు. అదేలే, కళ్ళెమ్మెట నీళ్ళు పెట్టుకుంటాడు. వాడికా ముద్ద ఎలా ఉంటుందో తెల్సు, అది కావాలని వాడు పరితపించి ఉంటాడు, అది నోటికి తగలగానే మాత్రం ఇన్నాళ్ళు అది లేదన్న బాధే తన్నుకొస్తుంది. మీరు పరాయణం చేసి వినిపించిన తెలుగు రుచి తగులుతుంటే, నాకూ అలానే అనిపించింది. It was sheer ecstasy, even if you choose to term it as far fetched. Saragamo అనే పొర్చుగీస్ రైటర్, “tremors were being recorded on the seismograph of his soul…” అంటారులే ఓ చోట. నాకూ అలానే అనిపించింది మరి! 

మీ గొంతులోని మాధుర్యాన్ని ఈ పేరా చివర వరకూ విస్మరిద్దాం. “కదా”, “అమ్మమ్మ” అనేవి అతి సామాన్యమైన తెలుగు పదాలు. రోజూ నోళ్ళల్లో నానే పదాలు. కాని వాటిని మీరు చదువుతూ ఉంటే, నాకు తెలుగు కొత్తగా రుచించింది. “కద” ను “కదాఆఆఆఆఆ!” అని, “ఎక్కడ?”ను “ఏ…..ఖ….ఢ?” అని ఖూనీ చేస్తుంటే చెవులప్పగించి చూస్తూ ఉండిపోయిన మేం, ఇప్పుడు మీ గొంతులో ఆ పదాల అసలు pronunciation వింటుంటే, ఎంత కమ్మగా ఉంటుందో చెప్పలేను. ఇహ, ధ, థ లకు గల తేడా, ల, ళ లకు గల తేడా  నుండి కొన్ని కఠిన పదాల ఉచ్చారణ వరకూ మీరు చదివింది నాకు పాఠాలుగా పనికొస్తున్నాయి. (నాకు తెలుగు అంత బాగా రాదు. ఈ పాటికే, ఈ ఉత్తరంలో మీకు చాలా తప్పులు కనిపించుంటాయి. అవి నాకు ఎలా రాయాలో తెలీక చేసినవే! )

నా పరిస్థితే ఇలా ఉంటే, ఇక దేశాలు పట్టుకుపోయి, తెలుగన్న పదం వినిపించకుండా బతికేస్తున్న వాళ్ళకి ఈ ఆడియో ఇస్తే సంతోషంతో ఊపిరాడకుండా పోతారేమో! 

బాపూరమణ గార్ల మీదున్న అభిమానమో, మరోటో మీ చేత ఇది చదివించింది అనుకుంటున్నారా? కాదు, కాదు! ఇది మా సౌభాగ్యం.  షడ్రుచుల భోజనంలా ఉంటుంది రమణ గారి కోతి కొమ్మచ్చి. మీరు దాన్ని చదవటం, ఒక కమ్మదనాన్ని జోడించింది. ఇహ, దాన్ని ఆరగించటం మా అదృష్టం కాకపోతే మరేంటి? 

మహాప్రభో……. కొన్ని దశాబ్దాలుగా తెలుగు పాటలు పాడి, సినిమాలు చేసి, తీసి, పాటల పోటీలు పెట్టి, తెలుగు గురించి చెప్తూ మమ్మల్ని ఋణగ్రస్తులను చేసింది కాక, ఇప్పుడు ఈ పుస్తకాన్ని చదివి వినిపించి, ఆ ఋణాన్ని మరింతగా పెంచేశారు. అందగ్గాను మీకు సాష్టాంగ దండప్రణామాలు! మా సచిన్ (టెండూల్కర్) ఆడిన / ఆడకుండా పోయిన ప్రతీ సారి standing ovation ఇవ్వటం మాకు అలవాటు. అలా మీకూ, బాపూ రమణలకూ ఇవ్వాలంటే ఓ జీవితకాలం పాటు ఇస్తూనే ఉంటాము. (ఎటూ అప్పు గొడవ వచ్చింది కాబట్టి.. మా బుడుగుకీ మీ గొంతు అప్పివ్వచ్చుగా! )

ఇప్పుడు కొంచెం ఇంగ్లీషన్న మాట, నా తెలుగు ద్వారా మీకు సరిగ్గా చెప్పగలిగానో, లేదోనని. 

With this work, you’ve brought back the joy of reading in Telugu, back to Telugus. We’re celebrating literature again! Don’t ask me how many of us really care. I don’t know. All I know is, people who know the value, bow to you! THANK YOU! 

అంత రుచిగా వండి వార్చిన రమణ గారికీ, అంతే బాగా కలిపి ముద్దలు పెట్టిన మీకూ – అచ్చ తెలుగు చిత్రరాజం మాయాబజారులోలా – నమో నమః. 

అన్నట్టు, వేటూరి గారి “కొమ్మ కొమ్మకో సన్నాయి” అనే పుస్తకం అచ్చేయించింది కూడా మీరే కదూ?! దానికి కూడా బోలెడన్ని థాంకులు! అదింకో బ్రహ్మాండమైన వంటకం. అరుదైన పుస్తకం. అందులో జంధ్యాల గారి మీద రాసిన వ్యాసం చదువుతుంటే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. 

ఇప్పటికే చాలా వాగేశాను. ఏవైనా తప్పులుంటే మన్నించగలరు. ఎక్కడైనా పొరపాటుగా మాట్లాడుంటే, పెద్ద మనసుతో మన్నించగలరు. నాకు రాయటం చేతనవ్వకే అని గ్రహించగలరు. కోపం వస్తే, ఇదో నా చేతులు చాచే ఉన్నాయి, మీరు కట్ట తీసుకొని కొట్టడమే తరువాయి. 

సెలవు. 

పూర్ణిమ

One comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s