ముళ్ళపూడి వారి బుడుగుంగారు కథ చెప్పడానికి ఉపక్రమించే ముందే నీతి సెలవిస్తారు. ఎప్పుడోకప్పుడు చెప్పుకోవలసినదే కదా, ముందు ’నీతి’ అనేసుకుంటే అలా పడుంటుంది కదా, అని. మరే! కథ అన్నాక నీతంటూ ఉన్నాక చెప్పుకోవాలిగా. ఫలానా కథలో ఫలానా వాళ్ళ మధ్య ఫలానా సంఘటనలు జరిగినప్పుడు, ఫలనా అవుతుంది, దాన్ని బట్టి మనకు ఫలనా నీతి బోధపడుతుంది. మరి ఇలాంటి ఓ ఫలానా కథను తీసుకొని మనుషులకు, మారుతున్న పరిస్థితులకూ అన్వయిస్తే ఏమవుతుంది? అప్పుడు ఏ నీతులు బోధపడతాయి? లాంటి ఆసక్తికరమైన ప్రశ్నలు రేపే చిత్రరాజం, సాయి పరాన్‍జపే తీసిన సోషల్ సెటైర్ ’కథ’.
చిన్నప్పటి నుండి వింటున్న తాబేలు-కుందేలు కథ తెల్సు కదా? (’ఊహు.. తెలిదంటూ’ అంటూ తల అడ్డంగా ఊపి, చెంతనో ఐదారేళ్ళ చిన్నారులుంటే వారిచే చెప్పించుకోవటం కూడా ఒక పద్ధతి. 🙂 ) సరే.. ఇంతకీ ఆ కథను ఆధారంగా.. కాదు కాదు , ఆ కథనే తీసుకొని, కుందేలు-తాబేలు బదులు కుందేలు లాంటి చలాకి మనిషి, తాబేలు లాంటి నెమ్మదస్తుడి మధ్య ప్రేమ, ఉద్యోగం వగైరా వగైరా (మూకుమ్మడిగా “జీవితం” అనేసుకుందామా?) లో పోటీ పెడితే, మారుతున్న కాలంలో ఎవరిని విజయం వరిస్తుంది? అన్నది కథాంశం. ఇంతటి ఆసక్తికరమైన కథాంశాన్ని ఎన్నుకోవడమే కాక, అంతే నేర్పుగా తెరకెక్కించించిన విధానం కథకురాలు, దర్శకురాలు అయిన సాయి గారి శ్రద్ధాసక్తులను తెలుపుతుంది.
ఒకానొక నాయనమ్మ, నిద్రపోడానికి మారాం చేసే తన మనవడికి ఈ తాబేలు-కుందేలు కథ చెప్పడం మొదలెడుతుంది. వాళ్ళుంటున్న ’చాల్’ (నాలుగైదు అంతస్థుల అద్దె ఇల్లు ఉండే భవనం అనుకోవచ్చు. బొమ్మ ఇక్కడ.) లోనే మన తాబేలుగారు (అనగా నసీరుద్దీన్ షా) ఉంటారు. బడుగు జీవితంలోని చిరుద్యోగానికి వచ్చిన చిట్టి ప్రొమోషన్‍కు తనలో తాను పొంగిపోతూ, అదే భవనంలో ఉంటున్న, తాను ప్రేమిస్తున్న అమ్మాయిని (దీప్తి నావెల్) పెళ్ళి చేసుకోడానికి అడ్డంకులన్నీ తొలగిపోయాయని ఆనందిస్తూ ఉంటాడు. మహా ఠీవిగా తన వాటాకు తన నేమ్ ప్లేట్ కూడా తగిలిస్తాడు. అప్పుడే కుందేలు గారి (అనగా ఫారుఖ్ షేక్) ఎంట్రీ. వీళ్ళిద్దరూ ఒకప్పటి స్నేహితులు. తాబేలు మెల్లిమెల్లిగా చదువుసంధ్య పూర్తి చేసి ఏదో చిన్న ఉద్యోగంతో నెట్టుకొస్తూ ఉంటే, చదువును గాలికి వదిలేసి, గాల్లో మేడలు కడుతూ, కల్లబొల్లి మాటలు చెప్తూ అందర్నీ ఆకర్షించి ఏ పూటకా పూట బ్రహ్మాండంగా జరుగుబాటు చేయటంలో దిట్ట కుందేలు.
వీళ్ళిద్దరి మధ్య పోటీలు, పందాలు గట్రా వాళ్ళంతట వాళ్ళు పెట్టుకోరు. స్నేహితుల్లా ఒకే వాటాలో ఉంటారు. కానీ when life is race and when you happen to have a life, well, like it or not, you’re racing. Racing against who and for what? అన్నది తెలీకుండా / తెల్సుకోకుండా పరిగెట్టేయడమే జీవితంలోని fun element ఏమో! అలా, వాళ్ళకి తెలీకుండానే ఒకే సంస్థకు పనిచేయడం, ఒకే పిల్లను మంచిచేసుకోవడం, ఇరుగుపొరుగుతో సత్సంబంధాలు వగైరాలలో పోటి పడిపోతుంటారు.
సినిమా మొత్తంలో గమ్మత్తు ఏంటంటే, దీన్నో నీతి కథగా కాకుండా, మానవీయ కథగా చూపించారు. ఇందులో తప్పొప్పులను నిశ్చయించడంలో మనం చాలా ఉత్సాహం చూపించచ్చుగానీ, ఈ కథలో నెగ్గిందెవరో, ఓడినదెవరో, నెగ్గినవారు కోల్పోయిందేంటో, ఓడినవారు గెల్చుకున్నదేంటో అన్నీ విశ్లేషించుకుంటూ కూర్చుంటే, సినిమా చూసినంత సేపూ నవ్వుకున్న నవ్వులన్నీ, నిట్టూర్పులైపోగలవు! అందుకని నా స్నేహితురాలు సలహా మేరకు, సినిమాను సినిమాలా చూస్తే… ఓహ్! బెమ్మాండమైన సెటైర్, కామెడి ఉంటాయి. నటీనటుల విలక్షమైన నటన. ఎనభైలలో భారతీయ దిగువ మధ్యతరగతి జీవితాలను దగ్గరనుండి చూస్తున్న భావన కలుగుతుంది. ఈ సినిమాలో పాటలన్నీ చొప్పించినట్టు అనిపించాయి నాకు, కథాగమనానికి అడ్డుపడుతూ.. అదొక్కటే బాగోలేదనిపించింది.
ఇహ, ఈ చిత్ర దర్శకురాలి గురించి చెప్పాలంటే పదాలు కాదు, పేరాలకు పేరాలు తన్నుకొచ్చేస్తున్నాయి నాకు. Before anything else, she’s an amazingly gifted story teller. సినిమా రంగాన్ని ఎన్నుకున్నారు గానీ, ఈవిడ ఎదురుగా కూర్చుని ఒక కథ చెప్పించుకున్నా, ఆవిడ కళ్ళకి కట్టినట్టు చెప్పగలరు అని నా ఊహ. ఆవిడ చెప్పాలనుకున్న కథపై ఆవిడకు పూర్తి పట్టు ఉంటుంది. కథేంటో ఆవిడకు బా తెల్సు. ఆ బా తెల్సినదాన్ని అంతే సమర్థవంతంగా ఇంకో చెవిన వేయగలరు. సినిమా వచ్చేసరికి పాత్రలకు జీవం పోసే నటీనటులుండడం ఈవిడ అదృష్టం. మిగితా సాంకేతిక వర్గం గురించి నేను వ్యాఖ్యానించలేనుగానీ, ఈవిడే కథ-మాటలు-స్కీన్ ప్లే చూసుకుంటుంటారు. కథనంలో గానీ, పాత్రోచిత సంభాషణలలో గానీ ఎక్కడా లోపాలు తొంగితొంగి చూడవు. ఏ సన్నివేశమూ కథకు పనికిరానిదై ఉండదు. అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు కాక, కథలోని ముఖ్య భాగాలను పాత్రల హావభావాల్లోనో, పరిసరాల్లోనే దాచి, మనల్నే వెతుక్కోమని అనగలరు.
ముఖ్యంగా ఈ సినిమాలో నాకు నచ్చినది -which floored me – ఆవిడ అప్పటి quintessential Indian middle class livingని సెల్యులాయిడ్ మీద బంధించిన తీరు. అలా చేయడానికి ఒక నిశిత దృష్టి కావాలి. చుట్టుపక్కల ఏం జరుగుతుంది, మనుషులెలా మారుతున్నారు అన్నవాటిని గమనించే ఓపికుండాలి. అలా గమనించుకున్న వాటిని తిరిగి అప్పజెప్పేటప్పుడు సొంత పైత్యం గానీ, మితిమీరిన వ్యంగ్యం గాని ఉంటే మొత్తం రాసాభాస అవుతుంది. పప్పుకి తాలింపుగానీ, తాలింపులో స్పూనుడు పప్పు వేయరుగా!
ఇంత ఎందుకు రాస్తున్నానంటే, ఎనభైలలో మధ్యతరగతి జీవితాలను, చాలీచాలని జీతాలు, ఇరుకు అద్దె ఇళ్ళూ, కోరికలు అనంతం, చేతిలో నాలుగు రాళ్ళు లేవు, అప్పులూ, అబద్ధాలు అంటూ నిర్వచించి పారేయచ్చు. కానీ అవే నిజాలు కావు. వాటి అన్నింటి మధ్యనా ప్రేమలు చిగురించాయి, పెళ్ళిళ్ళు జరిగాయి, కాపురాలు నిలబడ్డాయి. పాచిపట్టి, పగిలిన గోడ మధ్యలో నుండి ఒక ఏదో కొత్త చిగురు పుట్టచ్చు, దానికో చిట్టి పూవు పూయచ్చు. సాయి, హృషి దా, బాసు దా, వీళ్ళంతా ఫోకస్ చేసింది ఆ చిగురు మీద. అలా తీసిన ఫొటోలో బాక్‍గ్రౌండ్‍లో ఉన్న పాచి తాలూకా ముదురు ఆకుపచ్చ కూడా కొత్త అందం సంతరించుకుంటుంది. అలాకాక, పాడుబడిన గోడగానే చూపిస్తే, ప్రస్తుతం సాప్ట్-వేర్ ఉద్యోగుల పాత్రలతో వస్తున్న తెలుగు సినిమాల్లా కంపు కొడతాయి!
ఒక జానపద కథను తీసుకొని ఒక సోషల్ సెటైర్ వేసే సినిమా బాలివుడ్‍లో ఉంటుందని ఊహించలేదు. దాన్ని ఆద్యంతం హాస్యస్ఫోరకంగా తీయటమే గాక, అంతర్లీనంగా ఎన్నో మౌలిక ప్రశ్నలను లేపి, వాటిని ప్రేక్షకులకే వదిలేసిన తీరు గమనార్హం. అద్భుతమనను గానీ, అందమైన సినిమా.
ఇప్పటి వాళ్ళు చూడదగ్గ, చూడవలసిన సినిమా!