మనిషి లోతుల్ని చూపే ’స్పర్ష్’

Posted by

గత మూడు రోజుల్లో సాయి పరాన్‍జపేతీసిన మూడు విభిన్న చిత్రాలు చూడ్డం జరిగింది. వాటిలో, ఆవిడకు జాతీయ ఉత్తమ చిత్రం అవార్డునే కాక ఎనలేని గుర్తింపునీ సంపాదించి పెట్టిన సినిమా, ’స్పర్ష్’ ఒకటి.

నసీరుద్దీన్ షా, షబానా ఆజ్మీ తారాగణం అని నేను ప్రకటించగానే మా అమ్మ “అయితే, కొంచెం ఓపికతో చూడాల్సిన సినిమా అయ్యుంటుంది.” అని అనేసింది. వికీలో చిత్ర వివరాలు చూస్తే కొంచెం భారీ సబ్జెక్ట్ ఉన్న సినిమా అని వెంటనే అర్థమైపోయింది. ఆ సినిమా పై నా ఆలోచనలను ఇక్కడ పంచుకుంటున్నాను.

ఈ చిత్రానికి కేంద్రబిందువు (center) ఒక అంధవిద్యాలయం. ఆ విద్యాలయానికి ప్రిన్సిపల్ నేత్రవిహీనుడైన అనురుధ్ (నసీరుద్దీన్ షా). ఓ కీలకమైన అవయువం పనిచేయకున్నా ఎంతో ఆత్మబలంతో తామెవ్వరికి తక్కువ కామని నిరూపించుకునేలా అక్కడి విద్యార్థులను సంసిద్ధులను చేస్తూ ఉంటారు. ఆర్ధిక సాయం మాత్రమే కాకుండా తీరిక వేళల్లో వచ్చి పిల్లలకి లలిత కళలు, హస్త కళలు నేర్పించడానికి వీలుగా సహృదయులను ఆహ్వానించి, వారి వల్ల విద్యార్థులు లబ్ది పొందేలా చూస్తాడు అనిరుద్ధ్.

భర్తను కోల్పోయి తీవ్ర నిరాశానిస్పృహలలో మగ్గుతున్న కవిత ప్రసాద్ (షబానా ఆజ్మీ) ఈ విద్యాలయంలో పాటలు నేర్పించడానికని చేరుతుంది. అతి తక్కువ కాలంలో అందరి ఆదారాభిమానాలనూ చూరగొంటుంది. అనిరుద్ధ్ కూ దగ్గరవుతుంది. గతాన్ని వెనుక వదిలిపెట్టి అతడితో జీవితాన్ని పంచుకోడానికి సిద్ధపడుతుంది. ఇద్దరికీ నిశ్చితార్థం అవుతుంది. కానీ ఏ అండాదండా లేకుండా స్వతంత్రంగా జీవించటానికి అలవాటుపడ్డ అనిరుద్ద్, కవిత రాకతో తానా స్వాలంబనను కోల్పోతానని భయపడి ఆమెను దూరం చేసుకుంటాడు. ఆ తర్వాత ఆ విద్యాలయం నుండి కూడా ఆమెను తప్పించాలని చూస్తాడు. తప్పించగలిగాడా? ఇద్దరూ కల్సుకున్నారా? అన్నది క్లైమాక్స్!

భారతీయ చిత్ర పరిశ్రమకు ఎప్పుడో గాని గుర్తు రాని సబ్జెక్ట్ లైన్, పైగా నసీర్, షబానా ఉన్నారు, ఇదో dark and gruesome మూవీ ఏమో అని భయపడ్డాను ఈ చిత్రం గురించి తెలియగానే. కానీ కథంతా మెల్లిగా, హాయిగా సాగినట్టే తోచింది. ఎక్కడా దుర్భర, భయానక సన్నివేశాలు లేవు. సినిమా మొత్తం అంధుల గూర్చే అయినా వారి జీవనపయనంలో ఉన్న ఒడిదుడుకులను పరిచయం చేసారే గానీ, దాన్నేదో భూతద్దంలో చూపించడానికి ప్రయత్నించలేదు. ఇది నటీనటుల సహజనటన వల్ల సాధ్యమైందో, లేక కథనే అలా నడిపించారో తేల్చుకోవటం కాస్త కష్టమే. ఉదాహరణకు, ఇందులో ఓం పూరి వేసిన పాత్ర ఒక అంధుడు, భార్యను కోల్పోయినవాడి పాత్ర. అతడిని పలకరించడానికి నసీర్ వెళ్ళినప్పటి సీన్‍ను భారీగా వినిపిస్తున్న విషాద నేపధ్య సంగీతం మధ్య ఏడుపులూ పెడబొబ్బలూ పెట్టి చాలా డ్రమాటిక్‍గా తీయచ్చు. అలా కాక, చాలా సున్నితంగా, ఒక్క రవ్వ కూడా నటన ఎక్కువ కాకుండా ఓం పూరి మనోవేదనను తెరపై ఆవిష్కరించారు. ఈ సన్నివేశంలో ఓం పూరి నటన చూసి తీరాల్సిందే!

ఇహ నసీర్ గురించి ప్రత్యేకంగా, కొత్తగా చెప్పుకోవాల్సినదేముంది? ఆయన ఎంతటి విలక్షణ నటుడో ఆయన ఏ చిత్రాన్ని చూసినా, అందులోని పాత్ర నిడివి ఎంత చిన్నదైనా, ఇట్టే తెల్సిపోతుంది. ఇందులో కూడా ఆయనకు ఆయనే సాటి అన్నట్టు నటించారు. ప్రపంచంలో ఎవ్వరూ తానో అంధుడని చిన్న చూపు చూస్తే సహించలేని మనిషి, తానో అంధుడన్న విషయాన్ని ఒక క్షణం కూడా మర్చిపోకుండా మననం చేసుకుంటూ, తన వైపు ప్రేమగా ఎవరు వస్తున్నా అది జాలి మాత్రమే అని నమ్ముతూ ఉండే పాత్రకు నసీర్ ప్రాణప్రతిష్ట చేసారు.

అలానే షబానా ఆజ్మీ అమితంగా ప్రేమించిన భర్తను కోల్పోయి జీవితానికి దూరంగా చీకటిలో బతికుతున్న భార్యగా అద్భుత నటన ప్రదర్శించారు. ఆమె నవ్వినా కూడా విషాద ఛాయలు కనిపించాయి. ఎట్టేకలకు జీవితంలోకి కొత్త వెలుగు వస్తుందని ఆశపడి, దాన్ని అందుకోడానికి సందేహపడి, చేయందించాక భంగపడి, అంత నిరాశలోనూ అక్కడి విద్యార్థులకు ఒక అమ్మగా, ఒక ఆలంబనగా – ఇన్ని పార్శ్వాలను అలవోకగా చూపించగలిగారు. నసీర్, షబానా లేకపోయుంటే ఈ సినిమా ఇంత బాగుండి ఉండేది కాదనటంలో అతిశయం లేదు.

ఈ చిత్రంలో నాకు చాలా నచ్చిన రెండు విషయాలున్నాయి. కొంచెం పొలిటికల్లీ కరెక్ట్ గా మాట్లాడుకోవాలంటే, అవి నేను చూసిన, నాకు అనిపించిన రెండు విషయాలు.

ఒకటి: చిత్రం అంధుల గురించే అయినా వారి సాధకబాధకాల మీదే ఫోకస్ పెట్టకుండా, ఇంకెన్నో కోణాలను స్ఫృశించగలిగారు. అందులో ఒక ఆసక్తికరమైన అంకం, ఇందరి అంధబాలల మధ్య ఒక దృష్టిలోపం లేని పిల్లవాడుంటే, అతడి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అని. ఈ అంధవిద్యాలయంలో కాంటీన్ నడుపుతున్నతడి మేనల్లుడు కూడా అదే పాఠశాలలో అందరితో కల్సి మెల్సి తిరుగుతుంటాడు. అక్కడి బాలలకు తనకు చేతనైన సాయం చేస్తుంటాడు. కొత్త టీచరు (షబానా) అక్కడికి వచ్చాక ఆమెను అమితంగా ఇష్టపడతాడు. కాని ఆమె ఎప్పుడూ అంధబాలలపైనే అధిక శ్రద్ద, అనురాగాలూ చూపుతూ ఉంటుంది. తోటి పిల్లవాడితో కొట్లాట జరిగినప్పుడు కూడా ఇతడినే కొడుతుంది. అందుకని తానూ అంధుణ్ణి అయితే అందరికి మల్లే తనకూ అధిక ప్రేమానురాగాలు దక్కుతాయన్న వెర్రి అలోచనలు మొదలవుతాయి ఆ కుర్రవాడికి. సమయానుకూలంగా వాటిని టీచరమ్మే దూరం చేస్తుంది.

షబానా-నసీర్ మధ్య చిగురించిన ప్రేమ, కొన్నాళ్ళకు అది ముల్లదారిన పడినప్పటి కోపతోపాలు, అపార్థాలూ, చిరాకులూ అన్నీ కూడా ఏ ఇద్దరి మనుషుల మధ్య చెడిన బంధంలానే అనిపించింది నాకు. నిజమే, తానో అంధుణ్ణి అన్న నిజాన్నే నసీర్ ఆ బంధానికి అడ్డుగోడ చేయాలనుకుంటాడు. కారణం పక్కకు పెడితే, దాని వల్ల కలిగే దుష్పరిణామాలు మాత్రం అత్యంత సహజంగా ఉండేట్టు చూసారు. ఒక్కప్పుడు ’నా చాక్లెట్లన్నీ ఇంకోడు తీసేసుకున్నాడు’ అని ప్రిన్సిపల్ హోదాలో ఉన్న తనకు చెప్తే బుజ్జగించి పంపిన నసీర్, కొన్నాళ్ళకు ఒక సీరియస్ సమస్యను తీసుకొచ్చిన విద్యార్థి మీద అరుస్తాడు. అంతటి మార్పు వస్తుంది అతడిలో.

ఇక్కడ మరో విషయం. ఇక్కడ చూపులేని నసీర్ పైనే అందరి ధ్యాస పోయినంతగా, జీవితంలో కోల్కోలేనంతా గట్టి దెబ్బ తిని చాలా నీరసపడిపోయిన షబానా వైపు అంతగా పోదనుకుంటాను. ఒక నేత్రవిహీనుణ్ణి పెళ్ళిచేసుకోడానికి సంసిద్ధత చూపినందుకు ఆమె దేవతని కొనియాడవచ్చేమో గానీ (సినిమాలో ఒక పాత్ర ఈ డైలాగ్ అంటాడు కూడా), ఏ బంధంలోనైనా ఎవరో ఒక్కరే అన్ని వేళలా అభయహస్తం చూపిస్తూ, వరాలిస్తూ ఉండిపోలేరు. అలా కొంచెం సేపు ఒకరు చేస్తే, ఇంక్కొంచెం సేపు వేరొకరు చేయాలి. ఆ ఇచ్చిపుచ్చుకోవడాలనేది అనివార్యం. కాకపోతే, కొన్ని ఇవ్వడాలు కళ్ళకు కనిపిస్తాయి. ఉదాహరణకు, షబానా నసీర్‍ను చేయిపట్టుకొని దారెమ్మట నడిపించడం. కొన్ని కనిపించవు. ఉదాహరణకు, నసీర్ ప్రేమానురాగాల్లో షబానా పొందే తృప్తి. అందుకే కళ్ళున్నా కూడా మనకి కనిపించనవి ఎన్నో! ఏదో స్థాయిలో మనమంతా అంధులమే అనుకుంటా!

రెండోది: సినిమాను ఎక్కడా విపరీతమైన మెలోడ్రామాకు తావివ్వకుండా సరళంగా, సహజంగా చిత్రీకరించటం. కొన్ని సీన్స్ ఎంత అహ్లాదాన్నిస్తాయో చెప్పలేను. ఊహించని సమయంలో అతడి రాకకు గమనించి అద్దం ముందుకు పరిగెత్తుకెళ్ళి జుట్టు సవరించుకోబోయిన ఆమె, వెంటనే దువ్వెన పడేసి పర్ఫ్యూమ్ రాసుకుంటుంది. ఎందుకనంటే, ఆమె సుగంధం, ఆమె స్పర్శ తనకెంత ఇష్టమో అతడి చెప్పి ఉంటాడు గనుక. అలానే అతడికి నచ్చే చీరను ఎన్నుకోడానికి ఆమె కళ్ళుమూసుకొని చీరను ఎన్నుకుంటుంది. ఇది హింది సినిమాల్లో నేను చూసిన అత్యంత రొమాంటిక్ సీన్.

తాను అమితంగా ఇష్టపడే టీచర్ వచ్చి కథ వినిపిస్తున్నప్పుడు ఆ కథలో రాకుమారి టీచర్ అయినట్టు, ఆమె కాపాడేది తానే అయినట్టు ఒక కుర్రవాడి ఊహలను కూడా బాగా చూపించారు.

సినిమా ముగింపు మాత్రం నాకస్సలు నచ్చలేదు. మానసిక జటిలత్వం ఉన్న మనుషుల బంధాలు ఎక్కడో చోట ముడిపడిపోయి, ఆ తర్వాత ముడివీడక, చాలా సంఘర్షణకు లోనవ్వాల్సి ఉంటుంది. బంధాన్ని తెంపుకొని వెళ్ళటమా? లేక ముడి మీద ముడేసి బలపర్చుకోవడమా? అనేది ఆ ఇద్దరికీ వదిలేస్తేనే బాగుంటుంది. అలా కాక, ఈ చిత్రంలో బంధంలో ఉన్న ఇద్దరికీ మధ్య కామెంటేటర్‍గా మూడో వ్యక్తి నచ్చజెప్పటం నాకసలు నచ్చలేదు. ఎంతో ఉన్నతంగా మల్చుకున్న పాత్రలను ఒక ఉదుటున కిందకు తోసేసినట్టయ్యింది. వారిద్దరి మధ్య ఏర్పడిన అడ్డుగోడలను వారి వల్లే కూలుంటే బాగుండేది గానీ, మరొకరు వచ్చి విశ్లేషణ అందించటం ఎబ్బెట్టుగా అనిపించింది. మానసిక విశ్లేషణలకన్నా కోపంలో అనే మాటల్లో నిజాయితీ ఎక్కువ ఉంటుంది. అప్పటిదాకా అత్యంత సహజంగా నడిచిన కథ, నా మట్టుకు నాకు, ఒక్కసారిగా కృతుకంగా అనిపించింది.

సినిమాలో పాటలు తక్కువ. బాగున్నాయి. ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్ అతిధి పాత్రలో కనిపిస్తారు. సినిమాలో కొంచెం లైటింగ్ తక్కువ అనిపించింది, నా వరకూ. డైలాగులు పాత్రలకు తగ్గట్టుగా ఉన్నాయి, విశేషంగా చెప్పుకునేంత కాకపోయినా.

అక్కడక్కడా లోపాలు కనిపించినా ఈ సినిమా చూడదగ్గ సినిమా. చూడాల్సిన సినిమా. అంధవిద్యార్థుల సాధకబాధకాలు, వారికి లోకానికి మధ్యనుండే సంబంధబాంధవ్యాల్లో ఉండే చిక్కులు, ఒక చక్కని చిక్కని ప్రేమకథ, ఒక మానసిక విశ్లేషణ, ఇన్ని విభిన్న కోణాలను ఒక్కసారిగా చూపించే అరుదైన చిత్రం. అందమైన చిత్రం.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s