చష్మ్-ఎ-బద్దూర్’ – ఒక ఈలపాట లాంటి సినిమా

Posted by

First published in navatarangam.com on Dec 19th, 2011.

గడపదాటుతూనే చూపుడు వేలుకి తొడిగిన కీచెయిన్‍ను గిరగిరా తిప్పుతూ, ఈల అందుకొని,  తెరచిన గేటును అశ్రద్ధగా వదిలేసి, బైక్ ఎక్కి కూర్చొని, నుదుటిపై పడుతున్న జుట్టు అలక్ష్యంగా వెనక్కి తోస్తూ, విలాసంగా బైక్ స్టార్ట్ చేసి, దాని దడ్-దడ్-దడ్ శబ్ధంలో కూడా ఈలను ఆపకుండా దూసుకుపోతూ, దారిన ఎవరన్నా అమ్మాయి కనిపించగానే కాస్త నిదానించి, జుట్టును సవరించుకొని, ఒకసారి ముఖారవిందాన్ని బైక్ అద్దంలో చూసుకొని, నవ్వుకొని, అదే నవ్వును అమ్మాయికేసి చూస్తూ కొనసాగించి, బైక్ మీదే ఏదో విన్యాసం చేయబోయి, అది వికటించి, వెంటనే పళ్ళికిలించి, అక్కడనుండి ’హాం ఫట్’ అన్నట్టు మాయమైపోయి.. పక్క వీధిలోకి వెళ్ళగానే మరో అమ్మాయి, మళ్ళీ కథ మొదలు..ఇట్లాంటి సన్నివేశాలు సినిమాల్లోనే కాదు, నిజజీవితంలో కూడా బోలెడు. చూసినప్పుడల్లా ముసిముసినవ్వులు దగ్గరనుండి పొట్టపట్టుకొని నవ్వాల్సి వచ్చే సందర్భాలూ ఉంటాయి, ఏం జరగబోతుందోనన్న సస్పెన్స్ తో బాటు. అచ్చు అలాంటి వినోదాన్ని, కుతూహలాన్ని రేకెత్తించే రొమాంటిక్ కామెడి చిత్రం ’చష్మ్-ఎ-బద్దూర్’. 

ఇదో ముగ్గురి బాచలర్స్ కథ. ముగ్గురూ ఢిల్లీలో రూమ్మేట్స్! ఒకడికి షాయరి అంటే ప్రాణం. మరొకడికి సినిమాలు. ఇంకోడికి పుస్తకాలు. నిరుద్యోగులు. ఢిల్లీలో ఉన్న వేలకొద్దీ అందమైన అమ్మాయిల్లో వాళ్లకోసం ఎవరో ఉంటారులే అని సిగరెట్లను ఊదిపారేసినంత తేలిగ్గా, కనిపించిన ప్రతి అమ్మాయి దగ్గర మనసు పారేసుకుంటుంటారు. ఒక పూట ఉన్న ముగ్గుర్లో ఇద్దరికి ఒకే పిల్ల మీద కన్నుపడుతుంది. వారి శాయశక్తులా ప్రయత్నిస్తారు గానీ, భంగపడతారు. అనుకోని విధంగా కొన్ని రోజులకు అదే అమ్మాయితో మూడోవాడికి పరిచయం కలుగుతుంది. పరిచయం నుండి ప్రేమ నుండి పెళ్ళి నిశ్చయం వరకూ రాజధాని బండిలా శరవేగంతో దూసుకుపోతుండా, కుళ్ళుతో మిగితా ఇద్దరూ చెయిన్ లాగేస్తారు. బండి ఆగిపోతుంది. ఆగిన ఈ బండి మరలా ఎలా కదిలింది? అన్నది క్లైమాక్స్ లో తేలుతుంది. (సినిమా టైటిల్ ’ఛష్మ్-ఎ-బద్దూర్’ అన్నది స్నేహితుల మధ్య ఈర్ష్యాసుయలు రాకుండా ఉండాలని అనే మాటట. దిష్టి తగలకుండా ఉండేందుకు అంటుంటారట. ఈ ముగ్గురూ ఉండే ఇంటి తలుపుకి దిష్టి బొమ్మతో పాటు, ఇది రాసి ఉంటుంది!)

కథ అదైతే, కథ చెప్పిన తీరెట్లాగ ఉంటుందయ్యా అంటే, “అర్రె.. నీకు తెల్సా, మేం ఢిల్లి రూమ్‍లో ఉండగా, ఓ సారి.. “ అంటూ మనకు తమ అనుభవాలను పంచుకునే స్నేహితులెవరో కథ చెప్పుకొస్తున్నట్టు ఉంటుంది. (నాకైతే గ్రూచో మార్క్స్ పుస్తకం బా గుర్తొచ్చింది.)  సినిమాలో కథను ఎవరూ నరేట్ చేయరు. ధర్డ్ పార్టీ నరేషన్. అయినా కూడా సినిమా చూస్తున్నంత సేపూ, నేను టివి ముందు కూర్చొని చూడ్డం లేదు, అదో ఆ గదిలో ఒక మూలనో, లేక ఆ రోడ్డుపై అటు వెళ్తుండగానే ఈ కుర్రాళ్ళు కనిపిస్తుంటారు అని అనిపించింది. అంత సహజంగా తీసారు. ఒకట్రెండు పాటలూ, క్లైమాక్స్ నూ తప్పిస్తే మిగితా ప్రతీది నిజజీవితంలో జరిగినదే అంటే నమ్మేయచ్చు. పాత్రోచితమైన సంభాషణలూ, వేషధారణలూ అన్నీ వాస్తవానికి దగ్గరగా ఉంటాయి.

నటీనటులు బాగా నటించారు అనటం అల్పోక్తి అవుతుందేమో! హీరోయిన్‍ను పక్కకు పెడితే, ముగ్గురు అబ్బాయిలకూ (ఫారూఖ్  షేక్, రవి బిస్వాని, రాకేష్ బేడి) “కథ ఇట్లా ఉంటుంది. ఇహ, మీ ఇష్టం” అని మాత్రమే చెప్పేరేమో మరి. అలా అల్లుకుపోయారు కథలో, కథతో. ఆడినా, పాడినా, కలలు కన్నా, కల్లబొల్లి మాటలు చెప్పినా అన్ని చెల్లింపజేసారు. పైగా ఈ చిత్రం చేసేసరికి వీళ్లంతా కూడా రెండుపదుల వయసులో అప్పుడే అడుగుపెట్టినవారో, ఏమో, ఆ మొహాల్లో లేతదనం వగైరాల వల్ల  కాలేజి విద్యార్ధులుగా అనిపించడమే కాదు, కనిపించారు కూడా. ముగ్గురి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా పలికింది. కామెడి విషయంలో ముగ్గురూ ముగ్గురే! హీరో-హీరోయిన్ మధ్య రొమాన్స్  పెరట్లో పూసిన గులాబి పూవుకు మల్లే తాజాగా అనిపించింది. రేఖా, అమితాబ్‍లు అలా ఓ సారి తళుక్కుమని పోతారు, సినిమాలో. అందరికన్నా ’పాన్ వాలా’గా వేసిన ఆయన భలే నచ్చారు నాకు. బాకీలు వసూలు చేసుకోవటంలో కఠినంగా ఉండాలనుకున్నా, ఇట్టే కరిగిపోయే పాత్రలో ఆయనది.

Out and out comedy అయిన ఈ సినిమాకు అసలు సిసలైన ’హీరో’, నా ఉద్దేశ్యంలో, ఈ చిత్ర దర్శకురాలు సాయి పరాన్‍జపే! యనభైల్లో ఓ మహిళా దర్శకురాలు ఓ బాచిలర్స్ కథను తీసుకొని ఇంత సమర్థవంతంగా తెరకెక్కించారంటే నాకింకా నమ్మశక్యం కావటం లేదు. నాలాంటి వాళ్ళుంటారనేనేమో, టైటిల్స్ లో డైరెక్టర్ గురించి వచ్చినప్పుడు మగచేతులను పక్కకు నెట్టి ఆడచేతులు కనిపిస్తాయి తెర మీద. సాయివి మూడు సినిమాలు చూసాను. ’స్పర్ష్ ’ కొంచెం గంభీరమైన సినిమా. ’కథ’లో కామెడి కన్నా ఒక సెటైర్, మారుతున్న కాలాన్ని ప్రతిబింబించాలనే ప్రయత్నం కనపడ్డాయి. రెండు సినిమాలూ చాలా నచ్చాయి. కానీ ఒక ’చష్మే బద్దూర్’ ఆవిడ మీద నాకు ఎనలేని గౌరవాన్ని పుట్టించింది.

కామెడి తీయడం, రాయడం,  చేయడం చాలా కష్టం, అది అందరి వల్లా అయ్యేపని కాదు అని ఓ పక్క అంటూనే, సక్సస్‍ఫుల్‍గా కామెడి చిత్రాలను తీసినవారిని మాత్రం ’ఆ..ఉత్త కామెడి డైరక్టర్లే!’ అని తీసిపారేయటం కూడా కద్దు. ఈవిడ ఈ చిత్రానికి దర్శకత్వమే కాక, కథ, మాటలూ, స్క్రీన్ ప్లే విభాగాలనూ చూసుకున్నారు. కథలు బాగా నడిపించారు. మాటలు మాత్రం ’వహ్వా!’ అనిపించేలా ఉన్నాయి. (హింది అంతగా రాని వారు, సబ్‍టైటిల్స్ లేక హింది / ఉర్దూ బా వచ్చిన వాళ్ళ సాయం తీసుకోవాలి అని నా సలహా!) అబ్బాయిలు అచ్చంగా ఎలా మాట్లాడతారో అలానే ఉన్నాయి. ఏ మాత్రం డైల్యూట్ అవ్వనివ్వలేదు.

సందర్భానుసారంగా వచ్చే పాటలూ బాగుంటాయి. హీరోయిన్ సంగీతం నేర్చుకుంటుంటుంది కాబట్టి ఆమె మనఃపరిస్థితిని పాటల్లో పలికించి, కథ చెప్పటంలో భాగంగా వాడుకున్నారు.

హింది సినిమాలు నేను చూసింది తక్కువే అయినా, ఇట్లాంటి చిత్రం చాలా అరుదైన చిత్రమే అని చెప్తాను. రోజువారి జీవితంలో సగటు మనుషుల మధ్య జరిగే సన్నివేసాల్లో అసభ్యం, పిల్లతనం కాకుండా చక్కటి, చిక్కటి హాస్యం పండించచ్చు అన్న నిజాన్ని నిరూపించిన సినిమా. అదే సమయంలో, కుటుంబ ప్రేక్షకులకు వినోదాన్ని అందివ్వాలని కథలో ఎక్కడా కృతకంగా చూపలేదు. బాచ్‍లర్స్ ఉండే గదిని బాచ్‍లర్స్ ఉండే గదిగానే చూపించారు. అర్థ నగ్నంగా ఆడవారి వాల్ పోస్టర్లూ, చెత్తా చెదారం, గది సుబ్బరంగా లేకపోవటం లాంటివన్నీ ఉంటాయి. వాటితో కామెడి పండించిన తీరు మాత్రం ’క్లీన్’. ఒక భారతీయ సినిమాలో  ఏడు పదులు దాటిన ముదుసలి ’ప్లే బాయ్’ తిరగేయడం చూసి తీరాల్సిన సీన్, అది ఒక అరనిముషం పాటే ఉన్నానూ.

అలా వీధిలోకి అన్యమనస్కంగా వచ్చినప్పుడు ఓ ఆడపిల్ల కనిపించగానే కళ్లింతై, ఒళ్ళు పులకరించినప్పుడల్లా గుర్తొచ్చే సినిమా. బైక్ మీద విన్యాసాలు చేస్తూ ఈల వేస్తూ ఏ కుర్రాడు కనిపించినా గుర్తొచ్చే సినిమా. ఒకటే పైకప్పు కింద కొన్ని సంవత్సరాలు గడిపి, ఆకలిని, ఆనందాన్ని కలిపి పంచుకున్న ఏ ముగ్గురి/నలుగురి ’యారీ’ (స్నేహపు) కథ విన్నా గుర్తుకొచ్చే సినిమా.

“మాది కామెడి సినిమా. అంటే తమరు తమ తమ బుర్రలని ఇంట్లో పెట్టుకొని, తాళాలవీ జాగ్రత్త వేసుకొని వచ్చి మా సినిమా చూడాలి. అంతే గానీ కథ లేదు, లాజిక్ ఏదీ? అంటూ మొదలెట్టకూడదు” అంటూ సినిమాను ఎలా చూడాలో ఛానల్ ఛానల్‍కూ వచ్చి ప్రేక్షకులకు బ్రెయిన్ వాష్ చేస్తున్న ప్రస్తుత తరం కామెడి డైరెక్టర్లూ, ఆక్టర్లూ తిని వదిలేయగా మన బుర్రల్లో మిగిలిన గుజ్జుకు కాస్త అయినా స్వాంతన, ఓదార్పు కావాలనుకున్నప్పుడల్లా చూడాల్సిన సినిమా.

టైటిల్ కార్డ్స్ దగ్గర మెల్లగా పైకి ఎగసిన కనుబొమ్మలతో పాటు అరవిరిసిన చిర్నవ్వులు మొదలుకొని ఆద్యంతం నవ్వుల్లో ముంచి లేవదీసే ఈ చిత్రాన్ని ఒకేసారి చూసినా చిత్రంగా నవ్వుల ఖజానాన్ని మొత్తం మనలోనే ఎక్కడో  నిక్షిప్తమైపోతుంది. ఇప్పటి వరకూ చూడకపోయుంటే వెంటనే చూడండి. చూసేసి ఉంటే, మళ్ళీ చూడండి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s