హే రామ్,
జీవితం ఒక కఠనమైన యదార్థం
నువ్వేమో ఓ మహాకావ్యం
నీవల్ల కాదులే
ఈ అవివేకంపై విజయం
దానికి పది కాదు, ఇరవై కాదు
ఉన్నాయిప్పుడు లక్షల్లో తలలు, లక్షల్లో చేతులు
విభీషణుడు ఇప్పుడు
ఎవరి వైపునున్నాడో మరి
ఇంతకన్నా పెద్ద ఏం జరుగుతుందిలే
మన దౌర్భాగ్యం
ఒక వివాదాస్పదమైన స్థలానికి పరిమితమై
పోయింది నీ సామ్రాజ్యం
అయోధ్య ఇప్పుడు నీ అయోధ్య కాదు
యోధుల లంక అది,
’మానస’ నీ ’చరితం’ కాదు
ఎన్నికల భేరి అది!
హే రామ్, ఎక్కడ ప్రస్తుత కాలం
ఎక్కడ నీ త్రేతాయుగం
మర్యాదా పురుషోత్తముడివి నువ్వెక్కడ
ఎక్కడ నీ నేతా-యుగం
సవినయంగా మనవి చేసుకుంటున్నాను, వెళ్ళిపో ప్రభూ
ఏ పురాణంలోకో, ఏ మతగ్రంధంలోకో
క్షేమంగా, లాభంగా
ఇప్పటి అడవులు అప్పటి అడవులు కావు
వాటిల్లో వాల్మీకి తిరుగాడడానికి
కున్వర్ నారాయణ
మూలం: హిందీ
అనువాదం: పూర్ణిమ
Like this:
Like Loading...
Related
Leave a Reply