ఎందుకు ఇది?
ఇదేదో ఒక్కళ్ళు అన్నారని తిక్కరేగి రాయాల్సి వచ్చింది కాదు. ఎప్పట్నుంచో సుడులు తిరుగుతున్న ఆలోచనలు. ఒకటే జోరీగల నస ఎంత కాలం భరిస్తాం, ఎవరమైనా? “ఆమెకి క్రాఫ్ట్ మీద అతి-శ్రద్ధ”, “కథకన్నా క్రాఫ్టు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది”, “ఆ… మీకు తెల్సా ఆమె వర్క్ షాపులూ, కోర్సులూ చేస్తుంది తెల్సా రాయడానికి”, “బాగా పొగరమ్మా మనిషికి, బా చదువుకున్నాననీ!” లాంటి మాటలు పడీపడీ ఉన్నాను నాతోటి వాళ్ళతో. ఏళ్ళు గడుస్తున్నాయి కాబట్టి కొత్త బాచ్‍లు రాస్తున్నారు. వీళ్ళు వాళ్ళదగ్గర్నుంచి కాపీ పేస్ట్ చేస్తున్నారు. అది సహజం. మేము కూడా stackoverflow.com నుండే కోడ్ ఎత్తుకొస్తుంటాం. కానీ అదైనా తేడా జరిగితే software ఈడ్చి తన్నుతుంది. అసలు కోడ్ అధమంలో అధమమైనా పనిజేయగలదా అని చెప్పడానికి మాకు compilers ఉంటాయి. మీకేం ఉంటాయి సాహిత్యంలో? గ్రూపులు తప్ప. అందులో కాస్త కరిస్మా ఉన్నవాళ్ళెవరో ఒకళ్ళు గట్టిగా ఓ ఆక్-పాక్-కరిపాక్ థియరీ చెప్తే, మిగితావాళ్ళు గుడ్డిగా “మమ” అనుకోవడం తప్ప.
ముందు బాచ్ వాళ్ళు కనీసం అరకొర మాటలని వదిలేసి మళ్ళీ పట్టించుకోలేదు. ఈ కొత్త బాచ్‍కి నాచేత “సరిగ్గా” కథ రాయించాలనే దురద. అందుకని ఇప్పుడు నేను ఇదంతా వాగేసి అందరి కళ్ళూ తెరిపించేయాలనేం కాదు. కొత్తా,పాతా తేడా లేకుండా వీళ్ళందరికీ మెంటల్ బ్లాక్స్ ఉన్నాయి నేనన్నా, నేను రాసేవన్నా – ముందునుంచీ ఉండి ఉంటాయి, నా విషయంలో బా తెల్సొస్తున్నాయంతే! అవి పోవాలంటే ఓ జీవితకాలం పట్టచ్చు. Also, I’m not your therapist. పోయిన వారమే ఓ కొత్త కథ రాసి పంపించాక, పవన్ సంతోష్‍తో, “తెలుగువాళ్ళకి కథ అర్థం కాదనే ఫీడ్‍బాక్ వచ్చింది ఇద్దర్నుంచీ!” అన్నాను. దానికి సమాధానం: “రాసిన మీరు తెలుగువారు కాదా? చదివిన నేను తెలుగువాణ్ణి కాదా? మనలాంటి కనీసం ఓ పదిమందైనా ఉండరా? వాళ్ళకోసమే కదా ఈ కథ!” ఆ నమ్మకంతోనే చెప్తున్నా. తెలుగు సాహిత్యలోకం గొడ్డుపోయుండచ్చు గానీ, తెలుగుజాతి మీద ఇంకా ఆశలున్నాయి నాకు. వాళ్ళకి చెప్తున్నాను.
లిటరరీ డిబేట్లు, డిస్‍కోర్సులు లాంటి పాడు అలవాట్లు మనకి లేవు కనుక, గాసిప్-స్కాండల్-బిచింగ్ మాత్రమే మనకి చేతనవును కనుక, ఇప్పుడు దీన్ని కూడా “ఎవరి మీద కోపమో? ఆ మాట ఎవర్ని అని ఉండచ్చంటారూ?” కి మించి ఆలోచించరు కనుక (నో, నేను మైండ్ రీడింగ్ చేయడం లేదు. నా ఫేస్‍బుక్ పోస్ట్స్ కి వచ్చే రెస్పాన్స్ ఇదే, ముఖ్యంగా తెలుగు సాహిత్యం జనాభా గురించి రాసినప్పుడు.) ఇది తక్కినవారికి గాసిప్ మెటీరియల్‍గా అయినా పనికొస్తుంది. మీ వాట్సాప్ గ్రూపుల నోటిఫికేషన్లు ఆగకుండా వచ్చుగాక!
శిల్పం గిల్పం
కొందరికి నేనంటే ఒక ఇమేజ్ ఉంది. నేను కథలు ఎట్లా రాస్తానన్న ఇమేజ్. కథ పూర్తి చేసేసరికి బల్ల మీదంతా రక్తం. నా చేతులకంతా రక్తం. ఎందుకంటే ఒక కథ బుజ్జి పిట్టలా నా దగ్గరకొస్తే నేను దాన్ని హింసించి, ఈకలు పీకి లాగి, దాని కాళ్ళకి ముళ్ళదారం కట్టి, సన్నపాటి ఊసలు దించి, దాన్నో ఊపిరాడని పెట్టెలో పెట్టి పార్సెల్ చేస్తానన్న మాట. ఎందుకలాగ అంటే నేను బయటనుంచి, మన ఇంటావంటా లేని, ఏవో పాడు తంత్రాలు, కుయుక్తులవీ నేర్చుకుని ఇట్లా ఇరికిస్తేనే కథ అవుతుందని పిచ్చి ఊహలు పెట్టుకున్నానట. అందుకని నేను రాసిన కథ చదవగానే “అయ్యో… కథ చచ్చిపోయిందే!” అని ప్రాణం ఉసూరుమంటుంది వీళ్ళకి. (Ironically, నా బ్లాగ్‍లో కాకుండా బయట వచ్చిన మొదటి కథ పేరు అదే! 🙂 )
సారంగ-1లో అరిపిరాల గారు, ఇంకొకరు ప్రతి నెలలో వచ్చిన కథలని పరామర్శించేవాళ్ళు. అందులో “ఏనాడు విడిపోని ముడి వేసెనే” కథతో పాటు ఇంకెవరిదో కథని కూడా ప్రస్తావిస్తూ (నాకు గుర్తున్నది రాస్తున్నా): “శిల్పం వల్ల కథకి కొత్త బలం వచ్చుండచ్చు, కానీ అది కథని పాఠకునికి బాగా దూరం తీసుకెళ్ళింది. పాఠకుల్ని దూరం చేసేంతటి శిల్పం కథకి అవసరమా?” అలాంటిదో ప్రశ్న ఏదో లేవదీశారు. ఆ వ్యాసం ఆ ప్రశ్నతోనే ముగుస్తుందని గుర్తు. అది చాలా ముఖ్యమైన ప్రశ్న. కానీ ఎవరూ దాన్ని చర్చించలేదు. (వాళ్ళంత కష్టపడి రాసినవి అసలెంత మంది చదివారో అన్నదే డౌట్ నాకు). నేనూ మాట్లాడలేదు. నా కథని డిఫెండ్ చేసుకుంటున్నట్టు ఉంటుందని.
ఇప్పుడు ఇలా రాయడం డిఫెన్స్ లా కనిపించచ్చు. అట్లాంటి ఓ ప్రశ్నను తీసుకుని దానికి నేను రాసిన కథలు మంచి ఉదాహరణలు కాబట్టి, అనలైజ్ చేసి, అవుననో కాదనో సమాధానం ఇవ్వచ్చు. అబ్బే! మన ఆక్-పాక్-కరేపాక్ థియరీల గురించి మనం గాల్లో దోసెల్లా వేయగలమే తప్పించి, ఒక అంశంతో మానసిక కుస్తీ (mental wrestling) చేయగలమా? ఇట్లా కుస్తీపడుతూ కూర్చుంటే గాల్లో దోసెలెలా వేస్తాం? తోటి రచయితలు ఆ దృష్టితో చూడనే చూడరు. విమర్శకులు అని చెప్పుకుంటున్నవారికీ ఆలోచన రాదు. ఒకవేళ వాళ్ళకి అనిపించి, అందులో నా కథలు గుర్తొచ్చినా, వాళ్ళ half-assed job కన్నా “conflict of interest” ఉన్నా కూడా నేనే బా చెప్పగలను. వాళ్ళకి నాకున్నంత objectivity కూడా ఉండదు మరి.
నా కథలు నేనే అచ్చేసుకుని, నేనే రివ్యూ చేసుకుని, నేనే అవార్డు ఇచ్చుకునే పరిస్థితి ఎటూ తప్పదని అర్థమైంది కనుక, ముందు డిఫెన్సుతో మొదలెట్టడంలో తప్పులేదు. “ఏమో గుర్రం ఎగురావచ్చు” స్కీము కింద రేపు నాకు అవార్డులూ, రివార్డులూ వచ్చేవరకూ ఆగి, అప్పుడు “you losers!” అని అనచ్చు. కానీ, ఆ అవసరం లేదు నాకు. నేనేం రాస్తున్నానో, ఎందుకు రాస్తున్నానో నాకు తెల్సు. External validation వల్ల ఆత్మవిశ్వాసం పెరగచ్చు గానీ, నా surefootedness ని చెప్పడానికి అది అవసరం లేదు.
“ఏనాడు విడిపోని ముడి వేసెను” మొదటి డ్రాఫ్ట్ రాసీ రాయగానే సౌమ్యకి పంపించాను. “ఏముంది ఇందులో, ఇలాంటివెన్ని రాలేదు? నేనే రాసా ఇలాంటిది ఒకటి” అని తన పాత కథ (ఈమాటలోదే అనుకుంట) పంపింది. మొదటి డ్రాఫ్ట్ గానీ డైరెక్టుగా పబ్లిష్ చేసుంటే plagiarized అనుకోవచ్చు. పాత్రలు పేర్లు, సన్నివేశాలూ వేరే అయినా కథ దాదాపుగా ఒకేలా నడిచింది. కానీ నేను చెప్పాలనుకున్న కథ అది కాదు. సౌమ్య కథలో domestic disturbance ఉంటే, నేను అనుకున్నది ఒక unknown gloom వల్ల వాళ్ళిద్దరి మధ్య కష్టకాలం. నేను మొదటి డ్రాఫ్ట్ లో అదే తీసుకొచ్చా అనుకున్నా గానీ అది రాలేదు. అంటే, ఆ అబ్బికి ఆ పూట బాలేదు అన్నదాన్ని నేను బాగా రెజిస్టర్ అయ్యేలా చెప్పాలి. మళ్ళీ రాశాను. కానీ కథంతా అబ్బిది అయిపోయింది, ఎక్కువ అతని గురించి రాస్తున్నాను కాబట్టి. కానీ కథ అమ్మాయిది. ఆమెకి ఎంత అమోమయపు కష్టంలో ఉంది అనేదే. (Yes, it’s about the caretaker. I was sure.)
ఆమె కష్టాలూ, కన్నీళ్ళూ కూడా రాసుకుంటూ పోతే చదవడానికి నాకే నీరసమొచ్చింది. మామూలుగా అయ్యే గొడవలలో ఒక సంఘటన, ఒక అదుపు తప్పిన మాట, కొన్నాళ్ళుగా మగ్గుతున్న కోపం ఇలాంటివేవో ఉంటాయి. కోపమొచ్చి ముసుగుతన్నడం, అర్చుకోవడం వగైరా. కానీ ఈ అబ్బికి ఉన్నది (మనకి తెలీని) ఒక recurring mental ailment. దానికి ఆమె అడ్జస్ట్ అయిన విధానం చెప్పాలి. అసహాయతలోంచి వచ్చిన అసహనం చూపించాలి. బా ఆలోచించాక నాకు తట్టింది ఏంటంటే, ఎటూ నిజజీవితంలో అయితే అతనికి ఉన్నది ఒక invisible ailment కాబట్టి, కథలో దానికి రూపం ఎందుకు ఇవ్వకూడదు? ఒక physical manifestation ఇచ్చి చూస్తే ఎలా ఉంటుందని?
ప్రయత్నించాను. పని చేస్తుందనిపించింది. అబ్బి సమస్య బా రెజిస్టర్ అవుతుంది, దారాలు వంట్లోంచి పుట్టుకురావడమనేది ఎంతటి పరమ లేజీ పాఠకుడైనా అయినా తప్పించుకోలేని ఇమేజ్. అతి కొద్ది స్పేస్ లో దాన్ని రిజిస్టర్ చేసేశాను కాబట్టి, వాళ్ళిద్దరి ప్రేమకథనీ, అన్యోన్య కాపురాన్ని ఆవిష్కరించుకోడానికి బోలెడంత జాగా దొరికింది. ఆమెకెటూ అదో తెలవారని రాత్రి కాబట్టి గతమంతా తిరగతోయడానికి చక్కగా కుదిరింది. ఎటూ అతనంటే చచ్చేంత ఇష్టమని చూపించగలిగాను కాబట్టి (కాస్త మనసుపెట్టి చదివే) పాఠకుడి ధ్యాస ఇంకెటూ పోదు. ఆమె పడిన తంటాలలోనే ఆ పాఠకుని దృష్టి నిలుస్తుంది.
ఈమాటకి పంపిస్తే కాస్త పని చేయించి, చేసి మొత్తానికైతే బాగా వచ్చిందన్న నమ్మకం వచ్చాకే వేశారు. “ఇంకా బాగా రాయాలి”, “ఇంకా నేర్చుకోవాలి” లాంటి ఉచిత సలహాలే నా పేరు రాసిన పక్కనే రాసేవారు, రాస్తుంటారు కాబట్టి, సారంగలో దీని గురించి ప్రస్తావిస్తారనీ, అదీ ఆలోచించి ప్రస్తావిస్తారనీ అనుకోలేదు. కానీ ఆలోచించినట్టే ఉన్నారు. అందుకే ఆ ప్రశ్న అడిగారు.
పాఠకుడికి దూరం చేసే శిల్పం, సంక్లిష్టత కథకి అవసరమా?
మనం చెప్పాలనుకుంటున్నదే పాఠకులకి కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేలా ఉండాలనేది లోకమంతా కోడై కూసే మాటే. కానీ అది ఎక్కడ్నుంచి వస్తుందన్నది కూడా మనం గమనించుకోవాలి. పుస్తకాలు వస్తువులుగా మారి, అమ్ముడుపోయి, రాసినవారికి వేసినవారికి డబ్బు తెచ్చేక మొదలైన నరేటివ్ ఇది. అది తప్పని నేను వాదించడం లేదు. కానీ అదో దాటకూడని గీత అంటే కూడా నేను ఒప్పుకోను. (చూశారా, గీతలని బేఖాతరు చేస్తుంది నేను. గిరిగీసుకుని కూర్చుంటుంది మీరు.)
పైన నేను చెప్పిన విధంగా, కథ అమ్మాయి వైపునుంచే చెప్తున్నా, కానీ అబ్బి సమస్యనూ బలంగా ఎస్టాబ్లిష్ చేసి, వాళ్ళిద్దరికీ ఇంకేం పేచీలు లేవు, దీనితోనే సతమతమవుతున్నారు అన్నది నేను చెప్పాలనుకున్న కథ. దానికి నేను కాస్త మాజిక్ రియలిజం టచ్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే, మానసిక సమస్యలు మనకి కనిపించనంత మాత్రాన లేనట్టు కాదు, అవి ఉన్నప్పుడు ఇలాంటి యాతనలు పడాలి అనేది చెప్పడం కాబట్టి. మానసిక సమస్యల గురించి మనకి పెద్ద అవగాహన లేదు కాబట్టి దాన్ని relatable చేస్తూనే, మరో శారీరిక సమస్య ఇది అనే ఆలోచనకి ఆస్కారం లేకుండా, దాన్ని non-realగా కూడా ఉంచాను. (అంతే గానీ, ఎవరో మాజిక్ రియలిజం గురించి కథ రాసుకునిరా పో, అంటే నా సబ్మిషన్ కోసం ఇద్దర్ని (పాత్రలే అయినా) నేను పెట్టిన క్షోభ కాదది.)
అన్ని తిప్పలెందుకు? డిప్రషన్ అనో, మరోటనో పేరే చెప్పి “తేలిగ్గా రాయొచ్చు కదా” అని ప్రశ్న రావచ్చు. పేరు ఎందుకు చెప్పకూడదని నా పట్టు అంటే, మనకున్న మిడిమిడి జ్ఞానంలో డిప్రషన్ అనో, ఇంకోటనో అంటే ఒక్కో అర్థం తీయచ్చు. చేతికి ఫ్రాక్చర్ అయ్యి కాస్ట్ వేసేరు అంటే మన అందరికి 99% ఒకేలా అర్థమవుతుంది. మానసిక సమస్యలు అలా కావు. “ఆ… బా డబ్బు చేసినోళ్ళు వేసే వేషాలు. దుక్కలా ఉన్నాడు, ఏం మనాది వాడికి?” అనే ఆస్కారం నేనివ్వదల్చుకోలేదు. Whatever shit it is, point is, it is happening. Now, you watch how the couple deals with it. అంతే!
తెలుగువాళ్ళల్లో బలంగా నాటుకుపోయిన నమ్మకమేటంటే: కథావస్తువు, శిల్పమూ పూర్తిగా వేర్వేరు. ఆ పూట మూడ్ బట్టి వేసుకున్న బట్టల్లానో, మాచింగ్ దుద్దుల్లానో శిల్పాన్ని ఎన్నుకోవచ్చు. అది కొందరి విషయంలో నిజమే అయ్యుండచ్చు. కానీ నా ప్రయాణం వేరు. కథావస్తువుతో పాటు దాదాపుగా నాకు శిల్పం కూడా అదే వచ్చేస్తుంది (ఆరెక్స్ మారేజ్, ఫిజూల్ కథ). అలా రానప్పుడు నన్ను నా తిప్పలు పెట్టి కథావస్తువే దానిక్కావాల్సిన శిల్పం అది వెతుక్కుంటుంది. ఆ వెతుకులాట నీరసం తెప్పిస్తుంది. ఎందుకంటే, ఒక్కో కథకీ ఒక్కోసారి నేను నాలుగు డ్రాఫ్టులు రాయాల్సి వస్తుంది. అట్లా రాసే ఓపిక లేక / శ్రద్ధ లేక రాసినవి అయితే పేలవంగా ఉండిపోయాయి (ఉదా: కినిగెలో వచ్చిన witchorbitch, ఇంకో కథ). లేదా వెనక్కి తిరిగొచ్చాయి.
ఇది కరెక్టా, కాదా. ఇలా రాసినవి కథలా, కాదా అన్న చర్చ నేను పెట్టదల్చుకోలేదు.
ఇది నా ప్రాసెస్. పీరియడ్.
ఇక్కడింకో మాట: బ్లాగ్‍లు చదవడం మొదలెట్టినప్పుడు నా టాప్ రెండు బ్లాగ్స్, మెహర్‍ది కలంకలలు. గౌతమ్‍ది రెండు రెళ్ళు ఆరు. పైపైన చూస్తే ఈ రెండు బ్లాగులకీ భూమీ ఆకాశాలంత తేడా ఉంటుంది. ఒకటి పరమ సీరియస్ లిటరరీ బ్లాగ్ – ఫణి రాసిన ఒక వాక్యం చదివేసరికి నాకు ఆయాసం వచ్చేది. ఇంకోటి – ఫుల్టూ మజా, గౌతమ్ రాసిన ఏదో ఒక పంచ్ లైన్ చదివి నవ్వి నవ్వి కడుపునొప్పి వచ్చేది. అట్లా అని కలంకలలే ముఖ్యమైన, తరతరాలకి అందించాల్సిన బ్లాగ్, రెండు రెళ్ళు ఆరు టైమ్ పాస్ బ్లాగ్ అనగలమా? అనలేం. ఎందుకు? పొట్లం కట్టడానికి కామెడీ వాడినా గౌతమ్ లోపల పాక్ చేసినవి మన బతుకుల్లోని చాలా pertinent సంగతులు. ఉద్యోగాలలో స్ట్రెస్, ప్రేమలలో setbacks, స్నేహాలలో craziness – అన్నీ ఉన్నాయి. ఆ పొట్లం విప్పి చూడ్డమే, రీడర్‍గా నాకు rewarding experience.
“You need to chill a bit, dude,” అని ఫణితో, “Man, bachpana chodo and get serious,” అని గౌతమ్‍తో అనడం అర్థంలేని మాట. వాళ్ళు ఎలా express చేయగలరో అలా చేశారు. ఇద్దరి తరఫునా నేను చెప్పగలను, “ఇలా రాయాలి మనం. అప్పుడు ఎక్కువమంది చదువుతారు” అని రాయలేదు. వాళ్ళలోంచి అదెలా బయటకొస్తే దాన్ని అలా రానిచ్చారు.
పి.సత్యవతి గారిని కూడా “మీరు భలేగా రాస్తారు, మీకా ఆలోచన ఎలా వచ్చింది? ఆ ఉదయం ఏం ఫలహారం తిన్నారు?” టైపు అడుగుతుంటారు. మైండ్ కూడా కన్నులా (మనిషి కన్నులానో, కెమరాలానో) పనిజేస్తుంది. అది పరిశీలిస్తున్నవాటిని ఒకలా ప్రాసెస్ చేస్తుంది. అంత చదువు చదువుకున్న అమ్మాయి పెళ్ళి చేసుకుని వ్యక్తిత్వమే మర్చిపోతే ఆవిడ ఫెమినిస్ట్ లెక్చర్ ఇవ్వలేరు. సర్రుమనేలా అలాంటి వాతే పెడతారు. That is her! That’s why have only one P. Sathyavathi! ప్రాసెస్ చేసుకుంది ఒకరికి కామెడిలా బయటకొస్తే, ఇంకొకళ్ళకి వ్యంగ్యంలా వస్తుంది. ఒకరికి గాఢమైన, చిక్కని వచనంలా వస్తే, ఇంకొకళ్ళకి కవిత్వంలా వస్తుంది.
You can’t ask why their mind processes it that way. You can’t mock me for how my mind works. This is no different from body-shaming, if you think of it. వాళ్ళు రాసేవి మాకు బాగా నచ్చుతాయ్ మరి, అందుకని సమస్యలేదు. మీరు రాసేవి చదవాలంటేనే విసుగొస్తుంది అంటే – దాని గురించే ఏడ్వండి, ఫోకస్ పెట్టి. “నువ్వు రాసేవి చెత్త/కంపు/ఏడుపుగొట్టు/depressing/baffling” – అది మీ లైన్. ఆ లైన్‍ని ఎంత దూరమన్నా లాక్కుని వెళ్ళండి, మీకు నచ్చిన విశేషణాలూ, తిట్లూ పెట్టుకుంటూ. ఆ లైన్ నుంచి బయటకొచ్చి అంటే అది psycho-analysis, value judgements కిందకి వస్తుంది.
షేమ్ – షేమ్ గేమ్
ఇందాక అనుకున్నాం కదా, శిల్పమనేది వేసుకునే బట్టల్లాంటిదని, తెలుగువాళ్ళకి. ఒకవేళ, ఒక సాహిత్య సభకి, అందరూ అయితే ఫాబ్ ఇండియా బట్టలో, లేదా కళంకారీ, ఇక్కత్ వగైరా వగైరా వేసుకొచ్చిన చోటుకి నేను డిస్కో డాన్సర్‍లో మిథున్ చక్రవర్తిలా బల్బులు పెట్టుకుని జిగేల్ జిగేల్ డ్రస్ వేసుకొచ్చానే అనుకుందాం. నవ్వు ఆపుకోలేకపోవడం, నవ్వేయడం, ఆ బల్బుల లైట్ మొహానికేసి కొడుతుంటే మొహం చిట్లుంచుకోవడం – అన్నీ మానవ సహజం! అన్నింటి మధ్యన కూడా అక్కడ నేనేదో మాట్లాడాను, నేను చెప్పాలనుకున్నది చెప్పాను. మీరు పట్టించుకోలేరు. పోనీ, మొదటిసారి కష్టం.
నేను మళ్ళీ మళ్ళీ అలానే వస్తుంటాను. మీరు మళ్లీ మళ్ళీ అలానే నవ్వుతారు, మొహం చిట్లించుకుంటారు. నా మాట మాత్రం గాల్లో కల్సిపోతుంది.
నా కథలు చదవడం కూడా అలాంటి అనుభవమే అనుకుంటే, ఒకసారి వింత, రెండోసారికి రోత, మూడోసారికి పాత అయిపోవాలి కదా? ఎన్నాళ్ళిలా అరిగిపోయిన రికార్డులా: “శిల్పం ఎక్కువైంది!” అన్న మాట. ఎందుకలా అనిపిస్తుంది? ఎక్కడ ఎక్కువవుతుంది? ఎలా మార్చి రాయచ్చు? ఈ ఎక్కువవ్వడం వల్ల మొత్తం పాయింట్ మిస్ అవుతుందా? కొద్దిగానేనా? అసలు పాయింట్ ఏంటి? ఈ పాయింట్‍ని పెట్టి సులభతరంగా, తేలికగా, ఈజీగా రాసినవారున్నారా – వాళ్ళ కథలిచ్చి చూద్దామా? అసలు మనకి కొండెక్కినందుకు ఆయాసం వచ్చినా సూర్యాస్తమయం బాగనిపించిందా, లేక కొండెక్కలేక అసహనంతో అంటున్న మాటలా?
నాకివేవీ చెప్పకుండా మీరు మళ్ళీ మళ్ళీ అదే పాట పాడితే నేను అదే డాన్స్ వేస్తాను. Stephen King తన పుస్తకం, “On Writing”లో “You fool me once, shame on you. You fool me twice, shame on me. You fool me thrice, shame on both of us.” అని రాస్తారు. ఈ same-same shame-shame game ఎన్నాళ్ళు? దానర్థం, మీరు నాకు అది ఎందుకు సమస్యో అర్థం చేయించడం లేదు. ఎందుకు చేయించడం లేదంటే మీలో ఎవరికీ ఆ ఆసక్తి లేదు. కూర్చుని, ఇవ్వన్నీ అనలైజ్ చేసి, ఎక్కువతక్కువల జాబితా చేసే ఓపిక మీకు లేదు. ఓపికుంటే, కనీసం ఒక్కరైనా కనీసం అరకొర రిపోర్టైనా ఇచ్చేవారు. పి.జ్యోతి గారు ఇచ్చినట్టు బాక్‍వాటర్స్ గురించి రాస్తూ: “ఇది ట్రామా కథ! ప్రేమకథ కాదు. అమ్మాయి అబ్బాయి ఉన్నారని ప్రేమ కథ అనుకోవాలా? సరే అనుకుందాం” అని అన్నారు. ఆవిడో 33 మార్కులేసి మళ్ళీ ఏదో బుద్ధిపుట్టి గ్రేస్ మార్కులు వేశారు. మిగితావాళ్ళు అది కూడా చేయరు. పావని అనే ఆవిడ “రాజకీయం కానీదేమీ ఉండదు, ప్రతీ కథా రాజకీయమే” అంటారు, కానీ ఇందులో ఆవిడకి రాజకీయం కనిపించదు ఎందుకనో.
ఏ కథ ఏ గూటికి చేరుతుందో ఎవరికి తెల్సు?
రెండు పేరాలు కూడా చదవలేకపోయామంటే అది నా బాధ్యత మాత్రమే ఎలా అవుతుంది? ఏం? కథకి తన పాఠకుణ్ణి ఎన్నుకునే అధికారం లేదా? What if I say that the story has kicked you out because you weren’t in the headspace it demands? శోకం: ఒక పరిశీలన చాలా సంక్లిష్టమైన కథ. రాయడానికి, చదవడానికి మాత్రమే కాదు. అందులో డీల్ చేస్తున్న సబ్జెక్ట్ కూడా.
“పబ్లిష్ చేసినా ఇది నాలుగో కంటికి తెలీని కథగా మిగిలిపోతుంద”ని, “గుడి చుట్టూ మూడు ప్రదిక్షణలు చేసినట్టు పూర్ణిమ కథ మూడు సార్లు తప్పక చదవాల్రా బాబూ” అని ఎడిట్ చేసేటప్పుడు మేం చాలా జోక్స్ వేసుకున్నాం. “మీరు తప్ప ఎవరు రాయలేరండి” అని అంటుంటారుగా మన జనం, “ఈమాట తప్ప ఎవరూ వేయలేని కథ” అది. అంటే, కాపీ-పేస్ట్ జనాభా కాదు. చదివి, అర్థం చేసుకుని, విలువ తెలుసుకుని వేసేవాళ్ళు. ఈమాట టీమ్ కూడా తెలుగువాళ్ళనే తానులో ముక్కలే కాబట్టి సహజసిద్ధంగా ఉండే గాసిపింగ్- బిచింగ్ సెషన్స్ లో నాగురించి, నా కథల గురించి ఏమన్నా అనుకోవచ్చు. కానీ కథని పంపినప్పుడు మాత్రం కథకి వాళ్ళిచ్చే విలువకి మాత్రం నా దండాలు! కానీ ఆ సైట్ లేకపోయుంటే, “నేనూ, నా బ్లాగ్” అనుకుంటూ ప్రాణం సుఖంగా ఉండేది.
ఆ కథకి వచ్చిన ఒక కామెంట్. నేను ఊహించలేదు అలాంటిదొకటి ఈమాట పాఠకుల నుంచి సాధ్యమని:

That sealed the deal for me! That is what the story is about! It is this unexplainable, uncontrollable empathy for others – especially at the loss of self! ఇట్లాంటి ఒక్క కామెంట్ చాలు అర్థరహితంగా, ఓవరాక్షన్ చేస్తూ రాసే కథలు కావివి అని చెప్పడానికి. నాకు లైకులు, షేర్లూ, ఫేస్‍బుక్ లైవ్లూ, ఫాన్ క్లబ్బులూ, సన్మానాలు, శాలువాలు, అవార్డులూ ఏమీ వద్దు! వాటికోసం నేను రాయడం లేదు.
నేను ఆశించేది ఒకరిద్దరి పాఠకుల్ని. వాళ్ళు కథ చదివి ఈ ఆర్డరులో ఏ ఒక్కటి అనుకున్నా, నేను రాసింది సార్థకమే.
౧) ఇది నా కథ
౨) ఇది నాకు తెల్సిన కథ (పైన లలితగారు అన్నది)
౩) ఏదో ఉందబ్బా ఈ కథలో, జేబులో వేసుకుని ఉంచుకుంటాను.
ఇట్లాంటి పాఠకులు నాకు ప్రతీ కథకి ఒకళ్ళో ఇద్దరో తగులుతుంటే (కేవలం ఈమాట పాఠకులో, లేదా నా సర్కిల్‍లో ఉన్నవాళ్ళకే తెలుస్తుంది కదా! ఎవరూ వీటిని షేర్ చేసి, ఎందుకు బాగుందో చెప్పినవారు, చైతన్య పింగళిలాంటి ఒకరిద్దరు తప్పించి, ఎవరూ లేరుకదా? ఆ కొద్దిమందిలోనే ఒకళ్ళో ఇద్దరో ఇలా చెప్తుంటే) నా మీద నాకు నమ్మకం పెరగదూ? నేను బోగస్ కాదని నాకు నేను చెప్పుకోవడం కాకుండా, ఇలా ఇంకో మాట వినిపిస్తే ఎంతటి మనోబలం నాకు? పైగా ఇలా అనిపించిందని చెప్పాలనిపించనివారు, చెప్పాలనుకున్నా చెప్పలేకపోయినవారూ ఉండరా? What else can be more gratifying than making such a meaningful dialogue with your readers! What is that I’m losing by not playing the game by your rules?
పొగుడుతూనే రాయనవసరం లేదు. జనాల సైకో అనాలసిస్ ప్రకారం (లిటరరీ అనాలసిస్ మనం చేయంగా): ఆరెక్స్ మారేజ్ నా హృదయాంతరాలలోంచి తన్నుకొచ్చిన కథ. నా మేధ అడ్డుపడలేదు కాబట్టే ఆ కథ అంత బాగా వచ్చింది. వేరేవాళ్ళలా రాయమంటే వినని తెల్సు కాబట్టి, దీన్ని చూపించి, “ఇలా రాస్తుండు అని చెప్తారు.” కానీ ఆ కథ అలా వచ్చింది, అలా రాశాను. రచయితగా ఆ కథలో ఆ పిల్లని, ఆమె చుట్టూ ఉన్నవీ mock చేయడం మాత్రమే. Look, how effed up you all are! అని చెప్పడమే నా ఉద్దేశ్యం. కానీ ఆ అమ్మాయి చెప్తుంది కాబట్టి, అది కూడా గుక్కతిప్పుకోకుండా చెప్తుంది కాబట్టి, it left whatever impressions it had to leave with the reader.
రాస్తున్నంత సేపూ , అచ్చువేశాక కూడా నాకు అనుమానం పీకుతూనే ఉంది, ఇంతిలా ఫ్రీజ్ అయిపోయే మనుషులుంటారా? ఉంటే, వాళ్ళ నేపథ్యం ఏమిటి? Who is this gal? నా సెటైర్ ఎందుకు పనిజేయడం లేదీ పిల్ల మీద? అప్పుడీ కామెంట్ వచ్చి నా కళ్ళు తెరిపించింది. ఆవిడ చెప్పిన కండిషినింగ్ నాది కూడా, చాలా మంది మిడిల్ క్లాస్ అమ్మాయిలది అదే. కానీ అలా విడమర్చి చెప్పేవరకూ దాన్ని నేను గుర్తుపట్టలేకపోయాను. కండిషినింగ్ ఎంత తీవ్రంగా పనిజేస్తే అంతటి తీవ్రమైన పరిణామాలుగా. I was mocking her for not punching the first guy in his face. I was mocking her for not falling in love with the second guy. I was mocking her for having a friend who suggests she better watch porn. నేను exaggeration అనుకున్నది నిజంగా జరిగే అవకాశముందని తెల్సినప్పుడు మాత్రం నాకు బాధేసింది. కొందరు ఆ కథకి ఎందుకంత కనెక్ట్ అయ్యారో (ముఖ్యంగా ఈమాట కామెంట్స్ లోనే ఒకాయన వివరంగా ఆ అమ్మాయి తరఫున వాదించారు. Mind you, he wasn’t defending me. He was batting for that gal! How rare is that, in comments of a Telugu story.)

విమర్శంటే…
ఈపాటికే మీలో కొంతమంది మొదలెట్టి ఉంటారు – బొత్తిగా విమర్శని తట్టుకోలేకపోతున్నారండీ రచయితలు. అసలు మాట్లాడలంటే భయమనుకోండి వీళ్ళతో అని. కానీ విమర్శ అంటే రోడ్‍పైన కార్ గుద్దినవాడితో మాట్లాడినట్టు కాదు కదా? “బుద్ధుందా, చూసుకుని నడపలేవా?” అని అడిగినట్టు, “నకరాలు చేస్తున్నావా? మామూలుగా రాయలేవా?” అని విసుక్కోడానికి. విమర్శించడానికి కథతో సమయం గడపాలి. ఆలోచించాలి. “మాకు వేరే పనుల్లేవా?” అని మీరంటే “అన్ని పనుల్లో loose statements ఎందుకు అనేయడం?” అని నేను అడక్కుండా ఎలా ఊరుకుంటా?
మన క్రిటిక్స్ (established, promising, flexing the wings ఏ కాటగరీ అయినా) – I can’t smoothen this blow – they are most… ok, no adjectives! ఇంటర్నెట్‍లో కాంటెంట్ క్రియేటర్స్ (యూట్యూబర్స్, influencers etc) ఉంటారుగా, వాళ్ళకున్నంత శ్రద్ధ, కమ్మిట్మెంట్, diversity పట్ల దృష్టి, objectivity etc కూడా మనవాళ్ళలో కనిపించడం లేదు నాకు. అంటే, వీళ్ళు ఫుడ్ బ్లాగర్లు అయితే వాళ్ళకి నచ్చిన ఒకట్రెండు రెస్టారెంట్లకి మాత్రమే వెళ్ళి దాని గురించే తిప్పి తిప్పి చెప్తారు. వీళ్ళు క్రికెట్ అనలిస్టులు అయితే వాళ్ళకి ఇష్టమైన ప్లేయర్ అవుట్ అవ్వగానే టివి కట్టేసి అంతవరకే రాస్తారు. వీళ్ళు డాక్టర్లు అయితే వాళ్ళకి నచ్చిన వాళ్ళకే వైద్యం చేస్తారు. I can go on, but you get the drift…
వీళ్ళకి పర్సనల్ ఇష్టాయిష్టాలు ఉండవని కాదు. వీళ్ళు ఫాన్ రిపోర్ట్స్ రాయకూడదని కాదు. By all means! కానీ, అప్పుడు టైటిల్ “తెలుగులో రాస్తున్నవాళ్ళలో నాకు ఇష్టమైన రచయితలు” అని ఉండాలి. “తెలుగులో రాస్తున్న రచయితలు” అని హెడింగ్ పెట్టాక కూడా “నా ఇష్టం” అనకూడదు. “మేం అంటాం” అన్నా ఒప్పుకుంటా గానీ అప్పుడు ఎవరైనా అడిగితే “పూర్ణిమ కథలు నేను చదవలేదు. నాకు ఐడియా లేదు,” అని చెప్పి ఆపేయాలి. అంతే గానీ, “ఆ… విన్నాను, ఎవరో చెప్పారు… ఓవరాక్షన్ చేస్తూ రాస్తుందట” అని అనకూడదు. పూర్ణిమనే కాదు, ఎవర్నీ అలా అనకూడదు. మర్యాద దక్కించుకోవాలంటే.
“నాకర్థం కాలేదు” – విమర్శ కాదు. “రెండు పేరాలు కూడా చదవలేకపోయాను”- విమర్శ కాదు. “నాకు క్రికెట్ నచ్చదు” – విమర్శ కాదు. “చదివేక నాకు తలనొప్పి వచ్చింది” – విమర్శ కాదు. కామెంట్స్. అంతే.
విమర్శ అంటే – కథ ముగింపేంటి? ఇప్పుడిప్పుడే మానసిక ఆరోగ్యం గురించి కాస్త తెలుస్తున్న సమయంలో నువ్వు ఉన్న mental health frameworksని రిజెక్ట్ చేసినట్టు చూపిస్తావా? Pro-suicideగా రాస్తావా? ఏం మేసేజ్ ఇవ్వాలనుకుంటున్నావ్?
విమర్శ అంటే – ఆమె ఊహించుకుంటున్న పేరాల్లో గొంతు ఎవరిది? అతడి జీవితం ఆమె మాటల్లోనా? లేదా అతడి మాటల్లోనా? ఈ కాంట్రాస్ట్ ఇటాలిక్ చేసిన పేరాలకి, చేయని వాటికి మధ్య కనిపించిందా? అలా రాయడం వర్క్ అయిందా, లేదా?
విమర్శ అంటే పొగడడం, తిట్టడం కాదు. కథని నేను సొంతం చేసుకున్నంతగా సొంతం చేసుకుని దాన్ని తెల్సుకోవడం. ఆ తెల్సినదాన్ని చెప్పడం. నా ప్రమేయం లేకుండా, ప్రభావం పడకుండా.
కథకి తెల్సు దానికి ఎవరు కావాలో…
ఒక్కోసారి విసుగొచ్చి playing to the gallery కథలు రాయాలనిపిస్తుంది. తెలుగు వెలుగువాళ్ళు కథ రాసి పంపమని ఫోన్ చేస్తే కాదనలేకపోయాను. పుస్తకం.నెట్ గురించి, ఒక కమ్యూనిటి కృషిగా ఒక mainstream పత్రిక రాయడం, అదే మొదలూ తుదలు. వాళ్ళంత శ్రద్ధగా రాశారు కాబట్టి, పైగా నన్నో “యువ రచయిత”గా గుర్తించి అడిగారు కాబట్టి రాశాను. అప్పుడు బుర్రలో వినిపించినవివే – తిన్నగా రాయి, లేకపోతే ఎవరికీ అర్థం కాదు అన్నవే! వాటిని పక్కకు తోసి ఆ ఊబర్ కథ రాశాను. అందులో ఆమె భయపడ్డాన్ని ఎక్కువ నొక్కి చెప్పి మిగితావన్నీ అండర్ కరెంట్‍లా చెప్పుకొచ్చా. అది చదివి, “రేప్ కాపిటల్ అండీ మన దేశం, ఆడవాళ్ళకి భద్రత లేకుండా పోతోంది” అని మాత్రమే వ్యాఖ్యానిస్తారని నా ఊహ. ఊహు. దాన్ని కాప్టలిస్ట్ ప్రపంచంలో, నిచ్చెనలో ఎక్కడున్నా అందరి పరిస్థితుల్లోనూ సారూప్యం ఉంటుంది అన్న దాని గురించే మాట్లాడారు.
ఇక్కడే నావి రెండు ప్రశ్నలు:
౧. తెలుగు పాఠకులనంతా ఒక homogeneous groupగా జమకట్టేసి వాళ్ళ IQ, EQల అవరేజ్ ఎవరన్నా తీసి పెట్టారా? “నీకు కథ అర్థం కాదేమోనని నేను రాయడం మానుకున్నాను అనో, లేదా బాగా నీళ్ళు కలిపి పల్చన చేసిచ్చాను అనో” అంటే అది పాఠకుడిని అవమానించినట్టు కాదా? పసన పండు కోసుకుని తినాలంటే చేతులంతా జిగురైపోతాయిలే, అందుకని మనం ఎప్పుడూ అరటిపళ్ళే తినిపించాలి? ముప్ఫై రెండు పళ్ళూ సుబ్బరంగా ఉన్నవాడికి అన్నం పేస్టులా చేసి ఎందుకు పెట్టాలి? ఒక రచయితగా పాఠకులని నేనెందుకు తక్కువ చేయాలి.
౨. “Eat before it melts” అని రాసినట్టు “React to the story as soon as it ends” అనడానికి అదేమన్నా ఐస్‍క్రీమా? రేపొద్దున్నకల్లా పాచిపోయే కూరా? కథ చదివాక అదెక్కడో మనలో ఒక మూల పడుండదా? దానికి బుద్ధిపుట్టినప్పుడో, మనం ఆ అవకాశం ఇచ్చినప్పుడో ఒకసారి పలకరించి పోదా?
మీకేం కథలు కావాలో నాకు తెల్సు. బెంగళూరు టెస్ట్ మాచ్ వాళ్ళిద్దరూ కల్సి చూశాక ఎప్పటికో విడిపోతారు, బ్రేకప్ అయ్యి. అది మీ నాస్టాల్జియాని ఫీడ్ చేస్తుంది. సచిన్ ఉన్నాడు కాబట్టి బంపర్ ఆఫర్. ఆపైన వాళ్ళు మళ్ళీ కోవిడ్ టైమ్‍లో ఎన్నో ఏళ్ళకి పలకరించుకుంటారు. ఓ సెంటిమెంట్ డైలాగ్ తో ముగిస్తే “మాంచి కాఫీ లాంటి కథ” అంటారు. కాస్త బోల్డ్‍గా వాళ్ళ చేత sleazy మాటలు మాట్లాడిస్తే “టెకీలా తాగినట్టుంది” అంటారు. ఇంకాస్త ముందుకెళ్ళి వాళ్ళిద్దరూ తమ తమ spousesని పక్క గదిలో పెట్టుకుని వీడియోకాల్‍లో masturbate చేసుకున్నారు (అంటే, మామూలు పరిస్థితులలో extra-marital affair లో సెక్స్ ఉంటుందిగా పక్కాగా మన కథల్లో) అని రాస్తే… ఆహా, ఇంకేం… పండగే పండగ! రాసినవాళ్ళ జీవితాన్ని, వ్యక్తిత్వాన్నీ చాకిరేవు పెట్టే సువర్ణ అవకాశం!
నేను అలా రాయను. నేను కథలని చేతికి అందివ్వను. ఒలిచి నోట్లో పెట్టను. మీరు ఉన్న దగ్గర నుంచి కదలక్కర్లేకుండా కాచ్ పట్టుకునేలా నేను కథలు విసరను.
నా కథలు అర్థం చేసుకోడానికి IQ కాదు, ఉండాల్సింది emotional athleticism. మనసుకి, బుద్ధికి stretching exercise ఇవ్వాలి. అన్నింటికన్నా ముఖ్యంగా మీ ఆక్-పాక్-కరేపాక్ కళ్ళద్దాలని కాసేపు పక్కకు పెట్టాలి. మానసికంగా కాస్త కూడా flexibility లేని మీరు తిరిగొచ్చి “over-intellectualized” అని నన్ను ఆడిపోసుకోవడం… <<మీరూ రచయితలు… నింపుకోండి మీ “తేలికైన” భావనలను!>>
ఇక్కడ ఐరనీ అదే. లేనిపోని లెక్కలు, నియమాలూ పెట్టి నేను కథను చంపేస్తున్నానని అభియోగం. కానీ నిజానికి నేను రాస్తున్నంత సేపూ దాని గుండె కొట్టుకుంటుంది. పత్రికకు పంపించాక కూడా కొట్టుకుంటుంది. అచ్చయ్యాక కూడా. నలుగురైదుగురే అయినా చదివినవాళ్ళ మనసుల్లోనూ కొట్టుకుంటుంది. కానీ మీలాంటి కొందరి చేతుల్లోకి రాగానే మాత్రం, అది కొట్టుకోవడం మానేస్తుంది. ఆ నేరం నా మీదకి తోస్తున్నారు. మీరోసారి అనగానే మీవాళ్ళు వందసార్లు వల్లిస్తారు. అదే అబద్ధం మళ్లీ మళ్లీ వినిపించేసరికి నిజమన్న భ్రమ కలుగుతుంది. This is a dangerously single narrative, but I can’t counter it, because I don’t have enough voice. డేంజర్ నాకు కాదు. కమ్యూనిటీకి. ఇన్ని privileges ఉండి, hyper heteronormative కథనాలే రాస్తూ, కేవలం కథనం కొత్తగా ఉన్నందుకే నాకు ఇంత నస అంటే, రేపు LGBTQA+ రాస్తే అవి కొత్తగా అనిపించాయని తిట్టుకోమని గారంటీ ఏంటి?
నిజం మాత్రం ఇదే. ఓవర్ intellectualized, లాజికల్, అనలిటికల్ అయిన నేనే కథని meta-physical spaceలో చూడగలుగుతున్నాను. అందుకే అది ఎవరి కథో వాళ్ళకి చేరితే సరిపోతుంది నాకు. కానీ మీకే అది చదివీ చదవగానే అర్థమైపోవాలి. కాళ్ళకి చెప్పులు వదులవ్వకూడదు, షర్ట్ కి బటన్ పట్టాలి లాంటి ఒక consumerist వ్యూ. టాటూకి అనుగుణంగా బట్టలేసుకునే exhibitionist వ్యూ. తేలిగ్గా, వేసుకున్నా వేసుకోనట్టు, చదివినా చదవనట్టు ఉండాలనే మార్కటింగ్ వ్యూ.
మీరనుకున్నంత purists ఏం కానే కారు మీరు. ఏ కథ చెప్పాలో, ఎలా చెప్పాలో మీరు గుడ్డిగా విశ్వసించే (మీకు తెల్సీ తెలియని) నియమాలు ఎన్నో. ఓ పక్క దాన్ని ఆర్ట్ అని అందలం మీద కూర్చోబెడతారు, కానీ ఒక కొత్త artistic expression అంటే అసహనం. భరించలేరు. “ప్రయోగం” అన్న పదం వాడి పాస్/ఫెయిల్ అంటారే గానీ “ఓహ్… ఎప్పుడూ చూడని పక్షి వచ్చిందే ఇవ్వాళ!” అన్నది మీ మొదటి స్పందన (involuntary response) ఎప్పటికీ కాలేదు. దానర్థం, మీక్కావాల్సింది assembly lineలో ఒకరకంగా కనిపిస్తూ కొద్ధి కొద్దీ తేడాలతో బయటకొచ్చే బొమ్మలు. ప్రాణం లేని బొమ్మలు. Inanimate objects.
అందుకే నా కథల్లో కొట్టుకునే గుండె అంటే మీకు కంగారు, భయం, ఏం చేసుకోవాలో తెలీకపోవడం.
అందుకే నా కథ మీ చేతుల్లో ఉండకుండా ఎగిరిపోతుంది. రక్తం అంటుకున్న చేతులు నావి కావు. మీవి.