Side characters & stereotypes in short stories

Posted by

(నేపథ్యం: మొన్నా మధ్య వరుసబెట్టి నాలుగైదు కొత్త తెలుగు కథలు చదవాల్సిన అవసరం తెచ్చుకున్నాను. అవి తెప్పించిన చికాకులో ఏదో వెటకారంగా ఫేస్‍బుక్‍లో రాశాను, కథల్లో రియాల్టిని నీరుగార్చి, తేలికపర్చి ఎందుకు చూపించకూడదో అని వివరించాను. అది చదివిన ఒకరు ఒక కథ పంపించారు, చదివి ఎలా ఉందో చెప్పమని. నేను పని ఒత్తిడిలో వివరంగా రాయలేకపోయాను, కానీ అందులో ఏం వర్క్ అవుతున్నాయి, ఇంకా దేని మీద పనిజేయాలి అన్నవి మాత్రం రాసి పంపాను. స్పందనగా, ఫీడ్బాక్ ఉపయోగకరంగా ఉందని చెప్పి, కథలో ప్రాధాన్యత లేని పాత్రల గురించి ప్రశ్న అడిగారు. కొన్ని స్టీరియోటైపులకి అనుగుణంగా ప్రవర్తించే మనుషులున్నప్పుడు కథల్లో వాటిని రాయకూడదా? రాస్తే ఎలా రాయాలి? ఆ కథలో కొన్ని పాయింట్లు తీసుకునే వాళ్ళతో చర్చించా గానీ, నాకది ముఖ్యమైన విషయంగా తోచి దానికి సంబంధించిన కొన్ని ఆలోచనలు ఇక్కడ పంచుకుంటున్నాను.

“ఏలా రాయాలి?” అన్న నియమాలేం సృష్టించడం లేదు. ఎలా రాస్తే మనం చెప్పాలనుకున్నది పాఠకులకి బాగా చేరుతుందని నాకనిపిస్తుందో దాన్ని నాకు నేను చెప్పుకుంటున్నాను గట్టిగా. మీలో ఇది ఏ కొన్ని ఆలోచనలు రేపినా చాలు. “ఇలానే రాయాలి” అని నేను చెప్పను. ఇంకెవ్వరు చెప్పినా వినద్దనే చెప్తాను. 🙂 )

పట్టపగలు మబ్బులని చూస్తూనో, రాత్రి పూట నక్షత్రాలని చూస్తూనో పక్కవారికి మనకి కనిపిస్తున్నది చెప్పడం సర్వసాధారణ అనుభవం. చిన్నతనంలో కనీసం ఒకట్రెండు సార్లైనా చేసుంటాం ఆ పని. స్నేహితులకో, అమ్మమ్మ తాతలతో ఉన్నప్పుడో నాకు ఫలనా నక్షత్రం కనిపిస్తుంది, ఫలనా మబ్బు ఈ ఆకారంలో ఉందని పంచుకునే కబుర్లు ఉండే ఉంటాయి. వాళ్ళు చూసేది, మనం చూసేది ఒకటే ఆకాశాన్ని అయినా దాన్ని చూస్తున్న తీరులో, కనిపిస్తున్నదాన్ని మాటల్లో చెప్తున్న తీరులో ఎవరి ప్రత్యేకత వారిది. కథలు రాయడం కూడా ఇలాంటిదే – మనకి కనిపిస్తున్న దృశ్యాదృశ్యాలని మనకి తోచిన రీతిలో ఇంకొకరితో పంచుకోవడం.

నక్షత్రాలు, మబ్బులు మనకి అందనంత దూరంలో, అక్కడెక్కడో ఉంటాయి. అయినా కూడా మనం ప్రతీ నక్షత్రాన్ని ప్రత్యేకంగా గుర్తించడానికి ప్రయత్నిస్తాం. పెద్దగా ఉందనో, మిణుకుమిణుకుమంటున్నదనో, పెద్ద చుక్కకి ఐమూలగా ఉందనో ఏదో రకంగా దానికో పేరు పెట్టుకుంటాం, ఒక వర్ణనని ఆపాదిస్తాం. మన దృష్టి వాటి వైపు పడుతున్నంత సేపూ అవన్నీ గుంపులో ఉన్నా వేటికవే ప్రత్యేకం. ఇహ, ఏ టెలిస్కోప్ లాంటి సాధనమో ఉంటే వాటి ఉనికి మరింత స్పష్టంగా తెలుస్తుంది. అట్లా చూసి కూడా నక్షత్రాల గురించి “ఆహ్… బోలెడన్ని కనిపించాయిలే, నల్లటి ఆకాశంలో మిలమిలా మెరుస్తూ. అంతే!” అని అంటే, వాళ్ళు మంచి కథారచయితలయ్యే అవకాశాలు తక్కువని చెప్పాలి. ప్రతీ నక్షత్రాన్ని చూసి ఉత్సాహంగా ఒక్కో కథ చెప్పగలిగేవాళ్ళే కథకులయ్యే అవకాశాలు ఎక్కువ.

కథా ప్రపంచంలో పాత్రలు కూడా రాత్రి పూట ఆకాశంలో వెలిగే తారల్లాంటివే! వాటిని కలుపుకుంటూనో, విడదీసుకుంటూనో, ఒకదానితో ఇంకోదానికున్న సంబంధం వెతుక్కుంటూ పోతేనో కథలు పుట్టుకొస్తాయి. కొత్తగా వస్తున్న తెలుగు కథల్లో పాత్రల నిర్మాణం, నిర్వహణలపై శ్రద్ధ బొత్తిగా కనిపించడం లేదు. సాహిత్యమంటేనే అబద్ధాలతో అల్లిన ప్రత్యేకతల (specialties, idiosyncrasies) ద్వారా ఒక సార్వజనీయమైన సత్యాన్ని (fundamental generic truth)ని చేరుకోవడం. కానీ మన కథలు మాత్రం పాత్రలకీ ఒక సార్వజనీయతను ఆపాదించేస్తునే రాయబడుతున్నాయి. ప్రధాన పాత్రల విషయంలో (అంటే కథ ఎవరిదో వాళ్ళ విషయంలో) ఇలాంటి generalization వల్ల కథెలా పేలవంగా మారిపోతుందనేది ఇంకో రోజున చర్చించుకుందాం. ఇవ్వాళ్టికి మాత్రం ప్రధానేతర పాత్రల గురించి మాత్రమే ప్రస్తావన.

ఈ ప్రధానేతర పాత్రలలో కూడా రెండు రకాలు అనుకోవచ్చు:
౧. కథకి కీలకమైన (అంటే వాళ్ళు లేకపోతే కథే లేదు),
౨. అంత కీలకం కాని పాత్రలు (అంటే వాళ్ళు లేకున్నా కథ నడిచే తీరులో పెద్ద తేడా రాదు)
అయితే, చిన్న కథలో, ఏ పాత్రైనా ఏదో రకంగా ఒక అర్థాన్నిచ్చేదిగా, ఉన్న డైమెన్షన్‍కి డెప్త్ పెంచేలానో, లేదా కొత్త డైమెన్షన్ ఇచ్చేలానో ఉండాలి.

ఈ ప్రధానేతర పాత్రల్లో స్టీరియోటైపులు ఉండకూడదా?

ముందు స్టీరియోటైపులంటే అర్థం చేసుకోవాలి. ఎవరు స్టీరియోటైపులు అనిపించుకుంటారు? ఒక predefined pathలో నడిచేవారు. వాళ్ళని కొన్ని పరిస్థితులకి గురిచేస్తే వాళ్ళ స్పందన 99.99% సార్లు ఒకటే అయ్యుంటుందని మన అనుకోలు.

ఉదాహరణ తీసుకుంటే, “ఆడపిల్లలందరూ బాయ్ ఫ్రెండ్స్ తో ఖర్చు పెట్టిస్తుంటారు” – ఇది మనకి తరుచుగా వినిపించే మాట. బహుశా, చాలా మందికి అనుభవమై ఉండి కూడా ఉండొచ్చు. కొందరి నమ్మకం కూడా అయ్యుండచ్చు. కానీ ఈ అభిప్రాయాన్ని/నమ్మకాన్ని కథలోకి తీసుకురావడం ఎలాంటిదంటే – ప్లానిటోరియం టికెట్ అని చెప్పి వంద తీసుకుని, లోపల ఏదో ఒక డొక్కు టెలిస్కోప్‍ని అటూ ఇటూ తిప్పి “ఆ… కనిపిస్తున్నాయా? అవే నక్షత్రాలు. ఒక ఐదు నిముషాలు చూసి, మీరు వెళ్ళిపోవచ్చు” అని చెప్పడం లాంటిది. అందుక్కాదు కదా మనం అంత దూరం వెళ్ళింది, అంత ఖర్చు పెట్టింది? మన డాబా మీదనుంచి కనిపించని నక్షత్రాలని చూడ్డానికి, కనిపించే నక్షత్రాలని ఇంకాస్త దగ్గరగా చూడ్డానికి వాటి ప్రత్యేకతలు చూడ్డానికి కదా మనం వెళ్తాం?

మరి అల్లంత దూరాన, మనం ఎప్పుడూ వెళ్ళలేనంత దూరాన ఉన్న నక్షత్రాల పట్లే ఒక మనిషిగా మనకంత ఉత్సుకత, ఉత్సాహం ఉంటే, మరి మనతో పాటు మనలా బతుకుతున్న మనుషుల పట్ల ఇంకా ఎక్కువ ఆసక్తే ఉంటుంది కదా? కథలు చెప్పడం, చెప్పించుకోడం ఆ ఆసక్తి వల్లే కదా! మరప్పుడు మనం నోరు చప్పరిస్తూ, “ఏముంది బాస్! అమ్మాయిలంతా ఇంతే!” అని చెప్పడంలో విశేషమేముంటుంది? అలా జనరలైజ్ చేయడానికి కథ రాయడం దేనికి, ఛాయ్ కొట్టు దగ్గర గాసిప్ చేస్తే సరిపోతుంది కదా? అందుకని అలాంటి స్టీరియోటైపులనే మోసే రచయితలంటే నాక్కాస్త చిరాకు!

కానీ, అబ్బాయిలతో ఖర్చు పెట్టించే అమ్మాయిలూ ఎంత మంది లేరు? వాళ్ళ గురించి కథలు రాయకూడదా?
రాయోచ్చు. రాయాలి. దానికి ముందు మన బుర్రలో ఉన్న స్టేట్మెంట్ మారాలి:

“అమ్మాయిలు అందరూ బాయ్ ఫ్రెండ్స్ తో ఖర్చు పెట్టిస్తుంటారు”

ఇలా ఒక మాట అనుకుంటే పద్ధతిగా ఉంటుంది. ఎందుకని? ఇప్పుడు కూడా అందరూ కాకపోయినా “దాదాపు అందరూ అంతే!” అని అనుకోవచ్చుగా రచయిత. అవును, అనుకోవచ్చు. కానీ “దాదాపు”లో అలాకానివాళ్ళుంటారనే అవకాశముంది, రవ్వంతే అయినా. ఆ స్పృహ మనకి రాసేటప్పుడు కీలకం – ఎందుకంటే, మనకి తెలీకుండానే మనం ప్రపంచాన్ని ఎలా చూస్తున్నదీ మన కథల్లోకి చొచ్చుకుని వచ్చేస్తుంది. ఒకణ్ణి పీల్చుకుని పిప్పి చేసేసి తినేసిన అమ్మాయిని గురించి రాసే కథలో కూడా ఈ అవగాహన ఉండటం వల్ల, ఆ అమ్మాయిలా ప్రవర్తించడానికి కారణమేముందా అని ఆలోచింపజేస్తుంది. అది కథలోకి నేరుగా రానవసరం లేదు, ఆమెపై జాలి పుట్టనక్కర్లేదు. ఇంకేదో డైమెన్షన్ చేరవచ్చు ఆ స్పృహ ఉండడం వల్ల, ఆ పాత్రకి. అది ముఖ్యం.

ఇప్పుడు మన కథలో “బాగా డబ్బు ఖర్చుపెట్టించే అమ్మాయి” పాత్ర ప్రధానమైనది కాదు, అంటే కథ అమ్మాయిది కాదు అనుకుందాం. అప్పుడు కథలో ఆమె ఇలా భాగమవ్వచ్చు:
౧. ముఖ్యపాత్రకి పదేపదే ఈ పాత గర్ల్ ఫ్రెండ్ గుర్తొస్తుంటుంది: అప్పుడు ఆమెని స్కెచ్ చేయడానికి స్పేస్ దొరుకుతుంది. ఓ రెండు వేల పదాల కథలో కనీసం నాలుగొందలైనా ఆమెకి కేటాయించచ్చు. వీలైనన్ని వివరాలు, ఆమె అన్న మాటలు తీసుకురావచ్చు.
౨. కేవలం ఒక ప్రస్తావన మాత్రమే ఉంటుంది: అంటే, మహా అయితే రెండు మూడు లైన్లకి, ఓ యాభై పదాల కన్నా ఎక్కువ రాయడానికి కథనం ఆస్కారం ఇవ్వన్నప్పుడు ఎలా ఆ పాత్ర పాఠకునిపై ప్రభావం చూపించే (రిజెస్టిర్ అయ్యే) విధంగా రాయొచ్చనేది తిరకాసైన విషయమే! “ఈమె సరితలా కాదు, అసలు డబ్బు ఖర్చు పెట్టించడం లేదు” లాంటి వాక్యాలు కాకుండా “సరిత అయితే రిచార్జ్ చేయించని పూటా కలవడానికి కాఫీ షాప్‍కొచ్చేది, నవ్వుతూ నవ్వుతూ మాట్లాడుతూనే రిచార్జ్ చేయించమని గుర్తుచేసేది” అనో లేదా, “రిచార్జు చేయించలేరుకానీ గర్ల్ ఫ్రెండ్స్ కావాలండీ కొందరికి!” అని నిష్టూరాలు ఆడేదనో వివరాలు ఉంటే కొంచెమన్నా ఆ పాత్ర లోతు గురించి ఒక అవగాహన వస్తుంది, కథని అర్థంచేసుకునే వీలుగా.

ఎన్ని వివరాలు రాసుకుంటూ పోవాలి, ఎక్కడ ఆపాలి?
మనం కాగితంతోటో, మరే మెటీరియల్ తోటో బొమ్మలు చేసేక అవి ఒక్కోసారి నిల్చోకుండా పక్కకి ఒరిగిపోతాయి, పడిపోతాయి. ఎందుకని? వాటికి బేస్ సరిగ్గా లేక, బాలెన్స్ ఆగక అలా పడిపోతాయి. ఒక్కోసారి పడిపోకుండా బొమ్మలోనే ఏదో చేయచ్చు, ఏదీ కుదరకపోతే కనిపించకుండా ఏ పుల్లముక్కనో దూర్చి అది నిల్చునేట్టు చేయచ్చు. మన మాటలతో చేసే బొమ్మలూ ఇలా ఒరిగిపోతుంటాయి కథల్లో. అది గుర్తించడమే చాలా కష్టమైన పని. ముఖ్యంగా ఆ పాత్ర తాలూకూ ఐడియా మనకి బలంగా ఉండి, కొద్ది వివరాలు మాత్రమే కథలో ఇచ్చినప్పుడు మనం రాయాలనుకున్నదానికి-రాసినదానికి తేడా కనిపెట్టలేం. ఇక్కడే ఎడిటర్, మరో మనిషి చదివి అభిప్రాయం చెప్పడం లాంటివి పనికొస్తాయి.

అయితే, రాయడం గురించి మాట్లాడుకోవడంలో ఒక పేచీ ఉంటుంది. “నేను 4×4 అడుగుల కాగితాన్ని తీసుకుని, కింద నుంచి పది అంగుళాలు కొల్చి కాగితాన్ని మడిచాను” అన్నంత క్లియర్ కట్ సూచనలు ఇవ్వలేరు ఎవ్వరూ. నేను పైన ఉదహరించినవేవీ కథ రాసేటప్పుడు యధాతథంగా పనికిరావు. మనం చదివే కథల్లోనో, రచనా వ్యాసంగం మీద వచ్చిన పుస్తకాల్లోనో ఇలాంటి అంశాలని కనిపెట్టి రాయడం ప్రాక్టీస్ చేసుకోవచ్చు కానీ అచ్చంగా కథ రాసేటప్పుడు మన కథకే ప్రత్యేకించిన ఇబ్బందులు, సవాళ్ళూ వస్తుంటాయి.

కొన్నేళ్ళ క్రితం నేను “రైటింగ్”కి సంబంధించిన పుస్తకాలు చదివేసి అలానే రాయాలని ప్రయత్నించి, నేను రాసేవాటిలో కుదరక, మొత్తంగా బ్లాంక్ అయిపోయి చాలా తికమక పడిపోయాను. అప్పట్నుంచి నేను రాయడంలోని సమస్యలకి సమాధానాలు, పరిష్కారాలు, ఐడియాలు రచనలు కాని వాటి నుంచి కూడా వెతుక్కుంటున్నాను. దీని వల్ల లాభమేమిటంటే, నేను ఐడియాని మాత్రమే అరువు తెచ్చుకుంటున్నాను, ఆ ఐడియాని ఎలా అమలు పరుస్తాను, ఏ మేరకు అమలు పరుస్తాను అన్నది నా క్రియేవిటిపైనే ఆధారపడుంటుంది.

ఇప్పుడు సైడ్-పాత్రలని అర్థం చేసుకోడానికి ఈ కింది కేరళ మ్యూరల్ ని పరిశీలిద్దాం. ఇది గజేంద్ర మోక్ష ఘట్టానికి సంబంధించినది. విష్ణువు గరుడాసనుడై గజేంద్రున్ని కాపాడ్డానికి వచ్చాడు. దేవతలు, బుషులు, ప్రజలు ఆయనకి నీరాజనాలు అర్పిస్తున్నారు.

Kerala Mural Painting based on “Gajendra Moksham” on a temple wall in Calicut. Artist: Unknown.

ఇప్పుడు ఈ చిత్రాన్ని ఒక చిన్న కథ (short story) అనుకుంటే:

 • గోడపై ఉన్న స్పేస్ – కథ రాసుకోడానికి ఉన్న రెండు వేల నుండి మూడు వేల పదాలు
 • కథ: గజేంద్ర మోక్షం
 • ప్రధాన పాత్రలు: విష్ణువు, గజేంద్రుడు, మొసలి
 • ప్రధానం కావు కాని కథలో ఉన్న పాత్రలు: దేవతలు (శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు) దేవబుషులు (నారదుడు), భూలోకంలోని ఋషులు, ప్రజలు. వీళ్ళు లేకపోయినా గజేంద్రుడు కష్టాల్లో ఇరుక్కుంటాడు, విష్ణువు వస్తాడు. కానీ వీళ్ళు కూడా ఉండడం వల్ల ఇది కేవలం గజేంద్రునికి-విష్ణువుకి సంబంధించిన పర్సనల్ విషయం మాత్రమే కాదు, it has an implication at a universal (or rather, multiversal level?) అన్నది కూడా స్పష్టమవుతుంది.

మనం మాట్లాడుకుంటున్నది ప్రధానం కాని పాత్రలు కాబట్టి వాటిని ఎలా చిత్రీకరించారో చూద్దాం.

 • ముందుగా కళ్ళకి కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నది ప్రధాన పాత్రలే ఎక్కువ స్థలాన్ని ఆక్రమించుకున్నాయన్న సంగతి. కథ వాటి గురించే కాబట్టి. అందులో విష్ణువు, గరుడే ఎక్కువ స్థానాన్ని ఆక్రమించారు – ఎందుకంటే, ఈ చిత్రం చెప్పాలనుకుంటున్న కథ కాపాడేందుకు విష్ణువే తరలి వచ్చాడని చెప్పడం.
 • మిగితా పాత్రలని వాళ్ళ నివాసాన్ని బట్టి పొజిషన్ చేశారు. దేవతలందరూ ఆకాశంలో, దిగొస్తున్న విష్ణువుకి పైన నెలకొల్పబడున్నారు. ఇక్కడే గమనించాల్సిన విషయం ఒకటుంది: దేవతల గురించి common knowledge ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొన్ని అంశాలని/విశేషాలని బాగా వాడుకున్నారు. వాళ్ళ ప్రత్యేకించి గుర్తుపట్టేలా ఆనవాలు ఇచ్చారు.
  • తంబూరా పట్టుకుని గెడ్డమున్న ఆయన నారదుడు అనుకోవచ్చు.
  • ఆయన పక్కన పచ్చగా ఉండి ఒళ్ళంతా కళ్ళతో ఉన్నది ఇంద్రుడు
  • ఇటు చివర తెల్లని ఛాయలో ఉన్నది శివుడు. ఎలా చెప్పాం? కంఠం చూస్తే జాగ్రత్తగా తెలుస్తుంది.
  • ఆయన పక్కన చతుర్ముఖుడు, ఎవరో చెప్పనవసరం లేదు కదా!
 • కానీ, అదే భూలోక వాసుల గురించి అలా ప్రత్యేకించి గుర్తుపట్టే వీలులేదు.
  • గెడ్డం, సాధారణ వస్త్రధారణ, రుద్రాక్షలు ఉన్నాయి కాబట్టి ఋషి.
  • పక్కన ఇద్దరు స్త్రీలు. వాళ్ళు విష్ణు భక్తులో, గజేంద్రుని భార్యలో అయ్యుండచ్చు.

పై ఫోటోలో నేను బౌండరీలు గీసాను సైడ్-కారెక్టర్లకి. ఎంత తక్కువ స్పేస్‍లో ఎన్ని వివరాలిచ్చి వాటిని ప్రత్యేకంగా నిలపడానికి ప్రయత్నించారో అర్థమవుతోంది కదా!

ఇట్లాంటి ఒక పెయింటింగ్ నేను చేసి, ఆ ఋషికి రంగులేయకుండా మిగిల్చేస్తేనో, లేదా నారదుడు బదులు ఆ స్పేస్ అలా ఖాళీగా వదిలేస్తేనో, లేదా విష్ణువు చేయొకటి లావుగా ఇంకోటి సన్నగా గీస్తేనో మీకు ఈ కళలో ఏ మాత్రం ప్రవేశం లేకపోయినా కూడా చూడగానే, “అర్రే, ఇక్కడేంటి ఇలా ఉంది? ఇదెందుకు వదిలేసారు?” అని అడక్కుండా ఉండలేరు ఖచ్చితంగా! ఎందుకని? ఎందుకంటే, చిత్రాలు మన కళ్ళ ద్వారానే లోపలకి ప్రవేశిస్తాయి. మన కళ్ళకి unified image తీసుకోవడం అలవాటు. ఏ మాత్రం ఎక్కువతక్కువలైనా మన కళ్ళు పసిగట్టేస్తాయి.

కానీ రచనలు అలా కావు. అవ్వడానికి కళ్ళ ద్వారానే లోపలికి ప్రవేశించినా, మాటలే లోపలకి వెళ్ళి, లోపల మనోనేత్రంపైన చిత్రం ఏర్పడాలి. అందుకే పఠనానుభవంలో పాఠకుడికీ కీలక పాత్ర ఉంటుంది, రచయితతో పాటుగా. అయితే ఈ మనోనేత్రం పైన మనం బొమ్మ మెల్లిమెల్లిగా గీసుకుంటూ పోతాం, అది మెల్లిమెల్లిగా కరిగిపోతూ ఉంటుంది. కాబట్టి, ఒక stable unified image చాలా కష్టం, దాదాపు అసంభవం. కేవలం ఆ చిత్రం తాలూకు మనోభావాలు మాత్రమే మనలో నిల్చిపోతాయి. అందుకే బాగా నచ్చిన రచనైనా, నచ్చనిదైనా మనం ఎందుకు నచ్చిందో, లేదో గబుక్కున చెప్పలేం. “ఎక్కడో తేడా కొడుతుంది” అనో, “లోపలేదో కదిలింది” అనో, “I can’t put my finger on it,” అనో అందుకే వాపోతుంటాం మామూలుగా. ఎంతో నిశితంగా చదివి, జాగ్రత్తగా పరిశీలిస్తే తప్ప రాసినదాంట్లో ఏది తప్పు పోయిందో, సరిగ్గా వచ్చిందో చెప్పలేం.

కానీ తెలుగులో అట్లా చెప్పగలిగే పాఠకులు, ఎడిటర్లు బహు అరుదు. మనకి కథలో ఎమోషన్ గట్టిగా పడితే (అంటే, పెయింటింగ్‍లో రంగులు కంటికింపుగా కనిపిస్తే) చాలు, ఆ కథ గొప్పదైపోతుంది. పాత్ర నిర్వహణ, నిర్మాణం లెక్కకు రాకుండా పోతుంటాయి (అంటే ఒక చేయో, కన్నో గీయకుండా వదిలేసినా తేడా కొట్టడం లేదు.) ఎడిటర్ల బాధ్యతలే ఎవరో ఒకరిద్దరు తప్ప తీసుకోవడం లేదు. ఇహ, చదివేవారు కూడా అయితే ఆకాశానికి ఎత్తేస్తారు, లేదా డిస్మిస్ చేసే టోన్‍లోనే మాట్లాడతారు గానీ ఒక craftsmanship పాయింట్ నుంచి మనకి సలహాలు సూచనలు వచ్చే అవకాశం దాదాపుగా లేదు. అలాంటప్పుడు ఇట్లాంటివన్నీ సరిగ్గా సమకూరుతున్నాయా కథలో లేదా అన్నది మనకి మనమే ఒకటికి పదిసార్లు చూసుకోవాలి.

నాట్యమైనా, సంగీతమైనా, చిత్రలేఖమైనా, రచనైనా నేర్చుకోకుండా రాదు. అయితే, ఒక గురువు దగ్గరకి వెళ్ళి ఎన్నో ఏళ్ళ పాటు నిర్విరామంగా నేర్చుకుంటే తప్ప ఇతర రంగాల్లో పదర్శనా స్థాయికి రాలేరు. వాటితో పోల్చుకుంటే రచనలో మాత్రం అది తేలిక! రాయడం, అచ్చేయడం మొదలెట్టినంత మాత్రాన నేర్చుకుంటూ ఉండడాన్ని విస్మరించకూడదు. భాష మీద పట్టున్నంత మాత్రన కథలు రాయడం వచ్చేస్తుందని కాదు, లోకాన్ని చదివే తీరులోను, దాన్ని వచనంలోకి తర్జుమా చేసే ప్రక్రియలోను ఎప్పటికప్పుడు కొత్త సవాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటాయి. వాటిపై పట్టు సాధించడంలోనే రచనా వ్యాసంగంలో, ముఖ్యంగా కాల్పనిక సాహిత్యం రాయడంలో మజా ఉంటుంది.

నేనిక్కడ పంచుకున్నది ఒక నమూనా మాత్రమే! మీరు ఇలాంటిదే ఒక సినిమాలోనో, షార్ట్ అనేమిషేన్ మూవీలోనో లేదా ఇంకే రకమైన story telling formatలోనే ఎలా చేశారన్నది గమనిస్తే (గమనించడానికి మీకు ఆ రంగంపై ఆసక్తి ఉంటే తేలికవుతుంది) మీకే ప్రత్యేకమైన కొన్ని ట్రిక్కులు, టెక్నినిక్కులు వంటబడతాయి. మాకు పెయింటింగ్ క్లాసులో ముందు లైన్, లైన ఎలా తిప్పాలి, ఎంత తిప్పాలి అన్నది ప్రాక్టీస్ చేయిస్తారు. ఎంత చేయిస్తారంటే చేతికి అలవాటైపోతుంది – the hand becomes the mind! నాట్యం చేసేవాళ్ళకీ అంతే, the body becomes the mind! రచనా వ్యాసంగంలో ఆ స్థాయికి చేరాలంటే చాలా అంటే చాలా ప్రాక్టీస్ చేయాలి – ఈ లోపు మన పుస్తకాలకి రివార్డులు, మనకి అవార్డులు వచ్చేసినా – ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. Anything art takes a lifetime to master!

4 comments

 1. Ramarao Kanneganti on Facebook:

  Right on! Story is not a statistical narrative. It tells the story that statistics do not tell us. It stretches, tests, pokes, punctures, and extends the boundary cases. Side characters are usually props, plot devices, and tropes in storytelling. In experts hands, they invoke other stories. In lot of Koku’s stories, these side characters suddenly open up other worlds.

  Two other points I am stuck with: one is your use of mural to illustrate the richness that side characters can bring. In studying medieval life, these non-main characters offered clue to the life: how harvesting is done, how bread is baked, how cows are milked, how children are raised, and how people went about their daily life. The main part of the story is common enough — it never told the story of corners of life that is seen too mundane.

  The other point is about how the story is changed when minor characters tell the main story. Like Guildenstern and Rosencratz. Or, Chitra in the hands of Tagore. Or, I, Claudius. In the modern cinema, Forrest Gump. Or, Kumar and Harold (starts out minor and then become the focus). In Run, Lola, Run movie, a quick montage of side character history makes the story become real and rich.

  Like

 2. A well articulated essay, Purnima. I hope somebody benefits from thus guidance. One note: the amount of detail about side characters or even main characters depends on the way the writer decides to tell the story. A well detailed mural is good; so is an abstract painting from the right hand.

  Like

 3. హలో అండి, మీరు రాసిన బ్లాగ్ పోస్ట్ మల్లి చదువుతున్నా నా కామెంట్ పోస్ట్ చేయడానికి.

  ముందుగా ఇది రాయడానికి ఒక కారణం నేనైనందుకు ఆనందపడుతున్న.
  ఇది మీరు ఎంత తక్కువ సమయంలో, ఎంత ఇన్స్టింక్టీవ్ గా రాసారో నాకు తెలుసు. కానీ ఇది అలా లేదు. ఒక మంచి వ్యాసానికి ఉండే అన్ని లక్షణాలు నాకు తెలీవు కానీ, ఇది నాలో చాలా ఉన్న చాలా ఆలోచనలని తాకింది, కదిపింది, కొత్తగా ఆలోచించేలా చేసింది.

  సైడ్ కేరక్టర్స్ గురించి మాట్లాడుతూ, రచనని, బొమ్మలు గీయడాన్ని, ఈ రెండిటికి ఉన్న సారూప్యతని చాలా బాగా చెప్పారు. రచన విషయంలో ఒక స్టేబుల్ యూనిఫైడ్ ఇమేజ్ రావడం అనేది కుదరదు అనడం నాకు కొత్తగా అనిపించింది. నిజమే కదా అనుకున్న. రచనని, బొమ్మలని దాటి సినిమాల్లోకి వెళితే కూడా మీరు అన్నది నిజమని అనిపించింది. అంటే, అర్జున్ రెడ్డి సినిమా లో ఫ్రెండ్ క్యారెక్టర్, పెళ్లి చూపులు సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ . . వీటిని మనం అంతగా ఆనందించడానికి కేవలం తెలంగాణ యాస అనో, హీరో మీద ‘పంచ్’ వేసిన కొత్తదనం అనో కాకుండా ఒక రిఫరెన్స్ ఇచ్చారు మీరు ఆలోచించడానికి. ఇలా చాలా పాయింట్స్ అఫ్ వ్యూస్ ఉండడం వళ్ళ ఇది నాకు గొప్ప వ్యాసం.

  ఇక నేను ఈ వ్యాసాన్ని మల్లి మల్లి చదువుతుంటే అనిపించిన కొన్ని విషయాలు:
  స్టీరియోటైప్ ని అలానే రాస్తూ కూడా మంచి కథ రాయొచ్చేమో. మీరు అన్న పోలిక నక్షత్రాలని చూడడం, ప్లానిటోరియం కి వెళ్లి ప్రత్యేకంగా తెలుసుకోవడం . . ఈ రెండిటి మధ్యన ‘స్పష్టంగా’ తెలుసుకోవడం కూడా ఉంది కదా. ఇదే రాతకి తీసుకొస్తే, ఒక స్టీరియోటైప్ ని స్పష్టంగా రాయగల్గితే దానికి అదే మంచి కథ అవ్వదా?
  “ఏముంది బాస్! అమ్మాయిలంతా ఇంతే!” అని చెప్పడంలో విశేషమేముంటుంది? అలా జనరలైజ్ చేయడానికి కథ రాయడం దేనికి, ఛాయ్ కొట్టు దగ్గర గాసిప్ చేస్తే సరిపోతుంది కదా? అందుకని అలాంటి స్టీరియోటైపులనే మోసే రచయితలంటే నాక్కాస్త చిరాకు!” అని అన్నారు.
  నాకు ఏమి అనిపిస్తుంది అంటే, ఆ స్టీరియోటైప్ ని తయారు చేసే విధానంలో కూడా మంచి కథ ఉంది అనిపించింది. విశేషముంటుంది.
  ఒక అతను, వాడి అల్లుడికి డాక్టర్ తప్పు ట్రీట్మెంట్ ఒకటి ఇచ్చాడు. మంచిగా బతకగల్గిన ఫామిలీ అనే అనుకోవాలి. పిల్లాడికి తప్పుడు ట్రీట్మెంట్ పక్కన పెడితే దానితో పాటు నేను విన్న ఒక వాక్యం . . ”దరిద్రులు. . 800 rs బదులు ఏడు వేలు గుంజారు ‘ అని. నాకు ఇది చాలా సాధారమైన, ఎక్స్పెక్టెడ్ రియాక్షన్ అనే అనిపించింది. కానీ, ఆ మనిషి అలా ఎందుకు తయారయ్యాడో అర్ధం చేసుకోవడం వెనక నా మనస్సు పరుగులు పెట్టింది.

  ఒక సాధారణ విషయాన్నీ అది సాధారణము అవ్వడం వెనక ఉండే ప్రక్రియలో ఉండే వైపు ఆలోచిస్తున్న. మీరు చెప్పండి ఇప్పుడు 🙂

  Like

  1. >> ఒక స్టీరియోటైప్ ని స్పష్టంగా రాయగల్గితే దానికి అదే మంచి కథ అవ్వదా?

   మన ఇద్దరం ఒక్కటే అంటున్నాం అనుకుంటా. స్టీరియోటైప్‍ల గురించి రాయద్దని కాదు, ఎలా రాస్తున్నామన్నది ఒకసారి చూసుకుంటే మంచిది అని అంటున్నాను అంతే! విషయం సాధారణమా, అసాధారణా, అనన్యమా, అతి సామాన్యమా అన్నది కాదు సమస్య, దాన్ని ఎంత ప్రతిభావంతంగా ప్రెజంట్ చేస్తున్నాము అన్నది ముఖ్యం.

   “ఏముంది బాస్, అమ్మాయిలంతా ఇంతే!” అన్న టోన్ పాత్రలు ద్వారానో, నరేటర్ ద్వారానో వస్తే నాకు అభ్యంతరాలేం ఉండవు. కానీ రచయిత దృక్కోణమే అది అయినప్పుడు కథలు చాలా పేలవమైపోతున్నాయని అంటున్నాను. మీరన్నట్టు “ఒక సాధారణ విషయాన్నీ అది సాధారణము అవ్వడం వెనక ఉండే ప్రక్రియ”ను పట్టుకోకపోతే కథారచనలో, కథాపఠనంలో పెద్ద మజా ఏం ఉండదన్నది నా వాదన.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s