మా ఆయన చనిపోయాడు. నాలుగురోజుల క్రితం. కాదు కాదు. ఐదు రోజులనుకుంటా.
టైమ్‍జోన్ తేడాలు కలుపుకుంటే ఏ రోజు వస్తుందో. లెక్కపెట్టడానికి నాకెవ్వరూ వివరాలు ఇవ్వడం లేదు. కార్ ఆక్సిడెంట్. చనిపోయాడు. నాకు తెల్సినవంతే!
అందరూ మాట్లాడుకుంటున్నారు. ఒకళ్ళని ఒకళ్ళని కౌగలించుకుంటూ, కళ్ళు తుడుచుకుంటూ, ఓదార్చుకుంటూ మాట్లాడుకుంటున్నారు. నాకు వినిపించకుండా.
నాకు వినిపించకూడదని. “చిన్నపిల్ల… చిన్నపిల్ల!” ఒకటే మాట కబురందిన దగ్గర నుంచి. ఇరవై నాలుగేళ్ళకి పెళ్ళి చేసినప్పుడు లేని చిన్నతనం, పాతికేళ్ళు కూడా లేకపోయినా తల్లి అవ్వాలని తొందరపెట్టినప్పుడు లేని చిన్నతనం ఇప్పుడెలా వచ్చిందో మరి. “చెప్పకండి చెప్పకండి… తట్టుకోలేదు!” అదే మాట.
నన్ను కిందకు కూడా రానివ్వడం లేదు. “షాక్‍లో ఉంది. ఒక్క బొట్టు కూడా ఏడవలేదు!” అని హైరానా పడిపోతున్నారు. “చంటి… చంటి… చంటీ” ఆ మాట కాకుండా మా అత్తగారి నోట ఇంకో పేరు వినిపిస్తే అది నాదే. ఆవిడ మంచినీళ్ళు కూడా తాగడం లేదు. కానీ నేనమన్నా తిన్నానా అని మాటిమాటికి గుర్తుచేస్తున్నారట. అతడి కజిన్ అందించిన సమాచారం.
అమ్మాయి, ఇంటర్ చదువుతుంది. అదే నాకూ, ఈ గదికీ కాపలా! పొద్దున్నే ఏదో కామెడీ షో చూస్తూ ఉంది. నేనూ ఇయర్‍ఫోన్స్ పెట్టుకున్నాను. ఆమె కూడా. వాళ్ళమ్మ విసవిసా వచ్చి రుసరుసలాడి పోయింది. “ఇంట్లో ఉన్న పరిస్థితి అర్థమవుతుందా నీకు? ఏంటా నవ్వు!” అని. ఆ మాట ఆమె కూతుర్ని అనిందో, నన్ను అంటుందో తేల్చుకోలేకపోయాను. ఫేస్‍బుక్‍లో కాట్ వీడియోస్ చూస్తూ ఉన్నాను. నేనూ నవ్వానేమో.
ఆ దెబ్బకి కజిన్ యూట్యూబ్‍లో కోర్సు మెటీరియలేదో చూస్తుందిప్పుడు. కనుకి పాట్లు పడుతూ. “పడుకో రాదూ!” అని అడిగాను. “అమ్మో… మధ్యాహ్నం పడుకుంటే తంతుంది మా అమ్మ!” అని వెనక్కి వాలడానికి కూడా లేని స్టూల్ మీద కూర్చునే ఉంది.
నోటిఫికేషన్స్ అన్నీ డిజేబుల్ చేశాను. లేకపోతే, టంగ్-టంగ్-టంగ్ “టేక్ కేర్”, “బీ స్ట్రాంగ్” టంగ్ టంగ్ “ఎనీథింగ్ ఐ కాన్ హెల్ప్ విత్, ప్లీజ్ లెట్ మీ నో”, “మేమంతా ఉన్నాం నీ కోసం” టంగ్ టంగ్ టంగ్! ఫామిలీ గ్రూపులు, స్కూల్-కాలేజి గ్రూప్‍లు, ఆఖరికి హాబీ గ్రూప్‍లో కూడా ఒకటే మాట. అందరిదీ ఒకటే ఊహ. నా కాళ్ళ కింద భూమిని ఎవరో లాగేయగానే నేను వెనక్కి పడిపోతున్నాను, అగాధంలోకి జారిపోతున్నాను. వీళ్ళంతా అది కళ్ళారా చూస్తూ “గ్రీఫ్ ఇస్ పర్సనల్” అంటూ ఏమీ చేయలేక అలా అప్పుడప్పుడూ వచ్చి పలకరించి పోతుంటారు.
హౌ డస్ ఇట్ మాటర్?
అసలు, నా విషయంలో కాళ్ళకింద భూమి సుబ్బరంగానే ఉంది అన్నది వీళ్ళకి అర్థమవుతుందా? అవును, మనిషి పోయాడు. ఆ… చెట్టంత మనిషే పోయాడు. ఎంతో భవిష్యత్తున్న మనిషే పోయాడు. “పాపం కదా, ఎవరూ ఊహించలేదు”, “అర్రెర్రె… ఎంత పని జరిగిపోయింది?”, “వాళ్ళ అమ్మానాన్నలకి దిక్కెవ్వరు?” – అవును, నావి కూడా అవే ఫీలింగ్స్! అచ్చంగా అవే! మా అత్తగారిని చూస్తే జాలేస్తుంది. అంతే! జాలి (మాత్రమే) వేస్తుంది.
సినిమాలో ఏ ఏమోషనల్ సీన్ చూసినా కన్నీళ్ళు ఆపుకోలేని నాకు ఇప్పుడు ఏడుపెందుకు రావడం లేదో తెలీదు. “నా” మనిషి పోయాడని కాకపోయినా, “మా” జీవితం ఇక ముగిసిపోయిందని కాకపోయినా కనీసం… కనీసం… ఇంట్లో అందరూ ఏడుస్తూనే, మొహాలు వేలాడదీసుకునే ఉన్నందుకైనా ఏడుపు రావాలి కదా? కొడుకుని పోగొట్టుకున్న అత్తగారిని చూసైనా, కూతురి బతుకు బుగ్గిపాలైపోయిందని దిగులు పెట్టుకున్న అమ్మని చూసైనా ఏడుపు రావాలి కదా?
ఏడుస్తుంటే ఏడ్వద్దని నచ్చజెప్పటానికి అందరూ ముందుంటారు. ఏడుపు రాకపోతే పర్లేదని అంటారా ఎవరైనా? ఏడుపు దేనికి కొలమానం? ప్రేమకా, పాశానికా, లోటుకా?
తలబద్దలైపోతుంది. కాఫీ కావాలి. నా అంతట నేనెళ్ళి పెట్టుకోలేను. అడగలేను. కజిన్ పడుకుండిపోయింది. ఎప్పుడో మరి.
మళ్ళీ ఫేస్‍బుక్ తెరిచాను. ఏదో కొత్త సినిమా గురించి అంతా రాస్తున్నారు. మళ్ళీ కాట్ వీడియోస్ వచ్చాయి. ఎవరో రాజకీయ నేత ఏదో అన్నాడట ఆడవాళ్ళని. మీమ్స్ బోలెడు. ఒకదానికి నవ్వాగలేదు. “లాఫ్టర్” ఎమిటికాన్ కొట్టాను. స్క్రోల్ చేసుకుంటూ పోయాను. ఏవో చిన్నపిల్లలు డాన్స్ చేసే వీడియోలు. బ్రైడల్ మేకప్ వీడియోలు. కపిల్ శర్మా షో స్నిపెట్స్. సారాభాయ్ వర్సెస్ సారాభాయి. పాకిస్తాన్ సీరియల్స్ సీన్లు.
ఈ స్క్రోలింగ్ అగాధం కాదా? ఇందులోకి జారిపోతుంటే “టేక్ కేర్” అనో, “బీ స్ట్రాంగ్” అనో ఎవరూ చెప్పరేం?!
ఎప్పటికో పైకి తేలాను. ఆ కాట్ వీడియో పట్టుకోడానికి “ఆక్టివిటికి వెళ్ళాను”. లాఫ్టర్ ఎమిటైకాన్ తీసేశాను. నేను నవ్వకూడదు. మనసులో నవ్వినా బయటకు తెలీకూడదు. అపరాధి వేలిముద్రలు పడకుండా జాగ్రత్త పడినట్టు నేను “నార్మల్” అన్న ముద్రలు ఎక్కడా వదలకూడదు. నేను బాధపడాలి.
నా ప్రొఫైల్‍కెళ్ళాను. మొదటి మూడు లైన్లలోనే “మారీడ్ టు: సాయి అఖిల్”. జీవితంలో సాధించిన అతి పెద్ద ట్రోఫీ అతడే మరి. టాపర్ అని డిక్లేర్ చేశాక రి-ఎవాల్యువేషన్ పెట్టి కాదని తేల్చినట్టు, మెడల్ ఇచ్చేశాక స్కోరింగ్‍లో తప్పుందని వెనక్కి తీసేసుకున్నట్టు… అప్పుడన్నా ఏడుపు రావాలి. కనీసం పోయిందన్న ఉక్రోషంలోంచి అయినా ఏడుపు రావాలి. ప్చ్…
అతడి వాల్‍పైకి వెళ్ళాను. ఆపకుండా RIP మెసేజెస్. వాళ్ళూ వీళ్ళూ అని లేకుండా. అందరూ బాధపడుతున్నారు. అందరూ “క్రై”, “బ్రోకెన్ హార్ట్” ఏమోజీలే వాడుతున్నారు. “నే నమ్మన్రా! నువ్వు లేవంటే నేను ఒప్పుకోన్రా”, “ఎంత మంచోడివి బాస్, అందుకే దేవుడు అంత త్వరగా పిలిపించేసుకున్నాడు”, “అన్యాయం. అన్యాయం. అన్యాయం.”, “సమ్‍బడీ టెల్ మీ థిస్ ఇస్ ఎ క్రుయల్ జోక్. బట్ ఓన్లీ ఎ జోక్”. ఒకళ్ళిద్దరు నన్ను కూడా టాగ్ చేశారు. అదే మాట: టేక్ కేర్. బీ స్ట్రాంగ్.
ఒక మనిషి పోయాక పడాల్సిన బాధకి, అనుభవించాల్సిన లోటుకి ఒక కోటా ఉంటే దాన్ని వీళ్ళే నింపేస్తున్నారు. ఈ మనిషికోసం నేను కార్చే కన్నీళ్ళ శాతం ఎంత?
ఫ్రెండ్స్. కజిన్స్. ఫ్రెండ్స్! మనుషులంటే ఇంత ప్రేమ ఉన్నవాడు, ఇంత మందికి ప్రాణమంత దగ్గరైనవాడు, తన చావుతో అందరికీ “పర్సనల్ లాస్” మిగిల్చినవాడు, నాకోసం ఒక పలకరింపు, ఒక చిర్నవ్వు ఎందుకివ్వలేకపోయాడు? భార్యగా కాకపోయినా, మనిషిగానైనా నాకందులో వంతు ఎందుకు లేదు?
ఆటో-పైలెట్ మోడ్‍లో ఉండి స్క్రోల్ చేసుకుంటూ పోతున్న నా బొటని వేళ్ళు, చదువుకుంటూ పోతున్న నా కళ్ళూ ఠక్కున ఆగిపోయాయి. “ఆమనీ – థింకింగ్ ఆఫ్ యు” అని చివర్న తగిలించాడో ఫ్రెండ్ ఒక పోస్ట్ లో. ఇంజనీరింగ్ బాచ్‍లో సగం మందిని టాగ్ చేశాడు. ఆమెకి వాళ్ళ పేర్లు కంఠతా వచ్చు. వాళ్ళు ఎక్కడున్నదీ, ఏం ఉద్యోగాలు చేస్తున్నదీ, పెళ్ళిళ్ళు అయ్యాయో లేదో అన్నీ తెల్సు.
అతడు చెప్పలేదు ఎవరి గురించీ. ఆమని గురించి తప్ప.
“ఎనిమేదళ్ళ రిలేషన్. పెళ్ళి అయితే అవ్వదని అర్థమైంది. ఆర్నెళ్ళు టైమ్ తీసుకున్నాను. సరిపోలేదని తెలుస్తున్నా మన పెళ్ళికి ఒప్పుకున్నాను. అది తప్పు. నేను నిన్ను సరిగ్గా ట్రీట్ చేయలేకపోతున్నాను. అదింకా తప్పు. కానీ ఈ మొత్తంలో నీ తప్పేం లేదు. You’re just at the wrong end at the wrong time. But don’t punish yourself ever. Please.”
పెళ్ళికని పదిహేను రోజులున్నాడు. అందులోనే ఎంగేజ్మెంట్, పెళ్ళి, రిసెప్షన్, ఫస్ట్ నైట్ కాని ఫస్ట్ నైట్. వ్రతాలు, గుళ్ళూ గోపురాలు, ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య తిరుగుళ్ళు. చీరలు-డ్రసెస్, మెహందీ, మేకప్, ఫోటో షూట్, ఫ్రెండ్స్, కజిన్స్ – పెళ్ళంటే ఇవే కదా! “పూరీ జిందగీ పడీ హై అబ్” అనేవాళ్ళే అతడితో మాట్లాడ్డానికి ప్రయత్నించినప్పుడల్లా.
పారిపోయాడు. లీవ్ దొరికే సమస్యే లేదు, ముఖ్యమైన ప్రాజెక్ట్ అని చెప్పాడు. కానీ కాదు. పారిపోయాడు. నాతో, ఒక ఇంట్లో, ఒక గదిలో ఉండలేక, ఉండడాన్ని కనీసం ఊహించలేక పారిపోయాడు. రోజూ కాల్ చేసేవాడు. రోజూ మాట్లాడేవాడు. “తిన్నావా?” “బాగానే ఉందా అంతా?” “ఏం ఇబ్బంది లేదుగా” – నా నసీబ్‍లో ఉన్న ఈ ఐదు నిముషాల హిసాబ్ ఇవే, ఇలాంటివే! అంతకన్నా కొంచెం ముందుకెళ్ళినా సమాధానంగా: “మీటింగ్ ఉంది. వెళ్ళాలి.”
ఓ రోజు అత్తయ్య చిన్నప్పటి ఆల్బమ్ చూపించారు. ముద్దొచ్చేశాడు. “ఐ లవ్యూ” అని మెసేజ్ చేశాను. రిప్లై లేదు.
ఓ పూట అల్మారాలో పాత ఫోటోలన్నీ తుడిచాను. హార్స్ రైడింగ్‍కి వెళ్ళి ఫోజ్ కొట్టి తీయించుకున్న ఫోటో. “రారా రెక్కల గుర్రం ఎక్కి, ఎత్తుకుపోవా నీతో చుక్కల లోకంలోకి” అని హమ్ చేస్తూనే లైన్ టైప్ చేశాను. రిప్లై లేదు.
రాత్రికి మాత్రం కాల్ వచ్చేది. “తిన్నావా?” “బాగానే ఉందా అంతా?” “ఏం ఇబ్బంది లేదుగా!”
ఏవి ఇష్టంగా తింటాడు? ఏవి తినడానికి నసుగుతాడు? ఏ రంగు ఇష్టం? చిన్న చప్పుడైనా మెలకువ వచ్చేస్తుందా? ఏ క్రికటర్ ఇష్టం? మొదటి సైకిల్ ఏది? మొదటి బైక్ ఎప్పుడు? చేతిరాత ఎలా ఉండేది?స్కూల్ సంగుతులేంటి? తీరికున్నప్పుడల్లా అత్తామామలు పూసగుచ్చినట్లు చెప్పేవారు. నేను ఆలకించేదాన్ని.
సరిపోయేది కాదు. బాగా ఆకలి మీదున్నప్పుడు ఒకట్రెండు ముద్దలు తింటే ఇంకా ఆకలి ఎక్కువవుతుందే, అలా. అమ్మానాన్నలకి తెలియని లోకం చాలానే ఉంటుంది కదా! సోషల్ మీడియా మీద పడ్డాను. ట్విట్టర్‍లో రోజుకో అప్‍డేట్ ఉండేది, టెక్నికల్ లింక్స్. అప్పుడప్పుడూ క్రికెట్. రెండూ అర్థమవవు నాకు. అయినా తెరచి చూసేదాన్ని. మనిషిని చూసినట్టే అనిపించేది.
ఫేస్‍బుక్‍లో ఉన్నాడు. ఆక్టివ్‍గా లేడు. మా పెళ్ళి ఫోటోలు టాగ్ చేసినవే ఆఖరు. స్క్రోల్ చేసుకుంటూ పోయేదాన్ని. మంచులో ఫోటోస్. యూ.కె వీధుల్లో తిరిగిన ఫోటోస్. ఏర్పోట్ నుంచి “కొత్త బంగారు లోకం” అన్న స్టేటస్, చెన్నైలో తిరిగిన బీచ్‍లు, ఇండియా క్రికట్ వల్డ్ కప్ నెగ్గినప్పటి కేరింతలు, ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్రెండ్స్ తో గ్రూప్ ఫోటోలు… పెళ్ళి నాకు భర్తగా “సాయి అఖిల్” అని ఒక బ్లాంక్ కాన్వాస్ మాత్రమే ఇస్తే, ఇలా ఒక్కో స్టేటస్ చదువుకుని ఆ కాన్వాస్‍ని నింపుకుంటూ పోయాను. చాలా బాగనిపించేది ఒక్కోసారి. చిరాకేసేది ఇంకోసారి. వేళ్ళు నొప్పి పెట్టేవి. కళ్ళు గుచ్చుకునేవి. ఏడుపొచ్చేది. అయినా తెల్లారేసరికి ముస్తాబై సెల్ఫీ పెట్టేదాన్ని. నాతో అతడు ఉన్నట్టు, అతడితో నేనుండద్దా?
రిప్లైలా? రాత్రికి మాత్రం కాల్ వచ్చేది. “తిన్నావా?” “బాగానే ఉందా అంతా?” “ఏం ఇబ్బంది లేదుగా!”
ఒక రోజు తన రిలేషన్‍షిప్ స్టేటస్ అప్డేట్ చేయమని మెసేజ్ పెట్టాను. బదులు లేదు. కాల్‍లో గుర్తుచేశాను. చేస్తానన్నాడు. చేయలేదు. రెండు రోజులు ఆగాను. నేనే కాల్ చేశాను. అరిచాను. ఏడ్చాను. “ఎన్నారై అని చెప్పి పెళ్ళి చేసుకుని మళ్ళీ తిరిగిరాకుండా పోయే రకం నువ్వు. నీకక్కడ ఎవరో ఉన్నారు” అని మాటలు అన్నాను. “నేను నీకు నచ్చలేదు. నా అందం సరిపోలేదు. నా చదువు సరిపోలేదు. అందుకే అందుకే…” అని ఏడ్చాను. ఏం మాట్లాడలేదు. కాల్ కట్ చేయలేదు.
గంట తర్వాత మెసేజ్ పెట్టాడు, ఆమని గురించి. నేను రిప్లై ఇవ్వలేదు.
ఆ దెబ్బకి, నాకు పెళ్ళి అనే దెయ్యం దిగింది. తళతళలాడే చీరలు, మిలమిలలాడే బంగారం, పాటలు, డిస్కోలు, మొహం మొత్తేటన్ని వంటకాలు, చెప్పలేనంత హడావిడి – ఏదీ అతడికి పట్టలేదు. మొత్తం పూజలూ, ఈవెంట్లూ అన్నీ రోబోలాగా చేసుకుంటూ పోయాడు, ఎవ్వరికీ అనుమానం రాలేదు. అప్పుడా వేడుకలకి అర్థమేమిటి? ఒక మనిషి మనసు మార్చలేనివి, ఒక మనసుకి ఆశ పుట్టించలేనివి – ఎందుకివ్వన్నీ?! నేను మాస్టర్స్ కి అప్లై చేస్తున్నానని మెసేజ్ చేశాను. “అదేదో ఇక్కడ అప్లై చేయి” అని అడగలేదు అతడు. “నువ్వు వచ్చేస్తావా ఇక్కడికి?” అని నేనూ అడగలేదు.
ఒక్కసారిగా ఏడుపులు వినిపించాయి మళ్ళీ. అతడి డెత్ సర్టిఫికేట్ వచ్చిందంట. నా కాఫీతో పాటు కబురొచ్చింది.
కాసేపటికి నన్ను కిందకి రమ్మన్నారు. అతడి ఫ్రెండ్స్ వచ్చారని.
అదే ఇంజనీరింగ్ బాచ్. దాదాపుగా అందర్నీ గుర్తుపట్టాను. విషాల్ అత్తయ్య ఒడిలో పడుకుండి పోయాడు. రాఘవ మొబైల్ అటూ ఇటూ తిప్పుతూ దిక్కులు చూస్తూ ఉన్నాడు. శ్రీ ఎవరి చేతుల్లోంచో కాఫీ కప్పులు అందుకుని బయట ఉన్నవాళ్ళకి సర్వ్ చేయడం మొదలెట్టాడు. శ్రావ్య దగ్గరకొచ్చి హత్తుకుంది.
ఆమని రాలేదు. అసలైతే, అందరికన్నా అతడి ఆఖరి చూపు చూసే హక్కు ఆమెకే ఉంది. కానీ ఎక్స్ కోసం దహనసంస్కారాలు ఆపేంత గొప్పోళ్ళం కాలేదు మనం. అతడూ లేక, ఆఖరి చూపూ దక్కక ఆమెకి ఇంకేం మిగిలిందిక్కడ, రావడానికి?
కాసేపటికి అందరూ నా గదికొచ్చారు. నా చుట్టూ కూర్చున్నారు. “టేక్ కేర్”, “బీ స్ట్రాంగ్” అని వాళ్ళు నాకు చెప్పలేదు. నేను వాళ్ళకి చెప్పలేదు. మౌనం. మాటలు ఇవ్వలేని ఓదార్పుని ఇచ్చేంత మౌనం. రాఘవ నా దగ్గరకొచ్చి నా చేతులు పట్టుకుని ఏడ్చాడు. ఏం చేయాలో తెలీక దిక్కులు చూస్తూ ఉండిపోయాను.
ఈ ఐదు రోజుల్లో నాకు మొదటిసారిగా ఒకళ్ళు బాసటగా ఉన్నారనిపించింది వీళ్ళు వచ్చాకే. “నాకేం ఏడుపు రావడం లేదు” అని చెప్పాను శ్రావ్యతో. నా భుజం నిమురుతూ నావంతుగా కూడా తనే ఏడ్చింది.
“రాత్రికి ఉండిపోండి” అనడిగాను. “లేదు, వెళ్ళాలి” అని హడావిడి పడ్డారు.
“ఆమని.. ఆమని” అని విషాల్ ఆగిపోయాడు. శ్రావ్య వాణ్ణి పక్కకు పంపి చెప్పింది, కబురు తెలియగానే ఆమని కొలాప్స్ అయిపోయిందని. ఐసియులో ఉంచారని.
“ఔట్ ఆఫ్ డేంజర్” అని కూడా చెప్పింది. నాకు మాత్రం “డేంజర్”లో పడేంత ప్రేమా అన్నదే రిజస్టర్ అయ్యింది.
నిజంగానే ఏడుపు ప్రేమకీ, పాశానికీ కొలమానమై ఉంటుంది. అత్తయ్య మాట్లాడలేకపోతున్నారు. ఆమని హాస్పిటల్‍లో ఉంది. చనిపోయినవాళ్ళకి కాదు సర్టిఫికేట్. బతుకున్నవాళ్ళకే. కంటతడి పెట్టలేకపోతున్న నాకు “విడో” స్టేటస్. గుండె ఆగిపోయినంత పని అయినా ఆమనికి అఫీషియల్‍గా ఏ స్టేటస్ ఉండదు. నా మెడలో ఉన్న తాళి బొట్టు అతని చావుని ఆపలేదు. మెడలో పడని తాళి బొట్టు ఆమె ప్రాణం మీదకి తీసుకురాకుండా ఉండలేదు.
ఈ ఏడాది జీవితాన్ని పూర్తి బూటకంగా కాకుండా, కాసిన్ని కన్నీళ్ళతో అయినా సరే, అతనితో ఆఖరి ప్రయత్నంగా కాస్తంత బంధాన్ని ఏర్పర్చుకోవాలని కసితీరా ప్రయత్నించాను. అయినా ఏడుపు రాలేదు. కోపమొచ్చింది. నా మీద నాకు అసహ్యమేసింది. విరక్తి కలిగింది. ఏడుపు మాత్రం… ఊహూ!
అతడి చాట్ తెరిచాను. ఈ వాక్యాల దగ్గరే ఆగిపోయాను: “కానీ ఈ మొత్తంలో నీ తప్పేం లేదు. You’re just at the wrong end at the wrong time. But don’t punish yourself ever. Please.”
(Mainly inspired by Paggaliat movie on Netflix. In fact, I was so hooked to the premise, but so disappointed with the execution, that the “couple” were playing on my head for too long. I had to give those thoughts some form of fiction, and push them out of my system. )