(ప్రస్తుతం మనమున్న పరిస్థితుల్లో సాహిత్యమే దిక్కవుతుంది. 😦 కున్‍వర్ నారాయణ్ రాసిన రెండు కవితలని అనువదిస్తూ కాస్త distract అయ్యాను.)
మామూలు జీవితం గడుపుతూ
తెల్సు నాకు
ప్రపంచాన్ని మార్చలేనని
పోరాడి
గెలవలేననీ
ఆ, పోరాడుతూ పోరాడుతూ ’షహీద్’ కాగలను
ఆ పైన
వీరుని స్మృతిలో సమాధో
లేదూ ఒక నటుడి అంతటి పేరో…
కానీ షహీద్ అవ్వడం
ఖచ్చితంగా గర్వించదగ్గ విషయమే
అతి మామూలు జీవితం గడుపుతూ కూడా
మనుషులు చప్పుడు చేయకుండా షహీద్‍లు అవుతూనే కనిపించారు.
నోట్:
షహీద్: యుద్ధంలోనో, గొప్పకారణానికో ప్రాణాలు పొగొట్టుకున్నవారిని హిందు/ఉర్దూలో షహీద్ అంటారు. తెలుగులో సరైన పదం దొరకలేదు నాకు.
గణాంకాల రోగం
ఒకసారి నాకు గణాంకాల వాంతులైయ్యాయి
లెక్కేస్తూ లెక్కేస్తుంటే అంకెలు
కోట్లని దాటుకుంటూ పోయేసరికి
నేను కళ్ళు తిరిగి పడిపోయాను
స్పృహ వచ్చేసరికి ఆసుపత్రిలో ఉన్నాను
రక్తం ఎక్కిస్తున్నారు
ఆక్సిజన్ ఇస్తున్నారు
నేను అరిచాను
డాక్టర్, నాకు దారుణంగా నవ్వొస్తోంది
నవ్వించే గాస్ అయ్యుంటుందిది
ప్రాణాలు కాపాడేది కాదు
నువ్వు నా మీద నాకు నవ్వొచ్చేలా చేయలేవు
ఈ దేశంలో ప్రతి ఒక్కరూ విచారంగా బతకాలి
పుట్టుకుతో వచ్చిన హక్కది, లేదంటే
అర్థం లేకుండా పోతాయి
మన స్వాతంత్ర్యం, ప్రజాతంత్రం
మాట్లాడకండి – నర్సు అంది – చాలా నీరసపడిపోయారు మీరు
అతి కష్టం మీద లొంగింది మీ రక్తపోటు
డాక్టర్ నచ్చజెప్పాడు – గణాంకాల వైరస్
ఘోరంగా వ్యాపిస్తోంది ఇవ్వాళ్రేపు
నేరుగా మెదడు మీద ప్రభావం చూపిస్తోంది
మీరు అదృష్టవంతులు, బతికిపోయారు
ఏమైనా అయ్యుండచ్చు మీకు —
విషజ్వరంలో ఏదో వాగుతూనే ఉండేవారు
లేదూ పక్షవాతమొచ్చి మొత్తానికి పోయేవారు
మీరు మాట్లాడినప్పుడు
మెదడులోని ఏ నరమైనా తెగి ఉండచ్చు
ఇంత పెద్ద సంఖ్య వేసే ఒత్తిడిలో
మనమంతా ఒక నాజూకైన కాలంలో ఉన్నాం
లెక్క మొత్తం గురించి ఆవేశపడితే ప్రాణం మీదకి రావచ్చు
గణాంకాల మీద ఏ మందూ పనిజేయదు
నెమ్మదించండి
బతికిపోతే, కోట్లల్లో ఒకరిగా మిగిలిపోతారు
హఠాత్తుగా నాకనిపించింది
ప్రమాదాల్లో అప్రమత్తంగా ఉండమని సూచించే సంకేతంగా
మారిపోయింది డాక్టర్ మొహం
నేను గణాంకాల తరాజులా
అరుస్తూ పోయాను
మేం అంకెలు కాదు, మనుషులం