అహనా పెళ్ళంటలో ఆటోబయోగ్రఫీ చెప్పుకునే నూతన్ ప్రసాద్ లా “స్నేహాలు పలురకాలు…” అని మొదలుపెట్టి పెద్ద క్లాస్ పీకాలని ఉంది కానీ పోన్లే పాపం అని క్షమించి వదిలేసి రెండుముక్కల్లో ముగిస్తాను.
ఒకసారెందుకో వేణుకి మెయిల్ చేస్తూ “నేను మీకంత క్లోజ్ ఫ్రెండ్ కాకపోవచ్చు గానీ…” అని సన్నాయి నొక్కులు నొక్కినందుకు బదులుగా జవాబులోని లైన్ ఇది. ఆ తర్వాత నేనెందుకు అలాంటి వెధవ అనుమానాలు పెట్టుకోకూడదో, ఎందుకు మా మధ్య స్నేహం ఎప్పటికీ గాఢమైనదో తన తరహాలో వివరించారు.
స్నేహాలు పలురకాలు.
వాటిల్లో బ్లాగ్ స్నేహాలు ప్రత్యేకమైనవి. నేను ఒకటే స్కూల్‍లో చదివాను కాబట్టి పన్నెండేళ్ళు వాళ్ళే క్లాస్‍మేట్స్, ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు బ్లాగ్ మొదలెట్టి 13-14 yrs అవుతోంది. ఈ లోపు ఉద్యోగాలు, ఊర్లు మారాను. వాట్సాప్ వల్ల అందరూ గ్రూప్స్ అయితే పెడుతున్నారు. ఇంకేం లేకపోయినా forwards అయితే వస్తుంటాయక్కడ. బ్లాగ్ స్నేహాలు కూడా బ్లాగులు, బజ్, గూగుల్ ప్లస్, ఫేస్‍బుక్, వాట్సాప్ అన్నీ దాటుకుని ఇంకా కొనసాగుతున్నాయి. ఇంత సుదీర్ఘ స్నేహాల్లో అన్నివేళలా అందరితో టచ్ లో ఉండడం దాదాపు అసంభవం. అయినా ఏదో సన్నని దారం అందర్ని అంటిపెట్టుకుని ఉందనే అనిపిస్తుంది.
వేణు కరోనా అప్‍డేట్స్ నాకు ఫేస్‍బుక్‍లో రాయడం ద్వారానే తెలిసాయి. కరోనా వచ్చిందనగానే పెద్ద పట్టించుకోలేదు నిజానికి. వైరస్ సోకడం అతి సహజమైపోయిందిప్పుడు. కానీ ఆసుపత్రిలో చేరాననగానే గుండె జారిపోయింది. కానీ ధైర్యం నటించాను. మనిషి ఆక్టివ్‍గా అప్‍డేట్ చేస్తుంటే బానే ఉండుంటారని ఆశపడ్డాను. అసలు ఆసుపత్రిలో చేరడమే గగనమైపోతున్న రోజులు కాబట్టి బెడ్ దొరికినందుకు ఊరటగా అనిపించింది. I was forcing myself to look at positives. I was confusing my instincts with anxiety.
వేణు వాళ్ళమ్మగారికి సీరియస్ గా ఉందని తెల్సినప్పుడు నేను కాల్ చేశాను. అవతలి నుంచి హలో వినిపించగానే “అమ్మకేమైంది?” అని అడిగాను. ఆయన దానికి సమాధానం చెప్పకుండా “అసలు నీ గొంతులో ఎందుకంత గాభరా ఉంది? మా పూర్ణీ ధైర్యంగల పిల్ల కదా… ఇలా మాట్లాడ్డమేమిటి?!” అని అడిగారు. నేనంత కంగారు పడుతున్న సంగతి అప్పుడే తట్టింది నాక్కూడా. “ఏమో, నాకు చాలా భయమేస్తుంది” అని చెప్పాను. అప్పుడు నన్ను కొంచెం calm చేసి, నేను కుదురుకున్నాక, నేను నెమ్మదించాక అప్పుడు వాళ్ళ అమ్మగారి గురించి మాట్లాడారు.
నాకు 2019లో విపరీతమైన (almost crippling) anxiety attacks జరిగాక థెరపిస్ట్ తో, “నాకు ఇంతకు ముందెప్పుడూ ఇలా కాదు. ఇదసలు పూర్తిగా కొత్త” అని అంటే, “లేదు, ఇది ఎప్పుడో మొదలైయ్యుంటుంది. మెల్లిగా, చిన్నగా. మీరు గమనించుకోలేదు” అని చెప్పారు. వాళ్ళెటూ జీవితం మొత్తం తిరగ తోడిస్తారు కాబట్టి అందులో నాకు ఈ సంభాషణే నాకు అక్కరకొచ్చింది. వాళ్ళు నాకు సహాయం చేయడానికి పనికొచ్చింది.
ఆయన ఉన్న పరిస్థితుల్లో నేను ఎలా మాట్లాడుతున్నా అన్నది అనవసరం. ఆయనకి వాళ్ళమ్మంటే ప్రాణమని నాకు తెల్సు. అదే నా టెన్షన్. నేను ప్రాణం పెట్టే మనిషికే అలాంటి కష్టం వచ్చి తల్లడిల్లిపోతుంటే ఏం చేయలేక నిస్సహాయంగా ఉండిపోయాను. వేణు కూడా అదే పీడని అనుభవిస్తారేమోనన్న భయం, బాధ, బెంగ.
ఎటూ అదే జరిగింది. వేణు వాళ్ళమ్మ పోయాక ఆవిడ గురించి చాలా రాశారు. నాకవేవీ చదివే ధైర్యం లేకపోయింది. ఇప్పటికీ లేదు. వేణుకి కూడా ఏదో మాటవరస “టేక్ కేర్” చెప్పి పక్కకు తప్పుకున్నాను. నాకు తెలీలేదు అప్పుడు, ఎలా సపోర్ట్ ఉండాలో.
నేను సతమవుతున్న మానసికారోగ్య సమస్యల గురించి ఈ ఏడాది మొదట్లో రాశాను. మామూలుగా నేను “థాంక్స్” గానీ, “సారీ” గానీ చెప్పకుండా ఉండను. ఆ వ్యాసాలు రాసినప్పుడు కూడా కొందరికి మెయిల్ చేశాను, వాళ్ళ స్నేహానికి. వేణుకి ఎందుకో చెప్పలేదు.
ఇప్పుడెంత తన్నుకుంటున్నా ఫేస్‍బుక్‍లో మొన్నా మధ్య తెలుగులో తెలుగు పదాలే ఉండాలా, ఇంగ్లీష్ పదాలుంటే ఏంటి అన్న అంశంపై వాడీ-వేడీగా వాదించేసుకున్నదే last proper interactionగా గుర్తొస్తోంది. ఇద్దరం తగ్గలేదు. Passionately arguing, but respectfully disagreeing.
బ్లాగ్ స్నేహాలు ఇందుకు కూడా ప్రత్యేకం. విచిత్రం. పైకంతా ఏదో భాషనీ, సాహిత్యాన్నీ, సమజాన్నీ ఉద్ధరించేయబోతున్నట్టు ఆవేశాలు. కానీ ఏకాంతంగా కూర్చుని ఆలోచించుకుంటే తప్ప ఎంతెటి లోతైన ఆప్యాయతలూ, అనురాగాలో అర్థం కావు. అలాంటి ఏకాంతాలు చేజిక్కించుకుని ఎమోషనల్ ఈమెయిల్స్ రాస్తే, “పిచ్చి మొహం!” అని అప్పుడు అనుకున్నా, తర్వాత ఆ అక్షరాలే మిగిలిపోతాయి.
అక్షరాలు అచ్చంగా, ఎలా ఉన్నవి అలానే మిగిలిపోతాయి.
జ్ఞాపకాల్లా కావు అక్షరాలు. మసకబారిపోవు. మబ్బుపట్టవు. మాయమైపోవు.
మరుపుని కూడా జయిస్తాయి. ఆ క్షణంలోని భావావేశాలని యదాతథంగా మోసుకొస్తాయి. లేకపోతే, “స్నేహాలు పలురకాలు” అని వేణు నాకు క్లాస్ పీకబోయారన్నది నాకు గుర్తే లేదు. మెయిల్స్ చూస్తుంటే కనిపించింది.
బ్లాగ్ స్నేహాలు ఒక రకంగా విడ్డూరం కూడా! ఒక బ్లాగర్ పెళ్ళికి పిలిస్తే వెళ్ళాం. వేరే ఊర్లో, పెళ్ళికే పనిగట్టుకుని వెళ్ళాం. అక్కడ మా బాగోగులు చూసుకోడానికి ఒక కజిన్. “ఎక్కడ, ఎలా పరిచయం మీకు పెళ్ళికొడుకు?” అన్న ప్రశ్న వచ్చింది.
“ఇట్లా అంతా బ్లాగులు రాసుకుంటుంటాం, ఇంతకు ముందు పెళ్ళికొడుకుని చూడలేదు మేము, కానీ మా ఫ్రెండ్!” అని చెప్పాము. “ఏదో మాట వరసకి పిలిస్తే వచ్చేస్తారా?” అన్నాడాయన అసహనంగా. “లేదండీ, కార్డిచ్చే పిల్చారండీ” అని చూపించాము.
చుట్టాలైతే, సహాయం చేసినా చేయకున్నా, వార్తలు అందుతూనే ఉంటాయి. సహోద్యోగులైతే బాస్ నుంచి అప్‍డేట్స్ వస్తాయి. పక్కింటివాళ్ళమైతే ఇంట్లో వాళ్ళే ఒక మాట చెప్పి పెడతారు. ఫ్రెండ్స్ లో బాగా చూసిన మొహమైతే ఏ సహాయమైనా అడుగుతారు. ఇట్లాంటి ఇంటర్నెట్ స్నేహాలు అర్థం చేసుకోలేరు త్వరగా.
వేణు ఒక రోజు ముందు వరకూ తానే స్వయంగా అప్‍డేట్స్ ఇస్తూ ఉన్నారు. ఒక రోజంతా ఏ సమాచారం తెలీకపోతే అందరం మామూలేనని అనుకున్నాం. నాకన్నా నేను మాట్లాడుతున్న బ్లాగర్-ఫ్రెండ్స్ ధైర్యంగా కనిపించారు. నేను ధైర్యం నటించాను.
పొద్దున్నే వార్త తెల్సింది. షాక్. అయినా మెసేజ్ చేసిన ఫ్రెండ్-నేనూ, “యు టేక్ కేర్-యూ టేక్ కేర్” అని చెప్పుకుంటూ ఉన్నాం. ఇద్దరం తెల్సిన వాళ్ళకి కబురు అందిస్తున్నాం. ఇంకెవ్వరైనా ఫోన్ చేసి, లేదు ఫేక్ న్యూస్ అని చెప్తారేమోనని ఆశపడుతున్నాం. ఫేస్బుక్ లో ఎవరూ అప్‍డేట్ చేయకుండా ఉంటే ఇది నిజం కాదేమోనని ఆశ.
అప్పుడే ఆ ఫ్రెండ్ నుంచి మెసేజ్: “రికవర్ అవుతాడనే అనుకున్నాను. నిన్నంతా లాస్ట్ ఆక్టివ్ ఎప్పుడున్నాడా అని చూసుకుంటూ ఉన్నాను.”
ఆ మెసేజ్‍కే నాకు ఏడుపు మొదలైంది. అప్పటి వరకూ మొద్దులా ఉన్నాను.
ఒక మనిషి పేరు పక్కన “గ్రీన్” కనిపించడమనేది ఎంతటి ఊరటో, ఎంత life-giving అనేది కేవలం ఆన్‍లైన్ స్నేహాలున్న వాళ్ళకే తెలుస్తాయి. కొట్టుకున్నా, తిట్టుకున్నా, మాట్లాడ్డం మానేసినా – బ్లాక్ చేయనంత కాలం – అలా ఒక గ్రీన్ బల్బ్ కనిపిస్తే కంటికి, మనసుకి ఎంత ప్రశాంతతో!
ఒక రోజంతా “ఎందుకిలా అయ్యింది?”, “నేను అవకాశమున్నా సహాయం చేయలేదా?”, “ఇంత మంచి మనిషికి ఇలా ఎలా అవుతుంది?” వగైరా వగైరాతో కొట్టుకున్నాను. కానీ ఏమో, with a risk of being misinterpreted, I’d still say, Venu’s death also had a calming effect on me, just like his presence. Especially, given the dire circumstances. He did his best. ఏడాదిన్నర బాటు కరోనా బారిన పడకుండా జాగ్రత్త పడ్డారు. ఆ టైమ్‍లో అందరికీ జాగ్రత్తలు గుర్తుచేస్తూనే ఉన్నారు. అంతకన్నా ఎవరేం చేయగలరు?
ఆల్సో, ఇప్పుడంతా “ఓన్లీ 35”, “ఓన్లీ 60” అని సంతాప సందేశాలు పెడుతున్నారు కానీ ఎప్పుడన్నా వయసు పెరుగుతుందంటే సంతోషపడనిచ్చిందా ఈ లోకం? ఇంకా అది చేయలేదు, ఇది సాధించలేదు, ఇంత వయసొచ్చినా… ఇలాంటి మాటలే కదా వినిపించేది! అంత ఒత్తిడి పెడుతున్నా, ఏదో సాధించని పోరుబెడుతున్నా అన్నీ అధిగమించి నిండుగా నవ్వడమెంత కష్టం? అంతకన్నా well-lived lifeకి నాకు ఉదాహరణ దొరకడం లేదు.
నేను 2019లో విపరీతమైన suicidal tendencies ని ఎదుర్కొని ఎలాగో బతికి బట్టకడుతున్నా. 2020 ఏమో ఆ కట్టే బట్టలని ఎటూ నైట్‍వేర్, కాజ్యువల్స్ కి కోవిడ్ మార్చేయడంతో బిక్కుబిక్కుమంటూ బతకడమే కాకుండా నాకో వింత అలెర్జీ తగులుకుని ముక్కు ఒక వైపు పనిచేయకుండా సతాయించింది. ఏడాదంతా సతాయించి ఇప్పుడిప్పుడే తగ్గుతుందనే సరికి సెకండ్ వేవ్ మొదలైంది. వాళ్ళు పోతారు, వీళ్ళు పోతారు – నాకివే భయాలు. వేణు దెబ్బతో అవ్వన్నీ పోయాయి.
Nothing matters. At the same time, everything continues to matter. Such is life.
నా priorities మారాయిప్పుడు. ఇంతకాలం బతకాలి, ఇన్ని చేయాలి – అలా ఆలోచించడం దండగ. ఎంతకాలమున్నామనేది, ఏం చేశామనేది కొంత వరకే. ఏం మిగిల్చి వెళ్ళామన్నదే ముఖ్యం.
వేణు బ్లాగ్ ఉంది. యూట్యూబ్ లో వేణు గొంతుంది. వేణు నవ్వుంది.
స్నేహముంది. ఆప్యాయత ఉంది. తెలుగుపై మమకారముంది.
ఇవి చాలు నాకు.
నేనేం చేసినా సంతోషపడి, ప్రోత్సహించే స్నేహితుల్లో వేణు ఎప్పుడూ ముందుండేవారు. ఇక మీద కూడా ఉంటారు. I can feel his hand on my head.
ఏదో ఒక ఏడాది వేణుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు ఇలా వెరైటీగా రాసి పంపాను.
మీరు మూవీస్ బాగానే చూస్తుంటారుగా. మన సినిమాల్లో మీకు నచ్చిన ఓ ముసలమ్మ కారెక్టర్‍ని (ఏ నిర్మలమ్మో, జానకమ్మోనో) నన్నుగా ఊహించుకుంటూ ఈ కింది లైన్స్ చదువుకోండి. లైటాతి లైట్‍గా ఒక సన్నటి కన్నీటి పొర, కొంచెం వణికే గొంతు, ఇంకా బోలెడు వణికిపోతున్న చేతులూ, సందర్భానుసారంగా ఊహించుకోండి.
ఇవ్వాళ నీ పుట్టినరోజటగా నాయనా! మా నాయనే, మా తండ్రే! ఏ తల్లి కన్నబిడ్డవో గానీ, నీ మాట ఇన్నా, నిన్ను చూసినా కడుపు నిండిపోతుంది నాయనా. ఏదీ.. ఇదో.. అట్టాగే నిండు పున్నమి చంద్రునిలా నవ్వుతూ నిండుగా కలకలాం సుఖసంతోషాలతో బతుకు తండ్రి. ఏ కష్టమొచ్చినా కడుపులోనే దాచుకుంటావ్ గా ఎటూ.. ఇట్లాంటి పుట్టినరోజులు నువ్వేటా ఏటా బోలెడు జరుపుకోవాలని మనసారా దీవిస్తున్నా.. సుఖంగా ఉండు నాయనా!
అదన్న మాట సంగతి. అవ్వ అవతారం అయిపోయింది. ఇప్పుడు ’పూర్ణీ అమ్మమ్మ గారికి’ అంటూ రిప్లై మొదలైందో, నాలోని సూరేకాంతం బయటకొచ్చేస్తుంది. 🙂
My prayers didn’t have enough power. Wherever he is, my wishes continue to be the same. I don’t want to change a single word.
Onward, my friend. Deep gratitude for enriching my life in ways only you could do.
ఏ తుఫానో వచ్చినప్పుడు తలుపులేసుకుని ఇంట్లో ఉండి, వర్షం తెరిపిచ్చిన ఉదయాన బయటకి వచ్చి ఎన్ని చెట్లు వాలిపోయాయి, ఎన్ని పండ్లు రాలిపోయాయి చూసుకుంటాం. చక్కదిద్దుకునే పని మొదలెడతాం. అట్లానే ఉంది పరిస్థితి. ఈ కరోనా ఎప్పటికి ముగుస్తుందో. అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంత శూన్యం మిగిల్చిపోతుందో తెలియటం లేదు.
వేణూ అందరికీ నిత్యం మాట్లాడే స్నేహితుడు కాకపోవచ్చు. కానీ అతను లేకపోతే అతని ప్రెజెన్స్ అందరూ మిస్ అవుతారు. ఎవరికి కష్టం వచ్చినా మెయిల్‌లోనో, పోస్ట్‌లోనో పరామర్శించి ధైర్యం చెబుతాడు. ఎవరికి మంచి జరుగుతున్నా సంతోషంగా శూభాకాంక్షలు చెబుతాడు. అందుకే తను లేకపోతే ఆ లోటు మనకి తెలుస్తుంది.
వేణు ఎక్కడ ఉన్నా తన విషెస్ మనతోనే ఉంటాయి. మనం తన గురించి తలపోసే మాటలు కూడా తన వరకూ చేరుతాయనుకుంటా.
LikeLike
నాకు వేణూశ్రీకాంత్ గారు, మీరు ఇద్దరు తెలియదు. కానీ వేణు గారి బ్లాగ్ ఎప్పటి నుంచో చదువుతున్న పాఠకుణ్ణి. ఆయన ఎంత మంది బ్లాగర్స్ జీవితాలని ప్రభావితం చేశారో తల్చుకొంటే అబ్బురమనిపిస్తుంది. మీది, మీలాగే నివాళి అర్పించిన అందరి స్నేహితులది వ్యర్థ ప్రలాపము కాదు. ఈ పాడు లోకంలో ఇంకా కొంత మానవత్వం, ప్రక్కన వాడి మీద ప్రేమ మిగిలి ఉన్నాయని చేప్పే తార్కాణం. ఆయనకి సద్గతి కలగాలని ప్రార్థిస్తున్నాను.
LikeLike