నా ఫ్రెండ్ SA పుణ్యమా అని “The Seen Unseen” podcastలో శారదా ఉగ్రాతో చేసిన ఇంటర్వ్యూ విన్నాను. అందులో ఆవిడ చాలా విషయాలు చెప్పారు, వాటిని గురించి తీరిక చేసుకుని మళ్ళీ ఎప్పుడో రాయాలి. (పడుకుని విన్నాను కాబట్టి నోట్స్ కూడా ఏం రాసుకోలేదు.) వాటిల్లో ఒక విషయం మాత్రం ఈ బ్లాగ్ పోస్ట్ కి స్పూర్తి. ఆవిడ తొంభై దశకం మొదట్లోనే స్పోర్ట్స్ జర్నలిస్ట్ గా పనిచేశారు. భారతదేశంలోనూ, విదేశాల్లోనూ పనిచేశారు. వృత్తి రిత్యా ఉద్యోగాలు మారారు, ఊర్లు తిరిగారు. అప్పటికి మొబైల్స్ లేవు. సెల్ఫీలు లేవు. అయినా పని చేసిన ప్రతి ఆఫీసులోనూ, వెళ్ళిన ప్రతి ముఖ్యమైన క్రీడాంగణం దగ్గర ఫోటోలు తీసుకుని పెట్టుకున్నారట.
“అప్పటి ఫోటోలు ఉన్నాయా మీవి? అని అడుగుతుంటారు నన్ను. ఎందుకు లేవు? సుబ్బరంగా ఉన్నాయి. నేను వెళ్ళిన ప్రతి చోటా ఫోటో తీసుకోవాలనే నియమం పెట్టుకున్నాను ఎప్పుడూ. నేనేదో ఉద్దరించేస్తున్నాను అన్న భావనతో కాదు, నేనిక్కడ ఉన్నాను, నా జీవితంలో ఇదో జ్ఞాపకమైపోయింది ఇప్పుడు అన్న భావనతో అన్ని చోట్లా ఫోటోలు తీసుకుని దాచుకున్నాను. అలానే నేను రాసినవన్నీ కూడా పేపర్ కట్టింగ్స్ తీసుకుని ఫైల్ చేసుకున్నాను. మంచివి, చెడ్డవి, పెద్దవి చిన్నవి అని బేధం లేకుండా అన్ని మళ్ళీ అదే చెప్తున్నాను, అవి గొప్పగా రాసేసినవి, తరతరాలకి ఉండాల్సినవి అని కాదు. నేను రాసినవి, నా శ్రమని నేను గుర్తించడానికి మాత్రమే” అని చెప్పుకొచ్చారు.
శారద కూడా సయీ పరాంజపెలాగా మరాఠి ఆవిడ. మరి మరాఠి అమ్మాయిలకి ఇంత self-assuredగా ఉండడం ప్రత్యేకించి నేర్పుతారో, లేక ఏదన్నా రంగంలో తొలి అడుగులు వేసి తక్కినవారికి మార్గదర్శకత్వం చేసేవారిలో ఆ మాత్రం తమ పని అంటే దురంహకారంగా మారని self-importance వస్తుందో, లేదో ఎందుకూ పనికిరాని తొక్కలో modesty తెలుగమ్మాయిలకే నూరిపోస్తారో నాకు తెలీదు కానీ, వీళ్ళద్దరినీ చూశాక నేను చేయాల్సిన unlearning చాలా ఉందని అర్థమవుతోంది. అసలు మన పని గురించి మనం ప్రస్తావించడమే చాలా ఇబ్బందికరమైన విషయంగా చూసే కల్చర్ సాహిత్యంలోనే ఉంది… ఇదే ఆఫీసులో అయితే “ఇది నా పని, నేను చేశాను” అని వీలైనంత వరకూ assertiveగాను, అవసరం పడితే కొంచెం aggressiveగానే చెప్పాల్సిన అవసరం ఎప్పుడూ ఉంటుంది. అక్కడ ఒళ్ళు హూనం చేసుకున్నాక నోరు మూసుకుని కూర్చుంటే జీతం పెరక్కపోగా, ఉద్యోగం కూడా ఊడచ్చు. అదే సాహిత్యంలో అయితే “నేనేదో రాస్తుంటానులెండి, పిచ్చి రాతలు”, “అయ్యో… ఏదో తోచింది రాయడమే, నాకేం తెల్సునని” అని మెలికలు తిరిగితేనే వినయవిధేతలు ఉన్నట్టు.
“కార్పరేటుతో దీన్ని పోల్చడం అన్యాయం. ఇది సృజనాత్మక పని. హృదయాంతరాలల్లోంచి వస్తుంది… బ్లాహ్” అంటుంటారు. మరప్పుడు ఇక్కడ ఒక దిక్కుమాలిన, ఎందుకూ కొరగాని, ఎటూ నిరూపించలేని meritocracy భాషలోనే మాట్లాడుతుంటారు, ఎందుకు? డబ్బూ లేకపోయే, రివార్డులు, రికగ్నిషన్లూ లేకపాయే… కానీ ఊ అంటే రాంకింగ్ భాషలోనే మాట్లాడతారు. శ్రీచైతన్య, నారాయణ వాళ్ళ ఆడ్స్ లా “ఒకటి ఒకటి రెండు రెండు రెండు మూడు నాలుగు నాలుగు” అని తమకి నచ్చిన రచయితల గురించి ఊదరగొడుతుంటారు. నాబోటి వాళ్ళని “perpetually upcoming writers” కింద తోసేయడానికి, “ఇంకా ఇప్పుడే కదా మొదలెట్టారు. మీరింకా సాధన చేయాలి” అని ఉచిత సలహాలు పడేయడానికి సిద్ధంగా ఉంటారు. నా మానాన నన్ను వదిలేయండి, కానీ అడ్డదిడ్డంగా అనిపించుకోవడంలో మాత్రం నాకు పేచీలుంటాయని నేను ఫేస్‍బుక్ పోస్ట్ వేసినప్పుడల్లా “aww… she’s crying for attention” టైపు స్పందనలే వస్తున్నాయి. (ఆంగ్రీ ఎమోజీ) అలాంటి నేపథ్యంలో శారద ఇంటర్వ్యూ తారసపడ్డం ఒక పెద్ద ఊరట.
ఏదో ఉత్సాహంలో మొదటి భాగం మార్చి నెల చివర్లో రాశాను, ఈ సారి రాయాలా quarterly review అని అనుకున్నాను. పైగా ఏప్రిల్, మే నెల మొత్తం అచ్చంగా చావు తప్పి కన్ను లొట్ట పోయిన పరిస్థితి కదా! ఏప్రిల్ మధ్యలోంచి మొదలై జూన్ మొదటివారం వరకూ కోవిడ్ వాలంటరింగ్ చేయడంతో అసలు ఒక ఆరేడు వారాల పాటు పుస్తకం తెరవలేదు. ఆఫీసు పని, వాలంటరీ పని సరిపోయింది. చుట్టూ అంత ప్రాణ నష్టం జరుగుతుంటే అన్నింటి మీదా విరక్తి వచ్చింది. అన్నీ పనికి రాని పనులు, ఊసుపోని పనులుగా తోచాయి. కానీ అంతటి విపరీత పరిస్థితుల్లో కూడా ప్రస్తుతం చేస్తున్న ఉర్దూ క్లాసులు మిస్ కాలేదు. విన్నా వినకున్నా, నోట్స్ రాసుకున్నా రాయకున్నా ఖచ్చితంగా క్లాస్ లో లాగిన్ అయితే అయ్యేదాన్ని.
ఆ క్లాస్ చెప్పేది ఎనభై మూడేళ్ళ హెచ్.కె. లాల్ గారు. ఆయన విభజన కాలంలోని హింసని చూశారు. పాకిస్తాన్ నుంచి పారిపోయి వచ్చారు. ఇండో-పాక్ యుద్ధాల వేడిని చూశారు. ఇందిరా గాంధి హత్య తర్వాత జరిగిన హింసని చూశారు. తన జీవితంలోనే ఎన్నో ఒడిదుడుకులు చూశారు. అయినా ఆయనకి జీవితం మీద మమకారం రవ్వంత కూడా తగ్గలేదు. ఒక పూట క్లాస్ ముగుస్తుందనగా ఎవరో ఒకరు అత్యుత్సాహంగా, “ఆప్‍కా టైమ్ హొగయా” (మీ సమయం అయిపోయింది!) అని అన్నారు. అనడానికి అతను క్లాస్ టైమ్ గురించే అన్నా, అందరికీ వేరే అర్థమే స్ఫురించింది. ఆయనకి చాలా కోపమొచ్చేసి చడామడా తిట్టేశారు. “నా టైమ్ ఏం కాలేదు. నేనింకా బతికుంటాను. నేను చేయాల్సిన పనులింకా ఉన్నాయి. నేను చెప్పాల్సిన పాఠాలు మిగిలున్నాయి. నా టైమ్ అయిపోయిందని నీకెలా తెల్సు?” అని.
కోవిడ్ సెకండ్ వేవ్ మొత్తం కూడా ఆయన ఒక్క రోజు కూడా క్లాస్ మిస్ అవ్వకుండా పాఠాలు చెప్పారు. నలభై మంది ఉండాల్సిన క్లాసులో పది మందే వచ్చినా చెప్పారు. అలా అని వాస్తవంతో ఆయనకేం సంబంధం లేదని కాదు. ఎక్కడెక్కడ ఆక్సిజన్ లేక జనాలు చనిపోతున్నారో, ఎక్కడ ఆక్సిజన్ లీక్ అయి ప్రమాదాలు జరిగాయో, గంగలో శవాలు ఎలా తేలి వచ్చాయో అన్నీ తెల్సు ఆయనకి. అవ్వన్నీ క్లాసులో ఏదో వంకన ప్రస్తావిస్తారు. వాటికి తగ్గ షేర్-ఓ-షాయరీ చెప్తారు. Without turning your face away from reality, yet not lose hope and rigor to live – అది ఆయణ్ణి చూశాక అర్థమైంది. ఈ రాయడాలు, చదవడాలు అన్నీ vanityకి సంబంధించినవి, ఇవ్వన్నీ అహాన్ని పెంచిపోషించుకునే సాధనాలు, సమయాన్ని ఎలా వెచ్చించాలో తెలీక చేసే పనులు అని విరక్తి నిండిపోయిన సమయంలో ఆయన నిర్విరామంగా చేస్తున్న పని నాకు చాలా స్ఫూర్తినిచ్చింది. ఆయన నేర్పిన ఉర్దూ మర్చిపోయినా పర్లేదు కానీ, ఆయన జీవితం గురించి నేర్పిన పాఠాలు మర్చిపోకుండా ఉంటే చాలు. ఆయనకో సలాం.
“Fresh beard styling (Khat/Chehra)” అంటూ ఆయన మా వాట్సాప్ గ్రూప్‍లో షేర్ చేసుకున్న ఫోటో. (బీటింగ్ హార్ట్ ఎమోజి ఇక్కడ.)

అందుకని నేను ఈ క్వార్టర్లీ రివ్యూ సీరిస్‍ని నిస్సంకోచంగా కొనసాగిస్తాను. ఏప్రిల్-జూన్ 2021 మధ్య జరిగిన విశేషాలు:
శోకం: ఒక పరిశీలన
చెప్పా కదా, ఉర్దూ క్లాసులో చావు గురించి, బతుకు గురించి రోజూ కవిత్వం నడిచేదని. దాని ఫలితమా అని, వాలంటరీ పనుల్లో తలమునకలై ఉన్నా కూడా ఫేస్‍బుక్ ఫ్రెండ్స్ రాస్తున్న కవితలపై దృష్టి పెట్టగలిగాను. వాటిల్లో ఆరింటిని ఎన్నుకుని ఒక గుత్తుగా గుచ్చి చివరి నిముషంలో ఈమాటకి పంపాను. వాళ్ళు వేశారు! ముందెన్ని రాసి ఉన్నా, ఇంక ముందు ఎన్ని రాయబోయినా ఇది మాత్రం చాలా ప్రత్యేకం నాకు. నేను కవితలు ఎప్పుడూ అనువాదం చేసింది లేదు. పైగా అసలు బుర్ర పనిచేయని సమయంలో. ఒక పక్క ఆక్సిజన్ బెడ్స్, మెడిసన్స్ కోసం లీడ్స్ వెతుకుతూ సమయం చిక్కినప్పుడల్లా చేసిన పని. నాకే అబ్బురం అనిపించింది.
ఈ కవితలు అచ్చు అయ్యాక ఫేస్‍బుక్ లో షేర్ చేస్తే కొందరు తెలుగురాని ఫ్రెండ్స్ ఆడియోలు పెట్టమని అడిగారు. మాధవ్ గారు రికార్డ్ చేసి పంపారు. వాటిని ఇక్కడ పంచుకుంటున్నాను.
కాలయంత్రం 2020:
కోవిడ్ మొదలవ్వడానికి ముందు హాజరైన వర్క్ షాప్ ఇది. నాకో పుస్తకం బహుమానంగా ఇస్తూ సాయిగారు “కథ రాయాలి పూర్ణిమా” అని సైన్ చేశారు.
ఇది ఏడాది బట్టీ నడిచిన ప్రయత్నం. నేను ముందు సీరియస్ గా తీసుకోలేదు, చారిత్రకాంశంతో నేను కథ రాయలేనని. కానీ జనవరిలో ఏదో ప్రయత్నం చేద్దామని చూశాను. సాయి గారికి మొదటి డ్రాఫ్ట్ పంపడమే “ప్లీజ్ రిజెక్ట్” అన్న మెసేజ్ తో పంపాను. అసలు హైదరాబాద్ చరిత్ర తెలుగు చరిత్ర కిందకి వస్తుందా, ఎవరో ముస్లిం ఆవిడ ఒక పత్రిక నడిపితే అది తెలుగు పాఠకులకి ఎక్కుతుందా? లాంటి చాలా అనుమానాలు పీకాయి. అయినా రాస్తే హైదరాబాద్ గురించే రాయాలని నిర్ణయించుకుని అదే రాశాను. సాయిగారికి నచ్చింది, సరి అనిపించింది. కొన్ని సవరణలు చేసి మార్చి నాటికి ఫైనల్ చేశాము. ప్రింట్‍కి వెళ్ళిందో లేదో అన్ని చోట్లా లాక్‍డౌన్ మొదలైంది. కానీ మొత్తానికైతే పుస్తకం వచ్చింది. అందులో నేను రాసిన కథ ఉంది. దానితో పాటు మరో పదిహేను కథలు ఉన్నాయి.
ఇద్దరు ముగ్గురు పాఠకుల నుంచి మంచి స్పందన కూడా వచ్చింది. అన్నీ ఫేస్‍బుక్‍లో ఉన్నాయి. సాయి వంశీ అభిప్రాయం మాత్రం ఇక్కడ పంచుకుంటున్నాను.

పుస్తకం కొనుక్కోడానికి లింక్:
PARI Translations
ప్రస్తుతం నా పఠనా వ్యాసంగాన్ని, రచనా వ్యాసంగాన్ని “కథ-స్క్రీన్‍ప్లే-దర్శకత్వం” టైపులో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నిర్దేశిస్తున్నది ఆదిత్య-రోహిత్-SA అనే త్రయం. చదివేవి, రాసేవి, వింటున్నవి, చర్చిస్తున్నవి – ఆ అవకాశాలు దాదాపుగా వాళ్ళ దగ్గర నుంచే ఎక్కువ వస్తున్నాయి. ముగ్గురికీ PDD (public display of dosti) అంటే చిరాకు. అందుకే ఇంతకన్నా ఎక్కువ acknowledge చేయడం లేదు. వివరాల్లోకి వెళ్ళడం లేదు.
ఇప్పుడు సరిగ్గా గుర్తు రావడం లేదు కానీ, పి.సాయినాథ్ నిర్వహించే People’s Archive of Rural India కి కాంట్రిబ్యూట్ చేయాలన్న ఆలోచన వచ్చాక రోహిత్ ప్రోత్సాహంతోనే బండి ముందుకు నడిచింది. 2019లోనే ఒక ఆర్టికల్ అనువాదం చేశాను. కానీ అప్పుడు పబ్లిష్ అవ్వలేదు. ఇప్పటికి అయింది. ఆ పాత ఆర్టికల్‍తో పాటు కొత్తగా కోవిడ్ నేపథ్యంలో వచ్చిన కవితని కూడా అనువదించాను.
మృతులని లెక్కించడంలో అక్కరకురాని పాఠాలు
చట్ట బజారులో ఉర్దూ కాలీగ్రాఫర్లు
ఇది కూడా నా మట్టుకు నాకు చాలా ముఖ్యమైన పని. కనీసం రెండు మూడు నెలలకైనా ఒకట్రెండు ఆర్టికల్స్ చేయాలని ఆశ. సమయం కుదుర్చుకోవాలి.
Mental Health & Community Healing
కోవిడ్‍తో వేణు శ్రీకాంత్ పోవడం పెద్ద దెబ్బ. ఊహించని దెబ్బ. నాకు ఇంకేం చేయాలో పాలుపోలేదు. వేణు స్నేహితులని పోగేసి ఒక జూమ్ మీటింగ్ చేయడం తప్పించి. అది అనుకున్నదాని కన్నా ఎక్కువ సాంత్వననే ఇచ్చింది మా అందరికి. నేను పోయిన ఏడాది చేసిన gestalt workshops వల్ల నేర్చుకున్న దాంట్లో ముఖ్యమైనది కమ్యూనిటి హీలింగ్. అదే ప్రయత్నించాను. అందరూ ముందుకు రావడం వల్ల వర్కవుట్ అయ్యింది.
తర్వాత కోవిడ్ వల్ల మానసిక ఆరోగ్యం ఎలా దెబ్బతింటుందనేది అర్థం చేసుకునే ప్రయత్నంలో ఒక సర్వే కండెక్ట్ చేశాను. దానికి వచ్చిన స్పందనలని ఆధారంగా చేసుకుని, ఎప్పటినుంచో బ్లాగర్ ఫ్రెండ్ అయిన డా. రాఘవేంద్ర టాక్ ఇచ్చారు. పదిహేను ఇరవై మంది పాల్గొన్నారు. సంక్షోభాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అన్నవాటిపై డాక్టర్ గారు చాలా వివరంగా మాట్లాడారు. ఇలాంటివే అప్పుడప్పుడూ చేస్తుండాలి. తెలుగులో ఇలాంటి డైలాగ్స్ మొదలుపెట్టినందుకు నాకు చాలా తృప్తిగా ఉంది.
కొన్ని ఆసక్తికరమైన మంచి కబుర్లు త్వరలో
కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల అనుకున్న కొన్ని పనులు ఆగిపోయాయి, లేదా ఆలస్యమయ్యాయి. నా కథ ఈనాడు వాళ్ళ దగ్గర అలానే అటకాయించింది. ఖచ్చితంగా ఏప్రిల్ నాటికి పబ్లిక్ అవ్వాల్సిన పనులు రెండు మూడు వచ్చే నెలలో కానీ బయటకి రావు. వాటిల్లో కనీసం మూడు అయినా నా తాహతుకి కొంచెం పెద్ద వార్తలే. తొంభై ఐదు శాతం పనులు అయిపోయాయి, ఖచ్చితంగా బయటకి వస్తాయని తెల్సు కానీ, చుట్టూ ఇంత అనిశ్చితి నెలకున్న సమయంలో, దినదిన గండం నూరేళ్ళాయుష్షు అన్నట్టున్న సమయంలో ఏదీ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం కాబట్టి, ఇవ్వన్నీ నాతో పాటు వేరేవాళ్ళు వెసులుబాటు మీద ఆధారపడున్నాయి కాబట్టి మెల్లిగా అయినప్పుడే చెప్తాను. బహుశా, సెప్టంబర్ వరకూ ఆగకుండా మధ్యలో అప్‍డేట్స్ ఇస్తుంటాను.
ఈలోపు “ఇన్ ది మూడ్ ఫర్ లవ్” కథా సంకలనం మూడో ముద్రణకి వెళ్తుంది. ఆ కథలతో ఎన్ని పేచీలున్నా చదివి చర్చకు పెట్టినందుకు మాత్రం అనేకులకి థాంక్స్ చెప్పుకోవాలి.
