అనువాదాలు: తెలుగులోకి vs తెలుగులోంచి

Posted by

“తెలుగులో అనువాదాలు ఎక్కువగానే వస్తున్నాయి. తెలుగు నుండే జరగటం లేదు…”

తెలుగునాట సాహిత్య అనువాదాల ప్రస్తావన వచ్చినప్పుడల్లా వినిపించే మాట ఇది. మాటమాటల్లో మామూలుగా అనే మాట కాదు. ఒకరకమైన కోపం, అసహనం, విసుగు కలగలిసిన గొంతులో వినిపిస్తుంటుంది. తెలుగు రచయితలకు న్యాయబద్ధంగా రావాల్సిన ఆస్తులని ఎవరో అడ్డుకుంటున్న ఆక్రోశం కూడా ఉంటుంది వీటిల్లో.  ఆఖరికి ఫలానా అనువాద రచన చదివాను, నచ్చిందని ఫేస్‍బుక్ పోస్ట్ పెట్టినా, “వాళ్ళవి చేయడం కాదు, మన సంగతేంటి? మన రచనలు ఎప్పుడు బయటకెళ్ళేది? మనకెప్పుడు అవార్డులు వచ్చేది? ఎంతసేపు వాళ్ళు గొప్ప, వీళ్ళు గొప్ప అనడమేనా? ఏం, మేం… అదే, మనం గొప్పకాదా… ఒక తెలుగువాడిని ఇంకో తెలుగువాడు పైకి తీసుకెళ్ళడండీ, పైపెచ్చు తొక్కేస్తాడు!” అని ఒకటే నాన్-స్టాప్ మోనోలాగ్! 

ఎవరు ఇలా అంటున్నారు, ఎన్నిసార్లు అంటున్నారు అన్న డేటా పాయింట్స్ నా దగ్గర లేవు. నాకు వినిపించినప్పుడల్లా ఫేస్బుక్‍లో నా వాల్ మీద ఆవేశపడుతూ వస్తున్నాను. ఈ మధ్యనే తెలుగులో కొత్తగా రాస్తున్న రచయిత, కవి అనువాదాల విషయంలో నేను వింటున్నవాటి గురించి మీ అభిప్రాయాలు చెప్పండని పింగ్ చేశారు. అనువాదాలని ఎక్కువగా చదివిన పాఠకురాలిగా, అనువాదాలు చేస్తున్న ప్రాక్టీషనర్‍గా, తెలుగునుంచి, తెలుగులోకి అనువాదుకులు ఓ 120 మెంబర్లున్న ఫేస్బుక్ గ్రూప్ ఓ ఏడాదిపాటు అడ్మిన్‍గా, వేర్వేరు భారతీయ భాషల్లో అనువాదరంగం గత ఐదారేళ్ళ బట్టి మారుతున్న విధాలని నిశితంగా గమనిస్తున్న observerగా, నేను పంచుకోదగ్గ విషయాలు కొన్ని ఉన్నాయనిపించి వాటిని ఈ వ్యాసంలో పొందుపరుస్తున్నాను. ఏ మాత్రం అవగాహన లేకుండా అనువాదాల గురించి అవాక్కులు చెవాక్కులు పేలే వారికి లెక్చర్ కాదిది. ఈ అవాక్కులు చెవాక్కుల్లో నిజమెంత, కల్పించినదెంతో తెలీక తికమకపడుతున్నవారి కోసం, లేదా అసలేం జరుగుతుందోనన్న కుతూహలం ఉన్నవారి కోసం మాత్రమే!

ఇందులో మీకు పలుచోట్ల నాకు పొరిగింటి పుల్లకూర అంటే రుచి అన్న అభిప్రాయం కలగచ్చు. తప్పు లేదు, నిజానికి నేనా పుల్ల కూరలో నిమ్మకాయ పిండుకుని తినే రకాన్ని అని గుర్తుంచుకోగలరు.

అనువాదకులు – సాధకబాధకాలు  

సాహిత్యానువాదం అనేది ఒక niche కళ. ఒకే భాషలో రాసే రచయితల్లా కాకుండా అనువాదకులకి కనీసం రెండు భాషల్లో ప్రవేశం ఉండాలి. ఒక్క భాషలో అయినా ప్రవేశానికి మించిన నైపుణ్యం ఉండాలి. దానికి తోడు సాహిత్యం ప్రక్రియలపైన ప్రత్యేకమైన అవగాహన, గమనింపులు కలిగివుండాలి. కవిత్వం అనువదించడానికి, నాన్-ఫిక్షన్ చేయడానికి కావాల్సిన స్కిల్‍సెట్ వేరు. ఎక్కడో కొందరు మాత్రమే అన్ని ప్రక్రియల్లో అద్భుతమైన అనువాదాలు అందించగలరు. అంటే, ఓ రెండు భాషల మీద పట్టుండి, ఒక భాషలోనైనా బాగా వ్యక్తీకరించగలిగిన మనుషులు బహు అరుదని గుర్తించాలి ముందుగా. 

అనువాదం, ఏ విధాన చూసుకున్నా, రచనకన్నా సంక్లిష్టమైన వ్యవహారం. కొత్తగా నిర్మాణం చేయడం, లేనిది సృష్టించడం గొప్ప అని మనం అనుకుంటాం కానీ, ఉన్నదానిని సరఫరాకి అనుకూలమైనంతటి ముక్కల్లో పగలగొట్టి వేరే చోట పునఃప్రతిష్టించడానికి పట్టే శ్రమ, నేర్పు, ఓర్పు మరో స్థాయిలో ఉండాలి. అది అందరివల్లా అయ్యేపని కాదు. 

అయినా, ఈ కళకి తగినంత డబ్బు కాదు కదా, కనీస గౌరవమర్యాదలు లేవు. మన దగ్గరే కాదు, ప్రపంచవ్యాప్తంగా లేవు. అనువాదకులకి తగినంత పారితోషకం లేకపోవడం, అనువాద పుస్తకాలపై వారి పేరు కూడా వేయకపోవడం, రివ్యూలలో అనువాదం బాగుంటే “బాగుంది” అని ఒక్క మాటలో తేల్చేసి, బాగోకపోతే అనువాదకుని చీల్చి చెండాడుతూ రాయడం వంటివి వెస్ట్ లోనూ జరుగుతున్నాయి. 2021లో #NameTheTranslator అంటూ అనువాదకులకి మద్దతుగా  పబ్లిషర్లకి రచయితలు, పాఠకులు నిలవాల్సి వచ్చిందంటే ఊహించుకోవచ్చు. 

వెస్ట్ లోనే పరిస్థితి అలా ఉంటే, భారతీయ భాషల్లో పరిస్థితులు ఇంకా దయనీయం. గత ఐదారేళ్ళుగా భారతీయ భాషల్లోంచి ఇంగ్లీషులోకి వెళ్తున్న అనువాదాల గిరాకీ బాగా పెరిగింది. అందులోనూ నవలలకే ప్రాధాన్యం! కథా సంపుటాలకు, కవితా సంపుటాలకు సముఖత చూపడం లేదు. మలయాళ రచయిత, కె.ఆర్ మీరా చిన్న కథలు మలయాళంలో లక్షల కాపీలు అమ్ముడుపోతే, ఆంగ్లానువాదం రెండో ప్రింట్‍కి నోచుకోలేదని ఆవిడే ఒక పానెల్ డిస్కషన్‍లో చెప్పారు. 

ఆంగ్లంలోకి వెళ్ళాయి కాబట్టే కన్నడ రచయితలు, వివేక్ శాన్‍భాగ్ (ఘాచర్ ఘోచర్), వసుధేంద్రలకు (మోహనస్వామి), తమిళ రచయిత పెరుమాళ్ మురుగున్‍కు (పూనాచ్చి) అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. వారి అనువాదకులైన శ్రీనాథ్ పెరూర్, కళ్యాణ్ రామ్‍కు మంచి పేరొచ్చింది. భారతీయ రచయితలు నేరుగా ఇంగ్లీషులో రాసిన రచనలతో పాటు, అనువాదాలకీ సరిసమానమైన స్థాయిని కల్పిస్తూ JCB Literature Prize భాగంగా, రచయితతో సమానంగా అనువాదకులకూ ప్రైజ్ మనీ ఇస్తున్నారు. 


భారతీయ భాషల మధ్యలో జరుగుతున్న అనువాదాల విషయంలో మాత్రం పెద్ద మార్పులు లేవు. ఉన్న అరకొర ఫండ్స్ తోనే పుస్తకాల అనువాదాల ఖర్చు భరించాల్సి వస్తోంది. అనువాదకులకి నామమాత్రపు పారితోషకం అందుతోంది. ప్రస్తుతం, భారతదేశంలోనే పెద్ద అనువాదాల మార్కెట్టులో మలయాళం ఒకటి. మలయాళంలోకి వస్తున్న అనువాదాల కాపీలూ పదుల వేల సంఖ్యల్లో అమ్ముడుపోతున్నాయి, కానీ అనువాదకులకి మాత్రం తక్కువ డబ్బే అందుతోందని వినికిడి. అనువాదం చేస్తూనే బతికే రోజులైతే ఎవరికీ లేవు! 

ఇహ తెలుగుకి వస్తే ఆ నామమాత్రపు డబ్బు ప్రస్తావన కూడా ఉండడం లేదు. ఓ పక్క ఒళ్ళు హూనం చేసే ఉద్యోగాలు చేసుకుంటూ మరో పక్క చిక్కిన  కాస్త ఖాళీ సమయం అనువాదాలు చేస్తుంటే, “ఏమీ ఇచ్చుకోలేమయ్యా… చూద్దాంలే, పుస్తకాలు అమ్ముడుపోతే!” అని నీళ్ళు నములుతూ, ఒక గొప్ప రచనని తెలుగులోకి తీసుకొచ్చినందుకు అభినందించక, అనువాదాన్ని మార్కెట్టులోకి తీసుకొస్తున్నందుకే ఉద్ధరిస్తున్నాం అన్న ఫీలింగ్‍లో ఉంటున్నారు మన ప్రచురణకర్తలు. పరిస్థితి ఇంత నిరాశాజనకంగా ఉండి కూడా, తెలుగులో అనువాదాలు విరివిగా వస్తున్నాయంటే అబ్బురపడాల్సిన విషయమేనని అనిపిస్తుంది నాకైతే! 

ఇతర భాషల్లో మన అనువాదాలు రావాలంటే… 

ఇంగ్లీష్‍లోకి అనువాదం అవుతున్న భారతీయ భాషల్లో ఎక్కువగా వెళ్తున్నవి బాంగ్లా, మలయాళం, ఒక మోస్తరుగా కన్నడ, మరాఠి. సాహిత్య అకాడెమీ ప్రచురిస్తున్న  పత్రికలో తెలుగునుంచి అనువాదాలు బానే కనిపిస్తున్నా, పుస్తకాల రూపంలో మాత్రం తెలుగు కనిపించడం లేదు. (ఈ వివరాలున్న వ్యాసం ఇక్కడ చదువుకోవచ్చు) అలానే, నవలలకి ఉన్న ప్రాముఖ్యత నాన్-ఫిక్షన్‍కి అసలు ఉండడం లేదన్నది మరో లోటుని పూరించడానికే, New Foundation of India వారి Translation Fellowship మొదలుపెట్టారు. ఏడాదిపాటు స్పాన్సర్షిప్ చేయడంతో పాటు ఒక మెంటర్‍ని కూడా ఇస్తారు, పనిజేయడానికి. కానీ ఇందులో కూడా తెలుగులో లేదు.

మనమిక్కడ కూర్చుని విసుక్కుంటూ ఉంటే వేరే భాషల అనువాదకులూ, ప్రచురణకర్తలు లైన్లు కట్టి, భారీ చెక్కులిచ్చి, మన కాళ్ళు కడిగి మన రచనలు పట్టుకెళ్ళే సమస్యే లేదు. “అనువాదకులు మన రచనలు పట్టించుకోవడం లేదు” అని విసుక్కోవడం అర్థరహితం. మన రచనలు వేరే భాషల్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలో గమనించుకోవాలి ముందు. నాకు ఇంగ్లీష్ లిటరరీ ఎకోసిస్టమ్ తో పరిచయం ఉంది కాబట్టి, ఇంగ్లీష్‍లో బోలెడు డబ్బు, అవార్డులున్నాయని మన రచయితలకి యావ ఉంది కాబట్టి, అదే ఉదాహరణగా తీసుకుంటున్నాను. 

వాళ్ళే అనువాదం చేస్తామంటూ రావాలంటే: 

 1. మన దగ్గర వస్తున్న రచనల గురించి సంభాషణలు, చర్చలు నడుస్తుండాలి. “నా పుస్తకం వచ్చింది, మీకు పంపనా?” టైపు సంభాషణలు, “మీరు మాత్రమే రాయగలరు” టైపు చర్చలు కాదు. విమర్శకులు, పాఠకులు, తెలుగు వచ్చిన వేరే భాష రచయితలు, రచన గురించి (రచయిత గురించి కాదు) ఉత్సాహపడుతూ మాట్లాడుతుంటే, అవి అనువాదకుల, ప్రచురణకర్తల చెవిన పడచ్చు. 
 2. అనువాదం బిజినెస్ లో ఉన్నారు కాబట్టి ఆ రచనని తెలుగులోనే చదివి ఫీడ్బాక్ ఇప్పించుకునే వెసులుబాటు వాళ్ళకి ఉంటుంది. 
 3. రచన నచ్చితే, అనువాదానికి పర్మిషన్ అడుగుతూ ముందుకొస్తారు. 

మనమే రచన ఒకటి ఉందని చెప్పాలనుకుంటే: 

 1. లక్ష్యభాషలో అనువదించగల నైపుణ్యం, ఆసక్తి ఉన్న అనువాదకులని ఎన్నుకోవాలి. రచయితకో, ఆ అనువాదకుడికో ఆ భాష సాహిత్యరంగంలో నెట్‍వర్క్ ఉంటే పని సులభమవుతుంది. 
 2. ప్రచురణకర్తలని అప్రోచ్ అయ్యేముందు, వాళ్ళు ఎలాంటి పుస్తకాలు వేస్తారు, వాళ్ళు మార్కెట్ నీడ్స్ ఏంటి అని కొంచెం హోమ్‍వర్క్ చేయాలి. ఉదా: ఇంగ్లీష్ అనువాదం రావడమే ధ్యేయమైతే కథలకన్నా నవల రాస్తే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. తెలుగులో వచ్చేలా కలగూరగంపలా (అంటే అనేక కథాంశాలతో వచ్చే) కథల సంపుటిలా కాకుండా, ఒక థీమ్ బేస్డ్ కథలుంటే సెలెక్ట్ అయ్యే ఛాన్సులు మెరుగుపడతాయి.  
 3. వాళ్ళు ఒప్పుకుంటే భాగ్యం. పని మొదలపెట్టచ్చు. డబ్బులు కూడా ఇస్తామంటే మహాభాగ్యం. పని పూర్తి చేసి ఇవ్వడమే. 

వాళ్ళొచ్చినా, మనమే అడిగినా, మనం అందరం చేయాల్సిన పనులున్నాయి. 

 1. రచయితలు/అనువాదకులు: ఆయా భాషల్లో అనువాదాలను ప్రచురించే పత్రికల లిస్ట్ తయారుచేసుకుని ఒకటో అరో అనువాదాలు పంపిస్తూ ఉండడం. ప్రస్తుతం భారతీయ, కొన్ని అంతర్జాతీయ ఇంగ్లీష్ వెబ్‍పత్రికలు కూడా అనువాద కథలని, కవితలని ఆమోదిస్తున్నాయి. వాటిల్లో అప్లై చేసి, ఎడిటింగ్ ప్రాసెస్ కఠినంగా ఉంటుంది కానీ, అచ్చైతే మంచి విజిబిలిటీ వస్తుంది.
 2. సమీక్షకులు/విమర్శకులు: ఆంగ్లానువాదం వచ్చే వరకూ కూడా ఆగాల్సిన అవసరం లేదు. పుస్తక సమీక్షలు ఆమోదించే పత్రికలకి తెలుగు రచనల గురించి సమీక్షలు, విశ్లేషణాత్మక వ్యాసాలు రాసి పంపచ్చు. “ఈ రచన ఎందుకు అనువాదం అవ్వాలి?” అన్న టాపిక్ మీద కూడా రాసి పంపచ్చు. వివేక్ శాన్‍భాగ్ రాసిన కన్నడ నవల “ఒందు బది కడలు” (తెలుగులో, ఒక వైపు సముద్రం) వేరే భాషల్లోకి ఎందుకు రావాలో రచయిత,  గాయత్రీ ప్రభు, రాసిన వ్యాసం ఇందుకు ఒక చక్కని ఉదాహరణ.
 3. ప్రచురణకర్తలు: తాము వేసిన పుస్తకాలు బయటకి వెళ్తే పేరుకి పేరు, రాయల్టీ రూపంలో డబ్బూ వస్తుంది కాబట్టి ప్రచురణకర్తలు కూడా అనువాదం చేయించడానికి శాయశక్తులా ప్రయత్నించచ్చు. ఇవ్వాళ తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్‍కి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అంత పేరు రావడానికి, కలచువడు ప్రచురణలు అధినేత, కన్నన్ సుందరన్, పాత్ర ఎంతో ఉంది. ఇంగ్లీషుతో ఆగక యూరోపియన్ సాహిత్య సమావేశాలకూ వెళ్ళి పెరుమాళ్ మురుగన్ రచనల్లో విశిష్టతా, గొప్పదనం, అనువాదం అవ్వాల్సిన అవసరం అన్నీ పి.పి.టిల్లో ప్రెజంట్ చేస్తుంటారని, అలా తమిళ సాహిత్యం గురించి వారికి అవగాహన కలిగిస్తారని కొన్ని ఇంటర్వ్యూలలో పంచుకున్నారు.      

ఇన్ని ప్రయత్నాలు, ఇంత శ్రమ పెడితే గానీ ప్రస్తుతం ఆంగ్లంలోకి రచనలు వెళ్ళే అవకాశాలు లేవు. ఏదో సాహిత్య అకాడెమీ అవార్డీలకి, విపరీతంగా పేరున్నవారికి తప్ప మిగితా అందరూ ఇవ్వన్నీ చేసుకోవాల్సిందే! 

రచయితలు వారి ఒంటి స్తంభం మేడల మీద కూర్చునుంటే, అనువాదకులు కష్టనష్టాలకి ఓర్చుకుని వాళ్ళని చేరుకుని బతిమిలాడి అనువాదాలు చేస్తారన్న భ్రమలు వదులుకోవాలి. ఇది సమిష్టి వ్యవసాయం. “వేరేవాళ్ళ రచనలు ఎగబడి అనువాదం చేస్తున్నారు, మనమంటేనే చులకన” అని ఒకళ్ళనే అనడం సబబు కాదు. తెలుగునుంచి బయటకు అనువాదాలు వెళ్ళడం లేదనుకుంటే, పైన చెప్పిన తతంగాల్లో ఎంత చేస్తున్నాం, ఎక్కడ తేడాలొస్తున్నాయన్నది ఆలోచించుకోవాలి.

ఇరు భాషల మీద కనీస అవగాహన లేకుండా, అవతలి రచనలో సారాన్ని పట్టుకోకుండా పదం-పదం మెకానికల్‍గా అనువాదం చేసుకుంటూ టపటపా పుస్తకాల మీద పుస్తకాలు రిలీజ్ చేస్తే మురిసి ముక్కలైపోయి సాహిత్య అకాడెమీవారి అనువాద అవార్డులు వచ్చాయి, వస్తుంటాయి. కానీ, అకాడెమీకి సిఫార్సు చేసేది, జ్యూరీగా వ్యవహరించేది తెలుగు రచయితలు/కవులు. వేరే భాషల్లోకి అనువాదం వేళ్ళాలంటే పరికించేది, పరిశీలించేది ఆయా భాషల సాహితీవేత్తలు. మన దగ్గర పనిజేసినట్టు అక్కడ ధూపదీపనైవేద్యాల కన్నా సాహిత్యంలోని బలం పనిజేస్తుందని గమనించడం చాలా ముఖ్యం!  

తెలుగు సాహిత్యానికి బయట నిలబడే సత్తా ఉందా?

ఒక తెలుగు రచన బయటకు వెళ్ళాక అక్కడి సాహిత్యంతో పోటీపడగలగాలి, ఆ పాఠకులని మెప్పించగలగాలి. అలా మెప్పించగలిగితే మరికొన్ని రచనలు అనువాదం అవ్వడానికి బాటవేసినట్టు ఉంటుంది. కానీ, అసలు మనకంత సీన్ ఉందా?

దీనికి ప్రమాణాలు ఏమీ లేవు. ఇన్ని అనువాదాలు జరుగుతేనో, ఇన్ని అవార్డులు వస్తేనో మనకి సత్తా ఉందని చెప్పడానికి లేదు. అందుకని, ఇక్కడ సామూహిక జవాబు కన్నా, వ్యక్తిగత జవాబులకి ఆస్కారం ఉంటుంది. వేరువేరు భాషల్లో వస్తున్న సాహిత్యాన్ని నిశితంగా పరిశీలిస్తున్నవారికి ఒక రకంగా తోస్తుంది (= సీన్ అస్సల్లేదు), కేవలం తెలుగే లోకంగా ఉండి “మీరు గొప్ప రచయిత” అనే కామెంట్స్ లో కొట్టుకుపోయేవారికి మరో రకంగా తోస్తుంది. (= మనకేం తక్కువ! మనది గొప్ప సాహిత్యం. కాదనే వాళ్ళు పొరిగింటి పుల్లకూర మొహాలు.)

అయితే, సీన్ ఒక్కరోజులో, ఒక రచయితో ఏర్పడేది కాదు, ఒకరి అభిప్రాయంతో పాడైపోయేది కాదు. తెలుగు నవల/కథల అనువాదానికి రేపటి రోజున జె.సి.బి లాంటి ప్రైజ్ రావాలంటే, ఎందరో తెలుగు రచయితల అనువాదాలు రిజెక్ట్ అవ్వాలి. రిజెక్ట్ అవ్వడానికి కారణాలు అన్వేషించి, ఆత్మవిమర్శ చేసుకుని, సాహిత్యాన్ని మరింత అధ్యయనం చేస్తే, అప్పుడు తెలుగు సాహిత్యం మెరుగుపడే అవకాశాలున్నాయి. ఏదోనాటికి అవార్డులూ వస్తాయి.

నేను పాలుపంచుకునే భారతీయ భాషా సమావేశాల్లో తమిళ, మలయాళ, కన్నడ ప్రస్తావన వచ్చి తెలుగు మాట వినిపించకపోతే మనసు చివుక్కుమంటుంది కానీ, అంతలోనే ఏదన్నా చేయాలన్న పట్టుదలా వస్తుంది. తెలుగునాట సాహిత్యకారుల మాటలు విన్నప్పుడు మాత్రం నీరసం, విరక్తి ఆవహిస్తుంటాయి. నన్ను వెలివేసినా, ఉరితీసినా ఇదే మాట చెప్తాను – ప్రస్తుతం తెలుగులో ఉన్నది స్కోత్కర్షే తప్పించి సాహిత్యంపై మక్కువ కాదు. “తెలుగునుంచి ఎందుకు అనువాదాలు జరగడం లేదు?” అన్న నిష్టూరంలో కూడా నిజానికి ఉన్నది, “ఎవడో ఒకడు నా రచనలు అనువాదం చేసేసి, నాకో అవార్డు తెచ్చిపెట్టలేడా?” అన్న వెంపర్లాట మాత్రమే! బాధ్యతారహితంగా ఇవే మాటలని స్టేజిలెక్కి, ఫేస్బుక్కులెక్కి వెళ్ళగక్కుతున్నారు కాబట్టి, వీళ్ళకుండే భజన సమూహాలు అవే మాటలని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాయి కాబట్టి అనువాదాల గురించి ఒక false narrative ఏర్పడిపోతుంది.  

నిజంగానే, తెలుగులో అనువాదాలు ఎక్కువగా ఉన్నాయా?


తెలుగులో అనువాదాలు “ఎక్కువగా” వస్తున్నాయా, లేదా? అన్నది నిర్ణయించుకోవాలంటే ముందు “ఎక్కువ” అన్నదానికి ఒక కామన్ అండర్‍స్టాండింగ్ ఉండాలి; అంటే మీ ఎక్కువ, నా ఎక్కువ ఒకటే అయితే మన వాదులాటకో అర్థం ఉంటుంది.

దాని కోసం లెక్కలు చూడ్డం ఒక పద్ధతి.

 1.  ఒక ఏడాదిలో వచ్చే తెలుగు పుస్తకాలెన్ని? అందులో నేరుగా వచ్చిన రచనలెన్ని? అనువాదాలెన్ని? వేటి శాతం ఎక్కువ ఉంది? – ఈ లెక్కలు తేల్చుకోవడం. 
 2.  తెలుగులోకి అనువాదమవుతున్నవి vs తెలుగునుంచి వెళ్తున్నవి లెక్కపెట్టుకోవడం. 

ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన సూక్ష్మాలు కొన్ని ఉన్నాయి.ఇంగ్లీషులోకి అనువాదం వెళ్ళడానికి ఎంత తతంగమో పైన చెప్పాను. తెలుగానువాదాలకి అంత ప్రయాస, బ్యూరోక్రసీ అవసరం ఉండకపోవచ్చు. 

తెలుగులోకి అనువదించడం, తెలుగులోంచి అనువదించడం ఒకటి కాదు. ఒకళ్ళే చేయగల పని కాదు. ఒకళ్ళే అచ్చేసేది కాదు. ఉదాహరణగా, తెలుగులోకి అనువాదం చేసేవాళ్ళు తెలుగుని ఇంగ్లీషులోకి చేయలేకపోవచ్చు (అధికశాతం చేయలేరు). అలానే, తెలుగు అనువాదాన్ని తెలుగు ప్రచురణకర్తలు డబ్బుపెట్టి అచ్చేయాలి. తెలుగునుంచి అనువాదాన్ని వేరే భాషవాళ్ళు డబ్బుపెట్టడానికి సిద్ధపడాలి. అంటే, ఇక్కడ అర్థమవుతుందేంటి? ఇవి రెండూ వేరువేరు పనులు. వాటికి కావాల్సిన వనరులు వేరు. ఒక అనువాదకుని దగ్గర వారానికి పది గంటలుంటే, అతను ఆ పదిగంటలు తెలుగులోకి అనువాదం చేయడానికి ఉపయోగిస్తుంటే అర్థం, అతను తెలుగునుంచి అనువాదం చేయడానికి కోత విధిస్తున్నట్టు కాదు. తెలుగులోకి చేయకపోతుంటే అతను ఇంకేదో పనిజేసుకుంటాడు గానీ తెలుగు రచనని ఇంగ్లీషులోకి చేయడం మొదలుపెట్టడు.  అలానే ఒక పాతికవేలు పెట్టి ఒక తెలుగు ప్రచురణకర్త తెలుగు అనువాదాన్ని అచ్చువేస్తున్నారంటే, వాళ్ళు తెలుగులోంచి వెళ్ళే అనువాదానికి అన్యాయం చేస్తున్నట్టు కాదు. అలాంటప్పుడు “తెలుగులోకి చేసేవాళ్ళు ఉన్నారు, తెలుగునుంచే ఎవరూ చేయడం లేదు” అని విసుక్కోవడంలో ఏమిటి అర్థం?

“ఎక్కువ! అనువాదాలు” గొడవేంటి అసలు?

మన దగ్గర అనువాదాల విషయంలో వినిపించే ఇంకో మాట: ఒకటే రచయితని ఏదో ఒకళ్ళు చేస్తే సరిపోదా? ఒకే రచనని ముగ్గురు, నలుగురు అనువాదం చేయడమెందుకు? 

నేను 2019 నుంచి అడిగినవాళ్ళకి మంటో అనువాదాలు చేస్తున్నానని చెప్తున్నాను. వెంటనే వచ్చే ప్రతిస్పందన, “ఆల్రెడీ చేసేశారుగా, మేం చదివేశాం! మళ్ళీ ఎందుకు చేస్తున్నారు?” ఇలా అడిగేవాళ్ళు తోటి రచయితలే! వీళ్ళు ఎక్కడో ఏదో పత్రికల్లో మంటో అనువాదం చదివి ఉంటారు. మంటో అంటే వీళ్ళకి ఆ రెండు మూడు కథలన్న మాట. దానికి తోడు ఈ రెండేళ్ళల్లో ఇతరులు చేసిన మంటో అనువాదాలు, రెండు కథా సంపుటాలు వెలువడ్డాయి.  ఆ పుస్తకాల గురించి రాస్తూ మొన్న ఒకళ్ళు “అందరూ మంటో మీద పడ్డారిప్పుడు!” అని అసహనంగా వ్యాఖ్యానించారు. 

ముందసలు, అనువాద గణాంకాలు లేకపోయినా, కొన్ని సూచికలు ఉంటాయి, అనువాదరంగం ఆరోగ్యాన్ని సూచించేవి – Health Index of Translations in Telugu, అనుకుందాం. వాటిల్లో కొన్ని: 

రచయితని సంపూర్ణంగా పట్టుకోగలిగినన్ని అనువాదాలు ఉన్నాయా?

ఒక రచయితవి చెల్లామదురుగా లెక్కపెట్టినట్టు కొన్ని రచనలు కాకుండా, వారి రచనా సర్వస్వంలో ప్రతీకలుగా నిలవగిలిగే అన్నింటినీ అనువాదంలోకి తీసుకురాగలిగినప్పుడు, ఆ రచయిత మన భాషా రచయితలతో పాటు పాఠకులు స్మరించుకోగలిగినప్పుడు అనువాదాలు సరిపడా వచ్చాయని అనుకోవచ్చు. (అప్పటికీ ఎక్కువ కావు, సరిపోతాయంతే. గమనించగలరు!) ఉదా: శరత్ రచనలు కానీ, రష్యన్ కథలు గానీ తెలుగువాళ్ళకి ఎంత దగ్గరయ్యాయో గుర్తుతెచ్చుకోండి, వాళ్ళు మనవాళ్ళే అన్నంతగా బాగా జరిగాయి. (ఇక్కడ “బాగా” అంటే రాశి, వాసి రెంటిలోనూ అని గమనించగలరు.) 

కానీ, ప్రస్తుతం అలా ఏం రావడం లేదే! హెచ్.బి.టి వాళ్ళు వైకాం బషీర్ కథలు, చుగ్తాయి కథలు వేశారు. ఆ రచయితలు తెలుగులో ఉన్నారా అంటే లెక్కప్రకారం ఉన్నారు. కానీ తెలుగు పాఠకులకి దగ్గరయ్యేంతగా ఉన్నారా అంటే లేరనే సమాధానం! “విశ్వవిఖ్యాత మూకు” లాంటి పదిహేను కథలు బషీర్‍ని పరిచయం చేస్తాయి, కరచాలనానికి అవకాశం ఇస్తాయి, కానీ దగ్గరకెళ్ళి ఆలింగనం చేసుకోవడానికి సరిపోవు. అలా అని ఆయన రాసిన అన్ని నవలలూ, కథా సంపుటాలు అనువాదం చేయమని కాదు. మలయాళీల సద్యలో (ఓనమ్ పండుగనాటి భోజనం) 24-28 ఐటెమ్స్ ఉంటాయి. మనకి సద్య గురించి ఐడియా రావాలంటే అన్నీ ఐటెమ్స్ వండక్కర్లేదు. జాగ్రత్తగా ఎన్నుకుంటే పది వంటకాలతో కూడా కడుపు నిండుతుంది. అలా జాగ్రత్తగా ఎన్నుకుని మనవాళ్ళకి పరిచయం చేసేట్టు అనువాదాలు ఉండాలి. బషీర్ మనవాడు కాడు, అచ్చ మలయాళంలో చదువుకుని మురిసిపోయే భాగ్యం మనకి లేదు, అయినా కూడా మన ముందు పరిచిన అరిటాకూ కాస్తలో కాస్త అయినా నిండుగా ఉండాలి.

బషీర్ సైటర్ రైటర్‍కన్నా ఎక్కువగా, చుగ్తాయి బోల్డ్ ఆండ్ డాషింగ్ లేడీ కన్నా ఎక్కువగా, తెలుగు వామపక్షాలు appropriate చేసుకునే వీలున్న ఒక “ప్రొగ్రసివ్” కన్న ఎక్కువగా మంటో తెలుగు పాఠకులకి పరిచయం అవ్వాలంటే అనువాదాలు అనేకం రావాలి. అనేకులు చేయాలి.  లేదంటే, ఆకు చివర్న ఉప్పూ, పచ్చడీ వడ్డించి భోజనం అయిపోయిందని చెప్పినట్టు ఉంటుంది. 

అయినా, పుస్తకం కొని చదివే పాఠకుడు, “నేను రెండొందలు పెట్టి ఒక రచయిత కథలు కొనుక్కున్నాను. ఇంకో మూడొందలు పోసి ఇంకొకరు చేసిన అనువాదం తెచ్చుకోలేను” అనంటే ఒక అర్థం ఉంది కానీ తెలుగు రచయితలకు, విమర్శకులకు ఎందుకంత కష్టం?

వాళ్ళ ఆస్తులు కరిగించి ప్రచురించాలనా? వాళ్ళ జేబులు చిల్లులుపడినా పుస్తకాలు కొనాలనా? కొన్నాక చదవాలనా? రెండింటిలో ఏది బాగుందో వాక్యం వాక్యం పోల్చాలనా? పోల్చి, ఏ ఒక్కరూ నొచ్చుకోకుండా బాగోగులు చెప్పాలనా? అనువాదం మీదా, ఆ రచయిత మీద సమీక్షలు, విశ్లేషణాత్మక వ్యాసాలు రాయక తప్పదనా? మంచి అనువాదాన్ని బేరీజు వేసి అవార్డు సెలక్షన్ కమిటీల ముందు పిచ్ చేయాలనా? వీటిల్లో ఏ పనులు చేస్తున్నారని వాళ్ళకి “ఒకటే రచయితవి ముగ్గురు, నలుగురు అనువాదం చేసేస్తున్నారు” అన్న కంప్లెంట్?

ఉచితంగా అందుతున్న కాపీల ఫోటోలు తీసి ఫేస్బుక్‍లో పెట్టి, ఓ రెండు మంచి మాటలు రాయడం పనే – కాదనను. కానీ ఒక రచయితనే లోకంగా చేసుకుని, ఆ భాషని క్షుణ్ణంగా నేర్చుకుంటూ, పారితోషకం లేకపోయినా, పైపెచ్చు వందా రెండొందల కాపీలు కూడా అమ్మవ్వని తెలుస్తున్నా, సమీక్షలు/పరిచయాలు రావడానికి పట్టుమని పది వేదికలు లేవని అర్థమవుతున్నా, ప్రచురణకర్తలని బతిమిలాడో, సొంతంగా డబ్బులు పెట్టుకునో జీవితంలో నాలుగైదేళ్ళు ఒకేదానిపై ధారపోసి పుస్తకం తీసుకురావడం కన్నా కష్టమైతే కాదనుకుంటాను! “ఎందుకు అనువాదాలు చేయడం?!” అని మాట విసురులో ఎందరి శ్రమ, సాహిత్యంపై ఆపేక్షని నిర్దాక్షిణ్యంగా కొట్టిపారేస్తున్నారో… అదీ సాహిత్యకారులయ్యుండి! ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా? 

తెలుగులోకి అనువాదాలు రావాలి. ఇంకా ఇంకా రావాలి!    

అనువాదం బేరం కాదు. “నా దగ్గర పది మేకలని తీసుకుని నీ దగ్గరున్న ఆవునివ్వు” అనే బేరం అసలైతే కాదు! “నువ్వు ఆవునివ్వకుండా నా పది మేకలూ తీసుకెళ్ళిపోతే, నేనేం పెట్టి వ్యాపారం చేసుకుంటాను?”, “ నువ్వు ఆవుని తీసుకెళ్ళకపోతే మేకలతో పాటు దాన్నీ మేపడానికి మేత ఎక్కడనుంచి పట్టుకురాను?” అని తల్లకిందులు అయ్యిపోవాల్సిన వ్యవహారం కానే కాదు! మన రచనలు బయటకి పోనప్పుడు ఇన్ని అనువాదాలు ఎందుకు తెలుగులోకి? అన్న కాకి లెక్కలు ఇక్కడ అవసరమే లేదు.

1.  తెలుగులోకి అనువదించగలిగినవారు అనువాదం చేస్తున్నారా? చేసినవి తెలుగు ప్రచురణకర్తలు వేస్తున్నారా? తెలుగు పాఠకులు వాటిని ఆదరిస్తున్నారా?
2. తెలుగులోంచి అనువదించగలిగినవారు అనువాదం చేస్తున్నారా? చేసినవి అచ్చేసే వేరే భాషా ప్రచురణకర్తలు ఉన్నారా? ఆయా భాషల పాఠకులు వాటిని ఆదరిస్తున్నారా? 

ఈ రెంటినీ కలాగాపులగం చేయాల్సిన అవసరం లేదు. మార్కెట్టు భాషలో మాట్లాడుకున్నా ఇవి వేరేవేరే మార్కెట్టులు. పైన యెల్లో రంగులో ఉన్నవాటికి, బ్లూలో ఉన్నవాటికి ఫండ్స్, రిసోసర్స్, టార్గెట్ ఆడియన్స్, రెవన్యూ మోడల్, లాస్-ప్రాఫిట్ అన్నీ వేరేవేరే! కమర్షియల్ మైండ్‍సెట్ ఉన్న తెలుగు రచయితలకి ఇంత చిన్న లాజిక్ అందకపోవడం విడ్డూరం.

అనువాదాలు వేయడానికే ప్రాముఖ్యతనిచ్చి తెలుగులో నేరుగా వస్తున్న రచనలను ప్రచురణకర్తలు (కేవలం డబ్బులు లేని కారణాన) తిరస్కరించడం ఈ విముఖతకి కారణమైతే దాని గురించి చర్చించాలి. అనువాదాలని లాభం లేదు.

తెలుగులోకి అనువాదాలు రావడం వల్ల తెలుగు సాహిత్యానికే ఎనలేని మేలు. ఒక్కళ్ళిద్దరు తెలుగు రచయితలకి జ్ఞానపీఠ్‍లు వచ్చినదానికన్నా పదివేల రెట్లు మేలు.
 

అనువాదాలు మనల్ని మనకి తెలీని కథలకు, వ్యక్తీకరణలకు పరిచయం చేస్తాయి. అనువాదాలు చదవడమంటే మన ఆవకాయ-పప్పన్నం, రాగి సంగటి-నాటుకోడి కూరతో పాటు కేరళవారి పుట్టూ-కడల కర్రీ, అస్సాం వాళ్ళ ఆలూ పిటీకా, మరాఠీవాళ్ళ మిస్సిల్ పావ్, పంజాబీల లస్సీ కూడా తిన్నట్టు, తాగినట్టు. పోషకాలుంటాయి, బలాన్ని చేకూరుస్తాయి. 

ఇన్ని రుచులకి, పౌష్టికాహారానికి అలవాటు పడ్డ పాఠకులకి చప్పిడి కూడో, రసం తీసేసిన పిప్పో పెడితే మొహమాటం లేకుండా తిప్పికొడతారు. అప్పుడు, రచయితలుగా మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరింత రుచికరమైన, బలవర్థకమైన సాహిత్యాన్ని సృష్టిస్తాం. దోస్తులు వేసిన మాడిపోయిన మసాలా దోశలని మన విమర్శకులు ఆహో, ఓహో అని స్టేజ్ మీద చప్పరిస్తుండగానే, పాఠకులు అమెజాన్‍లో నెగిటివ్ రేటింగ్ వేస్తారు – పుస్తకం కొనకుండా!

రచనావ్యాసంగం సునాయాసంగా సాగకుండా, మరి ఇన్ని రకాల సవాళ్ళు ఎదురవుతాయని తెలుగులో అనువాదాలంటే చిరాకేమో నాకు తెలీదు. 

ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, తెలుగు రచనల అనువాదాలూ బయటకు వెళ్ళాలి. “చాలా బాగుంది. మీరు మాత్రమే ఇంత బా రాయగలరు” అన్నది కాకుండా రచనలపై పాఠకులనుంచి కొత్త అభిప్రాయాలు వినిపించినప్పుడు, “ఏదో మెచ్చుకోలు కోసం చెప్పడం లేదు, ఇవ్వన్నీ నిజంగా నిజం” అని మొహమాటపడుతూ ముగించే పొగడ్తల ఉపన్యాసాలకు మించి పనికొచ్చేదో బయట విమర్శకులనుంచి వచ్చినప్పుడు మన రచయితలూ ఎదుగుతారు. సాహిత్యాన్ని మెరుగ్గా సృష్టిస్తారు. ఇవన్నీ జరగడానికి తెలుగులోకి వస్తున్న అనువాదాలేవీ అడ్డు కావు, పైపెచ్చు సహాయపడేవే అన్న విచక్షణ సాహిత్యకారులుగా మనలో కలిగిననాడు, తెలుగు సాహిత్యానికి పట్టం కట్టడానికి వేసిన తొలి అడుగు అవుతుంది! 

One comment

 1. అనువాదాల గురించి చాలా బాగా రాశారు. లోత యిన పరిశీల న.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s