Beasts of Burden: Imayam

Posted by
Title: Beasts of Burden 
Original: Koveru Kazhuthaigal
Original Language: Tamil
Author: Imayam 
Genre: Novel 
Translated to: English
Translator: Lakshmi Holmstrom
Translation Published by: Niyogi Books  

తొలి పరిచయాలు మనుషుల విషయంలోనే కాదు, కొంతమంది రచయితల విషయంలోనూ ప్రత్యేకంగా నిలుస్తాయి. 2020కి గాను కేంద్ర సాహిత్య పురస్కారం అందుకున్న ఇమాయమ్ గారి ఇంటర్వ్యూ ఒకటి చదివాను. “నాకీ పాటికే ఇచ్చుండాల్సింది ఈ అవార్డు, ఆలస్యం చేశారు” అన్న హెడ్‍లైన్‍తో మొదలైనా ఆయన ఆత్మహత్యలు చేసుకునే మహిళలు నిప్పంటించుకోవడం గురించి అన్న ఈ కింది మాటలు నన్ను ఒక కుదుపు కుదిపాయి.

“Why is it that we hardly come across a man who sets himself on fire even if he chooses to die by suicide? Why is it always a woman? Sometimes, I am stunned by the decisions women take. In this novel, Revathi, the protagonist, has no explanation for why she is in love with this man,” Imayam says.

ఆ ఊపులో వెంటనే ఆయన కథల ఆంగ్లానువాదం “వీడియో మరియమ్మ” కొన్నాను కానీ, రెండు కథలే పూర్తిచేయగలిగాను. ఆ రెండింటిలోనూ ఇమాయమ్ ఎంతటి విలక్షణమైన రచయితో బోధపడింది. దళిత నేపథ్యం ఉన్న కథలు రాస్తున్నప్పుడు కూడా ఆ వివిక్షని, ఆధిపత్య ధోరణులని సరళ రేఖలా కాకుండా, గడ్డిమేటు ఒకటి ఉందని, అందులో పడిపోయిన సూదిని తానే వెతుక్కొచ్చానని చెప్పి చూపించే రచయితల్లా కాకుండా, పీడిత-పీడకుల మాస్క్ వెనుక ఉండే మనుషులని పట్టి తేవడంలోనూ, ఆ complexityని, intersectionalityని, in all its messiness ,చూపించడంలోనూ ఇమాయమ్ ప్రత్యేక దృష్టి, శైలి కలిగినవారని అర్థమైంది.

కథలు పక్కకు పెట్టి ఆయన నవల ఆంగ్లానువాదం “Beasts of Burden” చదివాను. దాని గురించే ఇక్కడ పంచుకోబోతున్నాను.


ఈ నవలని రచయిత తన ఇరవై ఏళ్ళ ప్రాయంలోనే, 1987లో రాశారు. 1994 లో అచ్చైంది. అప్పట్లోనూ, ఇప్పటికీ తమిళనాట పెద్ద దుమారమే లేపింది. కారణం: దళిత రచయితలు దళితుల కథలెలా చెప్పాలి? అన్న మౌలికమైన ప్రశ్న లేపింది. దీని గురించి తీవ్ర వాదోపవాదాలే జరిగాయి.(ట) ఆంగ్లానువాదంతో పాటుగా రాసిన రచయిత ముందుమాటలో ఇలా అంటారు.

The world is an ocean, in which concepts and theories are like ship which appear and disappear. My works were not composed with the comfort offered by these ships, but written within the sea and by looking at its vastness. My writings try to draw a map of the time, place and culture of the geographical space in which I live. That was how Koveru Kazhuthaigal came into being.

మలయాళ రచయిత కె.ఆర్. మీరా కథలని పరిచయం చేసేటప్పుడు నేను ఒక పోలిక వాడాను. ఏదన్నా ఐడియాలిజీ, థియరీని దీపస్తంభం అనుకుంటే దాని చుట్టూ తచ్చాడుతూ ఉండే రచనలు కొన్నుంటాయి, అవెంతో దూరం తీసుకుపోలేవని. ఇమాయమ్ ఇక్కడ చెప్పడానికి ప్రయత్నిస్తున్నది కూడా అదే: లోకం పోకడలని అర్థం చేసుకోడానికి కొన్ని థియరీలు పనికొస్తాయి, అవి స్త్రీవాదం కావచ్చు, దళితవాదం కావచ్చు. ఆ థీయరీ పడవల్లో సౌకర్యంగా కూర్చుని నేను కథలు రాయలేదు అని అన్నారాయన. లోకాన్ని అర్థం చేసుకోడానికి కొన్ని నమూనాలు (మోడల్స్) స్పిష్టించుకుని, ఆ మోడల్సే లోకమని భ్రమింపజేసే రచనలు మనకి చాలానే కనిపిస్తుంటాయి. అవి పీడించేవారి దుర్మార్గాన్ని చూపెడతాయి కానీ ఆ దుర్మార్గం ఏర్పడ్డానికి కారణమైనవాటిని పట్టి చూపించవు. పీడింపబడేవారి అసహాయతను చూపిస్తాయి ఆ అసహాయత వెనుక కూడా ఒక మనోనిబ్బరం, ఒక human dignity ఉంటుందన్న సంగతి బయటకి తీసుకురాలేవు. అలా తీసుకురాలేనప్పుడు పీడిత-పీడక, ఆధిపత్య-అణగారిన, మనమూ-వాళ్ళు అన్న ద్వంద్వాలని సృష్టిస్తారే తప్ప, ఓ రకంగా ఇరు వర్గాల మధ్య ఉన్న దూరాన్ని మరింత పెంచుతారే తప్ప, ఇమాయమ్‍లా వాటిని దగ్గరకి తీసుకురాలేరు.

వివక్షని ఎలా రాయాలి, కథల్లో?

క్రాఫ్ట్ అనగానే తెలుగునాట విరుచుకుపడతారు. ఇమాయమ్ కూడా ఇరవై ఏళ్ళ వయసులో చూసింది, అర్థమైందే రాసుంటారు. ఆయనేం MFAలు చేసి ఉండడు ఆ సమయంలో. అయినా వివక్షని, కులాధిపత్యాన్ని ఆయన నవలలో సమర్థవంతంగా చూపెట్టగలిగారంటే అది క్రాఫ్ట్ వల్లనే.

క్రాఫ్ట్ అంటే ఏమిటి? దేని గురించి చెప్పాలి, ఎలా చెప్పాలి, దేన్ని వదిలేయాలి? ఈ నిర్ణయాలే క్రాఫ్ట్. ఈ నవల 1970లలో తమిళనాడులో ఒక చాకలి కుటుంబం ఎదురుకున్న కులవివక్ష, వృత్తిలో అగచాట్ల గురించి, చివరకి పిల్లలంతా ఆ పనిలో ఏం లేదని గ్రహించి దూరంగా వెళ్ళిపోతే ముసలి భార్యాభర్తలు మాత్రమే ఉండిపోతారు. ఇదా కుటుంబం కథ. దళితుల కథ. దళితుల్లో కూడా ఆధిపత్యం, వివక్ష ఉంటాయని చెప్పే కథ. అయినా, ఈ కథ అంతలా వివాదం కావడానికి, ఇన్నేళ్ళైనా బాగా అమ్ముడుపోవడానికి రచయిత చేసినవేంటి, చేయనివేంటి?

ఇది దాదాపు 280 పేజీల నవల కాబట్టి రచయిత చాలా సావకాశంగా, ఏం తొందరపడకుండా ఆ కుటుంబ రోజూవారి జీవితాన్ని చిత్రీకరిస్తారు. ఆ చిత్రీకరణ ఒక cctv కెమరా పెట్టి చేతలని, మాటలని రికార్డ్ చేసినట్టే ఉంటుంది కానీ, “అయ్యయ్యో” అని వగచడం, “అన్యాయం నశించాలి” అని పాత్రల తరఫున నినాదాలు అందుకోవడం ఉండదు. దాని వల్ల పాఠకులుగా మనం కూడా ఆ ఇంటికెళ్ళి అక్కడుండి వారి జీవితాలని చూసినట్టు అవుతుంది కానీ, ఇక్కడెక్కడో కూర్చుని, పాప్‍కార్న్ తింటూ చూసినట్టు ఉండదు. దాని వల్ల సానుభూతి బదులు, సహానుభూతి కలుగుతుంది.

ఈ కుటుంబం ఎదుర్కునే వివక్షకి ప్రధాన కారణమేమిటి? అది రచయిత పట్టుకోవడమే కాకుండా, మనకీ అంతే బాగా అర్థమయ్యేట్టు చెప్తారు. కారణం: కేవలం ఒక కుటుంబంలో పుట్టిన కారణం చేత ఆ కులానికి వృత్తిగా నియమించినదానినే వృత్తిగా కొనసాగించాలి. అదే బతుకుతెరువు కావాలి. వేరే అవకాశాలని అందిపుచ్చుకోవడానికి లేదు. ఆ పని కూడా “నీకు నా అవసరముంది, నీ అవసరం నాకుంది” అన్న ట్రేడింగ్ పద్ధతిలో కాక, “నువ్వు నాకు చేసేది సేవ, నేను నీ పై చూపెట్టేది దయ” అన్నట్టు ఉండడం కారణం. “నువ్వు ఫలానాగా పుట్టి, ఫలానా పనిజేస్తుంటావ్ కాబట్టి నీ ఇంట్లో పొయ్యి ముట్టించకూడదు. మిగులూ, తగులూ మేం ఏది పడేస్తే అది తినాలి” అన్న నియమనిబంధనల్లో ఉంది.

ఇవ్వన్నీ మనకి బలంగా అర్థమవ్వడానికి రచయిత ఎన్నో సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ సన్నివేశాల్లో ఆధిపత్యం చెలాయించేవారి మీద ఆగ్రవేశాలని ఆ కుటుంబ సభ్యుల్లో చూపెడుతూనే, మళ్ళీ తెల్లారేసరికి వాళ్ళకే, అవే పనులు చేయడానికి పూనుకుంటారు. అంటే, వివశతా ఉంది, విరక్తీ ఉంది.

అలానే, లాండ్రీలు, ఐరన్ బాక్సులు వచ్చాక చాకలికి బట్టలు ఇవ్వడం తగ్గించేస్తారు ఊర్లో జనమంతా. కొత్తగా ఈ దుకాణాలు పెట్టినవాళ్ళు తమ కడుపు కొడుతున్నారన్న ఆక్రోశం ఉంటుంది, విర్రవీగే కోపం వాళ్ళ మీద తగువేసుకోడానికి కూడా వెళ్తుంది ఒకామె. కానీ, ఆ కొట్టు అప్పుడు మూసేసి ఉంటుంది. ఊసురోమంటూ తిరిగి ఇంటికి రావడం తప్ప మరేం చేయలేదు.

వీళ్ళు చేసేది గొడ్డు చాకరీ. పీతు, ముట్టు గుడ్డలతో సహా అన్నీ ఉతకాలి. పెద్దా, చిన్నా, ముసలీ, ముతకా అందరివీ ఉతకాలి. సవర్తలనుంచి తద్దినాల దాకా అన్ని పనులూ వీళ్ళ చేతుల మీదే జరగాలి. ఆ చాకరీనంతా ఎంత సహజంగా, వివరంగా, graphicగా వర్ణించుకుంటూ పోతారంటే మనకి ఆయాసం, నీరసం వస్తాయి. ఆ వెంటనే వచ్చే సీన్‍లో వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బో, బియ్యమో ఇవ్వడానికి ఎవరన్నా బేరసారాలు ఆడుతుంటే వాళ్ళ మొహం పచ్చడి చేయాలన్నంత కోపం మనకి వస్తుంది. క్రాఫ్ట్ అంటే ఇదే! ఒకళ్ళని చూసి జాలిపడేలా చేసే రచనలు ఆయా రచయితలకి పేరు తెచ్చిపెడతేయేమో గానీ, పరిస్థితులని, జీవితాలని అర్థం చేసుకోడానికి సహాయపడవు.

ఈ అనువాదానికి ప్రొ. ఆర్ అజగరసన్ రాసిన ముందుమాట కూడా చాలా విలువైనది. అందులో ఆయన ఇమాయమ్ తన కథల్లోని పాత్రలని పాత్రలు (తమిళం: పాతిరంకల్) అనకుండా, “కథలో మనుషులు” (కథై మాన్‍థర్కల్) అని అంటారట! ఐడియాలని, ఐడియాలజీలని మోసే పాత్రలుగా కాకుండా, కథలు చెప్పే మనుషుల గొంతులని వినిపించగలిగేలా రాయడం ఎంత అపురూపమైన దృక్పథం!

తెలుగు సాహిత్యంలో పొద్దస్తమాను వినిపించే “రికార్డ్ చేశారు”, “నమోదు చేశారు” ఎంత పేలవమైన మాటలో ఈ కింది లైన్లు చదివితే తెలుస్తుంది:

Imayam’s fiction wins our attention to the life beyond the ethnographic data at a time when we see new forms of history-writing that challenge the dominant modes of history by using local data. The anthropologist Clifford Geertz insists on the need to ‘convert the entire culture into folklore and collect it’ for a proper ethnographic study.భారతీయ స్త్రీలని అర్థం చేసుకోవాలంటే మాత్రం భారతీయ భాషల్లో వచ్చే నవలలే దిక్కు అని నాకు బాగా అర్థమవుతోంది ఈ మధ్యకాలంలో.

ఈ నవలలో ఆరోక్యం పాత్ర చాలా విశిష్టమైన పాత్ర. ఒక సీన్ ఉంటుంది. వానల్లేక కరువొచ్చిందని ఊర్లో అమ్మవారికి వేటని కోస్తారు అంతా కలిసి. అలా కోసిన వేటలోని తలా, పేగులూ చాకలి కుటుంబానికి ఇవ్వాలి. కానీ ఇవ్వమంటారు ఊరి పెద్దలు. అధికారంగా రావాల్సింది రానప్పుడు ఎవరూ నోరు మెదపరు, మగవాళ్ళు కూడా. ఆరోక్యం ఒక్కత్తే నిలదీస్తుంది. అవతలి వాళ్ళు బూతులు తిడుతున్నా వెనక్కి తగ్గదు. ఆమెని చూసి ఇంకో ఆమె కూడా మాట కలుపుతుంది.

మనకి women empowerment అంటే ఏవో fancy ఇడియాలున్నాయి కానీ, ఇంతకు మించిన ధైర్యసాహసాలు, మనోనిబ్బరం ఏముంటాయి? ఆమె ఇలా అడిగాక మరుసటి రోజునుంచి ఊర్లో జనం ఇవ్వాల్సిన అన్నం కూరా కూడా ఇవ్వడం మానేస్తారు. అయినా, “నేనెందుకు అడిగాను? గమ్మున ఉండాల్సింది కదా!” అని ఆమె అనుకోలేదు. వివక్షని వివక్ష అనీ, అన్యాయాన్ని అన్యాయమనీ గుర్తించడమే తొలి మెట్టు కదా!

ఇంటింటికీ వెళ్ళి బట్టలు తీసుకురావాల్సినప్పుడు ఆమె కూతుర్ని ఒక ఊరిపెద్ద పాడుచేస్తాడు. ఆ అమ్మాయి ఇంటికొచ్చి ధారాపాతంగా ఏడుస్తూనే ఉంటుంది. తల్లికి చెప్పుకుంటుంది. ఇద్దరూ ఏడుస్తూనే ఉంటారు కొన్ని రోజుల పాటు. కానీ, మళ్ళీ వాళ్ళే సర్దుకుంటారు. ఆ దుఃఖం ఒక పొరలా వేటాడుతూనే ఉంటుంది, అయినా చేయాల్సినవి చేసుకుంటూనే పోతారు. ఏం పెట్టి తయారుచేసిన ఆడవాళ్ళల్లో ఇంతటి ఆత్మబలం ఉంటుంది?

తల్లి హృదయమంటూ కవితలు, ఒక స్తనం కనిపించేలా తల్లి బిడ్డకు పాలిస్తున్నట్టు చూపెట్టే బొమ్మలు తప్పించి తల్లితనం గురించి pop-cultureలో చూపించీ చూపించీ దాన్ని రొమాంటిసైజ్ చేసేవాళ్ళు మన నవలలు చదివితే తెలుస్తుంది అసలు, ఒక బిడ్డకి జన్మనివ్వడం అంటే ఏమిటో. మలయాళ రచయిత రాజీవన్ రాసిన “The Man who learnt to fly but couldn’t land”లో post-partum depressionని, ఈ నవలలో లేబర్‍ని చిత్రీకరించినంత బలంగా ఇంకెక్కడా నేనింత వరకూ చదవలేదు. బిడ్డ పుట్టగానే తల్లికి దైవత్వాన్ని ఆపాదించే నరేటివ్స్ మధ్య బిడ్డని కనడానికి, కన్నాక శరీరం, మనసూ పడే రాక్షస బాధ, నరక యాతన చెప్పడం కష్టం. ఆ పీడను భరించలేక తల్లులు పిచ్చ బూతులు తిట్టడం, అమానవీయంగా వ్యవహరించడం మననుంచి దాచిపెట్టే నిజాలు. బిడ్డ పుట్టిన ఇరవై రోజులకి కూడా పాలు పడకపోగా ఛాతీ అంతా నొక్కేసినట్టుండి ఒళ్ళంతా ఒకటే సలుపుతో కిందా మీదా దొర్లాడే ఇరవై ఏళ్ళ అమ్మాయి గురించి చదువుతుంటే స్త్రీని, స్త్రీ శరీరాన్ని అర్థంచేసుకుని, అనునయంగా చూసుకుంది ఆరోక్యం లాంటి చదువూసంధ్యా లేనివాాళ్ళేనా? అని అనిపించింది.అనువాదం చిక్కగా అనిపించింది, తెలీని మాటలు, ఆచారవ్యవహారాలు ఎక్కువగా ఉండడంతో మొదట, తర్వాతర్వాత కథనంలో చిక్కుముడులు ఎక్కువవ్వడం వల్లా చాలా నెమ్మదిగా చదువుకోవాల్సి వచ్చింది. చాలా వరకూ తమిళ పదాలని అలానే ఉంచేశారు. చివర్న అర్థాలు ఇచ్చారు. తమిళ నవలలో యాస బాగా ఉండి ఉంటుంది. ఇంగ్లీషుని కూడా అందుకు అనుగుణంగా చాలా వరకూ వాక్యనిర్మాణాన్ని మార్చారు. పల్లెపాటలు కూడా చాలా ఉన్నాయి, వాటి అనువాదాలు బాగనిపించాయి. (అవి చేయడం కష్టం.)

ఈ రచన ఎలాగైనా తమిళేతరులకీ అందాలని పట్టుపట్టిన మినీ కృష్ణన్ గారికి వేవేల కృతజ్ఞతలు. ఆవిడ పూనుకోక పోతే నాలాంటివారు ఇంత గొప్ప నవలని మిస్ అయ్యుండేవారు!

There is no other novel in Tamil that can be compared to Koveru Kazhuthaigal in artistically presenting the divisions and hierarchies created by the humans among themselves, in containing the depth of human suffering, and in successfully transferring the experience into writing.

One comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s