ఎడిట్ వార్స్

Posted by

First published in Oct 2021. https://eemaata.com/em/issues/202110/26944.html

మార్చ్ 2020.

అదొక దేశం. అందులో ఒకానొక వ్యక్తి. ఊరూ పేరూ, చదువూ సంధ్యా, ఉద్యోగమూ సద్యోగమూ, లింగమూ లైంగికతా అన్నింటినీ దాచేసి ‘అలక్_వి42’ అనే ఐ.డి.గా మారిపోయి, వికిపీడియా వ్యాసాలు రాయడం అలవాటు.

ఎన్నికల సమయం కాకపోయినా రాజకీయాకాశంలో కొద్ది రోజులుగా దట్టమైన నల్లటి మబ్బులు పట్టాయి. అంతా నిశ్శబ్దంగా ఉన్న వేళ రాజకీయ నాయకులు మాటల ఉరుములు ఉరుముతారు, దేశప్రజలు ఉలికిపడి సర్దుకుంటుంటారు. అలా సర్దుకుపోవడం ఆ దేశప్రజలకి అలవాటే!

ఓ మధ్యాహ్నం, అలక్_వి42 ఆఫీసుకి వెళ్తుంటే కార్‌లోని ఆకాశవాణి ఒక కబురు చెవిన పడేసింది: రాజధాని నగరంలో నైరుతి ప్రాంతంలో ఇవ్వాళ మధ్యాహ్నం ఇరు వర్గాల మధ్య ఘర్షణలు మొదలై దాదాపు ఇరవైమంది దాకా చనిపోయారు. డెభ్బైమందికి పైగా గాయపడ్డారు. ఖార్ఖానా నుంచి బయటకి వస్తుండగా గజడదబల వర్గానికి చెందిన మధ్యవయస్కుడిని గుర్తు తెలియని వ్యక్తి పొడిచి చంపాడు. కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ఈ హత్యకి సంబంధించిన వైరల్ ఫుటేజ్ హల్‌చల్ చేయడంతో, హంతకుడు కచటతపల వాడయ్యుంటాడని పుకార్లు లేచి, ఇరు వర్గాల మధ్య రాళ్ళదాడి మొదలై ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పోలీస్ అధికారి మా ప్రతినిధితో…

ఆ దేశానికి అల్లర్లూ అలవాటే! మీడియా, ప్రభుత్వం, ప్రజానీకం, ఇట్లాంటి వాటిని ‘చెదురు మదురు సంఘటనలు’గా కొట్టిపారేస్తుంటారు గానీ ఈసారి ఎందుకో అలక్_వి42 మనసుకు ఇది కొట్టివేయదగ్గ సంఘటనగా అనిపించలేదు.

తాజాగా జరిగిన అల్లర్లు దేశరాజధానిలోని ఒక ప్రాంతంలో. అది విశేషం కాదు. విశేషం వైరల్ ఫుటేజ్. పుకార్ల కన్నా పవర్‌ఫుల్. ‘ఎవరో ఎవరినో పొడిచేశారట’ అనే వాక్యంలో ప్రతీదీ గాలిమాటే. వినగానే గుండె గుభేలుమంటుంది, కడుపులో అదురు మొదలవుతుంది, కానీ ఎవరో, ఎవరినో తెలీదు కాబట్టి మనసూ-మెదడూ పని చేస్తూనే ఉంటాయి. కానీ ‘పొడుస్తా పొడుస్తా’ అని బెదిరించి చంపిన వీడియోలో మనుషులు నిజం, బెదిరింపు నిజం, చంపడం నిజం. తతంగాలన్నీ పూర్తి చేసుకుని కోర్టులు నిజానిజాలు తేల్చేలోపు నిజమైనా కాకపోయినా అందరికీ ఆ ఫుటేజే నిజం. మనసూ-మెదడూ లొంగిపోయే నిజం.

అలక్_వి42 ఆఫీసుకి చేరుకునేసరికి కఫేలో అంతా నోర్లు వెళ్ళబెట్టి చూస్తున్న టి.వి. స్క్రీన్లపై ఆ ఫుటేజ్‌కి సంబంధించిన ఇమేజ్‌లే! వాటిని వివరిస్తూ, వ్యాఖ్యానిస్తూ బండబండ అక్షరాలతో మాటలు!

రెండు రోజుల వరకూ పరిస్థితులు కుదుటపడలేదు. ‘ఘర్షణలు ఆ ప్రాంతం పొలిమేరలు దాటలేదు. అక్కడ కూడా ఇప్పుడు పూర్తి శాంతియుతమైన పరిస్థితులు నెలకొన్నాయి’ అని ప్రభుత్వం ప్రకటనలు చేస్తూనే ఉంది.

‘పొలిమేరలు దాటలేదు’ అంటే మనుషులు నరుక్కోవడం, ఆస్తులు తగలెట్టడం లాంటివి చుట్టుపక్కల ప్రాంతాలకి పాకలేదని. మరది యంత్రాంగం చాకచక్యంగా పనిజేయడం వల్లా లేకపోతే తంత్రాంగం ‘ఇప్పటికి చేసిన చప్పుడు చాలు’ అని ఊరుకోవడం వల్లా అన్నది తెలీదు; ఎవరికీ, ఎప్పటికీ! అలక్_వి42 ధ్యాస మాత్రం మాటల మీద! లీకైన గ్యాస్‌లా, తుమ్మితే అంటుకునే వైరస్‌లా అల్లర్లు కలిగించే భయాందోళనలు దేశమంతటా వ్యాపించడం మొదలెట్టాయి అప్పటికే, మాటల ద్వారా! వాటిని అడ్డుకోడానికి ప్రణాళిక వేయకపోవడంలోనే ప్రణాళిక ఉందేమో గమనించడానికి వార్తాపత్రికలన్నింటిని వెతుక్కుని చదివారు అలక్_వి42, ఆఫీసులో వీలు చిక్కినప్పుడల్లా.

– ‘గజడదబల మనిషిని హత్యచేసింది కచటతపలకి చెందిన వ్యక్తేనని మాకు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందింది. ఆ విషయాన్ని బయటకు రానివ్వకుండా కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయి,’ అని ఒక పత్రిక తీర్పు ఇచ్చింది.

– ‘కచటతపలని ఎన్నో ఏళ్ళగా తొక్కిపెట్టాలని చూస్తున్న గజడదబల క్రూర చరిత్ర తెలియనిదెవ్వరికి? ఇప్పటికన్నా మనమీ నిజాన్ని గుర్తించకపోతే, ఆత్మరక్షణకై మనం…’ అని మరో పత్రిక ఆవేశపడింది.

ఇంటికొచ్చేసరికి టీవీ నడుస్తూ ఉంది. రోజంతా ప్రింట్‌లోనూ, ఆన్‌లైన్‌లోనూ చదివిన అక్షరాలు ఏ భావాన్ని చెప్తున్నా ఒకేలా, ఒద్దికగా, నిరాండబరంగా, దాదాపుగా నల్లరంగులోనే ఉంటే, టీవీల్లో మాత్రం తాటికాయలంత అక్షరాలు, ఒళ్ళంతా గాట్లతో, ఎర్రగా, రక్తం కార్చుతున్నట్టు, వికృత నాట్యం చేస్తూ దర్శనమిచ్చాయి. టీవీ మ్యూట్ చేసున్నా ఆ అక్షరాలు అరుస్తున్నట్టే ఉన్నాయి: మీకు తెలుసునా ఈ నిజం! మేము నిగ్గుతేల్చిన నిజం. ఈ నిజాన్ని మీ ముందుకు మొట్టమొదటిసారి తీసుకొస్తున్నది మేమే!

కళ్ళకి వినిపించే మాటలు. వాటి హోరూ పోరూ భరించలేక గదిలోంచి అలక్_వి42 వెళ్ళిపోయారు. ఊరట కోసం కాసేపు పాటలేమైనా విందామనుకుంటే ఫోనులో ఒకటే అంతరాయాలు. నోటిఫికేషన్లు.

చెక్‌పోస్టులంటే తెలీని సోషల్ మీడియాలో అప్పటికే అక్షరాలు మరో విధంగా కల్లోలం కొనసాగించాయి. టి.వి. అంతటి నిరంకుశత్వం కాకపోయినా ఈ మెసేజ్‌లేం తక్కువ తినలేదు.

– ‘మీరే చూసి నిజానిజాలు తేల్చుకోండి’ అని సవాలు విసిరిన మెసేజ్ నిజానికి వేరెప్పటిదో, వేరెక్కడిదో వీడియోని ఇప్పటిది, ఇక్కడిది అని నమ్మించడానికి తెగ ఆయాసపడింది.
– గజడదబలు తమ పూర్వీకుల్ని ఎలా హింసించారో చెప్తూ చరిత్రనంతా తమకి అనుకూలంగా బులెట్ పాయింట్లలో కూర్చి ‘ఇన్ని నిజాలు కళ్ళముందు కనిపిస్తున్నా మనం నిద్రపోతున్నామంటే మనల్ని ఇంకెవ్వరూ కాపాడలేరు’ అని నిష్టూరమాడింది ఇంకో మెసేజ్.

ఇట్లాంటి కల్లబొల్లి మెసేజ్‌లే కచటతపలకి వ్యతిరేకంగా కూడా మొదలయ్యే ఉంటాయని అలక్_వి42కి అనిపించింది, కానీ అవి అందుకునే అవకాశం లేదనీ గుర్తొచ్చింది.

భోజనాల దగ్గర వద్దన్నా అదే ప్రస్తావన వచ్చింది. “చూశావా, నేను చెప్తూనే ఉన్నా, వాళ్ళెంతకైనా తెగిస్తారని, ఇప్పుడు నింద మన మీదేస్తున్నారు. అసలా సశషహలే నయం వీళ్ళకన్నా” అన్న తండ్రి మాటలకు అడ్డేస్తూ, “ఊరుకోండి, అసలే పరిస్థితులు బాలేవు. ఏ మాటంటే ఏం ముప్పో” అని అమ్మ అంది. న్యూస్ నుంచి స్పోర్ట్స్‌కి ఛానల్ మారింది గానీ టాపిక్ మారలేదు. “అర్రెర్రె… కాచ్ వదిలేశాడు. ఊరికే ఈ గజడదబ గాళ్ళను తీసుకుంటారు టీమ్‌లో, ఆడరూ పెట్టరూ…” తండ్రి కొనసాగించాడు.

తినడం అయ్యాక తీరిక దొరకగానే అలవాటుగా వికీ తెరిచి చూస్తే అలక్_వి42 ఎడిట్ చేస్తున్న పేజీల వివరాలు కనిపించాయి. వాటిపైకి మనసు పోలేదు ఆ పూట. ప్రస్తుతం దేశరాజధానిలో జరుగుతున్న అల్లర్ల గురించి ఇంకా ఎవరూ పేజ్ క్రియేట్ చేయలేదు.

పేజ్ క్రియేట్ చేసే ముందు అసలు అల్లర్ల గురించి ఇంతకుముందు ఏం రాశారో చదవడం మొదలు పెట్టారు అలక్_వి42. ‘దేశంలో అల్లర్లు’ అని వెతికితే 1923 అల్లర్ల నుంచి 2004 అల్లర్ల వరకూ బోలెడు పేజీలు వచ్చాయి. అల్లర్లు మొదలవ్వడం, పెరిగి పెద్దవి అవ్వడం, అమాంతంగా ఆగిపోవడం, కొంతకాలానికి అసలేం జరగనట్టు ఎవరేం మాట్లాడకపోవడం – అన్నీ ఒక టెంప్లేట్ ప్రకారంగానే జరుగుతుంటాయని, ఆ రివాజుకి రోజువారీ రియాజ్ అక్కర్లేదనీ వి42కి అర్థమైంది.

ఒక పాత వికి పేజ్‌ని టెంప్లేటుగా ఎన్నుకుని క్లిక్ కొట్టగానే కొత్త పేజ్ క్షణాల్లో తయారైంది.

అలక్_వి42 ‘రాజధానిలో అల్లర్లు’ అని ఓ కొత్త పేజ్ సృష్టించారు… అన్న ప్రకటన కనిపించింది వికీలో ఆన్‌లైన్ ఉన్న ఎడిటర్లకు. ఆసక్తి ఉన్నవారు వారి వారి ఐ.డి.ల రూపంలో ముందుకొచ్చి తలా ఓ చేయి వేశారు.

అల్లర్లు మొదలై అప్పుడే ఐదో రోజు. ఏ రోజుకారోజు కొత్త పరిణామం. కొత్త కోణం. కొత్త వివాదం.

ప్రతీ పదం ఆచితూచి రాయాలి. ప్రతీ అక్షరాన్ని పట్టిపట్టి చూసి చూసి తడబడిన, పొరబడిన వాటికి సర్దిచెప్పి సరిచేయాలి. ‘ఇది తప్పుడు స్టేట్‌మెంట్. మేం ఒప్పుకోం!’ అనే దాడికి గురికాగల వాక్యాలని గుర్తించి ఎవరూ కొట్టిపారేయలేని రిఫరెన్సుల లింక్స్ చేర్చి వాటి మనోధైర్యాన్ని పెంచాలి. భావావేశంలో అదుపు తప్పి ఆవేశపడుతున్న పదాలను వెనక్కి లాక్కొచ్చి కాసిన్ని మంచినీళ్ళు తాగించాలి. బెరుకుగా వెనక్కి దాక్కుండిపోతున్న నిజాలని ముందుకు చొచ్చుకొచ్చేలా తోయాలి.

అలక్_వి42తో పాటు మరో ఇద్దరు ఎడిటర్లు పనిజేస్తే గానీ పేజ్ ఒక కొలిక్కి రాలేదు. వచ్చాక, ఇలా కనిపించింది.

టైటిల్: రాజధాని నైరుతి ప్రాంతంలో అల్లర్లు
తేదీ: 27 మార్చి 2020
హతులు: 40
గాయపడ్డవారు: 247
ప్రేరకాలు: మతోన్మాదం, రాజకీయ అనిశ్చితి
రిఫరెన్సులు: 33
సృష్టించినవారు: అలక్_వి42
చివరిసారిగా సవరించినవారు: బైనాక్_31443

పేజ్ మెటా-వివరాలు: పదాలు-1029; అక్షరాలు-8740; ఫోటోలు-3 (1080×543 పిక్సల్స్).

[గమనిక: ఇది ‘కరెంట్ ఈవెంట్.’ ఎప్పటికప్పుడు పరిణామాలను బట్టి ఈ పేజ్ మార్చబడుతుంది.]

దేశరాజధానిలో అల్లర్లు, (లేదా దేశరాజధానిలో నైరుతి ప్రాంతంలో అల్లర్లు) మార్చి 2020లో జరిగిన మారణహోమం, విధ్వంసం. ఇంతటి దారుణానికి ముఖ్యకారణం కచటతపలు అనే వర్గం వారు గజడదబలనే వర్గాన్ని వెంటాడి, వేటాడి చంపడం. చనిపోయినవారిలో దాదాపు ఎనభై శాతం మంది గజడదబలే! మృతులలో కొందరు పోలీసు ఆఫీసర్లు, జర్నలిస్టులు, స్టూడెంటులు కూడా ఉన్నారు. కొందరు కత్తిగాట్లకు, తుపాకి తూట్లకి చనిపోతే, అత్యధికులు నిప్పంటించిన భవనాల్లో ఉండిపోవడం వల్ల కాలి చనిపోయారు.

శాంతియుతంగా జరుగుతున్న ఒక ర్యాలీపై ఉన్నట్టుండి రాళ్ళదాడి జరిగి, చెల్లాచెదురైన మనుషులని రాళ్ళతో కొట్టారు. ఈ ర్యాలీకి గజడదబల నాయకుడు పిలుపునివ్వగా, దీనికి యరలవలు, శసషహలు కూడా పూర్తి మద్దతునిచ్చాయి, ర్యాలీలో పాల్గొన్నాయి. గజడదబల వర్గానికి వ్యతిరేకంగా స్పీచ్ ఇచ్చిన దేశ అమాత్యులలో ప్రముఖులైన…

ఆ పూటకి అలక్_వి42 లాగౌట్ అయ్యారు.

కలత నిద్రలో ఎక్కడ్నుంచో దూరంగా ఆర్తనాదాలు వినిపించాయి లీలగా. అలక్_వి42 ఐడీ తాలూకా మనిషి ఉలికిపడి లేచారు. రోజూ వింటున్న వార్తలు, చదువుతున్న ఫార్వర్డ్‌లు, వికీ వ్యాసం కోసం తెలుసుకుంటున్న వివరాల వల్ల చెదిరిన మనసుకి ఇలాంటి కలలే వస్తాయని సర్దిచెప్పుకుని మళ్ళీ పడుకోబోయారు. తడుముకుంటూ కళ్ళద్దాలు వెతుక్కుని ఫోన్ తెరిచి చూస్తే – కలలో కాదు, వికీలో కలకలం!

వెంటనే లేచి అలక్_వి42 అనే ఐడిగా మారిపోయి, నేరుగా ‘రాజధాని నైరుతి ప్రాంతంలో అల్లర్లు’ అన్న పేజ్‌కి చేరుకున్నారు.

చెల్లాచెదురుగా పడున్నాయి పదాలు. నల్లగీతతో అడ్డంగా నరికేసిన మాటల వరుస కొన్ని చోట్ల. అక్షరాలని విడదీసి విసిరేయబడ్డ పదాలు కొన్ని అయితే, చొరబాటుగా చేరిన అబద్ధపు, అసంబద్దపు పదాలు కొన్ని. నల్లని అక్షరాలని తెల్లగా మార్చి పేజీలో సమాధి చేసిన పదాలు కొన్ని. అర్థాన్ని వక్రీకరించాక వికృతరూపాన్ని సంతరించుకున్న పదాలు బోల్డ్‌గా నుంచున్నాయి. రూపురేఖలు పోల్చుకోలేనంతగా ఆ పేజ్ మారిపోయి ఉంది.

ఇంతటి దారుణానికి ముఖ్యకారణం: కచటతపలు అనే వర్గం వారు గజడదబలనే వర్గాన్ని వర్గం వెంటాడి, వేటాడి చేస్తున్న దాడికి గత్యంతరం లేక ఆత్మరక్షణ కోసం చావడమైనా, చంపడమైనా…

గజడదబల వర్గానికి వ్యతిరేకంగా స్పీచ్ ఇచ్చిన దేశ అమాత్యులలో ప్రముఖులైన… ఇచ్చిన స్పీచ్‌ని వక్రీకరించి, అందులో లేనిపోని అర్థాలు తీసి…

ఇంతకు ముందు జతచేసిన జాతీయ, అంతర్జాతీయ దినపత్రికల రిఫరెన్స్ తీసేసి, ఇప్పుడు ఎవరో ఆగంతుకుడు పిస్టల్ పట్టుకుని చంపేస్తా అని బెదిరిస్తున్న ఒక వైరల్ వీడియోని, ఫేస్‌బుక్ నుంచి లింక్ చేశారు. చనిపోయిన చాలామందికి క్రిమినల్ రికార్డులు ఉన్నాయనో, వాళ్ళు శత్రుదేశం వాళ్ళు పంపిన టెర్రరిస్టులనో ఫేక్ ఫోటోలు పెట్టారు. ధ్వంసమైన ఆస్తుల తీవ్రతను తెలియజెప్పే అసలు ఫోటోలని మార్ఫ్ చేసి, వాటిల్లో గజడదబలకు చెందిన కొందరిని ఫోటోషాప్ చేశారు, హింసను ప్రేరేపిస్తున్నట్టు అర్థం వచ్చేలా.

ఆగడాలు కేవలం ఆ పేజ్‌తో ఆగలేదన్న విషయం త్వరగానే స్పష్టమైంది. దేశంలో ప్రతి ఒక్కరి ఆర్థిక, సామాజిక, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, క్రోడీకరించే సంస్థ గురించిన పేజ్‌లో, అదో అవకతవకల, అవినీతిమయమైన సంస్థ అంటూ వివరణ మార్చేశారు. ఎన్నో ఏళ్ళ కిందట క్రియేట్ చేసిన పాత అల్లర్ల పేజీలలో సమాచారమంతా తారుమారు అయింది.

“ఇది ఒక్కరిద్దరు చేస్తున్నది కాదు. ఇట్స్ ఎ మాబ్ అటాక్!” అని బైకాన్_31443 మెసేజ్ చేశారు, చాట్‌లో. ఒక్కో పేజ్‌కి ఒక్కో ఎడిటర్ కాపలాగా ఉండాలని నిశ్చయించుకున్నారు.

కొత్త అల్లర్ల పేజీలో వచ్చిన మార్పులన్నింటినీ అలక్_వి42 తిప్పికొట్టారు. మరో ఎడిటర్ సాయంతో, పడిపోయిన మాటలని నిలబెట్టారు. మొహమంతా మసిపూసి ఉన్న వాటిని తుడిచి శుభ్రపరిచారు. కలుపు మొక్కల్లా పుట్టుకొచ్చిన కొన్ని మాటలని, వాక్యాలనీ వేళ్ళతో సహా పీకి పారేశారు. మళ్ళీ పేజీనంతా శుభ్రం చేసి పూర్వస్థితికి పట్టుకొస్తుండగా… మళ్ళీ దాడి. మరింత అల్లకల్లోలం.

‘అసలు మన దేశాన్ని ప్రపంచం దృష్టిలో తక్కువ చేసి చూపించడానికే ఈ సంఘటనలకింత ప్రాచుర్యం కల్పిస్తున్నారు.’

‘ఈ అల్లర్లకి కారణం ఆంతరంగిక రాజకీయాలు కావు. ఇది శత్రుదేశం చేస్తున్న కుట్ర. దీనికి మనం లొంగకూడదు.’

“మార్పులన్నీ ఐడీలు లేనివారి నుంచి వస్తున్నాయి. మనుషులు చేస్తున్నారో, బాట్స్ చేస్తున్నాయో ఎవరికి తెలుసు? మనం ఎడిట్స్ చేసి లాభం లేదు. ఉయ్ ఆర్ అండర్ అటాక్!” అని సూపర్నోవా@098 అంటుండగానే ఎడిటర్లతో వాగ్యుద్ధానికి దిగారు అవతలివాళ్ళు.

158.2.6.98: మేం చేసిన మార్పులు తీసేస్తారేం… ఇది మీ జాగీరా, మాకిక్కడ హక్కుల్లేవా?

బైకాన్_31443: మీరు సరైన ఆధారాలు లేకుండా మార్చారు కనుక మేం రివర్ట్ చేయాల్సి వచ్చింది.

98.34.98.70: ఎందుకు లేవు ఆధారాలు? అన్నీ లింక్‌లూ పెట్టినా కూడా… మీరు మా స్వేచ్ఛని కాలరాస్తున్నారు. మా గొంతులు నొక్కేస్తున్నారు. ఈ జులుం నశించాలి.

నాఇష్టం_బే: చెప్పుకోడానికే మీదో స్వతంత్ర వేదిక. ఎవరైనా, ఎప్పుడన్నా ఎడిట్ చేయచ్చంటారు, చేస్తే తీసేస్తారు…

అలక్_వి42: మీరిచ్చిన లింక్‌లూ, వీడియోలు సోషల్ మీడియాలోనివి. నిజ నిర్ధారణ, అంటే ఫాక్ట్-చెక్ అవ్వని వాటిని ఆధారం తీసుకోకూడదన్న నియమం వికీలో ఉంది.

లొల్లి6708: అంటే, దూకుడుదేశం పత్రికలో వచ్చేవన్నీ నిజం కాదంటావ్… నీ తొక్కలోది గజడదబ పేపర్‌లో వచ్చినవే నిజమంటావ్… అమ్ముడుపోయార్రా మీరు, అమ్ముడుపోయారు!

78.93.45.0: లేకపోతే పనిగట్టుకుని మనదేశాన్ని ఎందుకిలా బజారుకీడుస్తారు… మీ అంతు చూస్తాం ఒరేయ్!

బైకాన్_31443: అమ్ముడుపోయిందెవరో తెలుస్తూనే ఉంది ఈ కామెంట్స్ బట్టి… మీరెవరికి పనిచేస్తున్నారో కనుక్కోవడం మాకు చిటికెలో పని.

అలక్_వి42 ఓ పక్క వాదిస్తూనే మరో పక్క ఎడిట్స్‌ని రివర్ట్ చేస్తూ వచ్చారు. కానీ, చేసిన మార్పులేవీ రెండు నిముషాలు కూడా నిలవలేదు. ఇహ, ఇది మానవమాత్రులు ఎదుర్కోగలిగే దాడి కాదని ‘ఎడిట్ వార్’ ప్రకటించారు వికీ అధిష్టానంవారు. గుండాయిజానికి గురవుతున్న పేజీలని ఇక ఎవరూ మార్చలేని విధంగా చర్యలు తీసుకున్నారు. అలక్_వి42, బైకాన్_31443లని కాసేపు ఆ పేజ్ నుంచి విరామం తీసుకోమని సలహా ఇచ్చారు. నిజానిజాలను పరికించి, పరీక్షించి పేజీ అప్‌డేట్ చేసే బాధ్యతను కొత్త ఎడిటర్లకి అప్పగించారు.

అలక్_వి42 లాగవుట్ అయిపోయారు.

‘ఎవరీ అలక్_వి42? ఎందుకా పేజ్ క్రియేట్ చేయడం?’ బండరాళ్ళంత అక్షరాలతో హెడ్‌లైన్‌లో దూకుడుదేశం పత్రిక లేవదీసిందీ ప్రశ్న. ‘శత్రుదేశం నుంచి వచ్చారా? లేదా మన బంగారమే చెడిందా? అహో… నిగ్గు తేల్చేది ఎవరు?’ అనుమానాలు లేపింది.

‘ఆ ఐడితో ఇప్పటికి 46 పేజ్‌లు క్రియేట్ అయి ఉన్నాయి. అన్నీ దేశరాజకీయాలకి సంబంధించిన సున్నితమైన విషయాలపైన, ఆంతరంగిక విషయాలపైనా. ఇంత పెద్ద దేశంలో అసలు ఏ అభిప్రాయభేదాలు, మాటపట్టింపులూ లేకుండా ఉంటాయా?! వాటి గురించి ఇంత రచ్చ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది?’

ఈ వార్త చదివిన అలక్_వి42 దాన్ని పెద్ద పట్టించుకోలేదు. తనని అడ్డుపెట్టుకుని వికీని ఎంత సాధించగలరు ఎవరైనా అనే అనుమానం మాత్రం వచ్చింది. అప్పటికి దేశరాజధానిలో అల్లర్లు సద్దుమణిగాయి.

‘మా ఎడిటర్ల ప్రైవసీ మాకు అత్యంత ప్రధానం. వారు వ్యక్తిగతంగా ఏ రాజకీయ భావాలకి చెందినవారైనా, ఏ మతంవారైనా, వారి స్వంత అభిప్రాయాలు ఆర్టికల్స్ లోకి వచ్చే అవకాశమే లేదు. అందుకు మా పాలసీలు ఒప్పుకోవు. కాబట్టి అలక్_వి42ని అటాక్ చేయడం మానుకోవాలి,’ అని వికీ ప్రకటన జారీ చేసేంతవరకూ ఆ పత్రిక వివాదాన్ని సాగదీసింది.

అనుకున్నంతా జరిగింది. లాగిన్ లాగవుట్‌లోనో, అశ్రద్ధగా వదిలేసిన ఏదో లింక్ వల్లో వివరాలు లీక్ అయ్యాయి.

అలక్_వి42 ఎవరో ప్రపంచానికి తెల్సిపోయింది. అతని పర్సనల్ ఫేస్‌బుక్, ట్విట్టర్ అకౌంట్లలో వెంటనే ట్రోలింగ్ మొదలైంది.

గబగబా కార్‌లో ఇంటికి చేరాడు. ఆపాటికే తల్లిదండ్రులు, భార్యా పిల్లల వివరాలు; అతనితో పాటు పనిజేస్తున్నవాళ్ళు, చదువుకున్నవాళ్ళు, ఛాయ్ తాగినవాళ్ళు – అందరి వివరాలూ బైటపడ్డాయని ఫోనులూ, మెసేజ్‌లూ వచ్చాయి. అతనితో ఎంత ఎక్కువ పరిచయముంటే అంత ఎక్కువ ట్రోలింగ్ వారిపై.

దూకుడుదేశం పత్రికవారు అతని వ్యక్తిగత వివరాలతో తమ పత్రికలో ఒక వ్యాసం ప్రచురించారు, దేశంపై వికీ నడుపుతున్న కుట్రలో దేశ యువత ఎలా పెడదోవ పడుతుందో చూడమంటూ. తమ ఎడిటర్ గోప్యతని బేఖాతరు చేస్తూ ఇలా నడిరోడ్డున నిలబెట్టినందుకు వికీ ఆ పత్రికను బ్లాక్‌లిస్ట్ చేసింది.

అయినా తక్కిన ఎడిటర్లకు భయం పట్టుకుంది. ఊరికే ఉత్తపుణ్యానికి చేస్తున్న సేవ ప్రాణంమీదకి వచ్చేదిలా తయారవుతోందని వాళ్ళ ఆందోళన. ‘ఎడిట్ వార్‌’లో ఒకరిద్దరు ఎడిటర్లు సమన్వయం కోల్పోయి బదులిచ్చినందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకునేసరికి తక్కినవారికి కోపం వచ్చింది. గాల్లో పెట్టిన దీపాన్ని ఆరిపోకుండా చూడాల్సిన బాధ్యతలో దీపానికి చేతులు కూడా అడ్డు పెట్టకూడదన్న నియమముంటే ఎలా అని కొందరు గట్టిగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు.

అలక్_వి42 ఉద్యోగం ఊడింది. ప్రపంచంలో అగ్రరాజ్యంగా భావించే దేశానికి చెందిన ఆ కంపెనీ, వాళ్ళ దేశంలో జరిగే #ప్రాణమెవరిదైనా_ఖరీదొక్కటే ఉద్యమానికి బాహాటంగా మద్దతునిచ్చి, ఈ దేశంలో వివాదంలో చిక్కుకున ఉద్యోగస్థుడికి మాత్రం ‘మేం రిస్క్ తీసుకోదల్చుకోలేదు. నీవల్ల తక్కినవారు డిస్టర్బ్ అవుతున్నారు, పని చేయలేకపోతున్నారు,’ అని చెప్పి ఇంటికి పంపించింది.

అతణ్ణి కొన్నాళ్ళ పాటు ఇంటినుంచి బయటకు రావద్దని కొందరు శ్రేయోభిలాషులు సూచించారు. ఆన్‌లైన్ అకౌంట్లన్నీ డిలీట్ చేయమన్నారు. వీలైతే అండర్‌గ్రౌండ్ అవ్వమని సలహా ఇచ్చారు.

మరి అండర్‌గ్రౌండే అయ్యాడో, మరింకేమైనా జరిగిందో అతను మళ్ళీ ఎవరికీ కనిపించలేదు. వికీలో అలక్_వి42గా తప్పించి అతని ఉనికి ఇంకెక్కడా మిగల్లేదు.

అక్టోబర్ 2048.

ఎన్నికల సమయం. దేశపు రాజకీయాకాశంలో మళ్ళీ కారు మబ్బులు. రాజకీయ నాయకుల మాటల ఉరుములు. ఒక్కొక్కరి మతం, కులం, వర్గం, భావజాలాలు, ఇష్టాయిష్టాలను బట్టి ఆ మాటలకి అనుగుణమైన రంగులు పూసి పర్సనలైజ్డ్ ఎక్స్‌క్లూజివ్ వార్తలందిస్తున్నాయి మీడియా సంస్థలు. ఎవరి స్క్రీన్లపై వారు చూడాలనుకునే నిజాలు వారికి కనిపించాయి. సర్చ్ ఇంజన్స్, సోషల్ మీడియా ఎవరికి వారికి ప్రత్యేకంగా సర్వీసులు అందించాయి. ఇలా ఎవరికి వారికి కావలసిన వార్తలే అందించడం, ఎవరికి కావలసిన నిజాలు వారికే చూపించడంతో ఎవరిది వారిది ప్రత్యేక లోకమైపోయింది. కాని, క్రమబద్ధంగా అప్పుడప్పుడూ అక్కడక్కడా అల్లరులు జరుగుతూనే ఉన్నాయి. ఆగిపోతూనే ఉన్నాయి. వికీపీడియా ఒక్కటే అందరికీ ఒకే సమాచారాన్ని అందించే పాత పద్ధతిని కొనసాగిస్తూ వచ్చింది. కాకపోతే వస్తున్న అనేకానేక కథనాల్లో నిజమేదో, అబద్ధమేమో కనిపెట్టడం కష్టమైపోయింది.

సోషల్ మీడియా అంతా ప్రభుత్వాల ఉత్తర్వులకు లోబడి పనిచేస్తున్నాయి. వాటి డేటా అంతా ఇప్పుడు ప్రభుత్వం ఆజమాయిషీలో ఉంది. శాంతిభద్రతల రక్షణలో ‘సర్వయిలెన్స్ అండ్ అనాలిసిస్’ అనే ఒక విభాగాన్ని ప్రభుత్వం స్వయంగా ఏర్పరిచింది. ప్రభుత్వానికి ఉభయతారకమైనవారు స్థాపించిన నేషనల్ సర్వయిలెన్స్ అండ్ ఎనాలిసిస్ సిస్టమ్స్ ఇంటిగ్రేటెడ్ (నాస్టీ) అనే ఒక కంపెనీ ఆ విభాగాన్ని నడుపుతుంది. సెల్‌ఫోన్లు, కార్లు, ట్రాఫిక్ లైట్లు, రెస్టారెంట్లు, మాల్‌లు, టి.వి.లు, ఇలా అన్నిచోట్లనుంచీ ప్రతీ మనిషి కదలికలన్నీ నమోదు చేయబడుతుంటాయి. మనుషుల ప్రమేయం లేకుండా (అందుకు సుప్రీమ్ కోర్ట్ అభ్యంతరం పెట్టింది.) వాటిని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా విశ్లేషించి, ఎక్కడ ఎవరు అనుమానంగా కదిలినా, తేడా కొద్దిగా వచ్చినా సిస్టమ్ వెంటనే హెచ్చరిస్తుంది, ప్రభుత్వాధికారులు తగిన చర్య తీసుకోవడానికి.

ఒక రోజు ఉన్నట్టుండి మధ్యాహ్నం మూడింటి నుంచి సర్వయిలెన్స్ సిస్టమ్‌కి కొన్ని నగరాల నుంచి వస్తున్న వీడియోల్లో ఏదో తేడా కనిపించింది. వెంటనే ఆ తాలూకూ మనుషులని, పరిసరాలని అబ్సర్వేషనులో పెట్టింది సిస్టమ్.

వీధుల్లోనూ రోడ్లపైనా మనుషులు అడ్డదిడ్డంగా పరిగెడుతున్నారు. మాటిమాటికీ దేనినుంచో తప్పించుకుంటున్నట్టు వెనక్కీ ముందుకీ పదేపదే చూసుకుంటూ అప్పుడప్పుడూ కిందకీ, పక్కకి వంగుతూ ఉన్నారు. బస్సుల్లో, మెట్రోలలో సీట్ల కింద దాక్కుంటున్నారు. కొందరు భయంతో పొలికేకలు పెడుతున్నారు. కొందరు దారికడ్డంగా కదలకుండా బిగుసుకుపోతున్నారు. కొందరు గాల్లో పిడిగుద్దులు కురిపిస్తున్నారు.

మరో ఐదు నిముషాల్లోనే ఇలాంటి వీడియోల సంఖ్య లక్ష రెట్లు పెరిగేసరికి సర్వయిలెన్స్ వింగ్ నుంచి అనాలిసిస్ వింగ్‌కి హై-అలర్ట్ వెళ్ళింది. చిన్నా పెద్దా అన్ని నగరాలనుంచి ఈ ఇమేజెస్ వస్తున్నాయని తెలిసింది. సమయం గడిచే కొద్దీ వ్యవహారం ముదిరింది. వీధుల్లో జనం పరిగెడుతూ ఒకళ్ళని ఒకళ్ళు గుద్దుకుంటున్నారు. పిల్లర్లకి, డివైడర్లకి ఢీ కొట్టుకుని పడిపోతున్నారు. కొందరు ఎత్తయిన భవనాల అంచుల దాకా వెళ్ళిపోయారు. కొందరు రైలు పట్టాల మీదా, రోడ్లపైనా అడ్డంగా నడిచారు.

‘వింతగా ప్రవర్తిస్తున్నవారిలో 98.51% మంది వర్చువల్ రియాలిటీ అద్దాలు తొడుక్కుని ఉన్నారు. వీరు వింతగా ప్రవర్తించడం మొదలెట్టే నలభై సెకన్ల ముందు ‘సిటీలో అల్లర్లు – లేటెస్ట్’ అని దాదాపుగా 99.12% మంది సెర్చ్ చేశారు’ అని సర్చ్ అనాలిసిస్ టీమ్ నుంచి కబురొచ్చింది.

‘సిటీలో అల్లర్లు – లేటెస్ట్’ అని సర్చ్ చేసినవారికి ‘బ్రేకింగ్ న్యూస్’ అని ఒక లింక్ కనిపించింది, వికీపీడియా నుంచి. దాని మీద క్లిక్ చేస్తే వర్చువల్ రియాలిటీ అద్దాలు పెట్టుకోమని సూచించింది. అద్దాలు పెట్టుకోగానే ‘మీరు చూడబోతున్నది ఒక విధ్వంసకర, హింసాయుత వార్త. ముందుకు వెళ్ళదలచుకున్నారా?’ అని అడిగింది. ‘అవును’ అనగానే ఒక కృత్రిమ సంఘటనా స్థలం వారికి కనిపించింది. ఎర్రని మంటలు, నల్లని పొగలు, రేగుతున్న దుమ్ము, చెల్లాచెదురుగా పరిగెత్తుతున్న జనం అన్నీ కళ్ళముందు ప్రత్యక్షమయ్యాయి. నినాదాలు, ఆర్తనాదాలు, పొలికేకలు, గన్ షాట్స్, రాళ్ళదెబ్బలకి పగులుతున్న అద్దాలు అన్నీ చెవుల్లో నిండిపోయాయి.

జరుగుతున్నదేంటో అర్థమవ్వగానే, వెంటనే ‘ఆంటీ నేషనల్ ఆక్టివిటీస్ సర్వయిలెన్స్ ఆక్ట్’ కింద ఇళ్ళల్లో, హోటళ్ళల్లో, బిల్డింగుల్లో, మాల్స్‌లో ఉన్న ఫుటేజ్ బైటకు తీశారు నాస్టీ కంపెనీ అధికారులు. వీధుల్లోనే కాదు, ఇళ్ళల్లో బిల్డింగుల్లో ఉన్నవారిదీ అదే పరిస్థితని, వాళ్ళూ సర్చ్ చేసినాక వి. ఆర్. అద్దాలు పెట్టుకుని వింతగా ప్రవర్తిస్తున్నారని తేలింది.

యంత్రాంగం రంగంలోకి దూకింది. ముందుగా సిటీ అల్లర్ల గురించి సర్చ్ చేస్తున్నవారికి ‘బ్రేకింగ్ న్యూస్’ లింక్ కనిపించకుండా చేశారు. వి.ఆర్. అద్దాల ద్వారా కనిపిస్తున్న కృత్రిమ వాతావరణాన్ని డిసేబుల్ చేసి, బ్లాంక్ సిగ్నల్ పంపించడానికి కొంత సమయం పట్టింది.

మరో పావుగంటకి వీధుల్లోనూ, బిల్డింగుల్లోనూ పరిస్థితి కుదుటపడింది. వి. ఆర్. అద్దాల్లో తెల్లని తెలుపు తప్ప మరేమీ కనిపించలేదు. ‘ఎక్కడివారు అక్కడే ఉండండి, కదిలితే కాల్చివేత’ అన్న ఆదేశం మాత్రం అందరికీ చేరింది, అద్దాలు పెట్టుకున్నవాళ్ళకీ, పెట్టుకోనివాళ్ళకీ.

ఎవరూ కదలలేదు. వాహనాలన్నీ ఆగిపోయాయి. వాహనాల్లో ఉన్నవాళ్ళందరూ తల వంచుకుని, తల మీద చేతులు పెట్టుకుని కూర్చున్నారు. దారినపోయేవారు ఎక్కడంటే అక్కడ మోకాళ్ళపై కూర్చుండిపోయారు.

ఆంబులెన్సులు వచ్చి చనిపోయినవారిని, క్షతగాత్రులని, మానసికంగా దెబ్బతిన్నవారినీ తీసుకెళ్ళాయి.

ప్రపంచంలోనే కనీవినీ ఎరుగని దాడి కాబట్టి వెంటనే ప్రభుత్వం ఒక హై-కమీషన్‌ని నియమించింది. దాని విచారణలో దేశపు శాంతిభద్రతలను విచ్ఛిన్నం చేయడానికి ఉద్దేశించిన ఈ పుకారు వికిపీడీయా నుంచి వెలువడిందని, జరిగిన సంఘటనల ద్వారా స్పష్టమయింది.

తన వంతుగా వికీపీడియా ఈ వివరణ ఇలా ఇచ్చుకుంది:

ఎన్నికల నేపథ్యంలో వేడెక్కుతున్న రాజకీయ వాతావరణం, వినిపిస్తున్న మాటలు యుద్ధాన్ని బట్టి త్వరలోనే అల్లర్లు జరుగబోతున్నాయని మా సిస్టమ్ అంచనా వేసి ఒక టెంప్లేట్ సిద్ధం చేసుకుంది.

____దేశంలోని ____ నగరం/టౌను/ఊరులో _____ రోజున, _____ సమయంలో అల్లర్లు చెలరేగాయి. నగరం/టౌను/ఊరులోని _______ ప్రదేశంలో, _______ అనే వర్గానికి చెందిన _____ అనే వ్యక్తిని నరికి/పొడిచి/కాల్చి/కొట్టీ/ఇంకేమన్నా ఒక గుర్తుతెలియని చంపారు. ఆ హంతకుడి _______ వర్గానికి చెందిన మనిషిగా అనుమానించి, మృతుని వర్గంవారు హంతకుని వర్గంతో ఘర్షణలకు దిగారు…

ఈ ఘర్షణలకి ముందు ______ రాజకీయనాయకుడు/సంఘం అధ్యక్షుడు/భావజాలానికి ప్రతినిధి _______ వర్గం గురించి చేసిన కొన్ని తీవ్రమైన, వివాదాస్పదమైన వ్యాఖ్యలను నిరసిస్తూ _____ వర్గం వారు చేపట్టిన ర్యాలీలో…

నిజంగా సంఘటన జరిగిన తర్వాతే, ఆ వివరాలు నింపుకుని బయటకు వెళ్ళాల్సిన ఈ టెంప్లేట్ ఘటనలేవీ జరగక్కుండానే బయటకు వెళ్ళింది. అది మా సిస్టమ్‌లో సాంకేతిక తప్పిదం కావచ్చు. మా వంతు చర్యగా టెంప్లేట్ క్రియేట్ చేసిన బాట్‌ని టర్మినేట్ చేస్తున్నాం. అయితే, పొరపాటుగా బయటకెళ్ళినా కూడా ఒకే కథనం వెళ్ళుండాలి. అలా కాకుండా కేవలం కొన్ని క్షణాల వ్యవధిలోనే లక్షలాది కథనాలు, వేర్వేరు వివరాలతో, ఎలా తయారయ్యాయో మాకు తెలీదు. అంతటి సామర్థ్యం మా సిస్టమ్స్‌కి లేదు.

విచారణ కమిటీ సిఫార్సు మేరకు ఇకనుంచీ వికిపీడియాలో వ్యాసాలని సమీకరించి క్రోడీకరించే పద్ధతిని, దేశపు శాంతిభద్రతల రక్షణ దృష్ట్యా నాస్టీ పరిధిలోకి తేవడం కోసం చట్టంలో తగుమార్పులు మళ్ళీ పదవిలోకి రాగానే తక్షణమే చేస్తామని ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చింది.

సంఘటన జరగకముందే వార్తలు వెలువడితే ఎలా? ఏదో తప్పిదం వల్ల పుకారులని వార్తలనుకున్నా, అందరికీ ఒకే సమాచారం వెళ్ళకుండా, అసంఖ్యాకమైన విద్వేషపూరిత కథనాలు ఎలా తయారయ్యాయి, అదీ అంత తక్కువ వ్యవధిలో? వికిపీడియా అంతటి సామర్థ్యం తనకి లేదంటోంది… మరి ఎవరికుంది? ఇదో సైబర్ దాడా? సైబర్ దాడి అయితే అది వికీపీడియాని ఉద్దేశించిన దాడా, లేక దేశంపై జరిగిన అటాక్‌లో వికీని పావులా వాడుకున్నారా? లేక రాజకీయ లబ్ది కోసం మన నాయకులే చేయించారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు అవసరమని ఆల్ట్-వెబ్‌లో స్వతంత్ర సంస్థలు, విశ్లేషకులు మొత్తుకుంటున్నా విచారణ సాగవలసినట్టే సాగి ముగిసింది.

‘అక్టోబర్ ఘటనలో మీరే బాధితులు. ఈ దేశంలో అందరికన్నా ఎక్కువ అన్యాయానికీ, వివక్షకీ గురవుతుంది మీరే, మిమ్మల్ని ఆదుకోగలిగేది మేమే, మమల్ని గెలిపించండి’ అన్న కథనంతో అఆఇఈలు మొదలుకుని కచటతపలు, గజడదబల నుంచి శసషహలు, యరలవల వరకూ అన్ని వర్గాల, మతాల, ప్రాంతాల, భాషల ప్రజలని నాయకులు, మీడియా ఊదరగొడుతూనే ఉన్నారు మరోవైపు ఎన్నికల వేడిలో.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s