ఆటోమొబైల్ సంబంధిత కథలతో వచ్చిన సంకలనం “తీయండ్రా బండ్లు”లో నేను రాసిన “రూ.16/కి.మీ” అనే కథను కూడా చేర్చడం నాకెంతో సంతోషాన్ని కలిగించిన విషయం. కారణాలు కొన్ని:
- ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన కథలు అని తెలియగానే నేను అసలు ఒకటి రాశానని కూడా గుర్తులేదు. సంకలనకర్తలైన విమల గారే గుర్తుచేశారు. రమణ గారు చేసే కథల రివ్యూల ద్వారా తెలిసిందన్నారు.
- ఇట్లా కొంచెం off-beat topic మీద పనిచేయాలనుకుంటున్నప్పుడు అసలు ఎన్ని వచ్చుంటాయి తెలుగులో అన్న మొదట అనుమానం వస్తుంది. దాదాపు నలభై కథలు 231 పేజీలతో పుస్తకాన్ని తీసుకొచ్చారు. అయినా కూడా వెల 100/- మాత్రమే ఉంచగలిగారు.
- ఈ పుస్తకావిష్కరణ విశాఖపట్టణంలో ఏప్రిల్ 2022లో జరిగింది. ఆవిష్కరణ సభకి రవణా సంస్థకు సంబంధించిన ప్రముఖులు వచ్చారు. తొలి ప్రతిని ఆటో డ్రైవర్ యూనియన్ ప్రెసిడెంటుకి ఇచ్చారు. ఇవ్వన్నీ తెలుగులో రచయితలకు ఎప్పుడో గానీ ఎదురవ్వని అనుభవాలు.
ఎన్నో రాస్తుంటాం గానీ, అతి తక్కువ సందర్భాల్లోనే అవి చేరాల్సిన చోటుకి చేరాయనిపిస్తుంది. ఈ పుస్తకానికి పబ్బుల్లో హడావిడి, సెలబ్రిటీల సందడి ఉండకపోవచ్చు కానీ, నాకు బోలెడు సంతృప్తిని ఇచ్చింది.
అసలంటూ కథలు రాసుంటే ఏదో నాటికి సరైన పాఠకులకి కూడా చేరుతుంది కదా! నేను అనువాదాల పనిలో పడి కథలు రాయడం అశ్రద్ధ చేస్తున్నాను. దాని మీద ధ్యాస పెట్టాలని కూడా గుర్తు చేసిందీ పుస్తకం.
కొన్ని ఫోటోలు:






