Title: Hadinetayena Aksharekha
Original: Pathinettavathu Ashtakkodu
Original Language: Tamil
Author: AsokaMitran
Genre: Novel
Translated to: Kannada
Translator: Seshanarayana
Translation Published by: National Book Trust of India, 1994
అదే ఇల్లు. అవే చెట్లు. అదే చర్చ్. అదే శ్మశానం.
ఆ దృశ్యం ఇంగ్లాండులోని గ్రామ ప్రదేశాన్ని చిత్రంగా మార్చి తూచినట్టుంది. గ్రామప్రదేశ దృశ్యమంటే విశాలమైన నేలపై విడివిడిగా రెండు మూడు కట్టడాలు, పొలాలు, ఖాళీ జాగా, కాలువ, దూరంగా కొండల వరుస, ఒక కుక్క, ఒక ఆవు ఉండే తీరాలి. మానవ మాత్రుడు మాత్రం కంటికి కనిపించకూడదు. ఈ సమయంలో బారక్స్ నూ, తననీ చేర్చి ఒక చిత్రం గీస్తే అది గ్రామప్రదేశమే అన్నట్టుగా అనిపిస్తుంది.
page 69
పై పేరాలోని బారక్స్ అనేది సికింద్రాబాదులో ఉన్న “లాన్సర్ బారక్స్” (Lancer Barracks) అనే రైల్వే ఉద్యోగుల కాలనీ. 1940ల చివరిలో హైదరాబాదు భారతంలో ఇంకా వీలినం కాని సమయంలో నిజాం రైల్వేలో తండ్రి ఉద్యోగం ఉండడంతో సికిందరాబాద్‍కు వలస వచ్చిన తమిళ కుటుంబంలోని కాలేజీ కుర్రవాడు చెప్పే కథే ప్రముఖ తమిళ రచయిత ఆశోక్ మిత్రన్ రాసిన ఈ నవల.
పై పేరాలో మాటలనుకుంటున్నది చంద్రశేఖర్ అనే కాలేజీ కుర్రాడు. చదువు, కర్ణాటక సంగీతం, క్రికెట్ అతని లోకం. ఒక కొత్త ఊరికి మకాం మార్చి ఏళ్ళ తరబడి ఉన్నా కూడా తమ భాషని, ఆహారపు అలవాట్లని, సంస్కృతి ఏ మాత్రం మర్చిపోకుండా, అలా అని అందరికీ దూరంగా అంటీముట్టనట్టుగా కాకుండా అవసరమైనంత మేరకు ప్రాంతీయ భాష నేర్చుకుని అక్కడివారితో మసలుకుని స్నేహాలు ఏర్పర్చుకునే వలస కుటుంబాలు ఎదుర్కునే సాధకబాధకాలన్నీ అతని కుటుంబమూ ఎదుర్కుంటుంది. దానికి తోడు సామాన్యుని ప్రమేయం లేకుండా జరిగే చారిత్రిక రాజకీయ పరిణామాలు సూటిగా బాధించేది సామాన్యులనే. హైదరాబాదుని భారతదేశంలో విలీనం చేసే క్రమంలో జరిగిన హింసకూ వీరే ప్రత్యక్ష సాక్షులు. బాధితులు.
*****
నవల పేరుకి అర్థం Eighteenth Axis/Parallel. హైదరాబాదు/సికిందరాబాదు భౌగోళికంగా ఆ ఆక్సిస్ దగ్గర ఉంటాయి కాబట్టి దాన్నే పేరుగా ఎన్నుకున్నారు రచయిత. నవల మొదలుకాక ముందే హైదరాబాద్ నిజాం పాలనకి సంబంధించిన ఒక జానపద కథ కూడా పంచుకున్నారు.
రచయిత కూడా ప్రధాన పాత్ర “చంద్రశేఖర్”లాగానే తమిళుడైనా సికింద్రాబాద్‍లో పుట్టి పెరిగిన మనిషి. ఇది ఆత్మకథాత్మక నవలని అనుకోవచ్చు. కానీ రచయిత ఇరవై ఏళ్ళ వయసులో సికింద్రాబాదు నుంచి మద్రాసుకి మకాం మారి, మరెన్నో ఏళ్ళ తర్వాత, తనకి 15-18 వయసున్నప్పటి అనుభవాలను పూస గుచ్చినట్టు నవలగా రాయడం ఒక విశేషం. అదీ అశోక్‍మిత్రన్ శైలిలో రాయడం మరో అద్భుతం.
భారత విభజనను కానీ, హైదరాబాదు, కశ్మీర్ విలీనాలను కానీ హిందూ-ముస్లిమ్ దృష్టికోణంతో చూస్తుంటాం. అయితే ఆ ఘటనలు జరిగినప్పుడు వాటిని చూసినవారిలో, అనుభవించినవారిలో ఇంకెందరెందరో ఉన్నారు. హైదరాబాదుకి వలస వచ్చిన తమిళులు ఎటూ నగరంలో outsiders/బయటివారుగానే పరిగణించబడతారు కాబట్టి (భాష రాకపోవడం, ఆచారవ్యవహారాల్లో తేడాలుండడం వల్ల) వారిది హైదరాబాదు విలీనం ఘటనాక్రమంలో ప్రేక్షక పాత్ర అవ్వగలదని నేనూహించలేదు. ఈ నవల ఆ విషయంలో ఒక కనువిప్పు లాంటిదే.
అందుకు ఒక కారణం ప్రధాన పాత్రకి రాజకీయాల్లో ప్రవేశమూ, ఆసక్తీ లేకపోవడం అని అనిపించవచ్చు. అతనికి తెలిసేవన్నీ కొద్దికొద్దిగా ముక్కముక్కల్లోనే తెలుస్తాయి. వాటి నేపథ్యాన్ని అర్థం చేసుకుని, వాటి పర్యవసానాలని ఊహించగలిగేంత సామర్థ్యం అతనికైతే లేదు. అలా అని జరుగుతున్నవాటికి అతీతంగా ఉండగలిగాడా అంటే అదీ లేదు. అతనిపైనా దాడులు జరుగుతాయి, అతనూ రాజకీయ ర్యాలీలలో పాల్గొంటాడు, అతణ్ణి చూసి అవతలి వర్గం వారు దాడి చేస్తాడేమోనని భయపడతారు. అంటే, ఆ లెక్కల్లో అతను హిందువే. కానీ హైదరాబాదు విలీనం కావాలా వద్దా, రజాకారులు మంచివారా దుర్మార్గులా అన్న విషయంపై బలమైన అభిప్రాయాలు లేకపోవడం, ఒకవేళ హైదరాబాదులో ఉండలేకపోతే (ఉండనివ్వకపోతే) మద్రాసుకు వలస పోవచ్చునులే అన్న ఆశ – ఇలాంటి విషయాల్లో అతను తమిళుడనే ఐడెంటిటీలో ఇరుక్కుపోతాడు. ఈ clashes of identity (Hindu identity vs Tamil identity) వల్లనే ఈ నవల ముగింపు అంత బలంగా తాకుతుంది. End of the day, whatever his mental makeup is, he’s a Hindu and he’s a man! He’s reduced to that.
భారతదేశ చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టమైన హైదరాబాదు విలీనాన్ని గురించి విస్తారంగా ఒక నవలను రాయడమే కాకుండా, ఆ నవలని ఒక తమిళుడి (బయటివాడి) దృష్టికోణంలో చెప్పడం వల్ల ఈ రచన అటు చారిత్రక నవలగానూ, ఇటు సైకలాజికల్ నవలగానూ రెండు విధాలా నిలుస్తుందని నాకనిపించింది.
ఇందులో చంద్రశేఖర్ పడే ఆవేదనా, ఆవేశం, తెలీనితనం నేను చదివిన ఇతర టీనేజ్/adolescent నవలలు “కాచర్ ఇన్ ది రై”, “కాఫ్కా ఇన్ ది షోర్”కి ఏ మాత్రం తీసిపోవు. “వేరే భాష మాట్లాడే ఊరిలో ఒక్కడే ఒంటరిగా ఉండడం నాకు అలవాటైపోయింద”న్న వాక్యం నిజంగా పుస్తకమంతా వ్యాపించే ఉంటుంది. ఒంటరితనం, దోస్తులు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవడం, కొత్తవాళ్ళతో కుదరకపోవడం అన్నీ ఉంటాయి. గాంధీ హత్యకు గురయ్యాడని తెలిసి ఎంత చలించిపోతాడో క్రికెట్ జట్టులో ఎంపికయ్యేంత బాగా ఆట ఆడలేనందుకూ అంతే నొచ్చుకుంటాడు. హాస్యం, కోపం, అమాయకత్వం అన్నీ కలగలసి ఉంటాయి.
*****
చదివేశాక పుస్తకం గురించి గూగుల్ చేస్తుంటే ఒక రివ్యూ కనిపించింది. ఈ నవల హైదరాబాదులో పుట్టి పెరిగినవారికి, అక్కడ చాన్నాళ్ళ పాటు ఉన్నవారికి ప్రత్యేకమైన నవల అవుతుందనడంలో సందేహంలో లేదు. అయితే, మనకి తెలిసిన జంటనగరాల విశేషాలన్నీ కథలో భాగమవ్వాలనుకోవడం అత్యాశే.
నిర్మాణపరంగా ఈ కథని ఆసక్తికరంగా third person narrative, first person narrative రెండూ వాడారు. నవలల్లో అలా చాప్టరుకి ఒక PoV వాడ్డం కొత్త కాదు. అయితే ఆశోక్ మిత్రన్ మాత్రం రెండు నరేటివ్స్ లోనూ ప్రధాన పాత్ర పరిధిని దాటి ఏ విషయాలూ చెప్పలేదు. ఉదా: చంద్రశేఖర్‍కు తెలీని రాజకీయ నేపథ్యాలను third person chapters లో విశిదీకరించలేదు. దీనివల్ల చంద్రశేఖర్‍కున్న పరిమితులన్నీ కథలోనూ ఉంటాయి. దాన్ని మైనస్ పాయింట్‍గా పైన ఇచ్చిన రివ్యూలో రాశారు.
నాకు మాత్రం అదే ప్లస్ పాయింట్ అనిపించింది. పైగా ఈ నవల కాచర్ ఇన్ ది రై తో పాటు పోల్చదగ్గదిగా (చారిత్రిక నేపథ్య విషయంలో కాదు, టీనేజర్ కథ విషయంలో) అనిపించింది. నిజానికి, రచయితకు మంచి అవకాశమే ఉంది, ఈ రెండొందల పేజీల నవలని ఐదొందుల పేజీల నవలగా మార్చి మొత్తం నిజాం చరిత్ర, హైదరాబాదు విలీనం గురించి రాసుకుంటూ పోయుంటే. ఆ temptation కి లొంగకుండా కేవలం ఒక కుర్రాడి నేపథ్యం నుంచే కథంతా చెప్పడం మంచి ఎత్తుగడ. బాగా రాశారు కూడా.
*****
ఈ పుస్తకం గురించి గానీ, రచయిత గురించి కానీ ఏమీ తెలుసుకోకుండా మొదలెట్టాను. నాలుకెట్టు కొన్నప్పుడే ఇదీ ఇంటికి వచ్చింది కనుక, సరదాగా తిరగ్గేద్దామని తీశాను. మొదటగా ఆశ్చర్యపరిచిన విషయం ఇది హైదరాబాదుకు సంబంధించిన తమిళ నవల. (నేను దాన్ని కన్నడంలో చదివాను!)
రెండోది, అసలు మొదటి పేజీలోనే “మొయినుద్దౌల్లా కప్” అనే క్రికెట్ టోర్నమెంట్ ప్రస్తావన రావడం. ఏదో మాట వరసుకి ప్రస్తావన అయ్యుంటుందనే లోపు పేజీలకు పేజీలు క్రికెట్ ఆటతోనే కథ ముందుకు నడిపారు. అసలు క్రికెట్ నేపథ్యంతో వచ్చిన నవలలు నేను ఎక్కువ చదవలేకపోయాను. కానీ, ఈ నవల నాకు ఎప్పటికీ గుర్తుండిపోయేది మాత్రం క్రికెట్ వల్లనే. అందునా హైదరాబాదులోని క్రికెట్. అదీ 1948 కాలంలో. నేను విన్నవి, చూసినవి, తెల్సుకున్న క్రికెట్ విషయాలన్నీ ఒక్క ఎత్తు, ఈ ఒక్క నవల ద్వారా నాకు హైద్ క్రికెట్ గురించి తెలిసినవి ఒక ఎత్తు. 1947-48లో భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా టూర్ ని కథలో ఆసక్తికరంగా వాడుకున్నారు. ఇంకా నిజాం పాలనలోనే ఉన్న జంటనగరాలకి భారతీయ వార్తా పత్రికలు ఆలస్యంగా అందేవి. టెస్ట్ మాచ్ వార్తల కోసం ఒకట్రెండు రోజులు వేచి చూడాల్సిన అగత్యం. దీన్ని పొడిగించి ఆసక్తికరమైన కథ రాసుకోవచ్చు.
Ashokmitran is supposedly one of the finest Tamil writers and I’ll give that too, but it is also abundantly clear that he’s an exceptional cricket lover. Oh his silky prose, and to top it, those cricket descriptions. IT’S A FEAST!
ఏ నవలకైనా ఒక మాక్రో (విస్తారంగా చూసే) చూపు, మైక్రో (సూక్ష్మంగా చూసే) చూపు ఉంటాయనుకుంటాను. ఈ నవలలో మాక్రో చూపుని, అంటే జరుగుతున్న రాజకీయ పరిణామాలను, పాఠకులకు అందజేయడానికి రేడియో, వార్తా పత్రికలు, వదంతులు అన్నీ వాడుకున్నారు. అవి కొంత మేరకే కథలో భాగం. అయితే వాటి వల్ల కలిగిన పర్యవసానాలను మాత్రం మైక్రోస్కోపులో పెట్టి చూపించినంత నిశితంగా రాశారు. ఉదా: భారతంలో విలీనంపై ఇంకా నిర్ణయం తీసుకోని సంధికాలంలో జంటనగరాల్లో బియ్యం దొరక్క జొన్నరొట్టెలు తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజూ అన్నం మాత్రమే తినే అలవాటున్న తమిళ కుటుంబాలకి అదెంత కష్టమో ఊహించవచ్చు.
అలానే హైదరాబాదుకి, సికిందరాబాదుకి మధ్యనున్న వ్యత్యాసం, ప్రతీ విషయంలోనూ. భారత విభజన నేపథ్యంలో నాగపూర్ లాంటి నగరాలనుంచి సికింద్రాబాదు స్టేషనుకి వస్తున్న ముస్లిమ్ రెఫ్యూజీలను చూసి “ముస్లిములైనా వాళ్ళు పేదవాళ్ళు” అంటాడు చంద్రశేఖర్. మరో చోట “అందరూ ముస్లిములే అయినా ఎంత తేడా ఒక్కొక్కరికి” అని అనుకుంటాడు. చంద్రశేఖర్ దృష్టే నవల దృష్టి కూడా. ప్రతీదాన్ని పరికించి పరికించి చూసి వ్యాఖ్యానిస్తుంది. ఆఖరికి తెలంగాణ వర్సెస్ ఆంధ్రా డిబేట్ కూడా కనిపిస్తుంది:
“నరసింహా రావుది అందమైన ముఖం. అయితే చర్మం మాత్రం నలుపు రంగు… మంచి సొగసైన ముఖం. గంభీరమైన ముఖం. ఇతనిని ఆంధ్రావాడని అంటే కోపం తెచ్చుకుంటాడు. తెలంగాణావాడేనని అనాలి. తరతరాలుగా ఈ హైదరబాదు సంస్థానంలోనే పుట్టి పెరిగిన కుటుంబానికి చెందిన వాడు. ఇతని ఇంట్లో సగం రోజు ఉర్దూనే మాట్లాడుకుంటారు. “
అశోక్‍మిత్రన్ వచనంలో మాత్రం, నేను చదివింది కన్నడ అనువాదమే అయినా, ఒక గొప్ప సొగసు ఉందని అర్థమైంది. చమత్కారమూ ఉంటుంది, సరళత్వమూ ఉంటుందా వాక్యంలో. అక్కడక్కడ కన్నడంతో కుస్తీ పడలేక ఆంగ్లానువాదం చదివేద్దామనుకున్నాను కానీ మళ్ళీ ఆ వాక్య నిర్మాణం కోసమే మొత్తం కన్నడలోనే చదివాను. అనువాదం చాలా మట్టుకు బాగుందనిపించింది. తమిళంలో పేర్లు మారిపోయినప్పుడు (ఉదా: అదిలాబాద్ అడిలాబాడ్ అయ్యాక) అలానే ఉంచేశారు.
Cosmopolitan నగరంలో జరిగిన కథ కాబట్టి ఉర్దూ, తమిళం, తెలుగు అన్నీ కనిపిస్తాయి డైలాగుల్లో. భాషల మధ్య ఉండే frictionని కూడా బా హైలైట్ చేశారు. ముఖ్యంగా అప్పటి నిజాం పరిపాలనలో ఉర్దూకే పెద్ద పీట కదా!
*****
తోబుట్టువుల్లో ఎవరో ఒకరికి బాగా పేరు వచ్చి ఇంకొకరి గురించి పెద్దగా తెలీకపోవడం జరుగుతుంటుంది. హైదరాబాద్/సికిందరాబాద్ అలాంటి తోబుట్టువులే. మధ్యన హుస్సేన్ సాగర్ ఉందనే కాదు, అన్ని విషయాల్లో ఈ రెండు నగరాలకు చాలా వ్యత్యాసం. అయినా సికింద్రాబాద్ ప్రస్తావన తక్కువగా వినిపిస్తుంటుంది. బయటివారికైతే ఈ రెండూ ఒకటే మహానగరం, సికింద్రాబాద్ ఒక ప్రాంతం పేరు అంతే అన్నట్టుంటుంది. నాకు కూడా ఈ రెండూ అంత వేర్వేరు ఏమీ కావు. అయినా, చార్మినార్ పూరానాపూల్ లక్డీకాపూల్ వీటి గురించి చదువుకున్నదానికి కన్నా మోండా మార్కెట్, సికింద్రాబాద్ స్టేషన్ లాంటి ప్రదేశాల గురించి చదువుకోవడం బాగనిపించింది. ఇంతటి ప్రత్యేకమైన నగరానికి ఒక నవలలో, తద్వారా సాహిత్యంలో ఇంతటి ప్రత్యేకమైన స్థానం దొరికినందుకు నాకు చెప్పలేనంత ఆనందం.