ఆత్మపరిశీలనకు పరిచిన దారులు, సత్యవతి కథలు

Posted by

తొలి ప్రచురణ: వివిధ, ఆంధ్రజ్యోతి. 20.12.2021

పోయినేడాది ఒక రోజు, రాత్రి పదకొండింటికి ఒక ఫ్రెండ్ మెసేజ్ చేస్తే “ఆఫీస్ పనిలో ఉన్నాను. మళ్ళీ మాట్లాడతాను” అని రిప్లై ఇచ్చాను. వెంటనే అవతలి నుంచి హెచ్చరిక: “నువ్విలా పగలనకా, రాత్రనకా ఆఫీస్ అలుకుతూ కూర్చుంటే అయినట్టే… జాగ్రత్త!”

ఆ ముందు వారమే పి.సత్యవతి రాసిన “ఇల్లలకగానే పండగౌనా?” అనే కథ కలిసి చదువుకున్నాం. కథలో ఒక చదువుకున్న గృహిణి, ఇంటి చాకరిలో పడి అస్తిత్వంలో కీలకమైన తన పేరునే మర్చిపోతుంది. జీవితంలో ఆమె నిర్వహించే పాత్రలు, నిభాయించే బాధ్యతలు ఆమెకి ఎప్పటికప్పుడు నామకరణాలు చేస్తూ పోతుంటే, వాటిని తోసిపుచ్చుతూ తనకి పెట్టిన పేరేంటో వెతుక్కోడమే ఆమె “హీరోస్ జర్నీ”. నిజానికి, ఆ గృహిణికి, గృహిణి-కాని-నాకూ పోలికలు లేవనిపిస్తాయి. అయినా నా ఫ్రెండ్ ఆ కథలోని మెటఫర్‍నే నాకు అన్వయించగలిగింది. ఉత్తమ ఇల్లాలు లాంటి పితృస్వామ్య పొగడ్తల వలలో ఆ గృహిణిని తన పేరు, చదువుసంధ్యలూ అన్నీ మర్చిపోయినట్టే, కాపిటలిజం ఎరలో బెస్ట్ ఎంప్లాయీ/గో-గెట్టర్ బిరుదుల్లో పడి నేనూ నాకు ముఖ్యమైనవేవో మర్చిపోతున్నాన్న స్పృహ కలిగించగలిగింది. 

ప్రతినిత్యపు స్పృహ

సత్యవతిగారి కథలన్నీ మౌలికంగా లేవదీసే ప్రశ్న ఒకటేనని నాకనిపిస్తుంది:  స్త్రీగా మసలుకునే నీ విధానంలో నీ సహజసిద్ధ నైజమెంత, నేరుగానో పరోక్షంగానో వ్యవస్థ రుద్దుడెంత? 

ఈ ప్రశ్నకు సమాధానం దొరకబుచ్చుకోవడానికి చాలా unpacking అవసరం. స్త్రీగా పుట్టిననాటి నుంచీ ఇది-చేయకూడదు, ఇలానే-ఉండాలనే ఎన్నో ఆంక్షలు-ఆక్షేపణలు వినీ వినీ, అవి వ్యక్తిత్వంలో అంతర్భాగమైపోయాక, వ్యక్తిగత బాగోగులూ ఇష్టాయిష్టాల స్పృహ కోల్పోయాక తలకెత్తుకున్న భారంలో సమంజసమైనదెంత, అవసరం లేనిదెంతన్న విచక్షణ కూడా మిగలదు. సత్యవతిగారి శైలి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు గానీ, వాస్తవికతతో సాగే కథనమైనా(మాఘ సూర్యకాంతి), అబ్బురపరిచే అధివాస్తవికత కథానిర్మాణమైనా (సూపర్ మామ్ సిండ్రోమ్), ఆ కథలు నన్ను నిలదీస్తూనే ఉంటాయి: “ఏదమ్మా నీ విచక్షణ? ఏ జమ్మి చెట్టుపైన నీ బుద్ధిని, ఆత్మగౌరవాన్నీ మూటకట్టి పెట్టొచ్చి, ఎవరు విధించిన అజ్ఞాతవాసంలో బతుకుతున్నావ్?” 

18వ శతాబ్దానికి చెందిన మేరీ వొల్స్టోన్‍క్రాఫ్ట్ (Mary Wollstonecraft), “I do not wish women to have power over men; but over themselves.” (ఆడవారికి మగవారి మీద అధికారం ఉండాలని కోరుకోను, వాళ్ళ మీద వాళ్ళకుండాలి.) అన్న మాటల భావమే సత్యవతిగారి కథల్లో ప్రతిధ్వనిస్తుంటాయి. 

ఆగ్రహావేశాలు – పలు రకాలు 

“Activism is my rent for living on the planet.”― Alice Walker 

 (ఈ గ్రహం మీద బతకడానికి నేను కట్టే అద్దె – ఆక్టివిజమ్: ఆలిస్ వాకర్)

ఉద్యమానికి సాహిత్యానికి విడదీయలేని బంధమే ఉంది. ప్రపంచమంతటా ఉన్నా, మన తెలుగులో మరింత బలంగా ఉంది. ఉపన్యాసాలు, విమర్శనాత్మక వ్యాసాల్లోనే కాదు కథల్లో, నవలల్లో కూడా నమ్మిన నిజాన్ని బల్ల గుద్ది చెప్పడం, ప్రతికూలాంశాలని దుయ్యబట్టడం చూస్తూనే ఉంటాం. ఆ ఆగ్రహావేశాల వేడిసెగలకి తాళ్ళలేనివారు తీసిపారేయడాలు, వెక్కిరింతలూ ఎన్ని ఎదురైనా ఇలాంటి ముక్కు-మీద-కొట్టినట్టుండే వ్యక్తీకరణలకూ సాహిత్యంలో అవసరమనిపిస్తుంది నాకు.   

సత్యవతిగారి కథల్లో నేరుగా ఇలాంటి ఆగ్రహావేశాలు కనిపించవు. “నా ఇష్టమొచ్చినట్టు చేసుకుంటా, దిక్కున్నచోట చెప్పుకో పో” అని ఏ పాత్రలూ ఆవేశపడవు. పాత్రలు ఫలానా చేయవచ్చా (ఉదా: పెళ్ళై పిల్లలున్న తల్లి వాళ్ళని వదిలి వెళ్ళిపోవచ్చా?) అన్న వాదోపవాదాలూ ఉండవు. ఇలా ఉండకపోవడం వల్లే ఆవిడ కథలు చాలా నచ్చుతాయని పాఠకులు అంటుంటారు. అయితే, కాస్త లోతుగా తరచిచూస్తే ఆ కథల్లో కూడా ఆగ్రహావేశాలు బలంగా కనిపిస్తాయన్నది నా ప్రతిపాదన. 

టోనీ మోరిసన్ రాసిన “స్వీట్‍నెస్” కథ ఉంది. కొంచెం సంక్లిష్టమైన కథ. నల్లజాతీయులపై వివక్ష నేపథ్యంలో నడిచే కథే అయినా ప్రధానంగా తల్లీకూతుర్ల మధ్య అంతరాన్ని తెలియజెప్తుంది. కథ పూర్తికాగానే తల్లికి కూతురంటే ఈర్ష్య, అపనమ్మకం అనే భావన కూడా కలగచ్చు. కథని ఇంకా క్షుణ్ణంగా చదివినప్పుడు మాత్రం, రెండు తరాల కాలంలో నల్లజాతీయులపై వివక్ష మారిన క్రమాన్ని వర్ణించడంలో, అది బంధాలపై వేసే దారుణ ప్రభావాలని చూపే విధానంలో టోనీ మోరిసన్ వ్యక్తం చేస్తుంది అచ్చమైన ఆక్రోశమే! (ఇంగ్లీష్‍లో, indignation) 

సత్యవతిగారి కథల్లో కూడా నాకు అలాంటి అచ్చమైన ఆగ్రహావేశాలు, ఆందోళనాక్రోశాలే కనిపిస్తుంటాయి. అవి పాత్రల ప్రతిక్రియల్లో కొద్దిపాటిగానే కనిపించచ్చు. నరేటర్ భారీ లెక్చర్లు ఇవ్వకపోవచ్చు. అయినా ధిక్కార స్వరం, తిరుగుబాటు వీటిల్లోనూ ఉన్నాయి. 

ఇంకొకరికి జరిగిన అన్యాయం కోసం రోడ్డెక్కి కాండిల్స్/పోస్టర్లు పట్టుకుని గొంతు కలపడానికి ఎంత అవగాహన, తెగువ కావాలో, అది ఆక్టివిజమ్ ఎలా అనిపించుకుంటుందో, ఒక వ్యక్తిగా నా శరీరాన్ని, మనసూ కుళ్ళబొడిచే (exploit చేసే) వేటినైనా తిరస్కరించడానికీ అంతకన్నా ఎక్కువ తెగువ కావాలి (ఎందుకంటే, పక్కన నిలబడ్డానికి, గొంతు కలపడానికి ఇక్కడ ఇంకెవ్వరూ ఉండరు), ఇదీ ఆక్టివిజమేనని నేను నమ్ముతాను. అందుకే, “దమయంతి కూతురు” కథలో తల్లి నిర్ణయాన్ని అర్థంచేసుకోమని చెల్లికి నచ్చజెప్పే కొడుకులోని ఉదారతకన్నా, తల్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా లోకం వాడే వ్యవహారిక భాషను (“లేచిపోయింది”,“తల్లిలేని పిల్ల”) ధిక్కరించే కూతురు గొంతే నాకు ఆదర్శం, ఆచరణీయం. 

అవగాహన – ఆవేశం – క్రాఫ్ట్

తెలుగునాట క్రాఫ్ట్/శైలి అనగానే అదేదో పైపైన తగిలించుకునే (అవసరంలేని) అలంకరణ (embellishment) అన్న అభిప్రాయం బలంగా ఉంది గానీ, సత్యవతిగారి కథలు చదివితే క్రాఫ్ట్ మాత్రమే చేయగలిగే పని తెలిసివస్తుంది. సాహిత్యాన్ని, సమాజాన్ని చదవడం వల్ల తనలో కలిగిన ఆగ్రహావేశాలని, అసహనాన్ని ఆవిడ పాఠకులకి అతిశయం/చమత్కారం అనే పాకేజింగ్‍లో అందిస్తారు. బాగా ప్రాచుర్యంలో ఉన్న పిట్టకథలకి, ప్రతీకలకి, పదబంధాలకి కొత్త స్పిన్ ఇస్తారు. వాటిని సరిగ్గా unpack చేయగలిగి చదివేవారికీ కలిగేవి ఆ ఆగ్రహావేశాలే, అసహనమే! 

ఆవిడ రాసిన కథలు ఎటూ మాస్టర్‍క్లాసులే. ఆవిడ రైటింగ్ కెరీర్ గ్రాఫ్ చూసినా అంతే స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఫిక్షన్ రాయడానికి సాహిత్యాన్ని చదవడమెంత అవసరమో, సమాజాన్ని చదవడం అంతే అవసరమన్న నా నమ్మకాన్ని ఆవిడ డెమాన్‍స్ట్రేట్ చేస్తూనే ఉన్నారు. 

 సత్యవతిగారు చిన్నప్పటి నుంచీ ఇటు తెలుగు సాహిత్యాన్ని, అటు ఇంగ్లీష్ ద్వారా ప్రపంచ సాహిత్యాన్ని చదువుకున్నారు, చదువుకుంటున్నారు. భూమిక పత్రిక కోసం రాసిన “రాగం-భూపాలం”లో  ప్రపంచ సాహిత్యాన్ని, ముఖ్యంగా ఫెమినిస్ట్ సాహిత్యాన్ని విశ్లేషించారు. చుగ్తాయి కథలు, హిజ్రా ఒక ఆత్మకథ లాంటి ఎన్నో అనువాదాలు తెలుగువారికి అందించారు. కేంద్ర సాహిత్య అకేడమీ అవార్డు అందుకున్నారు. 

తన చుట్టూ ఉన్న మనుషులని నిశితంగా పరికించి పరిశీలించి కథలు రాస్తుంటానని చెప్తుంటారు. ఆ సునిశిత దృష్టి వల్లే పితృస్వామ్యంతో కలిసి పెట్టుబడిదారి, వినిమయ సంస్కృతులు తెలుగు ఆడవారిపై పన్నుతున్న ఉచ్చును కేవలం జెండర్ లెన్స్ (ఆడా, మగా) మాత్రమే కాకుండా, క్లాస్ లెన్స్ (ఎగువ,దిగువ తరగతుల) కూడా తీసుకుని చూపించగలిగారు. 

తరతరాల చరితం 

తెలుగు సాహిత్యంలో చేసిన విశేష కృషికి గానూ సత్యవతిగారికి ’కువెంపు నేషనల్ అవార్డ్ – 2021’ గత వారం ప్రకటించారు. అవార్డుకి ఎన్నుకోడానికి కారణాలు చెప్తూ జ్యూరీ అన్న మాటలు: “తన కథల ద్వారా మూడు తరాల పాఠకుల మీద ప్రభావం చూపిన అతి కొద్దిమంది రచయితల్లో సత్యవతి ఒకరు. ప్రతిభావంతంగా, వాస్తవికంగా సమాజంలోని స్త్రీ పాత్రల చిత్రించడంలో కృష్ణా సోబ్తీ(హిందీ), అమృతా ప్రీతమ్(పంజాబీ), మన్ను భండారీ (హిందీ) సరసన నిలిచే రచయిత.”

వారు ఉదహరించిన పేర్లతో పాటుగా ఉర్దూ రచయిత ఇస్మత్ చుగ్తాయి నుంచి ప్రస్తుత కాలపు మలయాళీ రచయిత కె.ఆర్ మీరా వరకూ కొద్దో గొప్పో సాహిత్యాన్ని చదివిన వ్యక్తిగా, నాకు సత్యవతిగారి రచనలు అపురూపం. వివక్షకి, దోపిడికి, అరాచకానికి గురైన ఏ వర్గం వారిలోనైనా పీడిత భావన (victimhood) కనిపిస్తుంది. “నీకే ఇక్కడ అన్యాయం జరుగుతుంది” అన్న స్పృహ కలిగిస్తూనే “నువ్వే దీన్ని ఎదుర్కోవాలి. ముందు, నువ్వే లేచి నిలబడాలి” అన్న స్ఫూర్తినీ కలిగించడం, అది కూడా ఎప్పటికీ మర్చిపోలేని తమాషా మెటఫర్లలో పొట్లం కట్టి ఇవ్వడం ఆవిడ విలక్షణత.

మొదటిసారి ఈ కథలు చదివినప్పుడు, వివక్షకు గురవుతున్న ఆడవారి మీదే బాధ్యతనంతా మోపి, వారినే ప్రశ్నించడం ఎంతవరకూ సబబు అని సతమతయ్యాను. ఆ తర్వాతే అర్థమైంది, థెరపిస్ట్ రూమ్‍లనుంచి మెంటల్ హెల్త్ పోస్టర్ల నుంచి మీమ్స్ వరకూ “control what you can”, “you can’t pour from an empty cup” చెప్పే మాటలే సత్యవతిగారు ఎప్పుడో చెప్పేశారని.

ఫలానా రచయిత మనకి ఇప్పటికీ “రెలెవంట్” (relevant) అనగానే సాధారణంగా, అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు, పాత్ర స్వభావాలూ/ ప్రతిక్రియలూ మారలేదు, పర్యవసానాలూ అవే, కాబట్టి ఆ రచనకింకా సందర్భశుద్ధి ఉంది, ఇప్పటికీ చదువుకోవచ్చన్న అభిప్రాయం కలుగుతుంది. కానీ నా ఫ్రెండ్ చూపించినట్టు సత్యవతిగారి కథలని మారిన పరిస్థితుల్లో, భిన్నమైన పర్యవసానాలకీ అన్వయించుకోవచ్చు. కథల్లో ఆవిడ చూపెట్టే శైలికి ఎంత మురిసిపోతామో, వ్యవస్థల అణచివేతకి, ప్రలోబాలకి లొంగిపోకుండా వ్యక్తి ఎదురునిలిచి పోరాడగలదని, దానికి కావాల్సినదల్లా కాస్తంత స్పృహ, కాస్తంత నమ్మకమని నొక్కి వక్కాణించే ఆవిడ జీవితపు దృక్కోణానికీ అబ్బురపోగలిగిననాడే ఆవిడను మనం బాగా చదివినట్టు లెక్క.    

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s