అమ్మలు కూడా పలురకాలు.
బిడ్డనెప్పుడూ చీరకొంగునే దాచుకుంటూ, ఆకలి కనిపెట్టుకుంటూ, నిద్రొస్తే జోల పాడుతూ, నోటికొచ్చింది కూస్తే నవ్వేసి ఊరుకుంటూ, దెబ్బ తగిలితే మందేస్తూ, ఇలా కంటికి రెప్పలా చూసుకునే అమ్మలుంటారు.
బిడ్డను ఇంటిలో వదిలి పనికెళ్ళిపోయి, పొద్దున్న ఉడకేసిందేదో వేడి చేసుకుని తినమని చెప్పి, ఏదన్నా అటు ఇటూ కూస్తే చెప్పు చేతిలో పట్టుకుని పరిగెత్తించి, దెబ్బ తగిలితే కన్నీళ్ళు తుడ్చుకుని పైకి లేచే వరకూ వేచి చూసి, భావోద్వేగాలు ఏ మాత్రం చూపించని అమ్మలూ ఉంటారు.
మనలోని భావుకత్వం ఒప్పుకోకపోవచ్చు కానీ, ఇద్దరిలో ఉన్నది మమత. రెండో రకం అమ్మలేవ్వరూ పాషాణ హృదయులు కారు. వాళ్ళకున్న పరిస్థితుల్లో వాళ్ళకి చేతనైనట్టు బిడ్డను సాకుతుంటారు అంతే. వాళ్ళని “జడ్జ్” చేయాల్సిన అవసరం నాకైతే కనిపించదు.
మరి ఎందుకనో తెలుగు సాహిత్యంలో మాత్రం పల్లెటూర్లు vs నగరాలు పోటీ పెట్టినప్పుడు ఆ రెండు రకం అమ్మలకు మల్లే నగరాలు ఓడిపోతూనే ఉంటాయి. నగరాలను నిష్టూరాలాడడం తప్పించి, మహా అయితే వాటిపై జాలి పడ్డం తప్పించి మరో వ్యక్తీకరణే అరుదుగా వినిపిస్తుంటుంది.
నగరాల్లో ఉన్నది యాంత్రికత, కాలుష్యం, అమానుషం మాత్రమే – ఇవ్వన్నీ స్టీరియోటైపులు. పైపై పొరలను దాటుకుని చూడలేనితనం. కళ్ళనిండుగా కనిపించే ఆకాశంలో పక్షుల గుంపు ఎగురుతుంటే ఎంత మనోహరంగా ఉంటుందో, రేకుల ఇంట్లో ఎండ వల్ల వేడి తగ్గడానికి పై కప్పుకి కట్టిన గోనుసంచెలో గూడు కట్టుకుని పిల్లల్ని పొదిగిన పిచ్చుక కూడా అంతే అబ్బురంగా ఉంటుంది. మొదటిది ప్రకృతి అయితే, రెండోదీ ప్రకృతే!
నగరంలో ఉంటున్నంత మాత్రాన ఈ పిచ్చుక ఎగరడం మానదు, కూయడం మానదు, గూడు కట్టడం మానదు, గుడ్లు పెట్టడం మానదు, పొదగడం మానదు, పిల్లలకి ఎగరడం నేర్పించడం మానదు.
నగరం జీవి నైజాన్ని మార్చదు. దాన్ని ఇనుమడింపజేస్తుంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ బతకడం నేర్పిస్తుంది. కిటికీలోంచి వీచినంత గాలిలోనే గుండెల నిండా ఊపిరి తీసుకోవడం, మేడల మధ్య కనిపించే గుప్పెడంత ఆకాశాన్ని చూస్తూ కలలు కనడం నేర్పిస్తుంది.
ఇదీ ఒక అందమే, ఇదీ ఒక అనుభవమే! వాటిని పట్టుకోగలిగే కవులు/కథకులు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. కన్నడ రచయిత జయంత్ కయ్కణి గారు బొంబాయి, బెంగళూరు లాంటి మహానగరాల్లో బడుగు జీవితాల్లోని అందాలను గొప్పగా ఆవిష్కరించగలిగారు. కన్నడ కవి కె.వి. తిరుమలేశ్ గారు హైదరాబాద్ అంశంగా తీసుకుని గొప్ప కవితలు రాశారు. అందులో ఒకటి మచ్చుకి, నా అనువాదంలో…
“ఏంటీ వెధవ ట్రాఫిక్, ఏంటీ చెవిలో రొద” అని ఈసడించుకోవడం ఒక పద్ధతి. ఆ ట్రాఫిక్ గోలలోనూ జీవితాన్ని వెతుక్కోవడం మరో పద్ధతి. నగరంలో జీవించడం వేరు. నగరాన్ని జీవించడం వేరు! To live in a city and To live a city are two entirely different things. I rest my case.

