నాకింట్లోనే భయం వేస్తుంది.. డాడ్!!

Posted by

“హలో.. చెప్పు నాన్న..”

“హలో.. డాడ్, నాకు చాలా దాహం వేస్తుంది, మంచి నీళ్ళు కావాలి తాగటానికి!!”

“ఏ రా కన్నా, మంచినీళ్ళు ఇవ్వాల కూడా రాలేదా? సరే.. ఇప్పుడే ఒక మినిరల్ వాటర్ కాన్ ఇంటికి వచ్చేలా చూస్తాను ఉండు”

“అది కాదు, నీళ్ళున్నాయి. వంటింట్లోకెళ్ళాలి నీళ్ళు తాగాలంటే, నాకు భయం వేస్తుంది. కానీ చాలా దాహమూ వేస్తుంది”

“భయం దేనికి? ఎందుకు?”

“నిన్న సంఘటనా స్థలం అక్కడే కదా!! అందుకే వెళ్ళాలి అంటే భయం. అక్కడింకా ఎమో జరుగుతుందని భయం.”

“సంఘటనా స్థలం ఏంటసలూ? ఆర్ యు ఒ.కె? Relax!! నిన్న ఏం జరిగింది?”

“నిన్న మన వంటింట్లో ఫ్రిజ్ ఉంటుందే, ఆ కిటికీ దగ్గర ఒక పిల్లీ, ఒక ఎలుకా పోట్లాడుకున్నాయి. ఎలుక చాలా ప్రయత్నించింది, కానీ తప్పించుకోలేకపోయింది. పిల్లి దాన్ని పట్టుకు తింటుంటే విలవిలాడింది. ఆఖరున చచ్చిపోయింది. అప్పుడంతా రక్తం బయటకి వచ్చింది. భయంకరంగా ఉండింది.. డాడ్!”

“అంత జరుగుతున్నా నువ్వెందుకు చూశావు? చూస్తే చూశావు, ఇప్పుడింకా ఎందుకు ఆలోచిస్తున్నావు? అది నిన్న జరిగింది, నిన్నే అయ్యిపోయింది. పైగా పిల్లి ఎలుక చంపటం అన్నది ప్రకృతి విధి విధానం. It’s all but natural!!”

“ఊ.. ఎలుక కన్నా పిల్లి పైన ఉంటుంది ఫుడ్ చేన్ లో!! మరి బాంబ్ బ్లాస్టుల్లోనో? అక్కడ ఎవరి మీద ఎవరున్నారు? అదీ నాచురల్ కాదు కదా? మాటి మాటికీ ఎందుకు జరగటం? ఎన్ని సార్లు పునరావృతమవుతుందో కదా? నిన్న జరిగితే ఇవ్వాల మళ్ళీ జరగదు అనటానికి లేదు కదా! పిల్లికి మళ్ళీ ఆకలి వేసి.. మళ్ళీ ఒక ఎలుకను తింటుంటే?”

“నిన్న బాంబ్ బ్లాస్ట్ గురించిన వార్తలు చాలా సేపు చూశావు కదూ? అందుకే ఇన్ని భయాలు, అనుమానాలు. ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో మనకి తెలీదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. మన చుట్టుపక్కల కాస్త గమనించుకుంటూ ఉండడం తప్ప, ఈ పరిస్థితుల్లో మనమేమి చేయలేము. మన ధైర్యాన్ని పరీక్షించడానికే ఈ పనులన్నీ. అందుకని భయపడ కూడదు!”

“ఎందుకు భయం ఉండదు? అమ్మా, నువ్వూ ఇంటికి వస్తారో రారో అని భయం నాకు. ఇప్పుడు ఫ్రెండ్ తో పార్క్ కి వెళ్తే నేను తిరిగి వస్తానో లేదో అని భయం మీకు. క్రికెట్ మాచ్ కెళ్ళినా, నా ఫేవరట్ బాగా ఆడుతున్నా, అక్కడేదో జరిగిపోతుందని భయం. సినిమా చూస్తున్నంత సేపూ, బయట ఏమైపోతుందో అని భయం. నాకు ఇల్లంటేనే భయం వేస్తుంది. నా సిటీ అంటేనే భయం వేస్తుంది. నాకింకా దాహం వేస్తుంది.. మంచి నీళ్ళు కావాలి!!”

“నే ఇంటికొచ్చాక మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి, కిందున్న సూపర్ మార్కెట్ కి ఫోన్ చేసి, బాటిల్ తెచ్చి ఇవ్వమను.”

“స్టాక్ లేదట, గంట ఆగమన్నాడు”

“ఓహ్.. పక్కింటి వాళ్ళని అడుగు నీళ్ళు, అప్పుడు నువ్వు కిచన్ లో కి వెళ్ళక్కరలేదు.”

“తెలపు తెరిస్తే, పిల్లి వచ్చేస్తుందని భయం. నాకిప్పుడు పిల్లిని చూస్తే హడల్!! ఇక పక్కింటి ఆంటీ, అన్నీ ప్రశ్నలే వేస్తుంది. మీ ఇంట్లో నీళ్ళెందుకు లేవు? అవీ, ఇవీ అన్నీ అడుగుతుంది”

“చెప్పు, నాకు భయం అని..”

“అలా ఎలా చెప్తా? అందరూ నన్ను “డేరింగ్ ఆండ్ డాషింగ్ గాళ్” అంటారు. ఇప్పుడు నే వెళ్ళి ఇలా అని చెప్తే, అందరూ నన్ను గేళి చేస్తారు. నేను చెప్పను. నేను అడగను. కానీ నాకు నీళ్ళు కావాలి.”

“హమ్మ్.. ధైర్యం అంటే ఏమిటో చెప్పు..”

“భయం లేకపోవటం…”

“కాదు, భయాన్ని జయించటం. అది కాకపోతే, భయాన్ని గెలవన్నివ్వకపోతే, అదీ ధైర్యం అంటే!! Absence of fear is not courage. నిన్ను దొలిచేస్తున్న భయాన్ని నీ దగ్గరే అట్టిపెట్టుకుని అది ఇతరులను భయపెట్టకుండా చూసుకోవటం ధైర్యం అంటే!! నిజమే, మన చుట్టూ ఇలాంటి దుస్సంఘటనలు జరగటం, మళ్ళీ మళ్ళీ జరగటం, మన ధైర్యాన్ని పరీక్షిస్తున్నాయి. మన శత్రువులు మన వెనుక దాడి చేస్తున్నారు, మనకి తెలీకుండా!! అయినా వారిని మనం ధైర్యంగానే ఎదుర్కోవాలి. భయం వేస్తున్నా, అడుగు ముందుకు వేయాలి. ఎందుకంటే ఇది మన ఇల్లు, మనం ఇక్కడ నుండి ఎక్కడికి పారిపోలేము. అలా పారిపోయినా, అంతా ఇదే సమస్య!! అందుకే “ఇంటినే భయకంపిత ప్రదేశం” గా మార్చాలనుకున్నవారిని మనం గెలవనివ్వకూడదు.”

“అంటే.. నేనిప్పుడు వెళ్ళి నీళ్ళు తెచ్చుకోకపోతే, భయం గెలిచినట్టేనా?”

“కాదా మరి? నేను లైన్ లోనే ఉంటా, నువ్వు మంచి నీళ్ళు తెచ్చుకో!!”

“వద్దు డాడ్!! నేనే తెచ్చుకుంటాను. అవును, ఇది నా ఇల్లే కదా? పూర్తిగా చీకటి ఉన్నా నడవగలిగేంత పరిచయం నాకు. అలాంటిది దీనికే భయపడితే ఎలా? నువ్వు ఫోన్ పెట్టేయ్.. నేనే తెచ్చేసుకుంటాను. Thanks for the help, dad!!”

“వెల్కం, మై గాళ్”

“త్వరగా వచ్చేస్తావు కదూ.. అఫీసు నుండి”

“ఊ.. ఒకే ఒక్క మీటింగ్, అవ్వగానే నా చిట్టి తల్లి ముందుంటా.. సరేనా!! బై!!”

“బై”

40 comments

  1. చాలా ఆలోచనాత్మక సిద్ధాంతాన్ని,మన సమాజంలో పెరుగుతున్న టెర్రరిజాన్ని ఆధారంగా ఒక చిన్న వ్యక్తిగత ధృక్పధంతొ,ఒక ఘటనలా చెప్పడం చాలా మంచి ప్రయోగం.

    మణిరత్నం సినిమా చూసినట్లుంది. ఎక్కడో ఉన్న కాశ్మీర్ సమస్యని ఒక కుటుంబకథలో అదీ ఒక భార్యాభర్తల నడుమ జరిగే ప్రేమనడుమ ‘రోజా’ సినిమాలో చూపించి, ఆ సమస్యకు మానవదృక్పధాన్ని అందించినట్లుంది నీ చిట్టికథ.

    I simply liked it. ఇంకాలోతుగా ఆలోచిస్తే మరిన్ని interpretations వస్తాయనుకుంటా!

    Like

  2. “ఊ.. ఎలుక కన్నా పిల్లి పైన ఉంటుంది ఫుడ్ చేన్ లో!! మరి బాంబ్ బ్లాస్టుల్లోనో? అక్కడ ఎవరి మీద ఎవరున్నారు? అదీ నాచురల్ కాదు కదా?

    భయాన్ని జయించటం. అది కాకపోతే, భయాన్ని గెలవన్నివ్వకపోతే, అదీ ధైర్యం అంటే!! Absence of fear is not courage.

    ఈ రెండు వాక్యాలతో నువ్వు చెప్పాలనుకున్న విషయాన్ని చాలావరకు చెప్పేసావు. బాగా రాసావు… చాలా సున్నితంగా..

    Like

  3. ఈ వారం అంతా.. తీవ్రవాదులూ, బాంబు బ్లాస్టులూ, భయంకరమైన ఫోటోలూ, అవీ చూసేనేమో నాకూ మా ఆఫీసుకెళ్ళే రూట్ కాకుండా రైతు బజారుకి వెళ్ళాలన్నా.. ఫింగర్స్ క్రాస్డ్ అనుకుంటూ వెళ్తున్నా. ఎన్ని బాంబుదాడులు జరిగినా కన్విక్టెడ్ ఎవరూ లేరు. నర హంతకులు లూస్ గా మన తో పాటే తిరుగుతున్నరు అంటే భయమే మరి.

    ఈ రోజే సోమాజి గూడ వెళ్ళేను. బేగంపేట్ లో రెండు ఫ్లయ్ ఓవర్లనుంచీ ట్రాఫిక్ జాం! ఎన్నో వాహనాలూ, అందరో మనుషులూ.. పక్కనెళ్ళే ట్రాఫిక్ నుంచీ ఎవరన్న గ్రైనేడ్ విసిరితేనో – ముందు వెళ్తున్న హెచ్.పీ సిలిండర్ల వేను పేలితేనో – అని భయం వేసింది. చీ చీ ! ఏమీ కాదులే! అని నన్ను నేనే సర్దుకున్నాను.

    మీ పోస్ట్ చూసేకా.. భయం లేకపోవడం ధైర్యమా.. భయాన్ని జయించడం ధైర్యమా తెలుస్తూంది. బాగా రాసేరు పూర్ణిమా. మంచి ఊహలు ఊసులయ్యి – బోల్డన్ని విషయాలు చెప్తున్నాయి.

    Like

  4. మరే ! మా మానిక్ షా కూడా అన్నారు ట ! నీకు భయం వెయ్యట్లేదంటే నువ్వు అబద్ధం అన్నా చెప్తూ ఉందాలి, లేదా నువ్వు గూర్ఖా అన్న అయి ఉండాలి అని! నేను గూర్ఖా కాను కాబట్టి, నాకు భయం వేస్తుంది.

    Like

  5. Just wonderful!

    “Absence of fear is not courage.”

    Right. And fear in us adds courage to our enemy. Indirect గా మన సత్రువుకు మనమె సహాయం చేస్తున్నాం అన్నమాట మనల్ని గెలవటానికి. ఒక్క నిమిషం ఊపిరి బిగపట్టి ఒక్క అడుగు ముందుకేస్తే ఆ భయమే మనల్ని [మనలో ధైర్యాన్ని] చుసి పారిపోతుంది.

    ఇక గదిలో బంధించి హింసిస్తే పిల్లైనా ఎదురుతిరుగుతుంది. కాబట్టీ ఇక్కడ బలం కంటే ‘ఆత్మ బలం’ ముఖ్యం.

    Well done! Purnima

    Like

  6. నేటి మన దేశ సామాజిక దుస్థితికి అద్దం పడుతోంది మీ చిట్టి కవిత.ప్రతి ఒక్కరి భయాందోళనలను ప్రతిభింబిస్తోంది.

    Like

  7. చాలా బాగుంది. ధైర్యం అంటే భయం లేకపోవటం కాదు భయాన్ని జయించటం నిజంగా చాలా బాగా చెప్పారు. టపా అదిరింది .

    Like

  8. పూర్ణిమగారూ, చాలా బాగా వ్రాసారు.

    ఎందుకో ‘Independence Day’ సినిమా గుర్తుకొస్తుంది. అందులో వేరే గ్రహవాసుల చరిత్ర చెపుతూ, సైంటిస్ట్ అంటాడు – వీళ్ళు మనలాటి వాళ్ళే. వాళ్ళగ్రహం మీదున్న వనరులన్నీ కానిచ్చేసి – తమకు సరిపోయే మరో గ్రహం మీదకు దాడి వెళ్ళి – అక్కడ జీవరాశిని అంతమొందించి – ఆ గ్రహాన్ని తమ వాసస్థానం గా చేసుకుంటాయి. ఆ సినిమాలో అవి విలన్లు. మరి… నిజ జీవితంలో మనమో… వేరే జాతుల సంగతి పక్కన పెట్టండి – మన జాతి తరవాత తరానికి కూడా భూమిని వాసయోగ్యం గా ఉంచేటట్టు లేము.
    మనము కలుపుకోవలసినవాటి కంటా – తీసేయ్యవలసినవే నాకు ఎక్కువ కనిపిస్తున్నాయి.
    మనిషికి వాడి దేశం అంటే ఎంత ప్రేమ అంటే పక్క దేశం వాడిని ద్వేషించేంత.
    మనకి మన మతం ఎంత ప్రేమ అంటే పక్క మతం వాడిని చంపేంత.
    మనకి మన కులం అంటే ఎంత మమకారం అంటే పక్క కులాన్ని బురద చల్లేంత.
    మనకి ఎంత ధైర్యం అంటే పక్కవాడిని చంపడానికి మనల్ని మనం చంపుకునేంత.
    ఈ ఎక్కువలన్నీ కాస్త తగ్గితే కొంచెం బాగుణ్ణు.
    పూర్ణిమగారూ – నేను వ్రాసిన వ్యాఖ్య మీ టపాకి relevant గా లేదనిపిస్తే ప్రచురించకండి.

    Like

  9. పూర్ణిమా,
    ఎందుకో తెలీదు,కళ్ళల్లోకి నీళ్ళొస్తున్నాయి. నిజం! నిజమే, మరుక్షణం ఏం జరుగుతుందో తెలీకపోవడం జీవితం. మరుక్షణం చచ్చిపోతామేమో అనే భయంతో రోజూ బతకటం…మరి ఇదేమిటి? సూరత్ ని టీవీ లో చూసినప్పటినుంచీ రోడ్డు మీద వెళుతూ వెళుతూ చెట్ల మీద కూడా చూడాలన్నంతగా కాన్షస్ నెస్, కాదు కాన్షస్ నెస్ కాదు, మరేదో కలుగుతోంది. నలుగురు నడిచే చోట నడవాలంటే భయం! బాంబులు నలుగురున్న చోటేగా పొంచుంటాయి! అందుకే లక్షల మంది జనం మధ్య ఒంటరిగా, తప్పించుకుని తిరుగుతూ, కొత్తగా కనపడ్డ ప్రతి ఒక్కరినీ అనుమానిస్తూ.. మనల్ని మనం పోస్ట్ మార్టం చేసుకుంటూ…ఇదే నగరంలో జీవితం!

    నేనూ గూర్ఖాని కాదు, నాకూ అనుబంధాలున్నాయి, ప్రాణంగా నన్ను ప్రేమించే మనుషులూ, నేను ప్రేమించే మనుషులూ ఉన్నారు. అందుకే నాకూ భయం వేస్తోంది.

    భలే రాశావు! నీ టపాలన్నిటిలోనూ ఇది నన్ను బాగా కదిలించింది.

    Like

  10. భయం లేకపోవడం అంటే చావు ఎదురుగా వచ్చినప్పుడు కూడా నా మొహం మీద చిరునవ్వు చెరగక ఉండటం..
    భయం లేకపోవడం అంటే వేటాడబడుతున్నా, వేటగానికి దొరకక ఎదురు తిరిగి, రొమ్ము విరిచి నిలబడి పోరాడటం..
    చాలా సందర్భాలలో చావు భయమే మనకు ఎదురు తిరిగే ధైర్యాన్ని ప్రసాదిస్తుందేమో?
    good narration. keep it up.

    Like

  11. భయం, ధైర్యం రెండు పక్క పక్కనే ఉంటాయి, చీకటివెలుగుల్లాగా. మన ఇంట్లోనే మనకు భయం వేస్తుందంటే తప్పెవరిది? పిల్లిని ఇంట్లోకి రానిచ్చిన మనదా? భయం లాంటి ఎలుకని ఇంట్లో దాచుకొన్న మనదా? ఎవరిదీ తప్పు?
    బాగా రాశారు.

    Like

  12. Puttina vadu gittaka tappadu, alage gittina vadu janainckaka tappadu annadu geetalo srikrishundu;
    alage pilli elukani champi tinuta prakuthi sahajam;
    Kakapothe ikkada manusule manuulani champutunnanu, bhayamkampithulani chestunnaru,Idi chala ghoram. Pille nayam kadu manisi kante?? atleast adi aakali kosame elukalni champuthundi……
    So bayapaduthu koorchovadam kante, ilanti visayalu konchem adyathmikatha drukpadamtho alochinchali like jarigedi jaragaka manadu, Denikina siddam annattu.. … emtaru??

    Like

  13. కొన్ని questions and opinions….

    పిల్లి – ఎలుక పోరాటం అనేది question of survival and also అది ప్రత్యక్ష యుద్దం. కాని ఇక్కడ terrorists (వాల్లని terrorists అనాలా వద్దా అనేది కూడ questione..) చెస్తుంది mostly purely purpose of life మారిపోయింది (purpose of life and survival అనే వాతికి చాల difference వుంది అని నా అభిప్రాయం). and also ఇక్కడ జరుగుతున్నది ప్రచ్చన్న యుద్దం. so పిల్లి – ఎలుక పోరాటంతొ సంబందం లేదు అనేది నా అబిప్రాయం and once we start relating both, we end up giving new definitions to things happening.

    ఇక పుర్నిమగారికి పాటకులకి కొన్ని ప్రశ్నలు…
    ఇక భయాన్ని కాస్త పక్కన పెట్టి ఇంతకీ దీనికి solution వుందా??
    ఒక వేల వుంటే… solution ఎంటి? ఈ పోరాటం ఈ రోజు మొదలయిందా?? ఇన్ని వందల సవత్సరాల పోరోటానికి solution కనుక్కోక పోవడానికి మన పూర్వీకులు ఏమైనా పిచ్చివాల్లా? లెకుంటే ఇంకేదైనా కారణం వుందా??
    ఒక వేల solution లెకుంటె ప్రస్తుత కర్తవ్యం ఎంటి?

    — Vamsi

    Like

  14. మీ టపా చదువుతుంటె నాకు ముంబై లో ఉన్న రోజులు గుర్తుకు వచ్చాయి. ఆరోజు డిసెంబర్ 6. ఎక్కడ బాంబులు పేలతాయొ తెలియదు కాబట్టి మేమందరం క్లైంట్ ఆఫీస్ కి వెళ్ళకుండా గెస్ట్ హౌస్ లోనే ఉండాలని నిర్ణయించుకొన్నాం. నాకయితే ఆ ముంబై, ఆ ఉద్యోగం వదిలేసి మా వూరు వచ్చేద్దాం అనిపించింది.

    అంతలో మా గెస్ట్ హౌస్ కేర్ టేకర్ వచ్చి మాకో విషయం చెప్పాడు. ముంబై లో జరిగిన బాంబ్ బ్లాస్టులలో అతి పెద్ద బాంబ్ బ్లాస్ట్ సాంత్రాక్రజ్ ఎయిర్ పోర్ట్ దగ్గర జరిగిందట. పేలుడు పదార్ధాలు ఉంచిన కార్ పేలడం వల్ల ఆ సంఘటన జరిగింది. ఆ కార్ ముందు మేముంటున్న గెస్ట్ హౌస్ కింద పార్క్ చేసారంట. వాచ్ మేన్ పార్కింగ్ ప్లేస్ లేదు వేరె ప్లేస్ లో పెట్టమంటే వేరే ప్లేస్ లో పెట్టారంట అదే బ్లాస్ట్ అయింది.

    ఆ విషయం విన్న తర్వాత ఇంట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా రక్షణ లేదు అన్న విషయం బాగా అర్ధం అయింది. మొండి ధైర్యం తో (నిజంగా మొండి ధైర్యమే, మా ధైర్యానికి మొండితనం తప్ప ఇంకేమి కారణం లేదు) ఆ రోజు ఆఫీస్ కి వెళ్ళాం. అదృష్టవశాత్తు ఆ రోజు ఏమి జరగలేదు. బతికిపోయాం. మన ఇంట్లో మనం ప్రశాంతంగా తిరగలేని ఆ ధౌర్భాగ్యపు రోజులని గుర్తుకు వస్తే ఇప్పటీకి అదోలా ఉంటుంది.

    Like

  15. ఈ మద్య కలర్స్ చానల్‌లో “ఖతరోంకి కిలాడి” అని ఒక ప్రొగ్రాం వస్తుంది. అందులో ప్రముఖ మోడల్స్ కొంతమంది పాల్గొంటున్నారు. వారి స్లోగన్ “జో ఢర్‌గయా ఓ ఘర్ గయా”.
    భయానికి మరో పేరు “ఫోభియా” అన్ని భయాలు ఒకేలా వుండవు. కొన్ని భయాలు వంశపారంపర్యగా వస్తాయట. కాని నిత్యం నడుస్తున్న దారిలో కళ్ళెదుటే జరిగేవాటికి జీవనం భయమయం అయినప్పుడు జీవితం ధైర్యానికి కొత్తనిర్వచనాల్ని వెతుక్కోవలసిందే.
    —-

    నాకింట్లోనే భయం వేస్తుంది.. డాడ్!!
    టపా చదివిన తర్వాత మీతో పంచుకోవాలనిపించి ఈ కొన్ని మాటలు


    ఇంటర్మీడియెట్ చదువుతున్న మా అమ్మాయిలు అప్పుడప్పుడూ ఎదోరకమైన భయంగురించి చెబుతానేవుంటారు.
    వాళ్ళతో మాట్లాడుతున్నట్టే అనిపించింది.


    సంభాషణాత్మకంగా కథను నడిపించడం గొప్పటెక్నిక్ అనిపిస్తుంది నాకు. అందులోనూ ఫోనులో మాట్లాడుతూ కథను నడిపించడం, వర్తమానంలోంచి గతంలోకి, గతంలోంచి వర్తమానంలోకి సమాజాన్ని, విషయాన్ని నడిపించడం. అందులో విజయవంతమైన కథనంగా చెప్పవచ్చు.

    పూర్ణిమకు అభినందనలు

    Like

  16. అమ్మా, నువ్వూ ఇంటికి వస్తారో రారో అని భయం నాకు. ఇప్పుడు ఫ్రెండ్ తో పార్క్ కి వెళ్తే నేను తిరిగి వస్తానో లేదో అని భయం మీకు. క్రికెట్ మాచ్ కెళ్ళినా, నా ఫేవరట్ బాగా ఆడుతున్నా, అక్కడేదో జరిగిపోతుందని భయం. సినిమా చూస్తున్నంత సేపూ, బయట ఏమైపోతుందో అని భయం.
    — చాలా బాగా రాశారు పూర్ణిమా భయంగురించి. ఇక్కడ అమెరికాలో మొత్తం ఆర్థిక, రాజకీయాలన్నిటికీ కేంద్రం భయమే.
    కూడలి సాంకేతికసమస్యమూలంగా నేను ప్రేరణమీద రాసిన టపా ఎవరికంటా పడ్డట్టు లేదు. మీరు అడిగారు కనక ఇక్కడ చెప్పుతున్నా. ఏసారి నాబ్లాగు చూడండి. ఇక్కడ రాసినందుకు మీరేం అనుకుంటారోనని భయంగానే వుంది నాకు. 🙂

    Like

  17. కథ ఎత్తుగడ – సంభాషణలో కథ – అమ్మాయి భయం -కరుణ రసం -భయం – నడిపించిన తీరు చాలా బావుంది. అభినందనలు పూర్ణిమా.

    Like

  18. సాక్షి లో “తోడేలు” కథ చదివారా? భలే ఉంది.

    అలాగే మీ టపా కూడా. పన్లేని మంగలి పిల్లి తల గొరిగినట్లు, పనీ పాటా లేని సిద్దాన్తాలున్న వాళ్ళే బామ్బులేస్తారు. Seriously a serious blog after your allari.

    నిజం గా ఎంత భయానకం గా ఉంటుంది అలాంటి సంఘటనలలో. చాలా సెన్సిటివ్ గా ఉంది. మాటల్లో మీ బ్లాగు గురించి చెప్పలేను.

    Like

  19. మా రంగయ్య తాతని ఎలకా పిల్లి సంఘటన మీదే అడిగాను. పిల్లిని తోలుదాం అని. దానికి ఆయన ఎం చెప్పాడో తెలుసా! “చూసింది కన్ను. నువ్వుతోలాల్సింది చేత్తో. చెయ్యి చూడ లేదు. కనుక దానికి సంబంధం లేదు.”

    ఇప్పుడాయన బ్రతికుంటే నేను అడుగదలుచుకున్న ప్రశ్న… “తాతా! బాంబు పడితే నువ్వేదుకు పరిగెడుతావు? ఆ భీభత్సాన్ని చూసింది కన్ను. కానీ పరిగేట్టాల్సింది కాలితో కదా. కానీ అది చూడలేదు. దానికి సంబంధం లేదు కదా?”

    పూర్ణిమ గారికి: ఒక చిన్న డౌట్. తీరుస్తారనుకున్తున్నాను. మరి పిల్లి ఆకలి ఎవరు తీరుస్తారు? మనమే పాలు పోస్తే పోలా ఎలకని విడిపించి?

    Like

  20. మహేశ్ గారు: నెనర్లు!! మాట్రిక్స్ సినిమా అంటే లైట్ తీసుకున్నా గానీ రోజా అంటే గాల్లో తేలిపోవాల్సిందే!! చాలా సంతోషం.
    మీ interpretations కోసం వేచి ఉంటాను!! 🙂

    శ్రీవిద్య: థాంక్స్!!

    సుజాత గారు: అవును, ప్రతీది భయపెడుతుంది. అంతా మనదై కూడా భయపెడుతుంది. మనకి చాలా నచ్చిన ప్రదేశాలే ఇప్పుడు అనుమానంగా చూసేలా ఉన్నాయి. కానీ మనది కదా ఇది, భయం ఉన్నా, లేకపోయినా, మనం ఇలానే కొనసాగాలి.
    మీ వ్యాఖ్యకు నెనర్లు!! ఊహలన్నీ ఊసులైయ్యే వరకూ, ఇలా పంచుకుంటూనే ఉంటాను. 🙂

    మోహన: థాంక్స్!! నిజమే, ఆత్మబలం ముఖ్యం, బలం కన్నా!! ఈ టపాలో నేను చాలా interpretations కి తావిచ్చేలా రాసాను, ఆలోచించే కొద్దీ కొత్తగా అనిపించేలా!! నువ్వన్న ఆత్మబలం ఎవరైనా అంటారా లేదా అనుకున్నా. అనేశావు!! 🙂

    రాధిక గారు, చిలమకూరు విజయమోహన్ గారు, వేణూ శ్రీకాంత్ గారు, Niranjan Pulipati గారు, అశ్విన్ బూదరాజు గారు, చైతన్య గారు: వ్యాఖ్యాన్నించినందుకు నెనర్లు!!

    Like

  21. చివుకుల గారు: మీ కమ్మెంట్ చూసి ఎంతగా సంతోషించానో చెప్పలేను. మీరన్న ఆ “ఎక్కువ”లే మన ఈ పరిస్థితికి కారణం అనిపిస్తుంది ఒక్కోసారి. అవును, మన దేశం అంటే మనకెంత ఇష్టమూ అంటే పక్కదేశాల వారి ఊసుకి కూడా ఉలిక్కిపడేంత. మన దగ్గర ఏం జరిగినా ఎవరో పన్నిన కుట్రగా అభివర్ణించడం ఎందుకో నాకు చాలా సార్లు అర్ధం కాదు. నిజమే, మనకి హాని జరిగే అవకాశాలు లేకపోలేదు, కానీ అందుకని తగు జాగ్రత్తలు తీసుకోకుండా, ప్రతీ సారి “నింద” కార్యక్రమం, ఒక్కోసారి విసుగు కలిగిస్తుంది.

    అభిమాన్నాని గానీ, ప్రేమని గానీ, మనిషిలో అసలు మంచి భావాలుగా పరిగణిస్తాము. కానీ అవే హద్దులు దాటితే విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ వ్యాఖ్య చదివాకా ఓ టపా రాయాలనిపిస్తుంది. వీలు చూసుకుని తప్పకుండా రాస్తాను త్వరలో!!

    నా కంటెంట్ లో చాలా ఆలోచనలకి స్కోప్ ఉంది. అందులో మీ ఆలోచనలు అతికినట్టు సరిపోతాయి. పంచుకున్నందుకు సంతోషం!!

    సుజాత గారు: ఆ “ఏదో” ఏంటో చెప్పండి ప్లీజ్.. నన్నూ అదే వెంటాడుతుంది. లుంబినీ పార్కులో ఆ షో మొదలెట్టిన మొదటిరోజు, ఓపెనింగ్ కి నేనక్కడ ఉన్నా. ప్రతీ క్షణాన్ని ఎంజాయ్ చేశా!! మరలా పోయిన నెల వెళ్ళా, కానీ ఈ సారి మీరన్న ఏదో నన్ను తరిమింది. నిలవలేకపోయా అక్కడ!! ప్రతీ క్షణం ఆ ఆలోచనలే, ఇప్పుడిక ఇక్కడ ఏదో జరిగిపోతుందేమో అన్న అనుమానమే!!

    నిజమే… ప్రేమించే మనుషులు, ప్రేమిస్తున్న మనసులు మన భయాన్ని ఇంకా ఎక్కువ చేస్తున్నాయి ఏమో!!

    Like

  22. ప్రతాప్ గారు: నిజమే!! ఒక్కోసారి చావు భయమే, చావుని గెలిచేలా చేస్తుంది. ఇక భయం ఏంటీ? ధైర్యం ఏంటీ అంటే చాలా నిర్వచనాలే చెప్పుకోవచ్చు. ఒక్కో సందర్భంలో ఒక్కోలా ఉంటాయి ఏమో కదా ఇవి!! ఆలోచించాలి. మీ వ్యాఖ్య ఆలోచనలని ఎక్కడికో తీసుకుపోతోంది.

    కల గారు; ఊ.. మనింట్లోనే మనకి భయం వేస్తుందంటే అదెప్పుడూ మన తప్పే కానవసరం లేదు. ఒక్కోసారి పరిస్థితులవల్ల ఇలాంటివి ఏర్పడతాయి. అందుకే నాకు తెలిసి మనలో ఉన్న “భయం”ని మనకన్నా పెద్దగా పెరగనివ్వకుండా చూసుకోవాలి!! పిల్లిని మన ఇంటిలోకి రానివ్వలేదు, అదే చొరబడింది. అయినా మనం మనల్ని కాపాడుకోవాలిప్పుడు.

    కిశోర్: “జరిగేది జరగక తప్పదు”.. కాస్త వేదాంత ధోరణి అయినా, ఇలా అనుకుని మన భయాన్ని కాస్త వరకైనా తగ్గించుకోగలిగితే మేలే ఏమో!! ధైర్యంగా ముందుకు వెళ్ళటానికి పనికి వచ్చేది ఏదైనా అనుసరణీయమేమో!!

    Like

  23. వంశీ గారు: మీరన్న రెండు యుద్ధాలకీ పోలిక లేదు, ఒప్పుకుంటా!! ఒకటి ఎంత సహజమో, మరోటి అంత స్వార్ధము. మరి నేన్నెందుకు పిల్లీ, ఎలుకలని ఉదహరించాను? వాటి యుద్ధాన్నికి, అసలు మనకు భయం కలిగిస్తున్న యుద్ధానికి ఒకే ఒక పోలిక ఏంటంటే, ఒక ప్రాణి మరో ప్రాణి ద్వారా చంపబడడం. కారణం ప్రకృతి విధానమైనా పిల్లి ఎలుకను చంపుతుంది. సింహం జింకను చంపుతుంది. ఇది సహజమే!! కానీ అది జరిగేటప్పుడు చూస్తే సహజమే అని తెలిసినా “అయ్యో” అనిపించచ్చు!! చంపుతున్న పాణి మీద కోపమో, చంపబడుతున్న జీవి మీద కాస్త జాలి అనిపించే అవకాశం లేకపోలేదు. ఇందులోని పాత్ర అలాంటి సంఘటను చూసి భయపడింది. సహజమైన పద్ధతిలో యుద్ధమే ఇంత భయానకంగా ఉంటే, అసహజంగా జరుగుతున్న దాడుల్లో ఇంకెంత “రాక్షసత్వం” ఉందో అనే భయం!! She knows cat is above rat in the food chain, but she is not able to come to terms why man and man at the same level, have to kill one another!! ఇది కేవలం ఆ ఒక్క అమ్మాయి (కాల్పనికమే) ఆలోచనా తీరు మాత్రమే!! జనరలైజ్ చేసే ఉద్ధేశ్యం లేదు. ఆ రెంటినీ ఒకటే చూపించే ప్రయత్నం కానేకాదు. ఇంకా చెప్పాలంటే పిల్లి మళ్ళీ ఆకలి వేస్తే గానీ ఎలుకను పట్టదు, కానీ మనిషి ఎప్పుడైనా ఏదైనా చేస్తాడు.

    ఈ టపాలో నేను చెప్పాలనుకున్నదాంట్లో interpretations కి అవకాశాలు వదిలేశాను. If you had to overhear someone’s conversation, you’d assume and interpret in your own way. Right?? I wanted this to be that way!!

    ఇక మీ మిగితా ప్రశ్నలు, వాటికి సమాధానం తెలిసుంటే నేనిలా కాల్పనిక కథనం ప్రయత్నించను. ఓ వ్యాసం రాసేదాన్ని, ఇలా, ఇందుకు, ఇప్పుడు అంటూ!! సమాధానాలు లేవు కదా అని దీన్ని పక్కకీ పెట్టలేము. కొన్ని ప్రాక్టికల్ పరిష్కారాలు ఆలోచించాల్సిందే!!

    Like

  24. “భయాన్ని జయించడమే ధైర్యం” what an interesting concept!”

    ఇది చదువుతున్నంతసేపూ మొన్న మా అమ్మతో ఫోన్లో మాట్లాడిందే గుర్తొచ్చింది.. “అమ్మా, మరీ అవసరమైతేనే గానీ షాపింగ్ కి వెళ్ళొద్దు” అనంటే తను “నీతో పెద్ద తంటానే తల్లీ.. వరదలొచ్చాయనీ, ఎండలు మండిపోతున్నాయనీ, రైలు కాలిపోయిందనీ, బాంబులనీ, ఇలా ఏదో ఒకటి చెప్పి నన్ను ఇల్లు కదలొద్దంటావు.. అయినా నేను పుట్టి పెరిగిన ఊర్లో తిరగడానికి నాకు భయమేమిటే! ఎప్పుడెలా జరగాలో అలా జరుగుతుంది” అని అంది.. అప్పుడు ‘నా ఆందోళన ‘ అర్ధం చేసుకోదని కాస్త విసుక్కున్నా కానీ నీ టపా చదివాక అనిపిస్తుంది నేనెంత ఫూలిష్ గా ఆలోచించానా అని!!

    it’s really a touching post!

    Like

  25. @వంశీ; టెర్రరిజం ఇప్పుడు పిల్లో ఎలకల చెలగాటంగానే మారి కొత్త అర్థాల్ని (new definitions) సంతరించుకుంటోంది. అంతర్జాతీయ ఇస్లాం టెర్రరిజం నేపధ్యంలో వారి చర్యలకు కాశ్మీరో,గుజరాతో కారణం కాదు. వారి మూల ఉద్దేశం ముస్లింలు కానివారందరినీ (కాఫిర్ లను) భయబ్రాంతుల్ని చెయ్యడం. ముస్లిం మతాన్ని సర్వవ్యాప్తం చెయ్యడం.ఈ రెండు ఉద్దేశాలూ ఒకదానికొకటి చాలా బలంగా పెనవేసుకున్నవే.

    కాకపోతే, ఈ పరిణామక్రమంలో కొందరు ముస్లింలు బలైనా వీరికి పెద్ద తేడాలేదు. అత్మాహుతుదళాల్ని స్వర్గం పేరుచెప్పి ప్రేరేపించేవీరికి, భయం సృష్టిలో కొన్ని వందల ముస్లింప్రాణాలుపోయినా తేడాలేదు.కాబట్టి, ఇక్కడ పిల్లులు ముజాహుద్దీన్లు, ఎలుకలు వారిచేత భయపెట్టబడేవారందరూను.

    ఇది ‘సహజ యుద్దం’కాదనేది మీప్రశ్నైతే దానికి సమాధానం వినండి. survival of the fittest అనేది ప్రకృతి మంత్రం. ఇస్లాం అన్నిటికన్నా శ్రేష్టమైన మతంగా అతివాద ముస్లింలు భావిస్తారు. వారు చేసే పనులన్నీ ఈ శ్రేష్టమైన మతాన్ని వ్యాప్తి చెయ్యడానికీ, వారి మతం పైన అమెరికాలాంటి దేశాల దౌర్జన్యాన్ని కాలరాయడానికీ(అని వారనుకుంటున్నారు). అంటే, చివరికి వారి మతమే మిగలాలన్నమాట. ఇది సహజం అని వారనుకుంటారు. మీరు దాన్ని అంగీకరించినా,అంగీకరించకపోయినా వారికొచ్చే నష్టం లేదు.

    ఇక ఈ పోరాటం ఎప్పుడు మొదలైందో చెప్పాలంటే ఒక పూర్తిస్థాయి పుస్తకమే అవుతుంది.Samuel P.Hunting ప్రపోజ్ చేసిన Theory of ‘Clash of Civilization’ చదవగలరు.

    Like

  26. కవిత్వంలో రెండు విచిత్రమైన లక్షణాలు కనిపిస్తుంటాయి. ఒకటి సార్వజనీనమైన ఒక ఆలోచనని పూర్తిగా వ్యక్తిగతమైన అనుభవంగా మలచి, తానే స్వయంగా అనుభవించినట్టు చెప్పడం .. తిలక్ అమృతం కురిసిన రాత్రిలో .. దోసిళ్ళతో తాగి తిరిగి వచ్చాను, దుఖాన్నీ చావునీ వెళ్ళిపొమ్మన్నాను .. అనడం.
    రెండోది, వ్యక్తిగతమైన అనుభవాన్నించి ఒక సార్వజనీనమైన సత్యాన్ని ఆవిష్కరించడం. ఈ లక్షణం ఇస్మాయిల్, వారి అనుయాయుల కవిత్వంలో బాగా కనిపిస్తుంది.
    ఈ రెండిట్నీ మేళవించి ఈ వచనాన్ని కవిత్వ స్థాయికి ఎత్తారు.
    అభినందనలు.
    మొదటగా చదివినప్పుడు పిల్లీ-ఎలికా చెలగాటానికీ, టెర్రరిస్టు దాడులకీ ఇదేమి పోలిక అనిపించింది. కానీ ఈ రెంటికీ లింకు ఆ అమ్మాయి మనసులో కలిగిన భయంలో ఎక్కడో ఉన్నదనిపిస్తోంది.
    భయం లేకపోవడం కాదు, భయాన్ని జయించడమే ధైర్యమంటే .. గుర్తు పెట్టుకోవాల్సిన మాటలు.

    Like

  27. బ్రహ్మి- సాప్ట్ వేర్ ఇంజినీర్ గారు: మీ అనుభవాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు!! ఇలాంటివి జరినప్పుడు ఆ క్షణాన ఎన్ని సుడులు తిరిగినా బుర్రలో, ఆ తర్వాత ఒక మాహానుభవంగా మిగిలిపోతాయి. మా మిత్రుల్లో ఒకరు సెప్టెంబర్ ౧౧ న జరిగిన దాడిలో డబ్యు.టి.సిలో ఉన్నారు. 3నిమిషాల్లో ఆరొందల మెట్లు దిగాడు కావున, మనకీ స్టాట్స్ తెలిసాయి. తన కళ్ళముందు ఆ టవర్స్ అలా కుప్పకూలడం చూస్తూ ఉండిపోయాడు. కొన్ని అనుభవాలు ఏ కాటగిరిలో పెట్టాలో తెలీదు.

    జాన్-హైడ్ గారు: మీ వ్యాఖ్యకి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్ధం కావటం లేదు. ఇది పూర్తిగా నా ఊహ మాత్రమే, నేనెళ్ళి మా నాన్నతో ఇలా మాట్లాడలేదు ఎప్పుడూ!! మీరు మీ అమ్మాయిలతో మాట్లాడుతారు ఇలానే అని తెలిసినప్పుడు వాస్తవికతకు దగ్గరగా ఉన్నాను అని అనిపించింది. దీన్ని కథ అనవచ్చో లేదో నాకు తెలీదు, నాకిలా రాయాలనిపించింది రాసేసాను. మీరు వ్యాఖ్యాన్నించడమే కాక, మీ టాపాలో కూడా రాయడం ఊహించని సంతోషం. నెనర్లు!!

    మాలతి గారు: టపా నచ్చినందుకు నెనర్లు!! మీ టపా గురించి చెప్పినందుకు మరిన్ని ధన్యవాదాలు!! నిజమే కూడలి వల్లే మిస్స్ అయ్యా!! నాకెందుకో జల్లెడలో మీ టపా కనిపించలేదు!! 😦
    భయం దేనికండి, నాకు సాయం చేస్తూ!! 🙂

    రావుగారికి: ధన్యవాదాలు!!

    Like

  28. hmmm what do i say? teliyadam ledu andaru goppa goppa ga words use chesi mechukunnaru. I can only say this u make me proud to call you my friend…

    nenu eppudu nuvvu inta baga rayagalavu ani anukoledu.. poori u r good at wat you do keep writing

    Like

  29. గీతాచార్య గారు: సీరియస్ బ్లాగు, అల్లరి తర్వాత.. ఊ!! 🙂 తోడేలు కథ చదవలేదు. లింక్ ఇవ్వగలరా??
    మీ వ్యాఖ్యలో చాలా డెప్త్ ఉంది. ఇప్పుడే ఏమీ చెప్పలేను.
    ఇక పిల్లి ఎలుకను తినడం, అది దాని నైజం, ప్రకృతి విధానం. మనం మార్చాల్సిన అవసరం లేదు!! ఇక్కడ నేను చెప్పదలచుకున్నది పిల్లి వల్ల ఎలుకకి నష్టం అన్న జగమెరిగిన సత్యం కాదు. ఒక జీవి చంపబడుతుండగా చూసిన ఓ సెన్సిటివ్ రియాక్షన్!! అది కేవలం ఆ అమ్మాయి భయమే!! ఇంకా చెప్పాలంటే, తనలో ఎక్కడో ఎలానో దాగి ఉన్న భయం ఈ సంఘటనతో బయటకి వచ్చింది అనుకోవచ్చు!! It’s all about interpretations with this post!!

    నిషీ: థాంక్స్!! మీ అమ్మగారి గురించి నీ concern కరక్టే!! I say, keep bothering her!! అమ్మకదా అర్ధం చేసేసుకుంటారు!!

    మహేశ్ గారు: ఓ కొత్త మలుపు తిప్పారు ఈ చర్చని!! ఇవేవి నాకు తెలియవు. నెనర్లు!!

    కొత్తపాళీ గారు: వ్యాఖ్యాన్నించినందుకు నెనర్లు!! నేనే అడుగుదాము అనుకుంటున్నా, ఇలా రాస్తే కథ అనవచ్చునా అని? మీరు ఉదహరించిన రెండు ప్రక్రియలు నేను చదవలేదు. అమృతం కురిసిన రాత్రి ఇప్పుడే మొదలెట్టా!! ఇస్మాయిల్ గారి రచనల గూర్చి మరింత తెలుపగలరు!! మీరన్నట్టు ఆ అమ్మాయి భయమే లింక్, కాకపోతే ఇప్పుడే మహేశ్ గారు ఒక కొత్త ట్విస్ట్ ఇచ్చారు. దాని గురించి చదివితే గానీ చెప్పలేను!!

    శైలూ: చాలా చాలా థాంక్స్!! Didn’t expect this at all!! నువ్వే చెప్పాక ఇక ఆగే ప్రశక్తి లేదు. అలా అలా కొనసాగించేస్తా అంతే!! 😉

    Like

  30. కధ చదివిన తరువాత గుండె బరువెక్కింది. పిల్లి, టెర్రరిష్టు సారూప్యతకు నేనేదైతే కామెంటుగా రాద్దామనుకున్నానో మీ వివరణ లో మీరు చెప్పేసారు.
    ఇంత అద్భుతమైన లాజిక్, సింబాలిజం, భిన్న కోణాలు ఒక రకమైన ఆర్ధ్రత లను రెండు పేజీలలో ఎలా చెప్పగలిగారనే ఆశ్చర్యం నుంచి నేనింకా తేరుకోలేదు.

    అద్భుతం అనే మాట కన్న పెద్దమాటలేమైన ఉంటే ఎవరైన చెప్పండి. ఇక్కడ టైప్ చెయ్యాలి.

    బొల్లోజు బాబా

    Like

  31. I’m too late to respond. But your blog is very sensitive, and touching. You have taken an excellent point and executed it well. An experimental style. If you have not got this many responces, I could have written about blog in mine.

    Thank you for an excellent blog.

    Like

  32. Priya: almost 50 posts, nearly 500 comments but only the second time do I come across the word “experiment” for my writeup. 🙂

    Yes, this blog is meant to be the experiments of mind, language and writing!! Thanks a ton, for your comment!!

    బాబా గారు: నెనర్లు!!

    Like

  33. One of the very best blogs I have come across. The topic is very touching and narration style is very good.
    I live in Mumbai and there were two bomb blasts during my stay. The resilience shown by the people here is exceptional in face of any disaster. There were blasts in packed local trains, but the next day the trains are packed again. Blasts in the costliest business streets of South Mumbai didn’t stop anybody from opening their businesses the very next day. I salute the courage.
    Another aspect to be analyzed in this context is the difference between “courage” and “indifference”.
    Indifference is what our dear leaders display thru their inaction towards terrorism. Protecting people is second priority to protecting vote banks.

    Anywayz coming to your blog..good writing.. I read many of your blogs and can see a great writer in the making.

    Like

  34. పూర్ణిమా,

    చాలా రోజుల తరవాత చదివాను నీ టపా. ముందుగా అభినందనలు, చాలా బాగా రాసావు, ముఖ్యంగా నచ్చినది నీ అభిప్రాయాలు మొత్తం చెప్పకుండా ఆలోచింప చేసే ఆ విధానం చాలా బావుంది. అవునూ నీ శైలికి విరుద్దంగా చిన్నగా ఉంది ఏమిటి ఈ టపా? 🙂

    ఇకపోతే ఇది చదివిన ముందు రోజే యాదృచ్చికంగా “golden compass” చిత్రం చూసాను అందులో కూడా ఇదే వ్యాఖ్య “I will be fearfull but I will conquer my fear” అంటుంది ఆ చిత్ర కథా నాయిక అయిన చిన్న పిల్ల. అదే గుర్తుకొచ్చింది చదూతుంటే.

    నిజంగా సరైన సమయానికి మంచి జ్ఞానబోధ. నా బ్లాగులో, మురళి గారి తేటగీతిలో అతివాదం మీద జరిగిన చర్చలతో విసిగిపోయి ఇక ఆ చర్చలు ఆపేద్దామా అని అనుకుంటున్న తరుణంలో మంచి చురక నాకు personalగా. నిజమే- విసుగుకీ, భయానికీ లోనయి పోరు ఆపటం కుదరదు.

    వంశీ గారు,
    మీరు అడిగారు- ఈ సమస్యకు సమాధానము ఉందా అని? ఎందుకు లేదు? అన్యాయాన్ని ప్రతిఘటించటం, అమానుషాన్ని వ్యతిరేకించటం, మన వ్యక్తిగత జీవితంలో కూడా కొంచం సామాజిక భాద్యత గుర్తు చేసుకోవటం.

    ఉదా: మన NRIs ఉన్నారు కొన్ని రూపాయల తేడా వస్తుంది కదా అని మన $,£ ను హవాలా ద్వారా మన దేశానికి చేరవేస్తారు. అది చేరవేసే వారు దానిని నల్ల ధనంగా, terrorist ఫండ్స్ గా వాడతారని ఆగారా? మనము ఇల్లు, స్థలాలు అమ్మేటప్పుడు పన్ను ఎగవేతకై తక్కువ ధర తెల్ల ధనంగా చూపెడతాం, మిగితాది నల్లగా ఇస్తాము. మరి అవి ఉపయోగపడవా ఇలాటివాటికి?
    హిందువులకు అన్యాయం జరిగింది అనే వారు ఇతర మతస్థులపై ఎంత అమానుష చర్యలను ప్రతిపాదించినా మవునంగా ఉంటాము, మరి అది పెంచదా ఇలాటి కక్షలను, మత కలహాలను?

    మనము, మన కుటుంబము, మన వీధి ఇవన్నీ కలిపితేనే కదండీ దేశమంటే.

    అమ్మో, పూర్ణిమ గారి టపా విషయాన్ని వదిలిపెట్టి నేను నా స్వంత అజెండాలకు వారి టపాలను హైజాకు చేస్తున్నాను అని అనుకుంటే ఇంకేమైనా ఉందా, నన్నూ రేపు ఇంకో జంతువుతో పోల్చి టపా పెల్చేస్తారు. అందుకని ఇక ఆపేస్తున్నాను.

    Like

Leave a comment