పాతుమ్మా మేక: వైకామ్ బషీర్

Posted by
Title: Pathumma Meka
Original: Pathummayude Aadu
Original Language: Malayalam
Author: Vaikom Basheer 
Genre: Novella 
Translated to: Telugu
Translator: A. Pandarinath
Translation Published by: National Book Trust of India, 1973

Audio Book Language: Malayalam 
Platform: StoryTel 

Vaikom Basheer is not a writer, he’s an emotion! అని ఇంటర్నెట్ మీమ్ తరహా అరిచి గోల చేయాలనిపిస్తుంటుంది నాకు. ఆ పేరు తలవడమే ఒక సంబరం. బషీర్‍కి ఉన్న పేరు ప్రఖ్యాతల గురించి బాగా వినడం వల్లో, లేక ఆయన రాసినవన్నీ చదివేసి తెగ నచ్చేయడం వల్లనో కలిగిన భావావేశం కాదిది. దేవుడి దర్శనానికి ముందు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసినట్టు బషీర్ ప్రస్తావన రాగానే నేనొక నాటకం గురించి చెప్పాలి. లేకపోతే నాకు తృప్తిగా ఉండదు.

చెహోవ్ ఉత్తరాల పుస్తకాన్ని పరిచయం చేస్తూ నేనీ కింది మాటలు రాసుకున్నాను:

ప్రపంచం నెత్తిన పెట్టుకునే రచయితలు కొందరుంటారు. దానికి విపరీతంగా నచ్చేయటంతో వారిని అందలెమెక్కించి కూర్చోబెడుతుంది. సమకాలీనులు ఆ రచయితను చూసినట్టు తర్వాతి తరాలు చూసే అవకాశాన్నే ఇవ్వదు. ఆ రచయిత పోయిన కొన్ని దశాబ్దాలకో, శతాబ్దాలకో ఉనికిలోకి వచ్చిన పాఠకుడు ఇంత ఎత్తుమీద ఉన్న రచయిత చూడదల్చుకున్నప్పుడు పొగడ్తల పూలదండలు, అవార్డుల శాలువాలు మాత్రమే కనిపిస్తాయి. వాటిని తప్పించుకుని ఎట్లాగో రచయిత అసలు పనిని – అదే రచనల్ని –  చదివితే చుట్టూ జనాలు చేసే హడావుడి తగ్గి, రచయిత కొద్దో, గొప్పో దర్శనమిస్తాడు. అటుపై ఆ రచయితా పాఠకుని మధ్య ఏర్పడే బంధం పాఠకుడి మీద ఆధారపడి ఉంటుంది.  అదెంత దూరం పోయినా, బంధం ఎంత గాఢమైనా కూడా రచయిత అద్దంలో చందమామలానే మిగులుతాడు.

ఇప్పుడీ రచయిత అమాంతంగా మళ్ళీ పునర్జీవించాలంటే? అలా పునర్జీవితుడై పాఠకుని తాను తిరిగిన స్థలకాలాదులలో తిప్పాలంటే? తిప్పుతూ అప్పటి తన మనసులో ఉన్న ఆలోచనా ఝరినంతా పాఠకునిపై కురిపించాలంటే? మనిషిగా పుట్టి, ఉన్నంత కాలం ప్రాపంచిక అనుభవాల్లోంచి కథలను పుట్టించి, వాటికి జీవం పోసి.. పోయాక ఒక పేరుగా, ఒక సింబుల్‍గా, వీధుల్లో బొమ్మగా, సాహిత్య ప్రస్తావనలో ఓ అలవాటుగా మాత్రమే మిగిలిపోయిన రచయిత.. almost flesh and bloodతో, అతడి చిర్నవ్వు, అతడి కన్నీరు పాఠకుని కళ్ళముందు నిలవాలంటే?

ఆ వ్యాసం ఇలా flesh and bloodలో రచయితను పట్టి ఇచ్చేవి ఉత్తరాలు అని రాశాను. కానీ, నాటకాలు కూడా ఈ పని జేయగలవని నాకు “Under the Mangosteen Tree” అనే నాటకం చూసే వరకూ తెలీదు. నాటకం ట్రైలర్ చూడండి. ఆ వాలుకుర్చీ, ఆ గ్రామఫోన్, ఆ క్రీనీడ అచ్చు బషీర్ కాలంనాటికి తీసుకుపోతాయి. దానికి తోడు సంతోషం, దుఃఖం, హాస్యం, వ్యంగ్యం అన్నీ కలబోసిన కథలు కొన్ని అలా స్టేజి మీద ప్రత్యక్షమై టైమ్ ట్రావెల్ చేయించాయి.

నాటకం మధ్యలో ఇచ్చిన ఇంటర్వెల్ లోనే ఆయనవి ఆంగ్లానువాదాలు ఏవున్నాయా అని వెతుక్కుని ఆర్డర్ ఇచ్చేంత ఉత్సాహం వచ్చింది. ఆ ఆంగ్లానువాద కథలు చదివాను కానీ అంతగా ఎక్కలేదు. నాటకంలో కూడా ఆంగ్లానువాదాన్నే వాడారు. అయినా కూడా.

వివేక్ శాన్భాగ్ ఈ మధ్యన ఇచ్చిన ఇంటర్వ్యూలో అనువాదాల ప్రస్తావన వచ్చినప్పుడు, “బషీర్‍ని మలయాళంలో చదువుకోవడం మలయాళీలు చేసుకున్న అదృష్టం. అది మనకి ఎప్పటికీ చిక్కే అవకాశం లేదు. ఆయన కథల అనువాదాలు పట్టుకోగలిగేవి కొంత మాత్రమే. అయినా ఆ కొంచెమే మనకి మహాభాగ్యం. కన్నడవారికి కూడా బషీర్ అంత దగ్గర కాగలిగాడంటే అది అనువాదాల చలవే కదా!” అని అన్నారు. అప్పటినుంచి కన్నడలో బషీర్‍ని చదివే అవకాశాల కోసం చూస్తున్నాను.

అనుకోకుండా, ఈ వారంలోనే “పాతుమ్మా మేక” అనే నవలికకి తెలుగు అనువాదం దొరికింది. ఈ కథ స్టోరీటెల్ లో ఆడియో రూపంలో రాగానే ప్రయత్నించాను కానీ నాకు మలయాళంలో పట్టుమని పాతిక పదాలకి అర్థం కూడా తెలీదు. అందుకని అసలు అర్థంకాక వదిలేశాను. తెలుగు అనువాదం దొరికాక మాత్రం ఒక పేరా తెలుగులో చదువుకుని, దాన్ని మలయాళంలో విని ఇలా వంతుల వారీగా మొత్తానికి పూర్తి చేశాను.

ఎందుకిన్ని తిప్పలంటే, ఏ విశ్వవిఖ్యాత ముక్కు లాంటి కథే అయితే అది కథే కాబట్టి ఏ భాషలో అయినా ఇంచుమించు ఒకేలా ఉంటుంది. కానీ, “పాతుమ్మా మేక” బషీర్ జీవితంలోని ఘట్టాలు. ఆయన కుటుంబంలోని విశేషాలు. అందుకని ఆయన భాష ఎలా ఉంటుందని ఒక కుతూహలం. అసలు, మలయాళీలని ఎవరిని కదిపినా ముందా భాష, యాసల గురించే మాట్లాడుతుంటారు.

మరి భాషరాని నేను మలయాళంలో వింటే మాత్రం ఏంటి ప్రయోజనం? ఎలా తెలుస్తుంది భాషలో సొగసు? అంటే దొరికినవారికి దొరికినంత అనుకోవాలి మరి. కథలో పాత్రలు ఎక్కువ కాబట్టి మాటిమాటికి పేర్లు వస్తుంటాయి కథనంలో. వాటిని ఆంకర్స్ గా పెట్టుకుని, సాధారణంగా వాడే కొన్ని క్రియలు ఫాలో అవుతూ (వచ్చారు, వెళ్ళారు, స్నానం, తిను లాంటివి), మిగితాది ఖాళీలు పూరింపుము టైపులో వింటూ చదువుకున్నాను. తెలుగు అనువాదంలో వాక్యనిర్మాణంలోనూ, పదాలలోనూ ఎలాంటి మార్పులు చేశారన్నది ఒక పది పేజీల లోపు అర్థమైపోయింది.

ఇలా వింటూ చదవడం ద్వారా నాకు కథ మాత్రమే కాకుండా ఇంకొన్ని విషయాలు అర్థమయ్యాయి.

  • బషీర్ కథల్లో కూడా హిందీ/ఉర్దూ కథల్లోలా ఎవరు అంటున్నారో ముందు ఉండి, ఆ తర్వాత డైలాగ్ వస్తుంది. ఫలానా వారు అన్నారు: <డైలాగ్> దాన్ని అనువాదకుడు తెలుగులో రాసే విధంగానే మార్చేశారు. <డైలాగ్> అని ఫలానా వారన్నారు.
  • బషీర్ కొన్ని మలయాళేతర పదాలని విరివిగానే వాడారు. ఉదా: పబ్లిక్ రోడ్, ఫౌంటేన్ పెన్, స్పెషల్ లాంటివి. తెలుగు అనువాదంలో వాటిని తెలుగిఫై చేసేశారు. 😉
  • నేను అనుకున్నదానికన్నా సంస్కృత పదాలు తక్కువే వినిపించినట్టుగా అనిపించింది. బహుశా ఆయన సామాన్యుల భాష రాయడం వల్లనేమో.
  • కొన్ని చోట్ల వాక్యాలు మిస్ అయినట్టు అనిపించాయి. అయితే, తెలుగు అనువాదం కోసం వాడిన టెక్స్ట్ ఆడియో కోసం వాడినది వేరే అయ్యుండచ్చు.

ఇహ, కథ విషయానికి వస్తే, ఇది బషీర్ దేశాటనం అంతా పూర్తి చేసుకుని ఇక ఇంట్లోనే ఉండాలని నిశ్చయించుకున్న తర్వాత జరిగిన ఘటనల క్రమం. ఒక మేక, దానికి పుట్టిన పిల్ల చుట్టూ కథ తిరుగుతుంది కాబట్టే టైటిల్ కూడా అదే. కానీ మొదలవ్వడమే “పాతుమ్మా లేక ఒక ఆడదానిబుద్ధి – దీనికి సంబంధించిన కథ చెప్పదల్చుకున్నాను” అంటూ మొదలవుతుంది. మలయాళ ఆడియో బుక్‍లో “తమాషా కథ” అని ఉంది మొదటి వాక్యంలో.

నిజంగానే, తమాషా కథ ఇది! ప్రతి మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి కథల్లో ఉన్నట్టే ఇందులోనూ బంధాలు, అనుబంధాలు తమాషాగా ఉంటాయి. అప్పుడే పీక పిసికి చంపాలనిపించేంత కోపం, అప్పుడే ప్రేమలు, మమతలు. వాటిని వ్యక్తీకరించే విధానం కూడా తమాషాయే! అన్నింటికన్నా ముఖ్యంగా వీళ్ళందరి మధ్య డబ్బు పోషించే పాత్ర. అవ్వడానికి ఇది మేక కథే అయినా, మేక కూడా ఒక కరెన్సీయే, అది కూడా కుటుంబ సభ్యుల్లో ఒకటి, కాని దాని విలువా అది కనే పిల్లల మీదా, ఇచ్చే పాల మీదా ఉంటుంది. దాని మీద పెట్టే ఖర్చు/పెట్టుబడి ఉంటుంది, రాబడి కూడా ఉంటుంది.

బషీర్ ఈ డైనమిక్స్ అన్నింటినీ గొప్పగా పట్టుకున్నారు. కథ చెప్తుంది ఆయనే కాబట్టి “అందరికన్నా ఎక్కువ నేను” అనే ఆటిట్యూడ్ కనిపించదు. పైగా ఆయన అప్పటికే విపరీతంగా పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్న రచయిత. కుటుంబానికి సరిపడా డబ్బు సమకూరుస్తున్న ఇంటి పెద్ద. అయినా, నరేటివ్ వాయిస్ న్యూట్రల్‍గానే కొనసాగిస్తారు. అవతలి పాత్రల్లో లోభం, ఆశ, చురుకుదనం అన్నీ ఎలా సమపాళ్ళల్లో ఉండి వాళ్ళు విలన్లుగా, అవకాశవాదులుగా మిగలరో, అలానే బషీర్ పాత్ర కూడా అడగ్గానే డబ్బులిచ్చేసే మనిషిలానూ ఉంటాడు, ఎక్కువ విసిగిస్తే గోడకేసి గ్లాస్ విసిరికొట్టగల మనిషిలానూ ఉంటాడు.

కొన్ని సంఘటనలు చాలా వింతగా, ఎలా అర్థం చేసుకోవాలో తెలీనంత విడ్డూరంగా ఉంటాయి. ఉదా: బషీర్‍ని ఒక రోజు ఇంట్లో వాళ్ళంతా “నాకు పది/పాతిక/యాభై రూపాయలు కావాలి” అని రోజంతా అడుగుతూనే ఉంటారు. తన దగ్గర ప్రస్తుతం డబ్బు లేదని తెలిసి కూడా ఎందుకు అడుగుతున్నారో ఆయనకి అర్థం కాదు. సాయంకాలానికి పోస్ట్ మాన్ మనీ ఆర్డర్ తెస్తాడు. వంద రూపాయలది. “ఈ మనీ ఆర్డర్ వస్తుందని మావాళ్ళకి చెప్పావా?” అని అడుగుతారు బషీర్. “మీవాళ్ళంతా నాకు తెల్సినవాళ్ళు, కావాల్సినవాళ్ళు. అందుకని మీకు ఏదన్నా వస్తే వాళ్ళకి ముందే చెప్పమన్నారు” అని పోస్ట్ మాన్ బదులిస్తాడు. అతను ఇంకా అక్కడే ఉండగానే బషీర్ ఆ వంద రూపాయల్లో ఒక పది రూపాయలని మేకకి తినిపిస్తాడు. “అదేంటి?” అని అడిగిన పోస్ట్ మాన్‍కి సమాధానం దొరకదు, చదివే మనకీ దొరకదు.

వచ్చిన డబ్బంతా ఇంట్లోవాళ్ళకి ఇవ్వడం తప్పదని తెల్సినప్పుడు మేకకు పది రూపాయలు తినిపించడం అంతరార్థం ఏమిటి? “ఇది నా డబ్బు, నా ఇష్టమొచ్చినట్లు చేసుకుంటాను” అని చెప్పడమా? లేదా, “మీకిచ్చే డబ్బు, ఈ మేకకి తినిపించేది ఒకటే” అని చెప్పడమా? ఎలా అర్థం చేసుకోవచ్చు. కథల్లో వచ్చే కాల్పనిక పాత్రలు ఇలా చేయవు. రచయితలు అలా ఊహించరు. మనుషులే పాత్రలైన కథల్లోనో, పాత్రలే మనుషులైన కథల్లోనో తప్పిస్తే!

కథకి ఔటర్ లేయర్‍లో ఒక మేక ఉంటుంది. దాని చుట్టూ ప్రస్తుత కథంతా నడుస్తున్నట్టు అనిపిస్తుంది. మధ్యమధ్యన చాలా ఫ్లాష్‍బాక్‍లూ వస్తుంటాయి. అవ్వన్నీ బషీర్‍ జ్ఞాపకాల్లోనివి. ఇది మధ్య లేయర్. ఈ ఔటర్, మిడిల్ లేయర్లని పట్టి కథని బిగువుగా ఉంచేది ఆ కుటుంబంలోని స్త్రీల కథలు. మాట మాటల్లో చెప్పేసిన కథలానే ఉంటుంది కానీ, రచనలపై థియరైజేషన్లు ఏవీ లేని కాలంలో వీళ్ళింత పకడ్బందీగా రాయగలిగారోనని అబ్బురంగా అనిపిస్తుంటుంది.

అన్నింటికన్నా ఎక్కువగా “పాతుమ్మ మేక” అనువాదంలో (అది ఎలాంటి అనువాదమైనా) మంచి అనుభూతినిచ్చింది. బషీర్‍ని కళ్ళముందు నిలబెట్టింది. ఏకకాలంలో సున్నితమైన గమనింపులని భాషలో పట్టుకోగల రచయితగా, తనని గుర్తించి ఆటోగ్రాఫ్ తీసుకోవాలని ఉబలాటపడే రచయితగా, రచనా వ్యాసంగం వల్ల వచ్చిన డబ్బులు చాలీచాలకపోయినా దాన్నే వృత్తిగా తీసుకున్న రచయితగా, తన పుస్తకాల ప్రతులని తింటున్న మేకని కొట్టకుండా, కొత్త పుస్తకం రాగానే దానికి మళ్ళీ తినిపించిన రచయితగా బషీర్‍ని పరిచయం చేసింది.

దానికన్నా ఎక్కువగా వాలు కుర్చీలో పడుకుని, విసనకర్రతో విసురుకుంటూ చిన్నతనంలో నేయీ-పంచదార దొంగచాటుగా తిన్న కథలు మనం కూడా వినవచ్చు. మలయాళీలంత కాకపోయినా ఆ పెరట్లో ఆ వరండాలో ఆ చెట్లు, మేకలు, కోళ్ళ మధ్య మనమూ తిరిగొచ్చామని చెప్పుకోవచ్చు, టూరిస్టుగానైనా. ఇదో ఈ వీడియోలో వాళ్ళంతా చెప్పుకుని మురిసిపోయినట్టు. Basheer is not a writer, he’s an emotion!

One comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s