Naalukettu: MT Vasudevan Nair

Posted by
Title: Chaukettina Mane
Original: Naalukettu
Original Language: Malayalam
Author: MT Vasudevan Nair 
Genre: Novel
Translated to: Kannada 
Translator: B.K.Thimmappa
Translation Published by: National Book Trust of India, 1972

ఇళ్ళు కూడా జీవాలు. అవీ మనుషుల్లానే ఎన్నెన్నో దశలు దాటుకుంటూ పోతాయి. వాటికీ వార్ధక్యం వస్తుంది. కొన్నింటికి పునర్జన్మలూ ఉంటాయి. అన్నింటికన్నా ముఖ్యంగా అవీ ఊపిరి తీసుకుంటుంటాయి. ఊపిరాడక గిలగిలమంటాయి. అందరికీ అక్కరగా ఉండి వైభవాలు చూశాక ఎవరికీ అవసరం లేకుండా పోతాయి.

నేనీ మాటలు “ఇంటి ఇంటిగా మార్చేది కుటుంబంలోని ప్రేమలూ, ఆప్యాయతలూ. అవి లేనప్పుడు నాలుగు గోడలే మిగిలుతాయి కానీ ఇల్లు కాలేదు” అని మామూలుగా వినిపించే సెంటిమెంట్‍తో అనడం లేదు.  ఇంగ్లీషు/హిందీలలో వ్యత్యాసం ఉన్న హౌస్ vs హోమ్, లేదా మకాన్ vs ఘర్ అర్థంలో అనడం లేదు. 

ఇళ్ళు కూడా జీవాలు. వాటంతటకవే స్వతంత్ర జీవాలు. మనుషులు ఎన్ని భావావేశాలు ఆపాదించినా ఇంటికీ సొంత మనోభావాలు ఉంటాయి, మనం వినిపించుకోం అంతే! 

విఖ్యాత మలయాళ రచయిత, ఎమ్.టి. వాసుదేవన్ నాయర్ రాసిన “నాలుకెట్టు” అనే నవల గురించి మాట్లాడేటప్పుడు కూడా అది అప్పోణ్ణి అనే యువకుని గురించి, అతనికి హక్కుగా రావాల్సి ఉండి రానివ్వని మండువా ఇంటి గురించి అనే వినిపిస్తుంది. కానీ నిజానికి ఈ నవల ఆ మండువా ఇంటి గురించే! దానిపై పెత్తనం చేసేవాళ్ళు ఎలా మారారన్నదే ప్రధానంగా కథను ముందుకు నడిచినా, నవలని కాస్త లోతుగా తరిచి చూస్తే అర్థమవుతుంది: ఇది coming-of-age నవలే, కానీ అప్పోణ్ణిది మాత్రమే కాదు, ఆ ఇంటిది కూడా. 

అందుకే, మామూలు కథల్లా ఈ కథ పాత్రల ప్రయాణాలు, చేరుకున్న గమ్యాల దగ్గర ఆగదు. చిట్టచివరి పేజీలో అందరికన్నా ఎక్కువ సతమతమైన ఆ ఇల్లే మళ్ళీ ఊపిరి పీల్చుకుంటుంది. ఈ కథ సుఖాంతం అవ్వడానికి ఆ ఇల్లు కూడా తరతరాల చరిత్రని కూలగొట్టి తన కాళ్ళ మీద తాను సొంతంగా నిలబడాలి. అందుకే అంటున్నా, ఈ కథకు నాయకుడు (ప్రొటాగనిస్ట్) ఆ ఇల్లేనని.

*****   

మలయాళ సాహిత్యంలో క్లాసిక్ అని విపరీతమైన పేరున్న ఈ నవల గురించి ఇంటర్నెట్‍లో మలయాళంలో తప్పించి పెద్దగా సమాచారం దొరకడం లేదు. అందుకని ఇక్కడ కథని కొంచెం వివరంగా చెప్తున్నాను. 

మలయాళీలలో నాయర్ అనేది ఒక అగ్రకులం. ఆ కులానికి సంబంధించినవారు ఒకప్పుడు మాతృస్వామ్య వ్యవస్థను పాటించేవారు. ఇంటికి ఆడవారే పెద్ద. “సంబంధం” అని పేరుతో పెళ్ళికి బదులు ఒక సంప్రదాయం ఉండేది. ఆడవాళ్ళు తమ ఇంటికి వచ్చిన మగవాణ్ణి ఆ పూటకు భర్తగా స్వీకరించేవారు. అలా ఒకరికన్నా ఎక్కువ పురుషలతో సంబంధం ఉండేది. భర్తలని ఎన్నుకునే హక్కు స్త్రీలకి ఉండేది. కుటుంబంలో సంపద ఆడవారి చేతుల మీదుగా తరతరాలకి అందేది. అయితే ఈ వ్యవస్థ ఎక్కడో బీటలు వారడం మొదలైంది. “సంబంధం” నడుస్తూనే ఉన్నా పెత్తనమంతా మగవారి చేతుల్లో మారింది. 

ఆ సంప్రదాయం మరుగునపడ్డాక, రెండు తరాల కథని “నాలుకెట్టు” అనే నవలలో చూపించారు. అప్పోణ్ణి ఇంకా ఎనిమిదో తరగతి చదువుతుండగానే కథ మొదలవుతుంది. తండ్రిని చంపినవాడిపై ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతూ ఉంటాడు. తండ్రిని స్నేహితుడు, సహ-వ్యాపారి అయినవాడే హత్య చేస్తాడు. తల్లిదండ్రులది పెద్దలు అంగీకరించని వివాహం. ఊరిలో పేరూ పరపతి ఉన్న నాయర్ కుటంబంలో పుట్టి పెరిగిన తల్లి, తనకి వచ్చిన ముసలి ధనవంతుని కాదనుకుని, తన కులానికే (లేదా ఉప-కులం) చెందిన వ్యక్తి ని కోరి పెళ్ళిచేసుకుంటుంది. దానితో ఇంట్లోవాళ్ళు ఆమె చచ్చినదానితో సమానంగా భావించి అంత్యక్రియలు చేస్తారు. జూదంలో చేయితిరిగినవాడిగా పేరున్న అతను పెళ్ళయ్యాక వ్యాపారం మొదలెడతాడు, హత్యకాబడతాడు. దానితో కలవారి కూతురు కటిక పేదరికాన్ని చూడాల్సి వస్తుంది. కొడుకుని పెంచడానికి పాచిపనులు చేస్తుంది. 

తనకు హక్కుగా రావాల్సిన “నాలుకెట్టు” ఇంటిలో ప్రవేశానికి కూడా నోచుకోడు అప్పోణ్ణి. పంతం పట్టి వెళ్తాడు ఓసారి, అవమానాలు పాలవుతాడు. ఇంతలో తల్లికి మరో మగ ఆసరా దగ్గరవుతున్న కొద్దీ సహించలేక ఆదరించని ఆ కుటుంబం పంచనే చేరుతాడు. పేరు గొప్ప, ఊరు దిబ్బలా నడుస్తున్న ఆ పెద్దింటి వ్యవహారాలని గమనిస్తాడు. వాళ్ళని నమ్ముకుంటే అయ్యేపని కాదని చదువు మీదే ధ్యాస పెట్టి పాస్ అవుతాడు. ఉద్యోగ వేటలో తండ్రి హంతకుని సాయం తీసుకుంటాడు. బదులుగా అతని కుటుంబానికి సాయం చేస్తాడు. ఐదేళ్ళ ఉద్యోగంతో సంపాదించిన డబ్బుని ఆ నాలుకెట్టుని కొనడానికి వినియోగిస్తాడు. ఎట్టకేలకు తల్లిని, తల్లికి తోడుగా ఉన్న వ్యక్తిని ఆ ఇంటికే తీసుకొస్తాడు. 

*****  

మలయాళ సాహిత్యంలో ఈ నవల క్లాసిక్ ఎందుకు అయ్యిందో తెలుసుకోవాలంటే కేరళ సామాజిక, రాజకీయ పరిస్థితులపై అవగాహన ఉండాలి. అప్పటికే వస్తున్న మలయాళీ సాహిత్యంలో ఏం రాస్తూ ఉన్నారో, వాటికి భిన్నంగా ఈ రచన ఎలా నిలిచిందో తెలియాలి. అవేవీ తెలీని నేపథ్యంలో, ఈ పుస్తకం మొదటి వచ్చి ఇప్పటికి యాభై అరవై ఏళ్ళు అయ్యాక చదివినా కూడా అడుగడునా ఇదో క్లాసిక్ అని అనిపిస్తూనే ఉంది. The work screams of its genius, oh-so-subtly, at every corner. 

దీనికి ముందు ఎమ్.టీది నేను రండమూళం (భీమా: ది లోన్ వారియర్) చదివాను. అందులో వచనం అవసరమైన మేరకే ఉండి, అలతి పదాలతో సంక్లిష్ట భావాలు ఉంటే అది మహాభారతాన్ని ఏ ఆర్భాటాలూ లేకుండా చెప్పడంలో వాడిన strategy అనుకున్నా కానీ ఈ నవలలోని వచనం కూడా అలానే ఉండడం నన్ను అబ్బురపరిచింది. దానికి తోడు ఇది రచయిత ఇరవై మూడేళ్ళ వయసులో రాశారని తెలుసుకుని నోరు వెళ్ళబెట్టాను. ఆ తర్వాత ఆయన మలయాళ సాహిత్యంపై తనదైన ముద్ర వేయడంలో ఆశ్చర్యమే లేదు. 

నవల మొదలవ్వడమే అప్పోణ్ణి ప్రతీకారేచ్ఛతో మొదలవుతుంది. కానీ తన తండ్రి హంతుకుణ్ణి కలిసినప్పుడు మాత్రం ఆ కళ్ళల్లో మమకారాన్ని మాత్రమే చూడగలుగుతాడు. ఎన్నో కష్టనష్టాలకు నోర్చుకుని పెంచుకుంటూ వస్తున్న తల్లిని మాత్రం (అర్థంచేసుకోదగ్గదే అయినా) కోపంతో దూరం చేసుకుంటాడు. ఎప్పుడో చివరకి మళ్ళీ ఆమెకి దగ్గరవుతాడు. చిన్నపిల్లాడు, తండ్రిలేని వాడు అని కూడా చూడకుండా ఈసడించుకున్న చుట్టాలతో కూడా చివరకి ఈక్వేషన్స్ మారిపోతాయి. 

ఈ వైరుధ్యాలని ఎంత సరళంగా కథనంలో చూపించగలిగారో చదివితేనే తెలుస్తుంది. మితిమీరిన డ్రామాకి, ఎగసిపడే భావావేశాలకి అవకాశం ఉన్నా, ఈ పాత్రల చుట్టూ కేరళ చారిత్రక, సామాజిక నేపథ్యాన్ని చొప్పించే అవకాశం ఉన్నా కూడా వాటి జోలికి పోకుండా పాత్రల బహిర్గత అంతర్గత లోకాలని చూపించడం విశేషం. మరో రచయిత చేతిలో ఇదో ఐదొందల పేజీ నవల అయ్యేది. అప్పుడూ క్లాసిక్‍గా నిలుచుండచ్చు, కానీ ఎమ్.టీ కనీసం ఏ కాలంలో ఈ కథ జరుగుతుందన్నది కూడా చెప్పకుండా ఉండడంతో దీనికో timelessness quality వచ్చింది. 

నాకు రండమూళం మళ్ళీ మళ్ళీ గుర్తురావడానికి ఇంకో కారణం: భీముడిలానే అప్పోణ్ణి కూడా కుటుంబ ఆదరణ కోసం విపరీతంగా ప్రయాసపడతాడు. తండ్రిని చిన్నతనంలోనే కోల్పోతాడు. బతికున్న తల్లితో ఓ రకమైన మానసిక దూరం. రెండు పాత్రల సైకాలాజికల్ ట్రేస్ దగ్గరగా ఉంటుందని బలంగా అనిపిస్తుంది. 

*****  

మలయాళ వంటకాలు తినడం ద్వారా, మలయాళ కథలు వినడం ద్వారా, మలయాళ కళలు చూడ్డం ద్వారా మాత్రమే అందే అరుదైన అనుభూతులు కొన్ని ఉంటాయి. అవి ప్రపంచంలో మరెక్కడ వెతికినా దొరకవు.

ఈ నవలలో కూడా అలా మలయాళ ప్రత్యేకమైన కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. ఒకటి, సర్పం తుల్లాల్. ఇదో mystical ritual. సర్పాల ఆత్మని కన్యలలోకి ఆవహింపజేసే కళని నమ్ముతారు. రంగురంగుల పాము ముగ్గులు వేసి, ఆటపాటలతో ఆత్మని ఆవహింపజేస్తారు. దీన్ని వాడుకుంటూ ఒక కీలక ఘట్టాన్ని మొత్తం రచించారు. అంతరార్థాలు మనకి తెలియకపోవచ్చును గానీ, ఈ భాగం చదువుతున్నంత సేపూ ఆ పది పన్నెండేళ్ళ కుర్రాడిలానే మనం కూడా కళ్ళింతలు చేసుకుని ప్రతీ వాక్యానికీ అబ్బురపోయాను. ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాను.

అలానే, కేరళలో వరద ఉధృతిని తెలిపే సన్నివేశం మొత్తం.

“కాళరాత్రికి కాపలాదారుల్లా చెట్ల నల్లని ఆకృతి ఒక్క క్షణం కనిపించింది. మళ్ళీ చీకట్లు. కంటిలోపలా చీకటే పరుచుకుంది.” అని ఒక తుఫాను/వరదనాటి రాత్రిని అభివర్ణిస్తారు. ప్రకృతిని అంత దగ్గరగా చూస్తారు కాబట్టే మలయాళ రచయితలు దానిలో వికృతిని కూడా అంత అందంగా చెప్పగలరనిపిస్తుంది. పాత్ర మానసికావస్థకి ధీటుగా వాతావరణాన్ని సృష్టించడం గొప్ప ఎత్తుగడ. ఈ ఒక్క చాప్టర్ ఎన్ని సార్లు చదివినా తీరడం లేదు. 

*****  

నేను రాసే ప్రతి నవలలోనూ స్త్రీ పాత్రల గురించి ఒక ప్రత్యేక సెక్షన్ రాయాలని కొన్నాళ్ళుగా నిశ్చయించుకున్నాను. ఇందులో దాదాపు కీలక పాత్రలన్నీ మగవారివే అయినా, ఆడపాత్రలు ఉన్నవి తక్కువ, ఆక్రమించుకున్న స్థానం తక్కువే అయినా చాలా ప్రతిభావంతంగా ఉంటాయి. 

వయసు మళ్ళినవారిగా కనీసం మూడు ముఖ్య పాత్రలు కనిపిస్తాయి. అప్పోణ్ణికి గతాన్ని చెప్పే బామ్మ, అతని అమ్మమ్మ, తండ్రిని హత్య చేసినవాడి తల్లి. అప్పోణ్ణికి దగ్గరైన అమ్మాయి ఒకామె ఉంటుంది. నాలుకెట్టలో ఉండగా అన్ని విధాల సాయం చేసిన అమ్మాయి. వయసుతో నిమిత్తం లేకుండా వీళ్ళందరిలో ఎనలేని మమత పొంగుతూనే ఉంటుంది.   

మలయాళ సాహిత్య చరిత్రలో అప్పోణ్ణిది విశిష్ట పాత్ర అయ్యుండచ్చు కానీ, నాకు మాత్రం అతని తల్లి పారు కుట్టి మాత్రమే మనసులో నిలిచిపోయేట్టుంది. ఏమీ తెలీని వయసులో నచ్చినవాడి కోసం అందరినీ ధిక్కరించిన తెగువ నుంచి, అందరికీ దూరమై భర్తనూ పొగొట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపిన రోజుల నుంచి, బిడ్డ యోగక్షేమాలు మించి మరో తలంపే లేకుండా, తోడుగా ఉంటానన్న మగవాడిని కాదనుకుని, ఆఖరికి ఆ బిడ్డే దూరమైపోతే బతుకు మీద ఆశ చచ్చి నిస్సారంగా చావుకు లొంగిపోబోతుంది. బతికి బయటపడ్డాక మళ్ళీ దూరమైన కొడుకు కోసమే అన్నీ సమకూరుస్తుంది. 

ఎమ్.టీ ఎందుకు గొప్ప రచయిత అంటే నేను పారు కుట్టిని సృష్టించినందుకు అనే అంటాను. తల్లికి బిడ్డపై మమకారం ఉండడం సహజమే అంటారు. కానీ ఒక మగరచయితకు ఆడవారి అందచందాలు, శరీరాకృతులు కాకుండా, వారి జీవితాలు, మానసికావస్థలు, ఆలోచనలపై ఇంతటి మమతతో కూడా గౌరవమర్యాదలు ఉండడం బహు అరుదు. ఎందరి తల్లుల వేదనను విన్నాడో కన్నాడో కానీ ఈ తండ్రి మాత్రం గొప్ప మానసపుత్రికనే కలం ద్వారా కన్నాడు!

*****   

నేను “నాలుకెట్టు”కి బి.కె.తిమ్మప్ప చేసిన కన్నడ అనువాదం “చౌకట్టినె మనె” చదివాను. ఎన్.బి.టి వారి ప్రచురణ. కన్నడంలో కాబట్టే నాకు ఎమ్.టి. వాక్యంలో పనితనం బాగా తెలిసిందని అనిపించింది. అనువాదం క్వాలిటీ గురించి నేను వ్యాఖ్యానించలేను కానీ, కథ అర్థమవ్వడానికి ఆ ఆర్ద్రతలో మునిగితేలడానికి అడ్డంకులేవీ ఎదురవ్వలేదు. అక్కడక్కడా కొటేషన్ మార్కులు మిస్ అయ్యాయి. దానితో డైలాగులు ఎక్కడ ముగుస్తున్నాయో తెలీదు. నాకు కన్నడం మీద పూర్తి పట్టు లేకపోవడం వల్ల proper nouns ని కూడా డిక్షనరీలో వెతుక్కుని, తికమకపడి, ఆ పైన అవి పాత్రల పేర్లని నిర్దారించుకున్నాను. But overall, it was an enterprise totally worth it.  

గీతా కృష్ణన్‍కుట్టీ ఇంగ్లీషులోకి అనువాదం చేశారు. ఆవిడ రాసే పరిచయ వ్యాసం కోసమైనా ఆ పుస్తకం తెప్పించుకుని చదవాలి.  

3 comments

  1. ఈ పుస్తకాన్ని చాన్నాళ్ళ క్రితం చదివాను. తెలుగులో సమిష్టి కుటుంబం పేరుతో అనువాదం ఉన్నది. పాత అనువాదం.
    ఈ నవల చదివాకే మలయాళ మాతృ స్వామ్య వ్యవస్థ అనే విషయం నాకు తెలిసింది.
    అప్పణ్ణి తన మేనమావ పెద్దరికాన్ని పరిహసించటానికి కూడా తను ఆ ఇల్లు కొనటం కారణం అవుతుంది.
    ఆ ఇంటికి దూరమైన తల్లిని మళ్లీ ఆ ఇంటికి చేర్చటం కూడా కావొచ్చు. ఇందులో ఆ ఇళ్లు పాత్ర అని మీరన్నప్పుడు అది రెండు వ్యవస్థల మార్పుని పోషిస్తోంది అనిపిస్తోంది.

    Like

Leave a comment