The Craft of Writing Effectively: Larry McEnerney

Posted by

యూనివర్సిటీ ఆఫ్ చికాగో ప్రొఫసర్ ఒకరు రచనా వ్యాసంగం గురించి ఇచ్చిన లెక్చర్ యూట్యూబులో బా వైరల్ అయ్యిందని ఒక కోర్సులో తెలిస్తే, సరే అని చూడ్డం మొదలెట్టాను. “ఒక దెబ్బకి రెండు పిట్టలు” తరహాలో అటు నా వృత్తికి, ఇటు నా రచనా వ్యాసంగానికి రెండింటికీ ఏకకాలంలో పనికొచ్చే ఉపన్యాసాలు కనిపించినప్పుడు నాకు మహా ఆనందంగా ఉంటుంది. దాని గురించి నాలుగు ముక్కలు ఇక్కడ రాసుకుందామని. అదీ కాక, ఫేస్బుక్ లో కథారచన గురించి నేను రాసేవి సగం-సగం చదివి, context అర్థం చేసుకోకుండా ఎడాపెడా వ్యాఖ్యలు చేసేవాళ్ళకి కొత్త సరకు అందించినట్టు ఉంటుందని కూడా! 😉

ముందుగా కొన్ని విషయాలు:

  • ఇది ఒక యూనివర్సిటీ కోర్సులో భాగంగా ఇచ్చిన లెక్చర్. దానికి తోడు ఇది విద్యార్థులకి ఉద్దేశించిన కోర్సు కాదు. ఫాకల్టీ కోసం రూపొందించబడింది. అందుకని కొంచెం విభిన్నమైన, ఎప్పుడూ వినబడని  ఆలోచనలు ఉన్నాయి.
  • ఎక్కువ అకెడమిక్ రైటింగ్ గురించే ఇందులో ప్రస్తావన ఉంది. అంటే, experts writing for experts! అయినా కూడా, దీన్ని తెలుగు కథ రచనా వ్యాసంగానికి అన్యయించుకోవచ్చునని నాకనిపించింది. ఈ పోస్టులో కేవలం తెలుగు కథా రచనలకి పనికొచ్చేవి మాత్రమే ప్రస్తావించబోతున్నాను. మీరు లెక్చర్ పూర్తిగా విన్నాక ఈ కింది పాయింట్స్ తో ఏకీభవించకపోవచ్చు. ఇవి ఆయన చెప్పిన మాటలతో పాటుగా వాటిని నేను అన్వయించుకున్న విధానం.
  • ఈ పోస్టులో నేను మధించి, శోధించి రాస్తున్నది కాదు. Writing is thinking అనే సూత్రం ప్రకారం, అకడమిక్ రైటింగ్ నుంచి క్రియేటివ్ రైటింగ్ కి, అందులోనూ తెలుగులో రచనలకి ఎంత అన్వయించుకోడానికి చేసే ప్రయత్నం. ప్రయత్నాలు విఫలమవ్వచ్చునని గమనించగలరు.

రచయిత-పాఠకుడి ఈక్వేషన్

రచనా వ్యాసంగంలో రచయితదీ, పాఠకుడిదీ సమిష్టి వ్యవసాయం అనేది మనకి తరుచుగానే వినిపించే మాట. అయితే, ఈ లెక్చర్ లో ప్రొఫసర్ గారు, రాసేటప్పటి ఉద్దేశ్యానికి, చదివేటప్పటి ఉద్దేశ్యానికి వివరంగా తేడా చెప్పారు.

రచయిత తన చుట్టూ ఉన్న లోకాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఆలోచిస్తాడు. ఆ ఆలోచలని ఛేదించుకుంటూ ఒక దారీ తెన్నూ వెతుక్కోడానికి రాయడమనేది ఉపయోగపడుతుంది. ఆలోచించడం, రాయడం అనేవి వేర్వేరు పనులు కాదని ప్రొఫెసర్ వాదన. కోరాలో నేను నిర్వహించిన సెషనులో దీనికి సంబంధించిన ప్రశ్న వచ్చింది: రచయితలు ఆలోచనాపరులు కావాల్సిన అవసరముందా? మనకి కనిపించేదాన్ని, అనిపించేదాన్ని మించి ఇంకేమన్నా చూడాలనుకున్నా, తెలుసుకోవాలనుకున్నా ఇలా ఆలోచన-రాత ద్వయాన్ని ఆశ్రయించక తప్పదు. భావోద్వేగాలను, సామాజిక పరిస్థితులను తెలియజెప్పగల ఒక expert గా రచయితను భావిస్తే, ఎన్నో layers of complexities and subtleties ఉన్న వాటిని (పరి)శోధించేక గానీ నవల రాయలేరు కాబట్టి సంక్లిష్ట ఆలోచనలు చేయలేనివారు రచనలు చేయలేరు అనే చెప్పచ్చు.

తన చుట్టూ ఉన్న లోకాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో రచయిత ఒక రచనని ప్రొడ్యూస్ చేస్తే, తన చుట్టూ ఉన్న లోకాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో పాఠకుడు ఒక రచనని consume చేసుకుంటాడు. అంటే, రచయితకి output అయితే, ఒక రచన పాఠకుడికి input.

రచయిత తనకు అర్థమైనదాని గురించి చెప్పడానికి రచన చేస్తే, పాఠకుడు తనకి తెలిసినదాన్ని, అర్థంచేసుకున్నదాన్ని మార్చుకోడానికి/మెరుగుపర్చుకోడానికి చదువుతాడు.

ఇది కీలకమైన తేడా. రచయితకీ, పాఠకుడికీ జరిగే సంభాషణలో ఒక inherent conflict ఉంటుందనిపిస్తుంది. “నాక్కావలసింది నువ్వు ఇవ్వగలవా?” అనే ఛాలెంజీతోనే అది మొదలవుతుంది. రచయిత ఆ చాలెంజ్ లో నిలదొక్కోగలిగితేనే పాఠకుడు రచన పూర్తి చేస్తాడు. 

పాఠకునికి ఏం కావాలి?

పైన చెప్పుకున్నట్టు పాఠకుడికి తన లోకాన్ని కొత్తగా అర్థం చేసుకోవడమే ప్రధమోద్దేశ్యం కాబట్టి అందుకు తగ్గట్టుగానే ఒక రచన తనకి ఎంత విలువైనది అన్నదే చూసుకుంటాడని ప్రొఫెసర్ గారు నొక్కివక్కాణించారు. అకడమిక్ రచనల్లో అయితే clear, organized, persuasive అనేవి ముఖ్యమే అయినా వాటి అన్నింటికన్నా ముఖ్యమైనది valuable గా ఉండడమని అంటారు.

పాఠకుడికి ఆ విలువ కనిపించనప్పుడు రచనను:

  • మెల్లిగా చదువుతాడు (లేదా మళ్ళీ మళ్ళీ చదువుతాడు)
  • అర్థం కాక తికమక పడతాడు
  • చిరాకు పడతాడు
  • వదిలేస్తాడు.

Value is in the reader and not in the content!

ఈ స్టేట్మెంటుని కాస్త లోతుగా అర్థం చేసుకునే అవసరం ఉంది. మనం మామూలుగా వినే మాటలు: “ఇది చాలా విలువైన రచన. ఫలానా రచయిత ఈ కాలానికి అవసరం.”

ఆ రచనలకు ఆ విలువ ఎవరు ఇచ్చారు? అసలైతే సమాధానం పాఠకలు అని ఉండాలి. కానీ ఒక్కోసారి అది తోటిరచయితలు, సాహిత్య విశ్లేషకులు/విమర్శకులుగా మారిపోతుంటుంది. వాళ్ళు విలువైనవి అన్నారంటే విలువైనవే కావచ్చును కదా అన్న ప్రశ్న రావచ్చు.

కానీ, ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక సున్నితమైన విషయం ఉంది. పైన చెప్పుకున్నట్టు పాఠకుడు ఎందుకు చదువుతాడు? తనకి తెలిసిన అర్థాన్ని మార్చుకోడానికి. అంటే, అతణ్ణి ఏదో తికమక పెడుతుండచ్చు, కుతూహలం రేపొండచ్చు, లోపల దొలిచేస్తుండచ్చు. వాటి కోసం, ఒక పర్సనల్ లెవల్‍లో సమాధానాల కోసం రచనలని చదువుతాడు. సమాధానాలు ఇచ్చినా, ఇంకొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు రేపినా ఆ రచనకి విలువ ఇస్తాడు.

తోటి-రచయితలు, సాహిత్య విమర్శకులు అకడమియాలో ప్రొఫసర్లు, స్టూడెంట్స్ వంటివారు. వారు చదివేది ప్రొఫషనల్ కారణాల కోసం. గ్రేడుల కోసమో, జీతం కోసమో. వాళ్ళూ కొన్ని విశేష సందర్భాల్లో పాఠకులుగా మారిపోయి రచనలకి విలువనివ్వచ్చు. కానీ, నిజానికి, వాళ్ళది పని-లాంటి-పని.

తెలుగులో (కనీసం నా విషయంలో, నాలాంటి ఇంకొందరి విషయంలో) నా రచనలకి పాఠకులు అనేవారెవ్వరో తెలీక, ఉన్న ఈ తోటిరచయితల అభిప్రాయాలు, అభాండాలే కొలమానం అయిపోతున్నాయి. మాటలకి ఎలాగ మన అర్థం ఆపాదించే వరకూ అవి అర్థం-రహిత (meaningless అని కాదు, devoid of any meaning) మాటలుగా మిగిలిపోతాయో, రచనలు కూడా విలువ-రహితంగా (devoid of any value) ఉండిపోతాయి. ఏనాటికైనా పాఠకులని చేరగలిగితే విలువైనవి అనిపించుకోవచ్చు.

కమ్యూనిటీ బలం

అకడమిక్స్ అన్నీ జ్ఞానం సముపార్జన, పెంపొందించడం కోసం ఉద్దేశించినవే కాబట్టి knowledge system models ని ఎలా అర్థం చేసుకోవచ్చో కూడా వివరంగా చెప్పారు లెక్చరులో.

సాహిత్యం అనేది కూడా ఒక రకమైన జ్ఞానమే కాబట్టి దానికీ ఈ మొడల్ అన్వయించుకోవచ్చునని అనిపించింది నాకు. ముఖ్యంగా, అకడమిక్స్ లో అంటే పేపర్లు, రివ్యూలు, ఛాలెంజీలు అని ఏవో హడావిడి ఉండడం వల్ల, దానికి ఏవో కొన్ని పద్ధతులు ఉండడం వల్ల strict and rigid model అనిపిస్తుంది కానీ, సాహిత్యంలో అవి కూడా ఉండవు.

ఒక సమూహం (పాఠకులు, రచయితలు) ఒకరితో ఒకరు జరిపే సంభాషణలు, వాటినుంచి మొదలయ్యే చర్చలు, అవి దారితీసే అభిప్రాయాలు, ఈ లోపు కొత్తగా తెలిసేవి, తప్పని తేలేవి – వీటిన్నింటితోనే ఆ సమూహం జ్ఞానం సముపార్జనలో ఒక అడుగు ముందుకేస్తూ పది అడుగులు వెనక్కేస్తూ అతి నెమ్మదిగా కదులుతుందంటారు ప్రొఫసర్.

అట్లా చూసుకుంటే సాహిత్య సమూహం కూడా చర్చలూ, వాదోపవాదాలు, తర్జనభర్జనలతోనే ముందుకు నడుస్తుందని మనం గుర్తించాలి. ప్రస్తుతం తెలుగు సాహిత్యంతో సంబంధం ఉన్నవాళ్ళల్లో (నాతో సహా) ఒక నిరాశ ఉంది – the quality of discussions is too basic and too poor అని. నిరూత్సహపరిచే, నీరుగార్చే మాటలు, అదీ సాహితీ పెద్దలుగా చెలామణి అయ్యేవాళ్ళ నుంచి వినిపించినప్పుడల్లా చెప్పలేనంత చిరాకు.

అయితే, మనం అర్థంచేసుకోవాల్సింది, ఇక్కడ ఏదో సంభాషణ అయితే నడుస్తోంది. సాహిత్యం గురించి మాటలు వినిపిస్తున్నాయి. అంటే, అంత మంది ఆసక్తి చూపిస్తున్నట్టే. మనం ఎంత అవగాహన పెంచుకుని, ఎంత నిబద్ధతతో ఈ చర్చలో మన వంతుగా పాల్గొంటామో, ఓవరాల్‍గా క్వాలిటీ కూడా మెరుగుపడుతుంది.

దేని కోసం రచన?

Writing is NOT communicating your ideas. Writing IS changing their (readers’) ideas.

మనకి తెలిసింది తెలుసునని చెప్పడానికి కాదు రచనలు చేయడమంటే, “పాఠకునిగా నీకు తెలిసినదాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాను” అని చెప్పడానికి అని అంటారు.

ఇది కూడా లోతుగా అర్థం చేసుకోవాల్సిన మాట. ముఖ్యంగా కథలు రాసేవాళ్ళు.

“బయట సాహిత్యంతో పోలిస్తే తెలుగులో అంత గొప్ప రచనలు రావడం లేదు” అన్న ప్రతీసారి “ఆ, బోడీ, నీ మొహం, నీకేం తెలుసు, తెలుగు సాహిత్యం తోపు, తురుము” అనే మాటలు వినిపిస్తున్నాయే గానీ, అసలు ముందా మాట ఎందుకు వచ్చిందో అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు.

ప్రస్తుతం దేశంలో నానారకలా గొడవలున్నాయి, కానీ వాటి అన్నింటిలోకి మతకల్లోలాలు, మరీ ముఖ్యంగా హిందూ-ముస్లిం గొడవలు ఎక్కువగా ఉన్నాయి. ఈ అంశంపై తెలుగులో కథలు వచ్చాయి. వాటిని చదివితే నాకు తెలిసేది ఏంటి? హిందూ-ముస్లిములకి గొడవలు జరుగుతున్నాయని. వార్తాపత్రికలు, టీవీలు చెప్పిన విషయమే. ఇక్కడ కొన్ని కల్పిత పాత్రలుంటాయి. కొన్ని సన్నివేశాలు ఉంటాయి. అన్నింటికన్నా ముఖ్యంగా “అబ్బా! అయ్యో! అమ్మో!” అనేంత నాటకీయత ఉంటుంది. దీన్నే writing to tell what you know గా అనుకోవచ్చు.

ఇదే కథాంశంగా తీసుకుని, writing to change readers’ understanding కి ఉదాహరణ  చెప్పుకోవాలంటే ఒక కె.ఆర్.మీరా “ఖబర్”. తెలుగు కథలో ఉన్నంత స్పష్టంగా బైనరీలు, బౌండరీలు (హిందూ-ముస్లిం, పీడితుడు-పీడకుడు, వివక్ష-పక్షపాతం) ఇందులో ఉండవు. హిందువే ముస్లిము, ముస్లిమే హిందు, పీడించేవాడే బాధితుడు, బాధితుడే పీడించేవాడు అన్నంతగా కలిసిపోయి మన ఐడెంటిటీల చుట్టూ ఉన్న అసంబద్ధత మనకి కళ్ళకి చూపిస్తుంది కాబట్టి.

Gimme a Qabar (or a Hangwoman) in Telugu and I’ll STFU about anything Telugu literature!

ఈ తేడాని గమనించుకోవాలి కథలు రాసేవాళ్ళంగా. ఏం చెప్తున్నాం, ఎంత లోతుగా చెప్పగలుగుతున్నాం, మరీ ముఖ్యంగా ఎవరికి చెప్తున్నాం, ఎందుకు చెప్తున్నాం – వీటికి మన దగ్గర సమాధానాలుండాలి. ఆ సమాధానాల్లో మనకి ఏవో కొత్త దారులు కనిపించాలి, వాటివెంట పాఠకుని పట్టుకెళ్ళగలగాలి. పాఠకులు విలువ ఇవ్వగలిగేంత విషయమేదో రచనలో ఉండాలి.

Write to move the conversations forward – సంభాషణలని ముందుకు తీసుకెళ్ళగలగాలి. “నేను కూడా ఒక ట్రెండింగ్ టాపిక్ మీద రాసి లైకులు కొట్టేశాను” టైప్ కాకుండా కాస్త ఏమిటి జరుగుతుందో ఇంకొంచెం లోతుగా, తీక్షణంగా చెప్పడానికి ప్రయత్నించాలి. అది సమస్తం తెల్సుకున్నాక (అదెటూ అయ్యే పని కాదు), అత్యుత్తమ రచనగా రానవసరం లేదు, కానీ సంభాషణను ముందుకు తీసుకెళ్ళగలిగే ఉండాలనే ప్రొఫసర్ మాటలు గుర్తుపెట్టుకోదగ్గవి.

టార్గెట్ రీడర్స్

లెక్చర్ లో మళ్ళీ మళ్ళీ వినిపించిన మాట: రచనకు పాఠకుడే విలువనిస్తాడు అనేది. అయితే పాఠకులందరికీ ఒకటే రచన విలువైంది అనిపించదు. ఎందుకంటే పాఠకులందరికీ ఒకటే ప్రశ్నలు, సంశయాలు, కుతూహలం ఉండవు కాబట్టి.

తెలుగు పాఠకులని కూడా ఒక homogenous groupగా భావించడం, తెలుగులో ఫలానావే చదువుతారు, ఫలానావే అమ్ముడుపోతాయి అన్న థియరీలు పసలేనివి, పనికిరానివి. ప్రతీ రచనకి టార్గెట్ రీడర్స్ ఉంటారు. తెలుగులో కూడా ఉంటారు.

అయితే, అకడమిక్స్ లో ఈ టార్గెట్ రీడర్లని ఏ అర్థం చేసుకోవాలి, వాళ్ళకి కావాల్సింది ఏమిటి, వాళ్ళతో ఎలాంటి భాషలో మాట్లాడాలి వగైరాల గురించి ఆయన కొన్ని సలహాలూ సూచనలూ ఇచ్చారు. “వాళ్ళు దేనికి విలువనిస్తారు? వాళ్ళకి వేటి మీద సంశయాలు ఉన్నాయి?” అన్న ప్రశ్నలు ముఖ్యమన్నారు. అయితే వాటిని తెలుగు పాఠకులకి ఎలా అన్వయించుకోవాలన్నది నాకింకా అంతు చిక్కడం లేదు. అసలు డేటాపాయింట్సే లేవనిపిస్తుంది. ఇది ఆలోచించాల్సిన పాయింట్. దీని గురించి ఇంక్కొంచెం క్లారిటీ వచ్చాక మరోసారి ఎప్పుడైనా.

పూర్తి లెక్చర్ కి లింక్

Leave a comment