Affectionately dedicated to HP Compaq 6720s

తిలక్ కథలు – 1

ఓ శనివారం మధ్యాహ్నం పూట కోఠికి వెళ్ళాను, ఒక స్నేహం కొన్ని తెలుగు పుస్తకాలు కావాలంటే తీసుకొద్దామని. కావాల్సినవి కొని బయటకి వస్తుండుంగా, ఇరుగ్గుగా ఉన్న ఆ కొట్టులో, ఓ వ్యక్తిని దాదాపుగా గుద్దబోయి ఎలానో సంభాళించుకున్నాను. “క్షమించండి” ని నవ్వుగా మార్చి మాట కలిపాను. కొత్త పరిచయాలన్న బెరకు ఎటూ తక్కువ కాబట్టి ఏవేవో మాట్లాడుకున్నాము చాలా సేపు!! మధ్యలో “అతని” ప్రస్తావన వచ్చింది. “ఆ తెలుసులే..అయినా నాకవన్నీ పెద్దగా ఎక్కవు” అన్నట్టు విన్నాను. ఆయన చెప్తూనే ఉన్నారు, వినలేదనుకున్నాను గాని, విచిత్రంగా అతని గురించే ఆలోచనలు, నాకు తెలీకుండానే నా మస్తిష్కంలో అతడు పాతుకుపోయనట్టు. ఇక లాభం లేదు, అతని ఊహలతో ఉక్కిరిబిక్కిరి అయ్యే కన్నా నేరుగా కలిస్తే పోలే అని నిర్ణయించేసుకున్నాను!! కాస్త భయమూ వేయలేకపోలేదు. కానీ భయాన్ని మించినదేదో నన్ను తన వైపుకి అడుగులు వేసేలా చేసాయి. “ఏదో” కాదు, అతడు ఎప్పుడో అన్నప్పుడు నేను విన్న మాటలు: “స్వార్ధం కన్నా గొప్ప శక్తి లేదు. ఈ ఆదర్శాలు, ఆశయాలు అన్నీ ఆ ప్రాధమిక స్వార్ధానికి అంతరాయం కలిగించనంత వరకే!!” మరో ఆలోచన లేకుండా నడుస్తున్నాను, పూర్తి స్వార్ధంతో!!

“నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు” – అతనితో నా తొలి పరిచయం!! ఆ పరిచయం నా ఊహలకు కొత్తగా రెక్కలు కట్టి ఎక్కడెక్కడికి తీసుకుపోలేదనీ!! గాంభీర్యమో ప్రశాంతతో తెలియన్నివ్వకుండా ప్రవహిస్తున్న గోదావరి, ప్రపంచపు దృష్టి నుండి మిమల్ని కాపాడుతా అన్నట్టు అభయమిస్తున్న ఎత్తైన పాపికొండలు, ఆ తీరాన ఉన్న ఇసుక వెన్నెల్లో వెండిగా అనిపిస్తుంటే ఆడపిల్లలందరూ ఓ చోట చేరి నడుస్తుంటేనే ఆ మువ్వల సవ్వడి ఎంతటి హృదినైనా తట్టి లేపదా?? అలాంటిది ఇక ఆటపాటలతో అమ్మాయిలంతా ఆనందిస్తుంటే, గాజుల గలగలలూ నవ్వుల సరిగమలూ ఏ మనసైనా “ఆహా” అనకుండా ఉండగలదా?? హమ్మ్.. వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు!! అతని అక్షరాలు!!

సరే కలిసాను, “హే.. ఇస్ థిస్ తిలక్?” అంటూ కరచాలనం చేయవచ్చు!! కానీ ఎందుకొచ్చినదని మర్యాదగా “నమస్కారమండీ” అని పలకరించాను. భలేంటి ఆకారం, చూడ ముచ్చటైన ముఖం కానీ ఏదో తెలియని “గాంభీర్యం” ఆ కళ్ళల్లో చూసి నేరుగా చెప్పాలనుకున్నది చెప్పేసా. “మీరు కథలు కూడా రాస్తారని మొన్నే తెలిసింది. మీరు రాసిన కవితలు నేను చదవలేదు. ఎందుకో కవితలంటే అంత త్వరగా మనసు పోదు!! కథలు చెప్పండి, వింటాను” అన్నాను.

మరెలాంటి ప్రశ్నా లేకుండా, మొదటి కథ మొదలయ్యింది. పేరు “లిబియా యెడారిలో”. చిన్ని కథే!! యుద్ధానంతరం ఛిద్రమై చిందరవందరగా పడి ఉన్న సైనికుల శరీర భాగాలు మాట్లాడుకుంటున్నట్టు ఆ కథ. అందులో ఒక సైనికుడి చేయి మాటి మాటికీ “నా భార్య, నా పిల్లలూ” అంటూ ఉంటుంది. “నా ప్రత్యణువులోనూ నువ్వున్నావు ప్రియా” అన్న మాట నిజమైతే ఇలానే ఉంటుందా అనిపించింది. ప్రేమను చావుకూడా చంపలేదేమో కదా!! కథలో యుగయుగాలు మనిషి చేస్తున్న వ్యర్ధ ప్రయత్నాన్ని, దిగులుని, చావునీ, అర్ధం లేని జవాబు రాని ప్రశ్నని అన్నింటినీ చెప్పీ చెప్పకుండానే చెప్పేస్తారు. మనిషంతే అనుకున్నా, మనిషి గురించి నాకు మహా తెలిసినట్టు!! అందుకే దాని గురించి ప్రశ్నలు వేయకుండా, “బాగుందండీ కథ!! అదే నేనయితే ఏదో ఒక అవయువంతో ఓ స్వగతం చెప్పించి ఊరుకునేదాన్ని!! మీరు భలే కథలా చెప్పేరే!! మనిషి పోయినా, మనిషి భాగాలు అతడిలానే ప్రవర్తిస్తాయేమో అన్న ఊహ భలేగా ఉంది.” అన్నాను.

రెండో కథ మొదలయ్యింది. “కదలే నీడలు”. ఇదీ యుద్ధం గురించే, కాకపోతే వీళ్ళు చనిపోలేదు, అంతకన్నా భయంకరమైన ఒంటరితన్నాన్ని అనుభవిస్తున్నారు. ఊరు కాని ఊరిలో అయిన వాళ్ళకి, ఇష్టమైన వాటికి దూరమై, బిక్కు బిక్కుమంటూ యుద్ధంలో పోరాడుతున్నవారికి మనో”గతం” ఎలా ఉంటుంది?? ఆమెను భర్త వదిలేశాడు, అతనికి పెళ్ళికాక ముందే భార్య చనిపోయింది (అవును, సరిగ్గానే రాశాను, మీరూ సరిగ్గానే చదివారు). వారిద్దరి మధ్యా ఓ కృష్ణపక్షపు గుడ్డి వెన్నెల్లో అడుగులతో పాటు మాటా మాట కలిస్తే?? “వాహ్.. వాహ్” అనేసాను ఉత్సాహం ఆపుకోలేక, “ఫ్రాంక్ గా చెప్పనా, తెలుగు కథలు అంటే ఇలాంటి సబ్జెక్ట్ ఉంటుందని ఊహించలేదు. నాకు చెప్పటం రావటం లేదు కానీ, ఒక మనసుకి ఇంకో మనసు తోడవ్వడం, ప్రపంచం పెట్టిన ఆంక్షలను దాటిపోయేలా..” అంటూనే ఉన్నాను, మూడో కథ మొదలయ్యింది.

“అద్దంలో జిన్నా” కథ పేరు. పొలిటికల్ లీడరు కథ. “మనిషి మాటను సృష్టించాడు. మాట మనిషిని బంధించింది” అన్నదానికి నిలువెత్తు తార్కాణం ఈ కథ. స్వార్ధంతోటే, అహంతోనే ఒక్కసారి మాట ఇచ్చి నమ్మించేశాక, అది అబద్ధం అని చెప్పినా ఎవరూ నమ్మరు. “మనిషిలో ఉండే అహం, పతనానికీ, ఔన్నత్యానికీ, పరిశ్రమకీ, పరిణామానికీ కారణభూతమైన మూల శక్తి!! అలగ్జాండరినీ, గజినినీ, సముద్రాలూ, భూములూ, పర్వతాలు దాటించిన బలీయ స్వభావం అది!!” అని తిలక్ చెప్తూ ఉంటే, “నిజం!! నాదీ అదే అభిప్రాయం. అసలు “నేను” అంటూ లేకపోతే నా చూట్టూ ఎవరుంటారు?? నాతోనే కదా అందరూ!! మీరన్నది నిజం, నిజం!!” అని తలూపాను. ఈ అహాన్ని చంపేయడం వల్లే మనలో చాలా మంది ప్రతీ దానికి తలవంచుకుపోయే స్వభావం అలవర్చుకుంటారు. మరికొందరు, దానికి లొంగిపోయి, తానా అంటే తందానా అంటారు. కానీ “అహం” మనిషికి మూలం!!

“హోటల్లో” నాలుగో కథ!! ఒక మనిషి ఐదు రోజులు పొందుపరుచుకున్న వ్యక్తిగత దినచర్యగా ఈ కథ చెప్తున్నాడు తిలక్!! “నన్ను ప్రేమించీ, నాకోసం త్యాగం చేసిన ఆమెను ప్రత్యుపకారంగా చంపేసాను” అనే భర్త కథ తెలుస్తుంది మనకు. సైకో కాదతడు. మానసిక రుగ్మతలేవీ లేవసలు, “ఆకలి” తప్ప. “ఐదు రూపాయలు” అప్పు తీర్చలేక పట్టిన అగత్యం అది. మనిషికి కొన్ని నగ్న సత్యాలుంటాయి, ఎంత నేర్చినా కొన్నింటికి అతడు తలొగ్గక మానడు. ఆకలి జయించి తీరాలి, ఇంకో మార్గం లేదు. ఎవరిని చంపైనా తనని తాను బ్రతికించుకోవాలి!! ఆకలి నిత్య సత్యం. కథ పూర్తి కాగానే, నాకేదోలా అనిపించింది. “ఐదు రూపాయలు”, “ఐదు రూపాయలు” అనుకుంటూ ఉండిపోయాను. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, నేనూ మనిషినే!! నేనూ ఆ “ఐదు రూపాయలు ఇచ్చి ఉండేదాన్ని కానేమో!!” ఇలా ఆలోచిస్తూ ఉంటే ఆలోచనలెప్పుడూ ఒక కొలిక్కి రావని ముందుకు పదమన్నాను తిలక్ ని!!

“ఆశాకిరణం” – పేరు కాస్త ఆశావహకంగా ఉంది. ఊపిరి పీల్చుకున్నాను!! దారుణమైన సంఘటన చూసిన మనసుకి కొంచెం ఆశ పుట్టింది. ఇది ఒక స్కూల్ టీచరు కథ. వింటున్న కొద్దీ అసమర్ధుని జీవయాత్రలో సీతారామారావు వద్దన్నా గుర్తు వచ్చాడు. కానీ ఇందులో పాత్ర కనీసం సీతారామారావులా “false prestige” కూడా లేదు. ఏమిటో ఈ మనిషీ?? అప్పటికీ దుర్భరమైన దరిద్రాన్ని భరించలేక, ఇంటిలో భార్య సూటిపోటి మాటలు పడలేక, దొంగతనం చేయబోయి దెబ్బలు తింటాడు. ఏం చేయాలో తోచని పరిస్థితిల్లో ఇక ఆత్మహత్య చేసేసుకుందామా అన్న ఆలోచనలో ఉండగా, అతనికి ఆ చల్లని వార్త చెవిన పడుతుంది. తానింక చనిపోనక్కరలేదని తెగ సంబరపడి, ఇంటికెళ్ళి ఆ కుటుంబాన్ని దేవతలా కాపాడిన పెద్ద కూతురుని అభినందించబోతాడు. సంప్రదాయం గల కుటుంబంలో పెరిగీ, కేవలం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలన్న తపనతో తనని తాను అమ్ముకొచ్చిన “ఆశాకిరణం” వెక్కి వెక్కి ఏడవడం చూసి “ఏడుపు ఆపేశాకా చెప్తాలే” అనుకుంటాడు. మనిషి పతనానికి పరాకాష్ట!!  లేక పరిస్థితులు అంత బలీయమైనవా?? ఆలోచనలు కదలటం లేదు, కడుపులో చేయి పెట్టి దేవినట్టుంది.

కానీ ఇప్పుడా పాత్ర  నా కళ్ళముందుకొస్తే “ఛీ.. తూ!!” అననేమో?? జాలి పడతానేమో?? అసలెందుకు అతనికి అంత దారుణమైన పరిస్థితి?? ఎందుకు అంత దిగిజారాలి?? మనిషి పతనమయ్యిపోడానికి కారణాలేంటి? అతని భార్య కాస్త ధైర్యాన్నిస్తే పుంజుకునేవాడేమో?? ముందునుండే కూతురిని చదివించుకునుంటే ఆ పిల్ల సంసారపక్షంగా సంపాదించేదేమో?? కేవలం మూర్ఖత్వం ద్వారా ఉద్యోగాన్ని పోగట్టుకుని అందమైన ముగ్గులాంటి ఆమె జీవితం మీద ఇతనెందుకు బురద కాళ్ళేసుకుని తచ్చాడుతున్నాడు?? మనిషేనా అసలు?? ప్రశ్నల పరంపర ఆగటం లేదు. “ఏంటీ ప్రశ్నలు?” అని అడిగా!! “నీ ప్రశ్నలు, నీకే తెలియాలి మరి” అని పెదాలు కొద్దిగా విచ్చుకున్నాయి!! 

చిన్నగా చిట్టిగా చిట్టుకున్న అయిపోతున్నాయి కథలు. భాష తేలికగా, కథనం ఇంకా హాయిగా త్వరగా సాగించేలా ఉంది. కానీ ప్రతీ కథలోని భావం మాత్రం “గొంత్తుక్కి అడ్డుపడ్డట్టు” నాకు జీవితం పైనున్న romantic notions కి అడ్డుపడుతున్నాయి. ఊపిరాడడం లేదు నా ఊహలకు. వాస్తవానికి నేనంత దూరంలో ఉన్నాయో చూపించసాగాయి. ఆకలికి మించిన సత్యం లేదనీ, అహానికి మించిన విషం లేదనీ, ముసుగులు తొడుక్కున్న మన అసలు మొహాలను చూపించే అద్దాలలా ఉన్నాయి ఒక్కో కథ. భరించలేకపోతున్నాను.

ఓడిపోతున్నానన్న ఉక్రోషం తన్నుకొచ్చింది. “వెన్నెల్లో ఆడపిల్లలు నా అక్షరాలు అన్నది నమ్మి మోసపోయాను. ఇక్కడంతా చీకటేనా?? మనిషి ఎంత కంపుకొడతాడో చూపించడమేనా?? అసలు ఆ వర్ణనలో కూడా వెన్నెలను కృత్రిమైందిగా, ఆడవాళ్ళను బాధకు ప్రతిరూపంలా వచ్చే అర్ధంలో వాడారా?? కవిత్వం అంటే ఇందుకే నచ్చదు, అందమైన పదాల అల్లికలో ఎంత భయకరైన భావాన్నైనా దాచేయచ్చు. నా వల్ల కాదు. నేను వినలేను. నే పోతున్నా” అంటూ అడుగు ముందుకి వేయగానే ఆగిపోయింది. చేయి రానిదే నేను కదలేను అని చెప్పింది. వెనక్కి తిరిగి చూస్తే నా మణికట్టు అతడి చేతిలో ఉంది. పట్టీ పట్టకుండా ఉందా పట్టు. కాస్త బలం ఉపయోగిస్తే చేయి విడిపించుకోవటం కష్టం కాదు, కానీ మరలా ఏదో నన్ను ఆపింది. “ఇంకొక్క కథే, నచ్చకపోతే పోదువు” అన్నట్టున్న ఆ ముఖాన్ని చూసి…

(సశేషం)
**************
పుస్తకం వివరాలు:
పేరు: తిలక్ కథలు
రచయిత: దేవరకొండ బాల గంగాధర్ తిలక్
వెల: రూ. 120
ప్రతులకు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, అబిడ్స్ హైదరాబాద్!!
ఈమేల్: visalaandhraph@yahoo.com

34 Responses to “తిలక్ కథలు – 1”

 1. నిషిగంధ

  నా కత్యంత ఇష్టమైన పుస్తకం!! there is no way you can stop reading him like that :-)) I will be back to see your opinion on rest of the stories..

  మనకిష్టమైన వాళ్ళు మన కంతే ఇష్టమైన బుక్ చదువుతున్నారని తెలిసినప్పుడు ఎలా ఉంటుంది!? భలే ఎక్సైటింగ్ గా! నాకలానే ఉందిప్పుడు 🙂

  Like

  Reply
 2. independent

  నేను ఆరవ /ఏడవ తరగతిలో ఉన్నప్పుడు ఒక కథ చదివాను..

  ఒక భార్య, భర్త, వాళ్ళ పాప తిరుమల కెళ్తుంటే, బస్ లోయలో పడిపోతుంది. ప్రాణాలు కాపాడుకొనే ప్రయత్నంలో భాగంగా, అతను భార్యని,కూతుర్ని వీపు మీద ఎక్కించుకొని పైకి పాకడం మొదలు పెడతాడు. కొద్ది సేపయ్యాక పట్టు సరిగ్గా దొరక్క కూతురు జారి పోతుంది!…మరి కొంచెం పైకి పాకాక భార్య కూడా జారిపోతుంది…చివరికి తను పైకి చేరి, క్రింద తన భార్యను, కూతుర్ని చూసి భోరున ఏడుస్తాడు. వాళ్ళ ప్రాణాలు పోయినందుకే కాదు, అంతకన్నా ముఖ్యంగా తను తనకు తెలీకుండానే(?) వాళ్ళని వి(వ)దిలించుకున్న సత్యం అర్ధమయ్యి.

  It left an unforgettable impact on me!.

  ఇది జరిగిన క్రొద్ది నెలలకి, నేను వీధిలో క్రికెట్ ఆడుకుంటుంటే, మూడిళ్ళ ఆవతల ఒక రెండు స్కూటర్లు వచ్చి ఆగాయి..ఆటలో ఉండి మేము పట్టించుకోలేదు. చాలా క్రొద్ది సేపట్లో వాళ్ళు వెళ్ళిపోయారు.

  ఎవరో తెలీదు..నేను అన్నా అని పిలిచే చిత్తరంజన్(ఇంటర్మీడియట్ చదివేవాడు, ప్రక్కనున్న టౌన్లో) ని తిరిగి రాని లోకాలకి పంపించారు వాళ్ళు. తరవాత తెలిసింది.చిత్తరంజన్ కు నక్సలైట్స్ యాక్టివిటీస్ లో పార్టిసిపేషన్ చాలా ఎక్కువ అని. ఆ డెడ్ బాడీ, ఆ పూల్ అఫ్ బ్లడ్ అంతా crystal clearగా నా మైండ్ లో imprint అయిపోయింది.

  ఇంకొంచెం పెద్దయ్యాక టౌన్ కొచ్చేసరికి, మా నాన్న కొలీగ్ వాళ్ళ అబ్బాయిని(నా కన్నా చాలా పెద్దవాడు), నేను రోజూ ప్రొద్దున్నే స్కూలు కెళ్ళటానికి దాటే రైలు పట్టాల పక్కన చూసా.. ప్రాణం లేకుండా…ఈ సారి నక్సలైట్లు చంపేశారు ఇతన్ని..అర్ధరాత్రి దక్షిణ్ ఎక్స్ ప్రెస్ లోంచి దిగుతుండగా చూసి(మాటుకాసి).

  నేను పెరిగిన ఊళ్ళో ఇంటింటికీ నక్సలైట్లు ఉండేవాళ్ళు(ట). నా సీనియర్స్ లో quite a few దళ నాయకులుగా ఎదిగారు(ట). వాళ్ళనెప్పుడూ మళ్ళీ చూడలేదు నేను.

  నేను M.Tech వుండగా మా నానమ్మని చూసొద్దామని మా వూరికి వెళ్తుంటే, అప్పుడు క్రొత్తగా వూరి చివర పెట్టిన చెక్ పోస్ట్ లో నన్నాపారు. వాళ్ళ ప్రశ్నలు, అనుమానాలు, ఆ రుబాబు లోంచి బయట పడ్డానికి చాలా సేపే పట్టింది. కొన్ని names dropping, and నా RECW student id card చూశాక నన్నొదిలారు. ఉళ్ళోకి వెళ్ళాక తెలిసింది. నాకు చిన్నప్పట్నుంచి తెలిసిన పక్కింటి ‘కాకా’ వాళ్ళ అబ్బాయిని ఆరోజే పోలీసులు కాల్చేశారని. వాళ్ళా అబ్బాయిని చూడక కనీసం అయిదారు సంవత్సరాలు అయి ఉంటుందని నాకు తెలుసు.

  ఇవన్నీ కాకుండా ఆర్ధిక కారణాలు మానవ సంబంధాల్ని, ఎంత బలంతో ఊపేస్తాయో చూపిచే సంఘటనలు, దురద్రుష్టవశాత్తూ(?) నాకు చిన్నప్పట్నుంచే చాలా తగిలాయి.

  ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే, తెలీకుండానే జ్ఞాపకాల్లోకి వెళ్లడం ఒక కారణమయినా, మనుషులు కంపు కొట్టడం నాకు కొత్తెమీ కాదు. ఆకలి, ఆక్రోశం, స్వార్ధం, అజ్ఞానం, ఆధిపత్య కాంక్ష లే కాకుండా ఇజాలు(isms) కూడా ఒక పెద్ద కారణమే.

  మీరెప్పుడో చిన్నప్పుడు జరిగిన భయానక incidents గురించి రాసినప్పుడు వాటి జోలికెళ్ళబుద్ది కాలేదప్పుడు.

  అలాగే తొడుక్కునే ముసుగుల గురించి ఎవరో రాస్తా, మేము బ్లాగులు రాసేప్పుడు, గార్డెన్ వర్క్ చేసేప్పుడు, కవితలు రాసేప్పుడు ముసుగు తీసేస్తాము అంటే నవ్వొచ్చింది నాకు..

  నాకు తెలిసి ముసుగులు ఎప్పుడూ పోవు. కొన్నిసార్లు అవి ఉన్నాయనే తెలీదు మనకి…atleast నాకు.

  నాకీ ప్రపంచం అర్ధమయినంతవరకూ ముసుగు తొలగేది ఎప్పుడో, పైన చెప్పిన కథలో తెలుస్తుంది.

  Like

  Reply
 3. ప్రతాప్

  నేను ఈ పుస్తకాన్ని కొన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నాను. మళ్ళీ మళ్ళీ చదువుతూనే ఉన్నాను, ఉంటాను కూడా. ఈ పుస్తకం గురించి అందరికి చెప్పాలని అనుకొంటున్న సమయాన మీరే చెప్పేశారు.
  జీవిత సత్యాలని కథ రూపంలో హృద్యంగా చిత్రీకరణ చెయ్యడం కేవలం తిలక్ కే చెల్లింది. ముఖ్యంగా “హోటల్లో”, “ఆశాకిరణం” కథలు అయితే నాకు ఎంత బాగా నచ్చాయో. మనిషికి, పరిస్థితులకి మధ్య జరిగే పోరాటాన్ని ఎంత బాగా చెప్పాయో ఆ కథలు. ముఖ్యంగా “ఆశాకిరణం” కథ అయితే కొన్నాళ్ల క్రితం నేను రఫ్ గా రాసుకున్న ఒక కథకి దీనికి పోలికలున్నాయి. నేనో అందమైన ముగింపు (కేవలం నా అహాన్ని సంతృప్తి పరుచుకోవడానికి) ఇస్తే, తిలక్ మాత్రం…

  తిలక్ రాసిన ఈ కథలన్నీ మనస్సులో దూరి గిలిగింతలు పెట్టవు. మన ఆలోచనలకి మరో కొత్త కోణాన్ని చూపెడుతాయి(?). “అమృతం కురిసిన రాత్రి” రాసిన తిలక్ ఇతడేనా, అన్న అనుమానం కొంతమందికి కలిగిన కలగవచ్చు. అంత భావుకత్వం తన అక్షరాల్లో నింపి మన ఎదలోకి ఒంపిన తిలక్ ఇతడేనా అన్న అనుమానం నాక్కూడా కలిగింది.

  మొత్తానికి మంచి పుస్తకం అందరికి పరిచయం చేసారు.

  Like

  Reply
 4. S

  Thats a very well written article 🙂
  Read this some time back…seeing the names and the descriptions, I remembered those stories and feeling like reading them again now…thanks.

  Like

  Reply
 5. ఏకాంతపు దిలీప్

  “స్వార్ధం కన్నా గొప్ప శక్తి లేదు. ఈ ఆదర్శాలు, ఆశయాలు అన్నీ ఆ ప్రాధమిక స్వార్ధానికి అంతరాయం కలిగించనంత వరకే!!”

  అలా అని తిలక్ already అనేసాడా?! నేను అందాము అనుకుంటున్నానే!

  నాకు తెలిసిన ప్రపంచం ఎప్పుడూ ఆదర్శాల కోసం జీవించడం లేదు… ఆదర్శాలు కూడా స్వార్ధంలో నుండి పుట్టుకొచ్చిన కోరికలే… మనకిష్టమైన వాటిని( అవి ఏవైనా) కుటుంబమో, సమాజమో, ప్రభుత్వమో ఏవో చెప్పి దూరం చేసే ప్రయత్నం చేసినప్పుడు ఒక ఆదర్శం పుట్టుకొస్తుంది… (లేకపోతే అప్పటివరకు పట్టించుకోని ఆదర్శాలని ఆశ్రయిస్తారు…) అది ఒక్కోసారి వెంటనే అందరి అంగీకారం పొంది మార్పుకి దోహదం చేస్తుంది… ఒక్కోసారి వెంటనే అంగీకారం పొందదు… మార్పు మెల్లగా వస్తుంది… ఒక్కోసారి అలా కొందరి స్వార్ధంలో నుండి పుట్టిన కోరికలు అందరి అంగీకారం పొందవు, అవి అందరికీ ఆదర్శాల్లా కనిపించవు… ఒక్కోసారి కొన్ని ఏళ్ళ తరవాత అలా వచ్చిన మార్పు మంచికోసమొచ్చిందా, చేడూ కోసం వచ్చిందా అనే మీమాంశ కూడా జరుగుతుంది… చాలాసార్లు, ఆ ఆదర్శాలు వాళ్ళ కోరికలు తీరేవరకే, తీరిన తరవాత వాటితోనే జీవిస్తున్నారా లేదా అనేది అప్రస్తుతం అయిపోతుంది…

  ఈలోగా ఆ ఆదర్శాలని అనుభవించిన తరానికి కొత్త కోరికలు పుట్టుకొస్తాయి… మరలా కొత్త ఆదర్శాలు, కొత్త ఆశయాలు…

  అందుకే ఆదర్శానికి మూలాలు ఆ ఆదర్శాన్ని ప్రకటించే వారి స్వార్ధం లోనే ఉంటాయి.. దాన్ని నిస్స్వార్ధంగా, దాని వల్ల తనకి ఉపయోగం లేకపోయినా, కేవలం ఆదర్శం కోసమే బతికే వాళ్ళు లక్షల్లో ఒకళ్ళు ఉంటారు…

  ఎప్పుడైతే నేను అది తెలుసుకున్నానో…, ఆదర్శాలని వెక్కిరించే వాళ్ళని అసహ్యించుకోవడం మానేసాను… ఎవరి స్వార్ధం వారిది అని మనసులో అనుకుని 🙂 ఎప్పుడో ఒకసారి వాళ్ళ స్వార్ధం కోసం ఆదర్శాన్ని ఆశ్రయిస్తారు, లేకపోతే స్వార్ధం కోసం ఆదర్శాన్ని వదిలేస్తారు…

  ఆదర్శాలు నమ్మేవాళ్ళూ, నమ్మని వాళ్ళు ఒకరికొకరు హాని తలపెట్టుకోనంతవరకు నాకూ ఓకె… నేను పట్టించుకోను… నా స్వార్ధం నాది, నా ఆదర్శం నాది… వాళ్ళ స్వార్ధం వాళ్ళది, వాళ్ళ ఆదర్శాలు వాళ్ళవి…

  P.S:ఇంకా మొత్తం చదవలేదు… చదివి వస్తాను…

  Like

  Reply
 6. ఫణీంద్ర

  తిలక్‌ గొప్ప కవే, కాని mediocre కథా రచయిత. కథా పటిమ కన్నాmoral manipulation ఎక్కువ. కవిగా ప్రపంచాన్ని చాలా విశాలమైన దృక్పథంతో చూస్తాడు. కథా రచయితగా మాత్రం ఇరుకైపోతాడు. కవిగా మనిషిని ప్రేమిస్తాడు, కథా రచయితగా ద్వేషిస్తాడు (ఇది కాస్త జనరలైజ్డ్‌ స్టేట్‌మెంట్‌ అనుకోండి). చూడాలనుకుంటే ఒక పసిపాప ఇంకో పసిపాప దగ్గర్నించీ లక్కపిడత లాక్కోవడంలో కూడా స్వార్థాన్ని చూడొచ్చు. స్వార్థం మనిషి సహజ గుణం. దాన్ని ద్వేషించి లాభం లేదు. For me, with all its currept leaders, religious freaks, serial killers and rapist fathers, the world is still a romantic place to live. A lil bit of empathy is all it takes.

  By the way, మీకా “జిన్నా” కథ అర్థమైందంటే గొప్పే. నాకైతే ఏం అర్థం కాలేదు. అంత deliberate obscurity అవసరమా అనిపించింది. మీరు కొన్న పుస్తకంలో “ఊరి చివర ఇల్లు”, “నల్లజెర్ల రోడ్డు” మాత్రమే కాస్త గుర్తుంచుకోదగ్గ కథలుగా నాకనిపించాయి: అవి ప్రతిపాదించే నైతిక వ్యాఖ్యానాల వల్ల కాదు, కథలు నడిపిన తీరు వల్ల.

  Like

  Reply
 7. te.thulika

  సుజాతా. తిలక్ కథలు నేను చదవలేదు. నీ సమీక్ష చదివినంత శ్రద్ధగా, సంపూర్ణంగా నేను ఏసమీక్షా చదవలేదు ఈమద్యకాలంలో. స్పూర్తిదాయకంగా వుంది. నీలాగే వైదేహికి కూడా శరత్ అత్యంత అభిమాన రచయిత. ఆయన కథ, దొంగ, తను అనువాదం చేసింది ద ధీప్ అన్న శీర్షికతో. వీలయితే, తూలిక.నెట్.లో చూడు. ఆఅనువాదంమీద నీ అభిప్రాయం తెలుసుకోవాలని వుంది.
  నీసమీక్షమీద వచ్చినవ్యాఖ్యలు కూడా ఆలోచనాత్మకంగా వుండడం నాకెంతో సంతోషంగా వుంది.
  మాలతి.

  Like

  Reply
 8. te.thulika

  సుజాతా, నీసమీక్ష చదివినంత శ్రద్ధగా నేను ఈమధ్యకాలంలో ఏసమీక్షా చదవలేదు. సూటిగా, స్ఫష్టంగా, మనసు, మేధా పెట్టి రాసిన వ్యాసం. స్ఫూర్తిదాయకం. దీనిమీద వచ్చిన స్పందనలు కూడా ఆలోచనాత్మకంగా వుండడం విశేషం. నేను తిలక్ కథలు చదవలేదు. వైదేహికి కూడా నీలాగే తిలక్ అభిమాని. ఆయనకథ, దొంగ, తను చేసిన అనువాదం తూలిక.నెట్.లో వుంది. నీకు వీలయితే చూడు. దానిమీద నీ అభిప్రాయం తెలుసుకోవాలని వుంది.
  మనఃపూర్వకంగా అభినందనలు చెపుతున్నాను.
  మాలతి

  Like

  Reply
 9. Sridhar

  చాన్నాళ్లకి(?) తిలక్ పై ఇలా ఆర్టికల్ చదివే అదృష్టం కల్పించినందుకు చాలా ధాంక్స్.
  తిలక్ లోకాల్ని ఇంకా ఎక్స్ ప్లోర్ చేస్తారని ఆశిస్తూ…

  Like

  Reply
 10. కొత్త పాళీ

  చాలా విలక్షణమైన సమీక్ష. .. బాగా రాశారు. దీంకి కామెంటేందుకు కాస్త ఆలోచించాలి .. మళ్ళీ వస్తా

  Like

  Reply
 11. రానారె

  కొత్తగా చదివించేలా వుంది తిలక్ కథలపై మీ వ్యాఖ్యానం. చదువరుల విలువైన అభిప్రాయాలతో కలిసి ఒక మంచి వ్యాసం చదువున్నట్లయింది. కృతజ్ఞతలు.

  Like

  Reply
 12. Purnima

  నిషీ: Had this post with terrible timing I guess. 😦 I’ll have to make you wait for a li’l long for the rest. Thanks for the lovely comment.

  independent: I’d love to have a detailed response for your comment. Time constraint is working against it. I wish you had a blog, I wish you’d keep updating with your experiences / learning, I wish I cud read them. Ahem!! All wishes!! 😦

  ప్రతాప్ గారు: తిలక్ నచ్చడానికి ఏకైక కారణం మీరన్న ఆ వైవిధ్యం, కథల్లో, కవితల్లో!! మీరు రాస్తారని ఆశిస్తున్నాను. వ్యాఖ్యకి ధన్యవాదాలు!!

  సౌమ్యా: You almost made my day!! Thanks!!

  దిలీప్ గారు: ఒక్క లైన్ రాయించిన వ్యాఖ్యా ఇదీ?? అయితే మీరీ పుస్తకం చదవాల్సిందే!! అప్పుడు బోలెడన్ని టపాలు చదువుకోవచ్చు మేము!!

  Like

  Reply
 13. Purnima

  ఫణీ: Have a loads of questions for you. But for now, just shooting this.

  కవిగా ప్రపంచాన్ని చాలా విశాలమైన దృక్పథంతో చూస్తాడు. కథా రచయితగా మాత్రం ఇరుకైపోతాడు. – So u like him? Know him? What do u read of him? Very keen to know.

  the world is still a romantic place to live – Absolutely agreed!! You got to watch out my next post for what you call కథా రచయితగా ద్వేషిస్తాడు, or what i thought "he romances with dark".

  The two stories you mentioned would be in my next post, whenver that is.

  మాలతి గారు; నా పేరు చెప్పకపోయినా, మీ వ్యాఖ్య నాదే పూర్తిగా అనేసుకుంటున్నాను!! 🙂 ఆ కథను చూస్తానండి వీలు చూసుకుని.
  అస్సలంటే అస్సలు వీలుపడని పరిస్థితుల్లో ఈ టపా రాసాను. తొందరపడ్డానేమో అని అనుకున్నాను!! మీ అందరి వ్యాఖ్యలు చూస్తుంటే కొత్త ఎనర్జీ వస్తుంది. నెనర్లండీ!!

  శ్రీధర్ గారు: తిలక్ ని ఇంకా చాలా చాలా తెలుసుకోవాలని నాకూ ఉంది. ఎందాకా కుదురుతుందో చూడాలి!!

  కొత్తపాళీ గారు: మీ వ్యాఖ్యకోసం ఇక్కడ వేయిటింగ్!!! 🙂 ఎదురు చూస్తూ ఉంటాను!!

  రానారె గారు: >> కొత్తగా చదివించేలా.. చాలా ధన్యవాదాలు!! అసలు కథ కన్నా నా కథే ఎక్కువతుందేమో అని భయపడ్డా!! మీ వ్యాఖ్య కాస్త ధైర్యాన్ని ఇచ్చింది.

  Like

  Reply
 14. te.thulika

  అయ్యయ్యో, గొప్పతప్పయిపోయింది, పూర్ణిమా. నావ్యాఖ్య మాత్రం అచ్చంగా మీ సమీక్షమీదే. ఏదో పెద్దది అనుకని క్షమించేయాలి. ఎందుకో మనసులోమాట సుజాత అనుకున్నాను. నాకేమో అన్నిబ్లాగులూ ఒక్కలాగే కనిపిస్తున్నాయి. మాటవచ్చింది కనక చెబుతున్నా నాకీ సెక్యూరిటి ఇన్ఫో మహ ఇబ్బందిగా వుంది.

  మాలతి.

  Like

  Reply
 15. రాజేంద్ర కుమార్ దేవరపల్లి

  మపాసాను చదవకముందు తిలక్ కధలు గొప్పవనిపించాయి,కానీ,తర్వాత ఆ అభిప్రాయం కాస్త మారింది.

  Like

  Reply
 16. శ్రీవిద్య

  విమర్శకుల ప్రశంశలు పొంది, క్లాసిక్స్ అనిపించుకున్న పుస్తకాలు చదవాలంటే నాకు చాలా భయం. అందులో కష్టాలు, మనసుని మెలితిప్పే సంఘటనలు, పాత్రలు.. ఏడిపించేస్తాయి. ఏది ఏమైనా, ఎలా వున్నా జీవితం అందమైనది, ప్రయత్నిస్తే అనుకున్నది అందుకోగలము అన్నది నా సిద్దంతం. ఇలాంటి పుస్తకాలు మాత్రం పిచ్చిదానా జీవితం అనే చేదు మాత్రకి ఆశలు, ఊహలు అని తియ్యని పూతలు పూసుకుని అదే నిజమనే భ్రమలో బతుకున్నావు అని వెక్కిరిస్తాయి.నా చుట్టూ వున్న ప్రపంచాన్ని భయంకరంగా చూపించి మనసుని కెలికి పారేస్తాయి.

  అందుకే ఇలాంటి పుస్తకాల జోలికెళ్ళకుండా, నన్ను భయపెట్టే విషయాల నుంచి పారిపోతున్నా నేనిప్పుడు. అవి నా నమ్మకాల్ని చెదరగొట్టేసి, నన్ను నిరాశవాదిగా మార్చేసి నిర్లిప్తపు లోయల్లోకి తోసేస్తాయేమో అన్న భయంతో పారిపోతున్నను. కానీ మీలాంటివాళ్ళ సమీక్షలు చదివినపుడు, ఇలాంటి పుస్తకాల్ని చదవకుండా నేనేదో కోల్పోతున్నాను అనిపిస్తుంది. ఇలాంటి పుస్తకాల్లో గొప్ప జీవిత సత్యాలు వుంటాయి. జీవితాన్ని కాసి వడబోసిన వాళ్ళ అనుభవ సారం వుంటుంది. వీటికి ఆలోచింపచేసి మనిషి మనసుని పరిధిని విస్తరించే గుణం వుంటుంది.

  నీ రివ్యూ చదివాక , ఆ అనుభవసారం అందుకోడం కోసమైనా నేను నా comfort Zone దాటి ఈ పుస్తకం చదివాలి అనిపించింది నాకు. Thanks for ur wonderful review.

  @ independent : ముసుగుల గురించి మీరు చెప్పింది అక్షరాలా నిజం. నిజంగా ఆ ముసుగులు ఎప్పటకీ పోవు..కనీసం నావరకు. ఈ బ్లాగు లోకానికి తెల్సింది నా పేరు మాత్రమే.. అయినా పేరుకు కూడా బోలెడంత ఇజం. అది నన్ను నన్నుగా వుండనివ్వదు. వేసుకున్న ముసుగుని తియ్యనివ్వదు.మళ్ళీ అదే జీవితం. అదే పోరాటం. అదే సంఘర్షణ. అదంతేనేమో…

  Like

  Reply
 17. nagaraju

  బాగా రాసారు. నాకు బాగా నచ్చన కథ నల్లజర్లరోడ్డు. చాలా వైవిధ్యమైన కథనం ఉంది అందులో.

  ఫణీంద్రతో పూర్తిగా ఒప్పుకోలేను.

  నాకైతే తిలక్ కథలు మూడు రకాలుగా అనిపిస్తాయి – అద్దంలో జిన్నా, మణిప్రవాళం, లిబియా ఎడారిలో, గడియారం (?) లాటి పోయెటిక్ కథలు. వీటిల్లో మాంచి పోయెటిక్ మొటాఫరుంది, కాని దాన్ని కథలోకి తేవడంలో విఫలమయ్యాడేమో అనిపిస్తుంది.

  రెండో రకం – నల్లజర్ల రోడ్డు, ఊరుచివర ఇల్లు లాటి కథలు. కథని ఎత్తుగడ నుంచీ నడిపించిన తీరులోని వైవిధ్యం. ఒక్క కవికి మాత్రమే చేతనైన చిత్రీకరణలు.

  ఇహపోతే – జీవితం లాటి చచ్చు, పుచ్చు కథలు. అట్లాంటి కథలు ఏ చాసో చేతిలోనో పడితే కళాఖండలయ్యేవి. తిలక్ చేతిలో పడి ఉరేసుకొన్నాయి.

  తిలక్ కథలని (కొన్నిటిని), తిలక్ కవి అని తెలియకపోతే “ఓ బాగా రాసాడు” అని క్షమించేయవచ్చు, కాని తిలక్ కవిత్వాన్ని రుచి మరిగిన తర్వాత కొన్ని కథలలో “ఇదిగో పిల్లలూ, ఈ కథల్లోని నీతిని కవర్లో పెట్టి, స్టాంపు పెట్టి అతికించి మీకిస్తున్నా, జాగర్తగా దాచుకోండేం” అనిపించే నీరసపు కథనాన్ని క్షమించటం కష్టం.

  రెండోభాగం కోసం ఎదురు చూస్తుంటాను.
  ఛీర్స్,
  నాగరాజు

  Like

  Reply
 18. nagaraju

  ఇంతకు ముందు పెట్టిన కామెంటు వచ్చిందా?

  Like

  Reply
 19. వికటకవి

  నేను తిలక్ కధలు, కవితలు రెండూ చదవలేదు. కానీ మీ సమీక్ష చాలా బాగుంది. కానీ ఒక్క సందేహం.

  >> మనిషిలో ఉండే అహం, పతనానికీ, ఔన్నత్యానికీ, పరిశ్రమకీ, పరిణామానికీ కారణభూతమైన మూల శక్తి!! అలగ్జాండరినీ, గజినినీ, సముద్రాలూ, భూములూ, పర్వతాలు దాటించిన బలీయ స్వభావం …

  ఏ ఉద్ధేశ్యంతో అహం ఔన్నత్యానికి ఉపయోగపడుతుందన్నాడో అర్ధం కాలేదు. వీలైతే చెప్పండి.

  Like

  Reply
 20. Purnima

  నాగరాజు గారు: నాకీ శైలీ, శిల్పాలు (nuances of story telling) ఇలాంటివన్నీ అస్సలు తెలీవు. నేను ఒక కథ చదివాక అది నాకు మిగిల్చిన అనుభూతి వల్లే అది నాకు నచ్చిందీ. నచ్చలేదనీ నిర్ణయమయ్యేది. చాలా అల్పసంతోషిని అని చెప్పుకోవచ్చు!! May be I should learn the attitude of reading stories, may be!! నల్లజర్లరోడ్డు నాకు అత్యంత ఇష్టమైన కథ!!

  Tilak was exceptional even in his stories, may be not that often as in his poems. But I can’t put anywhere near “ordinary” or “mundane” as of now. My opinions are subject to change as and how I progress with other writers.

  వికటకవి గారు: ఏలాగైనా గెలిచి తీరాలి, “నేనే” రాజ్యాధిపతి కావాలి, “నా” కిందే సకల భాప్రపంచం ఏలబడాలి, “నన్ను” ఎదిరించి ధిక్కరించు వారుండరాదు, “నాకే” ఓటమి పరాజయాలా? లాంటి “నేనే” అన్న భావన లేకపోతే ఆ రాజులు అంత పోరాడలేకపోయేవారని కామోసు.

  “అహం” అన్న పదం ముందుగా పూర్తిగా తెలియాలి. “నా” అన్న భావం ఎక్కువయిన ప్రతీదీ అహమా?? లేక “ఆత్మాభిమానం”, “ఆత్మగౌరవం” లాంటి వాటితో సరిపుచ్చచ్చా?? మరెవరైనా చెప్తారేమో అని చూద్దాం.

  మంచి ప్రశ్న. వ్యాఖ్యాన్నించినందుకు నెనర్లు!!

  Like

  Reply
 21. independent

  Srividya గారూ..”…తెల్సింది నా పేరు మాత్రమే.. అయినా పేరుకు కూడా బోలెడంత ఇజం. అది నన్ను నన్నుగా వుండనివ్వదు. వేసుకున్న ముసుగుని తియ్యనివ్వదు”

  Bingo..right on it. I hear you Ma’am.

  ఇలాంటివి కొన్ని కనీసం మనకు తెలుస్తాయి శ్రీవిద్య గారూ. ఇంకొన్ని పాము కుబుసం లాగా టైట్ గా ర్యాప్ అయి ఉంటాయి. అవి ఉన్నాయనే తెలీదు మనకు.

  Abraham Lincoln ఓసారి “Nearly all men can stand adversity, but if you want to test a man’s character, give him power” అని అన్నాడు.

  కొన్ని మాస్క్స్, మనం ఎదురుదెబ్బతో గాయపడినప్పుడు కాదు, అవతలి వాళ్ళని బలంగా దెబ్బకొట్టగలిగే స్థితిలో ఉన్నప్పుడు, ఊడిపడతాయి. అప్పుడు అద్దంలో(మనసులోకి)చూసుకోవాలన్నా, వేడి ఆవిరి..అద్దాన్ని మసకబార్చినంత ఫాస్ట్ గా, మనసు మళ్ళీ మాస్క్ తో కప్పబడుతుంది. ఆ అగ్లీనెస్(స్వచ్ఛత)ని భరించలేక, మనమే ఉఫ్ మంటూ వేడి నిశ్వాసని ఊదుతాము కాబోలు, కన్వీనియంట్ గా ఉండే కారణాలతో. or it could be our manasu’s self-defence mechanism.

  ఇంకొన్ని మన నెర్వస్ సిస్టమ్ నిండా intertwine అయిపోయి ఉంటాయి. ఇవి ఎంత లోతుగా, బలంగా మన DNA లోకి penetrate అయిపోతాయంటే, మన మెదడులో ప్రతి న్యూరానూ ఈ మెటీరియల్ తోనే communicate చేసుకుంటాయి. దీన్నే కృష్ణమూర్తి “prison(er) of the past” అని, “conditioned mind” అని అంటాడు.

  ఇన్ని లేయర్స్ తో మనం కప్పబడి పోయి ఉన్నప్పుడు, మనకి మనమే అపరిచితుల్లాగా జీవితం గడచిపోతాఉంటుంది(మళ్ళీ ఇందులో ప్రశ్నేంటంటే, మనకి లో “మన”ఎవరు? మనమే లో “మన” ఎవరు?).

  సరే తిక్క బానే ముదిరినట్లుంది కదా నాకు :-). ఇందాకే “నిర్వాణ” అనే ఇండియన్ రెస్టారెంట్ కి వెళ్ళి వచ్చా..”నిర్వాణం” దాకా ఏమో కాని, వైకుంఠ ద్వారాలయితే కనబడ్డాయి. ఆ వికారం ఇంకా తగ్గలేదు.

  హే దిలీప్…question buddy..self-interest, selfishness రెండూ వేరేమో?

  ప్రతాప్ గారూ, “అంత భావుకత్వం తన అక్షరాల్లో నింపి మన ఎదలోకి ఒంపిన తిలక్ ఇతడేనా అన్న అనుమానం నాక్కూడా కలిగింది”. Thinking in poem..Living in prose అనేది అంత uncommon కాదేమో(నేను literal sense లో వాట్టంలేదీ పదాలు)..అలాంటప్పుడు మన expectations are too idealistic ఏమో ఆయన మీద..May be….Just may be..the difference that is widely observed across the board about his poetry and stories, is a “statement” by itself, that he is inadvertently making.

  Like

  Reply
 22. సుజాత

  “కవిగా మనిషిని ప్రేమిస్తాడు, కధా రచయితగా ద్వేషిస్తాడు” తిలక్ గురించి నా మనసులో ఉన్న అవ్యక్తమైన భావం కూడా ఇదే! కానీ చెప్పడం కుదరలేదు. “ఎందుకు” అని అడిగితే నేను వివరించలేను, మనసుకు అర్థమవుతుంది కానీ చెప్పలేను.

  నాకు ‘హోటల్లో ‘ కథ కదిలించేదిగా అనిపిస్తుంది. ఆశాకిరణం కూడా! ఊరి చివరి ఇల్లు మరోటి, నల్లజర్ల రోడ్డు ఇంకోటి!

  ఈ కథలు చదివి చాలా రోజులైంది. నా పుస్తకం ఇంకా నా దగ్గరికి తిరిగి రాలేదు. రాగానే మళ్ళీ చదవాలి.

  నిజమే, ఈ కథలు చదివాక ‘అమృతం కురిసిన రాత్రి ‘ రాసిన తిలక్ ఇతడేనా అనిపిస్తుంది.

  independent,
  ముసుగుల గురించి బాగా చెప్పారు. కానీ మనిషిగా ఈ సమాజంలో ఉన్నంత కాలం ఎప్పుడూ కాపోయినా కనీసం అప్పుడప్పుడైనా ఇవి మేలి ముసుగులు తప్పవేమో కదూ!

  Like

  Reply
 23. బొల్లోజు బాబా

  ఏది వ్రాయాలన్నా మనసు కదలటంలేదు.
  చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా బాగుంది.
  బొల్లోజు బాబా

  Like

  Reply
 24. రాజేంద్ర కుమార్ దేవరపల్లి

  దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన దేవుడిని చూసిన వాడు అనే కధ ఒక మపాసా కధకు దాదాపు మక్కీకి మక్కి అనుకరణ,అది చదివాక చాలా బాధనిపించింది.కానీ తిలక్ కవిత్వానికి ముఖ్యంగా పోస్ట్ మ్యాన్ సుబ్బారావు మీద రాసిన కవిత నభూతో నభవిష్యత్

  Like

  Reply
 25. ఏకాంతపు దిలీప్

  @ ఇండిపెండెంట్
  yep buddy… they are different literally.
  స్వప్రయోజనం,స్వార్ధం. స్వార్ధం చిన్నదైతే,స్వప్రయోజనం విస్త్రుతమైనది… నాకు తెలిసినంత వరకు రెంటికి పెద్ద తేడా లేదు…

  Like

  Reply
 26. రవి

  బావుంది….తిలక్ కు హాయ్ చెప్పండి, నా తరపు నుండీ. అమృతం కురిసిన రాత్రి తప్ప ఆయన కథల గురించి తెలీదు. ఓర్కుట్ లో ఓ కమ్యూనిటీ ఉండాలి తిలక్ పైన…

  పూర్ణిమ గారు, మీ బ్లాగు లో కామెంటాలంటే/చర్చించాలంటే మా ఆఫీసు నుండి కుదరదు.

  మీకు అనానిమస్ ల బెడద లేకపోతే, name & URL సౌకర్యం కల్పించగలరు.. ఇబ్బంది లేకపోతేనే సుమా…

  Like

  Reply
 27. కత్తి మహేష్ కుమార్

  నా మిత్రుడి దగ్గరినుండీ ఈ పుస్తకాన్ని 15 సంవత్సరాల క్రితం తీసుకుని, ఇప్పటివరకూ తిరిగి ఇవ్వకుండా, అప్పుడప్పుడూ చదువుకుని ఆనందిస్తూ ఉంటాను. “కొనకుండానే, జీవితానికి సరిపడా ఆనందం దక్కిందే అని”. ఈ సంకలనంలో అన్ని కధలూ ఆణిముత్యాలే. నీ సమీక్షా శైలి తిలక్ కథల గౌరవాన్ని పెంచింది.నా అభినందనలు.

  Like

  Reply
 28. Sankar

  ఇప్పటికే ఈ పుస్తకాన్ని మూడుసార్లు చదివేసాను. ఇప్పుడు మీ విశ్లేషణని కూడా రెండుసార్లు చదివేసా…
  ఒక్కో కధా చదివిన తర్వాత వాటి గురించి ఆలోచిస్తుంటే, అసలు అంత హృద్యంగా ఎలా రాసాడా అనిపిస్తుంది. తిలక్ కధల్లోని మంచి కొటేషన్లన్నీ అండర్‍లైన్ చేసి ఉంచాను. వీలు చూసుకొని ఇక్కడ కామెంటుగా పొందుపరుస్తా… అన్నట్టు మీరు ’సీతాపతి కధ’ గురించి మర్చిపోయారేంటో. భార్య చాటు జీవితాన్ని భరించలేక అతను పడే పాట్లు అతని అంతరంగం చదువుతుంటే నాకు తలంపుకొచ్చే విషయం ఒకటే… భర్త నీడే తమ ఐడెంటిటీగా ఉన్న ఆకాలపు ఆడవారి మనోగతాన్ని సీతాపతికి అన్వయించాడేమోనని…

  Like

  Reply
 29. RSG

  నాకు తిలక్ కవితలు నచ్చినంతగా కథలు నచ్చలేదు, దాదాపు అన్ని కధలూ Losers గురించీ, జీవితంలో నిరాశా నిస్పృహల గురించీ కావటంవల్లేమో…

  Like

  Reply
 30. Cinevalley

  its been long since i read telugu books. your article brought back those memories.

  Thanks
  –Cine Valley

  Like

  Reply
 31. Bhasker

  నా కాలేజి రొజుల్లొ మొదటి సారి చదివాను ఈ పుస్తకాన్ని అప్పుడు అంతగా అర్థం కాలేదు. రెండు సంవత్సరాల క్రితం మళ్ళి చదివినప్పుడు భలె నచ్చింది.

  Like

  Reply
 32. kRsNa

  mee article chadivaaka okasari tilak gari kathalu chadavaalani undi. ee roje testaanu poyi. dhanyavaadaalu.

  Like

  Reply
 33. వేణూ శ్రీకాంత్

  బాగా వ్రాసారు పూర్ణిమా, ఎప్పటి నుండో నేను చదవాలి అనుకుంటూ వాయిదా వేస్తున్న పుస్తకం ఇది. చక్క గా సమీక్షించి నాకు సాయం చేసావ్.

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Basic HTML is allowed. Your email address will not be published.

Subscribe to this comment feed via RSS

%d bloggers like this: