Affectionately dedicated to HP Compaq 6720s

Camకి చిక్కని చిత్రాలు!

గడచిన వారాంతంలో చేసిన ప్రయాణంలో డిజికామ్ అక్కరకు రాలేకపోయినా, మనోనేత్రంలో స్థిరపడిపోయిన కొన్ని ఛాయాచిత్రాలను అక్షరాలలోకి తర్జుమా చేసే ప్రయత్నం.  చూద్దామా మరి?

అటో నక్షత్రమైన తీరు:
మా వాళ్ళేదో కౌంటర్ వేశారు నా మీద అనిపించి పుస్తకంలో నుండి తేలి, వాళ్ళవంక రుసరుస చూద్దామని తలపైకెత్తా! తీరా చూస్తే కౌంటర్ పొట్లంలో పొగడ్త పెట్టారని గ్రహించి, నవ్వుకోలేక, నవ్వు ఆపుకోలేక ముఖం పక్కకు తిప్పుకునేసరికి, వెన్నెలలో బయటంతా బూడిద రంగులో ఉంది. బూడిద కూడా కాదు, అదో గమ్మత్తైన నలుపు.. మొద్దుబారిన పెన్సిల్ ములుకుని అడ్డంగా వాలుస్తూ కాగితం మీద బాగా రుద్దాక, ఒక చిన్ని కాగితం ముక్క తీసుకుని పైపైన రుద్దితే వచ్చే నలుపు కాని నలుపులా ఉంది. అక్కడున్నది పచ్చని పైరో, ఖాళీ స్థలమో నిర్ణయించుకునే లోపు మా రైలు వెళ్తున్న దారికి ఓ ముప్పై డిగ్రీల ఆంగిల్ చేస్తూ ఉన్న మట్టి దారి మీద ఒక ఆటో వెళ్తూంది. హైద్‍లో కనిపించే సెవెన్ సీటర్ కన్నా చిన్నది, మామూలు ఆటో కన్నా పెద్దది. జనాలున్నారు, డ్రైవర్‍తో పాటు. రైలు వేగంతో ఆ ఆటో నా కంటికి దూరమవుతూ ఉంది. ఇంతలో, ఆ ఆటో ఉన్న వాళ్ళు ఈ ట్రైన్‍ని చూసి ఏమనుకుంటున్నారో అన్న చిన్ని ఊహ! ఏ చిన్నారికో.. “చూడురా.. రైలెళ్తోంది” అని ఏ నాన్నో చూపిస్తున్నారా? లేక ఆ చిన్నారే.. “నా..న్నా… అదో లైలు.. బేద్ద లైలు” అని చెప్తుందా? పరిగెత్తే రైలు వెనుక పరిగెత్తని మనసు ఉంటుందా? లేక చీకటి రాత్రి నిశ్శబ్దాన్ని బద్దలు చేస్తున్నందుకు విసుక్కుంటారా? ఈ ఆలోచనలతో నేను ఎక్కడికో వెళ్ళిపోవాల్సింది. కానీ కళ్ళు ఆటోనే వెంబడిస్తున్నాయి. ఆటోలో మనుషులు మరుగయ్యారు, చక్రాలు కనిపించడం లేదు, కాసేపయ్యాక అసలు అక్కడ ఆటో ఉందని ఎవరికీ చూపించే వీలు లేదు. ఓ రెండు నిమిషాల నుండి చూస్తున్న ఆ ఆటో ఇంకా ఇప్పుడు నా “దృష్టిలో” ప్రాణంతో ఉండడానికి కారణం దాని హెడ్‍లైట్! పూర్తి ఆకారం చీకటిలో కలిసిపోయినా ఆ హెడ్‍లైట్ నా కంటికి దాని ఉనికి చాటుతూనే ఉంది. కాసేపటి వరకూ ఒక నక్షత్రంలా మెరుస్తూ ఉంది. నేలమీద నడుస్తున్న నక్షత్రంలా! ఇంకాసేపటికి రాలి… పోయింది నక్షత్రం!!

సైడ్ లోవర్ బర్త్ సీనరీ:
“సైడ్ లోవర్ బర్త్  అనెడి నాన్‍సెన్స్” అని రాయాల్సిన ఈ పేరాకి ఆ శీర్షిక పెట్టడానికి ఒకే ఒక్క కారణం, విజయవాడ స్టేషనులో రాత్రి మూడున్నరకి మా వాడినొక్కడిని తిట్టుకుంటూ లేచినా కళ్ళప్పగించి చూసిన ఒక మనోహర దృశ్యం. ఏవో కొన్ని లైట్లు కనిపిస్తే బిగించేసిన కిటికీ తలుపులు తెరిచాను. ఎత్తుగా ఉన్న వీధి దీపాల వల్ల తెల్సింది, అక్కడ ఓ కొండ ఉందని. “ఏదో కొండ.. ఏవో కొన్ని దీపాలు.. చల్..” అనుకుని ముసుగుపెట్టి పడుకుందామనుకుంటుండగా, కనిపించాయి, రెండు కొండలు మరీ దగ్గర దగ్గరగా! ఇప్పటికి కూడా ఆ ఆకారం నా కళ్ళల్లో మెదలాడుతున్నా అక్షరాల్లో పెట్టడం నా వల్ల కాదు. ఒకరి తలపై ఒకరు తల వాల్చి కూర్చున్నప్పుడు ఏర్పడిన ఏ ఇద్దరి నీడలానో ఉండచ్చు.. ఉండకపోనూ వచ్చు! మనకి కావాల్సింది మాత్రం ఆ రెండు కొండల ( లేక ఒకటే కొండ ఏమో.. ) మధ్యన అర్థచంద్రాకారం ఏర్పడడం.. అక్కడే నిండు పున్నమి చంద్రుడు! కళ్ళంటూ ఉంటే చూడాల్సిన సీను అనుకున్నా మనసులో!! బాక్‍గ్రౌండ్ మొత్తం చీకటి.. అదే ఆ బూడిద రంగు చీకటి. ఓ రెండు కొండలు.. లేక కొండల్లాంటి ఆకారాలు, ఇంచులు కొలిచి మరీ మధ్యన “ప్లేస్” చేశారనిపించేలా ఒక నిండు చందమామ, చందమామకి అక్కడక్కడా ఎర్రని షేడ్ చేసినట్టూ! ఆ మసక వెలుతురు.. ఆ నిండు జాబిలీ.. వేగాన్ని పుంజుకుంటున్న రైలు, ఒకే లైటు వెలుతురులో నిద్రపోతున్న కంపార్ట్ మెంట్, చలి గాలికి భుజాలను చుట్టేసిన చేతులూ, వాలడానికి ససేమీరా అని నిరాకరించే కనురెప్పలు! It was breathtaking, if not anything else.

ఆ కొండమీద నుండి రైలుతో పాటు చంద్రుడు కూడా రాసాగాడు; వెన్నక్కి వెన్నక్కి ఉంటూ.. ఆచి తూచి అడుగులేస్తున్నట్టు. రైలు నెమ్మదిగా పోతుంటే.. తానూ నిదానమైపోతాడు. రైలు పరిగెడితే.. తానూ పరుగందుకుంటాడు. ఆఖరికి ఏదో క్షణాన ఓటిమి ఒప్పేసుకుని కనుమరుగవుతాడు. అచ్చు.. ఇష్టపడిన పిల్ల వెంట వెళ్ళలేక, ఆగలేక తికతికపడే ఓ టీనేజీ కుర్రాడిలా!

మంచులో కోనసీమ – కోనసీమలో మంచు:
“హా.. ఆ గయా.. ఆ గయా.. ఛలో ఉఠో..” అంటూ ప్రాణాలు తోడేసినవాడిని కసి తీరా కొట్టడానికని లేచాము. కానీ ఎక్కడ? అప్పుడే తెలతెలవారుతున్న వెలుతురులో పచ్చని పొలాలన్నీ మంచు దుప్పటి ముసుగు తన్ని మరీ పడుకున్నాయి. కోనసీమలో అంత మంచు ఉంటుందని ఊహించలేదు.. ఆశ్చర్యం వల్లనేమో ఆనందం ఇంకా హెచ్చింది. అప్పటి దాకా, ఓ కొబ్బరి చెట్టు ఆకుల్లో ఈనులు లెక్కపెట్టేంత స్పష్టంగా ఉంటుంది. చూస్తూ చూస్తూ ఉండగానే మసకలో కరిగిపోతూ, “అసలక్కడ ఏమీ లేదే” అన్నట్టు మారిపోవడం. “ఓ గంట ముందు ఏం చేశావ్?” అని అడిగితే మెదడులో ఉన్న మబ్బంత మంచక్కడ! ఇంకా మంచుపట్టిన ప్రాంతాల్ని చూశాను. కానీ ఇది ఎందుకో ప్రత్యేకం అనిపించింది. రైలు కిటికీ ఎంత చిన్నదో మొదటిసారి తెల్సొచ్చింది. డోర్ దగ్గర నిలబడి చూస్తున్నప్పుడు ఎలా ఉంది అంటే: తెల్లని దుప్పటి వేసిన మంచం మీద, తెల్లని బట్టలు చుట్టేసిన నెలల పసికందు నిద్రపోతున్నప్పుడు.. కాస్త దూరం నుండి చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. పాపాయి మొహం మాత్రమే కనిపిస్తూ నిద్రలో ప్రశాంతంగా, ఆ ప్రశాంతత వలన చుట్టూ ఉన్న తెలుపు ఇంకా తెల్లగా అవుతుంది. ఉదయం ఆరవుతున్నా.. కోనసీమ ఇంకా మత్తుగా నిద్రపోతూనే ఉంది. 
   
మలిప్రేమ! 😉
మొదటిదెప్పూడూ తీయ్యనిది, తొలిప్రేమా.. తొలిముద్దూ.. తొలి ప్రేమలేఖ అంటూ ఓ మెలికలు తిరిగిపోతాం కానీ, is there something like falling for, all over again? గోదావరిని చూసేశాను కదా అని ఏ మాత్రం ఎక్సైట్ కాకుండా వెళ్ళానా.. అయినా ఏం లాభం, కొండల మధ్య వంపులు తిరుగుతున్నా గాంభీర్యంగా కనిపించే గోదారి నది చూస్తూనే పడిపోయాను.. మళ్ళీ! ఆ పడ్డం కూడా మామూలుగా పడ్డం కాదు, ఎత్తైన కొండ చివర్న నుంచుని, చేతులు చాచి.. పడుతున్నా అన్న పూర్తి స్పృహతో.. అది ఇచ్చే స్వేచ్చా ఆనందాలతో పడ్డటం మాట! గోదావరిలో ఏదో ఉంది.. ఏంటో వెత్తుక్కోలేదు, ఆ గమ్మత్తు ఏంటో గానీ, మత్తు మాత్రం భలే ఉంటుంది. ఇప్పటికే ఈ నది మీద కవిత్వాలూ, కథలూ బాగా వచ్చి ఉన్నాయి, నేనూ అందులో అతి సామాన్య ప్రేక్షకురాలనుకుంటా!

నదిలో.. కొండ నీడన.. వాళ్ళిద్దరూ..
పాపికొండల వ్యూ పాయింట్ వచ్చే ముందే అనుకుంటా, వచ్చీ రాగానో.. సరిగ్గా గుర్తు లేదు, ఓ పేద్ద కొండ, దాని నీడన ఒక చిన్ని పడవలో (పడవ కూడా అనకూడదేమో.. దానికో పేరుండే ఉంటుంది.. బోట్ అనుకుంద్దాం) ఒక జంట. సన్నని చీలికలా ఉన్న ఆ బోటులో ఓ పక్క ఆమె.. మరో పక్క అతడు. మధ్యన వలతో తంటాలు పడుతున్నారు. దూరం నుండి చూస్తున్నా, వారిద్దరికీ వయస్సు మళ్ళిందని తెలిసిపోతుంది. ఆ పూట బువ్వ కానిచ్చుక్కుని, ఏ రాత్రికో సరంజామా సిద్ధం చేసుకుంటున్నారేమో! ఈ ప్రయాణం మొదలెట్టి ఎన్నేళ్ళయ్యిందో! సహజీవనం అంటే ఒక అరుదైన గౌరవం కలగడానికి ఇదే కారణం, జీవితపు మలి సంధ్యలోనే దాని అందం పరిపూర్ణంగా తెలుస్తుంది. పైన చెప్పిన అన్ని సందర్బాల్లోనూ cam నా దగ్గర లేదు, కారణాంతరాల వల్ల. ఈ ఒక్క సందర్భంలో నా చేతిలోనే ఉన్నా.. ఫోకస్ చేసి, జూమ్ సెట్ చేసి, క్లిక్‍మనిపించటం వాళ్ళ ప్రైవసీకి అడ్డుగా తోచింది. నేను తీయలేదు, మరెవరినీ తీయనివ్వలేదు. మా తిరుగు ప్రయాణంలోనూ కనిపించారు, అక్కడే.. పని ముగించుకుని అప్పుడే బయలుదేరుతూ.

గ్లాసు ముందా? మేం ముందా?
అదృష్టం మరీ ఎక్కువై మేం ప్రయాణించిన బోటు తిరుగు ప్రయాణం మధ్యలో చతికిలపడి, గోదారమ్మ ప్రవాహ వేగం మీద ఆధారపడింది.  ఎవరో పడేసిన ప్లాస్టిక్ గ్లాస్‍ నిటారుగా నిల్చుని ఠీవిగా పోతోంది. అంతే వేగంతో మేము కూడా! చీకటి పడడానికి అంతా సంసిద్ధమయ్యే వేళ, అలా నదిలో కొండల మధ్యన ఉండిపోవాల్సి వస్తుందేమో అన్న ఆలోచన వచ్చినప్పుడు మాత్రం గుండె పాపం, బెంబేలు పడిపోయ్యింది. Castaway సినిమాలో హీరో దగ్గర బంతిలా, ఇక ఈ గ్లాసే మనకి తోడు అన్నంతగా వెళ్ళిపోయారు మాలో కొంత మంది. ఇంజెన్ రిపేర్ అయ్యి, బోటు గాడిన పడేసరికి పందెం మేమే గెలిచేసాం.

“అయ్యో.. గ్లాసు ఒక్కటే ఉండిపోయిందే!” అనుకునే బాధ వేరుగా ఉండేది. నిజానికి ఆ గ్లాసుకి చాలా “కంపెనీ” ఉందక్కడ! తిని పారేసిన ప్లేట్లూ, లేస్ కవర్లూ, గ్లాసులూ, బెలూన్‍లూ, ఈనాడు నుండి అన్ని దినపత్రికలూ, కాగితాలూ – అవీ ఇవీ అని కాక అన్నీ అక్కడ మునగలేక, ఈదలేక కష్టాలు పడుతున్నాయి. ఈ పాపికొండల ట్రిప్ పాకేజీలూ చాలా విస్తారంగా వ్యాపారం చేయిస్తున్నాయన్నదానికి ప్రత్యక్ష సాక్ష్యాలివీ! రెండేళ్ల క్రితం గోదావరికీ, ఇప్పటికీ చాలా తేడా. అసలు మనుషులు కాలు పెట్టగలిగిన ప్రతీ చోటూ ఇలా మరకలే ఉంటాయా? హమ్మ్.. 

25 Responses to “Camకి చిక్కని చిత్రాలు!”

 1. kvmkishore

  నాయనమ్మ వీపు మీద వాలిపోయి మెడ చుట్టూ చేతులు వేసి చెంపకు చెంప ఆంచి చూస్తుండగానే గిన్నెలో కుంచెంగా ఉన్న పిండి పాత చీర మొత్తం కప్పేసింది… అచ్చం అలా పిండి ఆరబోసినట్టు అలా రెప్పపాటులో కళ్ళ ముందు అల్లుకుపొయే మల్లెపందిరిలా రమణీయంగా చెప్పడం మీకే వచ్చని పేద్ద బడాయి… సరేలెండి చందమామ గురించి “పూర్ణిమ” కన్నా బాగా ఎవరు చెప్పగలరు…

  Like

  Reply
 2. నిషిగంధ

  కామ్ కూడా బంధించలేని అందాలెన్నో నాకైతే నీ మాటల్లోనే కనిపిస్తాయి… ఆ మాటల్లోనే ఆటో నక్షత్రంగా మారడం చదివి ‘వావ్’ అనేసుకుని.. ‘ఓ మా విజయవాడ మీదుగా ఎక్కడికెళ్ళిందో!?’ అని కుతూహులంగా ఇంకాస్త వేగంగా చదువుతుండగానే నువ్వు మలిప్రేమలో స్వేఛ్చగా పడటం చూసి కాస్తంత… కాదు కాదు… బోల్డంత అసూయపడిపోయాను.. చివరిగా నీ స్వగతం ‘అసలు మనుషులు కాలు పెట్టగలిగిన ప్రతీ చోటూ ఇలా మరకలే ఉంటాయా?’ చూడగానే What else can you expect!? అన్నట్లుగా మనసు నిర్లిప్తంగా అయిపోయింది!!

  Like

  Reply
 3. Rani

  wow! you are very expressive with words. I could see your mental images, reading this post. keep it up 🙂

  Like

  Reply
 4. మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్

  “కనిపించని దాన్ని వినిపించేవాడే కవి” అని ఏ ముహర్తాన అన్నారో కానీ ఆ మాటకు తిరుగేలేదు.
  (కావాలాంటే దాన్ని “కనిపించని దాన్ని వినిపించేదే కవయిత్రి” అని రాసుకోండి)

  Like

  Reply
 5. ప్రపుల్ల చంద్ర

  అద్భుతంగా ఉంది మీ వివరణ.. మేమూ మీతో పాటు ప్రయాణించిన అనుభూతి కలిగింది….

  Like

  Reply
  • siva kumar

   nijam ga alane undi…andamaina godavri lo anadama ga prayanimpa chesara thank andi…nijmaga we r so lucky…godavari district lo puttinanduku

   Like

   Reply
 6. మరమరాలు

  “One Look is Worth a Thousand Words”
  So said a famous Japanese philosopher, and now he was right. Thank you for photo-words.

  Burri

  Like

  Reply
 7. జ్యోతి

  వావ్! పూర్ణిమా! మమ్మల్ని కూడా నీతో పాటు ప్రయాణింపజేసావు. నువ్వు చూసిన , అనుభవించినా ఆ సుందర దృశ్యాలు, కెమెరా లేకున్నా కూడా మేము స్పష్టంగా చూడగలిగాము. కీప్ ఇట్ అప్..

  Like

  Reply
 8. మధుర వాణి

  పూర్ణిమ గారూ..
  మీరు వర్ణించిన చిత్రాలు cam కి చిక్కినా గానీ ఇంత మంచి అనుభూతిని కలిగించలేకపోయేవేమో..!
  మాకు కూడా ఒక చక్కటి అనుభూతిని మిగిల్చారు మీ ఊసుల ద్వారా..
  అభినందనలు 🙂

  Like

  Reply
 9. వేణూ శ్రీకాంత్

  అయ్యో పూర్ణిమా నిన్న లేఖిని నుండి కాపీ పేస్ట్ చేయడం లో లాస్ట్ లైన్ మిస్ చేసినట్లున్నాను నేను గమనించనే లేదు. ఇదిగో నా పూర్తి కామెంట్.

  ఎందుకో ఈ పాట గుర్తొచ్చింది పూర్ణిమా నీ టపా చూడగానే…

  “మాటల కందని భావాలు మంచి మనసులు చెబుతాయి..
  కవితల కందని భావాలు కంటి పాపలే చెబుతాయి..
  వెన్నెల మాటాడునా… వెదజల్లును చల్లదనాలు..
  మల్లిక మాటాడునా… కురిపించును పరిమళాలు..”

  కొన్ని చిన్న చిన్న అనుభూతులను అక్షరబద్దం చేయడం చాలా కష్టం కానీ నీ ప్రయత్నం బాగుంది…
  ఎంత బాగుందంటే ఈ పాట రాసినాయన దగ్గరకి వెళ్ళి, “లేదు మా పూర్ణిమ మాటలలో ఎలాంటి భావాలైనా ఇట్టే ఒదిగిపోతాయి !!” అని చెప్పాలనిపించేంతగా.

  Like

  Reply
 10. మోహన

  చాలా బాగా రాసావు పూర్ణిమా.. ట్రైన్ జర్నీ అంటే నాకు చాలా ఇష్టం. సైడ్ లోయర్ బెర్తు అంటే ఇంకా ఇష్టం. ఎందుకంటే.. ఎప్పుడు కావాలంటే అప్పుడు కిటికీ లోంచి చూస్తూ నా ప్రపంచంలోకి, మిగతా వాళ్ళని చూస్తూ ట్రైన్లోకీ వచ్చేందుకు వీలుగా ఉంటుంది. నీ వర్ణనలు ఇంకా అందంగా ఉన్నాయి. నేను అలా కిటీకీ లోంచి చూస్తూ మనసులో అనుకునే ఊసుల్లా..
  పొద్దున్న 8 అయినా మంచు ఎలా ఉందో ఇక్కడ చూడు.. http://picasaweb.google.co.in/visalay/Dec2007 [క్రితం డిసంబర్లో నేను రైల్లో ప్రయాణిస్తూ తీసిన కొన్ని ఫోటోలు .]

  కానీ నాకొకటే అర్థం కాలేదు. నీకు ట్రైన్లో నుంచి కనిపించింది కోనసీమేనా??!! Are u sure? కోనసీమకు ఇంకా ట్రైన్ రూట్ లేదు గా?! నువ్వు ట్రైన్లోంచి చూసింది, పశ్చిమ గోదావరి జిల్లా. తుర్పు గోదావరి రాజమండ్రితో మొదలవుతుంది. కోనసీమ తూర్పు గోదావరి జిల్లాలో ఒక భాగం. నాకైతే కోనసీమ అంటే గుర్తొచ్చే ఊర్లు.. కోటిపల్లి, అమలాపురం, రావులపాలెం. కోనసీమ గురించి మరిన్ని వివరాలు ఈ కింది లింకులో చూడు.
  http://en.wikipedia.org/wiki/Konaseema

  ఒకప్పుడు కరువుకాటకాలతో అలమటించిన ప్రాంతం అది. ధవళేస్వరం, విజ్జ్యేస్వరం దగ్గర కాటన్ దొర ఆనకట్ట కట్టించటంతో సశ్యశ్యామలమైంది. ఆకుపచ్చని జీవనదిలా సంవత్సరం పొడవునా పచ్చగా కళా కళలాడుతుంది. అలాంటి కోనసీమ అందాలను ఎన్ని ఫోటోల్లో అని బంధించగలం ?

  “నదిలో.. కొండ నీడన.. వాళ్ళిద్దరూ.. ” నాకు చాలా నచ్చింది. కెమేరాలో బంధించకుండా వారి ఏకాంతానికి భంగం కలగనీయకుండా చూసి, వారికి నువ్వు ఇచ్చిన గౌరవం అభినందనీయం.

  నువ్వు వెళ్ళొచ్చిందే కాకుండా, ఈ టపా చదివిన వారందరితో కూడా ఒక చిన్న ట్రిప్ వేయించేసావ్. ఆంధ్రప్రదేశ్ టూరిసం వారికి చూపించాలి నీ ఈ టపా.. 😉
  I enjoyed the read. Thank you.

  Like

  Reply
 11. Purnima

  మోహనా:
  టపా రాస్తున్నప్పుడు ఓ సారి గట్టిగా అరచి మరీ రెండు గదులవతల ఉన్న నాన్నని అడిగా.. కోనసీమ ఏంటి అని. అటు నుండి ఏదో పాజిటివ్ రిప్లై వచ్చేసరికి, ఇక్కడ రాసేశాను. ఇప్పుడు తెల్సింది, నేను అడిగిన ప్రశ్నే తప్పని! హమ్మ్.. Thanks for correcting!

  Btw, are you sure, it’s AP Tourism? Is not the South Central Railway? 😉

  @kvmkishore: “పూర్ణిమ” బడాయి ఎంత సేపులెండి, ఏ సూర్యుడో ఉన్నంత వరకే కదా! 😉
  ఒక్కసారి మా నాన్నమ్మను జ్ఞాపకం తెప్పించారు, మీ కమ్మెంటుతో. నెనర్లు!

  నిషీ, రాణీ, ఫణి ప్రదీప్, ప్రఫుల్ల చంద్ర, మరమరాలు, లక్ష్మీ, శ్రీ విద్య, జ్యోతి, మధురవాణీ, కొత్తపాళీ: ధన్యవాదాలు!

  Like

  Reply
 12. నేస్తం

  పూర్ణిమ గారు ఎంత బాగా రాసారండి 🙂 చాలా బాగుంది

  Like

  Reply
 13. రాజేంద్ర కుమార్ దేవరపల్లి

  కోనసీమలో అంత మంచు ఉంటుందని ఊహించలేదు..
  రైలు కిటికీ ఎంత చిన్నదో మొదటిసారి తెల్సొచ్చింది. డోర్ దగ్గర నిలబడి చూస్తున్నప్పుడు ఎలా ఉంది అంటే..నేనెప్పుడూ వెళ్ళలేదుగానీ,కోనసీమకు రైలు మార్గం నాక్కాస్త వివరించగలరా

  Like

  Reply
 14. మురారి

  మాటలతోనే కళ్లకి కట్టినట్టు చూపించారు.
  >>ఎత్తైన కొండ చివర్న నుంచుని, చేతులు చాచి.. పడుతున్నా అన్న పూర్తి స్పృహతో.. అది ఇచ్చే స్వేచ్చా ఆనందాలతో పడ్డటం మాట.

  >>ఫోకస్ చేసి, జూమ్ సెట్ చేసి, క్లిక్‍మనిపించటం వాళ్ళ ప్రైవసీకి అడ్డుగా తోచింది. నేను తీయలేదు, మరెవరినీ తీయనివ్వలేదు.

  మీరు భలే నచ్చేసారు.

  Like

  Reply
 15. భైరవభట్ల కామేశ్వర రావు

  అద్భుతం. ఇవి నిజంగానే Camకి “చిక్కని” చక్కని చిత్రాలు!
  వచ్చే వారం మేమూ పాపికొండల యాత్ర చెయ్యబోతున్నామోచ్! ఇప్పుడీ మాటలు నా మనసుకి గైడులా తోడొస్తాయి. ఆ చూడబోయే దృశ్యాలు మరింత అందంగా కనిపిస్తాయి.

  Like

  Reply
 16. జాన్‌హైడ్ కనుమూరి

  నేను పోలవరంలో పెరిగాను, గోదావరి, పాపికొండలు పడవ-లాంచీ ప్రయాణాలు ఎన్నో అనుభూతులు, అనుభవాలు అనుభవించాను. కాని మాటల్లో, చిత్రాలలో చెప్పలేకపోయా. కాంలేని చిత్రాలు కళ్ళముందు తిరిగాయి.

  ఈ ఆనంద అనుభూతినిచ్చిన మీ కళ్ళ కాంకి నా అభినందనలు, కృతజ్ఞతలు

  Like

  Reply
 17. కత్తి మహేష్ కుమార్

  అనుభవపు తునకలు బాగున్నాయ్!

  Like

  Reply
 18. satish

  మీ మనోనేత్రంతో తీసిన చిత్రాలు చాలా బాగున్నాయి. మీ ఊహలతొ జోడించి చాలా బాగా వర్ణించారు!! ఈ చక్కని అనుభూతి కలిగించినందుకు ధన్యవాదములు 🙂

  Like

  Reply
 19. నిశాంత్

  చాలా^చాలా బగుంది… 🙂
  ఈ చలికాలంలో ప్రయాణం అంటేనే ఒక అందమైన అనుభూతి..!
  ఈ మాటల చిత్రాలతో దాన్ని పదిలం చేసేసారు… జోహార్లు.
  చివరి మాట “మనిషులు కాలు పెట్టగలిగిన………..” నిజమేనేమో!!!!!

  Like

  Reply
 20. రాధిక

  చిన్న చిరునవ్వు,కొంత మైమరపు,కొన్ని జ్ఞాపకాలు,కొన్ని ఆశ్చర్యాలు,కొంత గర్వం[అమ్మా గోదారి నాదీ…ఎవ్వరికీ ఇవ్వను]కొంత నిరాశ[హైద్ నుండి ఊరికి రైలు ప్రయాణం తెగ మిస్ అయిపోతున్నాను]…ఇవీ నీ టపా నాకిచ్చిన బహుమతులు.ఇకనుండి ఫొటోలు నువ్వే దాచుకో.మాకు మాత్రం అక్షరాల అనుభూతులు పంచు.విజయవాడ పొద్దన్న మూడుకి అంటే ఏ గోదావరో,గౌతమో ఎక్కింది కొంపదీసి మా ఇంటికి వెళ్ళలేదు కదా అని అనుమానమొచ్చింది.పాపికొండల ట్రిప్పా.వెళ్ళేముందు కొండవీటి సత్యవతిగారి[మా గోదావరి బ్లాగ్స్పాటు]పాపికొండల అనుభవాలు చదివి వెళ్ళాల్సింది.

  Like

  Reply

Leave a Reply to మురారి Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Basic HTML is allowed. Your email address will not be published.

Subscribe to this comment feed via RSS

%d bloggers like this: