హవ్.. అన్నా!

Posted by

రోడ్లపైన జనాలు బారులు తీరి ఉన్నారు.  భారతదేశ జనాభాలో వైవిధ్యానికి నమూన చూపడానికి సరిపడా ప్రజలున్నారు. అన్ని వయసుల వారు. అన్ని మతాల వారు. అన్ని వర్గాల వారు. “అన్నా హజారే జిందాబాద్..”, “వి వాంట్ క్లీనర్ ఇండియా!”, “అవినీతిని నిర్మూలిద్దాం.. అన్నాకు మద్దతునిద్దాం” అన్న నినాదాల మధ్య, “ఇన్నాళ్ళూ దేశాన్ని దోచుకొని తిన్నారు. ఒక్కసారి ఈ బిల్ రానీ, నా కొడుకులు బతుకులని రోడ్డు మీదకు లాక్కురాకపోతే చూడు..” అన్న ఆగ్రహం, “హైట్స్ యార్.. ఒక డబ్భై ఏళ్ళ మనిషి నిరహార దీక్షలు చేస్తుంటే, మీకు ఇంగ్లాండ్‍లో ఇండియా ఇన్నింగ్స్ గురించి బెంగగా ఉందా?” అన్న చిరాకు, “ఇదేదో బాగుందే! ఇలా రోడ్ల పైకొచ్చి అరవడం, మనమేదో సాధించేస్తున్నాం అన్నట్టు.. ఫీల్స్ గుడ్!” అన్న సంబరం, “అబ్బా.. గొంతెండుకుపోతోంది. కాసిన్ని మంచినీళ్ళు దొరికితే బాగుణ్ణు” అన్న అలసట కూడా ఆ నిరసన నడకలో పాలుపంచుకున్నాయి.

“రేయ్య్.. ఇదో ఈ ఆంగిల్ నుండి ఒక ఫోటో తీయ్య్.. ఇక్కడ అయితే జనం బా కవర్ అవుతున్నారు” అన్నాడు, ఒకడు ఇంకోడితో. “తీయగానే ఫేస్‍బుక్‍లో లోడ్ చేసేయ్య్.. అది చూసి, చాలా మంది రావాలి. వస్తారు కూడా! లైవ్ అప్‍డేట్స్ కావాలి..” అన్నాడు ఇంకా ఆవేశంగా.

ఇంకోడు ఫోన్ తీసాడు, ఫొటో తీయడానికి. పదిహేను మిస్‍డ్ కాల్స్ అన్న కబురు చూపించింది. “అబ్బా.. ఆమ్మే అయ్యుంటుంది.” అని సన్నగా విసుక్కుంటూ తెరిచాడు. అక్క నుండి కాల్స్. మెసేజస్ కూడా. “రేయ్య్.. ఎక్కడున్నావ్? ఇంటికెళ్ళు త్వరగా!”, “ఫోన్ లిఫ్ట్ చేయ్.. “, “అమ్మకు బాలేదు. హాస్పిటల్‍కు తీసుకెళ్ళాలి.”, “నువ్వు ఈ మెసేజెస్ చూడగానే వెంటనే డాక్టర్ అంకుల్ క్లినిక్ వెళ్ళు.. అమ్మ అక్కడే ఉంది.” అన్న మెసేజ్‍లు చదవడానికి క్షణాలు సరిపోయాయి. బుర్రలోకి ఎక్కడానికి మాత్రం చాలా సమయమే పట్టింది. ఉన్న చోట నుండి బైక్ పార్కింగ్ ప్లేస్‍లోకి ఎలా పరిగెట్టాడో, ఆ పార్కింగ్ పద్మవ్యూహం నుండి ఎలా బయటపడ్డాడో, క్లినిక్ ఎలా చేరుకున్నాడో అతడికి తెలీదు.

క్లినిక్‍లో వాళ్ళ అమ్మను మంచం మీద చూసాడు. “నీకేమయ్యింది?” అంటూ కూలబడిపోయాడు. కొడుకుని దగ్గర తీసుకోవటంలో నిమగ్నమైన ఆవిడ సమాధానం ఇవ్వలేదు. “ఏమయ్యింది?” అని రెట్టించాడు. ఆవిడకు కళ్ళల్లో నీళ్ళుతిరుగుతున్నాయి, వాణ్ణింకా దగ్గరకు తీసుకొని, తల నిమిరారు.

“హే వచ్చావా? నీ కోసమే చూస్తున్నాం.” అంది ఆ అమ్మాయి.

“మీ అమ్మ మెట్లు దిగుతుంటే.. కళ్ళు తిరిగి.. బి.పి అట కదా.. పెద్ద దెబ్బలేం తగల్లేదు. కాలు బెణికింది. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. లక్కీగా ఆవిడ పడినప్పుడు మీ అక్కతో ఫోన్‍లో మాట్లాడుతున్నారు. ఆవిడ వెంటనే నాకు కాల్ చేసారు. అంటే.. మొన్నటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు నెంబర్స్ ఇచ్చుకున్నాం, నాకు ఆవిడతో కాలేజీ పనేదో ఉంది, అందుకని.” – సమాచారం మొత్తంగా చెప్పేసి, అప్పటికే ఆలస్యమయ్యిందనీ, వెళ్ళొస్తాననీ చెప్పి వెళ్ళిపోయింది.

డాక్టర్‍తో మాట్లాడి, మందులు కొనుక్కొని, అమ్మను తీసుకొని ఆటో ఎక్కి ఇంటికి బయలుదేరాడు. ఇల్లున్న సందు మలుపులోనే ఆపేసి, ఆటోవాడు దిగమన్నాడు.

ఒక పదడుగులు లోపలికి వెళ్ళమన్నాడు ఇతడు. పదడుగులేగా వేసుకొమ్మన్నాడు వాడు. దెబ్బ తగిలున్న మనిషన్నది కనిపించటం లేదా అని అడిగాడు. కనిపిస్తుంది; యాభై ఎక్ట్రా ఇస్తే వస్తానన్నాడు. అడుగుక్కి ఐదు రూపాయలా? అని మండిపడ్డాడు ఇతడు. ఏం? గుక్కెడు మంచినీళ్ళకి రూపాయలు పెట్టగాలేనిది అని వాదనకు దిగాడు వాడు. ఆటోవాళ్ళల్లో మానవత్వం కరువైయిందని వాపోయాడు ఇతడు. ఇందాక పండ్ల మార్కెట్ కాడ రెండు నిముషాలు ఆపినందుకు పైసల్ అడగలేదని గుర్తుచేసాడు వాడు. ప్రజల్ని పీడించుకుని తినటంలో రాజకీయ నాయకులకన్నా దరిద్రం ఆటోవాళ్ళు అని ప్రకటించాడు ఇతడు. మాటలు సరిగ్గా రానివ్వమంటూనే, దినం దినం ట్రాఫిక్ పోలిస్ హౌలాగాళ్ళతో వేగితే తెలుస్తుందన్నాడు వాడు.

“ఒరేయ్.. నాన్న! గొడవెందుకు? నేను నడుస్తా పద. ”

“లేదమ్మా.. కూర్చో! సరే.. పోనివ్వు, యాభై ఇస్తా..”

“మాంచి బేరం తగిలింది. పక్కనే అని చెప్పి శశ్మానంలోకి తీసుకొచ్చాడు.”

మనవాడికి కోపం పెరిగి, శరవేగంతో నోట్లోకి తన్నుకొచ్చిన బూతులు, వాళ్ళ అమ్మ అతడి చేయి నొక్కిపెట్టటంతో సడెన్ బ్రేక్ వేసినట్టు ఆగిపోయాయి. ఇంటి ముందు ఆటో దిగాక, అప్పనంగా గుంజుకున్న యాభై రూపాయల వంక ఆప్యాయంగా చూసుకుంటూ, “అన్నా హజారే సాబ్?” అన్నాడు ఇతగాడి చొక్కా మీదున్న బొమ్మను చూసి.” లోక్‍పాల్ బిల్ రావాలా.. అప్పుడు మీటర్ వేసి నడుపుతా. పోలిసోలందరూ బొక్కలోకి పోయే రోజు రావాలా.. ఫుకట్‍లో తీసుకుపోతా సవారీలను, సవారీలను. పీక్క తింటున్నారు సాలేగాళ్ళు. అమ్మ జాగ్రత్త సాబ్!” అంటూ వెళ్ళిపోయాడు వాడు.

కాసేపటికి వాళ్ళక్క ఫోన్ చేసింది. అమ్మను గురించి వాకబు చేసింది. కంగారు పడాల్సింది ఏమీ లేదు కదా అని ఒకటికి రెండు సార్లు అడిగి నిర్దారించుకొంది. తనకు చాలా భయమేస్తుందని చెప్పింది. వెంటనే బయలుదేరి రావడానికి సిద్ధం అని చెప్పింది. అమ్మను జాగ్రత్తగా చూసుకోమంది. తమ్ముణ్ణీ జాగ్రత్తగా ఉండమంది. ఇంట్లో పనులన్నీ సద్దుమణిగాక, ఫోన్ చేసి తీరిగ్గా మాట్లాడుకుందాం అని చెప్పి, ఫోన్ పెట్టేసింది.

ఇతగాడూ అమ్మకు జ్యూస్ చేసి, మందులు మింగించి, ఆవిడ పడుకున్నాక, టివి ముందు లాప్‍టాప్ తో తిష్టవేసాడు. అన్నా ఆరోగ్యం గురించి ఆందోళనగా ఉన్నారంతా! టివిల్లో ఊదరగొట్టేస్తున్నారు. ఫేస్‍బుక్ తెరిచాడు. వాల్ మొత్తంగా అవే మెసేజ్‍లు. అప్పుడు గుర్తొచ్చింది, తన ఫ్రెండ్‍కు మాటైనా చెప్పకుండా వచ్చేసాడని. ఫోన్ చేసి సంజాయిషీ ఇచ్చుకున్నాడు. ఒక వారం పాటు అమ్మను చూసుకోవడంతో సరిపోతుందనీ, తాను రాలేననీ, ఇంటి నుండి చేసే ఏ పనులైనా చేస్తాననీ చెప్పాడు. ఫ్రెండ్ “టేక్ కేర్” అంటూ ఫోన్ పెట్టేసాడు.

ఇంతలో వాళ్ళ అక్క ఫోన్..

“ఏరా? అమ్మకెలా ఉంది?”

“కాలు కొంచెం నొప్పిగా ఉందననింది. ఇప్పుడు పడుకుందిలే. డాక్టర్ గాభరా పడాల్సింది ఏం లేదన్నారు.”

“ఏమన్నా తినిందా?”

“లేదు. బ్రెడ్ కాల్చి ఇచ్చాను. ఒక ముక్క తినింది. ఇడ్లీ తెప్పిస్తానన్నాను. వద్దంది. జ్యూస్ చేసి ఇచ్చాను. తాగిపడుకుంది.”

“కనీసం పాలు కూడా తాగదు మనిషి. మజ్జిగుందా? మళ్ళీ అర్థరాత్రి లేస్తే, ఇవ్వడానికి బాగుంటుంది.”

“సరే.. చూస్తాను.”

“నువ్వేమన్నా తిన్నావా?”

“అహ.. ఏం లేదు. ఏడే అవుతుందిగా!”

“నిజం చెప్పరా! అంతా బానే ఉందా? నన్ను రమ్మంటావా? నేను కంగారు పడను.. నువ్వు నిజం చెప్పు..”

“అంతా ఓకే అక్కా.. నిజం! నా మాట నమ్ము..”

“నీ గొంతెందుకు అలా ఉంది మరి? ఏడ్చావా?”

“ఛ! అదేం లేదు. ఇవ్వాలంతా ధర్నాలో ఉన్నా కదా, అక్కడంత నినాదాలు అరిచి..అరిచి..”

“…”

“నా మీద కోపంగా ఉందా? అమ్మను వదిలేసి, నేనిలా…”

“అదేం లేదు. ఇది ఒక ఆక్సిడెంట్ అంతే!”

“అక్కడంతా గోలగా ఉందని, మొబైల్ సైలెంట్ పెట్టాను. నీ మెసెజెస్ చూసేసరికి తలతిరిగింది. సారీ!”

“హమ్మ్.. ”

“కానీ నిజం చెప్తున్నాను అక్కా.. అసలు ఇండియాలో ఇలాంటిదొకటి సాధ్యమని కూడా నాకనిపించలేదు. కానీ ఎంత మంది జనం తెల్సా! ఇన్నాళ్ళూ ఎంత అవినీతికి, అక్రమమానికి గురైయ్యారో.. అదంతా చూపిస్తున్నారు. అందరూ ఒక్కడి కోసం. ఒక్కడు అందరి కోసం. వావ్ ఫీలింగ్..”

“….”

“దేశ చరిత్రను తిరగరాస్తున్నామన్న ఫీలింగ్. మనక్కావాల్సింది మనం సాధించుకుంటున్నామన్న ఫీలింగ్. ఆ చరిత్రలో నేనూ భాగం! గర్వంగా ఉంది నాకు..”

“….”

“ఏం మాట్లాడవూ? నీకనిపించటం లేదా?”

“ఇవ్వన్నీ పట్టించుకునే స్టేజ్ దాటేసాను హేమూ.. ”

“అంటే, నువ్వు ఆంటీ-అన్నా?”

“ఏమో..”

“ఇప్పుడు ఫోన్ పెట్టేయకు ప్లీజ్.. అనన్య ఏడుస్తుందనో, బావ పిల్చాడనో, అత్తగారు నసిగిందనో. నాకు తెలియాలి. నువ్వెందుకు పట్టించుకోవటం లేదు. ఎప్పుడు చూడు ఆ ఫ్యామిలీ, లేకపోతే ఈ ఫ్యామిలీ? ఇవి తప్ప ఇంకో లోకం లేనట్టుంటావే?! చెప్పు.. పెళ్ళవ్వగానే షాపింగులు మానేస్తారా మీ ఆడవాళ్ళు? మానరే! కానీ జీ.కెలూ, కరెంట్ అఫైర్సూ .. పాలిటిక్స్.. స్పోర్ట్స్ … హహ్??”

“హహహహ.. శిరీష చాలా షాపింగ్ చేయిస్తుందా ఏంటి నీతో? అయినా, మా జీవితాలే షాపింగ్-మయం.. ఇంటగ్రెల్ పార్ట్.. ”

“ఏదన్నా అంటే అర్థం కాకుండ మాట్లాడతావూ..”

“సరే రా! నేను తర్వాత మాట్లాడుతా”

“అక్కా.. ఆగు. నేను చెప్పానా ఫోన్ పెట్టొద్దని? ఆగు. ఏంటి ఏడుస్తున్నావా? నేనేదో సరదానికి అన్నాను.”

“లైన్లో ఉండు..”

ఒక రెండు నిముషాల పాటు నిశ్శబ్దం.

“అక్కా? ఉన్నావా? ఐ యామ్ సారీ! నిన్ను నొప్పించాలని అనలేదు.. ఏదో జనరల్‍గా..”

“నాన్న గుర్తొచ్చేసారు. అందుకని. ఇందుకే నేను ఫోన్ పెట్టేస్తా అనేది. నేను ఫస్ట్ క్లాస్‍లో ఉండగా, పరీక్షల్లో మొదటి రాంక్ వస్తే బార్బీ డాల్ కొనమని అడిగాను నాన్నను. తప్పకుండా అన్నారు. నాకు మొదటి రాంక్ వచ్చింది. నాన్నకు చూపించాను. “నాకో వారం రోజుల సమయం ఇస్తావా? అమ్ములూ.. నీ డాల్ తెచ్చిస్తా” అని అనడిగారు. ముందు కొంచెం ఏడ్చి, ఆ తర్వాత ఒప్పుకున్నాను. వారం అయ్యాక నాన్న బొమ్మ తెచ్చిచ్చారు. తెగ సంబరపడిపోయాను. ఎగిరి గంతులేసాను. అందరికీ చూపించాను. కానీ నాన్న మీద అలిగాను. రోజూ ఆరింటికళ్ళా వచ్చి నాతో ఆడుకునే నాన్న, నేను నిద్రపోయేవరకూ రావటం లేదని. అప్పుడమ్మ చెప్పింది, నా బొమ్మ కోసం నాన్న ఓవర్‍టైం చేస్తున్నారని. “బొమ్మ కొనేసారుగా” అని అడిగాను.. అమ్మ “మనం ఇంకా బోలెడు కొనుక్కోవాలిగా” అంది..

“అప్పుడు నాకు తెలీలేదు, నాన్న ఏ బొమ్మ కోసం అంతగా పనిజేస్తున్నారో! పదిహేనేళ్ళ తర్వాత, నాకు బార్బీ బొమ్మ కొనిచ్చినప్పటి సంతోషం మళ్ళీ నాన్న కళ్ళల్లో చూసాను, నా పెళ్ళిలో. బావంటే నాన్నకు చాలా ఇష్టం. తనే అల్లుడు కావాలని ఎప్పుడో నిర్ణయించుకున్నారు. అందుకే నాకు కొనిచ్చారు, లక్షలు పోసి, ఓ జీవితకాలం ఓవర్‍టైం చేసి. ఆడవాళ్ళకు షాపింగ్ తప్పనిసరి. That we’ve to shop for husbands too, makes it even more… ”

“అక్కా.. సారీ! నేను వాగకుండా ఉండాల్సింది..”

“నో.. అదేం లేదు. నాకే ఏం అర్థం కావటం లేదు. నేను పుట్టడానికి ఓ ఇరవై ఏళ్ళ ముందు ఆంటీ-డవ్‍రీ లా వచ్చింది. అంటే, నేను పుట్టే సమయానికి కట్నం అన్న మాట తుడిచిపెట్టుకుపోయుండాలి. కనీసం ఆ మాటంటే వెగటో, భయమో పుట్టుండాలి సమాజంలో. అలా కాక, కట్నం ఒక సనాతన ఆచారంగా వస్తూనే ఉంది. ఆడపిల్ల పుట్టిందంటే, చంపుకునే వాళ్ళు చంపుకోగా, పనులకు పంపించేవాళ్ళు పంపించగా, అబ్బాయిలతో సమానంగా విద్యాబుద్ధులు చెప్పించిన మన అమ్మానాన్నల్లాంటి వాళ్ళు, అన్నీ చేస్తూనే కట్నం ఇచ్చుకోగలిగినంత డబ్బు పోగు చేసారు. సింపుల్‍గా చెప్పనా? నేను అబ్బాయై ఉన్నా, లేక నువ్వొక్కడివే కొడుకైనా నాన్నకు మంచి లొకాలిటిలో ఇల్లుండేది, ఇప్పుడున్న చోటు కాకుండా! నాన్నకొక మంచి బైక్ ఉండేది, డొక్కు లూనా కాకుండా. నాన్న ఇప్పటికి రిటైర్ అయ్యి, అమ్మను విసిగిస్తూ ఉండేవారు. అనారోగ్యం కలిగి, చిన్న ఆక్సిడెంట్‍ నుండి కోలుకోలేక….”

ఒక రెండు నిముషాల పాటు మాటలు లేవు. కన్నీటి మధ్య ఊపిరి తీసుకునే తాలూకు శబ్దాల తప్ప..

“..సో! నాకు తెలీదు అన్నా హజారే ఎవరో! ఎందుకు నిరహారదీక్ష చేస్తున్నారో! జన్‍లోక్‍పాల్ బిల్ అంటే తెలీదు నాకు. అందులో ఏముందో తెలీదు. దాన్ని ఎలా వాడుకోగలమో తెలీదు. అది పనిజేస్తుందన్న నమ్మకం కలగటం లేదు. వెన్నుముక్క లేనివాడికి ఊతకర్ర ఇచ్చి లాభమేమిటి? కనీసం నాకు లేదు నిలబడే ఓపిక. ఉండుంటే, పోలిస్ కేస్ కాకపోయినా, “కట్నం ఇచ్చి చేసుకునే పెళ్ళి నేను చేసుకోను..” అని తెగేసి చెప్పేదాన్ని ఇంట్లో. కాలేజీల్లో డిబేట్లో, ఎలక్యూషన్లలో చాలా మాట్లాడాను, తలెత్తుకొని. పెళ్ళిపీటల మీద తలదించుకున్నాను. నేను తెచ్చిన సారె చూపిస్తూ మా అత్తగారు మురిసిపోతుంటే నిట్టూర్చాను. నాకు వెన్ను లేదు. నిలబడే ధైర్యం లేదు. అప్పుడే లేదు. ఇప్పుడెక్కడ నుండి వస్తుంది? “అన్నా హజారేకి మద్దతునిస్తావా?” అంటే “అవును” అనలేను. అన్నానూ అంటే, ఇప్పటికిప్పుడు రైలు టికెట్లు కావాలంటే నాకు దొరకవు. మా మామగారి ఊర్లో ఇంటి స్థలం రెజిస్ట్రేషన్ పని కాదు. అనన్యకు మేమనుకుంటున్న స్కూల్ లో అడ్మిషన్ దొరకదు. నా స్నేహితురాల్లో ఎవరికైనా అన్యాయం జరిగితే, అన్నీ మూసుకొని కూర్చొమని సలహా ఇవ్వలేను. ఇవ్వన్నీ అయ్యే పనులేనా? పనులెవడికి కావాలి? ఏదో ఒకటి చెప్తే అయిపోతుందిగా అంటే.. ఏమో.. ఇంకోసారి నన్ను నేను మోసగించుకోలేను. సమాజం, దాని ఆచారవ్యవహారాలంటూ నన్ను గొర్రెల మందలో ఒకరిగా పెంచారు. ఇప్పుడు ఎదురుతిరుగుతున్న మరో గొర్రెల మందలో జేరలేను…

“ఏదేదో మాట్లాడేస్తున్నా.. హమ్మ్.. నేను చెప్పగలిగింది అంతే! నాకు వీటి మీద అభిప్రాయాలు ఏర్పచుకునేంత మేధ ఉన్నా, వాటికోసం నిలబడే సత్తువ లేదు. అలా అని, ఏమీ పట్టకుండా ఉండా లేను. రెంటికీ మధ్య నలగడం తప్ప. మీరంతా కల్సి మార్పు తీసుకొస్తే అంతకన్నానా? కానీ, ఇప్పుడు రోడ్ల మీద గొంతుచించుకోవడంతో, బిల్ పాస్ అయితే స్వీట్లతో సరిపెట్టుకుంటే మాత్రం చాలదు. ఒకదానికి అలవాటు పడిపోయాక, దాన్ని వదిలించుకోవటం తేలిక కాదు. కనీసం ఒకట్రెండు తరాల వాళ్ళు, ముఖ్యంగా అవినీతిలో తెల్సో తెలియకో అంతర్భాగమైపోయినోళ్ళంతా చాలా నిష్ఠగా ఉండాలి. దీక్ష చేస్తున్న అన్నాకు ప్రాణగండమే, ఒక్కసారే! అది నిలుపుకోడానికి ఇంకెన్నో గండాలు దాటుకోవాలి. ఈ వేడిని నిలుపుకోవాలి. ప్రలోబాలకు లొంగకూడదు. అడుగడుగునా తప్పుటడుగు వేయాల్సి రావచ్చు. కానీ వేయకూడదు. కనీసం మూడో తరం నుండైనా మార్పు సుస్పష్టమవుతుందని నా ఉద్దేశ్యం. చట్టాలు చేసి, అటకలెక్కించే పనైతే.. ఇవ్వన్నీ దండుగ కదూ!..

“సరే.. చాలా సేపయ్యింది. మళ్ళీ మాట్లాడుతా! అమ్మ జాగ్రత్త. నువ్వేదొకటి తిను.. మానేయక..”

“అలాగే.. గుడ్‍నైట్!”

“గుడ్‍నైట్”

“ఒక మాట.. నువ్విలా ఒక మూవ్‍మెంట్‍లో ఆక్టివ్‍గా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. దాని వల్ల ప్రయోజనాలు తెలియకపోయినా, క్రికెట్లో గెల్చినప్పుడే కాక, మిగితా సమయాల్లో, the youth of this nation wants to get counted అన్నది చూపిస్తున్నారు. నా వాగుడుకేం గానీ, మీ ప్రయత్నాలు మీరు చేయండి. ఏదైనా సరే, ఎక్కడో చోట మొదలవ్వాలిగా..”

“హమ్మ్..”

“ఉంటాను మరి. ఏ ఆలోచనలూ పెట్టుకోకుండా పడుకో.. ఏదోటి తిను.. మజ్జిగ, కొన్ని పళ్ళూ తీసి పెట్టుకో, ఒకవేళ అమ్మ లేచినా వీలుగా ఉంటుంది..”

“సరే.. నువ్వు నిశ్చింతగా ఉండు. అమ్మ రేపుదయం చెప్తుంది నీకు, నా సేవా కార్యక్రమాల గురించి..”

“హహహ..సరే.. బై”

“బై..”

ఫోన్ పెట్టేసి లాప్‍టాప్ దగ్గరకు వచ్చాడు. తెరచి ఉన్న విండోలో..

Do You Support Anna Hazare? అన్న ప్రశ్న కనిపించింది. అతడి స్నేహితులంతా “యెస్” అన్నారని చూపిస్తోంది. అతడు ఏదీ ఎన్నుకోలేకపోయాడు. “యెస్” పెట్టేదామనుకున్నాడు. కానీ మౌజ్ వత్తబోతున్నప్పుడు, చేతులు వణికాయి. విండో క్లోస్ చేసి, మనసు బాలేనప్పుడు ఖచ్చితంగా వినే పాటలను యూ ట్యూబ్‍లో తెరిచాడు. పాటలు వింటూ, కాసేపు సేద తీరాడు.

హమ్మ్.. ఇంకో గంటలోనో, రేపో, ఎల్లుండో మళ్ళీ ఫేస్‍బుక్ తెరవకపోడు గదా! అప్పటికి అతడి నిర్ణయం “అవును” అనే ఉంటుందనీ, ఆ “అవును”కి అతడో జీవితకాలం బాటు కట్టుబడి ఉండడానికి చిత్తశుద్ధిగా ప్రయత్నిస్తాడనీ కోరుకుందాం.

8 comments

  1. May be, the most noted softwares on earth have decided to displease me, these days. Not having a good time.

    Quite accidentally, – you gotta believe that, I’ve not managed to turn into narcissist, not yet – I clicked on “Like” button on the top bar.. I thought it would show me who liked it. It had it’s own mind and liked the post and refuses to unlike it, now. So, I ended up liking my own post.

    There seems to be no way of undoing it for time being as per wordpress, so folks who are planning to raise eyebrows, raise them for wordpress.

    Like

    1. మీరు రాసినది మీకు నచ్చకుండా మీరు రాయరు కదా.. సో మీరు లైక్ కొట్టటం సబబే.. మీరే లైక్ కొట్టుకున్నందుకు ఇంత వివరణ ఇవ్వాలంటారా 🙂

      Like

      1. రాసేటప్పుడు నచ్చి రాయను. నమ్మి రాస్తాను. రాసేటప్పుడు ఏమనుకొని రాసినా, రాసేసాక, దానితో విడిపడే రచనని చూసుకుంటాను. లేకపోతే, వేరేవాళ్ళు ఇచ్చే అభిప్రాయాల మీద ఆధారపడాల్సి వస్తుంది.. కమ్మెంట్స్ ఎప్పుడూ ’బోనస్’లే.. మోటివేషన్స్ కావు నాకు.

        ఇహ, వివరణ సంగతి.. అవసరమనిపించింది. బ్లాగు చేసాక, కనీసం నా ప్రాణస్నేహితులకు అయినా లంకె పంఫడానికి ఇబ్బంది పడే నేను నా బ్లాగును “లైక్” కొట్టానంటే పరమ చిరాగ్గా ఉంది. 🙂

        Like

  2. Wow!పూర్ణిమా చాలా బాగా వ్యక్తీకరించావు.

    p.s. ఇలాంటి accidenTal లైకింగ్ http://balasahityam.wordpress.com/(పిల్లల కోసం ఆడియో కథలు) లో ఒకసారి జరిగింది. పిలిచి చూపిస్తే కానీ చూడని బ్లాగు అయినా కాస్త కంగారు పడ్డాను మొదట్లో. తర్వాత మర్చిపోయాను. ఇప్పుడు ఇలా అవుతుంటాయిలే అని తెలుసుకున్నాను.

    Like

Leave a comment