రూ.16 ప్రతి కి.మీ – తెలుగు వెలుగులో

Posted by

తొలి ప్రచురణ: తెలుగు వెలుగు, జనవరి 2019.

“ఆగిపోయిన కార్ మీదేనా, మేడం? ఆయన మీ ఆయనా?”

“ఊ.”

“ఎక్కడకి వెళ్తున్నారు, మేడం? అమెరికానా?”

“కాదు.”

ప్రకాశ్‌కి ఒక వందసార్లు చెప్పుంటుంది, కాబ్ డ్రైవర్ల ముందు తెలుగులో, హిందిలో మాట్లాడొద్దని. మనకి భాష వచ్చని తెలిసిందా, అయితే మన గురించి ఆరా తీస్తారు, పొడిపొడి సమాధానాలిస్తే వాళ్ళ చరిత్ర చెప్పుకొస్తుంటారు. ముఖ్యంగా ఇలా సమయం ఎక్కువ పట్టే దూరాల్లో. దారిచూపిస్తున్న మాప్ ఆడగొంతులో ఒకటికి రెండు సార్లు చెప్పింది: మామూలుకన్నా ఎక్కువ ట్రాఫిక్ ఉంది, “అయినా కూడా” మీరు మీ గమ్యానికి 12:38 ఎ.ఎమ్ లోపు చేరిపోతారని. “అయినా కూడా” అని నొక్కి చెప్పించడం ద్వారా బండినడిపేవారికి, ప్రయాణిస్తున్నవారికి హైరానా, ఆందోళనా కొంత శాతం వరకూ తగ్గించగలిగారని ఉదాహరణగా ఇస్తూ, తాము రూపొందిస్తున్న సాఫ్ట్వేర్లలో కూడా కస్టమర్లని దృష్టిలో ఉంచుకోవాలని వాళ్ళ కంపెనీలో పదేపదే చెప్తుంటారు. ఇలాంటివన్నీ చూపించి చేయాలనుకున్నదాన్ని పదేపదే మారుస్తారు. అయినా కూడా ముందు అనుకున్న సమయంలోనే పనంతా అయిపోవాలంటారు.  మరి ఈ “అయినా కూడా” పనిపూర్తిచేయాల్సినవాళ్ళను ఎంత ఒత్తిడికి గురిచేస్తుందో ఎందుకు గ్రహించరు?

“మీరు సన్‌సిటి అపార్ట్మెంట్స్ లో ఉంటారు గదా, మేడం! నాకు తెల్సు.” మొబైలులో ఏదో చూస్తున్న ఆమె ఠక్కున తలెత్తి చూసింది. నేనెలా తెల్సు? నీకెలా తెల్సు? అన్న ప్రశ్నలు ఆమె కళ్ళల్లో స్పష్టంగా చదవగిలిగాడు డ్రైవరు తన ముందున్న అద్దంలో.

“నేనా వెనుక బస్తీలోనే ఉంటా, మేడం. మిమ్మల్ని ఆఫీసుకి దింపాను నాలుగైదు సార్లు. మాన్యతాలో కదా మీ ఆఫీసు?” ఆమె అయోమయంగా చూసింది. ఆమె గత నాలుగైదు నెలలుగా ఆఫీసు పని మీద స్పేన్ లోనే ఉంది. అయినా ఎలా గుర్తుంచుకోగలిగాడు?

“ఏమో, మేడం. మీరు గుర్తుండిపోయారు.” అతడు సన్నగా నవ్వాడు. ఆమె వెనుక సీటులో ఇబ్బందిగా కదిలింది. రేడియోలో “లవ్ గురు” అనే ప్రోగ్రాము వస్తుంది. ఆ ఆంకరు మరీ గోముగా, గారాలు పోతూ మాట్లాడుతున్నాడు. ఆమెకి ఒంటిమీదేదో పాకుతున్నట్టు అనిపించింది.

“రేడియో కట్టండి. నేను పనిచేసుకోవాలి.” అతడు రేడియో కట్టకుండా, వాల్యూము తగ్గించాడంతే! అనుకోని ప్రయాణం. ఉన్నట్టుండి బయలుదేరాల్సివచ్చింది. ఫ్లైటు దిగేలోపు  చాలా పనులు చేసుకోవాలి. కొంతపని ఇప్పుడే ముగించుకుంటే నయమనుకొని లాప్‌టాప్ తెరిచింది. తెరవగానే ఏడాదిన్నర బాబు ఫోటో కనిపించింది. దాని మీద నుండి కళ్ళు తిప్పలేకపోయింది. పిల్లలు కలిగేనాటికి అసలు ఉద్యోగమే చేయకూడదనుకుంది. ఒకరికొచ్చే జీతంతో, అప్పటిదాకా కూడబెట్టిన డబ్బుతో పిల్లాడు స్కూలుకి వెళ్ళేవరకూ ఉద్యోగం ఊసు అక్కర్లేదనుకున్నారు. పిల్లల ఆలోచన అప్పుడే లేదు కాబట్టి తను స్నేహితులతో కలిసి స్టార్టప్ పెట్టాడు. అది అనుకున్నదానికన్నా బాగా నడిచినా ప్రకాశ్ బయటకు వచ్చేశాడు. దానితో లాభంకన్నా నష్టమైంది. సరిగ్గా అప్పుడే బాబు కడుపులో పడ్డాడు. ఆరేడు నెలలు జీతమిస్తూ సెలవులిచ్చారు, కంపెనీవారు. తర్వాత కొన్నాళ్ళు ఇంటినుండి పనిచేసింది. ఇప్పుడు బాబునిక అమ్మదగ్గర వదిలిపెడితేగాని ఉద్యోగంలో కొనసాగలేని పరిస్థితి.

ప్రకాశ్ నుండి మెసేజి వచ్చింది: “కార్ సర్వీసింగ్ వాళ్ళు తీసుకెళ్ళారు. నేను ఇంటికి దగ్గర్లో ఉన్నాను.” ఏర్పోటు మూడుగంటల దూరం. అతడే దింపినట్టూ ఉంటుంది, కలిసి సమయం గడిపినట్టూ ఉంటుందని బయలుదేరారు కానీ, కారు కొంచెం దూరానికే మొరాయించింది.

కాబ్ ఒక ఫ్లైఓవరు మీద నుంచి ఇంకో దాని మీదకు ఎక్కుతూ దిగుతుంది. అమ్యూజ్మెంటు పార్కులో ట్రైనుల్లా తిరిగితిరిగి మొదలైన దగ్గరకే వస్తున్నట్టు, తన ఉద్యోగంలా, తన జీవితంలా ఎంత దూరం పోయినా సాధించింది ఏంటో అర్థంకానట్టూ… ఆమె తల గట్టిగా విదిలిస్తూ పని చేయడానికి ప్రయత్నించినా ధ్యాస కుదరలేదు. కొడుకు నవ్వులు, మాటల వీడియోలు చూస్తుండిపోయింది, ఇయర్ ఫోన్సు పెట్టుకొని.

దారి చూపించే మొబైలుని పక్కకు పట్టేసి, అదున్న స్థానంలో ఇంకో మొబైలుపెట్టుకొని పాటలు చూస్తున్నాడు డ్రైవరని ఆమె కాసేపటి వరకూ గ్రహించలేదు. పొట్టిపొట్టి బట్టలేసుకొని, కవ్వించేలా ఒకామె డాన్సు వేస్తుంది. ఆ పాటనుగానీ, ఆమెనుగానీ గుర్తుపట్టలేకపోయింది. డ్రైవరు ఒక కన్ను పాట మీదా, ఒక కన్ను రోడ్డు మీదా వేసి నడుపుతున్నాడు. అతడిని తట్టి “బాబూ! జాగ్రత్త!” అని చెప్పాలనుకుంది. ఇంతలో అతడికి కాల్ వచ్చింది. ఇప్పుడు సగం ధ్యాస ఫోనులో!

ఈ కాబ్ కంపెనీవాళ్ళు ఒక ప్రకటనతో ఊదరగొడుతున్నారని గుర్తొచ్చింది ఆమెకు: “మీ గమ్యం మా లక్ష్యం. మీ క్షేమం మా బాధ్యత.” ఒంటరిగా ప్రయాణిస్తున్న ఆడవాళ్ళు తమ ప్రయాణం ఏ దారిగుండా నడుస్తున్నదీ, ఎంత దూరంలో ఉన్నది, డ్రైవరు వివరాలు వగైరాలన్నీ కుటుంబసభ్యులతో పంచుకోవచ్చు. తన ప్రస్తుత ట్రిప్పు గురించి భర్తకి పంపిద్దామనుకుంది. కానీ ఎప్పుడూ లేనిది అలా పంపిస్తే గాభరా పడతాడేమోనని ఊరుకుంది. డ్రైవరు మాట్లాడుతున్న మనిషితో ఎక్కడ ఉన్నది, ఎక్కడకి వెళ్తున్నదీ అన్నీ చెప్పాడు.  

కొంతదూరానికి, కాబ్ పక్కకి ఆపి, “రెండు నిముషాలు, మేడం. ఇప్పుడే వస్తా!” అని అన్నాడు. ఆమెకి బండి ఆగిపోయిందేమోనని భయమేసింది. అతడు కొంచెం దూరం నడుచుకొని వెళ్ళి చెట్టు దగ్గర నుంచోవడం చూసి ఆమె ఇబ్బందిగా కళ్ళు మూసుకుంది. చుట్టూ పరిసరాలు గమనించింది: రోడుకు మధ్యలో మాత్రమే వీధిదీపాల వెలుతురు. అటూ ఇటూ చీకటి. ఉండడానికి ఎత్తుగా ప్రహరీ గోడలు, లోపల లైట్లున్నా బయటకి కనిపించవు. ఒకట్రెండు బండ్లు దూసుకొనిపోయాయి. డ్రైవర్ కారులో ఉన్న నీళ్ళ బాటిలు అందుకుని పక్కకు వెళ్ళి మొహం కడుక్కోవడం మొదలుపెట్టాడు.

ఆమెకేం అర్థం కాలేదు. అతడు కావాలనే కాలయాపన చేస్తున్నాడా? అతడికేదైనా దురుద్దేశ్యం ఉందా? ఇంకెవరినైనా ఇక్కడకి రమ్మన్నాడా? ముందు మాట కలపడానికి చూశాడు. మాట కలిపే అవకాశం ఇవ్వకపోయేసరికి పాట అందుకున్నాడు – ముమైత్ ఖాను, మలైకా ఖాను అంటూ ఏవో పిచ్చి లైన్లు – తనని ఉద్దేశించేనా? తన పరధ్యానాన్ని అవకాశంగా తీసుకుంటాడా? ఇక్కడే కాబ్ దిగేస్తే? ఇంకో కాబ్ దొరుకుతుందా? లగేజ్ అంతా పట్టుకొని ఎలా పారిపోవడం? పోనీ, పోలీసులకి ఫోను చేస్తే? ఏమని చెప్పాలి వాళ్ళకి? మాప్సు ఇంకో మూడు కి.మీలలో కాఫీడే ఉందని చూపించింది. అక్కడ దిగిపోయి ఇంకో కాబ్ తీసుకుందామని నిర్ణయించుకుంది.

బండి స్టార్టు చేయగానే కాఫీ డే దగ్గర దింపేయమని చెప్పింది. “ఏం, మేడం? ఏమైంది?” అని కంగారుపడ్డాడు. అక్కడేదో పనుందని చెప్పబోయిందిగానీ వంక కుదరలేదు. “రెండు నిముషాలేగా ఆగింది, మేడం! మీకోసం తినకుండా వచ్చాను.” అతడి గొంతులో నిష్ఠూరం చిర్రెత్తించింది. ఏదో ఉపకారం చేస్తున్నట్టు, ఊరికే దిగబెడుతున్నట్టు. అతడే సర్దిచెప్పడానికి ప్రయత్నించాడు. “డిన్నరు చేసి రావడానికి కనీసం అరగంటన్నా పడుతుంది, వేరే కాబ్ బుక్ చేసుకోండని చెప్పడానికే కాల్ చేశాను, మేడం. మీరు ఏర్పోటుకి వెళ్ళాలి, దారిలో కారు ఆగిపోయిందంటే తినకుండా వచ్చాను.” ఆమె ఎటూ తేల్చుకోలేకపోయింది. అనవసరంగా గొడవ పెరిగేట్టుంది.

“ప్లీజ్ మేడం. ఇక్కడ ట్రిపు ఆపేస్తే, నాకు వెనక్కి తిరిగెళ్ళడానికి బుకింగ్సు రావు. ఖాళీగా వెళ్ళాలి. ఇవ్వాళ్టికి నా టార్గెటు పూర్తవ్వదు. అయినా…” ఆమె కళ్ళల్లో భయాన్ని పసిగట్టాడు. “మీరేం భయపడకండి, మేడం. కావాలంటే నాకొచ్చిన రేటింగ్సు చూడండి.”

ఆమె చెమట తుడుచుకుంది. కాబ్ బుక్ చేసిన ఆప్ లో వివరాలు కనిపించాయి: పేరు – రంగనాథ్. చేసిన ట్రిప్పులు – ఆరువేలకి పైగా. కంపెనీతో ఉన్న సమయం – ఏడాదిన్నర. మొత్తమ్మీద వచ్చిన రేటింగు – 4.8. కస్టమర్ల ప్రశంసలు – “మంచి మాటకారి”, “కాబ్‌ శుభ్రంగా ఉంది”, “దగ్గరదారిలో తీసుకెళ్ళి  సమయానికి చేరేలా చూసినందుకు థాంక్స్”. ఇవ్వన్నీ చదివి ఆమెకి కొంత కుదటపడింది. అయినా, జరగబోయేది ఎవరు ఊహించగలరు?

“ట్రిప్పు ఆపద్దు, మేడం. ప్లీజ్. నా పొట్ట మీద కొట్టకండి. పోయిన వారం మా పాపకు డెంగ్యూ వచ్చి చాలా ఖర్చైంది. మూడునాలుగు రోజులు డ్యూటీయే ఎక్కలేదు. ఈ వారంలో ఆ పైసలు కూడా వస్తేగానీ బాంకుకి, డీజులికి పోగా ఇంట్లోకి ఏం మిగలదు. అందుకే ఇట్లా నిద్రలేక, తిండలేక బండి తోలుతున్నా… అర్థంచేసుకోండి.”

ఆలోపు ఆమె అనుకున్న కాఫీడే వచ్చింది, దాటిపోయింది. డ్రైవరూ కాస్త కుదుటపడి, “ఏం చెప్పమంటారు, మేడం? ఇదివరకూ కూడా టాక్సీ కంపెనీకే పనిజేసేవాణ్ణి. వారంలో ఒకట్రెండు సార్లు మాత్రమే ఇంటికొచ్చేవాడిని. సేటు అనేవన్నీ పడేవాడిని. దోస్తులొచ్చి చేతిలో పైసా లేకుండా యజమాని అవ్వచ్చనని చెప్తే ఇందులో దిగాను…”

“ఈ వెధవ ఉద్యోగం కన్నా ఏ కాబో నడుపుకుంటూ బతకటం మేలని” తన సహోద్యోగులు వేళాకోళంగా అనుకోవడం గుర్తొచ్చింది. ఒకరిద్దరు ఒకట్రెండు కారులు కొని, డ్రైవర్లకిస్తే లాభమనీ అన్నారు. “అదేంటి? బాగా నడుస్తుందనుకున్నా…?” అని అడిగింది. “అదంతా ఎర, మేడం. బుట్టలో వేసుకోడానికి  కొత్తల్లో కమీషను బాగా ఇచ్చేవాళ్ళు, దాంతో చేతికి ఎక్కువ వచ్చేది. అదే, అప్పట్లో మీకు ఫ్రీ రైడ్లు ఇచ్చేవాళ్ళుగా. అలవాటయ్యాక మీకు రేట్లు పెంచారు, మాకు కమీషను తగ్గించారు.”

ఆమెకి నవ్వొచ్చింది. కాగితం మీద జీతం ఒకలా ఉంటుంది. చేతికొచ్చేది ఇంకోలా ఉంటుంది. పదిరోజులు ఆగితే మొత్తం ఊడ్చుకొనిపోతుంది. కళ్ళుమూసుకుపోయేంత సంపాదన ఐటివాళ్ళదని, ఒక కాబ్‌తో కోటీశ్వరులు అయిపోవచ్చని ఎవరు ఈ పుకార్లు పుట్టిస్తారో! దిగితేగానీ లోతు తెలియదు. మునిగితే గానీ ఊపిరి విలువ తెలియదు. ఏర్పోటు ఇంకా అరగంట దూరంలో ఉంది. అటువైపు వెళ్తున్న అంతర్-రాష్ట్ర బస్సులు, టాక్సీలు కనిపిస్తున్నాయి రోడు మీద. లారీలు, భారీ వాహనాలు ఎక్కువగా ఉన్నాయి.

“మీకేం కంగారులేదుగా, మేడం. ఇక్కడ కొంచెం నిదానంగా వెళ్ళాలి. ఈ టైములో లారీలు ఎక్కువ.” అని అడిగాడు. ఆమె పర్లేదంది. భారీ వాహనాలు కనిపించాయి – వాటికెన్ని చక్రాలు ఉన్నాయో. వాటిముందు కారులు అగ్గిపెట్టెల్లా ఉన్నాయి.

“అయినా, మేం యజమానులయ్యే సీనుందా, మేడం? పేరుకే బండి నాది, కానీ ఏదీ నాచేతుల్లో లేదు… డ్యూటి ఎప్పుడు ఎక్కాలి, ఎప్పుడు దిగాలి, కస్టమరు దగ్గర ఎంత తీసుకోవాలి…”

“కో-ఫౌండర్ని అన్న విలువుందా నాకు? ఏ ఫీచరు పెట్టాలి? ఎవరికి అమ్మాలి? దేంట్లో అయినా నా మాట వింటున్నారా? ఇన్వెస్టరు ఏది చెప్తే అదే అంటే ఎంత దూరం పోగలం? ఏం, వాళ్ళు మాత్రం రేపు లాభాలు చూపించమనరా?” ప్రకాశ్ పడ్డ అవేశం గుర్తొచ్చింది. వాళ్ళ మధ్య కొనసాగలేక బయటకు వచ్చేశాడు, ఉన్న షేర్లు అమ్ముకొని. ఆపైన ఆరునెలలకే ఓ పెద్ద కంపెనీ కొనేసింది ఈ స్టార్టప్‌ని, ఊహించనంత డబ్బు పెట్టి. తమకి రావాల్సిన డబ్బు ఇంకొకరికి వెళ్ళిపోయిందని వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు. మేనజర్లతో వేగుతూ ఎంతకాలమిలా పడుతూ ఉండాలని సొంత కంపెనీ అంటూ దిగారు. మేనజర్లే నయమనిపించటం మొదలెట్టారు.

ఉన్నట్టుండి కారు కీచుమంటూ ఆగింది. ఆమె ముందుకి తూలి, వెనక్కి వచ్చి, కారు పైభాగానికేసి  తలకొట్టుకుంది. డ్రైవర్ మొహానికి చేతులు అడ్డుపెట్టుకున్నాడు. కారు అంతా చెదిరిన గాజుపెంకులు.

దారిపోయేవారెవరో ఆమెను, ఆమె లగేజుతో సహా ఏర్పోటుకి చేర్చారు. ఆసుపత్రికి తీసుకెళ్తామనంటే వద్దంది. సెక్యూరిటి, ఇమ్మిగ్రేషన్ ఎలానో కానిచ్చింది.  ఆమెకి తలింకా దిమ్ముగా ఉందిగానీ, రక్తాలొచ్చేలాంటి గాయాలు కాలేదు. ఫ్లైటుకింకా రెండు గంటల సమయముంది. అంతలో కుదుటపడుతుందా, లేదా ఫ్లైటులో ఏమన్నా అవుతుందా అన్న అనుమానం పీకింది. అక్కడ స్టాఫుతో మాట్లాడి డాక్టర్ని కలిసింది. ఆమె చెప్పిన లక్షణాలు బట్టి ప్రయాణించొచ్చని తేల్చాడు డాక్టరు.

ఈలోపు కాబ్ కంపెనీవాళ్ళు నాలుగైదు కాల్సు చేశారు, ఆమె ఎలా ఉందో కనుక్కోడానికి. అతడికెలా ఉందని అడిగింది. అతడి తప్ఫేం లేదని, అతడు జాగ్రత్తగానే బండి నడుపుతుండగానే ఆక్సిడెంటు అయిందని చెప్పింది. కానీ కాల్ చేసిన అమ్మాయి ఎంతసేపూ “మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము” అంటూ ఒకటే పాట పాడుతుంటే ఫోను పెట్టేసింది. ప్రకాశ్‌కి ట్రాఫిక్ వల్ల ఆలస్యంగా చేరారని, అంతా బానే ఉందని మెసేజి చేసింది.

డ్రైవరు నెంబరుకి కాల్ చేస్తే, ఎవరో ఎత్తారు – ఆసుపత్రిలో ఉన్నాడు, ప్రమాదమేమీ లేదుగానీ చేయి కదపలేకుండా ఉన్నాడు, ఒకట్రెండు వారాలు పడుతుందని. అతడికి ఫోను ఇస్తే, “మీరు ఒకేనా, మేడం.” అని అడిగాడు, మాట కూడదీసుకుంటూ. తనకేం కాలేదని, ఇంకో గంటలో ఫ్లైటులో ఉంటానని చెప్పి పెట్టేసింది.

ఇంతలో “జరిగిన దురదృష్ట ఘటనకు చింతిస్తూ, మీరు ఈ ట్రిప్పుకి కట్టిన డబ్బులు వెనక్కి వేస్తున్నాము” అన్న ఆటోమేటెడ్ మెసేజ్ వచ్చింది. “వద్దు”, “అది సరికాదు” అని నచ్చజెప్పే అవకాశం లేకుండా డబ్బులు వచ్చిపడిపోయాయి. ఆమె వెంటనే లాప్‌టాప్ తీసింది, ఆ కంపెనీవాళ్ళకి మెయిల్ చేయడానికి, అతడి తప్పేం లేదని వివరిస్తూ. ఏదో సహాయం చేస్తున్నట్టుకాదు, సాటి ఉద్యోగి తరఫున నిలబడుతున్నట్టు. మాట నెగ్గుతుందని కాదు, గొంతు కలపాలని.

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s