తెల్లారే లేచి, తల్లంటు పోసుకుని, చీరను సింగారించుకొని, నగా నట్రా పెట్టుకుని.. కాటుక చాటున రెప్పలు అతడి ఊహా చిత్రాన్ని గీయలేక ఇబ్బంది పడుతుంటే, ఫక్కున నవ్వే మనసు..మరుక్షణం ఏమి జరుగుతుందో అని గాబరా పడుతుంది.. ఇది ఒక అపూర్వ అనుభూతి. పెద్దల సమక్షంలో జరిగే పెళ్లి చూపుల్లో అతడిని చూడాలి, కన్ను కన్ను కలిసిన క్షణంలో హృదయంలో రేగే అలజడిని పంటి కింద అదమాలి. తన కంచు కంఠం చెవిని తాకగానే, మదిలో మ్రోగే వీణలను ఆపతరమా?? మాట తడబడుతూన్నా మాట మాట కలిస్తుంటే ఆ అనుభవం చెప్పతరమా?? “మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశ పడకే” .. అని మనసును బుజ్జగిస్తుండగానే, “అమ్మాయి మాకు నచ్చింది. ఇహ కట్న, కానుకల విషయంకి వస్తే..” అన్న మాటలు మనసు చివ్వుకుమనిపిస్తాయి. అప్పటి దాక అల్లుకున్న ఊహలు, కన్నీరై కారిపోతాయి. మనసున మనసై మాంగల్య బలంతో పండాల్సిన నిండు జీవితాలు, ఇప్పుడు సంతలో బేరానికి పెట్టిన వస్తువులుగా మారిపొతారు. “సంతలో బేరాలు” మరీ పాత కాలం పధ్ధతులు ఏమో? హైటెక్ షాప్పింగ్ మాల్ల్లులాగా “ఫిక్సెడ్ రేట్స్” ఏమో??
అసలు వరకట్నం అనే ఆచారం (దురాచారం??) ఎలా, ఎందుకు మొదలు అయ్యిందో తెలియదు. ఎన్నాళ్ళు ఇలాగే సాగుతుందో తెలియదు. రాను రాను దేశ జనాభాలో ఆడపిల్లల సంఖ్య తగ్గుతుంది. అప్పుడు ఈ కొనుక్కోవడాలు మానేసి, మనల్ని మళ్ళీ “అమ్ముకోవాలి” (కన్యాశుల్కం)!! అది ఇంకా నరకం!! నచ్చి ఇచ్చే కానుకలు “ఇచ్చి తీరాలి” అన్న కట్నాలుగా మారిన వైనం ఏమిటో తెలుసుకోవాలి అని ఉంది. ప్రకృతికే అందం తెచ్చే ఇంత అందమైన అనుబంధం ఇలా వ్యాపారంగా, మన సంస్క్రృతిలో అంతర్భాగంగా మారే అంత విలువ ఇచ్చాము!! భారతజాతి జీవినశైలిలో అత్యంత కీలకమైన తెలుగువారు దీనికి పెద్దపీట వేయడం శోచనీయం. దీన్ని ఎదిరించే శక్తి లేక, తల వంచుకుని పోవడమే..సబబా??
చట్టాలు ఉన్నాయి, న్యాయమూ జరుగుతుంది (మనం ఉండగానే కానవసరం లేదు!!). మనలో మార్పు రాకపోతే, ఎవరు ఎవర్ని ఎందాక బెత్తం తీసుకుని బెదిరిస్తారు?? మన అమ్మానాన్నలను సరిగ్గా చూసుకోవటానికి, మన పిల్లల్ని బడి మానిపించి పనికి పంపకుండా ఉండటానికి, ఆలిని కొట్టద్దు, చంపద్దు అని, ఇంకొన్నాళ్ళు పోతే మనం బ్రతకటానికి కూడ చట్టం కావాలి. మనం సృష్టించుకున్న ధనాన్ని, కాలాన్ని లెక్కేసుకుంటూ, ప్రతీ వస్తువునూ, మనిషినీ లెక్క కడుతున్నాము. ఎవరు ఏమన్నా, మనం మేధావులం, మనసు లేకపొతే ఏమి?? కదూ?? ఇంటి పని, వంట పని చూసుకోవటానికి అమ్మా-నాన్న కావాలి. లేక పొతే వృద్ధ ఆశ్రమాలు ఉన్నాయి. లెక్క సరిపొయింది కదూ?? మనిషి మహా మేధావి!!
“మనషి అన్న ప్రతి వారికి ఓ మనసు ఉంటుంది. ఆ మనసెప్పుడూ మంచినే కోరుకుంటుంది.” ఈ నమ్మకానికి దారుణంగా బలి అయ్యిన వారు చాల మంది. కాని ఆ నమ్మకమే మనల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది.. అదే మనకు, మన సమాజానికి శ్రేయస్కరం!!
శీర్షిక సరితూగలేదేమొననిపిస్తోంది. నమ్మకం అని పెట్టవచ్చు లేదా కట్నం అని పెట్టవచ్చు.
LikeLike
ప్రశాంతి గారు:
ఏమో నాకు అలా అనిపించలేదు. కట్నం అన్న విషయంతో మొదలయినా, మనిషికి మనిషికీ మధ్య నమ్మకం సడలిపోతోంది అనే భావన తో ముగిసినా, ఇవ్వనీ మనిషి తనను తాను మేధావిగా భావించటం వల్లే వచ్చాయి అని నా నమ్మకం. ఇక ముందు జాగ్రత్త వహిస్తాను సుమండీ!!
LikeLike
కట్నం ఇవ్వడం, తీసుకోడం నిజంగా అసహ్యం…..కదూ….!!
కానీ అదే చెల్లుతోంది మన సమాజంలో….ఇవ్వకుండా,తీసుకోకుండా బ్రతకడం అసాధ్యమేమీ కాదు… ధైర్యం ,పట్టుదల కావాలి అంతే..!!
అసలు ఆ దురాచారానికి మూలాలు తెలుసుకోవాలి…. ‘జానకి విముక్తి ‘(రంగనాయకమ్మ రాశారు)చదివారా…??లేకపోతే చదవండి.
“మనషి అన్న ప్రతి వారికి ఓ మనసు ఉంటుంది. ఆ మనసెప్పుడూ మంచినే కోరుకుంటుంది.” …..////ఎటొచ్చీ ఆ మంచి తనకు మాత్రమే మంచా?కుటుంబం మొత్తనికీనా??లేక పక్కవాడికీనా??లేక సమాజం అంతటికీనా?? అనేది ప్రశ్న
…వ్యక్తుల మధ్య సంబంధాలను డబ్బు ప్రభావితం చెయ్యగలిగినంతకాలం …కనీసం అలా అనుకున్నంతకాలం ఈ ప్రశ్నలు వస్తాయేమో…!!
టాపిక్ ఇంటరెస్టింగ్ అనిపించి …నా అభిప్రాయం రాశాను..
LikeLike
కట్నం అనే సాంప్రదాయం పెట్టిన సమాజానిదొక తప్పైతే, అడిగే మొగాడిదీ…ఇచ్చే ఆడవారిదీ అంతే తప్పు. ఇక మార్పు వి..శా..ల హృదయం ఉన్న మగాళ్ళనుంచో లేక వాళ్ళ తల్లిదండ్రులనుండో రావాలనుకోవడం అంత మూర్ఖత్వం కూడా ఇంకోటి లేదు. ఫ్రీగా డబ్బులొస్తే ఎవరొదులుకుంటారూ?
ఈ విషయంలో ఒక చిత్రమైన ఆలోచన వచ్చి నా మొదటి కథ దానిమిదే రాశాను. కాస్త పరిపక్వత లేకుండా ఉంటుంది..కానీ ఇక్కడ చదివి మీ కామెంటు రాయగలరు http://parnashaala.blogspot.com/2008/05/blog-post_7921.html
LikeLike
mee usulu .. padhunuga unnai..
LikeLike