జరగని కథ

Posted by

“గోపాలం చాలా బావుండడు.” – వాక్యం చదివీ చదివగానే కిసుక్కుమన్నాడు, చదివినవాడు.

“అలా కిసుక్కులూ, కసక్కులూ అంటూ ఉంటే పనులు జరగవు. గబగబా చదివేసి, ఏదోటి రాసేయ్య్..” అంటూ చేతికింద పనివాడు ఉండడం అలవాటులేని బ్రహ్మదేవుడు చురచురలాడాడు, “రాయమన్నా కదా అని ఉన్నదున్నట్టు రాయకు. నీ తెలివి కూడా చూపించు. తలరాతలేసుకొని కూర్చొనే మగడు దొరకటం తన తలరాత అని ఒహటే నస! జనాభా అలా పెరిగిపోయింది, నేనేం చేయను? అంటే అదీ మీ నిర్వాకమేగా అంటుంది. యు డోంట్ లవ్ మి అనీ మోర్! అనేసింది మొన్న! అందుకని నీకీ పనిజెప్పి నేను ఆ పని చూసుకోవాలి. జాగ్రత్త సుమా! జీవితాలూ..”

ప్రతీ ఉద్యోగి తన పై అధికారి మాటలు విన్నంత శ్రద్ధగా విన్నాడు కొత్త బ్రహ్మవాడు. అంతే శ్రద్ధగా వాటిని మర్చిపోయాడు. ఇలా రాసుకొచ్చాడు.

గోపాలం నుదిటన:
అనగనగా ఓ నువ్వు. నువ్వు చాలా బావుండవు. నీకో రాధ. రాధ చాలా బావుంటుంది.

రాధమ్మ నుదిటన:
అనగనగా ఓ నువ్వు. అంతకు మునుపే ఓ గోపాలం. గోపాలం చాలా బావుండడు. నువ్వు కూడా బావుండవు. (కొంచమైనా మార్చాలనీ..)

తలరాతలపై సీల్ వేసేసాడు.

పాతికేళ్ళ తర్వాత రాధా, గోపాలం కలిసారు; విధివశాస్తూ. రాధ గోపాలాన్ని గుర్తించింది. మనసిచ్చింది. గోపాలం బావుంటుందన్న బండగుర్తుతో (ఈ) రాధను చూళ్ళేదు.

కథ అయిపోయింది – జరగకుండ!

3 comments

Leave a comment