The joy of reading Tejo Tungabhadra

Posted by

వసుధేంద్ర కొత్త పుస్తకం వస్తుందని, దాని ఆవిష్కరణ సభకి నేను వెళ్ళి ఆయన సంతకం పెట్టించుకుని రమ్మని ఆదిత్య అడిగాడు, పోయినేడాది నవంబర్-డిసంబర్‍లో. సరేనన్నాను. “నువ్వూ ఓ కాపీ తెచ్చుకో…” అన్నది మాత్రమే వినిపించుకున్నాను. ఎటూ బెంగళూరుకి వచ్చాక పుస్తకాలే కాకుండా ఆటోగ్రాఫులూ పోగేయడం మొదలెట్టాను కాబట్టి పుస్తకం కొని “ఎనాటికైనా చదువుతాను” అన్న భ్రమలో బతకచ్చుగా అనుకుని నాకూ కాపీ తీసుకుందామనుకున్నాను. “…ఇద్దరం కలిసి చదువుదాం” అన్న ఆదిత్య వాక్యంలో మరో సగాన్ని పట్టించుకోలేదు. 

“ఏంటమ్మా, నువ్వొచ్చావ్?!” అన్నట్టు చూశారు, వసుధేంద్ర. అప్పటికి ఆయన నా మొహం గుర్తుపట్టగలిగే అన్ని పరిచయాలు అయ్యాయి మా మధ్యన  “ఫ్రెండు పుస్తకం కావాలన్నాడు” అని చెప్తూ రెండు కాపీల మీదా సైన్ చేయించేసుకున్నాను. ఇంతలో రచయిత అక్కడున్నవారికి, “తెలుగమ్మాయి. కన్నడ నేర్చుకుంటుంది.” అని చెప్పారు. వాళ్ళు నాకు చదువుకోడానికి సరళంగా ఉన్న పుస్తకాలు చెప్పబోతుంటే, “ఉగాది పుస్తకం చదివింది” అని కూడా చెప్పారు.  

ఇంతకీ అది పుస్తకావిష్కరణ సభ కాదు. కేవలం సైనింగ్ ఈవెంట్. “ఊరికే వాళ్ళొచ్చి వీళ్ళొచ్చి మాట్లాడి వెళ్ళిపోవడం దేనికి సభల్లో! ఇలా అయితే నేను పాఠకులతో కాస్త సమయం గడిపినట్టుంటుంది కదా అని ఇలా ఏర్పాటు చేశాను.” అని అన్నారు. 

ఇంటికొచ్చాక ఆటోగ్రాఫ్ ఫోటో తీసి ఫేస్బుక్‍లో పెడితే పని అయిపోతుందనుకున్నాను గానీ, ఆదిత్య పింగ్ చేశాడు – “గూగుల్ ప్రివ్యూలో మొదటి కొన్ని చాప్టర్లు” ఉన్నాయి. మొదలుపెడదాం చదవడమని. అంతకు ముందు ఇలా స్కైపులో శ్రీనాథ రాసిన శివరాత్రి మహత్యం చదివి ఉన్నాను కాబట్టి ఐడియా విడ్డూరంగా అనిపించలేదు. కాకపోతే నాకు బేసిక్ కన్నడ వచ్చంతే! సంభాషణల్లో కూడా వాడలేను. అలాంటిది ఇదసలు ఎంత దూరం వెళ్తుందోనన్న అనుమానాలు పీకుతూనే ఉన్నాయి. 

కన్నడ లిపి తెలుగుతో పోలినట్టు ఉంటుంది కాబట్టి, తెలుగు వచ్చినవారు చదివేయచ్చు. ప్రతి వాక్యం నేను మొదట చదవాలి. వాక్యం చివర ఆగి, మళ్ళీ మొదటినుండి ప్రతి పదానికి అర్థం చెప్పుకుంటూ రావాలి. నేను ఎక్కడ చెప్పలేకపోతున్నానో (పది పదాలుంటే నేను ఆరింటి దగ్గర ఆగిపోతానన్న మాట)  అక్కడ ఆదిత్య అర్థం చెప్పుతాడు – నేను నోట్ చేసుకుంటూ ఉంటాను. వ్యాకరణం విశిదీకరిస్తాడు అవసరమైన చోటల్లా. అలా ఒక్కో వాక్యాన్ని కనీసం రెండు మూడేసి సార్లు చదువుకుంటూ వెళ్ళడం, ఈ లోపు ఏదైనా మంచి వాక్యం, లేక సీను తగిలితే దాని గురించి అబ్బురపోవడం. మొత్తానికి ఇలా రెండు నెలల పాటు, పాతిక పేజీల వరకూ చదివాం. (ఈ లోపు నేను హైద్‍కి వెళ్ళినప్పుడు ఆదిత్యకు పుస్తకం ఇచ్చాను.)  రెండేసి గంటల కాల్స్ లో మూడు నాలుగు పేజీలు కూడా అయ్యేవి కావు, డబుల్ రీడింగ్ వల్ల. 

తర్వాత నా పనుల ఒత్తిడి వల్ల, ప్రయాణాల వల్ల గాపు వచ్చింది. మళ్ళీ కలిసి చదవడం మొదలెట్టేలోపు అప్పటి వరకూ తెల్సుకున్న పదాలూ మర్చిపోతానేమోనని మళ్ళీ మళ్ళీ  చదువుకుంటూ ఉన్నాను. ఆపైన ఎంత వరకూ చదవగలనో చూడ్డానికి ముందుకెళ్ళాను. మొదట్లో పదాని పదానికి డిక్షనరి చూసుకోవడం చిరాగ్గా అనిపించింది. కథేలోనేమో ఉత్కంఠత. భాష ఏమో ముందుకి సాగనివ్వదు. మొత్తానికైతే వదలకూడదు అని నిశ్చయించుకున్నాను. పట్టుబట్టి చదివాను. తుంగభద్ర అనే చాప్టరులో అసలు ఎవరు ఎవరో, ఏమంటున్నారో అర్థం కాలేదు. అది ఒకటికి రెండు సార్లు చదవాల్సి వచ్చింది. కానీ ఒక్కసారి పాత్రలు నమోదు అయ్యాక కథ సాఫీగా సాగిపోయింది. చివరి వంద పేజీలు వచ్చేసరికైతే పుస్తకాన్ని పక్కకు పెట్టలేకపోయాను. ఆఫీసుకెళ్ళే దారిలో చదువుకోడానికి పట్టుకెళ్ళే స్థాయికి వచ్చింది. 

మొన్న మేం చదివిన జయంత్ కాయ్కిణి కథ “నీరు”లో ఒక చోట, “ఆయన మాటల్లోని సరళత్వం వల్లే తీవ్రత ఇంకా ఎక్కువైంది” అని ఉంటుంది ఒక సందర్భంలో. వసుధేంద్ర శైలి అచ్చంగా అలాంటిదే! భాషలో సరళత్వం, వ్యక్తీకరణలో సరళత్వం ఉంటుంది చదివేటప్పుడు, అందుకని  కష్టపడాల్సిన అవసరం రాదు. కానీ ప్రభావం మాత్రం చాలా తీవ్రంగా కనిపిస్తుంది మన మీద. కథ సాగే కొద్దీ తేజో తుంగభద్ర నవల bleak అయిపోతుంది. కొన్ని చోట్ల పుస్తకం మూసేసి బ్రేక్ తీసుకోక తప్పదు, అంతటి bleakness! నా అరకొర భాషా జ్ఞానంతో అసలు అర్థాన్ని గ్రహిస్తున్నానా అని అనుమానాలు అన్నీ పటాపంచలై పోయాయి, నాలో కలుగుతున్న భావావేశాన్ని బట్టి! 

Vasudendra is a genius! అంతే! 

ఆదిత్యకి చెప్పాను నవల పూర్తిచేశానని. అయినా మళ్ళీ కల్సి చదువుకుందామనుకున్నాము, ఎక్కడ ఆపామో అక్కడ నుండి మళ్ళీ మొదలెట్టి. ఆలోపు లాక్డౌన్ మొదలై, ఆఫీసులో విపరీతమైన పని మీద పడ్డంతో కుదర్లేదు. ఆర్నెల్లుకి గానీ పుస్తకం.నెట్ లో రాయలేకపోయాను. 

ఎట్టకేలకు రాశాను. సముద్రాన్ని దోసిట్లో పట్టుకొచ్చినట్టు ఏదో రాసేశాను. ఈ నవలలో ముఖ్యపాత్రల్లో ఒకడు – గేబ్రియల్, ముద్దుగా గేబి. “థాంక్స్ ఫర్ గివింగ్ మి గేబ్రియల్” అని చెప్పాను రచయితకి చాట్‍లో, ఆయన పరిచయ వ్యాసం చదివాక! ఆయనకి అర్థమై ఉండదు నేనేమంటున్నానో. చెప్పగలిగేంత నేర్పు కూడా లేదు నాకు. 

పుస్తకం.నెట్ లో వ్యాసం వచ్చిన రెండు రోజులకి, మరో దోస్తు శిరీష్ ఆదిత్య పింగ్ చేసి, “అమ్మమ్మకి పంపాను పుస్తకం. కన్నడం వచ్చు” అన్నాడు. నాకు ఆశ్చర్యమేసింది కానీ పెద్దగా ఆలోచించలేదు. కొద్దికొద్ది రోజులకి అప్డేట్ – అమ్మమ్మకి బాగా నచ్చుతుంది నవలని. ఒక ఉదయం లేచి వాట్సాప్ చూసేసరికి, “ఇంటి నెంబర్ ఇది. అమ్మమ్మతో మాట్లాడండి, నవల గురించి” అని. ఆఫీసు పనంతా అయ్యాక చేశాను. 

ఆ గొంతులోని ఆనందం, ఉత్సాహం!  మేము పదేళ్ళ కిందట పుస్తకం.నెట్ కోసం చేసిన దేశాటనలోని అనుభవాలు గుర్తుతెప్పించేలా! Such unadulterated joy for books, for reading! ఆ మాటల్లో సాహిత్యం ఎక్కడ సాహిత్యంగా ఆగిపోతుందే, ఎక్కడ జీవితంతో కలిసిపోతుందో చెప్పలేం. అదీ ఒక సంగమంలా ఉంటుంది. అందుకే ఈ కబుర్లని దాచుకోవాలి. జీవితమంతా అర్థరహితమనిపించే క్షణాల్లో ఇవే దవా, దువా! ఆవిడ మాటలని పుస్తకం.నెట్ లో ఇలా నమోదు చేశాము. 

ఆదిత్య గురించి ఇప్పటికే బోలెడు పొగడ్తలు అవీ విన్నాను. అవేవీ అతిశయోక్తులు కాదు కానీ ఈ అబ్బాయిని మనం ఒక “encyclopedic knowledge repository”గానే భావించి అక్కడే ఆగిపోకూడదు. అబ్బురపరిచే అంతటి జ్ఞానమది, కాదనను. కానీ, he’s brings a lot more sensibility and wisdom to the table! అది ముఖ్యం. “నాకు తెల్సు ఇది. నేను అర్థం చేసుకున్నాను దీన్ని” అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు మనకి బానే కనిపిస్తారు. “నీకు తెలియాలి ఇది. నువ్వు అర్థంచేసుకోవాలి ఇది, దానికి నేను శ్రమపడతాను” అని తాపత్రయపడే వాళ్ళు అరుదు! అది గమనించాలి. దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. 

My task is cut out, though! శ్రద్ధపెట్టి నేర్చుకుని, ఆపైన నాకున్న పరిమితుల్లో తిరిగి సాహిత్యానికి కాంట్రిబ్యూట్ చేయడమే నేను ఆదిత్యకు రాసే “థాంక్యూ నోట్!”

One comment

Leave a comment