కాలయంత్రంలో ’అన్నీసా’ కథకు స్పందనలు

Posted by

కాలయంత్రం 2020లో నేనొక కథ రాశాను, ’అన్నీసా’ అనే పేరుతో. గత శతాబ్దపు తొలినాళ్ళల్లో మహిళా పత్రికలకి మహిళా సంపాదకులు ఉండేవారన్న విషయాలు చదువుతూ ఉంటే ఈ కథ పుట్టుకొచ్చింది. ఇంకాస్త రిసర్చ్ చేశాక సుగ్రా హుమాయున్ మిర్జా గురించి తెలిసింది. ఆవిడ గురించి కథ రాయాలనిపించింది. “తెలుగువాళ్ళ చరిత్రకి సంబంధించిన కథై ఉండాలి” అన్నది వర్కుషాపులో గట్టిగానే చెప్పారు. సుగ్రా బేగంని తెలుగు కథలోకి ఎలా తీసుకురావాలో, ఆవిడ గురించి చెప్తూనే దీన్నో తెలుగమ్మాయి కథగా ఎలా మార్చాలో అని చాలా తన్నుకున్నాను. సాయి గారు రిజెక్ట్ చేస్తారన్న నమ్మకంతోనే పంపాను. ఆయన ఎడిటింగ్ లో కథ ఇంకా మెరుగుపడింది.

ఉర్దూ ఎక్కువ వాడినందుకు ఆయన అభ్యంతరం పెట్టలేదు. నా కథల్లో ఇంగ్లీషు పదాలు ఎక్కువుంటాయని కొందరి పేచీ. అందుకని ఈ సారి ఉర్దూ వాడానన్న మాట. 😉 😀

మొత్తానికైతే నేను అనుకున్నదాని కన్నా ఎక్కువ స్పందనే వచ్చింది/వస్తూ ఉంది. నేనేదో పరమ వెరైటీ కథలు రాసుకుంటూ ఉంటాను. అందుకని “వాట్ నాన్సెన్స్” అన్న విసుగు తప్పించి పెద్దగా వినిపించేదేం ఉండదు. అందుకని ఈసారి స్పందన మరీ అపురూపంగా అనిపిస్తోంది. అందుకే వాటిని ఇక్కడ దాచుకుంటున్నాను.


‘అన్నీసా’ అనగానే ఉర్దూ పేరని తెలిసిపోయింది. తెలుగు వారి చరిత్రలో ఉర్దూ భాష రావడమంటే నవాబుల పాలన అని అర్థం. అందుకు తగ్గట్టే ఇది 1918-1920ల నాటి నిజాం పాలిత హైదరాబాద్ నగరంలోని కథ. హైదరాబాద్ కథ కావడంతో ఆసక్తిగా చదవడం మొదలుపెట్టాను. చరిత్రకు సంబంధించిన కథ అనగానే సహజంగా ఉండే నాటి సామాజిక వర్ణనకు భిన్నంగా ఇద్దరు స్త్రీ పాత్రల(బేగం, విజయ) ద్వారా అప్పటి కాలం ఎలాంటిదో చూపడం బాగుంది. అవసరమైన వివరాలు మాత్రమే ఇస్తూ కథ నడపడం నచ్చింది.

1920కే నిజాం ప్రభుత్వంలో ఒక ముస్లిం స్త్రీ ఉర్దూ పత్రిక నడిపారనే విషయం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఇంత చరిత్ర తెలియనందుకు సిగ్గుగా అనిపించింది. హైదరాబాద్ నగరవాసి, హైదరాబాద్‌‌లో స్త్రీల ఆత్మగౌరవం, అభ్యున్నతి కోసం పాటుపడిన తొలి మహిళా సామాజిక కార్యకర్త అయిన సుగ్రా హుమాయున్ బేగం(1882-1958) స్ఫూర్తితో ఆమెను పాత్రగా చేసి కథ రాయడం, కనుపర్తి వరలక్ష్మమ్మ గారి ఛాయలతో ‘విజయ’ అనే మహిళను ఆమెకు సహాయకురాలిగా, ఆపై స్వతంత్ర భావాలు కలిగిన మనిషిగా చూపడం.. చాలా చాలా అబ్బుర పరిచాయి. ఈ కథ ద్వారా ఆ అంశాలన్నీ బయటకు తెచ్చి పరిచయం చేసినందుకు పూర్ణిమకు కృతజ్ఞతలు.

కథ మొదలు చాలా హాయిగా, నింపాదిగా సాగినా చివరి భాగం కొంత హడావిడిగా ముగించినట్టు తోచింది. నిజానికి ఆ పాత్రలు మరింతగా ముందుకు సాగుతూ, మరిన్ని అంశాలను చర్చించినా చదివేందుకు నాలో చాలా ఉత్సాహం నిండి ఉంది. స్వాతంత్ర్య పూర్వ నిజాం రాజ్యంలో కొందరు మహిళల ధైర్యం, తెగువ, ధీరత్వాన్ని చెప్పడం ఈ ఒక్క కథతో సరిపోదనిపిస్తోంది. ఎవరైనా (ఎవరో ఎందుకు? వీలైతే పూర్ణిమే) హుమాయున్ బేగం చరిత్రను, నాటి సామాజిక పరిస్థితులను ప్రతిబింబిస్తూ ఒక నవల రాస్తే బాగుంటుంది.

-సాయి వంశీ


ఏ….లాల లలలల లా!హమ్ రాజ్ సినిమా చూసి బయటికొచ్చాక కూడా వెంటాడే పాట!అలా ఈ ‘అన్నీసా’ కథ చదివాక ‘సబర్ కరో మేరే జాన్’ అన్న మాట గుర్తుండిపోతుంది.పూర్ణిమ తమ్మిరెడ్డి రాసిన కథ.”సుగ్రా హుమాయూన్ బేగం”అనే ఆధునిక ముస్లిం మహిళ స్ఫూర్తితో రాసినది.

‘ఎవరైనాసరే ఆవిడకి సలాం చేసేవారు.ఎక్కడెక్కడనుంచో వచ్చి ఆమెతో మాట్లాడేవారు.గాంధీ,నెహ్రూ లాంటి పెద్దనాయకులు కూడా ఆమెని సలహా అడక్కుండా ఏ పని చేయరట’. ఆమె దగ్గర ‘విజయ’ సహాయకురాలు. బేగం ప్రోత్సాహంతో అన్ని విషయాలు అవగాహన చేసుకుంటోంది.బేగం నడిపే పత్రిక “అన్నీసా”ప్రతి సంచిక మొదటి పేజీలో”దక్కనులో స్త్రీ విద్య ఎంతగా పెంపొందాలంటే పర్దాలో ఉండికూడా ఆడవాళ్ళు మారాలి ఈ కాలపు ప్లేటోలుగా!”

అన్నీసా అంటే అరబ్బీలో మహిళ అని అర్ధమని,ఖురాన్ లో ఆ పేరుతో ఒక అధ్యాయం కూడా వుందిట.

ఎక్కడైనా ఎప్పుడైనా స్త్రీ ఎదుగుదల అంటే అసూయే.బేగం పత్రిక గురించిన సంభాషణ .”అచ్ఛచ్ఛా…బేగం సుగ్రా హుమాయూన్ మిర్జా!ఏం రాస్తారు మీరు అసలూ..మాషల్లాహ్!బహుత్ ఖూబ్!మీరు రాసిన లతీఫా ఒకటి మా అమ్మాయిలకి బాగా ఇష్టం…

ఏక్ మియాఁకి ఏక్ బీవీ క్యా మజెకి బాత్ హై..అంటూ ఆయన వినిపించాడు.

ఒక మగనికి ఒక పెళ్ళాం

ముచ్చటైన తీరు

ఒకమగనికి ఇద్దరు పెళ్ళాలు

జగడాల పోరు

ఒక మగనికి ముగ్గురు పెళ్ళాలు

లాఠీ దెబ్బల హోరు

ఒక మగనికి నలుగురు పెళ్ళాలు

చచ్చి కాటికి చేరు.

మెచ్చుకుని అందరూ నవ్వితే ఒకడు మాత్రం ‘ఒక మగనికి పెళ్ళాం ఒకరుపిల్లలు మాత్రం లేరు’అని కవిత చదివినట్టే చదివి గట్టిగా నవ్వేశాడు.మరి బేగంకి పిల్లలు లేరు. ఇంకా “పర్దాను కాదంటే ఖుదా కూడా ఊరుకుంటాడేం…పాపం,మిర్జా సాహెబ్ కోరి చేసుకున్నారు.అన్యాయమైపోయారు”బండి వచ్చి ఎక్కేలోపు మరిన్ని మాటలు తూలాడు,పక్కనున్నవాళ్ళు వారిస్తున్నా.అది వాడి బుద్ధి.ఆవీధి దాటగానే బేగమమ్మ చెంగు మొహానికి అడ్డుపెట్టుకోకుండా ఉండలేకపోయింది”.

స్త్రీల అభ్యుదయంకోసం పాటుబడిన బేగం సహాయంతో,పెళ్ళి అయాక మూడునెలలు కాపురంచేసి మొగుడు వదిలేసిన విజయ ‘మౌలానా అబుల్ కలాం ఆజాద్’ ఉరుదూలో ఇచ్చిన ఉపన్యాసాన్ని తెలుగులో అనువదించేంత ఎదిగిపోయింది.

ఇక్కడ ఈ విజయ,బేగం ల గురించి చదువుతుంటే ‘నీల’ ‘అనూరాధ’ గుర్తుకొస్తారు!

సాయి పాపినేని ప్రోత్సాహంతో చరిత్రనాధారం చేసుకొని అల్లిన మంచి కల్పన ఈ’అన్నీసా’కథ. చదువరులకు,చదవాలనే ఉత్సాహం కలగాలంటే కథ కొంత చెప్పకతప్పదు! ఇరవైదాకా కథలు రాసిన వీరి మిగిలిన కథలుకూడా ఇంత బాగుంటాయనే అనుకోవాలి!

– లక్ష్మీ నరసింహా రావు కొప్పరపు


సమీపభూతకాలం. గతశతాబ్ది మొదటి దశకాలు. పాశ్చాత్య దేశాల్లో కూడా స్త్రీలు పితృస్వామ్య పరదాలు చాటునుంచి విద్య, ఉద్యోగం, ఆస్తి అస్తిత్వం, బలం, అధికారాలలో సమానత్వం దిశలో తొలి అడుగులు వేస్తున్న రోజులు. (శతాబ్దం నడిచినా గమ్యం ఇంకా సుదూరమే.) ఆ తొలి అడుగుల ౙాడలు ఆనాటి బాగానగరపు వీధుల్లో స్పృశిస్తూ సాగిన కథ ‘అన్నీసా’. పూర్ణిమ మరిన్ని కథలు రాయాలి.

– సాయి పాపినేని


హైదరాబాద్ హుమాయూన్ నగర్ నివాసులకు శుభవార్త!!

ఎందుకంటే “కాలయంత్రం” కధల సంకలనంలో హైదరాబాద్ గురించి, ముఖ్యoగా హుమయూన్ నగర్ గురించి, అసలు ఆ ప్రాంతానికి ఆ పేరు రావడానికి కారణమైన సుగ్రా హుమయూన్ బేగం గురించి వ్రాసిన కధ కూడా ఉంది.

తొమ్మిదవ కధ: ‘అన్నీసా’ రచయిత్రి: పూర్ణిమా తమ్మిరెడ్డి.

ఈ సంకలనంలోని కధలన్నింటిలో అన్నీసా కధ అరచేతిలో గోరింటాకు పెట్టినంత అందంగా తీర్చిదిద్దారు రచయిత్రి. రచయిత్రి కధారచనా పాటవం ఈ కధలో ద్యోతకమైంది. గొప్ప విలుకాడు విల్లంబు ఎలా పట్టుకో వాలో.. పొదిలోనుండి బాణం నేర్పుగా ఎలా తీయాలో ఎలాఎక్కుపెట్టాలో.. ఆకర్ణాoతం ఎలా లాగాలో.. ఎప్పుడు వదలాలో తెలిసి బాణం వేసినట్లు పూర్ణిమ కద వ్రాసారన్నది నా ఫస్ట్ రియాక్షన్. ఇది చదివి పూర్ణిమ కంగారు పడిపోవచ్చు. “నాకంత సీన్ లేదు సర్..” అంటూ సిగ్గుపడిపోవచ్చు. నిజమే. ఎప్పుడూ మంచి రచన లోని గుణగణాలు ఓ విమర్శకుడు విప్పిచెప్పినప్పుడు రచయిత కూడా ఆశ్చర్యపోవచ్చు. సహజం. పెద్ద పెద్ద రచయితలు వ్రాసిన కధలన్నీ గొప్పకధలు కావు. గొప్పకధ అనుకొని వారువ్రాసినవి గొప్ప కధలు కాకపోవచ్చు. కాని వారు మధించి వ్రాసినప్పుడు.. కధా రచన లోని కళాత్మకత మెళకువ వారికి తెలిసినప్పుడు తప్పకుండ మంచి కధ వొకటయినా వారి నుండి వస్తుంది. ఆ కోవకు చెందిన సిన్సియర్ రచయిత్రి పూర్ణిమ. “సిన్సియారిటి కవితా సుందరికి సీమంతం లాంటిది.. శివ సుందరాలకు సత్యం బేస్ లాంటిది..” అన్నాడు తిలక్. పూర్ణిమ సిన్సియర్ గ వ్రాసిన ఈకధలో శివ సుందరాలు కధంతా పరచుకుని ఉన్నాయి. ప్రధానకధకు బేస్ లాంటి సుగ్రా హుమాయూన్ బేగం పోరాటజీవితo అచ్చమైన సత్యం. కాబట్టి ఈ కధ ఉత్తమ కధకు ఉదాహరణ అని నేనంటే అందరూ తలలూపూతారని భావిస్తున్నాను.

ఇక కధలోకి వెళదాం.

మరొకమారు ఈ కధా సంకలనం వెరీ స్పెషల్ అని చెప్పడానికి కూడా ఈ అన్నీసా కధ ను చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈసంకలనంలో మనలో కలగలిసిన ముస్లింసమాజాన్ని కూడా చెబుతున్నాం. 1323లో కాకతీయ సామ్రాజ్యాన్ని నాశనం చేయడం ద్వారా ముస్లిములు దక్షిణాపధంలోకి అడుగు పెట్టారు. ఆనక మధుర వరకు చొచ్చుకుపోయారు. గుడులు గోపురాలు నాశనం చేసి చేసి అలుపొచ్చి ఇక్కడే దిగబడి పోయారు. అలా కేవలం రాజు, సుల్తాన్ యుద్దాలు చేసుకుని రాజ్యాలు అక్రమించడమే కాక హిందూ మతంపై దాడి చేశారు. మన సంస్కృతిపై విరుచుకుపడ్డారు. అప్పటివరకు ఉన్న సమాజాన్ని చిన్నాభిన్నం చేసి మన వాళ్లంతా దిమ్మదిరిగి నిశ్చేస్తులై నిలబడిపోయేలా తెలుగువారి జనజీవితాన్ని అతలాకుతలం చేశారు. మనం తేరుకునే లోపల ముస్లింలు మన ప్రక్క ఇంట్లో కాపురం పెట్టారు. మన ఊళ్ళో మసీదు కట్టుకుని మన చెవిలో నమాజు చదవటం మొదలుపెట్టారు. ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే మన సమాజంలో మమేకమయ్యా రు ముస్లింలు. అప్పటివరకు కులవర్గాలు మాత్రమే తెలిసిన మనం ఇప్పుడు మనం హిందువులమని, వారంతా ముస్లిలులు అని.. అలా రెండుమతాలు ఉన్నాయని మొదటిసారి గుర్తించాము.

మన కధాకాలంనాటికి ఇస్లాం భారతీయసమాజంలో ఇంకిపోయింది. భాగమైపోయింది. కొన్ని ప్రాంతాలలో హిందువులను దాటిపోయింది. అలాంటి ప్రాంతం హైదరాబాద్. భాగ్యనగరం కాస్తా హైదరాబాద్ అయ్యిందంటే కారణం వారి డామినేషనే కారణం కదా.. ఈ కధలో రచయిత్రి ముస్లిం సమాజంలో స్త్రీ సమస్యలను.. ముస్లిం పురుష ప్రపంచం వారికి ఇస్తున్న స్థానం.. అసమతౌల్యాలను తుదముట్టించడానికి ఓ ధీరవనిత ప్రయత్నించడం.. ఇవన్నీ ఇoదులో మనకు ఎదురౌతా యి. కానీ ఏవీ స్పీచ్ ఇవ్వవు. సమస్యలను ఏకరువు పెట్టవు. రచయిత్రి కేవలం చిన్న చిన్న సన్నివేశాల ద్వారా ఆయా సందర్భాలలో వారి సహజమైన ప్రవర్తన ద్వారా మాత్రమే ముస్లిం మహిళల స్థితిగతులను చెప్పించడం ఈ కధలోని ఉన్నతత్వం.

బేగం, విజయ రెండు రైలు పట్టాలు. ఇద్దరివి వేరు వేరు నేపధ్యాలు.. వేరు వేరు పంధాలు.. బేగం ది వ్యవస్థ ప్రక్షాళన అయితే విజయది వ్యక్తిగతపోరాటం. మహిళల సమస్యలను పోరాడుతోంది బేగం. వాటిని స్వయంగా ఎదుర్కొంటూ తర్వాతి మెట్టు ఎక్కుతోంది విజయ. 18 వ శతాబ్దపు తొలినాళ్ళలో పురుషులే కాదు మహిళా సంస్కర్తలుకూడా పత్రికలు నిర్వహిస్తూ మహిళాభ్యు దయం కోసం సిన్సియర్ గా పోరాడారు. అలాంటి వారిలో సుగ్రాబేగం వొకరు. ఆమె, ఆమెవద్ద పనిచేసే విజయ ప్రధాన పాత్రలుగా చక్కని కధ అల్లారు పూర్ణిమ.

ఇద్దరూ ఆమె నిర్వహిస్తున్న పత్రికను ప్రింట్ చేసే ప్రెస్ కు వెళతారు. అక్కడ మోసం. ధైర్యంగా ఎదుర్కొంటుంది బేగం. దాన్ని అనుభూతి స్తుంది విజయ. మగవాళ్ళ వ్యాఖ్యానాల్లో ఆ వర్గపు దౌష్ట్యం ఇద్దరూ గ్రహిస్తారు. శారీరక అనారోగ్యంతో ఉన్న సుగ్రా మానసికంగా ఆరోగ్య వంతురాలు. ఆమె ప్రయత్నాలకు ముస్లిం మహిళలల్లో ఎంత వరకు మార్పువచ్చిందో తెలియదు కాని ఆమె అసిస్టెంట్ విజయ మాత్రం మహామేధావి మౌలానా ఆజాద్ హిందీ ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదించే స్థాయికి ఎదిగింది. అది ఆజాద్ సాబ్ కు, సుగ్రా మేడంకు కూడా గర్వదాయకం.. ఆనందకారకం.

కధ చదివితే విజయ విజయవిహారం, సుగ్రా బేగం అద్భుత నాయకత్వ పరిమళంతో మీరూ పరవశిస్తారు. ముగింపులో “బహుత్ హుందా” అంటూ ఆజాద్ సాబ్ చేసిన హుoదా కామెంట్ కంటే బేగం అన్నట్లు విజయ ఊహిoచే వాక్యం, “సబర్ కరో మేరీ జాన్” అని వ్రాయడం రచయిత్రి అత్యుత్తమ రచనా విన్నాణo. కొసమెరుపు ఏవిటంటే హైదరాబాద్ లోని హుమాయూన్ నగర్ ప్రాంతానికి ఈ సుగ్రా హుమాయూన్ మేడం పేరుమీదనే హుమయూన్ నగర్ పేరు వచ్చిందని నేను విన్నాను. తప్పయితే నిజం చెప్పండి.

-మత్తి భానుమూర్తి


ఈ వేళ కాలయంత్రం లొ కథ — పూర్ణిమా తమ్మిరెడ్డి ‘ అన్నీసా ‘.

ఈ కథలో సమాజంలో జరిగిన ఒక చారిత్రక మలుపుని నేపధ్యం గా తీసుకున్నారు .హైదరాబాద్ నగరంలో స్త్రీలను చదువు వైపు , ఆలొచన వేపు తిప్పే వారికి ఒక platform ఏర్పాటు అయ్యేందుకు సుగ్రా హుమయూన్ బేగం ఒక ఉర్దూ పత్రిక నడిపారు . అదే ఈ కథ నేపధ్యం .

అప్పటికి ఆంధ్ర దేశం లో కూడా స్త్రీల కొరకు పత్రికలు రావడం మొదలయ్యింది . దుర్గాబాయి దేశ్ ముఖ్ లాంటి వారు స్వయంగా పత్రికలు నడిపారు . అలా పరదా వెనక వుండే ముస్లిం స్త్రీల కొరకు నడిపే పత్రికా అన్నీసా . అన్నీసా అంటే ఉర్దూ లో మహిళ . డబ్బు ఉన్నా , చదువుకున్నా , హోదా ఉన్నా సమాజం లో స్త్రీ నిలబడాలి అంటే నిరంతర యుద్ధం .అది బేగం పాత్రలో , విజయ అనే ఈ కథ లోని మరో పాత్ర తోటి చూపారు పూర్ణిమ. ఈ కథ లో ఈ రెండే పాత్రలు . భర్త వదిలి పెట్టిన నిరక్షరురాలైన విజయ అనే ఒక మహిళ మౌలాన కలాం ఆజాద్ ఉర్దూ భాషణ ని తెలుగు లొకి ఒక బహిరంగ సభలో తర్జుమా చేసే స్థాయికి ఎదగడం ఈ కథ లో ముఖ్యాంశం .

ఇది ఆ పాత్రే కాదు స్త్రీ ల జీవితాలలో వస్తున్న చైతన్యం అనే చారిత్రక మార్పును సాహిత్యంగా రికార్డ్ చేసారు . ఇక ఆ నాటి హైదరాబాద్ మన కళ్ళ ముందు నిలబెట్టారు . మూసి నది స్వచ్చంగా నీరు తో నిండిన రోజులు . స్వాతంత్ర ఉద్యమం గాలులు హైదరాబాదు లో కూడా వీస్తున్న రోజులు .

ఒక సాంఘిక మార్పుని చరిత్ర లో ఇమిడ్చి కథ రాసిన పూర్ణిమ గారికి అభినందనలు.

– ప్రసూన బాలాంత్రపు


పూర్ణిమ తమ్మిరెడ్డి తెలుగు వాక్యాన్ని తన చేతిలో రంగుల పిట్టలా ఆడించగల చాకచక్యం ఉన్న రచయిత్రి. అలా అని కొద్దివే ఐనా సరే నేను చదివిన ఆమె రచనలు చెప్పేయి.

కానీ ఒక కథ చెప్పేటప్పుడు వాక్యాన్ని మెరిపించడం కన్న కథావస్తువుకి, పాత్రల స్వభావాలకి తగినట్టే ఉపయోగించాలని తెలియడం ఆమెను మంచి సంయమనం గల కథకురాలిని చేసింది.

హైదరాబాద్ ముస్లిం నేపధ్యం. అక్కడ పత్రిక నడిపే ఉన్నతవర్గాల మహిళ ఆమె సాహసం ఇవన్నీ అక్కడ పనిచేసే హిందూ మహిళను ఎలా తీర్చి దిద్దేయో అదీ కథాంశం.

ఇవాళ ఉన్న సామాజిక పరిస్థితి లో ఇలాంటి కథ చెప్పాలనుకోవడం పూర్ణిమ తాలూకు సామరస్యదృక్పధాన్ని చెప్తోంది.

పత్రిక ముద్రణ చట్టాబజార్ లో జరిగేది. ఒకసారి వాళ్లు చేసిన మోసాన్ని సుగ్రా హుమాయూన్ బేగం ఎలా ఎదుర్కుందో దగ్గరుండి చూసిన విజయ తర్వాతి కాలం లోఆమెనుండి చాలా నేర్చుకుంది. ఏం నేర్చుకుంది, ఎలా నేర్చుకుంది అన్నవి కుదురుగా, నిదానంగా, ఒకదాని తర్వాత ఒకటి సంఘటనలు పేర్చుకుంటూ, సహజమైన సంభాషణలతో కలుపుకుంటూ, కథ లోకి, ఆ వాతావరణం లోకి, సుఖంగా మనని తీసుకుపోగలగడం రచయిత్రి ప్రతిభ తప్ప మరోటి కాదు.

ఇలాంటి కథలు సరళంగా సాగిపోతూన్నట్టు ఉంటాయి. కాని వాటివెనక పూర్ణిమ కథలో వాడిన’ సబర్’ చాలా ఉంటుంది.

ఈ వయసు లో నేను చెప్పే “సబర్ కరో మేరీ జాన్” అనే మాట పూర్ణిమ’ ఈ’ వయసు లోనే చెప్పగలగడం ఆశ్చర్యం. ఆమె మాటలలోనే ఆమె పరిణతి చెప్పాలి: “మార్పు అచానక్ రాకూడదు. మన కాళ్లకింద పర్ష్ ని ఒక్కసారి లాగేస్తే మనం కింద పడిపోతాం. దెబ్బలు తగులుతాయి. మార్పు చెడ్డదనిపిస్తుంది. మార్పు ఎంత మెల్లిగా వస్తే అంత బలంగా ఉంటుంది . సబర్ కరో మేరీ జాన్.”

ఇది బేగం మాటే అయినా ఆమె నోట తన భావం చెప్పించడం కోసమే పూర్ణిమ18 శతాబ్ది నాటి ఈ కథ ఎత్తుకుందా అనిపించింది.

అప్పటి స్త్రీల పత్రికలచరిత్ర అనే తెరవెనుక ఉండి హిందూ ముస్లిం మహిళల పరస్పర స్నేహసంబంధాలు చెప్పడం ఇందులో ఉంది. అది ఇవాళ అవసరం. అది పూర్ణిమ సానుకూలదృష్టిని చెప్తోంది అని నాకు అనిపించింది.

పూర్ణం ఇదం.

ఈమె నిండకుండ.

– వాడ్రేవు వీరలక్ష్మీదేవి


ఈ సంకలనంలో నాకు బాగా నచ్చిన కథలలో ‘అన్నీసా’ ఒకటి. ఉత్తమ స్థాయి చారిత్రక రచనలు శకలాలుగా మిగిలిపోకుండా గతాన్ని వర్తమానానికి సంధిస్తాయి. ఏదో ఒక మేరకు సమకాలీన జీవనాన్ని, సమాజాన్ని లేదా మానవ నైజాన్ని తాకుతాయి. అదే వాటి విశిష్టత. అభినందనలు!

– సుధాకర్ ఉణుదుర్తి


One comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s