మొన్న శనివారం ఏవో పనుల మధ్య ఒక తెలుగు సాహిత్య ఈవెంట్‌కి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడికీ చాలా సేపు లోపలకి వెళ్ళకుండా రవీంద్ర భారతి మెట్ల మీదే ఒక గంట సేపు కూర్చున్నాను. అలా ఆరుబయట వచ్చీ పోయే జనాన్ని చూస్తూ ఏవో ఆలోచనల్లో మునిగిపోవడం నాకిష్టం. పైగా, ఆ పూట నేనొక్కదాన్నే కూడా లేను. వచ్చి పోయేవాళ్ళల్లో కొంత మంది, నన్ను కలుస్తామని ముందుగా చెప్పినవాళ్ళు ఒక్కొక్కరుగా వచ్చారు. చాలా వరకూ మొదటిసారి కలుస్తున్నవాళ్ళే అవ్వడంతో హాయ్-హల్లోలు అయ్యాక మీరేం చదువుతున్నారు-మీరేం రాస్తుంటారు?లు అయ్యాక ఎటూ ఒక ఇబ్బందికర నిశ్శబ్దం వచ్చి కూర్చుటుంది. అయినా ఏదో మానేజ్ చేస్తున్నాం అనుకుంటుండగా, నేనే, ఏం బుద్ధి పుట్టిందో, పైకి వెళ్ళాను.
సగం మాస్క్ లోపల దాక్కుని ఉన్నా నన్ను కొందరు గుర్తుపట్టారు. మళ్ళీ హాయ్-హల్లోలు. ఒక చుట్టు చుట్టి నేను బయటపడదామనుకుంటడగా ఒకళ్ళిద్దరు తగలడం, నాకు అమాంతంగా ఎవరో ఆముదం నోట్లో పోసిన ఫీలింగ్ రావడం జరిగాయి. ఆముదం కనీసం పొట్టలోకి వెళ్ళాక శరీరానికి మంచి చేస్తుందంటారు. ఇవి పాడు మాటలు, అక్కసు మాటలు. ఎందుకో నాకర్థం కావు. ఉదాహరణకి, పుస్తకం.నెట్ మొదలుపెట్టిన చాన్నాళ్ళ వరకూ “ఈమె ఫలనా. పుస్తకం.నెట్ అనే వెబ్సైట్ వెనకున్నవాళ్ళల్లో ఒకరు. ఆఫీసులో కూర్చుని నవలలూ చదువుకుంటూ, రివ్యూలు రాసుకుంటూ ఉంటుంది.” అని పరిచయం చేసేవారు. నేను ఆఫీసులో కూర్చుని చదువుతున్నా అన్నది వీళ్ళ ఇమాజినేషన్. పైగా నేనెక్కడ కూర్చుని చదువుతున్నా, రాస్తున్నా అన్నది పరిచయం చేసేటప్పుడు అప్రస్తుతం. (ఇది నా బ్లాగ్ కాబట్టి ఈ ఉదాహరణతో ఆపుతున్నా. ఇంతకన్నా దారుణమైన మాటలు వ్యక్తిగత జీవితానికి సంబంధించి వినాల్సి వచ్చేవి, వస్తున్నాయి.)
ఇట్లాంటివి విన్నప్పుడు మనసు చివ్వుక్కుమంటుంది. అలా బాధేసినప్పుడు నేను సైలెంట్ అయిపోతాను. దానికి మళ్ళీ “మీకు మాటలు రావా?” టైపు కామెంట్స్. చాన్నాళ్ళ వరకూ నాకు బాధ వేసేది, ఇలాంటివి విన్నప్పుడు. కానీ మొన్నటి శనివారం పూట మాత్రం కోపం వచ్చింది. ఆ రోజంతా ఏదో ఒకటి చిరాకు పెట్టేవే అవుతుండడంతో చాలా కోపం వచ్చేసి ఒక 24 గంటలు పట్టింది తగ్గడానికి.
ఇహ ఎవరైనా సరే (ఆ-ఈ గ్రూప్ అన్న తేడా లేకుండా), తెలుగు అదీబులని (సాహీతీవేత్తని ఉర్దూలో అదీబ్ అంటారు) పర్సనల్‌గా కలవకూడదంటే కలవకూడదు, ఈవెంట్స్ కి వెళ్ళకూడదంటే వెళ్ళకూడదు, వాళ్ళ కాల్స్ ఎత్తకూడదంటే ఎత్తకూడదు, మహా అయితే మరీ అవసరం పడితే చాట్స్ మాత్రమే అని తీర్మానించుకున్నాను. అసలు ఈ కోవిడ్ మొదలైన దగ్గరనుంచీ నేను కొంచెం ఈ సర్కిల్లో, సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండడం వల్ల నాకు పూర్తిగా విరక్తి వచ్చింది. వీళ్ళని కలిసి వీళ్ళ సోది మాటలు, దెప్పుడు మాటలు వినేకన్నా, అదో రవీంద్ర భారతో, శిల్పకళావేదిక మెట్లమీదనో ట్రాఫిక్ వింటూ కూర్చున్నా చెవులకి, మనసులకి హాయి.
మర్నాడు ఒక ఫ్రెండ్ తన ఫ్రెండ్ ఎవరికో నా నెంబర్ ఇచ్చాడని చెప్తే, లైట్ తీసుకున్నా. ఎవరన్నా చేసినా ఫోన్ ఎత్తనులే అని. కానీ ఆ మనిషి చేయడం, నేను అప్పుడే ఏదో కొరియర్ వాళ్ళు చేస్తున్నారని ఎత్తాను – ఇహ మాట్లాడ్డం తప్పని పరిస్థితి. కాసేపు అనుకున్నది కాస్తా ఒక నలభై నిముషాలు పట్టింది కట్ చేసేసరికి.
కసుబుస్సంటూ ఉన్న నేను ఆ కాల్ వల్లే శాంతించాను. దాంట్లో చాలానే టాపిక్స్ వచ్చాయి కానీ, ఇప్పుడు పనిగట్టుకుని పోస్ట్ రాయడానికి కారణం పుస్తకాల ప్రచురణ అనే టాపిక్.
ఒకళ్ళు తెలుగు నవల రాశారు. అచ్చేయడానికి డబ్బుల్లేవు. అందుకని ఒక్కళ్ళిద్దరితో ఆ మాట అని పక్కకి పెట్టేశారు. ఒక రోజు పనిలో ఉండగా బంధువులు ఒక డబ్బా తెచ్చి, అందులోంచి పుస్తకాలు తీసి చేతిలో పెట్టారు. రచయిత ఆ క్షణాల్లో పడిన భావోద్వేగం ఎలా ఉండి ఉంటుందో రచయితలం కదా, మనం ఆ మాత్రం ఊహించుకోలేమా? కానీ నాకెందుకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయంటే, ఆ వచ్చిన బంధువులు డబ్బున్నవారు కాదు. వాళ్ళే ఏవో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆస్తులు అమ్ముకున్నారు. అమ్మగా వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని ఈ పుస్తకానికని ఖర్చుచేశారు!
టివీ రియాల్టీ షోలలో లాగా కెమరా జూమ్ చేసి ఒక sob story చెప్పే ప్రయత్నం కాదిది. ఇప్పుడేదో నేను కార్పరేట్ లో కొంచెం సీనియర్ పొజిషన్లో ఉన్నా కాబట్టి నేను నోట్ల కట్టల్లో దొర్లుతుంటాను, డబ్బు యావతోనే ఒళ్ళు హూనమవుతున్నా కాపిటలిజానికి బానిసనైపోయానని మన అదీబులు సైకో-అనాలిసిసులు చేస్తుంటారు. ( తెలుగులో software engineers గురించి అంత నికృష్టమైన కథలు, సినిమాలు ఎందుకు వస్తాయో అర్థం అయ్యిందా? Ans: Over-simplistic view of any lived experience.)
డబ్బు లేక ఇబ్బంది పడిన కుటుంబం నుంచే వచ్చాను నేను. నారాయణ-చైతన్య లాంటి కాలేజీల్లో చేరే స్థోమత లేక పాలిటెక్నిక్ లో చేరాను. (ఏడాదికి Rs 1500 ఫీస్ అప్పట్లో.) ఇంజనీరింగులో ఫ్రీ సీట్ వచ్చింది, ఎనిమిది వేలు కట్టాలి. కానీ మా నాన్న దగ్గర లేవు. మర్నాడు ఉదయం ఎనిమిదింటికల్లా వెళ్ళి సీట్ ఫైనలైజ్ చేసుకోడానికి. రాత్రి పదింటి వరకూ డబ్బుల్లేవు చేతుల్లో. పావు తక్కువ పదకొండుకి మా దూరపు బంధువులెవరో సిటీ ఇంకో చివర్న వచ్చి డబ్బిచ్చారు కాబట్టి కాలేజీలో జాయిన్ అయ్యాను. లోన్ పెట్టనవసరం లేకుండా మా నాన్న ఎలాగో మానేజ్ చేశారు, ఆ తర్వాత.
డబ్బుల్లేక చదువులు ఆగిపోవడం, వైద్యం అందకపోవడం, ఎవరైనా పోయినప్పుడు వెళ్ళడానికి దారి ఖర్చులు లేకపోవడం ఇవ్వన్నీ చూశాను. ఇప్పటికీ, ఇన్నాళ్ళ బట్టీ రాస్తున్నా కూడా, నేను వీటి సరసన “డబ్బుల్లేక పుస్తకం అచ్చు వేయలేకపోతున్నాం” అన్నదాన్ని నిలబెట్టలేను. “అయ్యో, పోనీలెండి. బ్లాగ్ మొదలెట్టి రాసుకోండి” అన్న సలహా ఇస్తానేమో గానీ దానికి డబ్బు సమకూర్చడమనేది అంత అవసరమైన సంగతిగా భావించను. అంతే డబ్బు ఏ లిటరరీ కోర్సు చదవడానికో, లేదా మంచి పుస్తకాలు కొనుక్కోడానికో ఖర్చు చేస్తామంటే సంతోషిస్తాను. మా నాన్న అయితే అవి కూడా దండుగ ఖర్చులు, “పనికొచ్చే చదువు”కి వాడమని అంటారు, పక్కాగా.
అందుకే నాకు అంత అపురూపంగా పుస్తకం వేసుకొచ్చిన ఆ బంధువులని చూసి ముచ్చటా వేసింది, ఇంకో పక్క “ఎవరు వీళ్ళు? పుస్తకానికి ఎందుకింత విలువనిస్తున్నారు?” అన్న అనుమానమూ వచ్చింది. అంటే, ఇప్పుడు రమేశ్ కార్తీక్ మొదటి పుస్తకమూ crowdsourced funding. కానీ అది సాధ్యమయ్యేలా చేసిన అపర్ణా, చైతన్యా అదీబులు (సాహితీవేత్తలు) కదా! వాళ్ళకి ఆ పుస్తకం రావాల్సిన అవసరం ఉందనిపించడంలో వింత లేదు. కానీ, ఈ సాహిత్య సమూహానికి దూరంగా ఎక్కడో ఊర్లో ఉన్నవాళ్ళూ తెలుగు సాహిత్యం గురించి (వాళ్ళ పిల్లాడు రాశాడు అనే కారణంతోనే అయినా) ఆలోచించారు, అంతకన్నా ముఖ్యంగా ఖర్చుపెట్టారు!
నేనెప్పుడూ ఇంటర్నెట్ మీదే రాసిన మనిషిని కావడంతో నాకు ప్రింట్ పుస్తకం మీద అసలు మనసు పోలేదు ఎప్పుడూ. మంటో గొడవ లేకపోయుంటే పుస్తకం అచ్చేసే జోలికి పోను. కానీ వెస్ట్ లోనూ, ఇక్కడ ఇంగ్లీషులో లాగానే writer (unpublished) vs author(published) అనే తేడా తెలుగులో కూడా ఒక unsaid ruleలా కనిపిస్తుంది. మనదంతా క్రియేట్ వ్యవహారం లేదా సమాజోద్ధరణ, మార్కెటింగ్ జిమ్మిక్కులు లేవిక్కడ అని తెలుగోళ్ళు బుకాయిస్తారు కానీ, నేను ఇంతకు ముందోసారి అన్నట్టు, సకల దరిద్రాలూ ఏడ్చాయి ఇక్కడ, డబ్బు ఒకటే రాదు, రాసేవాళ్ళకి.
పుస్తక పరిచయాలు, కథలు, అనువాదాలూ, ఇప్పుడు బిబిసి రాస్తున్నవి అన్నీ, నేను ఫేస్బుక్ డీ-ఆక్టివేట్ చేసిన మూణ్ణెళ్ళకి అందరూ మర్చిపోతారు. ఎప్పుడు నా గురించి ఒక మాట చెప్పాలన్నా అప్పటికి నేనేమన్నా రాస్తుంటే దాని గురించే ప్రస్తావిస్తుంటారు. ఏమీ రాయకపోతుంటే నేను రాశా అని గుర్తు కూడా ఉండదు. ఇక ఎనాటికో archive.org లో ఎవడో sleepless, restless fellow తచ్చాడుతుంటే ఇవేవైనా ఎదురుపడితే, “ఎవరీ జీవి, ఇన్ని రాసింది?!” అని అనుకునేదొక్కటే నాకున్న remote chance. (Again! I’m not wallowing in self pity here, that’s the trend I’ve noticed. ఇట్లాంటి ట్రెండ్ ఉందని తెలిసి కూడా నా శాయశక్తులా రాస్తునే ఉన్నా అని మర్చిపోయి వెధవ అనాలిసిస్ చేస్తే మండిపోతుంది.)
ఎన్ని కాపీలు అమ్ముడుపోతాయో, అసలు పోతాయో పోవో అన్న పరిస్థితి ఉన్నా, ఒక కొత్త తెలుగు పుస్తకం రాగానే పట్టుమని నాలుగు పత్రికల్లో దాని గురించి సమీక్షో, పరిచయమో, excerpt వచ్చే పరిస్థితి లేకపోయినా, ఎవరో కొందరు అదృష్టవంతులకి ఏర్పడే fanboys తప్పించి మిగితా వాళ్ళకి “మీ పుస్తకం చూశానండి” అన్న మాట కూడా అపురూపమనిపించే అవస్థ ఉన్నా, అసలు ఎప్పుడన్నా ఏదన్నా కలిసి పనిచేద్దామనగానే బకీటుడు నిరశానిస్పృహలు మీద కుమ్మరించే వైఖరిలో కూడా సేవింగ్స్ బ్రేక్ చేసో, అప్పో సొప్పో చేశో, సహాయం అడిగో తెలుగు పుస్తకాలు అచ్చు వేస్తున్నారంటే టాక్‌కి, వాక్‌కి (walk the talkలో) సంబంధం లేనట్టే అనిపిస్తుంది నాకు.
There’s definitely something driving the Telugu writers to see their work as a bound book. Despite the internet. దాని గురించి మాట్లాడము. అలా పుస్తకాలు వేయడానికి అడ్డొచ్చే వాటిని గురించి ఏం చేయాలో మాట్లాడము. అదేదో రాజుగారి కథలో అందర్నీ ఒక గంగాళంలో పాలు పోయమంటే నీళ్ళు పోస్తారు జనాలు. మన తెలుగు రచయిత మాత్రం శ్రమకోర్చి సంపాదించిన పాలనే పోస్తున్నారు. అవ్వన్నీ గంగపాలు అయిపోయానన్న భావన రాకుండా ఏమి చేయొచ్చో నాకైతే అంతుచిక్కడం లేదు.
తెలుగు భవిష్యత్తు లేదు, అది చచ్చిపోతుంది, మన పిల్లలకి తెలుగులో చదవడమే రాదు, అక్షరాలే గుర్తుపట్టరు అని ఇంకోసారి ఎవరన్నా అంటే మాత్రం నేను గొడవేసేసుకుంటాను. కాన్వెంట్లకి వెళ్ళే పిల్లలని, పదేళ్ళు నిండక ముందే 128GB RAM లున్న లాప్‌టాప్‌లు ఇచ్చే పేరెంట్స్ ని చూసి మనం ఈ gross generalizations చేస్తున్నాం కానీ, రెండొందలు మూడొందల పేజీలని మొత్తం మొబైల్లో టైప్ చేసి తెలుగు మాన్యుస్క్రిప్టులు పోటీలకి, ప్రచురణకర్తలకి సబ్మిట్ చేస్తున్న ఇరవై ఏళ్ళ పిల్లలు మనకి కనిపించరు. తానా వాళ్ళ నవలల పోటీకి 107 entries వచ్చాయి. ఈనాడు వాళ్ళ కథావిజయం పోటీకి 1500 కథలు వచ్చాయి. ఎంతసేపూ మనకి JCB prizeలు రావు అన్న నిరాశే గానీ, ఇంత మంది ఇంత శ్రమకోర్చి రాస్తున్నారంటే వాళ్ళు రాణించడానికి మంచి వాతావరణం అందిస్తే, ఏమో పదేళ్ళల్లో మనకీ JCB prizeలో, అంతకు మించిన ప్రైజులో వస్తాయన్న ఆశ మాత్రం పుట్టదు.
తెలుగు చస్తే గిస్తే మన upper-class, upper-caste చేతుల్లో చస్తుంది. దానికి మంత్రదండంతో మళ్ళీ ప్రాణం పోయడానికి మాత్రం బోలెడు మంది ఉన్నారు, ఉంటారు అని నమ్మకం కలిగింది నాకైతే. ఉడతాసాయంగా నేను చేసేవి నేను చేస్తుండడం నా ప్రస్తుత కర్తవ్యం. నా గురించి ఎవరెంత నీచంగా మాట్లాడినా, నేను రాసేవి ఎంత తీసిపడేసినా, తెలుగులో నేను రాస్తూనే ఉంటాను. ఇది నేను మర్చిపోకూడదనే ఆ పూట అనుకోకుండా ఆ కాల్ ఎత్తానేమో!