Qabar: K.R.Meera

Posted by
Title: Qabar 
Original: Qabar
Original Language: Malayalam
Author: K.R.Meera
Genre: Novel
Translated to: English
Translator: Nisha Susan
Translation Published by: Eka (Westland Imprint)

అదో లోకం. కె.ఆర్ మీరా లోకం!

ఆ వాక్యంతోనే ఆమె రాసిన “The Unseeing Idol of Light” గురించి పోయినేడాది రాసిన వ్యాసాన్ని మొదలెట్టాను. షరా మామూలుగానే కాస్త వ్యక్తీకరణ అసాధారణంగా, క్లిష్టంగా ఉన్నవేటికీ తెలుగులో స్పందన రానట్టే ఆ వ్యాసానికీ రాలేదు. ఫలనా కథని, ఫలనా విధంగా చెప్పారని సరళరేఖ గీసినంత సులువుగా, సూటిగా రాసి, ఆ పుస్తకాన్ని కొందరికైనా పరిచయం చేయలేకపోయానే, అనవసరపు ఆర్భాటాలను తప్పించాల్సిందేమోనని కొంచెం నొచ్చుకున్నాను తర్వాత. కానీ, ఇప్పుడు కె.ఆర్.మీరా నవల “ఖబర్” (సమాధి) ఆంగ్లానువాదంలో చదవడం పూర్తి చేశాక మళ్ళీ అదే మాట అంటాను. బోల్డ్, ఇటాలిక్, ఫాంట్ 30లో అంటాను. 

అదో లోకం. కె.ఆర్ మీరా లోకం! 

కె.ఆర్ మీరాకి మాత్రమే సాధ్యమయ్యే లోకం. కథ నేరుగా కూడా చెప్పొచ్చు. అయోధ్య ఉన్న చోటునే ఉన్నా, బాబ్రీ మసీద్-రామ జన్మభూమి అనగానే కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ మొత్తం దేశమంతా గజగజా వణుకుతుంది కాబట్టి, కేరళలోని ఒక జిల్లాలో హిందు-ముస్లిమ్ మధ్య సివిల్ కోర్టు కేసుని ఆధారంగా చేసుకుని కాగితాలు, ప్రమాణాలు నమ్మే న్యాయస్థానంలో వేలవేల సంవత్సరాల కింద జరిగిందేమిటో, ఇప్పుడు మిగిలిందేమిటో చూపించలేక, నమ్మించలేక విసిగి వేసారి కేసు ఓడిపోయినట్టుగా కథ చెప్పొచ్చు. చూపెట్టాలనుకుంది మెజారిటీ వర్సెస్ మైనారిటీ మధ్య న్యాయ యుద్ధమో, అన్యాయ వెన్నుపోటో అయితే ఇలాంటి కథనం సరిపోతుంది. 

కానీ, కె.ఆర్.మీరా అక్కడితో వదిలిపెట్టదు. కళ్ళకి గంతెలు కట్టుకున్న న్యాయ దేవతకి కాగితాలు, దస్తావేజులు కావాలి కానీ, అసలు మనం ఆ దేవతని ఆశ్రయించకుండానే ఉండాలంటే మనకి ఎలాంటి ప్రమాణాలు కావాలి?

ఎవరు హిందువు? ఎవరు ముస్లిము? పుట్టుకతో వచ్చేది నిలుస్తుందా? ఏరికోరి ఒకదాని నుంచి ఒకటికి మారితే మనదవుతుందా? హిందూతనం ఎక్కడ ఉంటుంది? వేదాలు వల్లించడంలో, విగ్రహాలని పూజించటంలో, కాశీ-మానసరోవర్లకి యాత్రలకి వెళ్ళడంలో? ఇస్లామీ విధానమని దేన్ని అనాలి? ఐదు పూటాలా నమాజ్ చదవడాన్ని, రమాదాన్‍లో ఉపవాసాలు ఉండడాన్ని, జీవితంలో ఒకసారన్నా మక్కాకి వెళ్ళడాన్ని? 

ఇవ్వన్నీ సరే, ఇవే మతానికి ప్రతీకలన్నా నమ్మచ్చు. కానీ వీటినెలా నిరూపించడం? ఇతరులనెలా నమ్మించడం? ముఖ్యంగా అనేక శతాబ్దాలుగా, ఒక ఏరు ఇంకో ఏరుతో కలిసి నదై పొంగి పొరలితే, అది  సముద్రంలో కలిసే చోటకి వెళ్ళి, “ఇందులో ఏది ఏ ఏటి నీరు?” అని చెప్పడం సాధ్యమేనా? అసలు అలా అడగడం సబబేనా? మన ఒంటి మీద వేసుకునే బట్టలు, మన మొహానికి పెట్టుకునే అలంకరణలు, మన ఇంటి మీద ఎగరేసుకునే జండాలు ఇప్పటి ఈ క్షణపు నిజాలని చెప్తాయి కానీ, ఒక ఆరేడు తరాల వరకూ మన పూర్వీకులెవరో ఎంతో కొంత తెలిసినా, ఆ పైన మనం నిజంగా ఎక్కడ నుంచి వచ్చామో మనం చెప్పగలమా? 

మీరా తన నవలలో ఈ సమస్యనే ఎత్తుకుంటుంది. ముస్లిమ్ కుటుంబానికి చెందిన కొన్ని ఎకరాల భూమిని, ఆర్థిక ఇబ్బందుల వల్ల, ఒక హిందూ చారిటబుల్ ట్రస్ట్ వారికి అమ్మేస్తారు. ట్రస్ట్ వారు అక్కడ అన్ని మతాలవారికి, వర్గాలవారికి పనికొచ్చే భవంతి కట్టాలనుకుంటుండగా, ఆ ముస్లిమ్ కుటుంబంలో ఒక వ్యక్తి, “అక్కడ మా పూర్వీకుల సమాధి ఒకటి ఉంది. ఆ కాస్త భూభాగాన్ని నాకివ్వండి, నేను కొనుక్కుంటాను,” అని సివిల్ కోర్టులో కేసు వేస్తాడు. ఆ జిల్లాకి అప్పుడే నియమించబడ్డ జడ్జ్ భావనా సచ్చిదానంద ఆ కేసులో తీర్పుని ఇవ్వాలి. అదే కథ! 

కేసు ఎలాంటి మలుపులు తిరిగి ఉంటుందన్నదే కథ అయితే, “అదో లోకం…” అని అనుకోనక్కరలేదు. అసలు కేసు కన్నా జడ్జ్ భావన పూర్వీకుల గురించి తరచూ వినిపించే పుక్కటి కథలే నవలలో కీలక భాగాన్ని ఆక్రమించుకుంటాయి. ఒక పక్క తన భవిష్యత్తు ఏమిటో తెలీక మబ్బుగా ఉన్నా కూడా తన గతాన్ని, తన కుటుంబ గతాన్ని అర్థం చేసుకోడానికి ప్రయాస పడుతూనే ఉంటుంది. చెడిన వివాహం, విడిపోయిన తల్లిదండ్రులు, ADHD ఉన్న కొడుకు, కొత్తగా పెరిగిన ఉద్యోగ బాధ్యతలు ఇన్నింటి మధ్యన కూడా తన ఉనికిని పూర్వీకుల కథల్లోనే వెతుక్కుంటుంది. 

మీరా రచనా శైలిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఆమె వాడే మెటాఫర్స్, అతిశయాలు. దీని గురించి కొంత ఆమె కథలని పరిచయం చేసేటప్పుడు రాశాను. ఈ నవలలో కూడా అవి పుష్కలంగా కనిపిస్తాయి. తన పూర్వీకుడి సమాధి ఉన్న నేల కావాలంటూ కేసు వేసిన అతనికి ఇంద్రజాలం, మాజిక్ వచ్చు. వాటిని జడ్జ్ గారి మీద కూడా ప్రయోగిస్తాడు. ఆమెని అమాంతంగా కుర్చీతో సహా గాలిలోకి ఎగురవేసి, ఆమె వాడే పెన్నుని చిన్న నాగుబాముగా చేసేసి ముందు ఇబ్బంది పెడతాడు. ఆ పైన ఆమెని పూల వానలో తడిపించి, మబ్బుల ఇంటికీ తీసుకెళ్తాడు. అప్పటికి వరకూ ఆమె సింగిల్ మామ్, జిల్లా జడ్జ్. అప్పుడే ఆమె ఎడ్వర్డ్ గులాబీల గుభాళింపుకి పులకరించుకుపోయే రొమాంటిక్. కొన్ని పేరాల వ్యవధిలో కథ socio-realism నుంచి fantastical realms కి వెళ్ళిపోతుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది. ఆ కుదుపులకి తట్టుకోగలగాలే గానీ, ఆ ప్రయాణాల్లోనే మజానే వేరు! 

ఇక, ఉపమానాల సంగతి చూస్తే, మీరా ఒక ఉపమానాన్నే తీసుకుని కథంతా నడపదు. బలమైన ఉపమానాలని కథ మధ్యలో మాటమాటల్లో అనేస్తుందంతే! చదువుతున్నప్పుడు చెప్పాలనుకుంటున్న పాయింట్‍ని నొక్కి వక్కాణించడానికి చేస్తుందనిపిస్తుంది. కానీ చదవడం అయిపోయాకే ఆ ఉపమానం విశ్వరూపం మెల్లిమెల్లిగా సాక్షాత్కరిస్తుంది. ఈ నవలలోని ప్రధాన పాత్ర, తల్లి గర్భంలో ఉండగా కవలలు పుట్టబోతున్నారని చెప్తారు. కానీ ఒక్కత్తే పుడుతుంది. కవలల్లో ఒకళ్ళు అలా గర్భంలో మాయవవ్వడాన్ని vanishing twins అంటారు. ఆ పాత్రకి తాను తోబుట్టువుని తినేశానా అన్న అనుమానం చిన్ననాటి నుంచి పీకుతూనే ఉంటుంది. కారెక్టర్‍కి డెప్త్ ఇవ్వడానికి ఈ ప్రస్తావన అనుకోవచ్చు. కానీ, కొద్దిగా కథకి దూరంగా జరిగి ఆలోచిస్తే, భారత నేల భూగర్భంలో హిందూ-ముస్లిములు కవలలు అనుకుంటే, ఒకళ్ళని ఒకళ్ళు తినేస్తున్నారా? ఒకళ్ళని ఒకళ్ళు తినక తప్పని పరిస్థితుల్లో ఏమవుతుంది? అట్లా ఒకళ్ళు పోయి, ఇంకొక్కళ్ళే మిగిలితే, ఆ మిగిలిన వాళ్ళు నిజంగా ఒక్కళ్ళేనా? తినేసినవాళ్ళని మోసుకుంటూ తిరుగుతారా? 

అలానే, కవులు కథలు రొమాంటిసైజ్ చేసి చేసి వదిలేసిన కొన్నింటికి వికృత, విలక్షణ అర్థాలని అపాదిస్తుంది మీరా. ఉదాహరణకి, ఈ కథలో ఆమెకి ఇంద్రధనస్సుల గురించి “Those seven colors attacked my eyes like an army of seven thousand.” అని ఒకచోట అంటే, “Something was lodged in my eye. A shard of that rainbow.” అంటుంది. ఏడు రంగుల ఇంద్రధనస్సుని “భిన్నత్వంలో ఏకత్వం” (unity in diversity)కి ప్రతీక అనుకుంటే ప్రస్తుత కాలంలో ఆ రంగుల చమ్మక్కులే కొందరికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఇప్పుడు వాటిని పల్చబరచడానికే కొందరు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.

ఈ నవలలో మంటో ప్రస్తావన ఒకే ఒక్క వాక్యంలో వస్తుంది. పది పదాలు కూడా ఉండని వాక్యంలో మీరా సమర్థవంతంగా అన్నింటినీ పట్టుకొచ్చేస్తుంది: ప్రధాన ప్రాతల్లో ఒకరి మానసికావస్థ, మంటో రచనల సారాంశం, శతాబ్దాలుగా మత కల్లోలాల్లో చిక్కుకుపోయిన కోట్లాది మంది వ్యథ. ఆ ముందే ఒక చోట, మగవాళ్ళని నడిరోడ్డు మీద బట్టలు ఊడదీసి మత పరీక్ష పెట్టే ప్రస్తావన వస్తే గుల్జార్ రాసిన “ఖౌఫ్” (నా అనువాదం: భయం, ఈమాటలో) గుర్తొచ్చింది. అక్కడితో ఆగిపోతుందనుకున్నది మంటో వరకూ చేరేసరికి నేను ఉక్కిరిబిక్కిరి అయ్యాను. వెనువెంటనే కుదటపడ్డాను కూడా, ఇలా ఆలోచించేవారు ఉన్నారని. 

ఈ నేల కథ చెప్పడం మాటలు కాదు. దీని చరిత్రలో ఉన్నన్ని పాయలు, చిక్కుముళ్ళు బహుశా మరెక్కడా ఉండవు. కేవలం ప్రస్తుతం దేశంలో ఉన్న హిందూ-ముస్లిమ్ మతకల్లోలాల సమస్యని తీసుకుని ఓ కథ రాయకుండా, మనం మన మూలాల్లో వెతుక్కోకుండా ఎప్పటికీ ఈ సమస్యని ఎదుర్కోలేమని, కథ ఏ ఒక్కరిదోనని అనిపించినా అది ఏదో రకంగా మన అందరిది కూడా అనీ గుర్తుచేసినందుకు మీరాకి ఎన్ని ధన్యవాదాలు చెప్పుకున్నా తక్కువే! ఇంత విలువలున్న నవలని ఇంత త్వరగా అనువదించి మలయాళేతరులకి అందించినవారికి కూడా అభినందనలు!   

K.R.Meera రచనల గురించి నేను రాసిన వ్యాసాలు ఇక్కడ చడవచ్చు: https://pustakam.net/?tag=krmeera

ఆవిడ గురించి ఫేస్బుక్ లో రాసుకున్న పోస్ట్.

One comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s