హైదరాబాదుకే సముద్రమైన కవి: కె.వి.తిరుమలేశ్ 

Posted by

తొలి ప్రచురణ: ఆంధ్రజ్యోతి వివిధ, ఫిబ్రవరి 13, 2023

ఓర్జిత్ సేన్, ప్రముఖ చిత్రకారులు, ఒకసారి ‘కొచ్చి బినాలె’ ఆర్ట్ ఎగ్జిబిషన్‍లో చార్మినార్‍ది గ్లాస్ మొడల్ చేసి ప్రదర్శించారట. గ్యాలరీకున్న కిటికీ దగ్గర ఆ నమూనాను పెట్టగానే బొమ్మ చార్మినార్ ఆర్చులనుంచి కొచ్చి నీలిరంగులో సముద్రతీరం, హార్బర్ కనిపించాయి. దాన్ని ప్రేరణగా తీసుకుని చార్మినార్ చుట్టూ సముద్రంతో, మెరుపులు ఉరుములతో కూడిన ఒక తుఫాను రాత్రిని పెయిటింగ్‍గా చిత్రీకరించారు. కారుచీకటిలో మెరుపుల వెలుతురులో మిణుమిణుక్కుమంటున్న లైట్‍హౌస్‍లా అనిపిస్తుంది చార్మినార్ ఆ బొమ్మలో. కళాకారుల ధ్యాసను మేధను ఒక మహానగరం ఎలా వశపర్చుకోగలదో చెప్పడానికి ఇదో ఉదాహరణ మాత్రమే. 

సాహిత్యంలోనూ హైదరాబాదు నగరాన్ని ప్రేరణగా చేసుకొని రాయడం పరిపాటే! ఇక్కడి భాషలైన తెలుగు, ఉర్దూలలోనే కాదు, ఇతర భాషాల్లోనూ దాని హవా చూడచ్చు. మచ్చుకు, తమిళ రచయిత అశోక్ మిత్రన్ రాసిన “ది ఎయిటీన్త్ పారెలల్” అనే నవల, ప్రముఖ హిందీ కవి, కున్వర్ నారాయణ్‍గారి “గోల్కొండ” కవిత!

హైదరాబాదు తప్ప లోకం తెలీకుండా ముప్ఫై ఏళ్ళ వరకూ బతికిన నేను, ఆ నగరపు నీటికి నీడకూ దూరమయ్యాక దాని ఊసులు ఎక్కడ విన్నా చెవులు పెద్దవి చేసుకుని వింటున్నాను. కళ్ళు పెద్దవి చేసుకుని చదువుతున్నాను. కొన్నేళ్ళగానే కన్నడ భాష నేర్చుకుంటున్న నేను, కవిత్వం జోలికి పోయేంత సీన్ లేదనుకుంటుండగా, జయశ్రీనివాస్ రావుగారు ఆంగ్లంలోకి అనువదించిన కొన్ని కన్నడ కవితలు చదివాను. సోషల్ మీడియాలో, వాట్సాపులో రోజుకన్నో ఇన్నో సాహిత్య లింకులు, కవితలు అందుకునే నాకు, ఆ అనువాదాలను ప్రత్యేకించి మళ్ళీ మళ్ళీ చదువుకుంటూనే ఉండడానికి కారణం – హైదరాబాద్!  

“ఐ యామ్ తిరుమలేశ్, ఏ కన్నడ రైటర్ ఫ్రమ్ హైదరాబాద్.”– 2016లో జరిగిన 5వ బెంగళూరు సాహిత్యోత్సవం (లిటరరీ ఫెస్ట్)లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రఖ్యాత కన్నడ కవి, రచయిత, భాషా విజ్ఞాని, బాల సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతైన  కె.వి.తిరుమలేశ్ (1940-2023) తనని తాను పరిచయం చేసుకుంటూ అన్న మాటలు. కేరళలోని కాసరగోడ్‍లో పుట్టి పెరిగి, ఆ తర్వాత దేశవిదేశాలలు తిరిగినా, ఎనభై ఏళ్ళ జీవితంలో ఎక్కువగా హైదరాబాదులోనే ఉన్నారు. మొన్న జనవరి 30న హైదరాబాదులోనే చనిపోయారు. 

“బహుశా, హైదారాబాదు మీద ఎక్కువ కవితలు రాసినవాణ్ణి నేనే అయ్యుంటాను” అని 2012లో బెంగళూరు టైమ్స్‌కి ఇచ్చిన ఒక ఇంటర్వూలో ఆయనే అన్నారు. స్కోత్కర్షగా కాదు. యూరోపియన్ సాహిత్యం, చింతన గురించి కన్నడం రాస్తున్నందుకు కొందరు సాహిత్య-అల్లరి-మూకలు ఆయణ్ణి దూషిస్తున్న వేళ, సాహితీవేత్తకు తన-పర అనే బేధాలుండవన్న సంగతిని నొక్కివక్కాణించడానికి ఆ మాటన్నారు. 

ఒక నగరం, అందునా శతాబ్దాల చరిత్ర ఉన్న మహానగరం మీద రాయడమంటే ఏమిటి? 

కంటికి కనిపించే నగరం ఒకటి ఉంటుంది: మిరుమిట్లు గొలిపే కాంతులు, ఎత్తైన భవనాలు, కంటిని గుచ్చే  మితిమీరిన సంపద పేదరికాల సహవాసం లాంటివేవో. మనసుకి అనిపించే నగరం ఒకటి ఉంటుంది: ఆశ, ఆశయం, అవకాశం, అధికారం, ఏకాంతం-ఒంటరితనాల-కాక్‍టెయిల్ వగైరా. ఇవేవైనా కథావస్తువులు, కవితాంశాలూ అవ్వచ్చు. కాదనుకుంటే చరిత్ర, రాజకీయం, ఉద్యమం – ఏవో ముళ్ళు విప్పమంటూనే ఉంటాయి. 

ఇవ్వన్నీ మామూలుగా మన స్పృహలో ఉండేవే. సాధారణంగా మనం మర్చిపోయేది, మనకి గొప్ప కవులు మాత్రమే గుర్తుచేయగలిగే విషయం ఏమిటంటే: నగరం ఒక జీవనది. ఎప్పటికీ అలానే ఉందనిపిస్తుంది, కానీ క్షణక్షణం మారిపోతూనే ఉంటుంది. ఒకసారి మునకేసి లేచి రెండో మునకేసేసరికి కొత్తనీరు వచ్చి చేరుతుంది. 

మహానగరం గురించి రాయడమంటే దాని కట్టడాలు, రాజులు, ప్రభుత్వాలు, ఉద్యమాలు, ప్రేమగాథల గురించి రాయడం కాదు. మహానగరం గురించి రాయడమంటే గుప్పెట్లోంచి జారుతున్న ఇసుకలాంటి అనుభవాలను జల్లెడ పట్టడమే. అనుభవాలంటే మళ్ళీ వలపులు, విరహాలు, నిర్బంధాలు, విమోచనాలు కాదు. 

అనుభవాలంటే మామూలువి. అబిడ్స్‌లోని బుల్‍చంద్ బట్టల దుకాణానికి వెళ్ళే హడావిడిలో రోడ్డు దాటడానికి ఆగి, దుకాణానికి పెట్టున్న బుజ్జిబుజ్జి లైట్ల కాంతులని డబుల్ డక్కర్ బస్‍ ఎలా ముక్కముక్కలు చేసిందో అబ్బురంగా చూస్తూ రోడ్డు దాటి,

“చివరికి దాటేశాక ఏమనిపిస్తుంది

మీకు? నిరంతరంగా సాగే ఈ రోడ్డుని ముక్కముక్కలు చేసినట్టు

ఉందా? అయితే, ఎంత త్వరగా అది మళ్ళీ

ఒకటైపోయింది చూడండి – మనం అసలు దాటనే లేదు

అన్నట్టు. అబిడ్స్ రోడ్డులంతే!”

(ఆబిడ్స్ లో రోడ్డు దాటడం)



అనేంత మామూలు సంగతులన్న మాట. లేదూ,

“సాలర్‌జంగ్ మ్యూజియం నుంచి వినిపించే కూత

యక్షిదో, దెయ్యానిదో, ఒంటరిగా ఉన్న

చెక్క బొమ్మ భయమో – అవేవీ కాదంటే

విన్నవారి మనసులోని లయేమో”

(హైదారాబాదుకి)

అంటూ నగరానికే గర్వకారణమైన ఒక వింతకు ఆ నగరవాసులనే బాధ్యులు చేయడమన్నమాట. 

అనేక మంది భార్యలున్న ఒకడి గురించి ఆరా తీస్తూ, ఆ భార్యలేమైపోయారని వాపోతూ రాసిన కవితలో:

“వాళ్ళా?…

కొందరు నర్తకులయ్యారు

స్పర్శకే సిగ్గుపడ్డారు.

నిజంగా ప్రేమించారు

వేరే రీతిలో వేరే జనాలముందు పాడారు

ఆపైన చనిపోయాక వాళ్ళెకెవరూ సమాధులు కట్టించలేదు

ఇంకొందరు చివరంటూలేని గల్లీలయ్యారు

మీరు నడిచేవి

మీరు వెతికేవి.”

(వాళ్ళు) 

చారిత్రిక కట్టడాలపై పేర్లు గీసి రాసే ప్రజల అలవాటు ఆయన కవితలో ఒక మార్మికత సంతరించుకుంటుంది:

గోడలపై రాసిన ఈ పేర్లు

ఎవరివని చెప్పడమెలా?

చరిత్రలో రాసినట్టే రాశారు ఇక్కడ

ఆడవారు, మగవారు, ప్రయాణికులు, ప్రేమికులు

ఈ చుట్టు మెట్లను ఒక్కొక్కటే

ఎక్కి వచ్చారు కిటికీల దగ్గర నిలుచున్నారు

మూసీ– గోల్కొండ– ఫలక్‍నుమాల

పైనుంచి వీచే గాలికి తెరుచుకుని

మాయా పక్షుల్లా మాయమైపోయారు.

ఏం వదిలిపెట్టారు? ఏం పట్టుకునిపోయారు?

(భాగ్యనగరం) 

నగరం ఒకరికి ఏమిస్తుంది? ఒకరినుంచి ఏం తీసుకుంటుంది? ఒక నగరానికి మనం ఏమివ్వగలం? దానికి తెలియకుండా ఏం దాచుకోగలం? యాంత్రిక జీవితం విసిరే సవాళ్ళల్లో ఈ ప్రశ్నలకు ఏవో కాకిలెక్కల సమాధానాలు వెతుక్కుంటూనే ఉంటాం. మనం నివాసాలకు, విలాసాలకు, అత్యాశలకు నగరాన్ని యూజ్-ఎన్-థ్రోగా వాడుకుంటూ, పురోగతి పేరున విధ్వంసాలకు, పకృతి విలయాలకు, వర్గ విద్వేషాలకు దాన్ని పర్యాయపదంగా మారుస్తున్నాం. కీడు శంకిస్తూ అదిరే నగరపు కంటిని, బాధను పంటికింద నొక్కిపెట్టే దాని పెదాలని, కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దాని ఊపిరితిత్తులని గమనించక మన సెల్ఫీలకోసం పౌడరు అద్ది నవ్వుని రుద్దుతున్నాం. శతాబ్దాల తరబడి దాని వేదనను, యాతనను తీర్చాలంటే ఒక ఆత్మీయ ఆలింగనం అవసరం. అలా దాన్ని అన్ని వైపులనుంచీ చుట్టిముట్టడానికి, గట్టిగా హత్తుకోడానికి మనుషులైన మనకు సముద్రమయ్యే  మాయాశక్తి అదే ఇవ్వగలదని తిరుమలేశ్ నిరూపించారు.

He’s not just from Hyderabad. He’s within the city, with the city. He is the city.    

సముద్రం: కె.వి. తిరుమలేశ్

సముద్రంలేని హైదరాబాదుకి నేనే సముద్రాన్ని –

పొంగి ప్రవహించాను ఆ మహానగరపు విస్తీర్ణంలో 

నింపి వీధులను నింపి విలాసాలను  

చుట్టుముట్టాను నా ఆందోళనలో 

దాని కలవరాన్ని 

బెదురుతూనే 

పిలిచింది చేయి చాచి

తెరిచింది తెర తీసి

తెరిచినా తెరుచుకోని వ్యాకుల చిత్తం 

గుడి గోపురాళ్ళ మినార్ల చుట్టూ 

చుట్టాను ముట్టాను 

ఎక్కలేని ఎత్తులలో 

మబ్బులను నాటాను

అంగడి అరుగుల్లో

మసీదు మెట్లల్లో 

ఎవరివో ముంగిళ్ళల్లో 

ఎక్కడంటే అక్కడ 

నా కలలను చెక్కాను

లోలోపల ఎండిపోయాను  

మునిమాపు చీకట్లలో 

ఏరుకున్నదెవరు విరిసిన ఆల్చిప్పలను? 

ఎవరికీ వినిపించకుండా

వెక్కిందెవరు ఏకాంతంలో దుఃఖాలను? 

చెరిపేస్తూ వెళ్ళిపోయిందెవరు 

తమ అన్ని గుర్తులను?  

గాలి కూడా ఇప్పుడు చల్లబడింది

వేరే సముద్రాల వేరే 

అఘాతాల జ్ఞాపకాలను మోసుకొచ్చి 

యుగాలవుతున్నాయి నిద్రించి – 

నిద్రించాల్సి ఉంది 

నా సరిహద్దులను హత్తుకోవాల్సి ఉంది. 

(అనువాదం: పూర్ణిమ) 

Leave a comment